80. సప్తమీ కల్ప మహాత్మ్య వర్ణనము

సుమంతురువాచ :

మూ॥ “ఇత్థం శ్రుత్వా కథాం దివ్యాం హేలిమాహాత్మ్య మాశ్రితామ్ సాంబః పప్రచ్ఛ భూయోఽపి నారదం ముని సత్తమమ్”

 సాంబఉవాచ :

“సూర్యపూజాఫలం యచ్చ యచ్చ దానఫలం మహత్ ప్రణి పాతే ఫలం యచ్చ గీత వాద్యేచ యత్ఫలమ్

భాస్కరస్య ద్విజశ్రేష్ఠ! తన్మేబ్రూహి సమంతతః యేన సంపూజయా మ్యేష భానుం దేవైః సదార్చితమ్”

నారద ఉవాచ :

ఇమమర్థం పురా పృష్టో బ్రహ్మా లోకపితా మహః దిండినా యదుశార్దూల! శృణు ష్వైకాగ్రమానసః

సుఖాసీనం తథాదేవం సురజ్యేష్ఠం పితామహమ్ ప్రణమ్య శిరసా దిండిరిదం వచన మబ్రవీత్"

దీండిరువాచ :

“సూర్య పూజా ఫలం బ్రూహి బ్రూహి దానఫలం తథా ప్రణామే యత్ఫలందేవ! యచ్చోక్తం తౌర్యకత్రయే

ఇతి హాస పురాణాభ్యాం కారితే శ్రవణే తథా పురతో దేవదేవస్య యత్ఫలం స్యాత్తదుచ్యతామ్

మార్జనే లేపనే యచ్చ దేవదేవస్య మందిరే భాస్కరస్య కృతే బ్రూహి మమలోక పితామహ!

బ్రహ్మోవాచ :

“స్తుతి జాప్యోపహారేణ పూజాయాచ నరో రవేః ఉపవాసేన షష్ఠ్యాంచ సర్వపాపైః ప్రముచ్యతే

ప్రణిధాయ శిరోభూమౌ నమస్కార పరోరవేః తత్క్షణాత్సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః

తా॥ సుమంతుముని యిట్లనెను. 'ఇట్లు సూర్యుని మాహాత్మ్యమును గుఱించిన దివ్యకథ విని సాంబుడు మఱలనారదుని యిట్లు ప్రశ్నించేను “ సాంబుడిట్లనెను. “ముని సత్తమా! సూర్యుదేవుని పూజించుట వలన, ఆదేవదేవుని సేవాగ్ధమై దానములిచ్చుట వలన, అతనికి నమస్కరించుటవలన, అతని సమక్షమున గీత వాద్యాదులతోనతనికి ప్రీతికలిగించుట వలన. ఎట్టి ఫలములు గలుగునో వానిని గూర్చి నాకు చెప్పడు. దేవతలతో నెల్లప్పుడును పూజింపబడు నాలోక బాంధవుని నేను కూడా అయా ఫలముల ననుసరించి పూజింతును”-. నారదుడిట్లనెను. “ఇదే విషయమును గూర్చి పూర్వము దిండి, లోకపితామహుడైన బ్రహ్మదేవునడిగెను. ఆ వివరములు చెప్పెదను. సావధానుడవై వినుము. సురజ్యేష్ఠుడైన బ్రహ్మదేవుడు సుఖాసీనుడైయుండగా దిండి తలవంచి నమస్కరించి యాతనితో నిట్లనెను "బ్రహ్మదేవా! సూర్యపూజవలన, అతని ప్రీత్యర్థమై చేసెడు దానము వలన, నమస్కారము వలన, నృత్యగీత వాద్యాది సేవ వలన ఇతిహాస పురాణముల ప్రవచనములచేత, వానిని వినుటచేత, వీనిని సూర్యదేవుని యెదుట నిర్వహించుట చేత ఏఫలములు కలుగునో వానిని నాకుఁజేప్పుడు. సూర్యమందిరమున శుభ్రము చేయుట, అలికి ముగ్గుల పెట్టుటమున్నగు వాని వలన కలుగు ఫలమునూ కూడా నాకుఁదెలుపుడు”. బ్రహ్మదేవుడిట్లు పలికెను. “సూర్యుని స్తుతించుట, జపించుట, అతని సేవకొఱకు కానుకలిచ్చుట, పూజించుట, షఫీతిథినాడు ఉపవసించుట వలన సర్వపాపములనుండి విముక్తి లభించును. తలను నేల పైనాన్చి సూర్యనమస్కారములు చేయువాడు ఆక్షణముననే సర్వపాపములనుండి ముక్తుడగును. సందేహము లేదు.

మూ॥ భక్తి యుక్తో నరేయస్తు రవేః కుర్యాత్ప్రదక్షిణమ్ ప్రదక్షిణీ కృతాతేన సప్త ద్వీపా భవేన్మహీ

సూర్యలోకం వ్రజేచ్చాపి ఇహరోగైశ్చముచ్యతే ఉపానహౌ పరిత్యజ్య అన్యధానరకం వ్రజేత్

సోపానత్కో నరేయస్తు ఆరో హేత్సూర్యమందిరమ్ స యాతి నరకం ఘోర మసి పత్రవనం విభో!

 సూర్యం మనసి యః కృత్వా కుర్యాద్వ్యోమ ప్రదక్షిణమ్ ప్రదక్షిణీ కృతాస్తేన పర్వేదేవా భవంతి హి

పరితుష్టాశ్చ తే సర్వే ప్రయచ్ఛంతి గతిం శుభమ్ సర్వేదేవా మహాబాహో! హ్యభీష్టంతు పరంతప!

ఏకాహారో నరోభూత్వా షష్ఠ్యాం యోఽర్చయతే రవిమ్ సప్తమ్యాం వా మహాబాహో! సూర్యలోకం స గచ్ఛతి

 ఆహోరాత్రోప వాసీచ పూజయేద్యస్తు భాస్కరమ్ సప్తమ్యాం వాథ పష్యాం వా సగచ్ఛేత్పరమాం గతిమ్

 కృష్ణ పక్షస్య సప్తమ్యాం సోపవాసో జితేంద్రియః సర్వరకోప హరేణ పూజయేద్యస్తు భాస్కరమ్

పంకజైః కర వీరై ర్వా కుంకుమోదక చందనైః మోదకైశ్చ గణశ్రేష్ఠ! సూర్యలోకం సగచ్ఛతి

శుక్ల పక్షస్య సప్తమ్యాముపవాస రతః సదా సర్వశుక్లోప హారేణ పూజయేద్యస్తు భాస్కరమ్

జాతీ ముద్గరకైశ్చైవ శ్వేతోత్పల కదంబకైః పాయ సేన తథా దేవం స వజ్రేణార్చ యేద్రవిమ్

సర్వపాప విశుద్ధాత్మా విధుఃకాంత్యాన సంశయః హంసయుక్తేన యానేన హంసలోక మవాప్నుతే

తా॥  భక్తితో సూర్యదేవునకు ప్రదక్షిణము చేయువానికి సప్తద్వీపములతో గూడిన భూమికి ప్రదక్షిణము చేసిన ఫలములభించును . ఇహమునందు సర్వరోగ వినిర్ముక్తుడై సూర్యలోకమునకుఁబోవును. కాని ప్రదక్షిణము పాదరక్షలు లేకుండ చేయవలెను. పాదరక్షలతో ప్రదక్షిణము చేసినచో నరకము సంప్రాప్తమగును. పాదరక్షలతో గూడి సూర్యమందిర ప్రవేశము చేయువానికి “అసిపత్రవనమ'ను ఘోరమగు నరకము ప్రాప్తించును. మనస్సు నందు సూర్యదేవుని ధ్యానించుచు ఆకాశప్రదక్షిణము చేయువానికి దేవతలందఱును ప్రసన్నులగుదురు.. వారతని యెడ సంతుష్టులై శుభస్థితినిత్తురు. అంతియగాక అతని అభీష్టములను సఫలము చేయుదురు. షష్ఠినాడు ఒక పర్యాయము మాత్రమే భుజించు నియమముతో, లేక సప్తమీనాడైనను సూర్యదేవునర్చించువాడు సూర్యలోకమునకుఁబోవును.. రాత్రింబవలును షష్టి లేక సప్తమీ నాడు ఉపవాస వ్రతముతోనుండి సూర్యారాధన చేయువాడు 'పరమగతినందును. కృష్ణ పక్ష సప్తమీనాడు జితేంద్రియుడై ఉపవసించి ఎఱ్ఱని వస్తువులతో నాదేవుని పూజింపవలెను. తామరపువ్వులు, గన్నేరుపూలు, కుంకుమనీరు, చందనము, లడ్డుపములతో సూర్యభగవానునర్చించువాడు సూర్యలోకమునందును. శుక్లపక్ష సప్తమీనాడు ఉపవాస దీక్షతో తెల్లని పూజా వస్తువులతో భాస్కరుని పూజింపవలేను. జాజిపూలు, మల్లెలు, తెల్లకలువలు, కడిమిపూలు, పాయసము, వజ్రములతో సూర్యునర్చింపవలెను. అటుల పూజించువాడు సర్వపాపములనుండి ముక్తుడై, పరిశుద్ధాత్ముడై, చంద్రకాంతి వంటి కాంతి గలవాడై హంసలతో గూడిన విమానమున సూర్యలోకమును చేరును.

 మూ!! దిండిరువాచ : -

“బ్రూహిమే విస్తరాద్దేవ! సప్తమీకల్పముత్తమమ్ ఉపోష్య సప్తమీంయేన గమిష్యే శరణం రవ్వే”

బ్రహ్మోవాచ : -

“సాథు పృష్టోస్మి భవతా సప్తమీ కల్పముత్తమమ్ యథా సహస్ర కిరణః పురా పృష్టోఽరుణేనవై

కథితాః సప్తసప్తమ్యో భానునా శ్రేయసే నృణామ్ అరుణస్య గఱశ్రేష్ఠ! పృచ్ఛతః కారణాంతరే

కస్యచిత్వథ కాలస్య దేవదేవం దివాకరమ్ ధ్యానమాశ్రిత్య తిష్ఠంత మరుణో వాక్యమబ్రవీత్

కిమర్ధం దేవ దేవేశ! ధ్యానమాశ్రిత్య తిష్ఠసి? దినం న యాతి దేవేశ! కారణం మమ కథ్యతామ్

 కురు చంక్రమణం దేవ! వహమానో దివస్పతే! ఇత్యేవం భగవాన్పృష్ట ఇదం వచన మబ్రవీత్

శృణు త్వం ద్విజశార్దూల! యదర్థం ధ్యాన మాశ్రితః అర్వావసు ర్ద్విజశ్రేష్ఠః సచాపుత్రః ఖగోత్తమ!

 ఆరాధయతి మాం నిత్యం గంధ పుష్పోపహారకైః పుత్రకామః ఖగశ్రేష్ఠ! నచజానత్యయం యథా

పుత్రదోఽహం భవే యేన విధినా పూజితఃఖగ! శ్రూయతాం చ విధిః సర్వే యేనప్రీతో భవేనృణామ్

 సప్తమీ కల్పసంజ్ఞోపై విధీనాముత్తమో విధిః యస్తుమాం పూజయేన్నిత్యం తస్యపుత్రాన్దదామ్యహమ్

గృహ్ణీష్వ సప్తమీకల్పం గత్వా బ్రూహిద్విజోత్తమమ్ యేనాహం బహుపుత్రత్వం దద్యాం తస్య తథా ఖగ!

శ్రుత్వాభానోః క్షణాదేవ జగామ సఖగోత్తమః కథయామాస తత్సర్వం భానోర్వచన మాదితః

బ్రాహ్మణస్యఖగశ్రేష్ఠ! స చశ్రుత్వాద్విజోత్తమః చకార సప్తమీ కల్పం యథాఖ్యాతం ఖగేనతు

బుద్ధిం వృద్ధిం తథారోగ్యం ప్రాప్యపుత్రాంశ్చ పుష్కలాన్ గతోఽ సౌ సూర్యలోకంచ తేజసా తత్సమో భవత్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రహ్మేపర్వణి  సప్తమీ కల్పమాహాత్మ్య వర్ణనం నామాశీతి తమోఽధ్యాయః

తా॥  దిండి యిట్లనెను. “దేవా! శ్రేష్టమగు సప్తమీ కల్పమును నాకు సవిస్తరముగఁజేప్పుడు. నేనావిధానముననుసరించి సప్తమీనాడు ఉపవాస వ్రతము బూని ఆ సూర్యభగవానుని శరణుపొందెదను.”. బ్రహ్మదేవుడిట్లునుడివెను. ఉత్తమమగు సప్తమీ కల్పమును గూర్చి లెస్సగా నడిగితివి. ఇట్టి ప్రశ్ననే పూర్వము సూర్యభగవాను నరుణుడడిగెను. మానవుల శ్రేయస్సు కొఱకు భాస్కరదేవుడు ఏడు సప్తమీ తిథుల వ్రత విధానములు వివరించెను. అరుణుడీ వ్రతమును గూర్చి కారణాంతరమున నడిగి యుండెను. ఒకానొక సమయమున సూర్యదేవుడు ధ్యానము నాశ్రయించి యుండగా నరుణుడతనితో నిట్లు పలికెను. 'దేవదేవేశా! మీరు ధ్యానమునందేలయుంటిరి? మీరిట్లు నిలిచినచో దినము గడవదు. ఇట్లు నిలుచుటకు కారణము తెలుపుడు. కాలమును ముందుకు నడిపించుచు సాగిపొండు” అరుణుడిట్లడుగగనే సూర్యదేవుడిట్లు పలికెను. 'నేను ధ్యానముననుండుటకు కారణమును వినుము. అర్వావసువను బ్రాహ్మణోత్తమునకు సంతానము లేనందున. ప్రతిదినమతడు గంథపుష్పాదులచే నన్ను పూజించుచుండెను. పుత్రార్ధియై యాతడు నన్ను పూజించుచుండినను అతనికి పూజా విధానము మాత్రము తెలియకుండెను. ఎట్లు పూజించినచో నేను పుత్రులను అనుగ్రహింతునో అతడెఱుంగకుండెను. మానవులే విధితో పూజించినచో నేను ప్రసన్నుడనగుదునో దానిని చెప్పెదను వినుము. పూజా విధులలో సప్తమీ కల్పమను పేరు గలది ఉత్తమమైనది. దాని ననుసరించి నన్ను పూజించినవారికి పుత్రుల నొసంగుదును. ఈ సప్తమీ కల్పమును గొనిపోయి ఆ బ్రాహ్మణునకుఁజెప్పుడు. ఈ విధానమున నన్నాతడు పూజించును. అతనికి నేను పుత్రులనొసంగుదును. “సూర్యుడిట్లు చెప్పిన వెంటనే ఆఖగోత్తముడు బ్రాహ్మణుని చెంతకు బోయి సూర్యోక్త సప్తమీ కల్పమంతయు నాతని కుపదేశించెను. ఆ ద్విజోత్తముడదిసాంతముగ విని యధావిధిగ కల్పోక్త ప్రకారముగ వ్రతమాచరించెను. ఫల స్వరూపముగ నతడు సంపదలను, అభివృద్దిని, ఆరోగ్యము, బహుసంఖ్యాకులగు పుత్రులను బడసీ సూర్య తేజస్సుతో సమానమగు తేజస్సును పొంది సూర్యలోకమునకేగేను.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమాహాత్మ్యవర్ణనమను ఎనుబదియ అధ్యాయము సమాప్తము.