47. సప్తమీ కల్పమున శాకసప్తమి వ్రత వర్ణనము

మూ. సుమంతురువాచ :

సప్తమ్యాం సోపవాసస్తు నక్తాహారోZపివా భవేత్ సప్తమ్యాం దేవదేవేన లబ్దం స్వం రూపమాదరాత్

 అండేన సహ జాతోవై అండస్టో వృద్ధిమాప్తవాన్ అండస్థస్యైవ దక్షేణ భార్యాం దత్వాస్వకాం సుతామ్

నామ్నారూపేతి రూపేణ నాన్యానారీ తధా భవేత్ అండస్థ ఏవ సుచిరం స్థితో మార్తాండ ఇత్యతః

దక్షాజ్ఞయా విశ్వకర్మా వపురస్య ప్రకాశయన్ ప్రకాశతస్తతో నామ తస్య జాతం నరాధిప ।

అండస్థ స్యైవసంజాతో యమునాయమ ఏవచ

దాక్షాయణీ తస్యభార్యా వైరాగ్యాత్తను మధ్యమా చింతయా మాససాదేవి దుఃఖాన్నిర్వేదమాగతా

అహో తేజోమయం రూపం కాంతం కాంతస్య కాంతిమత్ నచాస్య కించితశ్యామి అంగంతేజో విమోహితమ్

 శుభం కనకతుల్యంమే రూపం కాంతం సుకాంతిమత్ సాంప్రతం శ్యామతాం యాతం దద్ధమేతస్యతేజసా

తస్మాత్తప్స్యే  తపశ్చాహం గత్వావై ఉత్తరాన్కురూన్ స్వాంఛాయా మత్ర నిక్షిప్య భయాచ్ఛాపస్య రూపిణీ

నిక్షిపోవాచ తాంబాలాం మా చాస్మైవైవదిష్యసి ఏవం సా నిశ్చయం కృత్వా గతావై ఉత్తరాన్కురూన్

స్వరూపం తత్ర నిక్షిప్య వడవా రూపధారిణీ చచార సా మృగైః సార్థం బహూన్వర్ష గణాన్నృప!

తా॥ సుమంతుముని యిట్లనెను. “సప్తమినాడు ఉపవసించినవాడు, లేక రాత్రి భోజనము మాత్రము చేయువాడు-సప్తమి తిధియందు సూర్యభగవానుడు పొందిన తేజో రూపమును పొందగలదడు. సూర్యదేవుడు అండముతోడనే పుట్టి అండముతోడనే పెరిగెను. అండమునందుండీయే దక్షుని పుత్రికను వివాహమాడెను. 'రూప' అను పేరు గల ఆదక్షకన్య రూపము చేత, పేరు చేత కూడ విలక్షణమైయుండెను. దీర్ఘకాలము అండమునందుండుటచే సూర్యుడు మార్తాండుడని పేరువడసెను. దక్షుని యాజ్ఞచేత విశ్వకర్మయితని శరీరమును ప్రకాశవంతమొనర్చెను. ఆ ప్రకాశము వలన నతనికి భాస్కరాది నామములేర్పడెను. అండమునందే స్థితుడైయున్న యీతనికి యమున, యముడు అను నిద్రకు జన్మించిరి. అతని భార్యయగు రూపాదేవి దుః ఖము చేతను, వైరాగ్యముచేతను నిర్వేదమును పొందియిట్లు చింతించెను. ఆహో! నా భర్తయగు సూర్యభగవానుని రూపమెంత తేజోమయమైనది! ఎంత కాంతివంతమైనది!! విరజిమ్ము వెలుగుల మధ్య అతని శరీరమెంత మాత్రమును నేను చూడజాలకున్నాను. బంగారు వన్నెతో సుందముగ ప్రకాశించెడునా రూపమితని మిక్కుటమగు తేజస్సుచేత దగ్ధమైపోయి యిప్పుడు నలుపువారినది. కావున నుత్తర కురుదేశములకుఁబోయి తపమాచరింతును." ఇట్లాలోచించి శాపభయమున తనకు మారుగ తన ఛాయనచటనే యుండనియమించి, ఆమెతో నీ రహస్యమును తనభర్తకు తెలుపకుండునట్లు కట్టడిచేసి తాను ఉత్తర కురుదేశములకు వెడలిపోయెను. తన 'నిజ'రూపమునటనుంచి ఆడుగుఱ్ఱము రూపమును ధరించి, అనేక సంవత్సరములుగానచ్చట నితర మృగములతో బాటు సంచరింపసాగెను.

మూ. అసావపిచ మార్తాండశ్ఛాయాం భార్యామమన్యత శనించ తపతీంచైవ ద్వే అపత్యేచ జజ్ఞవాన్

అధచ్ఛాయాత్మాపత్యాని స్నే హేన పరిపాలయేత్ నాతి స్నేహేన చాపత్యద్యమునాం యమమేవ చ

 అధ తాభ్యాం వినాదోZ భూదాదిత్య దుహిత్రోర్ద్వయోః తే ఉబే వివదంత్యౌతు పరస్పర మ సంమతమ్

యమునా తపతీ చోభే  నిమ్నగే సంబభూవతుః

యమోపి యమునాభ్రాతా ఛాయయాతిడితో భృశమ్ పాదముద్యమ్య తస్యావై  తస్ధా సమ్ముఖ ఏవసః

 ఛాయాశశాప తంరోషా ద్యస్మాత్పాదోద్యతో మమ తస్మాత్తే కర్మ భీభత్సం ప్రాణినాం ప్రాణ హింసనమ్

భవిష్యతి చిరం మూడ! ఆచంద్రార్కం న సంశయః పాదంచ యదిభూమౌత్వమిమం సంస్థాపయిష్యసి

కృమ యోభక్షయిష్యంతి మచ్ఛాప కలుషీకృతమ్

 తేషాం వివదమానానాం మార్తాండోZ భాగమత్తత: యమోZ ప్యాహ మహాత్మానం మార్తాండం లోకపావనమ్

 తాత! నిత్యమియం చాపి క్రూర భావేన పశ్యతి న చాస్యాః సుసమాదృష్టి రస్మాస్వస్తితి లక్ష్యతే

ప్రోవాచాధ సతాంఛాయాం మార్తాండో భృశకోపనః సమే అపత్యేకిం మూడే! సమత్వం నాను పశ్యసి?

 తా॥ సూర్యదేవుడు కూడ ఛాయాదేవిని భార్యగానే భావించెను. ఆమెయందతడు శని, తపతి అను నిరువుర సంతానమును బడ సేను. ఇంక ఛాయ తన సంతానమైన శనినీ తపతిని ప్రేమతో చూచుచు తన సవతి సంతానమైన యమ యములనంత ప్రేమతో చూడకుండేను. సూర్యపుత్రికలైన తపతీ యమునల మధ్య వివాదమేర్పడెను. ఆ వివాదమున నొకరినొకరు శపించుకొని నదులైపోయిది. ఒకనాడు యమున సోదరుడగు యమునిని ఛాయాదేవి కొట్టెను. దానితో యముడు కుపితుడై ఛాయను తన్నుటకై పాదమేత్తేను. దాని పై ఛాయ రోషముతో నాతనినిట్లు శపించెను. “మూర్ఖుడా! నన్నుకొట్టుటకు కాలెత్తితివి గావున జీవుల ప్రాణములను హింస పెట్టెడు భీభత్సమైన వృత్తి. నీ కాచంద్రార్కము కలుగును కాక! నా శపమువలన కలుషీకృతమైన నీ పాదమును భూమి పై మోపితివేని దానిని కీటకములు తినివేయును”. ఇట్లు వీరు కలహించుచున్న సమయమున నచటికి సూర్యుడు వచ్చెను. లోకపావనుడైన సూర్యునితో యముడిట్లనెను. “తండ్రీ! ఈమె మమ్మెప్పుడును క్రూరభావముతో చూచును. ఈమెకు మా యందు తన బిడ్డలతో సమానముగ చూచు దృష్టి లేనట్లు కన్పించుచున్నది.” ఆమాటవిని సూర్యుడు మిక్కిలి కోపించి ఛాయాదేవితో నిట్లనెను. “ఇద్దఱును సమానులేకదా! మూఢాత్మురాలా! వీరినందఱను  సమానమున నెందుకు చూడవు”?.

మూ. యమః ప్రోవాచ పితరం నేయం మాతా పితర్మమ మాతుశ్చాయా త్వియం పాపా శప్తోహ

మనయాపితః, యమునా తపతీ వృత్తం తత్సనర్వం విన్యవేదయత్

అధ ప్రోవాచ మార్తాండో మాతే  పాదో మహీతలే మాంసం రుధిర మాదాయ కృమయో యాంతు భూతలమ్

యమునా యాశ్చ యత్తోయం గంగా తుల్యం భవిష్యతి నర్మదాయాస్త పత్యాశ్చ సమం పుణ్యేన వైద్విజ ।

 వింధ్యస్య దక్షిణే నేహ తపతీ ప్రవహిష్యతి తత్సాయుజ్యతయా సార్థం గంగా యాస్యత శోభనా

గంగా మాసాద్య యమునా గంగాసైవ భవిష్యతి సౌర సౌమ్యే ఉభే పుణ్యే సర్వపాప ప్రణాశనే

సౌరీ చవైష్ణవా చోభే మహాపాప భయాపహే త్వంపుత్ర! లోకపాలత్వం బ్రహ్మణోZ జ్ఞాం సభాజయన్

అద్యప్రభృతి చ్ఛాయేయం స్వదేహస్థా భవిష్యతి

 ఏవం సంస్థాప్య స్వాం భార్యామపత్యాని తదైవచ ఆజగామ సకాశంవై దక్షస్యాహచ కారణమ్

దక్షో విజ్ఞాయ తత్సర్వం మార్తాండ మిదమాహవై

రూపం న పశ్యతీ తుభ్యం సాభార్యా ఉత్తరాంగతా

రూపం తే ప్రకటిష్యామి యది శక్ష్యసి వేదనామ్ అసౌ ప్రోవాచ శక్ష్యేZహం ప్రకాశీకురు మే వపుః

 అథసస్మార తక్షణం స్మృత ఏవాజగామసః ప్రోవాచ దక్షస్తక్షణం మార్తాండంవై  ప్రకాశయ

తా॥ యముడు తన తండ్రియగు సూర్యునితో నీట్లు చెప్పెను. “తండ్రీ! ఈమే మా తల్లికాదు. పాపాత్మురాలగునీమె మా తల్లియొక్క ఛాయ మాత్రమే. ఈమె నన్ను శపించినది.” ఈ విషయముతోబాటు యమునా తపతుల వృత్తాంతము-తక్కిన వివరములన్నింటిని తండ్రికి నివేదించెను. అదివిని సూర్యుడిట్లనెను. నీ కాలు క్రింద, నేల మీద మోపకుము. “కృమి సమూహము మాంసము రక్తమును గొని భూలోకమును చేరును. యమునా నదీ జలము గంగా జలముతో సమానము కాగలదు. నర్మదా తపతీ నదుల జలములు సమాన పుణ్యప్రదములగును. వింధ్య పర్వతమునకు దక్షిణముగ తపతి ప్రవహింపగలదు. దాని కలయికతో గంగ శుభమును సంతరించుకొనును. గంగను చేరి యమున కూడ గంగయే యగును. సూర్యసంబంధ జలములు గలవియగుటచే యమునా తపతీ నదులు రెండును సర్వపాపములను హరించునవియు, పుణ్యప్రదములును అగును. గంగా యమునలు రెండును మహాపాపములను, భయమును తొలగింపగలుగును. నీవు బ్రహ్మాజ్ఞచే లోకపాల పదవిని పొందెదవు. నేటినుండి ఈ ఛాయ తన దేహముననే యుండగలదు తన భార్యను, సంతానమును అట్లు నియమించి సూర్యుడు ప్రకాశ రూపుడై దక్షుని వద్దకేతెంచి దీనికంతటికీని కారణమేద్దీయో వివరించేను. దక్షుడా విషయములన్నియు తెలిసికొని సూర్య దేవునితో నిట్లనెను. “నీ రూపమును చూడజాలక నీ భార్యయగు రూప ఉత్తరదేశములకుఁ బోయెను. నీవు కొంత భాద నోర్చుకొనగలిగినచో నీ రూపమును ప్రకటమగునట్లు చేసెదను.” ఆ మాటవిని సూర్యుడు “బాధనోర్చుకొందును. నా శరీరము గోచరమగునట్లు చేయుడు” అని అర్ధించెను. అప్పుడు దక్షుడు విశ్వకర్మను స్మరించెను. స్మరించినంతనే విశ్వకర్మ యేతెంచెను. “విశ్మకర్మా! ఈ తేజోరూపుడగు సూర్యుని ప్రకటమగునట్లు చేయుమ”ని యాదేశించెను.

 మూ. తక్షా ప్రోవాచ మార్తాండం 'వేదనాంవిసహిష్యసే? 'విసహి ష్యేధ ప్రోవాచ తక్షణం దక్షచోదితః

అధ తక్షా ప్రకాశం పై తస్య రూపం విభావసోః ముఖాదారభ్య పాదాంతం తతక్ష కరణై స్వకైః

కిరణెస్తుద్యమానేషు తస్యాంగేషు పునః పునః క్షణే క్షణే మూర్ఛయతి మార్తాండో వేదనాతురః

తస్య శాపభయాత్తక్షా పాదౌ గుల్ఫాది యావతః చకారాధో నిరాకారా అంగుల్యోన ప్రకాశయత్

పర్యాప్తం తక్ష కర్మేదం వేదనా మమ బాధతే తక్షా ప్రోవాచ మార్తాండం వేదనాం జహి గోపతే

కర వీరస్య పుష్పాణి రక్తచందన మేవచ కరాదారభ్య గాత్రాణి విలింపే దేహజానితే - తత్తత్కృతం తధా తేన సరుజం త్యక్తహస్రవిః అతశ్చేమాని చేష్టాని మార్తాండ స్యేహ భూపతే

 కరవీరస్య పుష్పాణి రక్తచందన మేవహి ఇదమాహ పురాదేవో హ్యనూరోరగ్రతో నృప!

కరవీరస్య పుష్పాణి రక్తచందన మేవహి ఇతిహాస పురాణాభ్యాం సుపర్ణం గుగ్గులం తధా

యః ప్రయచ్ఛతి మే భక్త్యా సమేప్రాణాంప్ర యచ్ఛతి తస్మాన్నదేయ మన్యన్మే భక్తియుక్తేన జానతా

 మార్తాండస్యాండజం తేజో గృహీత్వా కిల భారత! చకార వజ్ర మజరం శత్రులేఖాది నాశనమ్

తా॥ దేవశిల్పి బాధను సహింతువా! యని మార్తాండునడిగెను. దక్షుని ప్రేరణ వలన ‘సహింతు' నని యాతడు విశ్వకర్మతో చేప్పెను. ఇకన శిల్పి సూర్యుని రూపమును ప్రకటము చేయుటకై తన పనిముట్లతో ముఖము మొదలుకొని పాదముల వఱకు చెక్కుచుండెను. సూర్యుని శరీరమునందు పౌనఃపున్యముగా ఉలి మున్నగునుపకరణములు చెక్కుచు నొప్పి కలిగించు చుండుట చేత నా బాధను తట్టుకొన జాలక నాతడు మాటి మాటికి మూర్ఛిల్లుచుండెను. సూర్యుని శాప భయము వలన శిల్పి, చీలమండలనుండి పాదముల వ్రేళ్ళ వఱకును చెక్కడము చేయక నిరాకారముగ వానిని మిగిల్చెను. “ఈ తక్షకర్మ (చెక్కివేయుపని) పర్యాప్తముగ నన్ను భాదించుచున్నది” అని సూర్యుడనగానే “ఓ సూర్యదేవా! ఇక బాధను వదలుము. గన్నేరుపూలు, ఎఱ్ఱచందనము నీ చేతులు మొదలుకొని అన్ని అంగములకు పూయుదును.” అతడట్లు చికిత్స చేయగానే సూర్యునికి నొప్పి తొలగిపోయెను. అందువలన సూర్యునకిట్టి యుపచారము లిష్టమైనవి . గన్నేరు పూవులు, రక్తచందనము తనకిష్టమైనవిగా సూర్యభగవానుడు పూర్వము చెప్పియుండెను. ఈ కరవీరములు, రక్తచందనము మరియు ఇతిహాసపురాణముల నుండి తెలిసికొనబడిన తామర, గుగ్గులు. నాకు భక్తితో సమర్పించువాడు నాకు ప్రాణదానము చేసిన వాడగును. కాబట్టి నాకితరము లేవియునీయనక్కరలేదు. విజ్ఞుడు నాకు ప్రియమైన వానినే సభక్తికముగ సమర్పింపవలెను.”  మార్తాండుని యండమునుండి యేర్పడిన తేజస్సును గ్రహించి దానితో విశ్వకర్మ శత్రునిర్భేదన సమర్ధమగునది, అజరమైనదియునైన వజ్రాయుధమును చేసెనట.

మూ. మార్తాండః పరితుష్టాZ భూల్లబ్థ్వా రూపం గతవ్యధః జగామ స కురూన్వేగా త్స్వభార్యా దర్శనోత్సుకః

మృగమధ్య గతాందృష్ట్వా వడవా రూపధారిణీమ్ అశ్వరూపం తతః కృత్వా స్వభార్యామధిరుహ్యసః

 అవాసృజత్స్వకం తేజో వేగేనారుహ్య సో శ్వవత్

 పరపురుషా శంకయా సా స్థితా దేవస్య సంముఖీ తేజో నాసాపుటాభ్యాంతు యుగపత్సాక్షిపత్పునః

తపతీ శనిశ్చ సావర్ణి శ్ఛాయాపత్యాని వైవిదుః యమునా యమశ్చపూర్వోక్తౌ సంజ్ఞాయాశ్చతధాత్మజా

 భార్యాలబా వపుర్దివ్యం తధాపుత్రాశ్చ భారత! సప్తమ్యాం దేవ దేవస్య సర్వమేవమిదం యతః

అనేక కారణే నష్టా సదాదేవస్య సప్తమి

సప్తమ్యాం సోపవాసస్తు రాత్రౌభుంజీతయో నరః కృత్వోపవాసం షష్ఠ్యాంతు పంచమ్యామేకకాలభుక్

 దత్వాసు సంస్కృతం శాకం భక్ష్యభోజ్యైః సమన్వితమ్ దేవాయ బ్రాహ్మణేభ్యశ్చ రాత్రౌ భుంజీత వాగ్యతః

 యావజ్జీవం నరః కశ్చిద్ర్వతమే తచ్చరేదితి తస్యశ్రీ క్విజయశ్చైవ త్రివర్గశ్చాపి వర్ధతే

మృతశ్చ స్వర్గమాయాతి విమాన వరమాస్థితః సూర్యలోకే స రమతే మన్వంతర గణాన్బహూన్

ఇహచాగత్య కాలాంతే నృపః శాంతి సమన్వితః

తా॥ సూర్యభగవానుడిట్లు ‘స్వరూపమును పొంది వెతలుదీరి సంతుష్టుడయ్యెను. అతడు తన భార్యను చూచుటకుత్సహించి సత్వరమే కురు దేశములకుఁబోయెను. అచట నాడు గుఱ్ఱము రూపము ధరించి మృగముల మధ్య తిరుగుచున్న తన భార్యను చూచి తానుకూడ అశ్వరూపమును ధరించి యామెతో సంభోగీంచెను. గుఱ్ఱము రూపమున నుండియే మిక్కిలి వేగముతో తన ‘తేజమును” ఆమెలో వదలెను. పరపురుషుడేమోయను శంకతో ఆమె యాతని కెదురుగ నిలిచి తన నాసాపుటములనుండి ఆ వీర్యమును బయటకు వెడలగ్రక్కెను. ఆసూర్య వీర్యము నుండియే దేవవైద్యులైన అశ్వినీ కుమారులు నా సత్యులను పేర జన్మించిరి. రేతస్సు చివరి భాగము నుండీ మహితుడగు రేవంతుడు పుట్టెను. తపతి, శని, సావర్ణి, ఛాయా దేవి సంతానము యమున, యముడు (పూర్వము చెప్పబడినవారు సంజ్ఞా సంతానము. భార్యను, పుత్రులను బడసి, దివ్యమైన శరీరమును పొంది సూర్యభగవానుడు సంతుష్టుడైన దినము సప్తమి. ఆకారణమున ఆ తిధీ సూర్యదేవునకు ప్రియమైనది. అట్టి సప్తమినాడు దీనమంతయునుపవసించి, రాత్రి భోజనము చేసి-అంతకుముందు దినమగు షష్టినాడును ఉపవాసము చేసి, దానికి ముందటి దినమగు పంచమినాడు “ఏకభుక్తము చేసియుండి. సూర్యునకు ప్రియమైన సప్తమినాడు వాజ్నియమము గలవాడై సుసంస్కృతము లైన శాక పాకములతో, భక్ష్యభోజ్యములతోను సూర్యునకు నైవేద్యమును సమర్పించి, బ్రాహ్మణులకును భోజనము పెట్టి, రాత్రి సమయమున తాను భుజింపవలేను. అత్తెఱంగున జీవించినంత కాలమీవ్రతము నాచరించు వాడు ధనమును, విజయమును, త్రివర్గమును సమృద్దిగబడయును. మరణించిన పిదప దివ్యవిమానారూఢుడై స్వర్గమునకు బోవును. కొన్ని మన్వంతరముల పర్యంతము సూర్యలోకమున సుఖించును. కాలాంతరమున తిరిగి యీ లోకమునకు వచ్చి శాంతి యుక్తుడగు రాజగును.

మూ. పుత్ర పౌత్రైః పరివృతో దాతాస్యాన్నృపతిశ్చిరమ్ భునక్తి హి ధరాం రాజన్విగ్రహైశ్చాజితః పరైః

 యేనరా రాజశార్దూల! శాకాహారేణ సప్తమిమ్ ఉపోష్య లబ్ధం తత్తీర్థం పిత్ర్యంవై రాజ సంజ్ఞికమ్

కరుణా తవ పూర్వేణ శాకాహారేణ సప్తమీమ్ ధర్మక్షేత్రం కురుక్షేత్రం కృతం తస్య వివస్వతా

సప్తమి నవమి షష్ఠీ తృతీయా పంచమీ నృప! కామదాస్తిథయో హ్యేతా ఇహైవ నరయోషితామ్

సప్తమీ మాఘమాసేతు నవమ్యాశ్వయుజే మతా షష్ఠీ భాద్రపదే ధన్యా వైశాఖేతు తృతీయికా

పుణ్యా భాద్రపదే ప్రోక్తా పంచమీ నాగపంచమీ ఇత్యేతాస్తేషు మా సేషు విశేషాస్తిథయః స్మృతాః

శాకం సుసంస్కృతం కృత్వా యశ్చభక్ష్యాసమన్వితః దత్వా విప్రో యథా శక్త్యా పశ్చాద్భుంక్తే నిశివ్రతీ

కార్తికే శుక్ల పక్షస్య గ్రాహ్యేయం కురునందన! చతుర్భిర్వాపి మాసైస్తు పారణం ప్రథమం స్మృతమ్

అగస్త్య కుసుమైశ్చాత్ర పూజా కార్యావిభావసోః విలేపనం కుంకుమంతు ధూపశ్చై వాప రాజితైః

స్నానం చ పంచగవ్యేన తమేవ ప్రాశయేత్తతః నైవేద్యం పాయసంచాత్ర దేవదేవస్య కీర్తితమ్

తా.అట్టిరాజు కొడుకులతో, మనుమలతో పరివృతుడై, దానశీలుడై, యుద్ధములందు శత్రువుచే నోడింపబడక, చిరకాలము రాజ్యభోగములనుభవించును. సప్తమినాడు శాకాహారముచే నుపవసించువారు పైతృకముగ సంక్రమించు రాజపదవినలంకరింతురు. నీకు పూర్వుడగు కురురాజు సప్తమితిథులలో శాకాహారియై యుపవసించుటచేనతని 'కురుక్షేత్రము' సూర్యునిచే ధర్మక్షేత్రముగ చేయబడినది. మానవ స్త్రీలకు సప్తమి, నవమి, షష్టి, తృతీయ, పంచమి అనునవి ఇహముననే కోరికలను దీర్చు తిథులు. మాఘమాసమున సప్తమి, అశ్వయజమున నవమి, భాద్రపదమాసమున షష్టి, వైశాఖమునందు తృతీయ పుణ్యప్రదములు. భాద్రపదమున వచ్చు పంచమి నాగపంచమి కూడ పుణ్యప్రదమైనది. ఇట్లు ఆయామాసములయందలి ఆయాతిథులు విశేషమైనవిగా చెప్పబడినవి. వ్రతాచరణము చేయువాడు శాకాదులను చక్కగా శోధించి భక్తియుక్తుడై బ్రాహ్మణునకు యధాశక్తిగ సమర్పించి, తరువాత రాత్రి సమయమున తాను భుజింపవలెను, కార్తీక శుక్లపక్ష సప్తమినుండి యీ వ్రతమును స్వీకరింపవలెను. ఇట్లు నాలుగు మాసములు వ్రతమాచరించి ఉపవాసానంతర భోజనము చేయవలెను. ఈ సప్తమి వ్రత సందర్భమున అగిసెపూలతో సూర్యునికి పూజచేయవలెను. కుంకుమ విలేపనము, అపరాజిత ధూపములతోను పూజింపవలెను. పంచగవ్యముతో స్నానముచేసి, దానినే ప్రాశనము చేయవలెను. సూర్యభగవానున కిష్టమైన దగుటచే పాయసమునాదేవదేవునకు నైవేద్యము పెట్టవలెను.

మూ॥ తదేవ దేయం విప్రాణాం శాకం భక్ష్య మథాత్మనా శుభశాక సమాయుక్తం భక్ష్య పేయ సమన్వితమ్

ద్వితీయే పారణే రాజన్! శుభగంధాని యానివై పుష్పాణి తాని దేవస్య తథాశ్వేతంచ చందనమ్

అగురుశ్చాపి ధూపోZ త్ర నైవేద్యం గుడ పూపకాః స్నానం కుశోదకే నాత్ర ప్రాశనం గోమయస్యతు

తృతీయే కరవీరాణి తథా రక్తంచ చందనమ్ ధూపానాం గుగ్గులశ్చాత్ర ప్రియోదేవస్య సర్వదా

శాల్యోదనం తు నైవేద్యం దధిమిశ్రం మహామతే! తమేవ బ్రాహ్మణానాంచ భక్ష్యలేహ్యసమన్వితమ్

 కాలశాకేనచ విభో! యుక్తం యద్యద్విచక్షణః

 గౌర సర్షప కల్కేర స్నానం చాత్ర విదుర్బుధాః తస్యైవ ప్రాశనం ధన్యం సర్వపాపహరం శుభమ్

తృతీయే పారణస్యాంతే మహద్రాహ్మణ భోజనమ్ శ్రవణంచ పురాణస్య వాచనం చాపి శాస్యతే

దేవస్య పురతస్తాత! బ్రాహ్మణానాం తధాగ్రతః బ్రాహ్మణాద్వాచకాచ్చ్రవ్యం నాన్యవర్ణ సముద్భవాత్

అధతాంబ్రాహ్మణాన్సర్వా న్భక్త్యా శక్త్యా చ పూజయేత్

వాచకస్యామలే రాజన్వాససీ సంనివేదయేత్ వాచకే పూజితే దేవః సదా తుష్యతి భాస్కరః

కరవీరం యథేష్టంతు తధా రక్తంచ చందనమ్ యథేష్టం గుగ్గులం తస్య యథేష్టం పాయసం సదా

యథేష్టా మోదకాస్తస్య యదావై తామ్ర భాజనమ్ యథేష్టంచ ఘృతం తస్య యథేష్టో వాచకః సదా

 పురాణంచ యథేష్టంపై సవితుః కురునందన ।

 ఇత్యేషా సప్తమి పుణ్యా శాకాహ్వా గోపతేః సదా యాముపోష్య నరో భక్త్యా భాగ్యవాంశ్చప్రజాయతే

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్య సంహితాయాం బ్రా హ్మేపర్వణి

సప్తమి కల్పేశాక సప్తమి వ్రత వర్ణనం నామ సప్త చత్వారింశోZధ్యాయః

            తా॥ సూర్యభగవానునకు నివేదించిన పాయసమును, శాక భక్ష్యాదులను భక్తితో బ్రాహ్మణుల కీయవలెను. శాకములు, భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములు, పానీయములు ఈయవలేను. రెండవ పారణమునందు సూర్యదేవునకు పరిమళ భరితములైన పుష్పములు, తెల్లచందనము సమర్పింపవలెను. అగరు ధూపము వేసి బెల్లపు భక్ష్యములు నైవేద్యము పెట్టవలెను. ఆ సందర్భమున కుశోదక స్నానము, గోమయ ప్రాశనము చేయవలెను. మూడవ పారణమున గన్నేరుపూలు ఎఱచందనము, గుగ్గులు ధూపము సూర్యదేవునకు ప్రియమైనవి. పెరుగు కలిపిన శాల్యన్నము నైవేద్యము పెట్టి దానితోబాటు కరివేపతో పాకము చేసిన భక్ష్యలేహ్యాదులతో కూడిన భోజనమును బ్రాహ్మణులకు నివేదింపవలెను. తెల్లని ఆవాల మడ్డితో స్నానము చేసి దానినే ప్రాశనము చేయుట పాపవినాశకరము. పుణ్యప్రదము. మూడవ పారణము తరువాత బ్రాహ్మణ సంతర్పణ చేయవలెను. ఆసందర్భమున పురాణ ప్రవచనము, శ్రవణము ప్రశస్తమైనది. సూర్య భగవానుని సన్నిధానమున, బ్రాహ్మణ మహాజన సమక్షమున, బ్రాహ్మణుడే పురాణ ప్రవచనము చేయగా వినవలెను. ఇతర వర్ణమువాని ముఖతః వినకూడదు. అటుమీదట నచటి బ్రాహ్మణుల నందఱిని భక్తితో, శక్తిననుసరించి పూజింపవలెను. పౌరాణికుని పవిత్రశరీరమునకు వస్త్రయుగ్మముతో సమ్మానము చేయవలెను. పురాణవాచకుని పూజించుట వలన సూర్యభగవానుడు సంతోషించును. గన్నేరు పూలు, ఎఱ్ఱచందనము, గుగ్గులు, పాయసము. లడ్డువములు, తామ్రపాత్ర, నేయి ఆదేవదేవునకు ప్రీతి పాత్రములయినట్లుగా, పురాణము, వక్త, కూడ ఆయనకు ఇష్టమైన విషయములు. ఇట్లు సూర్యదేవునకు సంబంధించిన శాకసప్తమి అని పేరుగల సప్తమి తిథి పుణ్యప్రదమైనది. ఆదినమున భక్తితోనుపవసించువాడు భాగ్యవంతుడగును.

శతార్ధ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమి కల్పమునందు శాక సప్తమివ్రత వర్ణనమను పేరుగల నలుబదియేడవ అధ్యాయము సమాప్తము.