18. ప్రతి పత్కల్ప సమాప్తి వర్ణనము

సుమంతురువాచ :

మూ.  పౌర్ణమాస్యుపవాసంతు కృత్వాభక్త్యా నరాధిప! అనేన విధినాయస్తు విరించిం పూజయేన్నరః

ప్రతిపద్యాం మహాబాహో! స గచ్ఛేద్ర్బహ్మణః పదమ్ ఋగ్భిర్విశేషతో దేవీ విరించేర్వాస్తు దేవతాః

కార్తికేమాసి దేవస్య రథయాత్రా ప్రకీర్తితా యాంకృత్వా మానవో భక్త్యా యాతి బ్రహ్మసలోకతామ్

కార్తికేమాసి రాజేంద్ర! పౌర్ణమాస్యాం చతుర్మఖమ్ మార్గేణ చర్మణా సార్థం సావిత్ర్యైచ పరంతప!

భ్రమయేన్నగరం సర్వం నానావాద్యైః! సమన్వితమ్ స్థాపయేద్ర్భామయిత్వాతు సలోకం నగరం నృప!

బ్రాహ్మణం భోజయిత్వాగ్రే శాండిలేయం ప్రపూజ్యచ ఆరోపయేద్రదేథేవం పుణ్యవాదిత్రనిస్వనై:

రథాగ్రేశాండిలీ పుత్రం పూజయిత్వావిధానతః బ్రాహ్మణాన్వాచయిత్వాచ కృత్వా పుణ్యాహమంగలమ్

దేవమారోపయిత్వాతు రధేకుర్యాత్ప్రజాగరమ్ నానావిధైః ప్రేక్షణకైర్ర్బహ్మఘోషైశ్చ పుష్కలైః

కృత్వాప్రజాగరం హ్యేవం ప్రభాతే బ్రాహ్మణం నృప! భోజయిత్వా యథాశక్త్యా భక్ష్యభోజ్యైరనేకశః

పూజయిత్వా జనంవీర ! వజ్రేణ విధివన్నృప! బీజేనచ మహాబాహో! పయసా పాయసేవచ

బ్రాహ్మణాన్వాచయిత్వాచ చ్ఛాందేన విధినా నృప! కృత్వాపుణ్యాహ శబ్దంచ రథంచ భ్రమయేత్పురే

తా ॥ సుమంతుముని ఇట్లనెను. “పూర్ణిమనాడు ఉపవాసము చేసి పాడ్యమినాడు భక్తితో ఈ విథానమున బ్రహ్మను పూజించు మానవుడు -1. బ్రహ్మపదమును పొందును. వాస్తు దేవతలను ముఖ్యముగా బ్రహ్మమంత్రములతో పూజింపవలేను -2. కార్తిక మాసమునందు బ్రహ్మదేవుని రథయాత్ర చెప్పబడినది. అట్టి రథయాత్రను భక్తితో నిర్వహించిన మానవుడు బ్రహ్మలోకమును పొందును -3. రాజేందొ! కార్తిక పూర్ణిమనాడు బ్రహ్మదేవుని సావిత్రితో కూడ మృగచర్మము నందాసీనుని చేసి -4. వివిధములైన వాద్యములతో నగరమునందూరేగించి తిరిగి యథాస్థానము చేర్పవలెను -5. మొదట శాండిల్యసగోత్రజుడైన బ్రాహ్మణుని భోజనాద్యుపచారములచేత పూజించి, మంగళవాద్యముల ధ్వనులతో దేవుని రథమునందధిరోహింపజేయవలెను -6. శాండిలీపుత్రుని రథము ముందు సవిధానముగా పూజించి, బ్రాహ్మణులచేత స్వస్తి పుణ్యాహవాచనము చేయించి -7. దేవుని రథమునందారోపణ చేసి ఆ రాత్రి జాగరణము చేయవలెను. వివిధములైన నృత్యాది ప్రదర్శనములచేత, విరివియైన వేదఘోషల చేత -8. ఇట్లు జాగరణ చేసి ఉదయముననే యథాశక్తి బ్రాహ్మణునకు అనేక విధములైన భక్ష్య భోజ్యములతో కూడిన భోజనము పెట్టి -9. అతనిని వజ్రపురవతోను, పాలు పాయసముతోడను యథావిధిగ సత్కరించి -10. బ్రాహ్మణులచేత వైదికవిధితో స్వస్తివాచనము, పుణ్యాహవాచనము చేయించి నగరమునందు రథమును త్రిప్పవలెను-11.

మూ. చతుర్వేద వీధేర్వి ప్రేర్ప్రామయే ద్భ్రహ్మణోరథమ్ బహ్వృచాచాథర్వణోచ్చారేశ్చందోగాధర్వుబీస్తథా

భ్రామయేద్దేవ దేవస్య సురజ్యేష్ఠస్యతం రథమ్ ప్రదక్షిణం పురం సర్వం మార్గేణ సుసమేనతు

నవోడవ్యోరథో వీర! శూద్రేణ శుభమిచ్ఛతా నారు హేత రధం ప్రాజ్ఞో ముక్వైకం భోజకం నృప!

బ్రహ్మణో దక్షిణే పార్శ్వే సావిత్రీం స్థాపయేన్నృప! భోజకో వామపార్శ్వేతు పురతః కంజజంన్య సేత్

ఏవం తూర్యనినాదైస్తు శంఖశబ్దైశ్చ పుష్కలైః భ్రామయిత్వారథం రాజన్పురం సర్వం ప్రదక్షిణమ్ స్వస్థానే స్థాపయేద్భూయః కృత్వా నీరాజనం బుధ:

య ఏవం కురుతే యాత్రాం భక్త్యాయశ్చాపి పశ్యతి రథం చాకర్షతే యస్తు స గచ్ఛేద్ర్బహ్మణః పదమ్

కార్తికే మాస్యమావాస్యాం యస్తు దీప ప్రదీపనమ్ శాలాయాం బ్రహ్మణః కుర్యాత్సగచ్ఛేద్ర్బహ్మణః పదమ్

ప్రతిపది బ్రాహ్మణాంశ్చాపి గుడ మిశ్రై ప్రదీపకై: వాసోభిరహతైశ్చాపి స గచ్ఛేద్రహ్మణః పదమ్

గంధై పుష్పైర్నవైర్వస్త్రైరాత్మానం పూజయేచ్చయః తస్యాం ప్రతిపదాయాంతు సగచ్ఛేద్ర్బహ్మణః పదమ్

తా॥ బ్రహ్మరథమును నాలుగువేదములు తెలిసిన బ్రాహ్మణులచేత లాగింపవలయును. అనగా రథమును లాగువారు ఋగ్యజుస్సామాధర్వణ వేదములను పఠించుచుండవలెను -12. ఆ సురశ్రేష్ఠుడైన దేవదేవునిరథము సమతలముగానున్న మార్గము ద్వారా పురమునంతయును ప్రదక్షిణముగా త్రిప్పవలెను -13. రాజా! శుభమును కోరువాడు శూద్రుని చేత మాత్రము రథమును లాగింపకూడదు. బుద్దిమంతుడు, భోజకుడైన బ్రాహ్మణుని విడిచి రథము నధిరోహింపజేయరాదు -14. బ్రహ్మదేవుని కుడి ప్రక్క సావిత్రిని, ఎడమ భాగమున భోజకుని స్థాపించి ముందుభాగమున బ్రహ్మను స్థాపన చేయవలెను -15. ఈ విధముగా వివిధ వాద్యధ్వనులతోను, శంఖారావములతోను రథమును పురమంతయు త్రిప్పవలెను. ఆ పిదప-రథయాత్రానంతరము నీరాజనమిచ్చి దేవుని స్వస్థానమున నిలుపవలేను -16. ఇట్లు 'రథయాత్ర' చేసిన వాడును, భక్తితో చూచినవాడును, రథము లాగిన వాడును బ్రహ్మలోకమునొందును -17. బ్రహ్మదేవుని మందిరమున కార్తికమాస అమావాస్యనాడు దీపములను వెలిగించినవాడు బ్రహ్మపదమును పొందును -18. పాడ్యమినాడు బ్రాహ్మణులకు గుడమిశ్రితములగు దీపములను, సదశములైన నూతన (అంచులు గల' శ్వేత వస్త్రములను సమర్పించి పూజించువాడు బ్రహ్మపదమును పొందును -19. ఆ పాడ్యమినాడే నూతన వస్త్రములతో, గంథ పుష్పాదులతో తనను తాను అలంకరించుకొనువాడు బ్రహ్మపదమును పొందును-20.

మూ. మహాపుణ్యాతిథిరియం బలి రాజ్యప్రవర్తినీ బ్రాహ్మణః సుప్రియా నిత్యం బాలేయాపరికీర్తితా

బ్రాహ్మణాన్పూజయిత్వాస్యామాత్మానంచ విశేషతః సయాతి పరమం స్థానం విష్ణోరమిత తేజసః

చైత్రే మాసి మహాబాహో! పుణ్యప్రతిపదాపరా తస్యాం యః శ్వపచం స్పృష్ట్వాస్నానంకుర్యాన్నరోత్తమ !

నతస్య దురితం కించిన్నాధయో వ్యాధయోనృప! భవంతి కురుశార్దూల ! తస్మాత్ స్నానం ప్రవర్తయేత్!

దివ్యం నీరాజనం తద్థి సర్వరోగ వినాశనమ్ గో మహిష్యాది యత్కించిత్తత్సర్వం భూషయేన్నృప!

తైల శస్రాదిభిర్వ(సైస్తోరణాధస్తతోనయేత్ బ్రాహ్మణానాం తథాభోజ్యం కుర్యాత్కురుకులోద్వహ!

త్రిస్రో హ్యేతాః పరాఃప్రోక్తాస్తిథయః కురునందన! కార్తికేశ్వయుజేమాసి చైత్రే మాసేచ భారత!

స్నానం దానం శతగుణం కార్తికేయా తిథిర్నృప! బలిరాజ్యాప్తి సుఖదాపాంశులా శుభనాశినీ

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్ఘ సాహస్ర్యం సంహితాయాం బ్రాహ్మే పర్వణి ప్రతిపత్కల్ప సమాప్తి వర్ణనం నామాష్టాదశోఽధ్యాయ:

తా ॥ పాడ్యమి తిథి మహా పుణ్యప్రదమైనది. బలిచక్రవర్తి రాజ్యము పొందిన దినము. బ్రహ్మకు ప్రీతిపాత్రమైనది. నిత్యమును బాలగా కీర్తింపబడునది -21. ఈ తిథియందు బ్రాహ్మణులను, విశేషించి తనను తాను పూజించుకొనువాడు అమిత తేజోవంతుడైన విష్ణుదేవుని స్థానమగు వైకుంఠమునకు పోవును -22. చైత్రమాసమునందలి ప్రతిపదనాడు చండాలుని స్పృశించినను, స్నానమాత్రమున -23. ఏ దోషమంటకుండ పవిత్రత చేకూరును. మనోవ్యాథులు కాని శరీర రుగ్మతలు కాని బాధింపవు. అందుచే చైత్ర ప్రతి పద మిక్కిలి శ్రేష్టమైనది. ఆనాడు స్నానము తప్పక చేయవలెను -24. అదియే సర్వరోగ వినాశకరమైన దివ్యనీరాజనము. ఆవులు, గేదేలు మొదలగునవి ఏవైన ఉన్నచో వానిని ఆదినమున చక్కగా అలంకరింపవలెను -25. నూనె, ఆయుధములు, వస్త్రములు మొదలగు వానితో అలంకరించి వానీని తోరణముల క్రిందికి చేర్పవలేను. ఆపై బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను -26. కార్తీక, ఆశ్వయజ, చైత్రమాసములందలి ఈ మూడు తిథులు శ్రేష్ఠములైనవిగా చెప్పబడినవి -27. కార్తిక పాడ్యమినాడు స్నానము దానము నూరురెట్లు ఎక్కువ పుణ్యప్రదము. ఈ తిథి బలిచక్రవర్తి రాజ్యము పొందిన దినము. సుఖమునిచ్చునది. పవిత్రమైనది. అశుభమును నశింపజేయునది -28.

శతార్థసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున ప్రతిపత్కల్ప సమాప్తివర్ణనమను పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.