41. షష్టీ కల్పమున బ్రాహ్మణ వివేక వర్ణనము

మూ. బ్రహ్మోవాచ : -

వేదాధ్యయన మ ప్యేతద్భ్రాహ్మణ్యం ప్రతిపద్యతే విప్రవద్వైశ్య రాజన్యౌరాక్షసా రావణాదయః

శ్వాద చాండాల దాసాశ్చ లుబ్దకాభీర ధీవరాః యేన్యేఽపి వృషలాః కేచిత్తేపి వేదానధీయతే

శూద్రా దేశాంతరంగత్వా బ్రాహ్మణ్యం క్షత్రియంశ్రితాః వ్యాపారాకార భాషాద్యైర్విప్ర తుల్యైః ప్రకల్పితైః

వేదానధీత్య వేదౌవా వేదంవాపి యథాక్రమమ్ ప్రోద్వహంతి శుభాంకన్యాం శుద్ధబ్రాహ్మణ జాంనరా:

అథవాధీత్య వేదాంస్తు క్షత్రవైశ్యైస్తువా నరాః గౌడ పూర్వాం కృతామేయుర్జాతిం వా దాక్షిణాత్యజామ్

 అపరిజ్ఞాత శూద్రత్వాద్భ్రాహ్మణ్యం యాంతి కామతః తస్మాన్న జ్ఞాయతే భేదో వేదాధ్యాయ క్రియా కృతః

శాస్త్రకారైస్తథా చోక్తం న్యాయ మార్గానుసారిభిః తే సాధుమత మాకర్ణ్య సంతః సంతి విమత్సరాః

ఆచారాహీనా న్నపునంతి వేదా యద్యప్యధీతాః సహషడ్భిరంగైః

శిల్పంహి వేదాధ్యయనం ద్విజానాం వృత్తం స్మృతం బ్రాహ్మణ లక్షణంతు

 ఆధీత్య చతురో వేదాన్యది వృత్తే న తిష్ఠతి న తేన క్రియతే కార్యం స్త్రీరత్నేనేవ షండకః

శిఖాప్రణవ సంస్కార సంధ్యోపాసన మేఖలాః దండాజిన పవిత్రాద్యాః శూద్రేష్వపి నిరంకుశాః-

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “వేదాధ్యయనము కూడ. ఈ బ్రాహ్మణ్యమును కలిగించును. బ్రాహ్మణుని వలె వైశ్యులు, క్షత్రియులు, రావణాది రాక్షసులు. శ్వాదులు, మాలలు, దాస్యముచేయువారు, బోయలు, గొల్లలు, జాలరులు ఇంకను ఇతర శూద్రజాతివారు వేదములధ్యయనము చేయుదురు. కొందఱు శూద్రులు దేశాంతరములకుఁబోయి, బ్రాహ్మణ, క్షత్రియుల నాశ్రయించి వ్యవహారమున, ఆకారమున, భాషాది విషయములందును బ్రాహ్మణ సదృశులుగా చేయబడి. వేదములు చదివి, లేక రెండు వేదములో, ఒక్కవేదమో యధాక్రమముగ నేర్చుకొని శుద్ధబ్రాహ్మణ కన్యను, శుభలక్షణములు గలదానిని వివాహమాడుదురు. లేక వేదములభ్యసించి, క్షత్రియ, వైశ్యజాతులతో సమానత్వమునుబొంది గౌడదేశమునకు తూర్పుననున్న దేశమునకో లేక దక్షిణ దేశమునకో చెందిన జాతిగా నేర్పడెదరు. వారి శూద్రత్వమజ్ఞాతమగులచే తమకిష్టమైన బ్రాహ్మణ జాతిని పొందుదురు. అందువలన వారి వేద విభాగముగాని, చేయుక్రియనుగాని, అనుసరించిచేయబడిన విభేదము, తెలియబడకుండును. న్యాయమార్గము ననుసరించు శాస్త్రకారులు కూడ నటులే చేప్పియుండిరి. వారు యథార్ధ విషయమును గ్రహించి మత్సరములేని సత్పురుషులుగా నుండిపోయిరి. వేదములను సాంగమున నధ్యయనము చేసినను అవి ఆచారహీనులను పవిత్రులఁజేయఁజాలవు. వేదాధ్యయనము చేయుట బ్రాహ్మణులకృత్యము. వృత్తి సద్వృత్తము కలిగియుండుటయే బ్రాహ్మణలక్షణము. నాలుగు వేదములనభ్యసించి యుండినను సద్వృత్తమున లేని బ్రాహ్మణుని చేత ఏ కార్యము(ను) చేయబడదు. అతడే కర్మచేసినను, స్త్రీ రత్నము నపుంసకుని ప్రేరేచినట్లు నిష్పలమగును. శిఖ, ఓంకారము, సంస్కారము, సంధ్యోపాసనము, మేఖల(మొలత్రాడు) దండము, జింక చర్మము, పవిత్రమొదలగునవి శూద్రులయందు కూడా నిష్టానుసారముగ నుండ వచ్చును.

మూ. ప్రసంగోపిహి శూద్రాణాం నశక్యోవినివారితుమ్ దేవోత్తమ త్రయేణాపి నివర్తంతే నరాః స్వయమ్

తస్మాన్నైతేఽ పి లక్ష్యంతే విలక్షణతయానృణామ్ యజ్ఞోపవీత సంస్కార మేఖలా చూలికాదయః

 ఆభిచారిక మంత్రాద్యైర్దుర్లభత్వాది భాషణైః బ్రాహ్మణ స్యైవ శక్తిశ్చ తేనాస్య విని హన్యతే

తపస్సత్యాది మాహాత్మ్యాద్దేవతా సమయస్మృతిః మంత్రశక్తిర్నృణామేషాం సర్వేషామపీ విద్యతే

వంచనం దుర్వచస్యాపి క్రియతే సర్వమానవైః శూద్రబ్రాహ్మణ యోస్తస్మాన్నాస్తి భేదః కథంచన

శాపానుగ్రహకారిత్వం శక్తిభేదో న విద్యతే చౌర చాటాది రాజన్య దుర్జనాభిహతే నృణామ్

 ఆత్మదుఃఖోదయా పాయం స్వేషుజంతుషు రక్షణమ్ కర్తుంన ప్రభవేచ్ఛూద్రో బ్రాహ్మణస్తద్వదేవహి

మాభూద్యుగే కలావేతద్దేశే చాకార్యకృద్విజే స్యాదన్య దేశకాలాదౌ ద్విజానామతిశాయినామ్

శాపానుగ్రహ సామర్థ్య మన్యద్వాధ్యాత్మగోచరమ్ బ్రహ్మసాధనమేతద్ధి లింగం కేచిత్ర్పచక్షతే

సంసారారక్త చేతస్కా మోహాంధ తమసావృతాః పతంత్యున్మార్గ గర్తేషు ప్రత్యగ్ని శలభాయథా

తా॥ శూద్రుల ప్రసంగమును నివారించుటకు త్రిమూర్తులకు కూడా శక్యము కాదు. ఇక మానవులైనచో దానిని నివారింపలేరు సరికదా తామే స్వయముగ తప్పుకొందురు. కాబట్టి మానవులలో యజ్ఞోపవీత సంస్కారములు, మేఖలలు, పీలకజుట్లు ప్రత్యేక దృష్టితో చూడబడవు. చేతబడి మంత్రములు మొదలగు వానిలోను, దుర్లభములని చెప్పబడు కార్యములలోను బ్రాహ్మణునకు మాత్రమే శక్తి యుండినచో అతనికి సంబంధించిన వారిని ఎవరు చంపగలుగుదురు?. తపస్సు, సత్యము మొదలగువాని మహాత్మ్యము వలన దేవతా సంబంధమగు జ్ఞానమును చింతన చేయు శక్తి కలుగును. ఇక మంత్ర శక్తి యనినచో నది యందఱకును అందుబాటులోనుండును. మోసముచేయుట, దుర్భాషలాడుట వంటివి సర్వమానవ సాధారణములే కావున బ్రాహ్మణ శూద్రులలో నెట్టి భేదములేదు. శాపమిచ్చుట, అనుగ్రహించుట, మున్నగువానిలో నెట్టి శక్తిభేదములేదు. దొంగలు, బందిపోట్లు, రాజులు, దుర్మార్గులు మొదలగు వారిచే దోచుకొనబడుటయందున మానవులలో నే భేదములేదు. తనకు దుఃఖము కలిగినపుడు దానిని తొలగించుకొనుట, స్వజనులను రక్షించుట అనునట్టివానికి శూద్రుడు కారణభూతుడు కాడు. (అట్టి పరిస్థితులు రాకుండా చూచుకొనును). బ్రాహ్మణుడు కూడా అట్టివాడే కదా!. అగ్గలించిన బ్రాహ్మణులలో నెవడేని యొకడీ కలియుగమున, ఈ దేశమున చేయరాని పనులు చేయకున్నను, వేటొక కాలమున వేడొక దేశమున నా విధముగనకార్యకరణమున తగుల్కొనవచ్చును. శాపానుగ్రహసామర్థ్యముల వంటివి పరమాత్మకుఁదెలియును. కొందఱు ఇట్టి శక్తిని బ్రహ్మత్వ సాధన చిహ్నముగ పేర్కొందురు. సంసారము పై వ్యామోహముగల మనస్సుగలవారు, మోహమనెడీ చీకటిలో ఆవరింపబడినవారు, అగ్నిలో మిడుతలవలె ఊర్థ్వ మార్గములందలి గోతులలో పడిపోవుదురు.

మూ. జాతిధర్మః స్వయం కించిద్విశేషః శ్రుతి సంగమాత్ అసిద్ధః శూద్ర జాతీనాం ప్రసిదో విప్ర జాతిషు

సంస్కారో యోని స్యావా సామగ్రీ ప్రభవోఽధవా శూద్రేభ్యోఽతి తిశయం ధత్తే యః సాధారణతాగుణః

విప్రాణాం పంచధా భేదః కల్పనీయస్తు పండితైః

న జాతి జస్త్రయీజోవా విశేషో యుక్తి బాధకాత్ క్రమక్రమ క్రియాః సంతి న సనాతన వస్తునః

 నిత్యోన హేతుర్విగత క్రియత్వాధేతుర్భవేద్వేద విశేషతః సః

సతత్సమస్తత్ర్పత్రి సన్నిధానా తాలాత్యయేక్షిత్వమయుక్త మేవ

 స్వాంతః శరీర వృత్తిష్ఠః శ్రుతియోగాదుదేతియః సోనన్యవేద విజ్ఞాతస్వభావోన్యైర్నగమ్యతే

విశిష్టాధీతి ధర్మత్వే కృత్రిమ బ్రహ్మ సంగతిః యస్యాస్త్యతి శయస్తస్య నాన్యో నా శ్రయతే యది

 దృశ్య స్వభావం కిమ భీష్టమేత బ్రాహ్మణ్యమాహాస్విదదృష్టరూపమ్

సర్వైః ప్రతీయేత హీ దృశ్యరూపం తతోన్యధావద్గతి రేవన స్యాత్

సామగ్ర్యభావాత్పరమం విశేషం భూదేవ గాత్రస్థమభూమి దేవాః

 స్మరంతి తే నాత్మని పుణ్యపాపం యధాతధేత్యే తదయుక్తముక్తమ్

సామగ్ర్యనుష్టాన గుణైః సమగ్రా శూద్రాయతః సంతిసమాద్విజానామ్

 తస్మాద్విశేషో ద్విజశూద్ర నామ్నోర్నాధ్యాత్మికో బాహ్యనిమిత్తకోవా

సంస్కారతః సోతిశయో యది స్యాత్సర్వస్య పుంసోస్త్యతి సంస్కృతస్య

యః సంస్కృతో విప్రగణ ప్రధానో వ్యాసాదికై స్తేన నతస్యసామ్యమ్

తా॥ వేద సంసర్గము వలన బ్రాహ్మణుల జాతియందు "జాతిధర్మము' ఇంచుక ప్రత్యేకమైనది, ఇది బ్రాహ్మణ జాతియందు ప్రసిద్ధము. శూద్రజాతి కిట్టిదిలేదు. సంస్కారమనునది పుట్టువుచేత, లేక సమగ్రత (లేక ఉపకరణముల) చేత కలుగుచున్నది. శూద్రుల కొఱకు మాత్రము సాధారణత్వగుణము మాత్రమే ఎక్కువగా పోషకమైయున్నది. బ్రాహ్మణులలో పండితులచేత కల్సింపదగిన భేదమైదు విధములుగ నున్నది. కాని జాతి వలన కలిగినది గాని, వేదమువలన కలిగినదిగాని ఏ విశేషమునులేవు. ఉన్నదని చెప్పుటకు హేతువేమియు లేదు గావున లేదని చెప్పుటజరిగినది. సపోతన వస్తువునకు క్రమక్రమ క్రియలు లేవు. ఎప్పుడును క్రియ చేయకుండువాడు కర్మభ్రష్టతకు కారణముకాడు కాని వేదవిహితమైన కర్మలాచరింపవలసిన వాడయియును నాచరింపమివలన వేద సాపేక్షముగ నతడు కర్మహీనతకు కారణమగుచున్నాడు. సామీప్యము వలన వీడు వానితో సమానమైన వాడగుచున్నాడు. కాలాతిక్రమణమైన పిదప దేనికొఱకై ననుచూచుట యుక్తముకాదు. మనోవృత్తిలో నుండువాడు వేద యోగముతోగూడ నెదిగినచోనతడద్వితీయమైన జ్ఞానముకలవాడగును. ఇతరులెవ్వరును అతనిని తెలిసికొనజాలరు. విశేషమగు రీతిలోనధ్యయనము చేయగల సహజ స్వభావమునకు తోడుగా నసహజమగు వేదసంసర్గము కూడా లభించుటచే నతిశయమునొందు వానిని, ఎవ్వడును ఆశ్రయింపకుండనుండడనినచోనది సమంజసమేయగును. అందజీచే కోరబడు బ్రాహ్మణ్యము దృశ్య స్వభావముకలదాయేమి? అయ్యయో! అది 'అదృష్ట' రూపముగదా! కనబడు రూపమందతిచేనెఱుంగబడును. అట్లుకాని దానికి మార్గమేముండును. ఏదియునుండదు. సమగ్రతా భావము వలన బ్రాహ్మణుని శరీరమునందొక పరమమైన విశేషముండును. దానిచేతనతని యాత్మయందలి దేవతలు, ఏది పుణ్యమో దానిని, ఏది పాపమోదానిని, ఏది సరియైనది కాదో దానిని ఏది శాస్త్రమున చెప్పబడినదో దానిని స్మరించుచుందురు. అశేషానుష్టాన గుణముల చేత శూద్రులుకూడ సమగ్రులై బ్రాహ్మణులతో సమానులుగానుందురు. కాబట్టి ఆధ్యాత్మికముగ గాని, బాహ్యనిమిత్తకముగ గానీ ‘బ్రాహ్మణ-శూద్ర' అనెడి విశేషమేమియు నుండదు . మిక్కిలి సంస్కారముగల పురుషులందజిలోనను సంస్కారము చేత అతిశయించినవాడు, బ్రాహ్మణ వర్గమున గొప్ప సంస్కారము గలిగిన ముఖ్యుడును ఉండవచ్చును. కాని అతనికి వ్యాసాదులతో మాత్రము సామ్యము ఘటింపదు.

మూ. హేతుత్వం ఘటతే నైషాం జాత్యాదీనామసంభవాత్ జాతేరకృత కత్వాచ్చ అధీతే న విశేషతః

సంస్కారాతిశయ భావా దంతరస్యాగతే పరైః భౌతికత్వాచ్ఛరీరస్య సమస్తానామసంహతైః కించాన్య నాస్తిక మ్లేచ్ఛ యవనాది జనేష్వలమ్

 వేదోదిత బహిర్దృష్ట చరితేషు దురాత్మసు ధర్మాదతిశయో దృష్టః క్రూర సాహసికాదిషు తస్మాన్నచ విభేదోస్తి న బహీరాంతరాత్మని నసుఖాదౌ న చైశ్వర్యే నాజ్ఞాయాం నాభయేష్వపి

న వీర్యే నాకృతౌ నాక్షే న వ్యాపారే న చాయుషి నాంగే పృష్టే న దౌర్బల్యే న స్థిరేనాపి చాపలే

న ప్రజ్ఞాయాం న వైరాగ్యే న ధర్మే న పరాక్రమే నత్రివర్గె న నైపుణ్యే న రూపాదౌ న భేషజే

నస్త్రీ గర్భే న గమనే న దేహమల సంప్లవే నాస్థిరంధ్రే నచ ప్రేమ్ణి న ప్రమాణే న లోమసు

శూద్ర బ్రాహ్మణ యో ర్భేదో మృగ్యమాణోఽపి యత్నతః నేక్ష్యతే సర్వధర్మేషు సంహతై స్త్రీదశైరపి

ఉక్త మాత్రా విసంభూతి ర్వి చారక్రమకారిభిః వృద్ధ వృందార కాధీశై రప్రధృష్యమిదం వచః

తా॥ పుట్టుక యనునది స్వాభావికమైనదయినందున, అధ్యయనమునకు ప్రత్యేకతయేమియులేనందువలన జాతులలో భేద కారణత్వము సంభవింపదు. సమస్తమైన జనులలో, దూరదూరములయందుండెడి పరులచేత, శరీరసంబంధమైన పాంచ భౌతికత్వమునుండియు, మనస్సుయొక్క అవుష్టసంస్కారమునుండియు కొనిరాబడిన జీవుని యందు 'జాతి'యేది?. ఇక నితర నాస్తిక, మ్లేచ్చ, యవనాదీ జనములయందును. వేదశాస్త్ర సరణిని బహిష్కరించిన దురాత్ములయందును, క్రూరమైన సాహసకృత్యములు చేయువారియందును ధర్మము వలన నతిశయించిన వాడు కన్పట్టుటయేమి? అందువలన అతడు బ్రాహ్మణ జాతియందలి సామగ్ర్యము వలన జన్మించిన వాడు కాడుగదా!. అకారణమున అంతరాత్మయందుగాని, బాహిరముగ గాని విభేదమేమియును లేదు. సుఖాదులయందుగాని, ఐశ్వర్యమునందుగాని, ఆజ్ఞయందుగానీ, అభయములయందుగాని వీర్యమునగాని, ఆకృతియందుగాని, కన్నులయందుగాని, వ్యాపారమునందుగాని ఆయుష్యమునగాని, అంగమునందుగానీ, బలుపునగాని, బలహీనతలోగాని, స్థైర్యమునగాని, చపలత్వమునగాని. ప్రజ్ఞయందుగాని, వైరాగ్యమున గాని, ధర్మమునగాని పరాక్రమమునగాని, త్రివర్గమున గాని, నైపుణ్యమునగానీ, రూపాదులలోగాని, ఔషధములందుగానీ. స్త్రీ గర్భమునగాని, గమనము'నందుగానీ, దేహముల విసర్జనమునగానీ నవ రంధ్రములలో గానీ, ప్రేమయందుగాని, ప్రమాణమునందుగాని, రోమములయందుగాని. శూద్ర బ్రాహ్మణులమధ్య భేదము మృగ్యమే యగుచున్నది. అన్ని ధర్మములయందును సమానత్వమే తప్ప భేదమును దేవతలు కూడా చూడజాలరు. పుట్టుక యనునది ఇంతవఱకు చెప్పబడినంత మాత్రమైనదే. ఈ విషయమును శాస్త్రకారులు గాని మేధావులుగాని తిరస్కరింపజాలరు.

మూ. నబ్రాహ్మణాశ్చంద్ర మరీచిశుభ్రా నక్షత్రియాః కింశుక పుష్పవర్ణాః న చేహ వైశ్యా హరితాల తుల్యాః శూద్రాన చాంగారసమానవర్ణా:

పాదప్రచారైస్తనువర్ణ కేశైః సుఖేన దుఃఖేన చ శోణితేన త్వఙ్మాంస మేదోస్థిర సైః సమానాశ్చతుష్ర్పభేదా హి కథంభవంతి?

 వర్ణప్రమాణాకృతి గర్భవాస వాగ్బుద్ధి కర్మేంద్రియ జీవితేషు బలత్రివర్గామయ భేషజేషు న విద్యతే జాతికృతో విశేష :

  స ఏక ఏవాత్ర పతిః ప్రజానాం కథం పునర్జాతికృతః ప్రభేదః ప్రమాణ దృష్టాంత నయ ప్రవాదైః పరీక్ష్య మాణో విఘటత్వమేతి

 చత్వార ఏకస్యపితుః సుతాశ్చ తేషాంపుతానాం ఖలుజాతిరేకా ఏవం ప్రజానాం హి పితైక ఏవ పిత్రైక భావాన్నచ జాతి భేదః

ఫలాన్యధోదుంబర వృక్ష జాతేర్యధాగ్ర మధ్యాంత భవాని యాని వర్ణాకృతి స్పర్శరసైః సమాని తథైకతో జాతిరతి ప్రచిoత్యా

యేకౌశికః కాశ్యపగౌతమాశ్చ కౌండిన్యమాండవ్య వశిష్ఠగోత్రాః ఆత్రేయ కాత్సాంగిరసః సగర్గా మౌద్గల్య కాత్యాయన భార్గవాశ్చ గోత్రాణి నానా విధజాతయశ్చ భ్రాతృస్నుషామైథున పుత్రభావాః వైవాహికం కర్మన వర్ణ భేదాః సర్వాణి శిల్పాని భవంతి తేషామ్

 యేచాన్యే పండితాః ప్రాహుర్దేహ బ్రాహ్మణతాం నరాః తేషాం దుర్దృష్టితిమిరమ పనీయాను కంప్యచ

న్యాయాంజనౌషధైర్ద్రవ్యైః పరిణామ సుఖావహై : ఉపనీతైః ప్రయత్నేన సుదృష్టం సంవిదద్మహే

తా॥ బ్రాహ్మణులు చంద్రకిరణములవలె శుభ్రమైనవారు కారు. క్షత్రియులు మోదుగపువ్వు వన్నెగలవారుకారు. వైశ్యులు హరిదళము వంటి వర్ణము గలవారు కారు. శూద్రులు బొగ్గువలె నల్లని వారునుకారు. అడుగులు వేసినడుచుట యందుగాని, శరీర వర్ణములయందుగాని, వెంట్రుకలయందుగాని సుఖదుఃఖములయందుగాని, రక్తమునందుగాని, చర్మము, మాంసము మెడ, ఎముకలు, ద్రవములందుగాని మానవులందుకు సమానులే. నిజమునకీ నాలుగు వర్ణములతో చెప్పబడు భేదము కలవారెట్లగుదురు?. వర్ణము, ప్రమాణములు, రూపములు, గర్భమున నుండుట, అటనుండి జన్మించుట, వాక్కు, బుద్ధి, కర్మేంద్రియములు, జీవితములు, బలములు, ధర్మార్థకామములు, రోగములు, ఔషధములు, -వీనియందు జాతివలన నేర్పడు భేద విశేషమేమియులేదు. ప్రజలకందఱికినీ పరమాత్మయే ప్రభువు కదా! జాతి భేదములేట్లేర్పడెను? ప్రమాణములు, దృష్టాంతములు, న్యాయచర్చలు మున్నగువాని మూలమున పరిశీలించినచో నీ భేదము ఛిన్నాభిన్నమై పోవును. ఒక తండ్రికి నలుగురు కొడుకులు, ఆ నలుగురు కొడుకుల జాతి యొకటియే. అటులే ప్రజలందఱకును తండ్రి పరమాత్మ యొక్కడే, తండ్రి యొక్కడగుచేత జాతిబేధములేదు. మేడి, రావి మున్నగు చెట్ల జాతులకు కొన్ని పండ్లు పై భాగమున, కొన్ని క్రిందుభాగమున నున్నను వర్ణము, రూపము, రసములచే అవియన్నియు అన్ని విషయములలో సమానముగనే ఉండునుగదా! అటులే మానవ జాతి కూడ ఒక్కటీయనియే భావింపవలెను. కౌశిక, కాశ్యప, గౌతమ, కాండిన్య, మాండవ్య, వసిష్ఠ, ఆత్రేయ, కౌత్స, ఆంగీరస, గర్గ, మౌద్గల్య, కాత్యాయన, భార్గవ సగోత్రీకులనెడు వివిధ గోత్రజాతులవారు. తోబుట్టువుల యొక్క, లేక కొడుకులు కోడండ్ర జంటల యొక్కయు సంతాన పరంపరలోని వారే. వారిలో వివాహకర్మ, వర్ణభేదములన్నియు కృత్రిమములే. కేవలము దేహసంబంధమైన బ్రాహ్మణత్వమును గుఱించి చెప్పువారికి గల గ్రుడ్డితనపు చీకటిని తొలగించుటకై వారి పై జాలి తలచి. శాస్త్రీయ దృక్పథమనెడి దివ్యౌషధములచే చేయబడిన అంజనమును పరిణామమున సుఖమును కలిగించుదానిని ప్రయోగించి వారికి మంచి చూపునిచ్చుచున్నాము.

మూ. మూర్తిమత్వాచ్చనాశిత్వం నాశిత్వాచ్ఛేష భూత్వత్ దేహాధార నివిష్టానాం బ్రాహ్మణ్యం నప్రకల్ప్యతే

ఏకైకోవయవ స్తేషాం న బ్రాహ్మణ్యం సమశ్నుతే న చానేక సమూ హేపి సర్వథాతి ప్రసంగతః

 పృథివ్యుదక వాయ్వగ్ని పరిణామా విశేషతః దేహతః సర్వభూతానాం బ్రాహ్మణత్వ ప్రసంగతః

 దేహస్య బ్రాహ్మణత్వం రతత్వజ్ఞైః ప్రకల్వ్యతే సంస్కరణాం శరీరస్య తేషాంన బ్రహ్మతా భవేత్

మృగ్యమానో ప్రయత్నేన దేహే తన్నోపలభ్యతే తస్మాన్నదే హే బ్రాహ్మణ్యం నాపిదేహత్మకం భవేత్

 వర్ణాప సద చాండాల శ్వాదాదీనాం ప్రసజ్యతే యది దేహస్య విప్రత్వం భవద్భిరుప గమ్యతే  

దేహశక్తి గుణైః క్షీణేః కాయ భస్మాదిరూపవత్ తస్మాద్దేహాత్మకేనైతద్రోహణ్యం నాపీ కాయజమ్ .

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యం సంహితాయాం బ్రా హ్మేపర్వణి షష్టీకల్పే బ్రాహ్మణ్య వివేక వర్ణనంనామైక చత్వారింశోఽధ్యాయః

తా॥ భౌతికాకృతి నశించు స్వభావము గలది యగుటవలనను, అట్లు నశింపగా మిగులునది శేషభూతము' వంటిదే కావునను, దేహమును ధరించి అందు నివసించు జీవులకు బ్రాహ్మణ్యమనునది కల్పింపబడదు. వారి ఒక్కొక్క అవయవము బ్రాహ్మణ్యమును పొందదు. వాని సమూహము కూడా అట్లు పొందజాలదు. పొందుననుట “అతిప్రసంగ'మగును. భూమీ, జలము, వాయువు, అగ్ని అను భూత సంఘాత పరిణామ విశేషము వలననే, సర్వప్రాణులకును కలుగు దేహత్వము వలన, బ్రాహ్మణత్వము కూడా ప్రాణులందరిని వర్తింపవలసి యుండును. కావున దేహమునకు బ్రాహ్మణత్వకల్పనము చేయుట తత్త్వము తెలియని వారి పనియగును. ఆ సంస్కర్తల శరీరమునకు కూడా బ్రహ్మత్వముండదు. ప్రయత్నపూర్వకముగ శరీరమునందు వెదకినను అదిలభింపదు. అందువలన అది దేహాత్మకమును కాదు అని చెప్పనగును. ఒక వేళ మీరు శరీరమునందు 'బ్రాహ్మణత్వము'ను చూడగలిగితిరేని అది అధమ కులములని చెప్పబడినవారిలోను, చండాలురలోను, ఆటవికులలోను పుట్టును. క్షీణించెడి దేహశక్తి గుణముల చేతను, శరీరమే భస్మాది రూపములుగా మారిపోవునదగుటచేతను బ్రాహ్మణ్యము దేహాత్మకమైనది కాదు. దేహమునందు పుట్టునదియును కాదు.

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య పురాణము నందలి బ్రహ్మపర్వమున షష్టీకల్పమునందలి బ్రాహ్మణ వివేక వర్ణనమను నలుబది యొకటవ అధ్యాయము సమాప్తము.