94. సప్తమీ కల్పమున పుణ్యశ్రవణ మాహాత్మ్య వర్ణనము

  బ్రహ్మోవాచ : -

మూll అత్రాఖ్యాన ముశంతీహ సంవాదం గణ పుంగవ! పితామహ కుమారాభ్యాం పుణ్యం పాపహరం శివమ్

స్రష్టారం సర్వలోకానాం సుఖాసీనం పీతామహమ్ ప్రణమ్య శిరసాదేవం శ్రద్ధా భక్తి సమన్వితః

కుమారో దేవ శార్దూల ఇదం వచన మబ్రవీత్ గతోఽహ మద్య భగవాన్ద్రష్టుం దేవం దివాకరమ్

కృత్వా ప్రదక్షిణం దేవః సమయా పూజతో రవిః ప్రణమ్య శిరసా భక్త్యా పరయా శ్రద్ధయా విభో !

అనుజ్ఞాతస్తత స్తేన సుఖాసీనో హ్యహం స్థితః అసీనేన మయాతత్ర దృష్టమాశ్చర్య మద్భుతమ్

కాంచనేన విమానేన కింకిణీ జాల మాలినా మణిముక్తా విచిత్రేణ వైడూర్య వర వేదినా

ఆగతం పురుషం తత్ర దృష్ట్వా దేవో దివాకరః స సంభ్రమం సముత్థాయ ఆసనాదేవ సత్తమ!

గృహీత్వా దక్షిణే పాణౌ పురతః ప్రాప్య తం నరమ్ శిరస్యాఘ్రాయ దేవేశ! పూజయామాస వైరవిః

ఉప విష్టంతు తంభాను రిదం వచన మబ్రవీత్ సుస్వాగతం భద్ర! సుఖకృతా ప్రీతాస్త్వ యా వయమ్

సమీపే మమ తిష్ఠత్వం యావదాభూత సంప్లవమ్ పునర్వస్యసి తత్థ్సానం యత్ర బ్రహ్మో స్వయం స్థితః

తాII ఈ సందర్భముగ శుభంకరము, పుణ్యప్రదము, పాపహరమునైన బ్రహ్మ-కుమారుల సంవాదమును చెప్పనిచ్చగింతురు. ఒకప్పుడు సర్వలోక సృష్టికర్తయగు బ్రహ్మదేవుని వద్దకు కుమారస్వామి యేతెంచి, సుఖాసీనుడైయున్న యా పితామహునకు ప్రదక్షిణ మాచరించి పూజించితిని. మిక్కిలి శ్రద్దతోను భక్తితోడను శిరసు వంచి నమస్కరించి. అతని యాజ్ఞమేరకు సుఖముగ నాసీనుడనైయుంటిని. అటుల కూర్చుండియున్న నేను ఆశ్చర్యకరము, అద్భుతమునైన ఒక సన్నివేశమచట చూచితిని. చిరుగంటల వరుసలతోను, మణులు, ముత్యములతోను, వైడూర్యములు పొదిగిన సుందరమైన వేదికతోను. అలంకరింపబడియున్న ఒక విమానము నుండి దిగి వచ్చిన యొక పురుషునిఁజూచి సూర్యదేవుడు సంభ్రమముతో తన యాసనమునుండి లేచి. అతనికెదురేగి తన కుడి చేత యాతనిని తన ముందుకు స్వాగతించి కొని వచ్చి, అతని శిరస్సును మూర్కొని ఆదరించెను. అతడాసీనుడైన పిదప అతనితో సూర్యభగవానుడిట్లనెను.“భద్రా! నీకు సుస్వాగతము. నీ (ఆగమనము)చే మేము మిక్కిలి సంతోషించితిమి. మోద మానసులమైతిమి. ప్రళయము వఱకును నీవు మాచెంతనే యుండుము. తదుపరి సృష్టిలో మల బ్రహ్మలోకమునకుఁబోయెదవు అచట చిరకాలముండేదవు”.

 మూ॥ ఏతస్మిన్నంతరే చాన్యో విమాన వరమాస్థితః ఆగతః పురుషో, దేవో యత్రతిష్ఠతి భాస్కరః .

స చాప్యేవం నరో దేవ! పూజతో భానునా తదా సామ పూర్వం తథోక్తస్తు ప్రశ్రయావసతః స్థితః

తత్రమే కౌతుకం జాతం దృష్ట్వాపూజాం కృతాం తయోః భానునా దేవ శార్దూల! పృష్టో భానుర్మయా తదా

కిమనేన కృతందేవ! యోఽయం పూర్వమిహా గతః నరస్తవ సకాశంవై యస్యతుష్ణో భవాన్భశమ్

 యదస్య భవతా పూజా కృతాహిస్వయమేవ తు ఆత్రమే కౌతుకంజాతం విస్మయశ్చ విశేషతః

 తథైవాస్య కృతా పూజా ద్వితీయస్య నరస్యచ సర్వథా పుణ్య కర్మాణా విమౌ నరవరోత్తమౌ

బ్రహ్మ విష్ణు శివాద్యైస్తు పూజ్యతే భగవాన్సదా యస్త్వమాభ్యాం పరం పూజాం కృతవాన్దేవ సత్తమ!

 కథ్యతాం మమ దేవేశ! కిమేతౌ కర్మ చక్రతుః య స్యేదృక్పరమం పుణ్యం ఫలం దివ్య మవాపతు:

శ్రుత్వా తద్వచనం దేవ! ఇదం వచన మబ్రవీత్

 సూర్య ఉవాచ : -

సాధు పృష్టోఽస్మి భవతా కర్మణో నిర్ణయం పరమ్

యదనేన కృతం కర్మ నరేణ మునిసత్తమ! యోఽ సౌ సూర్య మిహాయా, తస్తచ్ఛృణుష్వ మహామతే!

తా॥ అంతలోననే ఒక శ్రేష్ఠమైన విమానమునెక్కి మజియొక పురుషుడు సూర్యుడుండు స్థానమునకు వచ్చెను. అతడు కూడ సూర్య భగవానునిచేత పూజింపబడెను. ఆత్మీయమైన వాక్కులతో సూర్య దేవుడాతని ననునయింప నాతడు వినమ్రుడై కూర్చుండెను . సూర్యదేవుడా యిరువురిని పూజించుటఁజూచి నాకు కుతూహలము కలిగెను. ఆ దేవ దేవుని యిట్లు ప్రశ్నించితిని. “దేవా! నీ వలెనే వెలుగొందుచు నిన్ను మిక్కిలి సంతుష్టుని జేయగలిగిన ఈ పురుషుడే పుణ్య కర్మఫలముగ నిటకు వచ్చెను?. ఈతనిని మీరు స్వయముగ పూజించియుండుటంజేసి నాకు మిక్కుటమైన ఆశ్చర్యము, ఆసక్తియు కలిగినవి. రెండవ మనుష్యునకు గూడ నటులే సత్కారముచేసితిరి. ఈ మానవోత్తము లిరువురును అన్ని విధములుగ పుణ్యకర్ములు. ఓ బ్రహ్మదేవా! భగవానుడైన సూర్యుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు దేవతలందచేతను పూజింపబడును. అట్టి సూర్యదేవుడే వీరిద్దఱిని చాల ఆదరముతో పూజించెను. “ఓ సూర్యదేవా! వీరిరువురును ఇట్టి మహత్తరమైన పుణ్య ఫలము నందుట కే పుణ్య కర్మచేసిరో నాకుఁ దెలుపుడు'' అని నేనా దేవదేవునడిగితిని. నా ఈ మాట విని సూర్యుడిట్లు బదులు పలికెను. (సూర్యుఁడిట్లనెను) “కర్మ నిర్ణయమును గూర్చి లెస్సగా ప్రశ్నించితివి. సూర్య లోకమునకు రాదగిన కర్మ ఇతడేమి చేసెనో ఆ వివరములు చెప్పుచున్నాను వినుము.

మూ॥ యేయం మదంశ సంభూతైః పార్ధివైః పాలితాసదా అయోధ్యానామ నగరీ ప్రఖ్యాతా పృథివీ తలే

తత్రాసౌ వైశ్య జాతీయో ధన పాలఇతి స్మృతః తస్యాం పుర్యాం ద్విజశ్రేష్ఠ! దివ్య మాయతనం వ్యధాత్

తస్మిన్నాయతనే దివ్యే హ్యామ్నాయార్థం తథాశ్రితః బ్రాహ్మణానాం విశిష్టానాం పూజయిత్వా కదంబకమ్

ఇతిహాస పురాణాభ్యాం వాచకంచ విశేషతః పూజయిత్వా ద్విజశ్రేష్ఠం మునిశ్రేష్ఠం మహామునిమ్

పుస్తకం చాపి సంపూజ్య గంధ పుష్పోప హారతః తస్య విప్ర కదంబస్య వ్యాసస్యచ యథాగ్రతః

ప్రకల్పోక్తో ద్విజోఽనేన పాఠకో వాచకోత్తమః ఏషతిష్ఠతి దేవేశః సహస్రకిరణో రవిః  

చాతుర్వర్ణ్య మిదం వాపి శ్రోతుకామం కదంబకమ్ తిష్ఠచేహ ద్విజశ్రేష్ఠ కురు పుస్తక వాచనమ్

యేనమే వరదో భానుః సప్తజన్మని వైభవేత్ యావత్సంవత్సరం విప్ర! ప్రగృహ్య వృత్తి ముత్తమామ్

 స్వర్ణ నిష్కశతం విప్ర! తతో దాస్యే తథాపరమ్ పూర్ణే వర్షే ద్విజశ్రేష్ఠ! శ్రేయోఽర్థ మహమాత్మనః

ఏవం ప్రవర్తతే తస్మిన్పుణ్యే పుస్తక వాచనే షణ్మాసాగత మాత్రేతు కాలే సురవరోత్తమ! తథైవాంతరతశ్చాయం కాలధర్మము పేయివాన్

 మయాచాస్య విమానంతు ప్రేషితం కుర్వతోవ్రతమ్ ఇత్యేషా కర్మణస్తుష్టిః పుణ్యాఖ్యానక జార్చితా

తా॥  "నా అంశచేత జన్మించిన రాజులచే పరిపాలింపబడుచుండిన అయోధ్య యను పేరుగల పట్టణము భూ మండలమున ప్రసిద్ధమైనది. ధనపాలుడని పిలువబడు ఈ వైశ్య జాతీయుడు అచ్చటివాడే. అతడా నగరమున నొక శ్రేష్ఠమైన దేవాలయమును నిర్మించెను. ఆ దివ్యమైన దేవాలయమునందు పురాణ కథా ప్రవచనములను జరిపింపగోరి యాతడు శిష్టులైన బ్రాహ్మణ సమూహమునాశ్రయించి వారిని పూజించేను. ఇతిహాస పురాణములను ప్రవచించు మునిశ్రేష్ఠుడు మహామునియునైన బ్రాహ్మణశ్రేషుని ముఖ్యంగా పూజించి. గంధ పుష్పోపహారములతో పుస్తకమును పూజించి, బ్రాహ్మణ సమూహములోనిపురాణ ప్రవాచకులలో వాచకుడైన ఒక ద్విజశ్రేషునుద్దేశించి యిట్లు ప్రార్థించెను. “ఈ దేవాలయమున సహస్రకిరణుడైన సూర్య భగవానుడున్నాడు. ఈ పురమందలి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతుల సమూహమంతయు పురాణమును వినగోరుచున్నది. ఓ బ్రాహ్మణోత్తమా! తామిచ్చటనే ఉండి నిత్యము పురాణ పుస్తక వాచనము చేయుడు. దానితో నేడు జన్మల వఱకును సూర్య భగవానుడు నన్నను గ్రహించును. ఒక సంవత్సరము వఱకును తామి పవిత్ర వృత్తి స్వీకరించియుండుడు. సమాప్తియైన పిమ్మట మిమ్ము ఒక వంద బంగారు మాడలతో సత్కరింతును. మహాత్మా! నా శ్రేయస్సు నిమిత్తమై పూర్తి సంవత్సర మీ కార్యము నిర్వహింపుడు”. ఈ విధముగ పుణ్య ప్రదమైన పురాణ ప్రవచనము ప్రారంభమై జరుగుచుండగా, ఆు మాసములైనను కాకమునుపే ధనపాలుడు మరణించెను. పురాణ శ్రవణ వ్రతమును చేయుచు మరణించిన ఈ వైశ్యోత్తముని కొఱకు నేను విమానమును పంపితిని. ఇట్లు పుణ్య కథా శ్రవణములచే నన్నర్చించిన నాకు మిక్కిలి సంతోషమగును.

మూ॥ గంధ పుష్పోప హారైస్తు న తథా జాయతే మమ. ప్రీతిర్దేవవర శ్రేష్ఠ! పురాణ శ్రవణే యథా

గో సువర్ణ హిరణ్యానాం వస్త్రాణాంచాపికృత్స్నశః గ్రామాణాం నగరాణాంచ దానం ప్రీతి కరంమమ

 న తథాస్యాత్సుర శ్రేష్ఠ! యథా ప్రీతి కరం గుహ! ఇతి హాస పురాణాభ్యాం శ్రవణం సుర సైన్యప

శ్రాద్ధం కుర్వంతి యే మహ్యం భక్ష్య భోజ్యైరనేకశః నకరోతి తథా ప్రీతి ర్యథా పుస్తక వాచనమ్

 కర్ణశ్రాద్ధే యథా ప్రీతిర్మమ స్యాత్సుర సత్తమ!న తథా జాయతే ప్రీతి రోజ్య శ్రాద్ధే తథైవచ

అధకిం బహునోక్తేన నాన్య త్ప్రీతికరం మమ పుణ్యాఖ్యానాదృతే దేవ! గుహ్యమేతత్రకీర్తితమ్

యశ్చాయ మపరో విప్ర! ఇహాయతో నరోత్తమః అయమాసీద్ద్విజ శ్రేష్ఠస్తస్మిన్నేవ పురోత్తమే

ఏకదాతు గతశ్చాయం ధర్మశ్రవణ ముత్తమమ్ శ్రోతుం భక్త్యా ద్విజశ్రేష్ఠ! శ్రద్ధయా పరయావృతః

శ్రుత్వాతత్ర తతో భక్త్యా పుణ్యాఖ్యాన మనుత్తమమ్ కృత్వా ప్రదక్షిణం తస్య వాచకస్య మహాత్మనః ఏష విప్రోమర శ్రేష్ఠ! దత్తవాన్స్వర్ణమాషకమ్

దత్వాతు దక్షిణాం తస్మై వాచకాయామితౌజసే ఆనందమగ మద్విప్రః ప్రాప్తవాన్కాంచనం యథా

 ఏతద్ది సఫలం చాస్య నచాన్య త్కృత వానయమ్ యదనేన కృతాపూజా వాచకస్య మహాత్మనః ఫలం హికర్మణస్తస్య యన్మయా పూజితః స్వయమ్ .

తా॥ దేవవరులలో శ్రేష్ఠుడవైన ఓ కుమారా! పురాణ శ్రవణముల వలన కలుగునంత ప్రీతి, గంధ పుష్పోపహారములతో నాకు చేయు పూజవలన కూడ నాకు కలుగదు. ఆవులు, బంగారము, పెల్లుగా వస్త్రములు, గ్రామములు, నగరములు - వీనిని దానము చేయుట నాకు సంతోషదాయకమే. కాని ఇతిహాస పురాణాది శ్రవణములతో నైనంత కాదు. వివిధములైన భక్ష్య భోజ్యాది పదార్థములతో నా కొఱకు శ్రద్దగా చేయు పూజా సంతర్పణాది పుణ్య కార్యక్రమములు కూడ పుస్తక వాచనము కలిగించునంత తృప్తి కలిగింపవు. కుమారా! భోజన సంతర్పణము కంటెను శ్రవణ సంతర్పణమే ఎక్కువ ప్రీతి కరము.. వేయి మాటలేల? పుణ్య కథలను చెప్పుట, వినుట కంటెను నాకు సంతృప్తి నిచ్చునది మఱియొకటిలేదు. ఈ రహస్యము నీకుఁదెలిపితిని. ఇటకు వచ్చిన ఈ రెండవ వ్యక్తి ఆ పట్టణముననే నివసించు బ్రాహ్మణోత్తముడు. ఇతడొకసారి మిక్కిలి శ్రద్ధాభక్తులతో పుణ్యప్రదమైన పురాణమును వినుటకుఁబోయెను. ఆ ఉత్తమమైన పురాణమునంతయువిని, మహాత్ముడైన పౌరాణికునకు ప్రదక్షిణ మాచరించి యతనికి ఒక బంగారు మాషము (ఐదు గురిజలయెత్తు) నిచ్చెను. అంతీయకాక మిక్కిలి తేజస్వియైన ఆ పౌరాణికునకు దక్షిణ సమర్పించెను. సువర్ణము, దక్షిణ స్వీకరించి ఆ బ్రాహ్మణ ప్రవరుడు మిక్కిలి యానందించెను. ఇట్లు వాచకునకు చేసిన పూజా సత్కారము కాక ఇతడింకేమియు చేయలేదు. అంత మాత్రముచేతనే ఇతడు ఈ సత్ఫలమునందెను. ఆ మాత్రపు పుణ్య కర్మవలననే ఇతడు నా చేత పూజింపబడెను.

మూ॥ వాచకం పూజయేద్యస్తు శ్రద్ధా భక్తి సమన్వితః తేనాహం పూజితః స్వాం పై కో విష్ణుః శంకరస్తథా

వాచకం భోజయేద్యస్తు భక్త్యా భోజ్యైరనుత్తమైః తేనాహం పూజితః స్యాంవైదశ వర్షాణి పంచచ

న యమో న యమి చాపి నమందో నమనుస్తథా తపతీ న తథాన్విష్టా యధేష్ణో వాచకోమమ

వాచకే సత్కృతే దేవ! భోజితే సుర సైన్యప! తృప్తిర్భవతి మేదేవ! సంవత్సర శత ద్వయమ్

నకేవలం మమ ప్రీతీర్వాచకే భోజితే భవేత్ కృత్స్నశో దేవతానాంచ ఇంద్రాదీనాం తథా భవేత్ .

బ్రహ్మ విష్ణు శివాదీనాం సచేష్టో వాచకోమమ ప్రీతే తస్మిన్దేవతాః స్యుః సర్వాః ప్రీతా నసంశయః

ఇత్యేతత్కథితం సర్వమాభ్యాం కర్మమహాబల!

 నచాన్య చ్చక్రతుః కర్మ కిమన్యచ్చ్రోతు మిచ్ఛసి?” ఏతద్దృష్ట్వాహ మాశ్చర్యం తవాభ్యాశ మహాగతః  కిమత్ర తథ్యం దేవేశ! కథ్యతాం కౌతుకం మమ

తా ॥ భక్తి శ్రద్ధలతో పౌరాణికుని పూజించినవాడు నన్ను పూజించినవాడగును. ఇక విష్ణువు, శివుడును ఎవరు?. శ్రేష్ఠమగు భోజ్య పదార్థములతో వాచకునకు భక్తితో విందునారగింపజేసినచో పదునైదు సంవత్సరములు నన్నే పూజించినట్లగును. నాకు పురాణ వాచకుడైనట్లు యముడుగానీ, యమిగాని, శనైశ్చరుడుగాని, మనువుగానీ, తపతికాని ఇష్టులు కారు. పురాణ ప్రవాచకుడు భోజన సత్కారములతో తృప్తి నందగా రెండు వందల సంవత్సరముల వఱకు నాకు సంతృప్తి కలిగియుండును. వాచకుడు భుజింపగా కేవలము నాకు మాత్రమే సంతుష్టి కల్గుటకాక ఇంద్రాది దేవతలందఱికిని అటులే సంతృప్తి కలుగును. బ్రహ్మ విష్ణు రుద్రాదుల చేష్టా రూపమే వాచకుడని నా అభిప్రాయము. వాచకుడు ప్రీతుడైనచో దేవతలందఱు ప్రీతులగుటలో నెట్టి సంశయములేదు, కుమారా! ఇట్లు వీరిద్దజీ కర్మ గుణించి నీకు వివరించితి. వీరింతకంటే వేటేమియు చేసియుండలేదు. ఇంక నేమి విన గోరుచున్నావు?” అని సూర్యదేవుడు ముగించెను. 'ఓ బ్రహ్మదేవా! ఇది యంతయు చూచి నాకు చాల ఆశ్చర్యము కలిగి మి వైపున కిటులేతెంచితిని. దేవా! ఇందు సత్యమేమి? వినవలెనని కుతూహలపడుచున్నాను. చెప్పుడు. మూ! శ్రుత్వాకుమార వచవం సర్వలోకపితామహః

బ్రహ్మోవాచ : -

హంత! భోః సాధు! పుణ్యోఽసి! నాస్తి తుల్యస్త్వయాపరః యద్దృష్టౌ భవతా తాహి సుపుణ్యా పుణ్యకారిణౌ

 యదుక్తం భానునా వత్స! తత్తథా నాన్యథా భవేత్ యదాసీన్మే ముఖం పుత్ర! ప్రథమంలోక పూజితమ్

తస్మాదేతాని సర్వాణి నిర్గతాని సమంతతః ఇతిహాస పురాణాని లోకానాం హిత కామ్యయా

యథైతాని మమేష్టాని పురాణాని మహామతే! న తథావై చతుర్వేదీ నచాంగాని మహామతే!

శృణ్వంత్యేతానిమే భక్త్యా నిత్యం శ్రద్ధా సమన్వితాః దత్వాతు వాచకేవృత్తంతే గచ్ఛంతి పరం పదమ్

ధర్మార్థ కామమోక్షాణాం స్పష్టీకరణ ముత్తమమ్ ఇతిహాస పురాణాని మయా సృష్టానీ సువ్రత!

చత్వారో య ఇమేవేదా గూఢార్థాః సతతం స్మృతాః అత స్త్వేతాని సృష్టాని బోధాయైషాం మహామతే!

 యస్తుకారయతే నిత్యం ధర్మశ్రవణ ముత్తమమ్ ఆదిత్యాద్భాస్కరంప్రాప్య యాతి తత్పరమం పదమ్

దత్వాతు దక్షిణాంతత్ర ఆదిత్య స్యపురం వ్రజేత్ కీమాశ్చర్యం సురశ్రేష్ఠ! దొన పాత్రంహితత్పరమ్

తా॥ సర్వలోక పితామహుడైన బ్రహ్మదేవుడు కార్తికేయుని మాటలు విని యిట్లనెను. “భళి! చాల బాగుగనున్నది. పుణ్యాత్ముడ వయితివి. నీ వంటివాడు మఱియొకడులేడు. ఆ ఇరువురు పుణ్యపురుషులను దర్శించి ధన్యుడనైతివి. వత్సా! సూర్య భగవానుడు చెప్పిన దంతయును వాస్తవము. యథార్థము. అన్యథాకాదు. కుమారా! లోక పూజితమైన నా మొదటి ముఖము. నుండీయే ఇవి యన్నియు - ఇతిహాస పురాణములు- వెలువడి వ్యాప్తినొందినవి. ఇవి లోకమునకు మేలు చేయుటకునుద్దేశించినవి. ఈ పురాణేతిహాసములిష్టములైనట్లు నాకు నాలుగు వేదములుగానీ, షడంగములు కాని కావు. వీనిని నిత్యమును భక్తిశ్రద్ధా సమన్వితులై, వాచకునకు జీవనవృత్తి కల్పించి వినుచుండరుత్తమ గతి నందెదరు. ధర్మ, అర్థ, కామ, మోక్షములనెడి పురుషార్ధముల స్వరూపమును స్పష్టము చేయుట ఉత్తమమైన పుణ్యకర్మము. ఇతిహాస పురాణములు నా చేతనే సృష్టింపబడినవి. ఈ నాలుగు వేదములును ఎప్పుడును రహస్యమైన అర్థములుగలవిగా నున్నవి. వీని యర్థములను సుబోధము చేయుట కొఱకే నేనీ ఇతి హాస పురాణములను సృష్టించితిని. నిత్యమును ఉత్తమమైన పురాణ శ్రవణము చేయించువాడు సూర్య భగవానుని యనుగ్రహమున జ్ఞాన తేజస్సును పొంది యతని యుత్తమ లోకమునకుఁబోవును. వాచకునకు దక్షిణ నిచ్చువాడు సూర్యలోకమును చేరును. అందాశ్చర్యమేమి? వాచకునకన్న దాన పాత్రుడెవడు?.

 మూ॥ యథా దేవవరో లేఖో యథా హేతిః పరం పవి: బ్రాహ్మణానాంతథాశ్రేష్ఠోవాచకోనాత్ర సంశయః

హేతిర్యథా తేజసాంతు సరసాం సాగరో యథా తథా సర్వ ద్విజేభ్యస్తు వాచకః ప్రవరః స్మృతః

వాచకం పూజయేద్యస్తు నరో భక్తి పురఃసరమ్ పూజితం సకలం తేన జగత్యా నాత్ర సంశయః

సత్యముక్తం న సందేహో భానునా మత్కులోద్వహ! వాచకేన సమం పాత్రం న జాత్వన్యద్భవేత్క్వచితో .

తచ్ఛృత్వా బ్రహ్మణో వాక్యం కుమారో వాక్య మబ్రవీత్ “

అహో హి ధన్యతా తస్య పుణ్య శ్రవణ కారిణః దానంచ దదతోఽ త్యర్థం పుణ్యతా- వాచకాయవై” ,

ఇత్థం దిండే సదాయస్తు దేవ దేవస్య మందిరే కుర్యాత్తు ధర్మ శ్రవణం సయాతి పరమాంగతిమ్ .

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మే పర్వణి సప్తమీ కల్పే పుణ్య శ్రవణ మాహాత్మ్య వర్ణనం నామ చతుర్నవతి తమోఽధ్యాయః

 తా ॥ దేవతా శ్రేష్ఠులలో నింద్రుడు, ఆయుధములలో వజ్రాయుధ మేటులో బ్రాహ్మణులలో పురాణ వాచకుడట్లు శ్రేష్ఠుడైయున్నాడు. సంశయములేదు. తేజస్సులలో సూర్య కిరణము, జలాశయములలో సముద్రమెట్లో పౌరాణికుడు ప్రవరుడని చెప్పబడును. భక్తి పురస్పరముగ నే మనుష్యుడు వాచకుని పూజించునో వాడు సర్వ జగత్తును పూజించినవాడగుచున్నాడు. ఇట సంశయమేమియులేదు - . సూర్య భగవానుడు నిస్సందేహముగ సత్యమునే చెప్పెను. పురాణ వాచకుని కన్న యోగ్యుడేప్పుడెవడునులేడు”. బ్రహ్మ దేవుడు చెప్పిన దంతయువిని కుమారుడిట్లనెను. “ఆహా! పురాణ శ్రవణము చేయించువానిదియు, వాచకునకు పుష్కలముగ ద్రవ్య మిచ్చువానిదియు ధన్యత్వ పుణ్యత్వములెంత గొప్పవి”!. బ్రహ్మ దేవుడిట్లనెను. “దిండీ! ఇట్లు సూర్య దేవుని మందిరమున పురాణ శ్రవణము చేయించువాడు ఉత్తమగతి పొందును...

శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు పుణ్య శ్రవణ మహాత్మ్యవర్ణనమను తొంబది నాల్గవ అధ్యాయము సమాప్తము.