42. షష్ఠీ కల్పవలన బ్రాహ్మణ్య సంస్కార వివేక వర్ణనము

మూ. బ్రహ్మోవాచ : -

అపరైశ్చ సదాచార యోగయుక్తైర్మనీషిభిః యదకారి మహాసత్వై: సుభాషిత మిదంశృణు

బహు వనస్పతి శంఖ పిపీలికా భ్రమర వారణ జాతి ముదాహరన్ గతిషు కర్మమితో నటవత్సదా భ్రమతి జంతురలబ్ద సుదర్శనః

రూపైశ్వర్య జ్ఞాన కులైర్విభవైర్వరితో భూత్వాధర్మపథం చేద్విజహాసి నవక్ష్యే ప్రజన్భువనాని త్వమటి ష్యంస్త స్మాదభి భస్మీభూతే మద ఆత్మనః

జాతి కుల రూప వయో వర్ణానేక శ్రుత మదాంధః క్లీబాః పరత్రచేహచ హితమవ్యర్థం న పశ్యంతి

 జ్ఞాత్వా భవ పరివర్తే జాతీనాం కోటిశత సహస్రేషు హీనోత్తమ మధ్యత్వం కో జాతిమదం బుధః కుర్యాత్

 నైకాన్ జ్ఞాతి విశేషానింద్రియ నివృత్తి పూర్వకాన్సర్వాన్ కర్మవశాద్గచ్ఛత్యత్ర కన్యైకా శాశ్వతీ జాతి:

విద్వత్సదసి యోప్యాహ సంస్కారాద్భ్రాహ్మణా భవన్ న్యాయజ్ఞః సనిరాకార్యో వాక్యైర్యాయాను సారిభిః

గర్భాధానం పుంసవనం సీమంతోన్నయనం తధా జాత కర్మనామ కర్మ తథాన్న ప్రాశనంచవై

చూడోపనయనం చాస్య వ్రతాదేశస్తథైవ చ సమావర్తన మప్యన్యత్పాణి గ్రహణమేవచ

ఇత్యేవది సంస్కార విధానైర్యేతి సంస్కృతాః త ఏవ బ్రాహ్మణాయేషాం నైరంతర్యేణ కామనాః

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “సదాచారముతో కూడియండువారు, బుద్దిశాలురు, శక్తిసంపన్నులు ఏమిచెప్పిరో దానిని సుభాషితముగా వినుము. అనేకములగు చెట్టుచేమలు, శంఖములు మొదలగునవి జడవస్తువులు, చీమలు, తుమ్మెదలు ఏనుగులు మొదలగు జంతుజాలముల జన్మములను ప్రకటన చేయుచు, ప్రాణి, కర్మగతులయందు నటుని వలె నిటునటు నాడుచు నలబ్ధసుదర్శనుడై (పరమాత్మప్రాప్తి కలుగక-సరియగు చూపులేని యజ్ఞానియై) తిరుగుచున్నాడు. రూపములు, ఐశ్వర్యములు, జ్ఞానములు, కులములు, వైభవములనెడు కవచములచే చుట్టబడిన వాడవై ధర్మమార్గమనినచో విడిచిపుచ్చుచున్నావు. ఈ లోకమునుండి యాలోకమునకు, అటునుండి యిటకు పోవుచువచ్చుచున్నావు నీవు నీ అహంకారము భస్మీభూతమగునంత వఱకు జ్ఞానమును పొందజాలవు. నేనేమియు చెప్పజాలను. జాతి, కులము, రూపము, వయస్సు, వర్ణము అనియిట్లనేకములుగ వినబడుచున్న యహంకారములచే గ్రుడ్డివాగు, పేడివారు, ఈ లోకమున గానీ; పరలోకమునందుగాని తమకు శ్రేయమును కలిగింపగల ప్రయోజనమును చూడజాలరు. ఈ విభాగములను తెలిసికొనిన పిదప ఏ బుద్దిమంతుడు జాతి గర్వమును కలగి యుండగలడు?. స్వజనులననేకులను, ఇంద్రియ వృత్తుల నుండి విడివడినవారినందజీని పరిశీలించినఁదెలియును) జాతీయనునది కర్మననుసరించిపోవును. శాశ్వతమైన ఒకే జాతి యెవనికి గలదు?. విద్వాంసుల సభయందెవఁడేనీ, 'సంస్కారము వలన బ్రాహ్మణడయ్యేనని చెప్పిన యెడల అతనిమాట న్యాయానుసారముగ మాట్లాడు న్యాయజ్ఞుల చేత నిరాకరింపదగినదేయగును. గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము. చూడాకర్మ, ఉపనయనము, స్నాతకము, సమావర్తనము, పాణిగ్రహణము. ఈ మొదలగు సంస్కార విధానములచేత సంస్కృతులగుదురు. వారే బ్రాహ్మణులు. వారిలోనే నిరంతరముగ కోరికలు విజృంభించుచుండును!.

మూ. యస్మాద్వైబ్రాహ్మణా జాతా బ్రాహ్మణైఃకృత సంస్కృతైః నాయుఃశక్తిర్హి కాంత్యాది విశేషో విద్యతేస్ఫుట:

తౌవా బ్రాహ్మణ గాత్రోతౌ సంస్కృతా సంస్కృతౌ నరౌ ఇష్టానిష్టాప్య నాప్తిభ్యాం నభిద్యేతే పరస్పరమ్

జ్ఞానాధ్యయన హి మాంసానియమేంద్రియ నిగ్రహై : వినా సంస్కారయోగేఽపి పుంసః శూద్రాన్న భిన్నతా

 సంస్కారః క్రియమాణశ్చ న శూద్రేచ ప్రవర్తతే సంస్కృతాంగశ్చ పాపేభ్యోన పశ్యతి నివర్తతే

విలాసినీ భుజంగాది జన వన్మద విహ్వలా: వ్యాముహ్యంతి సదాచారాద్భ్రాహ్మణత్వాత్పతంతి చ

 సంస్కృతోఽపి దురాచారో నరకం యాతి మానవః నిఃసంస్కారః సదాచారో భవేద్విప్రోత్తమః సదా

మంత్ర పూతాత్మ సంస్కార యుక్తోపి ప్లవతేనతు బ్రాహ్మణ్యాదవికల్పం స పశ్చాద్దుశ్చరితో నరః

సామర్థ్యాత్పతనం తస్మాద్భ్రాహ్మణ్యాన్ముచ్యతేధ్రువమ్ దురసుషాన సక్తానాం పుంసాం పురుషపుంగవై :

 కింక్వచిద్దుష్టమేవైత త్కింవా స్పర్థావీదత్యయమ్ తుల్యముత్సహసే కర్తుమప్యదృష్టం తదావద

 ఆచారమను తిష్ఠంతో వ్యాసాదిముని సత్తమాః గర్భాధానాది సంస్కార కలాపరహితాఃస్ఫుటమ్

తా॥ సంస్కారములు చేయబడిన యున్న బ్రాహ్మణులచేతనే కలిగిన బ్రాహ్మణులలోను అపేక్షితములైన ఆయువు, శక్తి, తేజస్సు మొదలగు విశేషములు స్పష్టముగ లేకపోవుటయు కలదు. బ్రాహ్మణ శరీరముల నుండి పుట్టిన సంస్కారవంతుడు, సంస్కారహీనుడు అను నిరువురును, ఇష్టానిష్టముల విషయమునగాని, ప్రాప్త్యప్రాప్తుల విషయమునగాని ఒకరితోనొకరు భేదింపరు. జ్ఞానము, వేదాధ్యయనము, కర్మ, వేదాంతవిచారము, నియమము, ఇంద్రియనిగ్రహము అనువీనితో గాక కేవల సంస్కార యోగముతో మానవునకు శూద్రునకన్న భిన్నత్వమేమియు లభింపదు. శూద్రుని విషయమునందు సంస్కారము చేయబడుట జరుగక పోవచ్చును. కానీ సంస్కృతాంగుడయినంత మాత్రమున పాపముల నుండి ముక్తుడు కాడు. సర్పముల వంటి విలాసినీ జనముతోగూడి, మదోన్మత్తులై మోహమునందుచున్నవారు సదాచారమునుండి, బ్రాహ్మణత్వమునుండియు పతితులగుచున్నారు. దురాచారవంతుడు సంస్కారములు పొందియుండియు పతితులగుచున్నారు . దురాచారవంతుడు సంస్కారములు పొందియుండినను నరకమును పొందును. సంస్కారములు లేనివాడయినను సదాచారవంతుడు బ్రహ్మోణోత్తముడగును. మంత్ర పూతమగు సంస్కారములు పొందియుండినవాడైనను తరింపజాలడు. ఏలయన సంస్కారవశమున నేర్పడిన బ్రాహ్మణ్యము నుండి తప్పుకొనలేకయు, దురాచారము వలన తప్పించుకొనజాలకయు దుష్టచరిత్రుడుగా నుండి పోవును. అది యోగ్యత నుండి పతనము చెందుట కావున నతడు బ్రాహ్మణత్వము నుండి కూడా విడివడును. తప్పదు. “దురాచారవంతులైన పురుషులలోనట్టిదానిని సదాచారులెప్పుడైనను చూచిరాయేమి? అని స్పర్ధాళుఁడవై వానితో సమానముగ దోషము చేయుటకు నీవు కూడ నుత్సహించినచో నప్పుడు నీకు పట్టబోయెడు నదృష్టమును గూర్చి చెప్పుము. గర్భాధానాది సంస్కారకలాపమేమియు లేకుండగనే వ్యాసాదిముని సత్తములు ఆచారమును పాటించుచు మాత్రమే యుండిరనుట స్పష్టము.

మూ. విప్రోత్తమాః శ్రియం ప్రాప్తాః సర్వలోకనమస్కృతాః బహవః కథ్యమానాయే కతిచిత్తాన్నిబోధత

జాతో వ్యాసస్తు కైవర్త్యాః శ్వపాక్యాశ్చ పరాశరః శుక్యః శుకః కణాదాఖ్యస్తథోలూక్యాః సుతోభవత్

మృగీజోధర్ష శృంగోపి వసిష్టో గణికాత్మజః మందపాలో ముని శ్రేష్టో నావికా పత్యముచ్యతే

మాండవ్యోముని రాజస్తు మండూకీ గర్భ సంభవః బహవోఽన్యేపి విప్రత్వం ప్రాప్తియే పూర్వమద్విజాః

యచ్చైతచ్చారు చరితైరర్చ్య ముచ్చరితం వచః తద్విచార్యాచరన్నుచ్చే రాచారోపచితద్యుతిః

హరిణీ గర్భసంభూత ఋష్యశృంగో మహాముని తపసా బ్రాహ్మణో జాతః సంస్కారస్తేన కారణమ్

 శ్వపాకీ గర్భసంభూతః పితావ్యాసన్య పార్థివ! తపసా బ్రాహ్మణోజాతః సంస్కారస్తేన కారణమ్

ఉలూకీ గర్భసంభూతః కణాదాఖ్యో మహాముని తపసా బ్రాహ్మణో జాతః సంస్కార స్తేన కారణమ్

గణికా గర్భసంభూతో వసిష్ఠశ్చ మహాముని తపసా బ్రాహ్మణో జాతః సంస్కారసేన కారణమ్

నావికా గర్భసంభూతో మందపాలో మహామునికై తపసా బ్రాహ్మణో జాతః సంస్కార స్తేన కారణమ్

వేద తంత్రజ సంస్కార కలాప నిపుణైరపి విద్యాతపో ధన బలాదుత్కృష్టం లభ్యతే ఫలమ్

లబ్ధ సంస్కార దేహాశ్చ మహాపాతకినో నరాః యస్మాన్నివర్తతే బ్రహ్మతస్మాత్సెంకేతికం విదుః

ఇతి శ్రీ భవిష్యమహాపురాణే శతార్ధ సాహస్ర్యాం సంహితాయాం బ్రాహ్మేపర్వణి

షష్ఠి కల్పే బ్రాహ్మణ్య సంస్కార వివేక వర్ణనం నోమద్వాచత్వారింశోఽధ్యాయః

            తా॥ సర్వలోక పూజ్యులై శ్రేయమును పొందిన బ్రాహ్మణోత్తములు చాలమంది కలరు. వారిలో నేను చెప్పబోవు కొందఱిని గుణించి తెలిసికొనుము. వ్యాసుడు జాలరి స్త్రీకిని, పరాశరుడు మాలేతకును బుట్టిరి. శుకుడు ఆడుచిలుకకు జన్మించెను. కణాదుడు గుడ్లగూబకు కొడుకుగా బుట్టెను. ఋష్యశృంగుడు మృగికి బుట్టెను. వసిష్ఠుడు దేవ వేశ్యయగు నూర్వశి కుమారుడు. మందపాలుడను మునిశ్రేష్టుడు ఓడనడుపు స్త్రీ కుమారుడని చెప్పబడును. మాండవ్యముని మండూకి గర్భము నుండి పుట్టెను. ఇంకను ఇట్టి వారనేకులు మొదట అబ్రాహ్మణులయియును తరువాత బ్రాహ్మణత్వమును బడసిరి. ఇట్టి మనోజ్ఞ చరిత్రులైన మహా పురుషులచేత ఏ పూజ్యమైన వాక్కు చెప్పబడినదో ఆ పూజ్య వాక్కుననుసరించి నడుచుకొనిన ఉన్నతుల చేత, ఆచారముతో వృద్ధినందిన తేజము పొందబడినది. ఆడుజింక గర్భము నుండి జన్మించిన ఋష్యశృంగుడు మహామునియయ్యెను. తపస్సుచేత బ్రాహ్మణుడగును. దానితో కూడియే సంస్కారము కూడా కారణమగుచున్నది. వ్యాసుని తండ్రియగు పరాశరుడు మాలేత గర్భమున జన్మించిన వాడయియును మహర్షయయ్యెను. కావున తపస్సుచేతనే బ్రాహ్మణుడగును. దానితో కూడి సంస్కారము కారణమగును. కణాదుడు గ్రుడ్లగూబకు బుట్టినవాడయ్యు మహాముని కాగలిగెను. కాబట్టి తపస్సే బ్రహ్మత్వమునకు కారణమగును. దానితో సంస్కారము కూడ కారణమగుచున్నది. వేశ్యా గర్భసంభూతుడైనను వసిష్ఠడు మహామునియయ్యెను. బ్రాహ్మణత్వమునకు తపస్సు కారణము. సంస్కారము దానిననుసరించిన కారణము. మందపాలుడు పడవనడుపుదాని కొడుకైనను మహామునియయ్యెను. తపస్సుచేత బ్రాహ్మణుడగును. దానితోగూడి సంస్కారము కారణమగుచున్నది. వేదములందు, ఆగమములందు చెప్పబడిన సంస్కారకలాపములయందు నిపుణులైనవారు కూడా జ్ఞాన తపోధనముల బలము చేతనే ఉత్కృష్టఫలమును పొందుచున్నారు. మహాపాపులైనను, సంస్కారము పొందిన దేహము గలవారైనను బ్రహ్మజ్ఞానమే నివృత్తి కారకమైనందువలన నదియే బ్రహ్మత్వమునకు సంకేతమని బుద్ధిమంతులు గ్రహింతురు.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున షష్ఠికల్పము నందలి బ్రాహ్మణ సంస్కార వివేక వర్ణనమను నలువది రెండవ అధ్యాయము సమాప్తము.