85. ఆదిత్యవార కల్పమున కామద విధి వర్ణనము

 మూ!! బ్రహ్మోవాచ : -

ప్రాప్తే మార్గశిరే మాసి శుక్లషష్ఠ్యాంతు యోభవేత్ స జ్ఞేయః కామదో వారః సదేష్టో భాస్కరస్యతు

 తత్రయః పూజయేద్భానుం భక్తి శ్రద్ధా సమన్వితః విముక్తః సర్వ పాపైస్తు ప్రాప్నుతే నందనాధిపమ్

రక్తచందన మిశ్రాణి కరవీరాణి సువ్రత! ధూపం ఘృతాహుతిం వీర! భాస్కరాయ ప్రయోజయేత్

నైవేద్యం చాపి కృశరం సుగంధం తీక్షమేవచ కృత్వోపవాస మథవా నక్తం త్రిపుర సూదన!

ఇత్థం ప్రపూజితో హ్యత్ర భాస్కరో లోక భాస్కరః కామాన్దదాతి సర్వాన్వై అతోయం కామదః స్మృతః

సపుత్రం పుత్ర కామస్య ధన కామస్య వా ధనమ్ విద్యార్థినే శుభాం విద్యామారోగ్యం రోగిణీ విభో!

అన్యాంశ్చ వివిధాన్కామాన్మంత్రైః సంపూజితో రవిః దదాతి గణ శార్దూల! అతోయం కామదః స్మృతః

 దద్యాద్యో మండకం చాత్ర గోపతేర్గోత్రభూషణః గోత్రారి తేజసా తుల్యో గోపతేర్గోపురం వ్రజేత్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మేపర్వణి ఆదిత్యవారకల్పే కామద విధి వర్ణనం నామ పంచాశీతి తమోఽధ్యాయః

తా॥  బ్రహ్మదేవుడిట్లనెను. “మార్గశిర శుక్లపక్ష షష్ఠీతిథినాడు వచ్చు ఆదివారము 'కామద వారమని చెప్పబడును. ఇది సూర్యదేవున కెప్పుడును ఇష్టమైనది. భక్తి శ్రద్దా సమన్వితుడై ఆ దినమున భాస్కరునారాధించువాడు సర్వపాపముల నుండి ముక్తుడై సూర్యుని పొందును. ఎట్టి చందనముతోఁగలిపిన గన్నేరుపూలు, అగ్నిలో నేతిని యాహుతి చేయగా వచ్చు ధూపము, సూర్యపూజలో వినియోగింపవలెను. పరిమళము గల వేడి పులగమును నైవేద్యము పెట్టవలెను. ఉపవాసవ్రతము లేక నక్త విధితో సూర్యపూజ చేయవలెను. లోకములకు వెలుగును ప్రసాదించు భాస్కర దేవుడిట్లు పూజింపబడి సర్వకామములనిచ్చును. అందుచేనిది కామదమని చెప్పబడినది. పుత్రకాములకు పుత్రులను, ధనమును కోరువారికి ధనమును, విద్యార్థులకు శుభప్రదమైన విద్యను, రోగుల కారోగ్యము నిచ్చును. కామద వారమునాడు పూజలందించిన సూర్యదేవుడు ఇంకను వివిధములైన కోరికలన్నింటిని దీర్చును. అందుచే ఆనాటి సూర్యభగవానుడు కామదుడని చెప్పబడినాడు. వంశభూషణుడైన భక్తుడు ఆదినమున సూర్యభగవానునకు నేతి భక్ష్యములు సమర్పించేనేవి ఇంద్రతేజము వంటి తేజము గలవాడై అతడు సూర్యస్థానమునకుఁబోవును.

శ్రీ భవిష్య పురాణమునందలి బ్రహ్మపర్వమున ఆదిత్యవార కల్పమునందు కామదవిధి వర్ణనమను ఎనుబది యైదవ అధ్యాయము సమాప్తము.