భవిష్య మహా పురాణము
40. షష్టీ కల్పమునందు కార్తికేయ వర్ణనమున జాతి వర్ణనము
మూ. శతానీక ఉవాచ : -
“అహోవ్రతం మహోత్కష్టం సంశయోహృదివర్తతే, కార్తికేయస్య మాహత్మ్యం శ్రుత్వా జన్మతథా ద్విజ!
అనేక జనితస్యేహ కార్తికేయస్య సువ్రత! మాహాత్మ్యం సుమహద్విప్ర! కథమే తద్విభావ్యతే
జాతిః శ్రేష్ఠా భవేద్వీర! ఉత కర్మభవేద్వరమ్ సంశయస్తు మహానత్ర దృష్ట్వామే కృత్తికాసుతమ్
ఏత ద్వద వినిశ్చిత్య న యథా సంశయోభవేత్ జన్మతః కర్మణశ్చైవ యజ్ఞ్యాయస్తద్భ్రవీహిమే”
సుమంతురువాచ : -
ఇమ మర్ధం పురాపృష్టో బ్రహ్మా శిష్యైర్మనీషిభిః యదుక్తం తేన తేషాంచ తత్తే వచ్మి నిబోధమే
సురజ్యేష్ఠం సుఖాసీన మభిగమ్య మహర్షయః ప్రణమ్యచ మహా బాహో విశ్వామిత్రస్య విప్రతామ్
దృష్టా విస్మయ గత్య కౌతూహల సమన్వితాః భక్తిం శ్రద్ధాం పురోధాయ ప్రణమ్యానత కంధరాః
ఋషయ ఊచుః -
'భో బ్రహ్మన్నాది కల్పేషి బ్రాహ్మణ్యం బ్రూహి కింభవేత్ జాత్యధ్యయన దేహాత్మ సంస్కారాచార కర్మణామ్
బాహ్యాభ్యంతర సామాన్య విశేషా యది కృత్రిమా: మనో వాక్కర్మ శారీర జాతి ద్రవ్య గుణాత్మకాః
సంత్యక్తవ్యాః ప్రసిద్ధయే జాతి భేద విధాయినః వస్తుభూతాః పరోక్షైర్వా ప్రమాణైర్న వినిశ్చితాః
అవ్యక్తాగమ సిద్దశ్చేజ్ఞాతి భేద విధిర్నృణామ్ వికల్పోఽయం నపుష్ణాతీ భవతః శేముషీ బలమ్
తా॥ శతానీకుడిట్లనేనె. “ఆహో! నిగ్రహ వ్రతము కష్టమైనది గదా! కార్తికేయుని మాహాత్మ్యమునుగుఱించి, అతని జన్మవిశేషమును గుజించియు తెలిసి కొనిన మీదట నాహృదయమున నొక సంశయము కలుగుచున్నది. అనేక ప్రకారములుగ జన్మించిన కార్తికేయుని జననమును, అతని గొప్పదనమును ఎట్లు సమన్వయించుకొనవలెను?. కృత్తికాసుతుని విషయమెఱింగిన పిదప, “జాతి శ్రేష్ఠమైనదా? కర్మశ్రేష్ఠమైనదా? అని గొప్ప సందేహము పొడముచున్నది. ఈ నా సందేహము తొలగునట్లు నిశ్చయపూర్వకముగ సమాధానము చెప్పుడు. పుట్టుక వలన గొప్పదన మబ్బునా? లేక చేసిన కర్మవలన ఘనత లభించునా?. సుమంతుముని ఇట్లు సమాధానము చెప్పెను. " ఇట్టి ప్రశ్ననే పూర్వము, బ్రహ్మను, బుద్ధిమంతులైన కొందఱు శిష్యులడిగిరి. అతడు వారికి చెప్పిన సమాధానమునే నేను నీకిప్పుడు చెప్పుచున్నాను వినుము. విశ్వామిత్రుని బ్రాహ్మణత్వమును గూర్చి విస్మయమంది, ఆ విషయమును తెలిసికొనుటకు కుతూహలముతో సుఖాసీనుడై యున్న బ్రహ్మదేవుని వద్దకుఁబోయి, భక్తి శ్రద్ధలతో వినమ్రులై అతనికి నమస్కరించి ఋషులిట్లనిరి. () ఓ బ్రహ్మదేవా! పుట్టుక, వేదాధ్యయనము, దేహము, ఆత్మ సంస్కారము, ఆచారము, కర్మ అను వీనిలో-ఆదికల్పమునందు బ్రాహ్మణత్వము దేనివలన కలుగుచుండెనో మాకు చేప్పుడు. మనో వాక్కాయ కర్మలకు, జాతిద్రవ్య గుణములకును సంబంధించిన బాహ్య, అభ్యంతర, సామాన్య విశేష లక్షణములు కృత్రిమములైనయెడల. ఇవి విడువదగినవి (అసహజములు) ఇవి ప్రసిద్దములు (సహజములు) అని పరోక్ష ప్రమాణములచేనైనను నిశ్చయించుటకు వీలుపడకుండును. మనుష్యుల జాతిభేద నిర్ణయ విషయముననాయా లక్షణములు తెలియకుండవచ్చి చేరి అ సహజములు సహజ సిద్ధమైనవి, అనెడి వికల్పము. మీ బుద్ధి బలమును కూడ పోషింపజాలకుండును.
మూ. బ్రహ్మోవాచ : -
ఏవమేతన్న సందేహో యధాయూయం వదంతి హ శృణుధ్వం యోగినో వాక్యం సతర్కం శిష్యశ్రేయసే
యోగేశ్వర ఉవాచ : -
ప్రమాణేహి ప్రసిద్ధేతు భిన్నార్థ విషయే యతః స్పష్టయోగ్యార్ధ విషయం ప్రత్యక్షం తావదీక్షతే
సామాన్యాతీంద్రియ గ్రాహీ సిద్ధాంతోఽభ్యుపగమ్యతే స ఏవ భగవానేకం ప్రమాణ మితి చేన్నతత్
యస్మాద్వివిధ మేతత్తే సంకటం భద్రవర్తతే వేదస్య పౌరుషేయత్వం నిత్యజాతి సమర్థకమ్
కార్యావిశేషా వేదోక్తా, నయుక్త మకృతంవచః తాల్వాది కరణానాంచ వ్యాపారానంతరం శ్రుతేః
వ్యాపారాత్పరత స్తస్య ప్రాగభావ విశేషతః తద్భావాను విధీయత్వ మన్వయ వ్యతిరేకతః
తస్మాద్ధూమాగ్ని వద్వార్థఫల భావోఽవతిష్ఠతే నచ వ్యాపార వచసో రన్యధానుపపత్తితః
పురుషాను గతాజాతీర్భ్రాహ్మణత్వాది కాస్తిచేత్ ద్వివర్ణజాతి భేదేన ప్రత్యక్షార్థోప లక్షణాత్
గోవర్గ మధ్యంచ గతో యధాశ్వో నిర్ధార్యతే జ్ఞైః సువిచక్షత్వాత్ మనుష్యభావాదవి శిష్యమాణస్తద్వద్ద్విజః శూద్ర గణాన్నభిన్నః
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “మీరు చెప్పుచున్నట్లది సందేహము కానేరదు. ఈ విషయమున యోగీశ్వరుడు శిష్యులశ్రేయస్సు కొఱకు వచించియుండిన సహేతుకమైన వాక్యమును వినుడు. యోగీశ్వరుడిట్లనెను. “వేజ్వేలు వస్తువుల భేదము నిర్ణయించుటలో ప్రమాణములు ప్రసిద్ధములైయుండుట వలన, ఆప్రమాణముల మేరకు ప్రత్యక్షముగ పరిశీలించి ఏది యేదో స్పష్టముగ నిర్ణయింపనగును. అతీంద్రియ జ్ఞాని వంటి వాడు చేసిన సిద్ధాంతమే అంగీకరింపబడును. కాని ‘అతడే భగవంతుడు. అతడు చెప్పినది మాత్రమే ప్రమాణమనుటయు సరికాదు. ఏలయన వస్తు నిర్ణాయక ప్రమాణములు పెక్కులుండును. ఇట్లు ప్రమాణ వైవిధ్య కారణమున వస్తు-ధార్థ్యనిర్ణయము కష్టసాధ్యమగును. వేదము పౌరుషేయమనుట దాని పుట్టుటను సమర్ధించునదియగును. వేదోక్తములగు విశేషములాచరింపవలెను. శ్రుతి వాక్యములను తాల్వాద్యవయవ వ్యాపారముచే నుచ్చరించిన పిమ్మట వానిని పాటించుట సరియైనది. ఏలయన వాక్యోచ్చారణకు పూర్వము ఆ కార్యవిశేషము, విధి ని షేధములు, ఆనుపూర్వము మున్నగునవి అప్రకటస్థితిలో నుండును. వాక్యభావముననుసరించు విధి శాస్త్రమున కన్వయవ్యతిరేకత యేర్పడును. అందువలన అర్థఫలమగు భావము ధూమముతోడి యగ్నివలె నొక యన్యోన్య నియతి కలిగియుండుననుట కూడా ఒక పక్షము మాత్రమే. ఏలయన ఉచ్చరింపబడిన వేద వాక్యమునందలి భావమున కన్యధా ఉపపత్తి లేకుండుటయు సంభవింపదుకదా!. అటులే పురుషు ననుసరించియే బ్రాహ్మణాది జాతీయుండుననుట సరికాదు. ఒక జాతి నుద్దేశించి, 'అది రెండక్షరములతో నుచ్చరింపదగిన పేరుగలది' అను నింత మాత్రమే భేదమును చెప్పుటచేత వ్యక్తమగు నర్థమితర జాతులకును ప్రవర్తించును గదా! (పురుషుని చెప్పినంత మాత్రమున నతని జాతి ప్రత్యక్షము కాదనుట. చతుష్పాత్తులైన పశువుల (గోవుల) మందలోనొక గుఱ్ఱమున్నచో దానిని బుద్ధిమంతులు పరిశీలించి గుజ్జమని నిర్ధారణ చేయుదురు. ఆ విధముగనే మనుష్యభావము నుండి వేణుగాని బ్రాహ్మణుని, శూద్రగణమునుండి వేఱుచేయుట సాధ్యము కాదు.
మూ. మనుష్యజాతేర్న పరో విశేషో యః కల్ప్యతే సర్వనరానుయాయీ సంస్కార యుక్తాహి క్రియా విశిష్టా ద్విజన్మనాం శూద్ర వివేక హేతుః
జీవోపి బ్రాహ్మణః ప్రోక్తో యైరతత్త్వజ్ఞమానవైః ప్రభ్రష్ట బ్రాహ్మణత్వాస్తే జాయంతే విప్ర సంగతః
జరా జన్మాంతర క్లేశ దుష్టగ్రాహ కులాకులమ్ నరతిర్యగ సచ్ఛూద్ర యోని దుఃఖోర్మి సంకటమ్
దౌఃస్థిత్య రోగశోకార్తీ జనావర్త సమన్వితమ్ శ్వాస శూకర చాండాల కృమి కూర్మాది కాయకమ్
సంసార సాగరం ఘోరం మగ్నః ఖలు పరిప్లువన్ భూరి పాప భరా క్రాంతః సజీవో బ్రాహ్మణః కథమ్?”
బ్రహ్మోవాచ : -
సప్తవ్యాధ కథా విప్రా మనునా పరికీర్తితా తాం నిశమ్య యదుశ్రేష్ఠ! నిత్యం జాతి పదం త్యజేత్
సప్తవ్యాధా దశార్ణేషు మృగాః కాలం జరేగిరౌ చక్రవాకాః సరిద్ద్వీపే హంసాః సరసి మాన సే
తెఽపి జాతాః కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః ప్రస్థితా దీర్ఘ మధ్వానం యూయం కిమవసీదథ
తస్మాన్న జీవే బ్రాహ్మణ్యం పశ్యామోహి కథంచన
శాస్త్రాది మద్భార్గవ జాతియుక్తో గజాశ్వగోజోష్ట్ర ఖరాదికానామ్
శక్త్యా కృతో హ్యంగజ వర్ణధర్మైర్భేదః స్ఫుటం లక్షణతోఽత్ర యద్వత్.
తా॥ మనష్యులందఱు నొకే విధముగ నుండుట దక్కమానవజాతిలో ప్రత్యేక విశేషమేమియులేదు. కాని బ్రాహ్మణ జాతికి మాత్రము, శూద్రజాతిని విడిగా గుర్తించుటకు కారణమగు సంస్కారయుక్తత, క్రీయా విశిష్టత యనునవి ప్రత్యేకముగ నున్నవి. తత్వము తెలియని వారు కొందఱు ప్రతిప్రాణియు బ్రాహ్మణుడే యందురు. అట్టివారు బ్రాహ్మణత్వమునుండి భ్రష్టమైనవారు. బ్రాహ్మణ సంసర్గముతో పుట్టుచుందురు. ముసలితనము, మలమల పుట్టుచుండుట మున్నగు క్లేశములనెడు క్రూరములైన మొసళ్ళ సమూహములచే కల్లోలితము చేయబడుచుండునది, మనుష్యులు, పశుపక్ష్యాదులు, అధమ జాతి శూద్రులు మొదలగు జన్మముల వలన దుఃఖపరం పరలనెడి తరంగములతో సంకోచము చెందుచుండునది. వివిధములై దుఃస్థితులు, రోగములు, దుఃఖములు, బాధలు, మొదలగువానితో, చిక్కులు వడు జనుల సమూహములనేడు సుడులతో కూడినది; కుక్కలు, పందులు, చండాలురు, కృమి కీటకములు అనెడి తాఁబేళ్లతో నిండినదియునైన. ఘోరమగు సంసార సముద్రమున మునిగితేలుచున్నవాడును, మహాపాపభారమును మోయుచున్నవాడును అయిన జీవుడు, బ్రాహ్మణుడెట్లగును?”. బ్రహ్మదేవుడిట్లుపలికెను. బ్రాహ్మణులారా! ఏడుగురు బోయవారి కథ పూర్వము మునువుచే చెప్పబడెను. దానిని విని పుట్టుక వలన నేర్పడిన స్థానమును విడిచి పెట్టవలెను. దశార్ణదేశమందలి యొక పర్వతము పై మృగప్రాయులైన యేడుగురు బోయలు కాలము గడిపిరి. సరిద్ద్వీపమునందు చక్రవాక పక్షులు తుదివఱకు కాలము గడిపెను. మానస సరోవరమునందు హంసలు. అటులే కురుక్షేత్రము నందుఁబుట్టిన వేదపారగులైన బ్రాహ్మణులును కాలము గడిపిరి. వీరందఱును చివరకు తమ సుదీర్ఘ ప్రయాణమున నెట నుండీరో యెఱుఁగరాదు. ఈ విషయమున మీరేమి నిర్ణయించెదరు?. అందుచే ప్రాణి మాత్రమునందేట్టి బ్రాహ్మణ్యమును కన జాలము. బ్రాహ్మణ జాతియందుఁ బుట్టియు నాయుధములధరించి, ఏనుగు, గుఱ్ఱము, ఎద్దు, ఒంటె, గాడిదమున్నగు పశువుల బలిమితో జీవించువాడును వానికన్న నతడు వేటైనవాడను నంశము, అవయవాది భేదములచేత స్పష్టమే యగును.
మూ. తదుత్తరాన్నైన వికర్తనీయా బ్రాహ్మణ్య జాతతీర్నృషు నాస్తికాచిత్
నిత్యాకృతిర్నానుపభేద రూపాయథా హి భేదః పరమోత్ర సిద్ధ్యేత్
సీతాద్యసాధారణ తుల్య రూపాః సనాతనాంగేషు న వర్ణభేదః
బ్రాహ్మణ్యమధ్రువమిదం కిలకృత్రిమత్వాదకృత్రిమం భవతి సామయికత్వయోగాత్ సాంకేతికం సుకృత లేశ విశేష లబ్ధం వాణిజ్యభేషజ కృతా మీవజాతి భేదాః కింబ్రాహ్మణాయే సుకృతంత్యజంతి కింక్షత్రియాలోకమపాలయంతః
స్వధర్మహీనా హి తదైవ వైశ్యాః, శూద్రాః స్వముఖ్యక్రియలో విహీనాః
తస్మాన్న గోశ్వవత్కశ్చిజ్జాతి భేదోఽస్తి దేహినామ్ కార్యశక్తి నిమిత్తస్తు సంకేతః కృత్రిమోభవేత్
ఏవంప్రమాణైః ప్రతిషిథ్యమానాం సాంకేతికం యాతి నరోవ్యవస్దామ్
స్వకీయసిద్ధాం స్వమతైర్నిషిద్ధాం నబుధ్యతే మూఢమనా వరాకః
గోమహిషజ వాజ్యుష్ట్ర వానేయావి గజాధిపాః ప్రేష్యవార్ధుషికా కార్యకరణోద్యత మానసాః
వణిక్కారు క్రియా విష్టా దివ్యాస్తేఽపిచ యేద్విజాః వినిషాసేతు విజ్ఞేయాః ప్రవ్యాదాశ్చ కుశీలవా:
పలాండు లశునా దాశ్చ మృగ్యుష్ట్రీ క్షీరపాయినః మాంస సర్వరస క్షీర క్రయ విక్రయ కారిణః
పునర్భూ వృషలీ వేశ్యా చాండాలస్తీ నిషేవిణః శూద్రన్నరస పుష్టాంగాః ప్రేత వస్త్రాన్న భోజనాః
మృత సూతక లబ్దాన్న పానాద్యభ్యవ హారిణః బ్రహ్మదేవ పితృభూత మను ష్యేషు బహిష్కృతాః
మాత్సర్య మద విద్వేష తృష్ణాకామ తమోమయాః హీనాచారా హి యేకేచిదపరే పిశునా ద్విజాః ప్రకారైర్బహుభిఃసర్వే తే ప్రణశ్యంతి నాన్యధా
తా॥ ఆ ప్రకారముగ, మానవ జాతిలో బ్రాహ్మణ్యమను విభాగము ప్రత్యేకముగ లేనందువలన, ఆ జాతిలో నిది బ్రాహ్మణ్యమని విశ్లేషించి చూపుట సాధ్యముకాదు. ఏలయన సాధారణ మానవాకృతిలో నత్యంత సూక్ష్మభేదములుండినట్లు జాతి నిర్దేశసూచకములగు స్పష్టములైన భేదములుండవు. తెలుపు, నలుపు మొదలగు వర్ణముల విషయమున సాధారణమగు సామ్యములు ఉండవచ్చును. పూర్వమునుండియు ననుక్రమముగ నేర్పడు శరీర విభాగములలో-రక్తాస్థి మజ్జమాంసాదులలో-వర్ణభేదమే ఉండదు. ఈ బ్రాహ్మణత్వమనునది కృత్రిమమైనదగుటచేత శాశ్వతమైనదికాదు. సమయయోగము చేత మాత్రమే అది సహజమైనదిగ వ్యవహరింపబడును. అది పూర్వజన్మమున నొనరించిన సుకృతలేశము వలన లభించిన ఫలమునకొక సంకేతము. వ్యాపారము చేయువారు, వైద్యము చేయువారు అనురీతిని జాతిభేదములన్నియు వారివారి వృత్తుల నాశ్రయించియే యుండును. పుణ్యకార్యములను వదలి పెట్టిన వారు' బ్రాహ్మణులెట్లగుదురు? లోకమును పరిపాలింపని వారు ఏమి క్షత్రియులు? స్వధర్మమును వదలిన 'వైశ్యులు' వైశ్యులెట్లగుదురు? అటులే తమజాతికి నియతములైన కర్మలు చేయని “శూద్రులు' శూద్రులెటులయ్యెడరు?. కాబట్టి మానవులలో ఆవు, గుఱ్ఱము' మధ్యగల భేదము వంటి బేదము జాతిపరముగలేదు. కార్యశక్తికి కారణమగు నేర్పాటు కృతకమైనదిగదా!. ఇట్లు ప్రమాణములచేత నిషేధింపదగినదియు, కేవలము వృత్తిపరమైన యేర్పాటు గలదియునైన వ్యవస్థను మానవుడు పొందుచున్నాడు. మూడుడు, కృపణుడనైనవాడు స్వమత సిద్ధమైనదేదియో, నిషిద్ధమైన దేదియో తెలిసికొన జాలకున్నాడు. ఆవులు, గేదెలు, మేకలు, గుఱ్ఱములు, ముస్లిగడ్డి (పెరుగు ప్రాంతముల), గొఱ్ఱలు, ఏనుగులు మొదలగు వాని యజమానులు, అప్పులిచ్చుట ద్వారా వచ్చెడి వడ్డితో జీవించువారు. వర్తకము చేయువారు. కంసాలి, సాలె, మంగలి, చాకలి, ముచ్చిపనులు చేయువారు, ఒ పైన జీవనము గలవారైనచో బ్రాహ్మణులేయగుదురు. మాంసము తినువారు, నానాదేశసంచారులైన నర్తకులు. -నీరుల్లి వెల్లుల్లితినువారు, జింక ఒంటెల పాలు త్రాగువారు; మాంసము, యక్షధూపము, పాలు వంటి వస్తువల క్రయ విక్రయములు చేయువారు;. మాటుమనుపొడినది, శూద్రస్త్రీ (కన్యక) వెలయాలు, చండాలస్తీ మున్నగు వారితో సాంగత్యము చేయువారు, శూద్రుల అన్నరసముతో పెరిగిన అవయములగలవారు (శూద్రాన్న భోక్తలు) ప్రేతల వస్త్రముల ధరించువారు, ప్రేతల కుద్దేశింపబడిన అన్నమును భుజించువారు;. మృతాశౌచ, జాతాశౌచములు గలవారి అన్నపానాదులనుపయోగించువారు; బ్రహ్మయజ్ఞము, దేవ యజ్ఞము, పితృయజ్ఞము, భూతబలి, అతిథి పూజనము అనువానిని చేయనివారు. మదమాత్సర్యములు, ద్వేషము, దురాశ, కాముకత, తమోగుణము గలవారు; ఆచారములేనివారు, ఇంకను కొండెకాండ్రు మున్నగు దుష్టస్వభావులు-ఇట్టివారు కులము చేత బ్రాహ్మణులయియును వినాశమును పొందుదురు. తప్పదు.
మూ. ఏవం శాస్త్రోదితన్యాయ మార్గభ్రష్టాస్తుయే నరాః విశిష్టగోత్ర సంస్కార కలాప సకలాత్మకాః
వేదానధ్యాపయంతోఽపి తేఽధీయానాః శ్రుతిక్రమాత్ బ్రాహ్మణ త్వాద్విషీయంతే దురాచార విధాయినః
తస్మాన్న జాతిరేకత్ర భూతాత్మాస్త్యన పాయనీ నాశిత్వాదత్ర చ శ్లోకాన్మానవాః సమధీయతే
సద్యః పతతి మాం సేన లాక్షయా లవణేనచ త్ర్య హేణ శూద్రోభవతి బ్రాహ్మణః క్షీర విక్రయీ
గోరక్షకా న్వాణిజికాంస్తథాకారు కుశీలవాన్ ప్రేష్యాన్వార్ధుషికాంశ్చైవ శూద్రింస్తాన్మనురబ్రవీత్
శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతామ్ క్షత్రియాయాతి విప్రత్వం విద్యాద్వైశ్యం తథైవచ
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యాం సంహితాయాం బ్రహ్మే పర్వణి
షష్ఠి కల్పే కార్తికేయ వర్ణనే జాతివర్ణనం నామ చత్వారింశోఽధ్యాయః
తా॥ ఈ విధముగ, శాస్త్రమునందు చెప్పబడిన ధర్మముల నాచరింపక భ్రుష్టులైనవారు, విశిష్టమగు గోత్రము, సంస్కారము, బిరుదములు, అలంకారములెన్నియున్నను. శ్రుతి క్రమముగ వేదమును అధ్యాపనము చేయుచున్నను, అధ్యయనము చేసియున్నను, దురాచార పద్దతి ననుసరించుటచే బ్రాహ్మణత్వమునుండి చ్యుతి పొందుదురు. అందువలన జాతి యనునది ఒక్కచోనుండునది కాదు. అది భూతాత్మ, అనపాయిని, మానవులు (స్వజాతి) భ్రష్టులు కాకుండా నిచటి శ్లోకములనధ్యయనము చేయవలెను. మాంసము, లక్క, ఉప్పు (అమ్ముట)చేత బ్రాహ్మణుడప్పటికప్పుడే పతనమగును. పాలనమ్మెడు బ్రాహ్మణుడు మూడు దినములలో శూద్రుడగును. గోరక్షకులు, క్రయవిక్రయములు చేయువారు, కంసాలి, సాలె, చాకలి, మంగలి, ముచ్చివారు, దేశసంచారము చేయునట్టువులు, కార్యనిర్వహణార్థము యజమానులచే పంపబడువారు, వడ్డీ వ్యాపారముచేయువారు, - వీరిని శూద్రులుగా మనువు పేర్కొనెను. శూద్రుడు బ్రాహ్మణత్వమును పొందును. బ్రాహ్మణుడు శూద్రత్వమును పొందును. ఇట్లు క్షత్రియుడు వైశ్యుడును బ్రాహ్మణత్వము పొందగల్గుదురని యెఱుంగవలెను.
శతార్థసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యపురాణమునందలి బ్రహ్మపర్వమునషష్ఠి కల్పమునందలి కార్తికేయ వర్ణనమున జాతి వర్ణనమను పేరుగల నలుబదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 40 of the Bhavishya Mahā Purana is as follows:
One of the Brahma Parva's most philosophically rich sections begins here with a debate on the nature of varṇa. Seven hunters present themselves before a ṛṣi and claim that they are brāhmaṇas — not by birth, but by virtue of their sattvic conduct, their abandonment of violence, and their deep knowledge of dharma. The ṛṣi tests them with increasingly subtle philosophical questions, and the hunters' answers reveal genuine wisdom. The parable thus initiates an extended philosophical dialogue on whether varṇa is determined by birth or by guṇa and karma. The chapter is notable for the sympathy and intelligence it attributes to the hunters, making clear from the outset that the question cannot be answered by a simple appeal to birth-based privilege.