105. సప్తమీ కల్పమునందు కామదా సప్తమీ వ్రత నిరూపణము

మూ! బ్రహ్మోవాచ :

ఫాల్గునామల పక్షస్య సప్తమ్యాం క్ష్మాధరా వ్యయ! ఉపోషితో సరో నారీ సమభ్యర్చ తమోఽపహమ్

సూర్యనామ జపన్భక్త్యా మిత భోక్తా జితేంద్రియః ఉత్తిష్ఠన్ప్రస్వపంశ్చైవ సూర్యమేవాభి కీర్తయేత్

తతోఽన్యదివసే ప్రాప్తే త్వష్టమ్యాం ప్రయతో రవిమ్ స్నాత్వా దేవం సమభ్యర్చ్య దద్యాద్విప్రాయ దక్షిణామ్

రవి ముద్దిశ్య వై చాగ్నౌ ఘృత హోమ కృత క్రియః ప్రణిపత్య జగన్నాథమితి వాణీ ముదీర యేత్

“యమారాధ్య పురాదేవీ సావిత్రీ కామనాయవై సమే దదాతు దేవేశః సర్వానామాన్విభావసుః సమభ్యర్చ్య ఇతి ప్రాప్తాన్కృత్స్నాన్కామాన్యథేప్సితాన్ సదదాత్యభిలాన్కామా ప్రసన్నోమే దివస్పతిః

భ్రష్ట రాజ్యశ్చ దేవేంద్రో యమభ్యర్చ్య దివస్పతిః కామాస్త్యం ప్రాప్తవాన్రాజ్యం సమే కామం ప్రయచ్ఛతు”

ఏవ మభ్యర్చ్య పూజాంచ నిష్పాద్యేహ వివస్వతః భుంజీత ప్రయతః సమ్య గ్ఘవిష్యం పతగధ్వజ!

ఫాల్గునే చైత్ర వైశాఖ జ్యేష్ఠే యస్య సమాపనమ్ చతుర్థి: పారణం మా సైరేఖిర్నిష్పాదితం భవేత్

 కరవీరైశ్చతురో మాసాన్భ్యక్త్వా సంపూజయేద్రవిమ్ కృష్ణా గురుం దహేద్ధూపం ప్రాశ్యం గోశృంగజం జలమ్

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “విష్ణు దేవా! ఫాల్గున మాస శుక్లపక్ష సప్తమీనాడు మానవుడుపవాస వ్రతముతో భాస్కర దేవునారాధించి, భక్తితో సూర్య నామమును జపించుచు మిత భోజనుడై, జితేంద్రియుడై, మేల్కొనినప్పుడును సూర్య దేవునే కీర్తించుచునుండ వలయును. స్త్రీయునిటులే చేయవలెను. మరుసటి దినమున నష్టమినాడు ప్రయత మానసుడై స్నాన మాచరించి సూర్య భగవానునర్చించి బ్రాహ్మణునకు దక్షిణ నీయవలెను. పిదప నా దేవునుద్దేశించి యగ్నియం దాజ్య హోమము నిర్వర్తించి, జగన్నాథుడగు నాతనికి నభివాదము చేసి యిట్లు ప్రార్థింపవలెను. పూర్వ కాలమున సావిత్రీ దేవి, ఏ దేవునారాధించి తన యభీష్టమును ఫలవంతమొనర్చుకొనెనో అట్టి దేవేశుడగు విభావసుడు నాకును వాంఛిత ఫలమిచ్చుగాక. దివస్పతి యగు దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడై యే దేవునర్చించి మఱల తన స్వర్గ సామ్రాజ్యమునే గాక కామితార్థముల నన్నింటిని పొందెనో అట్టి సూర్య దేవుడు నామనోరథమ నొసంగుగాక. ఏ దేవు నర్చించి దితి తన యశేష మనో భీష్టములను పొందెనో అట్టి సూర్య భగవానుడు ప్రసన్నుడై నా కోరికలన్నింటినీ డేర్చుగాక." ఇట్లు ప్రార్థించి వివస్వంతుని పూజను సంపన్నము చేసి నియతుడై చక్కగా హవిష్యమును భుజింపవలేను. ఫాల్గున చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసములో నాలుగు పారణములతో నీ వ్రతము సంపన్నమగును. నాలుగు మాసములలోను సూర్య దేవుని గన్నేరు పూలతో పూజింపవలెను. కృష్ణా గురు ధూపమును ప్రయోగింపవలెను. గోశృంగ జలమును ప్రాశనము చేయవలెను.

 మూ॥ నైవేద్యం ఖండ వేషాంస్తు దద్యాద్విప్రేభ్య ఏవచ తతశ్చ శ్రూయతామన్యా హ్యాషాఢాదిషు యా క్రియా

జాతి పుష్పాణి శస్తాని ధూపో గౌగ్గుల ఉచ్యతే కూపోదకం సమశ్నీయా నైవేద్యం పాయసం మతమ్

స్వయంతదేవ చాశ్నీయా చ్ఛేషం పూర్వ వదాచరేత్ కార్తికాదిషు మాసేషు గో మూత్రం కాయ శోధనమ్

 మహాం గోధూప ఉద్దిష్టః పూజా రక్తాత్పలైస్తథా కాంసారం చాత్ర నైవేద్యం నివేద్యం భాస్కరాయవై

ప్రతి మాసంచ విప్రాయ దాతవ్య దక్షిణా తథా కర్పూరం చందనం ముస్తా మగరుం తగరం తథా

 ఊషణం శర్కరా కృష్ణ! సుగంధం సిహ్లాకం తథా మహాంగోయం స్మృతో ధూపః ప్రియో దేవస్య సర్వదా

 ప్రీణనం చేష్టయా భానో: పారణే పారణే గతే యథాశక్తి యథా యోగం విత్త శాఠ్యం వివర్జయేత్

సద్భావేనైవ సప్తాశ్వః పూజితః ప్రీయతే యతః పారణాంతే యథా శక్త్యా పూజితః స్నాపితో రవిః

ప్రీణితశ్చేప్సితాన్కామాన్దద్యాదవ్యాహతం హరే! ఏషా పుణ్యా పాప హరా సప్తమీ సర్వకామదా

యథాభిలషి తాన్కామాన్లభతే గరుడధ్వజ! ఉషోష్యైతాం త్రిభువనం ప్రాప్తమింద్రేణ వైపురా

తా. ఖండ శర్కరతో పక్వము చేయబడిన పదార్థములను నివేదింపవలెను. బ్రాహ్మణులకు దక్షిణ నీయవలెను. ఇక ఆషాఢాదిగా నాలుగు మాసములలో నిర్వర్తింపవలసిన పారణ క్రియను వినుము. ప్రశస్తమైన జాజి పూలు, గుగ్గులు ధూపము, పాయస నైవేద్యమును సూర్య పూజలో వినియోగింపవలెను. బావి నీరు ప్రాశనము చేయవలెను. సూర్య దేవునకు నైవేద్యమిడిన పాయసమునే స్వయముగ భుజింపవలెను. తక్కిన క్రియలన్నియు పూర్వము చెప్పబడినట్లాచరింపవలెను. కార్తికాది మాసములలో శరీర శుద్ధి కొఱకు గో మూత్రము నుపయోగింపవలేను. మహాంగ ధూపము, ఎఱ్ఱగలువలు పూజకై యుపయోగింపవలేను. కొంసారము (నేతిలో వేయించిన పిండిలో శర్కరను గలిపి చేసిన పదార్థము)ను సూర్య భగవానునకు నైవేద్యము పెట్టవలేను. ప్రతి మాసము నందును బ్రాహ్మణునకు దక్షిణ నీయవలెను. కర్పూరము, చందనము, నిడుముస్తే, అగరువు, నందివర్ధనము. మిరియములు, శర్కర, సుగంధము, సిప్లకము (చీల్లమడ్డీ) వీని మిశ్రమము మహాంగ ధూపమనబడును. సూర్యదేవునకు సదా యిష్టమైన దీ ధూపము. ప్రతి పారణమునందున సూర్యదేవునికి ప్రీతికరములైన ఆయా వస్తు క్రియాదులచే నాతని సంతుష్టుని జేయుచుండ వలెను. విత్త శాఠ్యమును విడనాడి యధాశక్తిగ యథా సంభవముగ నీ ప్రతా చరణము చేయవలెను. సప్తాశ్వుడైన సూర్యభగవానుడు సద్భావముచే పూజింపబడుటచే ప్రీతుడగుటచే పారణాంతమున నా దేవదేవునకు యథా శక్తిగా నభిషేక పూజాదులు చేయవలెను. విష్ణు దేవా! సూర్య భగవానుడు ప్రీతుడైనచో నవ్యాహతముగ వాంఛిత ఫలములనిచ్చును. అందుచే నీ సర్వ కామదా సప్తమీ వ్రతము పుణ్యప్రదము, పాపహరము. దీనిని చేయువాడు కోరిన దెల్లయు నీడేరును. పూర్వకాలమున నింద్రుడీ వ్రతోపవాసము లాచరించి త్రిభువనాధిపత్యమునొందెను.

 మూII పుత్రం ప్రాపచ్చ సావిత్రీ పుత్రాంస్తు అదితి స్తథా యదవః కామనాం ప్రాప్తా ధౌమ్యో వేదమ వాప్తవాన్

త్వయాప్తా భార్గవీ కృష్ణ! శంకరః శుద్ధి మాప్తవాన్ పితా మహత్వం ప్రాప్తోఽహం తత్ప్రసాదాబ్జనార్దన!

అన్యైశ్చాధిగతాః కామాస్తమారాధ్య నసంశయః బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః శూద్రైర్యోషిద్భిరేవచ .

యం యం కామ మభిధ్యాయేత్తంతం ప్రాప్నోత్యుపోషణాత్ జనః ప్రాప్నోత్యసందిగ్ధం భానోరారాధనాద్యతః

అపుత్రః పుత్రమాప్నోతి గోగతశ్చాపి మోదతే రోగాభిభూత ఆరోగ్యం కన్యావిందతి సత్పతిమ్

సమాగత్య ప్రవసిత ఉపోష్యైత దవాప్నుయాత్ సర్వాన్కామానవాప్నోతి గోగతశ్చాపి మోదతే

 నా పుత్రోనాధనోవాపి నవానిష్టా న నిర్ఘృణః ఉపోష్యేతద్ర్వతం మర్త్యః స్త్రీజనో వాపి జాయతే

గో హేలి లోక మాసాద్య మోదతే శాశ్వతీః సమాః గైరికం యాన మారూఢ స్తేజసా రవి సన్నిభః

పునరేత్య మహీం కృష్ణ! ఘనా ఘన సమో నృపః క్ష్మాతలే స్యాన్నసందేహః ప్రసాదాద్గోపతే ర్నరః

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రహ్మేపర్వణి సప్తమీ కల్నే కామదాసప్తమీవ్రత నిరూపణం నొమ పంచాధిక శతతమోఽధ్యాయః

 తా॥  సావిత్రి పుత్రుని పొందెను. అదితి కూడ పుత్రులను బడసెను. యదువులు తమ యభీష్టములను పొందిరి. ధౌమ్యుడు వేదములను పొందెను. విష్ణు దేవా! నీవును లక్ష్మీదేవిని బడసితివి. శంకరుడు శుద్ధిని ప్రాప్తించేను. నేను పీతామహత్వము నొందితిని. ఇదంతయు నా సూర్యభగవానుని యనుగ్రహము చేతనే కదా జరిగినది. ఇంక నెందలో ఆ దేవునారాధించి తమ కోరికల నీడేర్చుకొనిరి. ఇందు సందేహమేమియు లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు, స్త్రీలు తమ తమ యభీష్టములాదేవుని కృపచే నెరవేర్చుకొనిరి. సూర్య ప్రీత్యర్థముగ చేయునుపవాస వ్రతము వలన నెవడేది కోరునో వానికదిలభించును. మనుష్యుడు సూర్యారాధనచే నిస్సంశయముగ తన మనోరథమును పొందగలడు. పుత్రుడు లేని వానికి పుత్రుడు కలుగును. సూర్యలోక ప్రాప్తి కలుగును. రోగగ్రస్తుతకారోగ్యము చేకూరును. కన్యకు మంచి భర్త లభించును. ఇహ లోకమునకు వచ్చి. యుస పాసవ్రత మాచరించి, సర్వ మనోభీష్టముల నొంది పిదప నేవడేని సూర్య లోకమున నానందించును . ఉపవాస వ్రతము నాచరించువాడు సంతాన హీనుడుగ గాని, దరిద్రుడుగ గాని, కనికరములేని వాడుగ గానీ, స్త్రీగ గాని జన్మింపడు. పెక్కు సంవత్సరముల వఱకు సూర్యలోకమున నానందించును. సూర్య తేజస్వియై బంగారు తేరు పై నెక్కి గో లోకమునకు, సూర్య లోకమునకు చేరి యచట చిరకాలము మోదించును. తిరిగి యిహలోకమున కేతెంచి సూర్య దేవుని యనుగ్రహముచే నింద్ర సన్నిభుడైన రాజగును. ఇందు సందేహము లేదు .

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు  'కామదాసప్తమీ వ్రత నిరూపణమను నూట యైదవ యధ్యాయము సమాప్తము.