97. సప్తమీ కల్పమున జయంతీ కల్ప వర్ణనము

బ్రహ్మోవాచ : -

 మూII మాఘస్య శుక్ల పక్షేతు సప్తమీ యా త్రిలోచన! జయంతీనామ సాప్రోక్తా పుణ్యపాపహరాశివా

సోపోష్యాయేన విధినా శృణుతం పార్వతీ ప్రియ! పారణానితు చత్వారి కథితాన్యత్ర పండితైః

పంచమ్యామేక భక్తంతు షష్ఠ్యాం నక్తం ప్రకీర్తితమ్ ఉపవాసస్తు సప్తమ్యా మష్టమ్యాం పారణం భవేత్

 మాఘ్చ ఫాల్గునే మాసి తథా చైత్రేచ సువ్రత! బక పుష్పాణి రమ్యాణి కుంకుమంచ విలేపనమ్

 నైవేద్యం మోదకాంశ్చాత్ర ధూప ఆజ్య ముదాహృతః ప్రాశనం పంచగవ్యంత పవిత్రీకరణం పరమ్

మోదకై ర్భోజయే ద్వీపాన్యథాశక్త్యా గణాధిప! శాల్యోదనంచ భూతేశ! దద్యాచ్ఛక్త్యా ద్విజేషువై

ఇత్థం సంపూజయేద్యస్తు భాస్కరం లోక పూజితమ్ సర్వ స్మిన్పారణే వీర! సోశ్వమేధ ఫలం లభేత్

 ద్వితీయే పారణే పూజ్య రాజసూయ ఫలం లభేత్ వైశాఖాషాడ జ్యేష్ఠేషు శ్రావణేమాసి సువ్రత!  పూజార్థ మథ భానోర్వై శతపత్రాణి సువ్రత!

శ్వేతంచ చందనం భీమ! ధూపోగుగ్గులు రుచ్యతే నైవేద్యం గుడ పూపాస్తు ప్రాశనం గోమయస్యతు భోజనే చాపి విప్రాణాం గూడపూపాః ప్రకీర్తితాః

ద్వితీయ మిద మాఖ్యాతం పారణం పాపనాశనమ్ రాజుసూయాశ్వమేధాభ్యాం ఫలదం భాస్కరప్రియమ్

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “త్రిలోచనా! మాఘమాస శుక్లపక్ష సప్తమీ “జయంతి'యని చెప్పబడును. అది పుణ్యప్రదము, పాపహరము, శుభంకరమునైనది. దాని నెట్లాచరింపవలెనో చెప్పుచున్నాను వినుము. తెలిసినవారు దీనియందును నాలుగు పారణలు చేయుదురు. పంచమినాడు ఒక పూట భోజనము, షష్ఠినాడు నక్తవ్రతము, సప్తమీదినముననుపవాసము, అష్టమినాడు పారణ చేయవలెను. మాఘ, ఫాల్గున, చైత్రమాసములందీ జయంతీ సప్తమీ వ్రతమాచరించు సందర్భమున రమ్యమైన శివమల్లీ పుష్పములు, కుంకుమ విలేపనము. నైవేద్యము కొఱకు లడ్డువములు, ఆజ్యధూపములతో సూర్యదేవుని పూజింపవలెను. పవిత్రీకరణ కొఱకు పంచగవ్యమును ప్రాశనము చేయవలెను. శక్తి కొలదిగ బ్రాహ్మణులకు లడ్డువములతో భోజనము పెట్టవలెను. బ్రాహ్మణ భోజనమున శాల్యన్నము వినియోగింపవలేను. అన్ని పారణముల యందును లోకపూజితుడైన భాస్కరదేవు నీటులే పూజించువాడు అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందును. రెండవ పారణమునందలి పూజనము వలన రాజసూయ యాగ ఫలము లభించును. వైశాఖము, జ్యేష్ఠము, ఆషాడము, శ్రావణములలో సూర్యపూజకు తామర పువ్వులు. తెల్ల చందనము, గుగ్గులు ధూపము, బెల్లపు భక్ష్యములు వినియోగింపవలేను. పాప నివారకము, రాజసూయాశ్వమేథముల ఫలమునిచ్చునది, సూర్యదేవునకు ప్రియమైనదియునైన రెండవ పారణ విధాన మిదియిట్లు చెప్పబడినది.

మూII తృతీయం శృణు దేవస్య పూజార్థే భాస్కరస్యతు మాసి భాద్రపదే వీర! తథా చాశ్వయుజే విభో!

కార్తికేచాపి మా సేతు రక్త చందన మాదిశేత్ మాలతీ కుసుమానీహ ధూపో విజయ ఉచ్యతే

నైవేద్యం ఘృతపూపాస్తు భోజనంతుద్విజన్మనామ్ కుశోదక ప్రాశనంతు కాయశుద్ధికరం పరమ్

తృతీయ మపి చాఖ్యాతం పారణం పాపనాశనమ్ రాజసూయాశ్వమేధాభ్యాం ఫలదం భాస్కరప్రియమ్

 చతుర్థమపి తే వచ్మి పారణం పాపనాశనమ్ రాజసూయాశ్వమేధాభ్యాం ఫలదం భాస్కరప్రియమ్

తదద్య దేవశార్దూల! పారణం శ్రేయసే శృణు మాసి మార్గశిరే వీర! పౌషే మాసి తథాశివ !

మా ఘేచ దేవశార్దూల! శృణు పుణ్యానశేషతః కరవీరాణి రక్తాని తథా రక్తంచ చందనమ్

అమృతాఖ్యస్తథా ధూపోనైవేద్యం పాయసం పరమ్ ఆర్జనీయం తథా తక్రం ప్రాశనంపరమం స్మృతమ్

 అగురుం చందనం ముస్తం సిహ్లకం త్ర్యూషణం తథా సమభాగైస్తు కర్తవ్యమిదం చామృత ముచ్యతే

తా॥ భాద్రపద, ఆశ్వయుజమాసములలో, కార్తికములోను జరుపబడు మూడవ పారణ విధిలో సూర్యపూజకై ఉపయోగింపదగిన పుష్పాది ద్రవ్యములను గూర్చి చెప్పుచున్నాను వినుము. ఎఱ్ఱని చందనము, జాజిపూలు, విజయధూపము నుపయోగింపవలెను. నైవేద్యముగా నేతి భక్ష్యములు సమర్పింపవలెను. బ్రాహ్మణ భోజనము, శరీర పావిత్ర్యమునకు కుశోదక ప్రాశనము విధ్యుక్తములు. ఇట్లు పాపనాశకమగు తృతీయ పారణ చెప్పబడినది. ఇది సూర్యదేవునకు ప్రియమైనది. రాజసూయాశ్వమేధ యాగముల ఫలములనిచ్చునది. పాపనాశకమగు నాల్గవ పారణ విధిని కూడ చెప్పుచున్నాను వినుము. ఇదికూడ రాజసూయాశ్వమేధముల ఫలముల నిచ్చును. సూర్యదేవునకు ప్రీతిగూర్చునది. శ్రేయస్సు కొఱకు దీని విధానము వినుము. మార్గశిర, పుష్య. మాఘమాసములలో నిర్వహింపబడు నీ విధి యనేకములగు పుణ్యఫలములిచ్చునది. ఎఱ్ఱని గన్నేరు పూలు, రక్తచందనము. అమృతమను పేరుగల ధూపము, నైవేద్యమునకు పాయసమును వినియోగించి సూర్యపూజచేయవలెను. పావిత్ర్యము కొఱకు మజ్జిగ సంపాదించి ప్రాశనము చేయవలెను. అది మిక్కిలి ప్రశస్తమని చెప్పబడినది. అగరు చందనము, తుంగముస్తలు, యావనము, సొంటి, పిప్పలి, మిరియాలు (త్ర్యూషణం) వీనిని సమభాగములుగా మిశ్రమము చేసిన నది అమృతమను ధూపద్రవ్యమని చెప్పబడును.

మూII  నామాని కధితాన్యత్ర భాస్కరస్యమహాత్మనః "చిత్రభానుస్తథా భానురాదిత్యో భాస్కరస్తథా  

ప్రియతా" మితి సర్వస్మిన్పారణే విధి మాదిశేత్ అనేన విధినాయస్తు కుర్యాత్పూజాం విభావసోః

తస్యాం తిథో దేవదేవ! స యాతి పరమం పదమ్ కృత్వైవం సప్తమీం భీమ! సర్వకామానవాప్నుతే

పుత్రార్దీ లభతే పుత్రాన్దనార్థీ లభతే ధనమ్ సరోగో ముచ్యతే రోగైః శుభమాప్నోతి పుష్కలమ్

పూర్ణే సంవత్సరే భీమ! కార్యాపూజా దివాకరే గంథ పుష్పోప హారైస్తు బ్రాహ్మణానాంచ తర్పణైః  నానా విధైః ప్రేక్షణకైః పూజయావాచకస్యతు

ఇత్థం సంపూజ్యదేవేశం బ్రహ్మణాంశ్చాభిపూజ్యచ వాచకంచ ద్విజం పూజ్య ఇదం వాక్య ముదీరయేత్

“ధర్మకార్యేషుమేదేవ! అర్థకార్యేషు నిత్యశః కామకార్యేషు సర్వేషు జయోభవతు సర్వదా”

తతో విసర్జయేద్విప్రాన్వాచకంతు ద్విజోత్తమమ్ ఇత్థం కుర్యాదిదం యస్తు సజయం ప్రాప్నుయాత్ఫలమ్ సర్వపాప విశుద్ధాత్మా సూర్యలోకం సగచ్ఛతి

విమాన వర మారూఢః కంజజోద్భవ ముత్తమమ్ తేజసారవి సంకాశః ప్రభయా పతగోపమః  

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మేపర్వణి సప్తమీ కల్సే జయంతీ కల్ప వర్ణనంనొమ సప్తనవతి తమోఽధ్యాయః

            తా॥ ప్రార్థించుట కొఱకు మహాత్ముడైన భాస్కరదేవుని నామములిట చెప్పబడినవి. “చిత్ర భానుడు, భాను, భాస్కరుడు, ఆదిత్యుడు. ప్రీతుడగుగాక” అని పారణములన్నింటియందును ఆ దేవదేవుని ప్రసన్నుని చేసికొనుట విధియైయున్నది. ఈ విధానమున ఆ తిథినాడు విభావసుని పూజనొనర్చువాడు పరమపదమునొందును. ఇటులీసప్తమీ వ్రతమునాచరించి సర్వకామములను పొందును. పుత్రులు కావలసిన వాడు పుత్రులను, ధనమునుగోరువాడు ధనమును, పొందును. రోగగ్రస్తుడు సర్వరోగములనుండి విముక్తుడగును. సమృద్ధమైన శుభములఁబడయును. సంవత్సరమంతయును సూర్యపూజ చేయవలెను. గంధపుష్పోపహారములతోను, బ్రాహ్మణ సంతర్పణలతోను, నానావిధనాట్యసంగీత కార్యక్రమములతోను, పురాణ ప్రవచనలతోను, పౌరాణిక పూజతోను ఈ వ్రతమునాచరింపవలెను. ఇట్లు సూర్యదేవునర్చించి, బ్రాహ్మణులనుపూజించి, పురాణ ప్రవచనము చేసిన బ్రాహ్మణోత్తమునారాధించి ఈ వాక్యమునుచ్చరింపవలేను-25. “ధర్మకార్యములందు, అర్థకార్యములందు, కామకార్యములందును ఓ దేవదేవా! నాకు సర్వదా జయము కలుగునుగాక!”. ఇట్లు ప్రార్థించిన పిమ్మట బ్రాహ్మణులను వాచకోత్తముని యధోచితముగ సాగనంపవలయును. ఈ వ్రతము నిట్లు చేయువాడు జయఫలమును పొందును. సర్వపాపముల నుండి ముక్తుడై సూర్యలోకమునకుఁబోవును. సూర్యతేజముతో సమానమగు తేజముతో, రవిప్రభ వంటి ప్రభతో వెలుగుచు బ్రహ్మ సృష్టించిన దివ్యవిమానమున సూర్యలోక ప్రాప్తినందును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు జయంతీ కల్ప వర్ణనమను తొంబది యేడవ అధ్యాయము సమాప్తము.