73. సాంబకృత సూర్యారాధన వర్ణనము

మూ॥ సుమంతురువాచ :

ఏత స్మిన్నేవ కాలేతు నారదో భగవానృషిః బ్రహ్మణో మానసః పుత్ర స్త్రీషులోకేషు విశ్రుతః

సర్వలోక చరః సోఽధ అటమానః సమంతతః వాసుదేవం సవై ద్రష్టుం నిత్యం ద్వారవతీం పురీమ్

ఆయాతి ఋషిభిః సార్థం క్రోధనో ముని సత్తమః అథాగచ్ఛతి తస్మింస్తు సర్వేయదు కుమారకాః!  

ప్రద్యుమ్న ప్రభృతయోయే ప్రహ్వాశ్చావనతాః స్థితాః అభివాద్యార్ఘ్య పాద్యాభ్యాం పూజాంచక్రుః సమంతతః

సాంబ స్త్వవశ్య భావిత్వాత్తస్య శాపస్య కారణమ్ అవజ్ఞాం కురుతే నిత్యం నారదస్య మహాత్మనః

రతః క్రీడాసువైనిత్యం రూపయౌవన గర్వితః అవినీతంతు తం దృష్ట్యా చింతయామాస నారదః

అస్యాహమవినీతస్య కరిష్యే వినయం శుభమ్ ఏవం సంచింతయిత్వాతు వాసుదేవ మథాబ్రవీత్

ఇమాః షోడశ సాహస్ర్యః స్త్రియో యాదవ సత్తమ! సర్వాంహి సదా సాంబే భావోదేవ! సమాశ్రితః

రూపేణాప్రతిమ: సాంబో లోకేస్మిన్సచరాచరే సదాహీచ్ఛంతి తాస్తస్య దర్శనం చాపి హిస్త్రియః

శ్రుత్వైవం నారదాద్వాక్యం చింతయామాస కేశవః 'యదేతన్నారదేనోక్తమ న్యదత్తతు కింభవేత్';

తా॥ బ్రహ్మ మాననసపుత్రడు, త్రిలోక ప్రసిద్ధుడు, సర్వ లోకములందు సంచరించుచుండువాడు, ఎప్పుడును తిరుగుచుండు వాడునైన నారద మహర్షి తఱచుగా శ్రీ కృష్ణదర్శనార్థమై ద్వారకకు వచ్చుచుండును-1, 2. గంభీరుడైన ఆమునిసత్తముడు కొందఱు ఋషులతోగూడి ద్వారకా పట్టణమునకీ సమయమున నేతెంచెను. ఆయన రాకతో యదుకుమారులందఱు-3. ప్రద్యుమ్నుడు మొదలగువారు వినయముతో వినమ్రులై ఆయనకు అభివాదముచేసి, అర్ఘ్య పాద్యాదులతో ఆ ఋషివర్యుని పూజించిరి-4, సాంబుడు మాత్రము, అవశ్యముగా ననుభవింపబోవు శాపకారణమున నేమో మహాత్ముడైన నారదుని కూడ అవమానింపదొడగెను-5. తాను సుందరుడనని, యావనవంతుడననీ అహంకరించి, క్రీడాసక్తుడై నిత్యము కన్నుమిన్నుగానక తీరుగుచుండెను. అవినీతుడైన సాంబుని వైఖరి గమనించి నారదుడాలోచనలోఁబడెను-6. “అవినీతుడైన ఈ సాంబుని వినయశీలిగ మార్చివేసెదను”. అని నిశ్చయించుకొని శ్రీ కృష్ణునితో నిట్లనెను-7. “ఓ కృష్ణా! ఈ పదహారు వేల మంది స్త్రీలందఱికిని సాంబునియందు ఒక ప్రత్యేక భావముకలదు-8. ఇతడు చరాచర ప్రపంచమంతటిలోను రూప సౌందర్యమున సాటిలేనివాడు. ఈ స్త్రీలందు ఎల్లవేళల నాతని దర్శనము న పేక్షించుచుందురు”-9. నారదుని ఈ వాక్యము విని శ్రీ కృష్ణుడిల్లాలోచించెను. “నారదుడు చెప్పిన ఈ విషయమును బట్టి స్త్రీలందఱు సాంబుని చూచుట కపేక్షించుచుండుటలో వేణు కారణమేమి కలదు?

మూ. వచనం శ్రూయతే లోకే చాపల్యం స్త్రీషు విద్యతే శ్లోకౌ చేమౌ పురాగీతౌ చిత్త జ్ఞై ర్యోషితాం ద్విజై:

పౌంశ్చల్యాచ్చల చిత్తత్వాన్నై: స్నేహ్యాచ్చ స్వభావతః రక్షితాః సర్వతో హ్యేతా వికుర్వంతి హి భర్తృషు

నైతా రూపం పరీక్షంతే నాసాం వయసి నిశ్చయః సురూపం వా వీరూపం. పుమానిత్యేవ భుంజతే

సుమంతురువాచ :

‘మనసా చింతయన్నేవ కృష్ణో నారద మబ్రవీత్ ‘సహ్యహం శ్రద్ద ధామ్యే తద్యదే. తద్భాషితం త్వయా'

బ్రువాణమేవం దేవంతు నారదో వాక్యమబ్రవీత్ తథాహం తత్కరిష్యామి యథా శ్రద్ధాస్యతే భవాన్'

ఏవముక్త్వా యయౌ స్వర్గం నారదస్తు యథాగతః తతః కతిపయాహోభిర్ద్వారకాం పునరభ్యయాత్

తస్మిన్నహని దేవోఽపి సహాన్తః పురికైర్జనైః అనుభూయ జలక్రీడాం పానమా సేవతే రహః

రమ్య రైవత కోద్యానే నానాద్రుమ విభూషితే సర్వర్తు కుసుమైర్నిత్యం వాసితే సర్వ కాననే

నానా జలజ ఫుల్లా భిర్దిర్ఘి కాభిరలంకృతే హంససారస సంఘుష్టే చక్రవాకోపశోభితే

తస్మిన్సరమతే దేవః స్త్రీభిః పరివృతస్తదా హార నూపురకేయూర రశనాద్యైర్విభూషితైః

తా॥ స్త్రీలలో చాపల్యముండునని లోకమున వినబడుచున్నది. స్త్రీ మనస్తత్వము నెఱిగిన మేధావులు పూర్వమి శ్లోకములను చేప్పిరి. “చపల చిత్తమువలన, అంకు తనపు లక్షణము కలిగియుండుట వలన స్వభావముచే వీరిని విశ్వసింపరాదు. వీరు అన్ని వేళల రక్షింపబడుచుండియు భర్తల యెడ వికృత ప్రవర్తన కలిగియుందురు-12, వీరు రూపమును పరీక్షింపరు. వయస్సును నిశ్చయింపరు. సుందరరూపుడో వికారరూపుడో పురుషుడైనచో చాలును. వానితో భోగింతురు”-13. సుమంతుముని యిట్లనెను. “శ్రీకృష్ణుడు మనస్సుననిట్లు చింతింపుచు నారదునితో నిట్లనెను. “నారదా! నీవు చెప్పిన మాటను విశ్వసింప జాలకున్నాను”-14. శ్రీ కృష్ణుని యీ మాటలు విని నారదుడు, “కృష్ణా నీవు విశ్వసించునట్లు నీకు తార్కాణము చూ పెదను' అని చెప్పి-15 ఎట్లు వచ్చెనో అట్లు స్వర్గమునకు వెడలిపోయెను. మఱల కొన్ని దినములకు ద్వారకకు వచ్చెను-16. ఆ దినమున కృష్ణుడు అంతః పురస్త్రీలతో జలక్రీడలాడి, రైవత కోద్యానమున పానము సేవించుచు నేకాంతమున నుండెను-17. వివిధ వృక్షములతో శోభించుచు, ఎప్పుడును పూ సెడి సర్వ ఋతువుల పుష్పములతో విలసిల్లుచు, వాని పరిమళములతో గుబాళించుచు-18. అనేక విధములైన వికసించిన తామరలతో, డిగ్గియలతో శోభించుచు, హంసలు, బెగ్గురు పక్షులు, జక్కవ పక్షులు మున్నగువానితో నలరుచు-19. ఆహ్లాదకరముగనున్న ఆ ఉద్యానవనమునందు శ్రీ కృష్ణుడు, మణి హారములు, అందియలు, కేయూరములు, మెలనూళ్లు మొదలగు నాభరణములతో నలంకరింపబడి యున్న స్త్రీలతో క్రీడించుచుండెను.

మూII భూషితానాం వరస్త్రీణాం చార్వంగీఛాం విశేషతః తాభిః సంపీయతే పానం శుభగంధాన్వితం శుభమ్

ఏతస్మిన్నంతరే బుద్దా మద్యపానాత్తతః స్త్రియః ఉవాచ నారదః సాంబం “సాంబోత్తి ష్ట కుమారక!

త్వాం సమాహ్వాయతే దేవో నయుక్తం స్థాతు మత్రతే తద్వాక్యార్ధమ బుద్వైవ నారదేనాథ చోదితః

గత్వాతు సత్వరం సాంబః ప్రణామమకరోత్ర్పభోః సాష్టాంగంచ హరేః సొంబో విధి వద్వల్లభస్యచ

ఏతస్మిన్నంతరే తత్ర యాస్తువై స్వల్పసాత్త్వికాః తం దృష్ట్యా సుందరం సాంబం సర్వాశ్చక్షుభిరే స్త్రియః

నసదృష్టః పురా యాభిరంతఃపుర నివాసిభిః మద్యదోషాత్తతస్తాసాం స్కృతిలో పాత్తథానృప!

స్వభావతోల్ప సత్త్యానాం జఘనాని విసుగ్రువు: శ్రూయతే చాప్యయం శ్లోకః పురాణ ప్రథితఃక్షితౌ

బ్రహ్మ చర్యేపి వర్తంత్యాః సాద్వ్యాహ్యాపి చశ్రూయతే హృద్యం పురుషం దృష్ట్యా యోనిః సంక్లిద్యతే స్త్రీయాః

లోకేపి దృశ్యతే హ్యేత న్మద్య స్యాత్యర్ధ సేవనాత్ లజ్జం ముంచంతి నిఃశంకా హీమ త్యోహ్యపీ హిస్త్రియః

సమాం సైర్భోజనైః స్ని గ్ధైః పానైః సీధు సురాసవైః గంధైర్మనో జ్ఞేర్వస్తిశ్చ కామః స్లీషు విజృంభతే

తా॥ భూషణములతో నలంకరించుకొని యున్న సుందరాంగులతో - ముఖ్యముగ నతిశయించిన సౌందర్యముగల జవ్వనులతో గూడి మంచి పరిమళముగల శ్రేష్ఠమైన మద్యమును సేవించుచుండెను-21. అంత కొంత తడవైన పిమ్మట నా స్త్రీలు మద్యపానము మత్తు నుండి ఇంచుక తేరుకొనిరి. ఆ సమయమున నారదుడు సాంబునితో “సాంబా! లెమ్ము! మా తండ్రి గారు నిన్ను రమ్మని పిలిచినారు. త్వరగా పొమ్ము. ఇక్కడ జాగు సేయుచునుండుట నీకు తగదు”. అనెను. సాంబుడు నారదుని వాక్యములలోని యంతరార్థము నెఱుంగ జాలక నాతని ప్రేరణతో శ్రీ కృష్ణుడు స్త్రీలతో క్రీడించుచున్న ఉద్యానవనమునకుఁబోయి, కృష్ణునకు సాష్టాంగ నమస్కారము చేసెను. ప్రేమాస్పదుడైన తండ్రికినట్లు ప్రణమిల్లిన సాంబుని -24 సుందరుడైన సాంబుని ఆ స్త్రీలందఱు ఇంచుక పులకరించుచు తిలకించి చలించిపోయిరి-25. అంతః పురస్త్రీలిట్లు సుందర పురుషుని జూచి కలత చెందుటను శ్రీ కృష్ణుడు లోగడ చూచియుండలేదు. మద్యపానపు మత్తువలన కలిగిన స్మృతి లోపమువలన నా స్త్రీలటు సాంబుని గగుర్పాటుతో చూచిరి-26. స్వాభావికముగ నిగ్రహశక్తి లేని స్త్రీల జఘన భాగములు ఇట్టిత ద్రవించును. ఈ సందర్భముగ పురాణ ప్రసిద్ధమగు శ్లోకమొకటి వినబడుచుండెను-27. దాని భావమిది, బ్రహ్మ చర్యమునందుండు స్త్రీలైనను, సాధ్వీమణులైనను అందగాడైన పురుషుని. జూచినంతనే స్త్రీలకు. యోని ఆర్టమగును-28. మద్యపానము నతిమాత్రముగా జేసిన స్త్రీల విషయముననిది లోకమున కన్నట్టుచునే యున్నది. ఇట్టి సందర్భములందు సిగ్గుగల స్త్రీలు కూడ నిశ్శంకగ సిగ్గువిడిచి ప్రవర్తింతురు-29. మాంసములతోడను, నూనెలతోడను వండిన భోజనములు చేయుటచేత, చేటుకుకల్లు, మద్యము, ఆసవము మున్నగునవి సేవించుటచేత, సుగంధ పరిమళములచేత, అందమైన వస్త్రములు ధరించుట చేతను స్త్రీలలో కామము విజృంభించును-30.

మూ॥ సీధు ప్రయుక్తం శుశ్రేణ సతతం సాధు హీచ్ఛతా మద్యం న పేయ మత్యర్థం పురుషేణ విపశ్చితా

నారదోప్యథతం సాంబం ప్రేషయిత్వా త్వరాన్వితః ఆజగమాథ తత్రైవ సాంబస్యాను పదేనతు

ఆయాంతం తాశ్చతం దృష్ట్వా ప్రియం సౌమన సమృషిమ్ సహసైవోత్థితాః సర్వాః స్త్రియస్తం మదవిహ్వలాః

తాసామధోత్థితానాంతు వాసుదేవస్య పశ్యతః భిత్వా వాసాంసి శుభ్రాణి పత్రేషు పతితానితు

తా దృష్ట్వాతు హరిః క్రుద్ధః సర్వాస్తా శప్తవాన్ స్త్రియః యస్మార్గతాని చేతాంసి మాం ముక్త్వానక్షత్రచ స్త్రియః

తస్మాత్పతి కృతాన్లోకానాయుషోంతే నయాస్యథ పతిలోక పరిభ్రష్టాః స్వర్గ మార్గాత్తథైవచ

భూత్వా -శరణాయూయం దస్యుహస్తం గమిష్యథ

సుమంతురువాచ :

శాపదోషాత్త తస్తస్మాత్తాః స్త్రియఃస్వర్గతేహరౌ ద్యూతాః పాంచనదై శ్చోరై రర్జునస్యతుపశ్యతః అల్ప సత్త్వాస్తు యాస్త్యా సన్గ తాస్తా దూషణం స్త్రియః

రుక్మిణీ సత్యభామాచ తథా జాంబవతీ ప్రియా నైతా గతా దస్యు హస్తం స్వేన సత్త్వేన రక్షితాః

శప్వైవ తాః స్త్రియః కృష్ణః సాంబమప్య శపత్తతః యస్మాదతీవ తేకాంతం రూపం దృష్ట్వా ఇమాఃస్త్రియః

క్షుద్ధాః సర్వాయతస్తస్మాత్కుష్ఠ రోగ మవాప్నుహి తస్య తద్వచనం శ్రుత్వా సాంబ: కృష్ణస్య భారత!

ఉవాచ ప్రహసన్రాజన్సంస్మరనృషి భాషితమ్ అనిమిత్తమహం తాత! భావ దోష వివర్జితః శప్తో నమేత్రవై క్రుద్దో దూర్వాసా అన్యధా పదేత్

తా॥ బుద్ధిమంతుడైన పురుషుడు మంచివాడుగ నుండగోరెనేని మదిరతోగూడిన కల్లు మొదలగు మత్తు పానీయములను అతి మాత్రముగ సేవింపకూడదు-31. నారదుడు సాంబుని పంపి అతని వెన్నంటియే సత్వర మచటికేతెంచెను-32. దేవర్షియైన నారదుని రాకను చూచి మద విహ్వలురైన స్త్రీలందఱును వెంటనే లేచి నిలబడిరి-33. వారట్లు లేచి నిలబడగానే శ్రీ కృష్ణుడు చూచుచుండగనే వారు ధరించియుండిన శుభ్రములగు వస్త్రములు ఊడిపోయి క్రిందనున్న చెట్ల యాకుల పై పడిపోయెను-34. కృష్ణుడది చూచి మిక్కిలి కోపముతో వారి నందజీని శపించెను. “ఓ కాంతలారా! మీ మనస్సులన్నియు నన్ను విడిచి ఎటకోపోయినవి కావున-35. అంత్యకాలమునందు మీరు భర్తలోకములను పొందకుండెదరుగాక. భర్త లోక పరిభ్రష్టులగుటయేగాక స్వర్గ మార్గమునుండియు భ్రష్టత పొంది-36. శరణ్యములేనివారై దొంగల చేతులలో పడిపోవుదురుగాక" అని శాపమిచ్చెను-37. సుమంతుముని యిట్లనెను. “ఆ శాప దోష కారణమువలన ఆ స్త్రీలందఱు శ్రీ కృష్ణుని నిర్యాణము పిదప, అర్జునుడు నిస్సహాయముగ చూచుచుండగనే పంచనద ప్రాంతీయులైన బందిపోటు దొంగలచే నపహరింపబడిరి. అల్ప న్నిగ్రహులైన కొందఱు స్త్రీలు దూషింపబడిరి-38. రుక్మిణి, సత్యభామ, జాంబవతి ఆ దొంగల చేతబడకుండిరి. వారు తమ సత్వముచే రక్షింపబడిరి- 39. ఆ స్త్రీలను శపించిన పిమ్మట శ్రీ కృష్ణుడు సాంబుని కూడ శపించెను. "సాంబా మిక్కిలి ఆకర్షణీయమగు నీ రూపమును చూచి ఈ స్త్రీ లందు క్షోభపడిరిగావున-40. నీవు కుష్ఠ రోగమును పొందుము”. కృష్ణుని యీ శాప వాక్యమును వీని సాంబుడు-41. నవ్వుచు, దుర్వాసుడు తనకిచ్చిన శాపమును గుర్తు చేసికొని యిట్లనెను. "తండ్రీ! ఈ స్త్రీల యెడ నే విధమైన దుష్ట భావములేని నేను అకారణముగ నీచేనిట్లు శపింపబడితిని. కాని ఈ నీ శాపము నన్నంటదు. ఏలయన నీ శాపమే నన్నంటినచో క్రోధముతో శపించి యుండిన ఆ దుర్వాసుని శాపము వ్యర్థమగును కదా!

మూII సుమంతురువాచ :

అస్మిఞ్చప్తే ఽనిమిత్తే ఽసౌ పిత్రాజాంబవతీ సుతః ప్రాప్తవాన్కుష్ఠ రోగిత్వం విరూపత్వంచ భారత!

సాంబేన పునర ప్యేవ దుర్వాసాః కోపితో మునిః తచ్ఛాపాన్ముసలం జాతం కులం యేనాస్య ఘాతితమ్

శ్రుత్వా హ్యవినయాద్ధోషాస్నాంభేనాప్తాన్ క్షమాధిప! నిత్యం భావ్యం వినీతేన గురుదేవ ద్విజాతిషు

ప్రియంచ వాక్యం వక్తవ్యం సర్వప్రీతి కరం విభో కిం త్వయా న శ్రుతౌ శ్లోకౌ యావుక్తౌ వేధసా పురా శృణ్వతో దేవ దేవస్య వ్యోమకేశస్య భారత్!

యోధర్మశీలో జితమానరోషో విద్యా వినీతో న పరోపతాపీ స్వదారతుష్టః పరదారవర్జితో నతస్యలోకే భయమస్తికించిత్

నతథా శీతల సలిలం నచందన రసో నశీతలా ఛాయా ప్లహ్లాదయతిచ పురుషం యథా మధుర భాషిణీ వాణీ

తతః శాపాభిభూతేన సమ్యగారాధ్య భాస్కరమ్ సాంబేనాప్తం తథారోగ్యం రూపంచపరమం పునః

రూపమాస్య తథాఽఽరోగ్యం భాస్కరాద్ధరి సూనునా నివేశితో రవిర్భక్త్యా స్వనామ్నా క్ష్మాధి పేశ్వర!

ఇతి శ్రీ భవి ష్యే మహా పురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి సప్తమి కల్పే సాంబకృత సూర్యారాధన వర్ణనం నామ త్రిసప్తతితమోఽధ్యాయః

తాII సుమంతుముని యిట్లనెను. “జాంబవతీ కుమారుడైన సాంబుడిట్ల నిమిత్తముగ తండ్రిచే శపింపబడీ కుష్ఠు రోగిత్వమును, కురూపిత్వమును పొందెను-43. సాంబుడు మఱల నొకతూరి దుర్వాసుని శాపమునకు గురియయ్యెను. ఈ శాపమువలన ముసలము పుట్టి కుల నాశనమయ్యెను-44. అవినయ దోషమువలన సాంబునికి కలిగిన దురవస్థలను వినిన మీదట గురువులను, దేవతలను, బ్రాహ్మణులను ఎల్లవేళల పూజ్య భావముతో గౌరవింపవలెనని తెలిసికొనవలెను-45. అందఱకుని ప్రీతి కలుగునట్లు ఎప్పుడును ప్రియ వాక్యమునే మాట్లాడవలెను. ఈ విషయమున పూర్వము బ్రహ్మ దేవునిచే చెప్పబడిన శ్లోకద్వయమును నీవు వినియుండలేదా? బ్రహ్మ దేవుని వలన వినివానినే శంకరుడు కూడ చెప్పియుండెను-46. “ధర్మశీలుడు, స్వాభిమానమును కోపమును జయించినవాడు, విద్యచేత పవిత్రుడు, వినమ్రుడు, ఇతరులను బాధిపంనివాడు, తన భార్యతో మాత్రము తృప్తి పడువాడు, పరస్త్రీలకు దూరముగ నుండువాడునైన సత్పురుషునకు లోకమున కొంచెమైనను భయముండదు-47. “ఒక తీయని మాట మనుష్యుని సంతోషపచినట్లు, . చల్లని నీరుగానీ, చందన ద్రవముగాని, చల్లని నీడగాని సంతోషపటుపజాలవు”-48. శాపతిరస్కృతుడైన సాంబుడు సూర్యదేవుని చక్కగా ఆరాధించి సంపూర్ణారోగ్యమును, పూర్వ రూపమును తిరిగి పొందెను-49. కృష్ణ నందనుడైన సాంబుడు సూర్యునివలన ఆరోగ్యమును, రూపమును పొంది, భక్తితో తన పేరనోక సూర్య మందిరముగల పట్టణమును నిర్మించేను.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమి కల్పమునందు సాంబకృత సూర్యారాధన వర్ణనమను డెబ్బది మూడవ అధ్యాయము సమాప్తము.