89. ఆదిత్యవార కల్పమున ఆదిత్యాభిముఖ విధి వర్ణనము

 బ్రహ్మోవాచ : -

మూ॥ కృష్ణ పక్షస్య సప్తమ్యాం మాఘమాసే భవేత్తుయః సాదిత్యాభి ముఖో జ్ఞేయః శృణు చాస్య విధింపరమ్,

కృత్వైక భుక్తం కృష్ణస్య వారే త్రిపుర సూదన! ప్రాతః కృత్వాతతః స్నానం పూజయిత్వాదివాకరమ్

ఆదిత్యాభిముఖస్తిష్టే ద్యావదస్తమనం రవే: జపమానో మాహాశ్వేతాం లాభమాశ్రిత్యసువ్రత!

చతుర్హస్తమృజుం శ్లక్ష్ణమవ్రణం సుగమం దృడమ్ రక్తచందన వృక్షస్య స్తంభం కృత్వా గణాధిప

 తమాశ్రిత్య మహాభక్త్యా దేవదేవం దివాకరమ్ పశ్యమానో జపన్ శ్వేతాం తిష్ఠదస్తమనాద్రవేః

గంథపుష్పోప హారైస్తు పూజయిత్వా దివాకరమ్ బ్రాహ్మణే దక్షిణాం దత్వా తతో భుంజీత వాద్యతః

ఇత్థమేతం తు యః కుర్యాదాదిత్య ప్రీతయే నరః భానుమాంస్తస్య ప్రీతః స్యాత్సర్వం ప్రీతో దదాతి హి

 ధనం ధాన్యం తథా పుత్ర మారోగ్యం భార్గవీం యశః తస్మాత్సం పూజయే దత్ర గీర్వాణాధిపతిం హర!

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మే పర్వణ్వాదిత్యవార కల్పే ఆదిత్యాభిముఖ విధి వర్ణనం నామ నవాశీతి తమోఽధ్యాయః

 తా॥  బ్రహ్మదేవుడిట్లనెను. “మాఘమాస కృష్ణపక్ష సప్తమీ ఆదిత్యాభిముఖ వారమని తెలియవలెను. శ్రేష్ఠమైన ఈ విధిని గుణించి వినుము. పూర్వ దినముననేక భుక్తముచేసి, మరుసటి దినమున ప్రాతఃకాలమున స్నానాదికృత్యములు పూర్తిగావించి, సూర్య భగవానుని పూజచేసి,. సూర్యుడస్తమించువఱకును, మహాశ్వేతను జపించుచు సూర్యాభిముఖముగ నీలిచియుండవలెను. ఫలమును కోరువాడీట్లు చేయవలెను. నాలుగు బారల చక్కని, సన్నని, కణుపులేరి, సమముగను, దృఢముగను ఉన్న ఎట్టి చందనపు స్తంభమును సిద్దము చేసికొని. దానినాశ్రయించియుండి భక్తి పురస్సరముగ సూర్య భగవానుని వైపు చూచుచు, మహాశ్వేత మంత్రమును జపించుచు సూర్యుడస్తమించు వఱకును అటులే యుండవలయును. గంధ పుష్పాది ద్రవ్యములతో సూర్య పూజనము చేసి, బ్రాహ్మణునకు దక్షిణ సమర్పించి, వాజ్నియమముగలవాడై అప్పుడు తాను భుజింపవలెను. సూర్యదేవుని ప్రీత్యర్థమై యీ విధముగ నభిముఖ వార వ్రత విధిని నిర్వర్తించువానియెడ భానుదేవుడు ప్రీతుడై, అతనికి ఆ దేవదేవుడు అభిమతార్ధములనన్నింటి నొసంగును. ధనము, ధాన్యము, సంతానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి మున్నగువానినిచ్చును. కావున నాదినమున దేవేశుని పూజింపవలెను...

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున ఆదిత్యవార కల్పమునందు ఆదిత్యాభిముఖ వర్ణనమను ఎనుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.