19. ద్వితీయా కల్పము - శర్యాత్యాఖ్యానము - పుష్పద్వితీయావర్ణనము

సుమంతురువాచ :

“ద్వితీయాయాంతు రాజేంద్ర! అశ్వినౌసోమపీతినౌ చ్యవనేన కృతే యజ్ఞే మిషతో మఘవస్యచ”

శతానీక ఉవాచ :

“కథమింద్రస్యమిషతః కృతౌతౌ సోమపీతినౌ చ్యవనేన హి దేవానాం పశ్యతాం తద్వదస్వమే

అహోమహత్తపస్తస్య చ్యవనస్య మహాత్మనః యదింద్రస్య బలాదేవ దేవత్వం ప్రాపితావుభౌ”

సుమంతురువాచ

“పురాతన యుగే సంధౌ పశ్చిమేఽధ నరాధిప చ్యవనోయోగమాస్థాయ గంగాకూలేఽవ సచ్చిరమ్

తత్ర శర్యాతిరాయాతః స్నాతుమంతఃపురైః సహ స్నాత్వాభ్యర్చ్య పితౄన్దేవాన్గమనాయోపచక్రమే

తత్రమూఢం జనపదమపశ్యత్పథి చేష్టనమ్ విణ్మూత్రో త్సర్గ సంరుద్ధం జ్యోతిరాక్షిప్త నిష్క్రియమ్ భ్రమంతం తత్రతత్రైవ సమీక్ష్యస బలం నృపః

ఉవాచ దుర్మనారాజా అమాత్యాన్స్వాన్పురోగమాన్ చ్యవనస్యాశ్రమేయం హి నాపరాధంతుకేనచిత్

నచోవాచ యదా కశ్చిత్తస్య రాజ్ఞస్తుపృచ్ఛతః తదా సుతా సుకన్యస్య ప్రోవాచ పితరం వచః

మయాదృష్టంతు యత్తాత! సఖిభిః సహకౌతుకమ్ తతో వచ్మి నిబోధత్వం శృణు తాత! మహాద్భుతమ్

శింజితారావ బహులాః కాంచీనూపురమేఖలాః గాయంత్యోవిలపంత్యశ్చ క్రీడంత శ్చాత్రకాననే

“రాజేంద్రా! ద్వితీయనాడు చ్యవనమహర్షి తాను నిర్వహించిన యజ్ఞమునందు ఇంద్రుని సమక్షమున అశ్వినీ కుమారులచేత సోమపానము చేయించెను” -1. శతానీకుడిట్లనెను. “ఇంద్రుడు దేవతలు చూచుచుండగా చ్యవనుడు అశ్వినీ కుమారులచేత సోమపానమెటుల చేయించెనో నాకు తెలియజెప్పుడు -2. మహాత్ముడైన చ్యవనుని తపస్సు ఎంత గొప్పదో తత్ర్పభావమున ఇంద్రుని బలముచేతనే అశ్వినీ కుమారులిరువురు దేవత్వమును పొందిరికదా! -3. సుమంతముని ఇట్లనెను “పురాతన యుగమునందలి ఒక సంధి చివరి భాగమున చ్యవనుడు యోగ సమాధి నాశ్రయించి చిరకాలము గంగాతీరమున నుండెను -4. ఒక నాడచటికి స్నానార్ధమై తన అంతఃపుర పరివార జనముతో కూడి శర్యాతి మహారాజు వచ్చెను. అతడు స్నానము చేసి దేవతలను పితరులను అర్చించి తిరిగి పోవుటకు ఉద్యుక్తుడయ్యెను -5. అట్టి సమయమున అచటి దారిలో నొక గ్రామమున అతని సైనిక బలము విణ్మూత్రములు నిరోధింపబడి, దృష్టిని కోల్పోయి ఏమిచేయుటకును తోచక నిష్క్రయమై మూఢముగా అచ్చటచ్చటనే తిరుగుచుండెను. అట్టి తన సైన్యమును చూచి -6. శర్యాతి మహారాజు ముందుకు నడచుచుండిన తన అమాత్యులతో ఇట్లనెను. “ఇది చ్యవన మహర్షి ఆశ్రమము కదా! ఇచట ఎవరి చేతను ఏ అపచారము జరుగరాదు. (ఎవరు ఏ అపరాధము చేసిరి?) -7.రాజు ప్రశ్నకు ఎవరును ప్రత్యుత్తరమియకుండిరి. అప్పుడు రాజకుమారి సుకన్య తన తండ్రితో ఇట్లనెను -8. “నేను చెలికత్తెలతో నిట తిరుగుచుండ ఒక ఆసక్తికరమైన అద్భుతము జరిగినది. తండ్రీ! దానిని గుఱించి వివరింతును. వీనుడు -9. ఈ అరణ్యమునందు మేము. కాలిఅందియల సవ్వడులతోను, మొలనూలి చీరుమువ్వల సందడితోను ఆడుచు పొడుచు సంభాషించుకొనుచు తీరుగుచుంటిమి.

 మూ ॥ కోకిల ధ్వనిమశ్రౌషం వ్యక్తావ్యక్తాక్షరంకృశమ్ “సుకన్య హ్యేహి హ్యేహీ”తి వల్మీకాధ్వాచముధ్గరన్

తత్ర గత్వాద్భుతం తాత! పశ్యామః కిల పావకౌ దీపా వివాచల శిఖౌ భూయః కన్యా ఉవాచ హ

మయాచ కౌతుకాత్తాత ! కిమేతదిత్యబుద్ధితః  సూదితౌ దర్భసూచ్యగ్రై స్తత్తేజః సముపారమత్ ”

తచ్ఛృత్వా నృపతి స్త్రస్త స్తూర్ణం తద్వనమాగమత్ యత్రాస్తే భార్గవః కష్టం వల్మీకాంతర్గతోమునిః

గత్వా సతత్రప్రోవాచ ప్రణిపత్యద్విజోత్తమమ్ అపరాధం మయాదేవ తత్ క్షమస్వనమోఽస్తుతే

స తం ప్రోవాచనృపతింమయాజ్ఞాతం నరాధిప! సుకన్యాం మే ప్రయచ్ఛస్వ నివేశార్ధీహ్యహం నృప ! అనుక్రమన్సుకన్యాంతు దత్వారాజన్సుఖీభవ

ఇత్యుక్తః ప్రదదౌ రాజా సుకన్యాయవిచారయన్ తతః స్వపురమాగమ్య అవసత్సుచిరం సుఖీ

సుకన్యాపి పతిం లబ్ధ్వా సుప్రీతారాధయత్తదా రాజ్యశ్రీయం పరిత్యజ్య వల్కలాజిన ధారిణీ

గతే బహుతిభే కాలే వసంతే సముపస్థితే తపోద్యోతిత సర్వాంగీం రూపౌదార్యగుణాన్వితామ్ స్నాతాం స్వభార్యాం చ్యవన ఉవాచ మధురాక్షరమ్

తా ॥ అంతలో “సుకన్యా! ఇటురమ్ము!” అనువాక్యము ఒక పుట్టనుండి వెలువడుచు, అస్పష్టముగ, క్షీణస్వరమున, కోకిల ధ్వని వలే మధురముగను మాకు వినిపించెను -11. ఆ ధ్వని వచ్చిన తావునకు వెడలి అచటనొక అద్భుతమును చూచితిమి. పుట్టలో నిశ్చలమగు దీపశిఖలవలె రెండు వెలుగుచున్న అగ్నికణములు కన్పట్టెను.” సుకన్య ఇంకను ఇట్లు చెప్పదొడగెను -12. “ అవి ఏవియో తెలియక దర్భకొనలతో వానిని పొడిచితిని, వెంటనే ఆ ప్రకాశము శమించెను.” -13. అది విని రాజు మిక్కిలి భీతిల్లి ఆలసింపక ఆ వల్మీకముగల అడవికి దారితీసెను, పుట్టలోపలి భాగమున భృగువంశీయుడగు చ్యవనుడు చిరకాలము నుండి తపోమగ్నుడై యుండెను -14. శర్యాతి, చ్యవనునకు నమస్కరించి ఇట్లనెను. "దేవా! మా అపరాధమును క్షమింపుడు. మీకు నమస్కారము.” -15. చ్యవనుడా మాటలువిని, “రాజా! నాకీదంతయు తెలియును, గృహస్థాశ్రమము నపేక్షించు నాకు నీ పుత్రికయగు సుకన్యనిమ్ము! జరుగుచున్న కార్యముల వరుసలోనే సుకన్యను నాకిచ్చి సుఖముగా నుండుము.” -16. శర్యాతి, ఋషి మాటలు విని మారుమాటాడక సుకన్యనతనికిచ్చివేసెను. అట్లు సుకన్యను చ్యవనునకిచ్చి వివాహము చేసి) తన రాజధానికి పోయి చిరకాలము సుఖముగా నుండెను -17. సుకన్య కూడ పతిని పొంది సంతోషముతో అతనిని ఆరాధించుచుండెను. ఆమె రాజభోగములను

విడిచినారచీరలు గట్టుచు భర్తను సేవించుచుండెను -18. ఇట్లు చాలదినములు గడిచిపోగా ఒక వసంతర్తువు వచ్చిన వేళ, తపస్సుచేత ప్రకాశించెడు సర్వాంగములుగలది, చక్కని రూపగుణములతో నొప్పియున్నది, ఋతు స్నాతయునైన తన భార్యతో చ్యవనుడు అనురాగముతో నిట్లనెను -19.

మూ॥ “ఏహ్యేహి భద్రే! భద్రంతే శయనీయం సమాశ్రయ అపత్యం జనయస్వాద్య కులద్వయ వివర్ధనమ్

ఏవ ముక్తాతు సా కన్యా ప్రాంజలిః పతిమబ్రవీత్ నార్హస్యద్య సుకళ్యాణ సంగమం స్థండిలేఽసమే

మమ ప్రియం కురుష్వాద్య తతో మామాహ్వయస్వచ పితృగే హే యధాతిష్ఠం శయనీయే సుసంస్కృతే

బహుగైరిక వర్ణాద్యైః శ్వేత పీతారుణాకులే వస్త్రాలంకార గంధాద్యైస్తథా త్వమపి తత్కురు

ఆత్మానం వయసోపేతం రూపవన్తం సువర్చసమ్ వస్త్రాలంకార గంధాఢ్యం పశ్యేయం యేన సాదరమ్

సుకన్న్యాయాః వచః శ్రుత్వా చ్యవనః ప్రాహదుర్మనాః నమేఽస్తి విత్తం కల్యాణి! పితు స్తేఽ స్త్రీ యథావనే

సకథం భూషయామ్యద్య సురూపశ్చ కథం వద, ప్రోవాచ సా పతింభూయః ప్రహసంతీ కృతాంజలి: విత్తం దదావైలబిలో రూపం వైరోచనోదదత్

చ్యవనః ప్రాహ భార్యాం తాం న కరిష్యేతపోవ్యయమ్ ఏవ ముక్త్వా తపశ్చోగ్రం తతాప సుచిరం తదా

అథ తత్రాగతౌ వీరా వశ్వినౌ కాలపర్యయాత్ దృష్టవంతౌ సుకన్యంతౌ దీప్త్యాపై దేవతామివ

ఉపగమ్యోచతుస్తాంతౌ “కాత్వం సుందరి! రూపిణీ కిమర్థమిహ ఏకాత్వం తిష్ఠసే కస్తవాశ్రయః ?”

సాతావువాచ తన్వంగీ శర్యాతి దుహితాహ్యహమ్ భర్తాచ చ్యవనో మహ్యం కౌచవాంమే తథోచ్యతామ్

తా ॥ “కల్యాణీ! నీకు శుభమగుగాక! ఇటురమ్మ! సెజ్జనలంకరింపుము. రెండు వంశములను వృద్ధి చేయు సంతానమునుబడయుము” -20. ఆ మాటలు విని సుకన్య అంజలిఘటించి భర్తతోనిట్లనెను. “స్వామీ! ఈ ఎత్తుపల్లముల దర్భశయ్యమీద నేడు సంభోగము కుదురుపడదు -21. మా పుట్టింట ఎట్టి సుందర సుసంస్కృత శయ్య పై నేను పరుండుచుండియుంటినో అట్టి ప్రియమైన శయ్యను సమకూర్చి అప్పుడు నన్నాహ్వానింపుడు -22. సుందరమైన వస్త్రములు, అలంకారములు, గంధ పుష్పాదులు, అనేకములుగా బంగారు వన్నెగలవి. తెల్లనివి, పచ్చనివి, ఎఱ్ఱనివి అయిన రత్నాభరణములు సంపాదింపుడు -23. మీరు కూడ బోవన సౌందర్యశోభితులై, వస్త్రాలంకార గంథాదులతో అలంకరింపబడిన వర్చస్విగా నా వైపు ప్రేమతో చూడుడు” -24. సుకన్య మాటలు వినిన చ్యవనుడు కలతపడిన మనస్సుతో ఇట్లనెను”. కల్యాణీ! నీ తండ్రి కున్నట్లుగా, ఈ వనమందు నివసించు నాకు ధనములేదు. -25. అట్టినేను ఎట్లు అలంకరింపగలను. సుందర రూపునిగా ఎట్లు కాగలనో చెప్పుము?”, ఆమె మఱల అంజలి ఘటించుచునే నవ్వుచు భర్తతోనిట్లనెనే. 'కుబేరుడు ధనమును, బలి, రూపమును మీ ప్రయత్నమున ఇచ్చిరనుకొనుడు” -26. చ్యవనుడు " నేను తపస్సును వ్యయపరుపజాలను”. అని భార్యకు చెప్పి చిరకాలము ఉగ్రమైన తపస్సులో మునిగిపోయెను -27. ఇట్లుండ కాలవశమున నొకనాడు వీరులైన అశ్వినీ కుమారులు అచ్చటి కేతెంచిరి. దేవతవలె ప్రకాశించుచున్న సుకన్యను గాంచిరి -28. ఆమెను సమీపించి “సుందర రూపిణివైన నీవెవరు? ఇచట ఏకాంతముగ నేల యుంటివీ? నీకు ఆశ్రయుడెవడు?” అని వారు ప్రశ్నించిరి -29. ఆమె వారి ప్రశ్నలు విని “ నేను శర్యాతిరాజు కూతురును. చ్యవనుడు నాభర్త. ఇంతకును మీరెవరో చెప్పుడు.” అనెను -30.

మూ!! ఊచతుశ్చాశ్వినౌ దేవావావాం విద్ధి నృపాత్మజే కింకరిష్యసి తేనత్వం జీర్ణేనచ కృశేనచ ఆవయోర్వృణు భర్తారమేక మేవ యమిచ్ఛసి”

సాత్వబ్రవీచ్చ మామైవం వక్తుమర్హౌ దివౌకసౌ భర్తారమనురక్తాంగీ యథాస్వాహా విభావసోః

అశ్వినా వూచతు :

“ఆయాతుచ విశత్వద్య చ్యవనో వైష్ణవీ జలమ్ తతో నౌ మధ్యగం హ్యేకం వృణీష్వాన్యం యమిచ్ఛసి

తావబ్రూతాం సుకన్యాంతు “గత్వాపృచ్ఛ స్వకం పతిమ్ తంచపృష్ట్వా పునశ్చాత్రా గచ్ఛనౌ సంనిధౌపునః

ఆవామత్రైవ తిష్ఠావో యావదాగమనం తవ” సాగత్వా ప్రాహ భర్తార మశ్వినావేవ మూచతుః

రూపవంతంచ భర్తారం కరిష్యావోయమిచ్చసి అధ మధ్యగతం హ్యేకం భర్తృత్వేన వరిష్యసి”

ఏవమస్త్వితి తాంప్రాహ సభార్యం చ్యవనస్త్వరన్ సా తం గృహ్య జగామాశు యత్రతౌ భిషజావుభౌ

సతావువాచ చ్యవనో యథోక్తం భవతోర్వచః కురుతం హ్యశ్వినౌ క్షిప్రం సుకన్యా చేప్సితం వృణోత్

తౌ తం సంగృహ్య గంగాయాం ప్రవిష్టౌ మునినా సహ ముహూర్తాత్తు సముత్తిష్ఠన్రూపతశ్చశ్రియా వృతాః

శోభంతేస్మ మహాబాహో! కముద్భిద్య తపోయుతాః కల్పాదౌ కలశే యద్వత్కంజాక్ష వ్యోమ వేధసః ఉదకాదుత్థితాస్తస్మాత్సర్వేతే సమరూపకాః

తా ॥ “రాజకుమారీ! మేము దేవతలమని తెలిసికొనుము. జీర్ణించి కృశించిపోయియున్న అతనితో నీవెట్లు కాపురము చేయుదువు? మా ఇరువురిలో నీకిష్టమైన ఒకనిని భర్తగా వరింపుము.” అని అశ్వినీ కుమారులు పలికిరి -31. ఆమె ఇట్లనెను. “దేవతలు నాతో నిట్లు పలుకదగునా? స్వాహాదేవి అగ్నిదేవునియందెట్లు బడ్డానురాగయై యుండునో అటులే నేనుకూడ నా భర్తకు అనువ్రతనై యుందును”-32. అశ్వినులిట్లనిరి. “నీ భర్తయగు చ్యవనుడు వచ్చి (మాతో బాటు) ఈ గంగలో ప్రవేశింపనిమ్ము. ఆ పైన మా ముగ్గురిలో నిష్టమైన వానిని వరింపుము -33. పోయి నీ భర్తనడుగుము. అడిగి తిరిగి మావద్దకు రమ్ము -34. నీవు వచ్చువఱకు మేమిచ్చటనే వేచి యుందుము.” వారిమాటననుసరించి ఆమె తన భర్తవద్దకుపోయి అశ్వినులు చెప్పిన ప్రకారమును వివరించెను -35. " నీభర్తను రూపవంతుని చేయుదుము. అప్పుడు నీవు మా ముగ్గురిలో నిష్టమైన వానిని భర్తగా వరింపుము" -36. చ్యవనుడాసక్తుడై “అటులే కానిమ్మనెను. సుకన్య భర్త అంగీకరించిన తక్షణమే అతనిని ఆ దేవ వైద్యులున్న కడకు గొనిపోయెను -37. చ్యవనుడు, వారి సూచనకు అంగీకారము తెలుపుచు, సుకన్య కోరినట్లు సత్వరమే చేయుడని వారితోననేను -38. వారిరువురు చ్యవనుని వెంటనిడుకొని గంగ వద్దకుపోయి అతనితోసహా గంగలో ప్రవేశించిరి. ఒక ముహుర్తకాలముననే వారు సౌందర్య శోభతో ప్రకాశించిరి -39. శతానీకా! నీటి నుండి వెలువడుటతోడనే వారు మువ్వురును. కల్పాదియందు జలరాశి నుండి వెలువడిన విష్ణు వ్యోమ బ్రహ్మలవలె తపోయుక్తులై గోచరించిరి. గంగలో మునిగి లేచుటతోడనే వారు ముగ్గురు సమానమైన రూపముగలవారైరి.-40.

మూ. సుకన్యాతు తతో దృష్ట్వా భర్తారం దేవరూపిణమ్ హర్షేణ మహతా విష్టా నచతం వేద భారత!

సమకాయాః సమవయః సమరూపాః సమశ్రియః వస్త్రాలంకార సదృశాన్ దృష్ట్వాచింతాం గతాచిరమ్

సా చింతయిత్వా సుచిరం వైద్య దేవావువాచహ భీభత్సోపిమయాభర్తా పరిత్యక్తో న కర్హిచిత్

భవద్భిరాత్మ సదృశం కథంత్యక్త్వా వృణే పరమ్ తస్మాత్తమేవ భర్తారం ప్రయచ్ఛధ్వం దివౌకసః

తయా సుబహుమానంతౌ ప్రాంజల్యాప్రార్థితౌ తదా దేవ చిహ్నాని స్వాన్యేవ ధారయంన్తౌ సుపూజితౌ

సుకన్య నిపుణంతౌతు సునిరీక్ష్యచ విహ్వలా న రజో ననిమేషోవై నస్సృశేతే ధరాంపదే

అయంచ సరజా మానో భూమి మాశ్రిత్య తిష్ఠతి నిమేషం చైవ తస్యైవం జ్ఞాత్వావై చ్యవనో వృతః

చ్యవనే వృతే సుకన్యయా పుష్పవృష్టిః పపాతహ దేవదుందుభయశ్చైవ ప్రావాద్యంత అనేకశః

తతస్తు చ్యవనస్తుష్టో దివ్యరూపధరస్తదా ఉవాచ తౌతు సుప్రీత అశ్వినౌకింకరోమివామ్

భార్యాదత్తా కృతం రూపం దేవానామపి దుర్లభమ్ ఉపకారం వరిష్ఠం యో నకరోత్యుపకారిణః

ఏకవింశత్సగచ్ఛేచ్చ నరకాణి క్రమేణవై తస్మాదహం వరిష్ఠం వై కరిష్యేఽ హమమానుషమ్

తా ॥ సుకన్య, దేవరూపము ధరించిన తన భర్తను చూచి మిక్కిలి సంతోషించెను. కాని అతనిని తెలిసికొనలేకపోయెను -41. “ఓ దేవతలారా! నాభర్త వికారస్వరూపుడై యున్నప్పుడు అతనిని విడిచి పెట్టియుండలేదు. ఇప్పుడు మీ చేత సుందరరూపునిగా చేయబడిన అతని విడిచి యన్యునెట్లు వరింపగలను?” ఆమె చింతాక్రాంతయగుచు అశ్వినీ దేవతలతో పలికెను -43. ముగ్గురు ఒకే విధమైన శరీరములతో, సమాన వయస్కులై, ఒకే తీరైన రూపము, తేజము, సమాన వస్త్రాద్యలంకారముతో నొప్పుచున్న వారిని చూచుచు చాలా సేపు చింతలో మునిగియుండెను -42. “అశ్వినీ కుమారులారా! మీరు సుందరునిగా చేసిన నాభర్తను విడిచి పెట్టి ఇతరుని వరింజాలను. కావునా నా భర్తనే నాకు ప్రసాదింపుడు.” అని సుకన్య ప్రార్ధనగా బలికెను -44, ఆమె వారిని పూజ్యభావముతో సమ్మానించుచు అంజలి ఘటించి ప్రార్థింపగానే వారు తమ దేవ చిహ్నములను ధరించిరి -45. సుకన్య వారిని చక్కగా పరీక్షించి ఆశ్చర్యమునందెను. వారు స్వేదమాలిన్యములేక,కనురెప్పలు వేయక, నేల పై పాదము లాన్చక యుండిరి -46. ఆకారణమున “ఇదిగో ఇతడు స్వేదమాలిన్యాదులచే వాడినట్లున్నవాడు. పాదములు భూమిపై మోపియున్నాడు. కనురెప్పలు వేయుచున్నాడు.” అని తన భర్తను గుర్తించి అతనినే వరించెను -47. సుకన్య, చ్యవనుని తన భర్తగా వరించుటతోడనే పుష్పవృష్టి గురిసెను. అనేక విధములుగా దేవదుందుభులు మ్రోగెను -48. దివ్యరూపధరుడైన చ్యవనుడు సంతుష్టుడయ్యెను. మిక్కిలి హర్షముతో అశ్వినులతో, మీకు " నేనేమి ప్రత్యుపకారము చేయవలెను? -49. భార్యనిచ్చితిరి, దేవతలకు కూడ దుర్లభమైన రూపమునిచ్చితిరి. ఉపకారము చేసిన వారికి ఎవడు శ్రేష్టమైన ప్రత్యుపకారము చేయడో -50. వాడు క్రమముగా నిరువదియొక్క నరకములను పొందును. అందువలన మీకు నేను ఏదేని ఒక మహోపకారము చేసెదను -51.

మూ॥ ఉపకారం భవద్భ్యాంతు ప్రీతఃకుర్యాంసునిశ్చితమ్ యజ్ఞభాగఫలం దద్యాం యద్దేవేష్వపిదుర్లభమ్

ఏవ ముక్త్వాతు దేవేశౌ విససర్జ మహామునిః ఆజగామాశ్రమం పుణ్యం సహభార్యోముదాన్వితః

అధశుశ్రావ శర్యాతిశ్చవనం దేవరూపిణమ్ జగామచ మహాతేజాద్రష్టుం మునివరం వశీ

తందృష్వా ప్రణిపత్యాదౌ ప్రతిపూజయధార్హతః సుకన్యాంతు తతో దృష్ట్యా ప్రణిపత్యాభినంద్యచ

సస్వజే మూర్థ్ని ఆఘ్రాయ తతోత్సంగం సమానయత్ సా తస్యాః సస్వజే ప్రేమ్ణా ఆనందాశ్రుపరిప్లుతా సంస్థాప్యతాం ముదాయుక్తో నృపతిః సహభార్యయా

భూయోబ్రవీత్సుసంతుష్టం చ్యవనస్తంనరాధిపమ్ సంభారం కురు యజ్ఞార్థం యాజయిష్యేనరాధిప

ఏవముక్తః సనృపతిః ప్రణిపత్య మహామునిమ్ జగామ స్వపురం హృష్ఠో యజ్ఞార్థం యత్నమాచరత్

సప్రెష్యాన్ప్రేష్న్ క్షిప్రం యజ్ఞార్థే ద్రవ్యమాహరత్ మంత్రి పురోహితాచార్యానా నయామాస సత్వరమ్

సమానీతేషు సర్వేషు తేషు ద్రవ్యేషు భారత! ఆజగామ విశుద్ధాత్మాచ్యవనః సహభార్యయా

తా ॥ మీ కొఱకు నేను సునిశ్చితమైన ఉపకారము చేయవలెను. దేవతలకు దుర్లభమైన యజ్ఞభాగ ఫలమును మికిచ్చెదను” -52. ఇట్లు చెప్పి చ్యవన ముని దేవతలను వీడ్కొనెను. సంతోషముతో భార్యతో కూడి తన పుణ్యాశ్రమమునకు వచ్చెను -53. తన అల్లుడగు చ్యవనుడు దేవరూపుడుగ సుందరుడైన వార్త శర్యాతి రాజు వినెను. విని అతనిని చూచుటకు మహా తేజుడైన శర్యాతి (సభార్యుడై) చ్యవనాశ్రమమునకు వచ్చెను -54. చ్యవనున కభివాదనము చేసి యథోచితముగా అతనిని పూజించెను. ఆపిదప కుమార్తెయగు సుకన్యను చూచి కుశల ప్రశ్నాదులతో పలుకరించి ఆమెను అభినందించెను -55. శిరస్సు మూర్కొని అక్కున చేర్చికొనెను.సుకన్య తల్లి కూడ ఆమెను ప్రేమతో కౌగిలించుకొనుచు ఆనంద బాష్పములురాల్చెను. శర్యాతి భార్యతో సహా మిక్కిలి సంతోషించుచు సుకన్యను తమ దగ్గర కూర్చుండబెట్టుకొనిరీ -56. పిమ్మట చ్యవనుడు సంతుష్టుడైన శర్యాతిని గాంచి ఇట్లనెను. “రాజా! నేను మీతో ఒక యజ్ఞము చేయింపదలచితిని. దాని కొఱకు మీరు సామగ్రినంతయును సమకూర్పుడు” -57. ఈ మాట విని రాజు (అంగీకారముగా) చ్యవనమునికి నమస్కరించి, యజ్ఞసంభారములు సమకూర్చుటకొఱకుగాను సంతోషముతో రాజధానికి ప్రయాణమైపోయెను -58. వెంటనే యజ్ఞద్రవ్యములను సేకరించి తెచ్చుటకై ఆయా ప్రదేశములకు మనుష్యులను బం పెను, యజ్ఞము నిర్విఘ్న పరిసమాప్తినొందుటకై సమాలోచనలు జరుపుటకు మంత్రులను, పురోహితులను, గురువులను సమావేశపరచేను -59. ఆయావస్తు సంభారములన్నియు సమకూడినంతనే విశుద్ధాత్ముడైన చ్యవనుడు సుకన్యతో గూడి అచటికేతెంచెను -60.

మూ. సంపూజితశ్చ శుశ్రావ మహాంతం త్యాగమౌజసమ్ అన్యైశ్చ బహుభిః సార్థమత్ర్యంగిరస భార్గవైః

ప్రవర్తితే మహయజ్ఞే యజమానే నృపోత్తమే ఋత్విక్త్వ కర్మనిరతే హూయమానే హుతాశనే ఆహుతాః స్వాగతాః సర్వే భాగార్థం త్రిదివాలయా:

యజ్ఞభాగే ప్రవృత్తేతు శాస్త్రోక్తేన విధానతః ఆగతా వశ్వినౌ తత్ర ఆహూతౌ చ్యవన్నతు

ఆహ్వానే క్రియమాణేతు అశ్విభ్యాంతు తదానృప! ప్రోవాచేంద్రేఽధ చ్యవనం “నైతె భాగాన్వితౌ కురు! దేవానాం భిషజావేతౌ నభాగార్హౌన దైవతౌ”

చ్యవన స్వీంద్రమాహేదం “దేవౌ హ్యేతావుభావపి మమోపకారిణావేతౌ దద్మిభాగం న సంశయః

తతోహ్యువాచ సక్రోధః సశక్రశ్చ్యవనంరుషా విప్రర్షే ప్రహరిష్యామి యదిభాగం ప్రయచ్ఛసి”

ఏవముక్తస్తు విప్రర్షిర్నచో వాచాపి కించన భాగౌ దదౌచ సోఽశ్విభ్యాం స్రువ ముద్యమ్యమంత్రత :

అధ ఉద్యమ్యభిదురం మోక్తుకామోదివస్పతిః స్తంభితశ్చ్యవనేనాథ సవజ్రః సనరాధిప!

స స్తంభయిత్వాత్వింద్రంతు బాగం దత్వాశ్వినోర్వశీ సమాపయామాస తదా యజ్ఞకర్మయధార్ధవత్

కంజజోఽ థాజగామాశు ఆహచ చ్యవనం తదా “ఉత్తంభ్యతామయం లేఖో భాగశ్చాస్త్యశ్వినోరిహ”

తా ॥ అతడు; అత్రి, అంగిరసుడు, భార్గవుడు మొదలగు పెక్కురు మహర్పులతో సహా పూజింపబడగానే, ఉత్సాహవంతమై అతిశయముతోగూడిన యజ్ఞధ్వానము (హవిర్షాన మంత్రములు) వినెను-61. శర్యాతి మహారాజు యజమానుడుగా నిర్వహింపబడు ఆమహాయజ్ఞమునందు ఋత్విక్కులు తమతమ కర్మలలో నిమగ్నులై అగ్నిహోత్రమునందు స్వాహాకారపూర్వకముగ వ్రేల్చుచుండగా దేవతలందఱును తమతమ యజ్ఞభాగములను స్వీకరించుటకై అచటికేతెంచిరి-62. శాస్త్రోక్త విధానము చేత యజ్ఞభాగములు ప్రవృత్తములగుచుండగా చ్యవన మహర్షిచేత ఆహ్వానింపబడి అశ్వినీ కుమారులు కూడ అచటికి వచ్చిరి-63. అశ్వినులు ఆహ్వానింపబడగానే చ్యవనునితో ఇంద్రుడిట్లనెను. “ఋషివర్యా! వీరిని యజ్ఞభాగాన్వితులనుగా చేయకుము. వీరు దేవవైద్యులేకాని దేవతలు కారు. అందుచే భాగమునకరులుకారు"-64. చ్యవనుడు ఇంద్రునికిట్లు సమాధానము చెప్పెను. "వీరిరువురును దేవతలే, నాకు వీరు ఉపకారము చేసినవారు, వీరికి నిస్సంశముగ యజ్ఞభాగమునిత్తును”-65. అప్పుడింద్రుడు కోపముతో చ్యవనునితో నిట్లనెను. "బ్రహ్మర్షీ! యజ్ఞభాగము వారలకిచ్చితివేని వజ్రాయుధముతో నొక్క వేటు వేసెదను"-66. ఈ రోష వాక్యము విని చ్యవనుడు ఏమియు పలుకక మౌనముగనుండెను. స్రువము లేవనెత్తి సమంత్రకముగ నశ్విను లిరువురుకును హవిర్భాగముల నిచ్చేను-67. అప్పుడింద్రుడు వజ్రాయుధము నెత్తి వదలుటకుద్యమించెను, కాని వజ్రాయుధముతో కూడ, ఎత్తినవాడెత్తినట్లుగనే, చ్యవనుని చేత ఇంద్రుడు, స్తంభింపజేయబడెను-68. వశియైన చ్యవనుడిట్లు ఇంద్రుని స్తంభింపజేసి, అశ్వినులకు భాగములనిచ్చి యజ్ఞకర్మలను ఫలవంతముగా సమాప్తిచే సెను-69. వెంటనే బ్రహ్మదేవుడచటికేతెంచి చ్యవనునితో నిట్లునుడివెను. “ఇక నుండి అశ్వినులకు యజ్ఞభాగము ఉండును. ఈ ఇంధ్ర స్తంభన చిత్రమును ఉపసంహరింపుము"-70.

మూ.  తథేంద్రస్తమువాచేదం చ్యవనం ప్రీతమానసః “జానామి శక్తిం తపసశ్చ్యవనేహ తవోత్తమామ్

ఖ్యాపనార్థం హి తపసస్తవ ఏ తత్కృతం మయా అద్యప్రభృతి భాగోస్తు దేవత్వంచాశ్వినో స్తథా

యస్త్విమాం తపసః ఖ్యాతిం త్వదీయాంవై పఠిష్యతి శృణుయాద్వాపి శ్రద్ధాత్మా తస్యపుణ్యఫలంశృణు

విరోచన సదోగత్వా గత్వాపుష్ప సదస్తధా కాలేథవామదేవస్య ముంజకేశ సదస్తధా యౌవన యుక్తః స క్రీడంస్తిష్ఠతీతి నసంశయ”

ఏవముక్త్వాజగామాశు దేవఃస్వభవనం వశీ చ్యవనోపి సర్యోపై శర్యాతిశ్చాశ్రమం గత:

అధాపశ్యద్విమానాభం భవనం దేవ నిర్మితమ్ శయ్యాసన వరైర్జుష్టం సర్వకామ సమృద్ధిమత్

ఉద్యాన వాపిభిర్జుష్టం దేవేంద్రేణ సమాహృతమ్ గో ఖండ సన్నిభం రేజే గృహం తద్భువి దుర్లభమ్

సుభూషణాని దివ్యాని రత్నవంతి మహాంతీచ అరజాంసిచ వస్త్రాణి దివ్యప్రావరణానిచ

దృష్ట్వా తత్సర్వమఖిలం సహపత్న్యామహామునిః ముదం పరమికాం లేభే శక్రంచ ప్రశశంసహ

ఏవమిష్టా తిథిరియం ద్వితీయా అశ్వినో నృప! దేవత్వం యజ్ఞభాగంచ సంప్రాప్తా విహ భారత !

తా ॥ అప్పుడీంద్రుడు హృష్టమనస్కుడై చ్యవనునితో నిట్లనెను. “చ్యవన మహర్షీ! ఉత్తమమైన నీ తపశ్శక్తిని నేనెఱఁగుదును-71. నీ ఈ తపశ్శక్తిని ప్రసిద్దము చేయుటకే నేనిదంతయు చేసితిని. నేటినుండి మొదలుకొని అశ్వినీ కుమారులకు దేవత్వముతో బాటు యజ్ఞభాగముకూడ ఉండుగాక.72 ఏ శుద్దాత్ముడు ఈ నీ తపఃప్రఖ్యాతిని గుఱించి చదువునో లేక వినునో వాని పుణ్యఫలమును వినుము-73. సూర్యలోకమునకు వెడలి అటునుండి చంద్రలోకమునకుఁబోయి, ఆపై శివలోకము, అటుపిమ్మట విష్ణులోకము చేరి నిత్యయౌవనుడై క్రీడించుచుండును. ఇందు సంశయము లేదు-74”. ఇట్లు చెప్పి ఇంద్రుడు సత్వరమే స్వర్గమునకు వెడలిపోయేను. చ్యవనుడు భార్యతోడను శర్యాతి తోడను గూడి ఆశ్రమమునకు పోయెను-75. ఆశ్చర్యకరముగా నచట దేవనిర్మితమైన చక్రవర్తి సౌధము వంటి సౌధమును చూచేను. ఆభవన రాజము శ్రేష్టములైన శయ్యాసనములతో సకలవాంఛసిద్ధిదములైన సర్వవస్తువులతో నిండియుండెను-76. ఉద్యాన వనములు, నడబావులు దేవేంద్రునిచే సమకూర్పబడియుండెను. ఆ గృహము భూమియందలి స్వర్గము వలె ప్రకాశించుచుండెను-77. వివిధ మణి మాణిక్యఖచితములైన దివ్యాభరణములు, విలువైన శుద్ధ వస్త్రములు, దివ్యములైన ఉత్తరీయములు, (మేలిముసుగులు) అట విలసిల్లుచెండెను-78. చ్యవనమహర్షి భార్యతో సహా వాని నన్నింటిని సాకల్యముగా చూచి పరమానందభరితుడై ఇంద్రుని మెచ్చుకొనెను-79. ఈ విధముగా విదియ అశ్వినుల కిష్టమైన తిథి. ఈ దినముననే వారు దేవత్వము పొంది యజ్ఞభాగమునకరులైరి-80.

మూ. ఉపోష్యా విధినా యేన తం శృణుష్వనరాధిప! రూపం సురూపం యో వాంఛేద్ద్వితీయాయాం నరాధిప!

కార్తికే శుక్ల పక్షస్య ద్వితీయాయాం నరాధిప! పుష్పాహారో వర్షమేకం భవేత్సనియతాత్మవాన్

కాలప్రాప్తానీ యాని స్యుర్హవిష్యం కుసుమానితు భుంజీయాత్తాని దత్త్వాతు బ్రాహ్మణేభ్యోనరాధిప!

సౌవర్ణ రౌప్య పుష్పాణి అధవాజలజానిచ ప్రతాంతే తస్య సంతుష్టా దేవౌ త్రిభువనేఽశ్వినౌ

దదతు: కామగం దివ్యం విమానమతి తేజసమ్ సుచిరం దివి నారీభిర్లోకేఽసౌ రమతేశ్వి నోః

ఇహచాగత్య కల్పాంతే జాతో విప్రః పురస్కృత : వేద వేదాంగ విదుషః సప్త జన్మాంతరాణ్యసౌ

జాతో జాతో భవేద్విద్వాంన్భ్రహ్మణోసౌకృతేయుగే దాతా యజ్ఞపతిర్వాగ్మీ ఆధివ్యాధివివర్జిత :

పుత్రపౌత్రైః పరివృతః సహపత్న్యాఽవసచ్చిరమ్ మధ్యదేశే సునగరే ధర్మిష్ఠో రాజ్యభాగ్భవేత్

ఇత్యేషా కధితా తుభ్యం ద్వితీయా పుష్పసంజ్ఞితా ఫల సంజ్ఞా తథాన్యాస్యాత్సుతేవై ముంజకేశినీ

సుష్ఠు పుణ్యపాపహరా విష్టరశ్రవసః ప్రియా అశూన్యశయనాలోకే ప్రఖ్యాతా కురునందన!

తాము పోష్యనరోరాజన్! శ్రద్ధాభక్తి సమన్వితః బుద్ధిం వృద్ధిం శ్రియం వాథ భార్యయా సహమోదతే

ఇతిశ్రీ భవిష్యేమహాపురాణే శతార్థసాహస్ర్యాం సంహితాయాం బ్రహ్మేపర్వణి ద్వితీయాకల్పే శర్యాత్యాఖ్యానే పుష్పద్వితీయావర్ణనం నామ ఏకోన వింఽశోధ్యాయః

తా ॥  రాజా! ద్వితీయనాడు పాటింపవలసి ఉపవాసాది వ్రత విధానమును గూర్చి వినుము. సుందరమైన రూపమును గోరువాడీ వ్రతమాచరింపవలేను-81. కార్తీక శుక్లపక్ష ద్వితీయనాడు మొదలుకొని నియమవంతుడై ఒక సంవత్సరము వఱకు పుష్పములను మాత్రమే ఆహారముగా స్వీకరింపుచుండవలెను-82. ఆయా ఋతువులయందు లభించు ఖాద్య పుష్పములను బ్రాహ్మణుల కిచ్చి తాను భుజింపవలెను-83. ఆవ్రత సమాప్తియందు బంగారము లేక వెండి పూలు లేక తామర పూలు బ్రాహ్మణులకు దానమీయవలెను. దానితో నాశ్వినులు తృప్తినందుదురు-84. ఇష్టమైన చోటికి ప్రయాణము చేయగల మిక్కిలి తేజోవంతమైన దివ్యవిమానము నిచ్చెదరు. చిరకాలము స్వర్గమున స్త్రీలతో రమించుచుండవచ్చును-85. వ్రతమాచరించిన వాడీట్లు సర్వభోగము లనుభవించి కల్పాంతమున ఇహలోకమున పూజ్యుడగు బ్రాహ్మణుడుగా జన్మించును. ఏడు జన్మములలోను ఇతడు వేద వేదాంగములలో విద్వాంసుడైయుండును-86. ప్రతి జన్మలోను విద్వాంసుడుగనుండుటయే కాక కృతయుగమునందు గొప్పదాతయై, యజ్ఞములు చేయువాడై చక్కని వక్తయై, మనోవ్యధలు శారీరక రుగ్మతలులేనివాడై-87. పుత్ర పౌత్రులతో గూడి, భార్యతో కలిసి చిరంజీవియై వర్ధిల్లును. లేక మధ్యదేశమునందలి ఒక మహానగరము రాజధానిగ గొప్ప రాజ్యమునుకు రాజగును-88. ఇట్లు పుష్పద్వితీయగా పేరొందిన వ్రతమును నీకు తెలియజెప్పితిని, ఫలద్వితీయ మఱియొకటి కలదు. అది విష్ణువుపవళించు దినమున నారంభమగును-89. ఈ వ్రతము మిక్కిలి పుణ్యప్రదమైనది. పాపసంహారకమైనది. విష్ణువునకు ప్రియమైనది. కురునందనా! 'అశూన్యశయన' అను పేరుతో కూడ ఈ వ్రతము లోకమున ప్రఖ్యాతినందినది-90. శ్రద్ధాభక్తుల పూర్వకముగ ఈ దినమున ఉపవసించిన మానవుడు సర్వవస్తు సమృద్ధిగల ఐశ్వర్యము నంది భార్యతో సుఖ జీవనము చేయును-91.

శతార్థ సాహస్ర సంహిత యగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున ద్వితీయా కల్పమునందు శర్యాత్యాఖ్యానము, పుష్పద్వితీయా వర్ణనమను పందొమ్మిదవ అధ్యాయము.