60. సప్తమి కల్పమున సూర్యపరిచర్యా వర్ణనము

సుమంతురువాచ :

మూ. ఇత్యుక్త్వా సజగామాశు సురజ్యేష్ఠం త్రిలోచనమ్ రథయాత్రా మహాబాహో! సూర్య స్యేత్యమి తౌజసః”

శతానీక ఉవాచ :

యమారాధ్య జగన్నాథం మమ పూర్వపితామహాః తుష్ట్యర్ధం బ్రాహ్మణానాంతు అన్నమాపుశ్చతుర్విధమ్

తస్యదేవస్య మాహాత్మ్యం శ్రుతం చ బహుశోమయా దేవర్షి సిద్ధమనుజైః స్తుతస్యహి దినేదినే

 కఃస్తోతు మీశస్తమజం య స్యైతత్సచరాచరమ్ అవ్యయస్యాప్రమేయస్య విబుధ్యేతోదయాజ్జగత్

 కరాభ్యాం యస్యదేవేశౌ కవిష్ణూ లోక పూజితౌ ఉత్పన్నౌ ద్విజశార్దూల! లలాటాత్రిపురాంతకః

 తస్యదేవస్య కై: శక్యావక్తుం సర్వావిభూతయః సోఽహ మిచ్ఛామి దేవస్య తస్యసర్వాత్మనా ద్విజ

శ్రోతు మారాధనం యేన నిస్తరేయం భవార్ణవమ్ కేనోపాయేన మంత్రైర్వా రహస్యైః పరిచర్యయా

 దానైర్వ్రతోపవా సైర్వా హోమైర్జాప్యై రథాపివా ఆరాధితః సమస్తానాం క్లేశానాం హానిదోభవేత్

 సైకా విద్యా హి విద్యానాం యయా తుష్యతి సర్వకృత్ శ్రుతానామపి తత్పుణ్యం యత్రభానోః ప్రకీర్తనమ్

రహస్యానాం రహస్యం త ద్యేన హంసః ప్రసీదతి ఏకః శ్రేష్ఠతమో మంత్రస్తదేకం పరమమ్ వ్రతమ్

తా॥ సుమంతముని యిట్లు పలికెను.“అమిత తేజస్వియగు సూర్యభగవానుని రథయాత్రను గుంచి సురజ్యేష్టుడైన శంకరునకు వివరించి బ్రహ్మదేవుడు వెడలిపోయెను”. శతానీకుడిట్లనెను. “మునివర్యా! ఏ జగన్నాథుడైన సూర్యభగవానునారాధించి మా తాతలు బ్రాహ్మణుల తృప్తి పఱచుటకొఱకు దివ్యమగు చతుర్విధాహారములనొసగు అక్షయపాత్రను పొందిరో. అట్టి యాదేవదేవుని మాహాత్మ్యమును నేను దేవరుల ద్వారా, సిద్ది పురుషుల ద్వారా అనేక విధములుగ, ప్రతిదినము వారు స్తుతింపుచుండగా వినియుంటినీ. అవ్యయుడు అప్రమేయుడు, తన ఉదయముతో, జగత్తును మేలుకొల్పువాడు. సకల చరాచర జగత్తుకు కర్తయయిన ఆ అభవుని మహిమను కొనియాడుట యెవరి తరము?. ఆతని రెండు చేతుల నుండి లోకపూజితులు, దేవేశులగు బ్రహ్మవిష్ణువులు, నొసటినుండి ఫాలలోచనుడును పుట్టిరి. అతని విభూతులను వర్ణింప నేవరికి శక్యమగును? భవసాగరమును దాటింపగల యాతని పూజా విధానము, ఏ ఉపాయముతో, ఏ రహస్యమంత్రములతో, ఏ విధమైన సేవలతో ఆ దేవుని కొలువవలెనో తెలిసికొనవలయునని నేను సర్వాత్మనా కోరుచున్నాను. ఎట్టి దానములచేత, ఎట్టి మొక్కులచేత, ఎట్టి ఉపవాసములచేత, ఎట్టి హోమములచేత, ఎట్టి జపములచేత ఆరాధింపబడి ఆతడు సమస్త దుఃఖములను నశింపజేయగలడు?. విద్యలలో కెల్ల యాతనిని సంతృప్తి పలుపగల విద్యయేది? సూర్య దేవ సంబంధముగ ఏ విషయము వినుటచేత వినువారికి కూడ పుణ్యఫలము చెప్పబడినది?. రహస్యములలోనికెల్లను రహస్యమైన ఏ మంత్రముచే నాతడు ప్రసన్నుడగును? శ్రేష్ఠతమమైనది, పరమమైనదియునైన ఒకే ఒక సూర్య మంత్రము లేక సూర్య సంబంధమగు వ్రతము ఎయ్యదీ.

మూ॥ ఉపోషితం చ తచ్చ్రేష్ఠం యేన భానుః ప్రసీదతి సాచైకా రసనా ధన్యా మార్తాండం స్తౌతి యా సదా

తదేకం నిర్మలం చిత్తం యద్గతం సతతం రవౌ శ్లాఘ్యనామాపి తౌ శ్లాఘ్యావిహలోకే పరత్రచ

యౌసదా ద్విజ శార్దూల! భానోఃపూజా కరౌకరౌ తదేకం కేవలం ధన్యం శరీరం సర్వజంతుడు 

యదేవ పులకోద్భాసి భానోర్నామాను కీర్తనే యా జిహ్వా కంఠతాలూక మధవా ప్రతిజిహ్వికా

అథవా సాపరో రోగో యా న వక్తి రవేర్గుణమ్ నవద్వారాణి సంతస్మిన్పురే పురుషసత్తమ!

 ప్రాకారైస్త్వావృతే విష్వగ్వృథా తాని విదుర్బుధాః దత్త్వా వధానం యచ్ఛబ్ధే వినైవ రవి సంస్తుతిమ్

శ్రేయసాం నహి సంప్రాప్తౌ పురుషాణాంవిచేష్టితమ్ జన్మన్యవిఫలా సేవాకృతా యాశ్రిత్యభాస్కరమ్

 దుర్గ సంసార కాంతార మపార మభి ధావతామ్ ఏకో భాను నమస్కారః సంసారార్ణవ తారకః

రత్నానా మాకరో మేరుః సర్వాశ్చర్యమయం నభః తీర్థానా మాశ్రయా గంగా దేవానా మాశ్రయే రవిః

ఏవ మాదిగుణో భోగో భానో రమిత తేజసః శ్రుతోమే బహుశః సిద్ధైర్గీయమానైస్తథా మరైః

సోఽహ మిచ్ఛామి తందేవం సప్తలోకపరాయణమ్ దివాకరమశేషస్య జగతో హృద్యవస్థితమ్

ఆరాధయితు మీశేశం భాస్కరంచామితౌజసమ్ మార్తాండం భువనాధారం స్మృతమాత్రాఘదారిణమ్ 

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మేపర్వణి

సప్తమీ కల్పే సూర్యపరిచర్యో వర్ణనంసామ షష్టితమోఽధ్యాయః

            తా॥ ఉపవసించుట శ్రేష్ఠమైనది, దానిచేత భానుదేవుడు ప్రసన్నుడగును. మార్తాండుని స్తుతించునాలుకయే ధన్యమైనది. రవి పై నిలిపియుంచిన చిత్తమే నిర్మలమైనది. భానుదేవుని నిత్యమును పూజించు చేతులే చేతులు. అవియే మెచ్చదగిన వానిలో మెచ్చదగినవి. సూర్యదేవుని నామమును కీర్తించుటచే పులకరించిపోవు శరీరమే ధన్యమైనది. అతని నామమును కీర్తించునాలుకయే కంఠతాలుకమైన నాలుక. లేకున్న కొండనాలుకయేయగును. లేక సూర్యుని గుణములను ప్రస్తుతింపనిచో అది యొక చెడ్డవ్యాధి యగును. ఈ శరీరమను పురమునకు తొమ్మిది ద్వారములు కలవు. అవి ప్రహరి గోడలచే నంతటనో వరింపబడి యుండినచో వ్యర్థములగునని పండితులయభిప్రాయము. సూర్యదేవుని స్తోత్ర సంబంధమగు శబ్దమునకు గాక ఇతర శబ్దముల యెడ శ్రద్ధవహించుటయే ద్వారములు మూతబడుటయగును. జన్మప్రాప్తించినప్పుడు మానవుల చేష్టయంతయు శ్రేయస్సంపాదనమునకే గదా! సూర్యభగవానునాశ్రయించి చేయబడిన సేవ ఎన్నటికిని విఫలము కాదు, చొరరానిది, అంతులే నిదియునైన ఈ సంసారమనెడి అరణ్యమున పరుగులెత్తు వానికి, సంసార సముద్రమును దాటించునది సూర్యనమస్కారమొక్కటియే. మేరు పర్వతము రత్నములకు నిలయము. ఆకాశమాశ్చర్యముల కొకరము. గంగానది తీర్థములన్నింటికిని ఆశ్రయము. సూర్యభగవానుడు సకల దేవతలకు స్థానము. అమిత తేజుడైన సూర్యుని యీ గుణవైభవములు, సిద్దులు దేవతలు కీర్తింపుచుండగా నేనెన్నియోవిధములుగ వినియుంటిని. సప్తలోక-పరాయణుడు, జగత్తు, హృదయమున నుండువాడు. దినకరుడునైన ఆ దేవుని గూర్చి సాకల్యముగ వినఁగోరితిని. దేవదేవుడు, భాస్కరుడు, అమిత తేజోవంతుడు, మార్తాండుడు, లోకములకాధారభూతుడు, స్మరించిన మాత్రమున పాపములను హరించువాడునైన ఆతనిని పూజించునిచ్ఛతో నాతని గూర్చి విస్తృతముగ వినదలచితిని.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమికల్పమున సూర్యపరిచర్యా వర్ణనమను అణువదియవ అధ్యాయము సమాప్తము.