61. సప్తమి కల్పమున సూర్యయోగ మహిమ వర్ణనము

 సుమంతురువాచ :

మూ॥ తమేక మక్షరం ధామ పరం సదసతోర్మహత్ భేదా భేదస్వరూపస్థం ప్రణిపత్య రవీంనృప !

ప్రవక్ష్యామి యధాపూర్వం విరించేన మహాత్మనా ఋషీణాం కథితం పూర్వం తంనిబోధ నరాధిప !

 ఆరాధనాయ సవితుర్మహాత్మా పద్మసంభవః యోగం బ్రహ్మపరం ప్రాహ మహర్షీణాం యథా ప్రభుః

సమస్త వృత్తిసంరోధాత్కైవల్య ప్రతిపాదకమ్ తదా జగత్పతిర్భ్రహ్మా ప్రణిపత్య మహర్షిభిః

సర్వైఃకిలోక్తో భగవానాత్మయోనిః ప్రజాహితమ్ యోయంయోగో భగవతా ప్రోక్తో వృత్తి నిరోధజః

ప్రాప్తం శక్యః స త్వనేకైర్జన్మభిర్జగతః పతే! విషయా దుర్జయా నృణా మింద్రియాకర్షిణః ప్రభో!

 వృత్తయశ్చేతసశ్చాపి చంచలస్యాపి దుర్ధరాః రాగాదయం కథం జేతుం శక్యా వర్షశతైరపి

న యోగ యోగ్యం భవతి మన ఏభిరనిర్జితైః అల్పాయుషశ్చపురుషా బ్రహన్కృతయుగేప్యమి

త్రేతాయాం ద్వాపరే చైవ ముప్రాప్తే కలౌ యుగే భగవంస్త్వాముపాసీనాన సన్నో వక్తుమర్హసి

అనాయాసేన యేనైవ ఉత్తరేమ భవార్ణవమ్ దు:ఖాంబు మగ్నా: పురుషాః ప్రాప్య బ్రహ్మన్మహాప్లవమ్

తా॥ సుమంతుముని యిట్లనెను. “అవ్యయుడు, సదసత్తులకతీతుడు, భేదాభేద స్వరూపములలో నుండువాడు, తేజస్వులలో శ్రేష్ఠుడు నయిన సూర్యదేవునకు నమస్కరించి. పూర్వకాలమున మహాత్ముడైన బ్రహ్మదేవుడు ఋషులకు చెప్పిన రీతిగా నేను నీకు చెప్పుచున్నాము. సావధానుడవై వినుము. మహాత్ముడైన బ్రహ్మదేవుడు, సూర్యభగవానుని యారాధన కొఱకు బ్రహ్మపరమైన యోగమును మహరులకుపదేశించెను. ఋషుల నమస్కృతులను స్వీకరించియాతడు, సమస్త చిత్తవృత్తులను నిరోధించుట వలన కలుగు కైవల్యరూపమగు యోగమును వారికి బోధించేను. స్వయంభువగునా బ్రహ్మ వారందజీ ప్రార్థన మేరకు లోకహితకరమైన చిత్తవృత్తిని నిరోధించునీ యోగమును వారికి దేలి పెను. బ్రహ్మన్! ఆ యోగమును అనేక జన్మల సాధన తరువాత మాత్రమే పొందుటకు సాధ్యమగును. ఏలయన మానవుల ఇంద్రియములనాకర్షించు విషయములు జయింపరానివి. రాగద్వేషాది వృత్తులు చంచలమైన మనస్సున అనివార్యములుగ చేరియున్నవి. వందలేండ్లకును వానిని జయించుటకెట్లు సాధ్యమగును?. అందువలన వీనిని జయింపనంతవఱకు, మనస్సు, వృత్తినిరోధ యోగమునకు యోగ్యమైనది కాకుండును. బ్రహ్మదేవా! మానవులీకృతయుగమున నల్పాయుష్కులు. త్రేతాయుగము, ద్వాపరయుగములందు కూడనిట్టి మహత్సాధనల , సాపేక్షముగ నల్పమైన ఆయువుకలవారే యగుదురు. ఇక కలియుగము వచ్చిన పిదపనేమి చెప్పగలము? భగవన్! మీ అండచేరితిమి. ప్రసన్నులై మాకు తెలుపుడు. ఆయాసము లేకుండ ఏయుపాయముచేత నీ సంసార సాగరమును దాటగలము? దుఃఖమనెడు నీటిలో మునిగిపోవుచున్న పురుషులకు ఒక గొప్ప తెప్పవంటి తారకమేది?.

మూ॥ ఉత్తరేమ భవాంభోధిం తథాత్వమను చింతయ ఏవముక్తస్తదా బ్రహ్మా క్రియా యోగం మహాత్మనామ్

తేషా మృషీనా మాచష్ట నరాణాంహితకామ్యయా ఆరాధయత విశ్వేశం దివాకరమతంద్రితాః

బాహ్యాలంబన సాపేక్షాస్తమజం జగతఃపతిమ్ ఇజ్యాపూజా నమస్కార శుశ్రూషాభిరహర్నిశమ్

వ్రతోపవా సైర్వివిధైర్భ్రాహ్మణానాంచ తర్పణైః తైస్తైరభిమతైః కామైర్యేచ చేతసితుష్టిదాః

అపరిచ్ఛేద్య మాహాత్మ్యమారాధయత భాస్కరమ్ తన్నిష్ఠాస్తధతధియస్తత్కర్మాణ స్తదాశ్రయాః

తద్దృష్టయస్తన్మనసః సర్వస్మిన ఇతిస్థితాః సమస్తాన్యధ కర్మాణి తత్రసర్వాత్మనాత్మని

సంన్యసధ్వం స వః కర్తా సమస్తావరణాక్షయమ్ ఏతత్త దక్షరం బ్రహ్మప్రధాన పురుషావుభౌ

యతో యస్మిన్యధా చోభౌ సర్వవ్యాపిన్యవస్థితౌ పరః పరాణాం పరమ: సైకః సుమనసా పరః

యస్మాద్భిన్నమిదం సర్వం యచ్చేదం యచ్చనేంగతి మోక్షకారణ మవ్యక్త మచింత్యమపరిగ్రహమ్  సమారాధ్య జగన్నాథం క్రియాయోగేనముచ్యతే

తా॥ ఈ భవసాగరము నెట్లు దాటగలమో మీరు యోచించి చెప్పుడు” అని ఇట్లు ఋషులడుగగా బ్రహ్మదేవుడు మహాత్ములైన ఆ ఋషులకు, లోకోపకారార్ధమై “శ్రద్ధాళువులై విశ్వేశుడైన దీవాకరుని యారాధింపు"డని క్రియాయోగమును బోధించెను-11,12. బాహ్యములైన వస్తు క్రియాదులయందాధార పడుట పై ఇష్టములు గలవారు (మధ్యమాధికారులు) అజాతుడు, జగత్ర్పభువునైన సూర్యభగవానుని, యజ్ఞము, పూజ, నమస్కారము, సేవ-13. వ్రతములు, ఉపవాసములు, వివిధ పద్ధతులలో బ్రాహ్మణ సంతర్పణలు మున్నగువానిలో వారి వారి యభీష్టములననుసరించి, వారి వారి మానసిక తృప్తిని బట్టి-14. ఏదేని యొక మార్గమున అపరిచ్ఛేద్యమహాత్ముడైన భాస్కరుని, తదేక నిష్ఠతో, తదేక బుద్ధితో, తదేక క్రియాకలాపముతో, తదాశ్రయ భావముతోనారాధింపుడు-15. అతని యందే దృష్టినిలిపి, అతని యందే మనస్సునిలిపి, అంతటనాతడే నిండియున్నాడను భావనతో, సర్వాత్మనా కర్మలనన్నింటిని నాతనిపరముగా నిర్వహింపుడు-16. ఆయనయే మన కర్తయని దృఢవిశ్వాసముననుండుడు. ఈ పృధివ్యాది సప్తావరణాదులతో ప్రళయమునకు గుజియగునశ్వర జగత్తు, అవినాశియగునా బ్రహ్మవస్తువు, ఇరువురును ప్రధాన పురుషులు-17. వీరిరువురును సర్వవ్యాప్తమైన సృష్టియందుండుటచే, ఒక్కడుగనే తెలియబడును. అతడు శ్రేష్టులలో శ్రేష్ఠుడు. పరమాత్మ, పరదైవతము-18. ఈ జగత్తతని కంటే భిన్నమైనది. అయినను ఇదియంతయును నిశ్చలుడైన అతడే యగుచున్నాడు. అతడే మోక్షమునకు కారణము. అతడవ్యక్తుడు. ఊహకందనివాడు. కేవలుడు. అట్టి జగన్నాథుడైన సూర్యభగవానునీ క్రియాయోగముతో నుపాసించువాడు ముక్తుడగును.

 మూ॥ఇతి తే బ్రహ్మణః శ్రుత్వా రహస్యమృషిసత్తమాః

నరాణా ముపకారాయ యోగశాస్త్రాణి చక్రిరే క్రియాయోగ పరాణీహ ముక్తికారీణ్యనేకశః

ఆరాధ్యతే జగన్నాథస్తదనుష్టానతత్పరైః పరమాత్మాసమార్తాండః సర్వేశః సర్వభావనః

యాన్యుక్తాని పురా తేన బ్రహ్మణా కురునందన! తానితే కురుశార్దూల! సర్వపాప హరాణ్యహమ్

 వక్ష్యామి శ్రూయతామద్య రహస్యమిద ముత్తమమ్ సంసారార్ణవ మగ్నానాం విషయాక్రాంత చేతసామ్

 హంసపోతం వినానాన్యత్కించిదస్తి పరాయణమ్ ఉత్తిష్ఠంశ్చింతయ రవీం వ్రజంశ్చింతయ గోపితమ్

 భుంజంశ్చింతయ మార్తాండం స్వపంశ్చింతయ భాస్కరమ్ ఏవ మేకాగ్రచిత్తస్త్వం సంశ్రితః సతతం రవిమ్

 జన్మ మృత్యు మహాగ్రాహం సంసారంభస్తరిష్యసి

గ్రహేశ మీశం వరదం పురాణం జగద్విధాతార మజంచనిత్యమ్  సమాశ్రితా యే రవి మిశితారం తేషాంభవోనాస్తి విముక్తిభాజామ్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యాం సంహితాయాం బ్రాహ్మేపర్వణి సప్తమి కల్పే సూర్యయోగ మహిమ వర్ణనం నోమైక షష్టితమోఽధ్యాయః

తా॥ ఆ ఋషి సత్తములు బ్రహ్మదేవునిచే చెప్పబడిన ఈ రహస్యమును విని-20. మానవులకుపకరించు నిమిత్తము యోగశాస్త్రములను రచించిరి. అవి యనేకములైన క్రియాయోగ పరములై ముక్తి కారకములుగ నుండెను-21. ఆయా యోగములనుష్ఠించువారు పరమాత్ముడు, జగన్నాథుడు, దేవేశుడునైన సూర్యభగవానుని పూజింతురు-22. పూర్వము బ్రహ్మదేవునిచే చెప్పబడిన పాపనాశకములగు నట్టి ఆయోగములను నేను నీకు-23. చెప్పెదను. ఈ ఉత్తమమైన రహస్యమును వినుము. సంసారసాగరమున మునిగి, విషయములచేనాక్రమింపబడిన మనస్సులు గలవారికి-24. దానిని తరించుటకు సూర్యుడనేడు ఓడ తప్ప ఆశ్రయింపదగినది మఱియొకటిలేదు. లేచుచు, నడచుచు-25. భుజించుచు, పరుండుచు, ఎల్లవేళలనా సూర్యభగవానునే స్మరించుచుండుము. ఏకాగ్రచిత్తుడవై యిట్లు నిరంతరము సూర్యదేవునే చింతన చేయుచుండిన యెడల-26. జనన మరణ పౌనఃపున్యరూపమగు మొసళ్ళచే నిండిన సముద్రమును దాటగలవు-27. గ్రహములకు ప్రభువు జగదీశ్వరుడు, వరములిచ్చువాడు, సనాతనుడు, సృష్టికర్త, పుట్టుకలేనివాడు, అయిన మార్తాండునాశ్రయించి, అతనినే ఈశ్వరుడుగ నెంచి నిత్యము ఉపాసించుచుండువారు మోక్షమునకు పాత్రులగుదురు. వారికి సంసార దుఃఖములుండవు.

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సూర్యయోగ మహిమ వర్ణనమను అరువది యొకటవ అధ్యాయము సమాప్తము.