భవిష్య మహా పురాణము
4. భవిష్య మహా పురాణము - బ్రహ్మపర్వము
సుమంతురువాచ :
కేశాంతః షోడశ వర్షే బ్రాహ్మణస్య విధీయతే రాజన్య బంధోర్ద్వావింశే వైశ్యస్య త్యధికే తతః
అమంత్రికా సదాకార్యా స్త్రీణాం చూడా మహీపతే సంస్కార హేతోః కాయన్య యధాకాలం విభాగశః
వైవాహికో విధిః స్త్రీణాం సంస్కారో నైగమః స్మృతః నివ సేద్వా గురోర్వాపీ గృహేవాగ్ని పరిక్రియా
ఏషతే కథతో రాజన్నౌపనాయనికో విధిః ద్విజాతీనాం మహాబాహో ఉత్పత్తిర్వ్యంజకః పరః
కర్మయోగ మిదానీంతే కథయామి మహాబల! ఉపనీయ గురుఃశిష్యం ప్రథమం శౌచమాదిశేత్
అచార మగ్ని కార్యంచ సంధ్యో పాసన మేవచ అధ్యాపయేత్తు సచ్ఛిష్యాన్సదా చాంత ఉదఙ్ముఖః
బ్రహ్మాంజలి కరో నిత్యమధ్యాహ్యా విజితేంద్రియః లఘు వాసాస్తథైకాగ్రః సుమనా సుప్రతిష్ఠితః
బ్రహ్మారంభేఽవ సానేచ పాదౌ పూజ్యౌ గురోః సదా సంహత్య హస్తావధ్యేయం సహి బ్రహ్మాంజలిః స్మృతః
వ్యత్యస్త పాణినా కార్యముప సంగ్రహణం గురోః సవ్యేన సవ్యః స్ప్రష్టవ్యో దక్షిణేనతు దక్షిణః
తా ॥ సుమంతుముని యిట్లనెను. “రాజా! కేశాంత (సమావర్తన) సంస్కారము బ్రాహ్మణునకు పదునారవ సంవత్సరమున, క్షత్రియునకు ఇరువది రెండవ వత్సరమున, వైశ్యునకు ఇరువది యైదవ సంవత్సరమునను విధింపబడుచున్నది. స్త్రీలకీ సంస్కారమును అమంత్రకముగా చేయవలెను. ఈ చూడా కర్మ శరీర సంస్కారము కొఱకు ఆయా వర్ణముల వారికి ఆయా వయస్సులలో చేయవలెను. స్త్రీలకు వివాహమే ముఖ్యమైన వైదిక సంస్కారము. కేశాంత సంస్కారము పిదప శిష్యుడు, గురు గృహమున నుండుటయో లేక స్వగృహమునకు వచ్చి అగ్నిహోత్ర గ్రహణము చేసి యుండుటయో చేయవలెను. రాజా ! ఇంత వఱకు నీకు ఉపనయన విధి గుఱించి చెప్పితిని. బ్రాహ్మణుల పుట్టుక శ్రేష్ఠత్వ వ్యంజక మైనది. ఇక ఇప్పుడు కర్మయోగమును గుఱించి చెప్పెదను. గురువు, శిష్యునకు ఉపనయనము చేసి మొదట అతనికి శుచిత్వమును గూర్చి ఉపదేశింపవలెను. ఉదఙ్ముఖుడై ఆచమించి సచ్ఛిష్యులకు ఆచారమును, అగ్నికార్యమును, సంధ్యోపాసమును బోధింపుచుండవలెను. శిష్యుడైనవాడు. జితేంద్రియుడై, ఏకాగ్రచిత్తుడై, స్వచ్ఛమైన మనస్సుగలవాడై, తేలికపాటి వస్త్రములను ధరించినవాడై, అధ్యయనమునందు బద్ధబుద్ధియై విద్యాభ్యాసకాలమున బ్రహ్మాంజలి ఘటించి యుండవలెను. గరువు యెడ హస్త ద్వయమును ముకుళించి యుంచుటయే బ్రహ్మాంజలి యనబడును. వేదాధ్యయన ప్రారంభ పరిసమాప్తులయందు ఎప్పుడును గురుపాదములను పూజించుచుండవలెను . వ్యత్యస్తమైన చేతులతో గురుపాదములకు నమస్కరింపవలెను. అనగా కుడిచేతితో కుడి పాదమును, ఎడమచేతితో ఎడమపాదమును స్పృశించి నమస్కరింపవలెను.
అధ్యేష్య మాణం తు గురుర్నిత్యకాల మతం ప్రీతః అధీష్వ భోఇతి బ్రూయా ద్వారా మోస్త్వితివారయేత్
బ్రహ్మణః ప్రణవం కుర్యాదాదావంతేచ సర్వదా స్రవత్యనోంకృతం పూర్వం పరస్తాచ్చ విశీర్యతే.
శ్రూయతాం చాపి రాజేంద్ర యథోంకారం ద్విజోర్హతి ప్రాక్కూలాన్పర్యుపాసీనః పవిత్రై శ్చైవ పావితః
ప్రాణాయామై స్త్రిభిః పూతస్తతస్త్వోంకార మర్హతి ఓంకార లక్షణం చాపి శ్రుణుష్వ కురునందన!
అకారం చాప్యుకారంచ మకారంచ ప్రజాపతిః వేదత్రయాత్తు నిర్గృహ్య భూర్భువస్వరితీతిచ.
త్రిభ్యఏవతు వేదేభ్యః పాదం పాదమదూదుహత్ తదిత్యృచోఽ స్యాః సావిత్ర్యైః వరమేష్ఠి ప్రజాపతిః
ఏతదక్షర మేతాంచ జపన్వ్యాహృతిపూర్వికామ్ సంథ్యయోరుభయోర్విప్రో వేద పుణ్యేన యుజ్యతే
సహస్ర కృత్వస్త్వభ్యస్య బహిరేతత్రికం ద్విజః మహతో ఽప్యేననే మాసాత్వచేవాహి ర్విముచ్యతే
ఏత యర్చావిసంయుక్తః కాలేచ క్రియ స్వయా విప్రక్షత్రియ విడ్యోనిర్గర్హణాం యాతి సాధుషు.
తా॥ గురువు శిష్యునికి నిత్యమును విద్యాభ్యాసము చేయుచుండుమని చెప్పవలెను జాగరూకుడై విరామము కలదనే భావనను నివారించుచుండవలెను. విద్యావ్యాసంగమునకు ఆద్యంతములలో ఎప్పుడును పరబ్రహ్మ వాచకమగు నోంకారము నుచ్చరింపుచండవలెను. అట్లు చేయని యెడల నేర్చిన విద్య మరచిపోవుటయు నేర్చుకొనబోవునది శుష్కించుటయు జరుగును. బ్రాహ్మణున కోంకారార్హతయేట్లు కలుగునో వినుము. ప్రాగగ్రములు గల కుశలతో చేయబడిన ఆసనముపై కూర్చుండి, పవిత్రలు ధరించి మూడుమారులు ప్రాణాయామముచేత పవిత్రులై అప్పుడు ఓంకారము నుచ్చరింపవలెను. కురు నందనా! ఓంకార లక్షణమును వినుము. పరమేష్టియగు ప్రజాపతి అకార ఉకార మకారములను మూడు వేదములనుండి గ్రహించి ‘భూర్భువస్వః. అనెడు వ్యాహృతులతో బాటు'తత్సవితుర్వరేణ్యం' ఇత్యాదిగా గల గాయత్రీమంత్ర. ఋచలను మూడింటిని గూడ మూడువేదములనుండి ఉద్ధరించెను. ఈ ఓంకారమును, వ్యాహృతిత్రయ పూర్వకముగ ఈ గాయత్రీ మంత్ర ఋక్కులను బ్రాహ్మణుడు ఉభయ సంధ్యలయందును జపించుచు వేదపాఠ పుణ్యముతో కూడిన వాడగునని తెలియవలెను.బ్రాహ్మణుడు మూడుపాదముల ఈ గాయత్రీ మంత్రమును వేయిమారులు జపించిన యెడల ఒక మాసము దాటినంతనే గొప్పపాపము నుండి యైనను కుబుసము విడిచిన సర్పమువలే విడుదల పొందును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యజాతిలో జన్మించి సకాలమున ఈ జపము చేయని యెడల సజ్జనులలో నిందితుడగును.
శ్రుణు ష్వైక మనారాజన్! పరమం బ్రహ్మణోముఖమ్ ఓంకార పూర్వికాస్త్రి స్రో మహావ్యాహృతయోఽవ్యయాః
త్రిపదా చైవ సావిత్రీ విజ్ఞేయా బ్రహ్మణో ముఖమ్ యోఽధీతేఽ హనహ న్యేతాం త్రీణి వర్షా ణ్యతం ద్రితః
స బ్రహ్మపరమ భ్యేతి వాయుభూతః స్వమూర్తిమాన్ ఏకాక్షరం పరం బ్రహ్మ ప్రాణాయామః పరం తపః
సావిత్ర్యాస్తు పరంనాస్తి మౌనాత్సత్యం విశిష్యతే తపః క్రియా హోమ క్రియా తథా దాన క్రియా నృప
అక్షయాంతాః సదారాజన్! యథా హ భగవాన్మనుః అవరం త్వక్షరం జ్ఞేయం బ్రహ్మాచైవ ప్రజాపతిః
వీధి యజ్ఞోత్సదారాజన్! జప యజ్జో విశిష్యతే నానా విధైర్గుణోద్దేశైః సూక్ష్మాఖ్యాతై ర్నృపోత్తమ
ఉపాంశుః స్యాలక్ష గుణః సాహసో మానసః స్మృతః యేపాక యజ్జా శ్చత్వారో విధి యజ్ఞేన చాన్వితాః
సర్వేతే జపయజ్ఞస్య కలాం నార్హంతి షోడశీమ్ జపాదేవతు సంసిద్ధ్యేద్భ్రాహ్మణో నాత్ర సంశయః
తా ॥ రాజా ! ఏకాగ్రచిత్తుడవై వినుము. ఓంకార పూర్వకమై, మూడు వ్యాహృతులతో నవ్యయమై. మూడు పాదములు గల ఈ సావిత్రీ మంత్రము బ్రహ్మముఖముగా తెలియదగినది. దీనిని ప్రతి దినము శ్రద్దగా జపించువాడు.వాయుభూతుడై స్వీయ మూర్తితో పరబ్రహ్మమును పొందును. ఓం అనేది ఒక అక్షరమే పరబ్రహ్మము. ప్రాణాయామమే శ్రేష్ఠమైన తపము .గాయత్రి కంటే శ్రేష్టమైనది లేదు. మౌనము కన్న సత్యము విశేషమైనది.తపస్సు, హోమము, దానము మనువు చెప్పినట్లు అక్షయ ఫలమునిచ్చునవి. అక్షర (వ్యవహారము తరువాతిదిగను, ప్రజాపతియే బ్రహ్మగను తెలియవలెను. రాజా! విధియజ్ఞముకంటే జప యజ్ఞము శ్రేష్టమైనది. ఏలయనగా అందలి వివిధములైన గుణముల చేతను, ఉద్దేశములచేతను సూక్ష్మ పద్ధతులలో చెప్పబడినది. ఉపాంశువు (పెదవులు, నాలుకతో శబ్దము వినబడకుండునట్లుచేయు జపము) లక్ష గుణములు కలది. మానస జపము వేయిగుణములు కలది. నాలుగు పాక యజ్ఞములు (పితృకర్మ, హవనము, బలి, వైశ్వదేవములు) దర్శ, పౌర్ణమాసాది విధి యజ్ఞముల వంటివి. ఇవి అన్నియును జప యజ్ఞము యొక్క పదునారవ కళకు కూడ సాటికావు. బ్రాహ్మణుడు కేవలము జపము వలననే సంసిద్ధిని పొందును .
కుర్యాదన్యన్నవా కుర్యాన్మైత్రోబ్రాహ్మణ ఉచ్యతే పూర్వాం సంధ్యాం జపం స్తిష్ఠే త్సావిత్రీమార్క దర్శనాత్
పశ్చిమాంతు సమాసీనః సమ్యగృక్ష విభావనాత్ దినస్యాదౌభవేత్పూర్వా శర్వర్యా దౌ తథా పరా.
సనక్షత్రా పరాజ్ఞేయా అపరా స దివాకరా జపం స్తిష్ఠన్పరాం సంధ్యాం నైశమేనో వ్యపోహతి
అపరాంతు సమాసీనో మలం హంతి దివాకృతమ్ నోపతిష్ఠతియః పూర్వాం నోపాస్తే పశ్చిమాం నృప!
సశూద్రవద్బహిష్కార్యః సర్వస్మాద్ద్విజకర్మణః అపాం సమీపే నియతో నైత్యకం విధిమాశ్రితః
సావిత్రీ మప్య ధీయోత గత్వాఽ రణ్యం సమాహితః వేదోపకరణే రాజన్! స్వాధ్యాయే చైవ నైత్యకే.
నాత్ర దోషో స్త్యనధ్యాయే హోమ మంత్రేషువావిభో! నైత్యకే నాస్యన ధ్యాయే 'బ్రహ్మ సత్రం హి తత్ స్మృతమ్.
బ్రహ్మాహుతి హుతం పుణ్యమన ధ్యాయ వషట్కృతమ్ ఋగేకాం యస్త్వధీయోత విధినా నియతో ద్విజః
తస్య నిత్యం క్షరత్యేషా పయో మేధ్యం ఘృతం మధు అగ్ని శుశ్రూషణం భైక్ష మధః శయ్యాం గురోర్హితమ్
ఆ సమావర్తనాతుర్యాత్కృతోపనయనో ద్విజః ఆచార్యపుత్ర శుశ్రూషాం జ్ఞానదో ధార్మికః శుచిః
అప్తః శక్తో న్నదః సాధుః స్వాధ్యాప్యాదశధర్మతః నాపృష్టః కస్యచి ద్బ్ర్హూయాత్ నచాన్యాయేన పృచ్ఛతః
తా॥ ఇతరమైనది ఏదిచేసి నను చేయు కున్నను సావిత్ర్యుపాసన చేయుచుండువాడే బ్రాహ్మణుడనబడును. ప్రాతస్సంధ్యావందనమున సూర్యదర్శనము వఱకును నిలబడి గాయత్రీ జపము చేయుచుండవలెను. సాయం సంధ్యావందనమున నక్షత్రములు ప్రకాశించు వఱకును కూర్చుండి గాయత్రీజపము చేయుచుండవలెను. సూర్యోదయము కంటే పూర్వము ప్రాతస్సంధ్య, సూర్యాస్తమయమునకు పూర్వము సాయం సంధ్య (ఆరంభింపవలెను). నక్షత్రములతో కూడినది సాయం సంధ్య. సూర్యునితో కూడినది ప్రాతస్సంధ్య అని తెలియవలెను. ప్రాత సంధ్యలో నిలుచుని జపము చేసినందువలన రాత్రీ పాపములు నశించును . అటులే సాయంకాల సంధ్యావందనమున కూర్చుండి జపించుటవలన దినము నందలి పాపములు నశించును. పూర్వసంధ్యలో నిలబడకయు సాయంకాల సంధ్యలో కూర్చుండకయు ఎవడు జపించుచుండునో . వాడు సర్వబ్రాహ్మణ కర్మల నుండి శూద్రునివలే బహిష్కృతుడు. నీయతుడై జలాశయముల సమీపమునగాని. ఆరణ్యములకు వెడలి గాని గాయత్రీజపాది నిత్యానుష్ఠానములను నిర్వర్తించుకొనుటశ్రేష్ఠము. రాజా! నిత్యవిధుల నిర్వహణమునగాని స్వాధ్యాయమునందుగాని. హోమ మంత్రాదులయందుగాని అనధ్యాయ దోషములేదు. నిత్యకర్మబ్రహ్మ సత్రముగా చెప్పబడును. దానికి అనధ్యయన దోషము వర్తింపదు. అనథ్యాయ మందు అగ్నిహోత్రమున వ్రేల్చిన హవిస్సు బ్రహ్మాహుతియై పుణ్యప్రదమగును. నీయతుడై విధి పూర్వకముగ ఒక్క ఋక్కునైనను, ఎవడు పఠించునో . అతనికి పయస్సు, స్వచ్ఛమైన ఘృతము, తేనె వృద్ధినందును.
ఉపనీతుడైన బ్రాహ్మణుడు సమావర్తనము వఱకును అగ్ని శుశ్రూషణము, భిక్షా చర్య, భూశయనము, గురు సేవ చేయుచుండవలెను. ఉపనయన సంస్కారము పొందిన బ్రాహ్మణుడు, ఆచార్య పుత్రుడు, సేవ చేయువాడు, జ్ఞానదుడు , ధార్మికుడు, శుచియైన వాడు. ఆప్తుడు , సమర్థుడు, ఔదార్యముగలవాడు, సాధుశీలుడు అను నీ పదుగురును పది లక్షణములు గలవారు వేదాధ్యయనముకు అర్హులు. ఆచార్యుడు, అడుగని వానికిని, అన్యాయముగ నడుగువానికిని ఏదియు చెప్పకూడదు.
జానన్నపిహిమేథావీ జడవల్లోక ఆచరేత్ అధర్మేణచ యః ప్రాహ యశ్చా ధర్మేణ పృచ్ఛతి
తయో రన్య తరః ప్రైతి విద్వేషంపా నిగచ్ఛతి ధర్మార్థౌ యత్ర నస్యాతాం శుశ్రూషాచాపి తద్విధా.
నతత్ర విద్యా వప్తవ్యా శుభం బీజ మీవోషరే. విద్యయైవ సమం కామం మర్తవ్యం బ్రహ్మవాదీనా
ఆపద్య పీహి ఘోరాయాం నత్వేనా మీరిణే వపేత్
విద్యా బ్రాహ్మణ మిత్యాహ శేవధిస్తే ఽస్మిరక్షమామ్ అసూయకాయ మా ప్రాదాస్తధా స్యాం వీర్యవత్తమా
శేవం సుఖము శంతీహ కేచిత్ జ్ఞానం ప్రచక్షతే తౌ ధారయతి వైయస్మాచ్ఛేవధిస్తేన సోచ్యతే
యమేవతు శుచిం విద్యాన్నియతం బృహ్మచారిణమ్ తస్మై మాం బ్రూహి విప్రాయ నిధి పాయాప్రమాదినే
బ్రహ్మ యస్త్వ ననుజ్ఞాత మధీయానాదవాప్నుయాత్ సయాతి నరకం ఘోరం రౌరవం భీమదర్శనమ్
లౌకికం వైదికం వాపి తధాధ్యాత్మిక మేవచ ఆదదీత యతో జ్ఞానం తం పూర్వ మభివాదయేత్.
తా ॥ అన్నియు తెలిసిన మేధావియైనను ఏమియు తెలియని వానివలెనే వర్తింపవలెను. అధర్మముగా నడుగువానికిని ఆధర్మముగ చెప్పువానికి. అరిష్టమైనను విద్వేషమైనను కలుగును. ధర్మము, అర్థము, శుశ్రూష లేని తావున విద్యాబీజములు నటరాదు. నాటినచో అవి ఊషర క్షేత్రమున నాటిన బీజములవలె నిష్పలమగును. బ్రహ్మవాదియైన ఆచార్యుడు విద్యతో బాటు కోరికను కూడ చంపుకొనవలెనేకాని, ఘోరమైన ఆపదకలిగినను, చవుటి నేలలో విత్తనములు వేయరాదు. విద్యాదేవత బ్రాహ్మణునితో నిట్లనెను. “నేను నీకు పెన్నిధిని. నన్ను రక్షింపుము. అసూయగలవాని కెప్పుడును నన్ను ఈయకుము. అట్లేననే నేను శక్తిమంతురాలినై యుందును” . కొందఱు దాచదగిన నిధి వంటిది ఐహిక సుఖమని చెప్పుటకిష్టడెదరు. మజీ కొందఱు జ్ఞానమే దాచదగిన నీధి యందురు. అవి రెండింటిని ధరించును కావున అది (విద్య) శేవధియనబడును. ఎవరిని శుచి నియమములు గల బ్రహ్మచారియని తెలిసికొనెదవో అట్టి బ్రాహ్మణునకు నన్ను ఉపదేశింపుము విద్యానిధిని కాపాడుటలో ప్రమాదపడని దానికి నన్ను బోధింపుము. ఎవడు గుర్వనుజ్ఞలేనిదే విద్య నేర్చుకొనునో. అట్టివాడు భయంకరము, ఘోరమునైన కౌరవ నరకమును పొందును. లౌకికము, వైదికము, లేక ఆధ్యాత్మికమునైన విద్యలలో ఏవిద్యగణపు వానికైనను తొలుత అభివాదము చేయవలెను
శ్లో ॥ సావిత్రీ సౌరమాత్రోపి వరోవిప్ర: సుయంత్రితః నాయంత్రిత స్త్రీవేదోఽపి సర్వాశీ సర్వవిక్రయీ
శయ్యాసనేద్ధ్యాచరితే శ్రేయసాన స మావిశేత్ శయ్యాసన స్థశ్చైవేనం ప్రత్యుత్థాయాభివాదయేత్
ఊర్థ్వం ప్రాణా హ్యుత్ర్కామంతి యూనః స్థవిర ఆగతే ప్రత్యుత్థానాభి వాదాభ్యాం పునస్తాన్ ప్రతిపద్యతే
అభివాదన శీలస్య నిత్యం వృధోప సేవినః చత్వారి సమ్యగ్వర్థంతే ఆయుః ప్రజ్ఞాయశోబలమ్
అభివాద పరోవిప్రోజ్యాయాంసమభివాదయేత్ అసౌనామాహమస్మీతి స్వనామ పరికీర్తయేత్
నామధేయస్య యే కేచిదభివాదం నజానతే తాన్ప్రాజ్ఞోహమితి బ్రూయాత్ స్త్రీయః సర్వాస్తథైవచ
భోః శబ్దం కీర్తయేదంతే స్వస్యనామ్నోభివాదయేత్ నామ్నః స్వరూప భావోహి భోభావ ఋషిభిః స్మృతః
ఆయుష్మాన్ భవ సౌమ్యేతి వాచో విప్రోఽభివాదనే అకారశ్చాస్య నామ్నోఽoతే వాచ్యః పూర్వాక్షరః ప్లుతః
యోనవేత్త్య భివాదస్య విప్రః ప్రత్యభివాదనమ్ నాభివాద్యః సవిదుషా యథాశూద్రః తథైవ సః
అభివాదే కృతే యస్తు న కరో వ్యభివాదనమ్ ఆశీర్వా, కురుశార్దూల! సయాతి నరకం ధ్రువమ్
తా ॥ గాయత్రీ మంత్రానుష్ఠానపరుడైయును బ్రాహ్మణుడు శాస్త్రనియమములకు బదుడై యుండిననే శ్రేష్ఠుడగును. అట్లులేనిదే మూడు వేదముల నభ్యసించిన వాడైనను అభక్ష్యభక్షకునివలె అవిక్రేయ విక్రేతవలే పాపియగును. గురువు శయ్యాసనములందు న్నప్పుడు అచటికి శ్రేయస్కాముడు ప్రవేశింపరాదు. తానటుల శయ్యాసనములందుండి నపుడు గురువు వచ్చిన ప్రత్యుత్థానము, అభివాదము చేయవలెను. వయస్సు పైబడిన వాడు సమీపించినపుడు తరుణ వయుస్కుని ప్రాణములు పైకి లేచును. ప్రత్యుత్థానము అభివాదము చేయుటచేత తిరిగి యథాస్థానమును పొందును. నిత్యమును పెద్దవారికి నమస్కరించువానికిని, వారిని సేవించువారికిని ఆయువు, తెలివి, కీర్తి, బలము అను నాలుగుఅభివృద్ధి యగును. అభివాదపరుడైన బ్రాహ్మణుడు, శ్రేష్ఠుడైన వృదునకు “నేను ఈ పేరుగలవానీనీ” అని తన పేరు చెప్పుకొనవలెను, పేరుచెప్పుకొని అభివాదము చేయుట తెలియనివారు, స్త్రీలును “నేను ప్రాజ్ఞుడను లేక ప్రాజ్ఞురాలను” అని చెప్పుకొనవలెను. అభివాదనమునందు తన పేరుచివర “భో” శబ్దమును చేర్చి ఉచ్చరింపవలెను. పేరు యొక్క స్వరూప భావమే ఈ “భో భావమని ఋషులు చెప్పిరి. అభివాదన మున దానిని స్వీకరించు బ్రాహ్మణుడు , "ఆయుష్మాన్ భవ సౌమ్య!” అని అశీర్వదింపవలెను. పేరు చివర గల 'అ' కారమును పూర్వాక్షరమును ప్లుతముగా (మూడుమాత్రల కాలమున) ఉచ్చరింపవలెను. అభివాదమునకు ప్రత్యభివాదనము చేయుటతెలియని వానికి బుద్ధిగలవాడు నమస్కరింపకూడదు. ప్రత్యభివాదము తెలియని వాడు శూద్రునితో సమానమైన వాడుగా భావింపవలెను. అభివాదము చేసినప్పుడు ప్రత్యభివాదమో, ఆశీర్వాదమో చేయనివాడు నిశ్చయముగా నరకమును పొందును.
శ్లో॥ అభీతి భగవాన్ విష్ణు ర్వాదయా మితి శంకరః ద్వావేవ పూజితౌ తేన యః కరోత్యభి వాదనమ్
బ్రాహ్మణం కుశలం పృచ్ఛేత్ క్షేత్ర బంధుమనామయమ్ వైశ్యం క్షేమం సమాగమ్య శూద్ర మారోగ్యమేవతు
నవచ్యోదీక్షితో నామ్నా యవీయానపి యోభవేత్ భో భవత్పూర్వకత్వేన ఇతి స్వాయం భువోఽ బ్రవీత్.
పర పత్నీతు యా రాజన్! అసంబద్దాతు యోనితః వక్తవ్యాభవతీత్యేవం సుభగే భగినీతిచ.
పితృవ్యాన్మాతులాన్రాజన్! శ్వశు రాకృత్విజోగురూన్ అసావహమితి బ్రూయాత్ప్రత్యుతాయ జఘన్యజః
మాతృష్వసా మాతులానీ శ్వశ్రూరథ పితృష్వసా సంపూజ్యా గురుపత్నీచ సమాస్తా గురుభార్యయా
జ్యేష్ఠస్య భాృతుర్యాభార్యా సవర్ణాహన్యహన్యపి పూజయన్ప్రయoతో విప్రోయాతి విష్ణుసదోనృప!
ప్రవాసాదేత్య సంపూజ్యా జ్ఞాతి సంబంధి యోషితః పితుర్యా భగినీ రాజన్! మాతుశ్చాపి విశాంపతే!
ఆత్మనో భగినీ యాచ జ్యేష్ఠా కురుకులో ద్వహ! సదా స్వమాతృవద్వృత్తి మాతి ష్ఠేద్భారతోత్తమ!
గరీయసీ తతాస్తాభ్యో మాతాజ్ఞేయా నరాధిప! పుత్ర మిత్ర భాగినేయా ద్రష్టవ్యాహ్యాత్మనా సమాః
తా ॥ “అభి” యనగా విష్ణు భగవానుడు. “వాదయామి” యనగా శంకరుడు ఎవడు అభివాదము చేయునో వాడు వారిద్దజీని పూజించినట్లగును. బ్రాహ్మణుని కుశలమును, క్షత్రియుని అనామయమును (అరోగమును), వైశ్యుని క్షేమమును, శూద్రుని ఆరోగ్యమునుగుఱించి ప్రశ్నించి పలుకరింపవలెను. తనకంటే చిన్నవాడైనను దీక్షితుని, పేరుతో సంబోధింపరాదు. భో, భవచ్చబ్ద ములతో సంబోధింపవలెనని స్వాయంభువు చెప్పెను. రాజా! రక్తసంబంధములేని యితరుని భార్యను భవతి, సుభగ, భగినీ ఇత్యాది శబ్దములతో పిలువవలేను. తండ్రి తోబుట్టువులను, మేనమామలను , పిల్లనిచ్చిన మానులను, ఋత్విజులను, గురువులను పిన్నవాడు ప్రత్యుత్థానము చేసి గౌరవించి, తన పేరు చెప్పి అభివాదము చేయవలెను, తల్లితోబుట్టువు, మేనమామ భార్య, భార్యతల్లి, తండ్రితోబును, గురువు భార్య వీరందఱు గురు భార్యతో సమానులైనందున పూజ్యురాండ్రు. బ్రాహ్మణుడు తన పెద్ద అన్న భార్యను నిత్యము శ్రద్ధగా పూజించిన, అతడు విష్ణు పదమునందును. రాజా! ప్రవాసమునుండి వచ్చిన (వాడు) వెంటనే తన జ్ఞాతి సంబంధులైన స్త్రీలను, పితృసోదరినైనను మాతృసోదరినైనను పూజింపవలెను. ఓకురుకులోత్తమా! తన జ్యేష్ఠ భగినిని (అక్కను)ఎల్లప్పుడు తన తల్లినివలే గౌరవించుచుండవలెను. రాజా! వీరందజిలోనను, తన తల్లి అందజికంటెను గొప్పదిగా తెలియవలెను. పుత్రుని, మిత్రుని, సోదరి సంతానమును తనతో సమానముగ చూచుకొనవలెను.
శ్లో ॥ దశాబ్దాఖ్యం పౌరసంఖ్యం పంచాబ్దాఖ్యం కలాభృతామ్ అబ్దపూర్వం శ్రోత్రియాణాం స్వల్పేనాపి స్వయోనిషు
బ్రాహ్మణం దశ వర్షంచ శతవర్షంచ భూమిపమ్ పితాపుత్రౌ విజానీయా ద్భ్రాహ్మణస్తు తయోః పితా
ఇత్యేవం క్షత్రియ పితా వైశ్యస్యాపి పితామహః ప్రపితామహశ్చ శూద్రస్య ప్రోక్తో విప్రో మనీషీభిః
విత్తం బంధుర్వయః కర్మ విద్యాభవతి పంచమి ఏతాని మాన్యస్థానాని గరీయో యద్యదుత్తరమ్
పంచానాం త్రిషు వర్గేషు భూయాంసి గుణవంతి చ యస్యస్యుః సోఽత్ర మానార్హ: శూద్రోపి దశమిం గతః
చక్రిణో దశమి స్థస్య రోగిణో భారిణః స్త్రీ యాః స్నాతకస్యతు రాజ్ఞశ్చ పంథాదేయో నరస్యచ
ఏషాం సమాగమో తాత! పూజ్యౌస్నాతక పార్థివౌ ఆభ్యాం సమాగమో రాజన్ ! స్నాతకోతృప మానభాక్
అధ్యాపయేద్యస్తు శిష్యం కృత్వోపనయనం ద్విజః సరహస్యం సకల్పంచ వేదం భరతసత్తమ !
తమాచార్యం మహాబాహో ! ప్రవదంతి మనీషిణః
ఏక దేశంతు వేదస్య వేదాంగాన్యాపి వా పునః యోధ్యాపయతి వృత్త్యర్థముపాధ్యాయః స ఉచ్యతే
నిషేకాదీని కార్యాణి యః కరోతి నృపోత్తమ ! అధ్యాపయతి చాన్యేన స విప్రో గురు రుచ్యతే
తా ॥ పది సంవత్సముల నుండి పేరువడసిన వానిని, అందఱిచేత కొనియాడబడువానిని, విద్యానిపుణులలో ఐదేండ్లుగా పేరుపొందిన వానిని, శ్రోత్రియులలో ఒక సంవత్సరము పెద్దయగు వానిని, స్వజాతిలో ఏకొంచెము పెద్దవాడైనను వానిని . దశవర్ష బ్రాహ్మణుని, శతవరుడగు క్షత్రియుని పితో పుత్రులుగా నెఱుగవలేను. బ్రాహ్మణుని వారలకు తండ్రిగా భావింపవలెను. ఈ విధముగనే క్షత్రియుని తండ్రి, వైశ్యుని తాత, శూద్రుని ముత్తాత బుద్ధిమంతులచే విప్రుడని చెప్పబడును. ధనము, బంధువు, వయస్సు, కర్మ విద్య ఈ ఐదు మాన్యస్థానములు. ఇందు ఉత్తరోత్తరము ఒకటి కంటే నొకటి గొప్పది. ఈ ఐదింటి యాధిక్యములు యోగ్యత కలగించునవి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో ఇవి ఎవరికిగలవో వారు గౌరవారులగుచున్నారు. శూద్రుడు తొంబది సంవత్సరములు పైబడిన వృద్ధుడైనచో గౌరవార్హుడగును. రథస్థుడు, వృద్ధుడు, రోగి, బరువుమోయువాడు, స్త్రీ . స్నాతకుడు, రాజు, పెండ్లికొడుకు, వీరలెదురైనచో, వీరికి దారి యిచ్చి ప్రక్కకు తొలగవలెను. వీరందరు కలసి వచ్చినచో వీరిలో స్నాతకుడు, రాజు పూజ్యులగుదురు. వీరిద్దఱు కలసి వచ్చినచో స్నాతకుడు మొదట పూజ్యుడగును. భరత సత్తమా ! శిష్యునకుపనయనము చేసి, సరహస్యము, సకల్పమునైన వేదమునధ్యాపనము గావించు బ్రాహ్మణుని, మనీషులు ఆచార్యుడందురు. వేదమునందలి ఒక భాగమును, వేదాంగములను వృత్తికొఱకు బోధించువాడు ఉపాధ్యాయుడనబడును. నిషేకాది కర్మలు చేసి వేదముతోబాటు బ్రహ్మవిద్యను కూడా ఉపదేశించువాడు గురువనబడును.
శ్లో ॥ అగ్న్యాధేయం పాకయజ్ఞానగ్నిష్టోమాదికాన్మఖాన్ యః కరోతి వృతోయస్య సతస్యర్త్విగిహోచ్యతే
య ఆవృణోత్యవితథం బ్రహ్మణా శ్రవణానుభౌ సమాతా సపితాజ్ఞేయస్తం న ద్రుహ్యేత్కథంచన
ఉపాధ్యాయ దశాచార్య ఆచార్యాణాం శతం పితా సహస్రేణ పితుర్మాతా గౌరవేణాతిరిచ్యతే
ఉత్పాదక బ్రహ్మదాత్రోర్గరీ యాన్భ్రహ్మదః పితా బ్రహ్మజన్మహి విప్రస్య ప్రేత్యచేహచ శాశ్వతమ్
కామాన్మాతా పితాచైవం యదుత్పాదయతో మిథః సంభూతం తస్యతాం విద్యాద్యద్యోనా వభిజాయతే
ఆచార్యస్తస్యతాం జాతీం విధివద్వేదపారగః ఉత్పాదయతి సావిత్ర్యా సా సత్యా సాఽ జరా మరా
ఉపాధ్యాయ మాదితః కృత్వా యే పూజ్యాః కథితాస్తవ మహాగురుర్మహా బాహో సర్వేషా మధికం స్మృతః
సహస్ర శత సంఖ్యోఽసా వాచార్యాణామిదం మతమ్ చతుర్ణామపి వర్ణానాం సమహా గురు రుచ్యతే
తా ॥ ఆగ్న్యాధేయము, ఏ యజ్ఞములు, అగ్నిష్టోమాటిక్రతువులు నిర్వహించుటకు ఎవడు యజమాని చేత వరింపబడునో వాడు అతనికి 'ఋత్విక్కు' అని చెప్పబడును. ఎవడు అతధముగ వేదముచే రెండు చెవులను ఆవరించుకొనియుండునో అతడే తల్లియు, తండ్రియు నగును. అట్టివానికి ఎప్పుడును ద్రోహము చేయరాదు. గౌరవింపదగిన దృష్టి చేత ఉపాధ్యాయులకంటే పదిరెట్లు ఆచార్యుడు, ఆచార్యులకంటెను వందరెట్లు తండ్రియును, తండ్రి కంటే వేయి రెట్లు తల్లియును అధిక తరులని చెప్పబడును. వేదాధ్యయనము, చేయించు కన్నతండ్రి కన్నను, వేదాధ్యయనము చేయించు పితృతుల్యుడైన గురువు శ్రేష్ఠుడు. వేదాధికారముగల బ్రాహ్మణ జన్మ ఇహపరములయందును శాశ్వతమైనది. కామముచేత తల్లిదండ్రులన్యోన్యముగా కలియుటవలన కలిగిన యోని జన్మ సంభూతిగా అతనిని తెలియవలెను . వేదపారగుడైన ఆచార్యుడు విధివిధానముగా, గాయత్రిచేత ఆపుట్టుకకు పుట్టువునిచ్చును. అది సత్యమైనది. అజరామరమైనది . ఉపాధ్యాయుడు మొదలుకొని ఎవరెవరు పూజ్యులో నీకు చెప్పితిని. వీరందజీలోనను మహాగురువే అధికుడని చెప్పబడినది. నాలుగు వర్ణముల వారికిని, ఆచార్యులందఱికంటెను నూరువేల రెట్లు అధికుడు. అతడే మహాగురువని చెప్పబడును .
శతానీక ఉవాచ :
శ్లో ॥ య ఏతే భవతాప్రోక్తా ఉపాధ్యాయ ముఖాద్విజాః విదితా ఏవ మే సర్వే న మహా గురురేవ హి
సుమంతురువాచ :
జయోపజీవీ యో విప్రః స మహాగురు రుచ్యతే అష్టాదశ పురాణాని రామస్య చరితం తథా
విష్ణుధర్మాదయో ధర్మాః శివధర్మశ్చ భారత ! కార్ష్ణంవేదం పంచమంతు యన్మహాభారతం స్మృతమ్
శ్రౌతా ధర్మాశ్చ రాజేంద్ర ! నారదోక్తామహీపతే జయేతి నామ ఏతేషాం ప్రవదంతి మనీషిణః
ఏవం విప్రకదంబస్య ధారకః ప్రవరః స్మృతః యస్త్వేతాని సమస్తాని పురాణానీహవిందతి.
భారతం చ మహాబాహో ససర్వజ్ఞో మతోనృణామ్ తస్మాత్స పూజ్యో రాజేంద్ర ! వర్ణైర్వప్రాదిభిః సదా
కింత్వయా న శ్రుతం వాక్యం యదాహభగవాన్విభుః అల్పంవా బహువా యస్య శ్రుతస్యోప కరోతి యః
తమపీహ గురుం విద్యాచ్చ్రుతోపక్రియయాతయా బ్రాహ్మస్య జన్మనః కర్తా స్వధర్మస్యచ శాసితా
బాలోఽపి విప్రో వృద్ధస్య పితా భవతి ధర్మతః
తా ॥ శతానీకుడిట్లనెను. “మహర్షీ! మీరు చెప్పిన ఉపాధ్యాయుడు మొదలగు బ్రాహ్మణులందఱ గుఱించి నాకు తెలియును. ఒక్క మహాగురువు గుఱించియే తెలియదు.” సుమంతుడిట్లు సమాధానము చెప్పెను. “రాజా! 'జయాపజీవి యైన బ్రాహ్మణుడే మహాగురువనబడును. అష్టాదశ పురాణములు, శ్రీరామకథ. విష్ణుధర్మము, శివధర్మము మొదలగు ధర్మములు, కృష్ణవేదము, పంచమవేదమని ఖ్యాతినందిన మహాభారతము. నారదోక్తములైన శ్రాతధర్మములు, వీనినన్నింటిని కలిపి, బుద్ధిమంతులు “జయ”మను పేరుతో వ్యవహరింతురు. ఈ జ్ఞాన సముదాయమును తెలిసినవాడు మనుష్యులలో సర్వజ్ఞుఁడుగా గుర్తింపబడును. అందువలన అట్టివాడు అన్ని వేళల, బ్రాహ్మణాది వర్ణములవారందఱికిని పూజ్యుడు. జగత్పభువైన భగవానుని వాక్యము నీవు వినలేదా? తనకు తెలిసిన కొద్దియో గొప్పదో అయిన విద్యతో ఎవడు ఇతరునికి ఉపకరించునో వానిని - ఆ విద్యాబోధన యనేడు ఉపకారము వలన - గురువని తెలియవలెను. బ్రాహ్మ జన్మమునకు కర్తయైన వాడును, స్వధర్మమును శాసింపగలవాడును అయిన విప్రుడు బాలకుడైనను, ధర్మముననుసరించి వృద్ధునకైనను తండ్రియే యగును.
శ్లో ॥ అధ్యాపయా మాస పితృన్చిశురాంగిరసః కవిః పుత్రకా ఇతిహోవాచ జ్ఞానేన పరిగృహ్యతాన్
తే తమర్థమపృచ్ఛంత దేవానాగత మన్యవః దేవాశ్చైతాన్స మేత్యోచుర్న్యాయ్యం వైశిశురుక్తవాన్
అజ్ఞోభవతి వైబాలః పితాభవతి మంత్రదః అజ్ఞంహి బాలమిత్యాహుః ఏతేత్యేవతు మంత్రదమ్
పితామ హేతి జయద మిత్యాహుస్తే దివౌకసః జయోమంత్రాస్తథా వేదా దేహమేకం త్రిధాకృతమ్
నహాయనైర్నపలితైర్నమిత్రేణ న బంధుభిః ఋషయశ్చక్రిరే ధర్మ యోఽనూచానః సనోమహాన్
బ్రాహ్మణక్షత్రియ వీశాం శూద్రాణాంచ విశాంపతే ! జ్యేష్ఠం వదంతి రాజేంద్ర ! సందేహం శ్రుణువైయథా
జ్ఞానతో వీర్యతో రాజన్ ! ధనతో జన్మతస్తథా శీలతస్తు ప్రధానాయే తే ప్రధానా మతా మమ
న తేన స్థవిరో భవతి యేనాస్య పలితం శిరః యోపై యువాప్యధీయానస్తం దేవా స్థవిరం విదుః
యథా కాష్ఠమయో హస్తీ యథా చర్మమయోమృగః యశ్చవిప్రోఽ నధీయాన స్త్రయస్తే నామ బిభ్రతి
యథాయోషాఽ ఫలా స్త్రీషు యథా గౌర్గవి చాఫలా యథాచాఽజ్ఞేఽ ఫలం దానం యథా విప్రో నృచోఽఫల:
తా ॥ ఒకప్పుడు బాలుడయియును పండితుడైన ఆంగిరసుడు తండ్రివయస్సుగల పెద్దవారికి విద్యబోధించెను. జ్ఞానము చేత అర్భకులైన ఆ పెద్దలను అతడు “బిడ్డలారా"! అని సంబోధించెను . దాని పై వారు కోపగించుకొని ఆ విషయమును దేవతలకు నివేదించుకొనిరి. బాలుడైన ఆంగిరసుడన్న మాట సరియైనదేయని దేవతలు నుడివిరి “ఎవడజ్ఞుడో వాడు బాలుడు. ఎవరు మంత్రదుడో (గురువో)వాడు తండ్రి. అజునినే బాలుడందురు. విద్యను బోధించువానిని తండ్రియందురు. అటులే “జయదుని' తాతయందురు.” అని దేవతలు చెప్పిరి. 'జయము', మంత్రములు, వేదములు అను వీనికి దేహమొకటియే యైనను అట్లు మూడు భాగములు చేయబడినది. సంవత్సరములచేత, వార్థక్యముచేత, మిత్రుడగుటచేత, బంధువులగుటచేత ఆధిక్యము రాదు. ఈ ధర్మవ్యవస్థను ఋషులేర్పరచిరి. ఇది అనూచానము, మనకు గొప్పది. రాజా! బ్రాహ్మణులలో, క్షత్రియులలో వైశ్యులలో శూద్రులలో గొప్పవాడుగా ఎవడు స్తుతింపబడునో చెప్పెదను వినుము. జ్ఞానముచే బ్రాహ్మణుడు, పరాక్రమముచే క్షత్రియుడు, ధనముచే వైశ్యుడు, జన్మ (వయస్సు)చే శూద్రుడు గొప్పవాడు. కానీ ఎవడు శీలవంతుడో వాడు గొప్పవాడని నా మతము. ఎవని తల నెఱసినదో వాడు మాత్రమే వృద్ధుడు కాడు. ఎవడు యువకుడైనను వేదాది విద్యలు బోధింపగలడో వాడు వృద్ధుడని దేవతలు తలతురు. కాష్ఠమయమైన ఏనుగు, చర్మమయమైన మృగము, విద్యాహీనుడైన బ్రాహ్మణుడు, ఈ మూడును నామమాత్ర స్థితిగలవి. స్త్రీలయందు గొడ్రాలి వలె, గోవులలో గొడ్డు గోదవలే, అజునకీయఁబడు దానమువలె వేద విద్యలేని బ్రాహ్మణుని ఉనికి నిష్పలము
శ్లో ॥ వైశ్వదేవేన యేహీనా ఆతిథ్యేన వివర్జితాః సర్వేతు వృషలాజ్ఞేయాః ప్రాప్తవేదా అపిద్విజాః
నానృగ్భ్రాహ్మణో భవతి న వణిజ్న కుశీలవః నశూద్రః ప్రేషణం కుర్వన్నస్తేనో న చికిత్సకః
అవ్రతాహ్యన ధీయానా యత్రభైక్ష చరాద్విజాః తంగ్రామం దండయేద్రాజా చోరభక్తప్రదోహి సః
సంతుష్ణో యత్రపై విప్రః సాగ్నికః కురునందన! యాతి సాఫల్యతాం వేదైర్దేవైరేవంహి భాషితమ్
వైదైరుక్తం యథా వీర సురజ్యేష్ఠ ము పేత్యవై వేపంతే బ్రాహ్మణా భూమా వభ్యస్యంతి హ్యనగ్నికా:
క్లిశ్యంతేతే కిమర్థంహి మూఢవై ఫలకాంక్షయా
అనుష్టాన విహీనానామాస్మానభ్యసతాం భువి క్లేశోహి కేవలం దేవ నా స్మదభ్యసనే ఫలమ్
అనుష్టానం పరందేవ మస్మత్స్వభ్యసనాత్సదా ఇత్యేవం రాజశార్దూల! వేదా ఊచుర్హి వేధసమ్
తస్మాచ్చ వేదాభ్యసనాదనుష్టానం పరం మతమ్
చత్వారోపా త్రయోవాపి యద్బ్రూయుర్వేద పారగాః సధర్మఇతి విజ్ఞేయో నేతరేషాం సహస్రశః
తా ॥ వైశ్వదేవము చేయనివారు, అతిథ్యమొసగనివారును,.వేదమునేర్చిన బ్రాహ్మణులైనను, వారందఱును శూద్రులనియే తెలియవలెను. వేదము లేనివాఁడు బ్రాహ్మణుఁడు కాఁడు. కుత్సితమైన నడవడిలేనివాఁడు వర్తకుఁడు కాఁడు, పనుల కొఱకు పంపబడని వాడు శూద్రుడు కాడు. దొంగతనము (కపటవర్తనము) లేనివాడు వైద్యుడు కాడు. నియమనిష్టలు లేనివారు, వేదాధ్యయనము చేయనివారు, భిక్షావృత్తిచే జీవించువారునగు బ్రాహ్మణులుండు గ్రామమును (ప్రజలను) రాజు దండింపవలెను. లేనిచో దొంగభక్తుల నిచ్చువాడగును. రాజా ! ఆహితాగ్నియగు బ్రాహ్మణుడేచోట సంతుష్టుడైయుండునో ఆ ప్రదేశము (నేలురాజు) సఫలత పొందును. వేదములచేత, దేవతల చేత ఇటులే చెప్పబడినది. ఒకప్పుడు బ్రహ్మదేవునితో వేదములిట్లు చెప్పినవి. “అగ్నిహోత్రము లేకుండగా వేదాభ్యసనము చేయు బ్రాహ్మణులు భూమి పై కంపిచుచుందురు. మూడులై ఫలాపేక్షతో. అనుష్టాన రహితులై మమ్ము అభ్యసించుచు ఈ భువి పై ఎందులకో క్లేశము ననుభవింతురు గదా! ఓ బ్రహ్మాదేవా! మమ్మభ్యసించు ఫలము కేవలము క్లేశమే కదా !. అందువలన మమ్ము అభ్యసించుట కంటే ఎప్పుడును అనుష్టానమే శ్రేష్ఠతరమైనది.” రాజా! ఈ విధముగా వేదములే స్వయముగ బ్రహ్మతో చెప్పినవి. ఆకారణమున వేదాభ్యాసము కంటే అనుష్టానమే మేలైనదని చెప్పబడినది. వేద పారగులు ముగ్గురో నల్వురో ఏది చెప్పినను అది ధర్మముగా తెలియదగును. ఇతరులు వేలకొలది చెప్పినను అది ధర్మముకాకుండును.
శ్లో ॥ యద్వదంతి తమో మూఢా మూర్ఖా ధర్మమజానతః తత్పాపం శతధాభూత్వావక్తౄనేవాను గచ్ఛతి
శౌచహీనే వ్రతభ్రష్ఠే విప్రే వేద వివర్జితే దీయమానం రుదత్యన్నం ‘కింమయా దుష్కృతం కృతమ్'
జయోపజీవినే దత్తం యదాత్మానం ప్రపశ్యతి నృత్యతిస్మ తదా రాజన్! కరావుద్ధృత్య భారత!
విద్యాతపోభ్యాం సంపన్నే బ్రాహ్మణే గృహమాగతే క్రీడంత్యౌషధయః సర్వా 'యాస్యామఃపరమాంగతిమ్'
అవతానామమంత్రాణామజపానాంచభారత! ప్రతిగ్రహోన దాతవ్యో నశిలాతారయే చ్ఛిలామ్
శ్రోత్రియాయైవ దేయాని హవ్యకవ్యాని నిత్యశః అశ్రోత్రియాయ దత్తాని నపితృన్నాపి దేవతాః
యస్యచైవ గృహే మూర్ఖో దూరేచాపి బహుశ్రుతః బహుశ్రుతాయ దాతవ్యం నాస్తి మూర్ఖ వ్యతిక్రమః
బ్రాహ్మణాతిక్రమో నాస్తి మూర్ఖే జప వివర్జితే జ్వలంత మగ్నిముత్సృజ్య నహిభస్మని హూయతే
నచైతదేవ మన్యంతే పితరో దేవతాస్తథా సగుణం నిర్గుణంవాపి బ్రాహ్మణం దైవతం పరమ్
నాతిక్రమేధ్గృహాసీనం బ్రాహ్మణం విప్రకర్మణి అతిక్రమన్మహాబాహో! రౌరవం యాతిభారత!
గాయత్రీమాత్రసారోపి బ్రాహ్మణః పూజ్యతాం గతః గృహాసన్నో విశేషణ న భవేత్పతితస్తు సః
తా ॥ మూఢులు, మూర్తులు, ధర్మము నెఱుఁగకుండ ఏదిచెప్పినను అదినూరురెట్లు పాపమై వారినే వెంబడించును. శుచిత్వరహితుఁడు, నియమభష్ణుడు, వేదహీనుడు అయిన బ్రాహ్మణునకు దానముచేయబడిన అన్నము, “నేనేమిపాపము చేసితిని?” అని ఏడ్చును. ఓ రాజా! జయాపజీవికి దత్తము చేయబడిన అన్నము తనను తాను చూచి మురిసిపోవుచు చేతులెత్తి నాట్యము చేయును. విద్యాతపస్సంపన్నుఁడైన బ్రాహ్మణుఁడు గృహమున కే తెంచినపుడు ఓషధులన్నియు “మేము పరమగతిని పొందుదుముగద” యని నర్తించును. నిష్ఠలేని వారికి, మంత్రము లేని వారికి జపములేని వారికి ఏ దానము చేయరాదు. ఒక శిలను మఱియొక శిల తరింపఁజేయఁజాలదు గదా!. హవ్యకవ్యము లెప్పుడైనను శ్రోత్రియునకే ఈయవలయును. శ్రోత్రియుడు కానివానికి ఈయబడినవి పితృదేవతలనుగాని దేవతలనుగాని తృప్తిపరుపజాలవు. గృహముననే మూర్ఖుడుండి పండితుడు దూరమున నుండిన పండితునకే ఈయవలెను. మూర్ఖ వ్యతిక్రమ దోషములేదు. మూరుఁడు, జప వివర్జితుఁ డునైన బ్రాహ్మణునతిక్రమించుట దోషముకాదు. మండుచున్న అగ్నిని వదలి పెట్టి, బూడిదలో ఆహుతిచేయరుగదా !. దేవతలు, పితరులు ఈ విషయమునేకాక, గుణవంతుడైనను, గుణహీనుఁడైనను, బ్రాహ్మణుఁడు పరమదైవతమని కూడ నైజు గుదురు. విప్రకర్మయందు ఇంటనున్న బ్రాహ్మణుని అలక్ష్యము చేయరాదు. అట్లుచేసిన యెడల గౌరవమను నరకము ప్రాప్తించును. గాయత్రీ మంత్రమాత్రసారుఁడైనను బ్రాహ్మణుడు పూజ్యతనందును, విశేషముగా ఇంటనున్నవాఁడు పతితుఁడు కాడనియే భావింపవలెను.
శ్లో ॥ ధాన్యశూన్యో యథాగ్రామో యథాకూపశ్చ నిర్జల: బ్రాహ్మణశ్చా నధీయానస్త్రయస్తే నామధారకాః
యస్త్వేక పంక్త్యాం విషమందదాతి స్నేహాద్భయాద్వా యది వార్థ హేతో:
వేదేషు దృష్ట మృషిభిశ్చ గీతం తాంబ్రహ్మహత్యాం మునయో వదంతి
అహింసయైవ భూతానాం కార్యం శ్రేయోఽనుశాసనమ్ వాక్చైవ మధురా శ్లక్ష్ణా ప్రయోజ్యాధర్మమీప్సితా
యస్యవాజ్మనసీ శుధ్ధ సత్యగు ప్తేచ భారత! సవై సర్వమవాప్నోతి వేదాంతోపగతం ఫలమ్
నారుంతుదః స్యాదాన్తోపి న పరద్రోహ కర్మధీః యయాస్యోద్విజతే లోకో నతాంవాచ ముదీరయేత్
యత్కరోతి శుభం వాచా ప్రోచ్యమానా మనీషి భిః శ్రూయతాం కురుశార్దుల! సదా చాపి తథోచ్యతామ్
నతథా శశీ న సలిలం నచందనరసో న శీతలచ్ఛాయా ప్రహ్లాదయతీచ పురుషం యథామధుర భాషిణీవాణీ
అర్హణాద్భ్రాహ్మణో నిత్యముద్విజేత విషాదివ అమృత స్యేవ చాకాంక్షేదపమానస్య సర్వదా
సుఖంహ్యవ మతః శేతే సుఖంచ ప్రతిబుధ్యతే సుఖంచరతిలోకేస్మిన్నవమంతా వినశ్యతి
అనేన విధినా రాజన్! సంస్కృతాత్మా ద్వీజఃశనైః గురౌవసన్ సేంచెను యాత్ బ్రహ్మాధిగమిదం తపః
తా ॥ ధాన్యములేని గ్రామము, నీరులేని బావి, వేదవిద్యలేని బ్రాహ్మణుఁడు, ఈ మూడును నామమాత్రములైనవి. స్నేహము వలనగాని, భయము వలనగానీ, లేక అర్థకారణమునగాని ఒకే పంక్తిలోనివారికి, ఒకరికి ఒక విధమున, మఱియొకరికి మఱియొక విధమున పక్షపాతముతో దానము చేయుట బ్రహ్మహత్యతో సమానమైన పాపమని వేదములలో కలదు; ఋషులు కూడ ఈ విషయమును గానము చేసిరి; అని మునులు చెప్పుచున్నారు. ప్రాణులకు శ్రేయముగూర్చు కార్యమును అహింసతోనే అనుశాసింపవలెను. (శ్రేయమును గూర్చు అనుశాసనమును అహింసతోనే చేయవలెను) కోరిన ధర్మమునుపదేశించుటకు మధురమైనదియు, ప్రియమైనదియునైన వాక్కును ప్రయోగింపవలేను. ఎవనివాక్కు, మనస్సు సత్యగుప్తములై శుద్దముగనుండునో పొఁడే వేదాంతోపగతమైన ఫలమునంతయును పొందును. ఒరులను వ్యధ పెట్టరాదు. తానును వ్యధచెందరాదు. ఇతరులను కలత పెట్టు మాటలు పలుకరాదు. ఓ కురుశార్దులా! శుభమును కలిగించు మాటలనే బుద్ధిమంతులు మాట్లాడవలెను. అట్లు పలికిన పలుకులనే వివవలెను. మధుర వాక్కువలె చంద్రుడు, నీరు, చందనరసము, చల్లని నీడ కూడా పురుషుని ఆహ్లాదపరుపజాలవు. బ్రాహ్మణుఁడెప్పుడును, తనను పూజించుటవలన విషము వలన వలె కలత చెందవలెను. సర్వదా అమృతమును వలే అపమానమునే ఆకాంక్షింపుచుండవలెను. అవమానింపబడినవాడు సుఖముగా. నిదురించును. సుఖముగా మేల్కొనును. సుఖముగా ఈ లోకమున తిరుగును. అవమానించిన వాడు నశించును. రాజా! ఈ విధానముగా ద్విజుడు సంస్కృతాత్ముడఁగుచు మెలమెల్లగా గురువు సన్నిధిని ఇట్టియంశములను సంగ్రహమొనర్పవలెను. ఇదియే బ్రహ్మాధిగమగు తపస్సు.
శ్లో ॥ తపో విశేషైర్వివిధైర్ర్వతైశ్చ వివిధోదితైః వేదః కృత్న్యోధిగంతవ్యః సరహస్యోద్విజన్మనా
వేదమేవాభ్య సేన్నిత్యం తపస్తప్యం ద్విజోత్తమః వేదాభ్యాసోహి విప్రస్య తపః పరమిహోచ్యతే
ఆ హైవ స నఖాగ్రేభ్యః పరమం తప్యతే తపః యః సుప్తాపి ద్విజోధీతే స్వాధ్యాయం శక్తితోన్వహమ్.
యోఽన ధీత్య ద్విజోవేదమన్యత్ర కురుతే శ్రమమ్ స జీవన్నేవ శూద్రత్వమాశు గచ్ఛతి సాన్వయః
న యస్య వేదో న జపో న విద్యాశ్చ విశాంపతే స శూద్ర ఏవ మంతవ్య ఇత్యాహభగవాన్విభుః
మాతురగ్రేచ జననం ద్వితీయో మౌంజి బంధనమ్ తృతీయో యజ్ఞదీక్షాయాం ద్విజస్య విధిరీరితః
తత్ర యద్ర్బహ్మ జన్మాస్య మౌంజీబంధన చిహ్నితమ్
తత్రాస్యమాతా సావిత్రి పితాత్వాచార్య ఉచ్యతే వేద ప్రదానాత్త్వాచార్యం పితరం మనురబ్రవీత్
నహ్యస్య విద్యతే కర్మ కించిదా మౌంజి బంధనాత్ నాభి వ్యాహారయే ద్భ్రహ్మ స్వధానినయనాదృతే
తా ॥ వివిధములైన తపో విశేషముల చేత, అనేకములుగా చెప్పబడిన వ్రతముల చేతను, బ్రాహ్మణుఁడు సరహస్యమైన వేదమునంతయున భ్యసింపవలెను. ద్విజోత్తముడు నిత్యమును వేదాభ్యాసము చేయుచుండలేను. తపమాచరింపుచుండవలెను. వేదాభ్యాసమే విప్రునకు శ్రేష్ఠమగు తపస్సని చెప్పబడును. ఏ బ్రాహ్మణుఁడు ప్రతినిత్యము యధాశక్తిగ, నిద్రించునపుడు కూడా-వేదపఠనము చేయుచుండునో అతఁడు నఖాగ్రములతోడి యుత్తమమగు తపమాచరించువాడని భగవానుడు చెప్పెను. ఏ ద్విజుడు వేదపాఠము చేయక ఇతర విషయములయందు పరిశ్రమ చేయుచుండునో అతడు. జీవితముననే తన వంశముతో కూడ శూద్రత్వమును పొందును, ఎవనికి వేదము, జపము, విద్యలులేవో వానిని శూద్రునిగనే భావింపవలెనని పరమేశ్వరుఁడు చెప్పెను. తల్లికి జన్మించుట మొదటిది, ఉపనయనము రెండవ జన్మ, యజ్ఞదీక్షయందు మూడవజన్మగా బ్రాహ్మణునకు శాస్త్రము చెప్పినది. మౌంజీ బంధన చిహ్నితమైన బ్రహ్మజన్మ అతనికెప్పుడు కలుగునో. అప్పుడు తల్లి గాయత్రియగును. తండ్రి ఆచార్యుడగును. వేదమునిచ్చుటవలన ఆచార్యుడు తండ్రియనీ మనువుచెప్పను. ఉపనయనము కంటే ముందు ఇతనికి ఏ కర్మయునుండదు. శ్రాద్దమంత్రములఁగలసికాక వేదమును ఉచ్చరింపరాదు.
శ్లో ॥ శూద్రేణతు సమంతావద్యావద్వేదే నజాయతే కృతోపనయనస్యాస్య వ్రతాదేశనమిష్యతే
బ్రాహ్మణో గ్రహణం చైవ క్రమేణ విధిపూర్వకమ్
యత్సూత్రంచాపి యచ్చర్మ యాయాచాస్యచ మేఖలా వసంచాపి యోదండస్తద్వైతస్య వ్రతేష్వపి
సేవేతేమాస్తు నియమాన్భ్రహ్మచారీ గురౌవసవ్ సన్నియమ్యేంద్రియ గ్రామం తపోవృద్ధ్యర్థమాత్మనః
బృందారకర్ష పితృణాం కుర్యాత్తర్పణమేవహి నరాణాంచ మహాబాహో! నిత్యం స్నాత్వాప్రయత్నతః
పుష్పం తోయం ఫలంచాపి సమిదాధానమేవచ నానావిధాని కాష్ఠాని మృత్తికాంచతథాకుశాన్
వర్జయేన్మధు మాంసంచ గంథమాల్యరథాన్ స్త్రియః శుక్లానిచైవ సర్వాణి ప్రాణినాంచైవ హింసనమ్
అభ్యంగమంజనం చాక్ష్ణోరుపానచ్ఛత్ర ధారణమ్ సంకల్పం కామజం క్రోథం లోభం గీతంచ వాదనమ్
నర్తనంచ తథా ద్యూతం జనవాదం తధానృతమ్ పరివాదం చాపి విభో! దూరతః పరివర్జయేత్
స్త్రీణాంచ ప్రేక్షణాలంబోరపవీతం పరస్యచ పుంశ్చలీభిస్తధాసంగం న కుర్యాత్కురునన్దన!
ఏకఃశయీత సర్వత్ర నరేతః స్కందయేత్క్వచిత్ కామాధి స్కందయన్రేతో హినస్తివ్రతమేవతు
తా ॥ వేదజన్మ (ఉపనయనము) కానంతవఱకు శూద్రునితో సమానము ఉపసయనాయానంతరము బ్రహ్మచర్య వ్రతమునాదేశింప వలెను. విధిపూర్వకముగ క్రమప్రాప్తమగు బ్రహ్మత్వగ్రహణము ఆపై జరుగును. అన్ని వ్రతములయందును అతని యజ్ఞోపవీతము, జింకచర్మము, దర్భమొలత్రాడు, వస్త్రము, దండము అతని తోడుగనుండును. బ్రహ్మచారి గురుకులమునందే నివసించుచు ఈ నియమములను పాటించుచుండవలెను. తన తపస్సును వృద్ధి చేసికొనుట కొఱకు ఇంద్రియసమూహమును నిగ్రహించి. దేవర్షిపితృతర్పణములను చేయుచుండవలెను. మహాబాహూ! వీరు ప్రతిదినము స్నానాద్యనుష్ఠానములు ముగించి. ఫలములు, పుష్పములు, నీరు, సమిధలు, వివిధములైన కష్టములు, మృత్తిక, దర్భలు ప్రోగుచేసి తేవలయును. మత్తుపానీయము, మాంసము, సుగంధములు, పుష్పమాలికలు, రథములు, స్త్రీలు, తెల్లని వస్తువులన్నియు (మల్లెలు వెన్నెలలు, వెండి మొ.) ప్రాణిహింసనము. తలంటు, పాదరక్షలు, గొడుగు ధరించుట, కామసంకల్పము, క్రోధము, లోభము, సంగీతము, వాద్యము. నర్తనము, జూదము, జనవాదము అసత్యభాషణము, నింద, వీని నన్నింటిని దూరముగా వదలి పెట్టవలెను. స్త్రీలను చూచుట, వారిని ఊతగా గొనుట, అడ్డగించుట, కులటలతో సంగమించుట చేయరాదు. ఎక్కడైనను ఒక్కడే పరుండవలెను. ఎప్పుడును రేతఃస్థలనము జరుగనీయరాదు. కామము వలన స్థలించిన రేతస్సు వ్రతమును చెడగొట్టును.
శ్లో ॥ సుప్తఃక్షరన్భ్రహ్మచారీ ద్విజః శుక్రమమతః స్నాత్వార్కమర్చయిత్వాతు పునర్మామిత్యృచం జపేత్
మనోరపి తథాచాత్ర శ్రూయతే పరమం వచః ఉదకుంభం సుమనసో గో శకృన్మృత్తికాం కుశాన్
ఆహరేద్యావదర్థాన్హి భైక్షంచాపిహి నిత్యశః
గృహేషుయేషాం కర్తవ్యం తాన్ శ్రుణష్వ నృపోత్తమ స్వకర్మసు రతాయేపై తథా వేదేషు యేరతాః
యజ్ఞేషుచాపి రాజేంద్ర! యేచ శ్రద్ధా సమాశ్రితాః
బ్రహ్మచార్యాహరేద్ఫైక్షం గృహేభ్యః ప్రయతోన్వహమ్ గురోఃకులేన భిక్షేత్ర స్వజ్ఞాతి కులబంధుషు
అలాభేత్వన్య గోత్రాణాం పూర్వం పూర్వం వివర్జయేత్ సర్వంచాపి చరేద్గ్రామం పూర్వోక్తానామసంభవే
అంత్యవర్జం మహాబాహో! ఇత్యాహ భగవాన్వీభుః
వాచం నీయమ్య ప్రయతస్త్వగ్నిం శస్త్రంచ వర్జయేత్ చాతుర్వర్ణ్యం చరేద్ఫైక్షమలాభే కురునన్దన !
ఆరాదాహృత్య సమిధః సన్నిదధ్యాధ్గృహోపరి సాయం ప్రాతస్తు జుహుయాత్రాభి రగ్నిమతంద్రితః
భైక్షాచరణ మకృత్వా న తమగ్నిం సమిధ్యవై అనాతురః సప్తరాత్ర మవికీర్ణ వ్రతంచరేత్
వర్తనంచాస్య భైక్షేణ ప్రవదంతి మనీషిణః తస్మాద్ఫైక్షేణవై నిత్యం నైకాన్నాదీ భవేద్ర్వతీ
భైక్షేణ ప్రతినో వృత్తి రుపవాస సమాస్మృతా దైవత్యవ్రత వద్రాజ నిత్యే కర్మణ్యథార్షివత్
కామ మభ్యర్థితోఽశ్నీయాద్ర్వత మస్య నలుప్యతే
తా ॥ బ్రహ్మచర్యమున నున్న బ్రాహ్మణుఁడు నిద్రాసమయమున కామరహితుడయియును వీర్యస్థలనమునకు గురియగునెడ, స్నానముచేసి సూర్యునర్చించి పునర్మామిత్యాది ఋక్కును జపింపవలెను. ఈ సందర్భమున మను వాక్యము కూడ ఇటులే కలదు. నిత్యమును సమనస్కుడైన బ్రహ్మచారి ఊదకుంభము, గోమయము, మృత్తిక, దర్భలు తెచ్చుచుండవలెను. ఇవియును, భిక్షయును కావలసినంత మేరకు ప్రతిదినము సేకరించుచుండవలెను. నృపోత్తమా! ఇక ఇండ్లలో చేయదగిన కర్తవ్యములను గుజించి వినుము. స్వకర్మలయందు, వేదములయందు, యజ్ఞములందును రుచికలిగి శ్రద్ధాళువులైన బ్రహ్మచారులు ప్రతిదినము ఆయా గృహములనుండి భిక్ష స్వీకరింపవలెను. గురుకులమునందును, జ్ఞాతుల ఇండ్లయందును, బంధు గృహములలోను భిక్షా చర్య చేయకూడదు. అన్యగోత్రముల వారి యిండ్లలో భిక్ష లభింపని పక్షమున పైఁజెప్పిన వానిలో పూర్వ పూర్వములను వదలి ఉత్తరోత్తరములలోచరింపవలెను. ఉక్తములైన యిండ్లలో భిక్ష సంభవము కానప్పుడు గ్రామమంతయును తిరుగవలెను. అంత్యగృహములు మాత్రము విడిచి పెట్టుమని భగవానుడు చెప్పెను. వాక్కును నిగ్రహించుకొనుట ద్వారా కోపమును శాపమును వదలి పెట్టవలెను. భిక్షదొరకనిపక్షమున చతుర్వర్ణముల వారి యిండ్లకును తిరుగవచ్చును. దూరమునుండి సమిధలు సేకరించుకొని వానిని ఇంటి పై భాగమున భద్రపరచియుంచుకొనవలెను. వానితో ప్రాతస్సాయం కాలములయందు అతంద్రితుఁడై అగ్నిని వ్రేల్చవలయును. శిక్షావరణ నుగానీ అగ్నీని వ్రేల్చుటగాని చేయనియెడల అనాతురుడై ఏడురాత్రులు అవకీర్ణి వ్రతము నాచరింపవలెను. భిక్షయే వృత్తిగా కలిగియుండవలెనని బుద్ధిమంతులు చెప్పుచున్నారు. అందువలన భిక్షావతి తాను ఒక్కని వద్దనుండియే నిత్యము భిక్షగ్రహింపరాదు. బ్రహ్మచర్యమునందలి యీ వృత్తి ఉపవాసముతో సమానమైనది. పితృదైవత్యమైన కర్మయందు కోరబడినచో - తానొక ఋషీవలే, అదియొక వ్రతమువలె భుజింపవచ్చును. దానివలన అతని బ్రహ్మచర్య భిక్షావ్రతమునకు లోపము కలుగదు.
శ్లో ॥ బ్రాహ్మణస్య మహాబాహో! కర్మయ త్సముదాహృతమ్ రాజన్యవైశ్యయోర్నై తత్పండితైః కురునన్దన !
చోదితోఽచోదితో వాపి గురుణా నిత్యమేవహి కుర్యాదధ్యయనే యోగమాచార్యస్యహితేషుచ
బుద్ధీంద్రియాణి మనసా శరీరం వాచమేవ హి నియమ్యప్రాంజలిస్తే ష్ఠే దీక్షమాణో గురోర్ముఖమ్
నిత్యముద్ధృత పాణిః స్యాత్సాధ్వాచారస్తు సంయతః ఆస్యతామితి చోక్తః సన్నాసీతాభిముఖం గురోః
వస్త్రవే షైస్తధాన్నైస్తు హీనఃస్యాద్గురు సన్నిధౌ ఉత్తి ష్ఠేత్ప్రథమంచాస్య జఘన్యంచాపి సంవిశేత్
ప్రతి శ్రవణ సంభాషే తల్పస్థోన సమాచరేత్ నచాసీనో నభుంజానో న తిష్ఠన్న పరాజ్ముఖః
ఆసీనస్య స్థితః కుర్యాదభిగచ్ఛంశ్చ తిష్ఠతః ప్రత్యుద్గన్తాచ ప్రజతః పశ్చాద్దావంశధావతః
పరాజ్ముఖస్యాభిముఖో దూరస్థ స్యైత్యచాన్తికమ్ నమస్కృత్య శయానస్య నీదేశే తిష్ఠత్సర్వదా
నీచం శయ్యాసనం చాస్య సర్వదాగురుసన్నిధౌ గురోశ్చచక్షుర్విషయే న యథేష్టాసనో భవేత్
నామోచ్చారణ మేవాస్య పరోక్షమపి సువ్రత నచైన మను కుర్వీత గతి భాషణ చేష్టితై:
తా ॥ కురునందనా! ఇప్పుడు చెప్పినదంతయు బ్రాహ్మణునకు సంబంధించిన కర్మయే. ఇది క్షత్రియులకు వైశ్యులకు కాదని పండితులు చెప్పుచున్నారు. ఆచార్యుని ప్రేరణ ఉండినను, ఉండ కున్నను, నిత్యము అధ్యయనమునందు, గురుహితకార్యములందు మనసు నిలిపి యండవలెను. మనస్సుతోసహా బుద్ధిని, ఇంద్రియములను, శరీరమును, వాక్కును నిగ్రహించుకొని, ప్రాంజలియై, గురుముఖమును వీక్షించుచు నిలచియుండవలెను. సదాచారుఁడై, సంయతుడై, ఎప్పుడును పైకెత్తిన చేతులతో నమస్కరించుచు, గురువు కూర్చుండుమని చెప్పిన తరువాత గురువునకభిముఖముగ కూర్చుండవలెను. గరుసన్నిధిలో నున్పప్పుడు వస్త్రవేషముల విషయమునను, ఆహార విషయమునను మితిగా నుండవలెను. ప్రతిశ్రవణ సంభాషణములు తల్పస్థుడైయుండిగాని, కూర్చుండిగాని, తినుచుగాని, నిలబడియుండీగానీ, పెడమొగమునగాని చేయకూడదు. గురువు కూర్చుండియుండినప్పుడు తాను సమీపమున నుండి, ఎదురుగా వచ్చుచున్నవాడైన తాను వెనుకకు పరుగెత్తుచు ప్రక్కకు తిరిగియున్న, తాను అభిముఖుడై, దూరస్తుఁడైయుండిన సమీపమునకు వెడలి, శయనించియుండినవాడైన తాను నమస్కరించి, యిట్లు ప్రతిశ్రవణ భాషణములు చేయవలెను. గురువు ఉపదేశంచు వేళ తానెప్పుడును నిలబడియే యుండవలెను. గురుసన్నిధానమున శిష్యుని శయ్యాసనములు దిగువనే యుండవలయును. గురువు చూచునప్పుడు శిష్యుడు ఇష్టము వచ్చినట్లు కూర్చుండరాదు. పరోక్షమునందైనను గురువు పేరు నుచ్చరింపరాదు. గురువుగారి నడకను గాని, మాటనుగాని, చేష్టలనుగాని శిష్యుఁడనుకరింపరాదు.
శ్లో ॥ పరివాదస్తథా నిందా గురోర్యత్రప్రవర్తతే కర్ణౌతత్ర పిథాతవ్యౌ గస్తవ్యంవా తతోఽన్యతః
పరీవాదాద్రాసభస్స్యాత్సారమేయస్తు నిందకః పరిభోక్తా కృమిర్భవతి కీటోభవతి మత్సరీ
దూరస్థోనార్చయే దేనం నక్రుద్ధో నాస్తికే స్త్రీయాః యానాసనగతో రాజన్! అవరుహ్యాభివాదయేత్
ప్రతికూలే సమానేతు నాసీత గురుణా సహా అశ్రుణ్వతి గురౌ రాజన్ నకించిదపి కీర్తయేత్
గోశ్వోష్ట్రయాన ప్రాసాద ప్రస్తరేషు కటేషుచ అసీత గురుణా సార్థం శిలాఫలకనౌషుచ
గురోర్గురౌ సన్నిహితే గురువద్వృత్తి మాచరేత్ గురుపుత్రేషు చార్యేషు గురోశ్చైవ స్వబంధుషు
బాలః సమాన జన్మావా విశిష్టాయజ్ఞ కర్మణి అధ్యాపయన్గురుసుతో గురువన్మానమర్హతి
ఉత్సాదన మథాంగానాం స్నాపనోచ్ఛిష్టభోజనే పాదయోర్నేజనం రాజన్! గురుపుత్రేషు వర్జయేత్
గురువత్ప్రతి పూజ్యాస్తు సవర్ణా గురు యోషితః అసవర్ణాస్తు సంపూజ్యాః ప్రత్యుత్థానాభివాదనై:
అభ్యంజనం చ స్నపనం గాత్రోత్సాదనమేవచ గురుపత్న్యాన కార్యాణి కేశానాంచ ప్రసాధనమ్
తా ॥ గురువును దూజుట, నిందించుట మొదలగునవి జరుగుచోట చెవులుమూసి కొనవలయును. లేక అచట నుండి వేడొక చోటకు పోవలయును. గురుపరివాదకుడు గాడిదయగును. నిందకుడు కుక్కయగును. గురువు నవమానించువాడు కృమియగును. గురువుయెడ మత్సరించినవాడు కీటకమగును. దూరమున నున్నప్పుడుగాని, క్రుదుఁడైయున్నప్పుడుగాని, స్త్రీల సమీపమున నున్నప్పుడుగాని గురువును నమస్కారాదికముతో గౌరవింపరాదు. యానాసనగతుఁడైనచో వానినుండి దిగిన పిదప అభివాదము చేయవలెను. గురువుతో సమానమగు ఆసనమునగానీ ప్రతికూలాసనమందుగాని కూర్చుండరాదు. గురువునకు వినబడకుండ ఏ విషయమైనను మాట్లాడరాదు. ఎడ్లు, గుఱ్ఱములు, ఒంటెలు మొదలగువాని వాహనముల పైన, ప్రాసాదముల పైన, బిళ్ళ పైన చాపల పైన, శిలాఫలకముల పైనను, నౌకలమీదను గురువుతో సహా కూర్చుండవచ్చును. గురువునకు గురువైనవాడు సన్నిహితుఁడైనపుడు అతని యెడ గురువునకు వలెనే ప్రవర్తింపవలెను. గురుపుత్రులయందు పూజ్యులైన గురుబంధువులయందును అటులే గౌరవభావముతోనుండవలెను. అధ్యాపనము చేయుచున్న గురువుయొక్క పుత్రుఁడు బాలుఁడైనను, సమవయస్కుడైనను, యజ్ఞకర్మలలో విశిష్ఠుఁడైనను గురువునకువలె గౌరవార్థుడగును. అంగములకు నలుఁ గు పెట్టుట, స్నానము చేయించుట, ఎంగిలి తినుట, పాదములు కడుగుట, గురుపుత్రుల విషయమున వదలవలెను. సవర్ణులైన గురుభార్యలు గురువువలెనే పూజ్యురాండ్రు. అసవర్ణులైనచో ప్రత్యుత్థానము, అభివాదములతో గౌరవింపవలెను. అభ్యంజనముచేయుట, స్నానముచేయించుట, అంగములకు నలుఁగు పెట్టుట తలవెంట్రుకలు దువ్వి అలంకరించుట గరుపతి విషయమున చేయకూడదు.
శ్లో ॥ గురుపత్నీంతు యవతీం నాభివాదేత పాదయోః పూర్ణవింశతి వర్షేణ గుణదోష విజానతా
స్వభావ ఏవనారీణాం నరాణా మిహ దూషణమ్ అతోర్ధాన్న ప్రమాద్యంతి ప్రతిపాద్యా విపశ్చితః
అవిద్వాం సమలంలోకే విద్వాంసమపి వాపునః ప్రమదా హ్యుత్పథంనేతుం కామక్రోధవశానుగమ్
మాత్రా స్వస్రాదుహితావా న వివిక్తాసనోభవేత్ బలవనింద్రియ గ్రామో విద్వాంస మపి కర్షతి
రాజేంద్ర! గురుపత్నీనాం యువతీనాం యువాభువి విధివద్వందనం కుర్యాదసావహమితి బ్రువన్
విప్రోఽస్యపాద గ్రహణ మన్వహం చాభివాదనమ్ గురుదారేషు కుర్వీత సతాంధర్మమనుస్మరన్
యథాఖనన్ ఖనిత్రేషు జలమాప్నోతి మానవః తథా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్ఛతి.
ముండోవా జటిలోవా స్యాదథవాస్యాచ్ఛిఖీ జటీ నైనంగ్రామేఽభి నిమ్లోచేదర్కోనాభ్యుదయాత్క్వచిత్
తంచేతభ్యుదయాత్సూర్యః శయానం కామకారతః నిమ్లోచేద్వాప్యభిజ్ఞానాజ్ఞపన్నుపవ సేద్దీనమ్
సూర్యేణ హ్యభినిర్ముక్తః శయానోభ్యుదితశ్చయః ప్రాయశ్చిత్త మకుర్వాణో యుక్తః స్యాన్మహతైనసా
తా ॥ ఇరువది సంవత్సరముల వయస్సు నిండిన గుణదోషజ్ఞుడు, యువతియైన గురుపత్నిపాదములకు నమస్కరింపరాదు. స్త్రీ పురుషుల స్వభావమే దూషితమైనది. అందువలన జ్ఞానప్రయోజన కార్యముల నుండి పండితులు ప్రమాదపడరు, లోకమున విద్వాంసునిగాని, పామరునిగాని కామక్రోధవశానుగమైన కానిత్రోవకు తీసికొని పోవుటకు ఒక్క స్త్రీ చాలును. తల్లితోగానీ, సోదరితో గాని, కూఁతురుతోగానీ ఏకాంతమున కూర్చొనరాదు. ఇంద్రియ సమూహము బలవత్తరమైనది. అది పండితుని కూడ ఆకర్షించును. రాజేంద్రా! యువకుడు, యువతులైన గురుపత్నులకు నేను ఫలనా వానిని' అని చెప్పుచు. విధి విధానముగా వందనమాచరింపవలెను. సత్పురుషుల ధర్మమును గుర్తించుచు గురుపత్నులకు, గురువునకు పాదగ్రహణముచేతను బ్రాహ్మణుఁడభివాదము చేయవలయును. మానవుఁడు గడ్డపాణతో నేలను త్రవ్వుచు నీటిని ఎట్లు పొందునో అటులే గురుగతమైన విద్యను శుశ్రూష చేత పొందును. బ్రహ్మచారి, అవధూత, యోగి, యతి వీరిలో నెవరైనను గ్రామమునుండగా సూర్యుడస్తమింపరాదు. ఉదయింపరాదు. ఉదయాస్తమయములలో గ్రామమున ఉండరాదు. స్వేచ్ఛగా పండుకొనిన అట్టివారిని తిరస్కరించి సూర్యుడుదయించినగాని లేక తెలివి. వలననుండి అస్తమించినగానీ ఆదినమున జపము చేయుచు ఉపవసింపవలేను. సూర్యోదయాస్తమయ సమయములలో నిద్రించువారు ప్రాయశ్చిత్తము చేసికొననిచో మహాపాపముతో కూడినవాడగును.
శ్లో ॥ ఉపస్పృశ్య మహారాజ! ఉభే సంధ్య సమాహితః శుచౌదేశీ జపం జప్యముపాసీత యథావిధి
యది స్త్రీయ ద్యవరజః శ్రేయః కించిత్పమాచరేత్ తత్సర్వమాచరేద్యుక్తో యవా రమతే మనః
ధర్మార్ధావుచ్యతే శ్రేయః కామార్థౌ ధర్మమేవచ అర్థ ఏవేహవా శ్రేయస్త్రి వర్గ ఇతి సంస్థితి:
పీతా మాతా తథా భ్రాతా ఆచార్యాః కురునన్దన! నార్తీనాప్యవమంతవ్యా బ్రాహ్మణేన విశేషతః
ఆచార్యో బ్రహ్మణో మూర్తి: పితా మూర్తి: ప్రజాపతేః మాతాప్యధ దితేర్మూర్తిర్ర్భాతాస్యాన్మూర్తిరాత్మనః
యన్మాతా పితరౌ క్లేశం స హేతే సంభవే నృణామ్ నతస్య నిష్కృతిః శక్యకర్తుం వర్షశతైరపి
తయోర్నిత్యం ప్రియం కుర్యాదాచార్యస్యచ భారత! తేషు హి త్రిషు తృష్టేషు తపః సర్వం సమాప్యతే
తేషాం త్రయాణాం శుశ్రూషా పరమం తప ఉచ్యతే న తైరనభ్యనుజ్ఞాతో ధర్మమన్యం సమాచరేత్
తఏవహి త్రయోలోకాస్త ఏవత్రయ ఆశ్రమాః తఏవచత్రయోవేదాన్త ఏవోక్తాస్త్రయోఽగ్నయః
మాతావైగార్హపత్యాగ్నిః పితావై దక్షిణః స్మృతః గురు రాహవనీయశ్చ సాగ్నిత్రేతా గరీయసీ
తా॥ మహారాజా! ఉభయ సంధ్యలయందును సమాహితుడై ఆచమించి, పరిశుద్ధమైన ప్రదేశమునందు కూర్చుండి యథావిధిగా జపము చేసికొనవలెను. స్త్రీ యైనను తమ్ముడైనను శ్రేయమునొడగూర్చినచో అట్టి శ్రేయమును సర్వమును మనసుకు నచ్చిన సమయమున వారికి చేయవలెను. ధర్మార్థకామములు త్రివర్గమనబడును. ఇందు ధర్మార్థములు శ్రేయమని చెప్పబడును. ఇహమునందు అర్థమే శ్రేయమని వికల్పము. తల్లి, తండ్రి, సోదరుఁడు, ఆచార్యుఁడు వీరిలో ఎవరినైనను, ఆర్తుడైయున్నను అవమానింపరాదు. బ్రాహ్మణునకిది విశేష ధర్మము. ఆచార్యుఁడు బ్రహ్మ స్వరూపుఁడు. తండ్రి ప్రజాపతి స్వరూపుఁడు. తల్లి అదితిమూర్తి. సోదరుఁడు ఆత్మ (తన) స్వరూపుఁడు. కొడుకులు కలిగిన పిదప కూడా తల్లిదండ్రులు క్లేశమును సహింపవలసి వచ్చినచో దానిని ఊరకచూచు కుమారునకు వందలేండ్ల వఱకును నిష్కృతి సాధ్యము కాదు. హే భారత! తల్లిదండ్రులకును ఆచార్యునకును ఎప్పుడును ప్రియ మొనర్చుచుండవలెను. వీరు మువ్వురు తృప్తి పడిననే తపస్సు సర్వమును సమాప్తమగును. వారి శుశ్రూషయే శ్రేష్టమగు తపస్సు అని చెప్పబడును. వారి యనుజ్ఞలేనిదే ఏ ఇతర ధర్మమునైనను ఆచరింపకూడదు. వారే మూడు లోకములు వారే మూడు ఆశ్రమములు. వారే మూడు వేదములు. వారే మూడు అగ్నులు. తల్లి గార్హపత్యాగ్ని, తండ్రి దక్షిణాగ్ని. గురువు ఆహవనీయాగ్ని. ఈ త్రేతాగ్నులే మహత్తరమైనవి.
శ్లో ॥ త్రిషు తుస్టేషు చైతేషు త్రీన్లోకాన్జయతే గృహీ దీప్యమానః స్వవపుషా దేవ వద్దివి మోదతే
ఇమంలోకం పితృభక్త్యా మాతృభక్త్యాతు మధ్యమమ్గురు శుక్రూషయాచైవ గచ్ఛేచ్ఛక్ర స లోకతామ్
సర్వేతేనా దృతా ధర్మా య స్యైతే త్రయ ఆదృతాః అనాదృతాస్తుయేనైతే సర్వాస్తస్యాఫలాః క్రియాః
యావత్రయ స్తే జీవేయుస్తావన్నాన్యత్సమాచరేత్ తే ష్వేవ నిత్యం శుశ్రూషాం కుర్యాత్ప్రియహితేరతః
తేషామనుపరోధేన పార్థక్యం యద్యదాచరేత్ తత్తన్నివేదయేత్తేభ్యో మనో వచన కర్మభిః
త్రిష్యేతేష్వపి కృత్యంహి పురుషస్య సమాప్యతే ఏష ధర్మః పరః సాక్షాదుపధర్మోన్య ఉచ్యతే
శ్రద్ద ధానః శుభాం విద్యామాదదీతావహదపి అంత్యాదపి పరం ధర్మం స్త్రీ రత్నం దుష్కులాదపి
విషాదప్య మృతం గ్రాహ్యం బాలాదపి సుభాషితమ్ అమిత్రాదపి సద్వృత్తమమే ధ్యాదపీ కాంచనమ్
స్త్రీయోరత్నం నయోవిద్యా ధర్మః శౌచం సుభాషితమ్ వివిధానిచశిల్పాని సమాదేయాని సర్వశః
అబ్రాహ్మణా దధ్యయనమా పత్కాలే విధీయతే అనువ్రజ్యాచ శుశ్రూషా యావదధ్యయనం గురోః
తా ॥ ఈ ముగ్గురు తృప్తిగా నుండిన, గృహస్థుఁడు మూడు లోకములను జయించును. ఇహ లోకమున దీప్యమానుఁడై, ఆ పిదప దివ్యునివలె స్వర్గమున ఆనందించును. పితృభక్తిచేత ఈ లోకమును, మాతృభక్తి చేత మధ్యమలోకమును, గురు శుశ్రూషచేత స్వర్గమును పొందును. ఈ ముగ్గురిని ఆదరించినవాఁడు సర్వ ధర్మములను ఆదరించినవాఁడగును. ఇట్లు మువ్వురిని ఆదరింపని వాని కార్యములన్నియును నిష్ఫలములగును. వారు జీవించియున్నంత కాలము నిత్యము వారి శుశ్రూషచేయుచు వారికే ప్రియమును హితమును కూర్చుటయందే బుద్దినిలిపి యుంచవలయునే కాని అన్యమేమియు చేయవలదు. ఇదియే పరమ ధర్మము. అన్యమైనది ఉపధర్మము మాత్రమే అని చెప్పబడును. ఈ ముగ్గురియందే పురుషుడు చేయవలసిన దంతయు సమాప్తమగుచున్నది. వారి నిర్నిరోధముగ వేటు పనులేవి చేసినను ఆయా పనులను గుణించి వారికి త్రికరణ శుద్ధిగా నివేదింపవలేను. శ్రద్ధాళువై, శుభప్రదమైన విద్యను శూద్రుని నుండియైనను, అంత్యజునినుండియైనను గ్రహింపవలెను. స్త్రీ రత్నమును దుష్కలము నుండి యైనను గ్రహింపవలెను. ఇది పరమ ధర్మము. విషము నుండి యైనను అమృతము, బాలుని నుండియైనను సుభాషితము, అమిత్రుని నుండియైనను సద్వృత్తము, అపరిశుద్ధము నుండియైనను బంగారము గ్రహింపఁ దగినది. స్త్రీలు, రత్నము, నీతి, విద్య, ధర్మము, శుచిత్వము, సుభాషితము, వివిధములైన శిల్పములు అన్ని చోటుల నుండియు గ్రహింపదగినవి. అబ్రాహ్మణుని నుండి విద్యా స్వీకారము ఆపత్కాల ధర్మముగా విధింపబడును. గురువు వద్ద అధ్యయనము సాగుచున్నంత వఱకే భిక్షా చర్య, శుశ్రూషయు చేయవలెను.
శ్లో ॥ నా బ్రహ్మణే గురౌ శిష్యో వాసమాత్యంపాకం వసేత్ బ్రాహ్మణే చాననూచానే కాంక్షన్గతి మనుత్తమామ్
యది త్వాత్యంతికోవాసో రోచతేచ గురోః కులే యుక్తః పరిచరేదేనమా శరీర విమోక్షణాత్
ఆ సమాప్తేః శరీరస్యయస్తు శుశ్రూషతే గురుమ్ సగచ్ఛత్యంజసా విప్రో బ్రహ్మణః సద్మశాశ్వతమ్
నపూర్వం గురవే కించి దుపకుర్వీత ధర్మవిత్ స్నానాయ గురుణాజ్ఞప్తః శక్త్యా గుర్వర్థమాహరేత్
క్షేత్రం హిరణ్యం గామశ్వం ఛత్రోపానహమేవచ ధాన్యం వాసాంసి శాకంవా గురవే ప్రీత మా హరేత్
స్వర్గతే గాం పరిత్యజ్య గురౌ భరత సత్తమ! గుణాన్వితే గురుసుతే గురుదారేఽథవా నృప!
సపిండే వాగురోశ్చాపి గురువద్వృత్తిమాచరేత్
ఏతేష్వ విద్య మానేషు స్థానాసన విహారవాన్ ప్రయుంజానోఽగ్ని శుశ్రూషాం సాధయేద్దేహ మాత్మనః
వీరస్య కుర్వన్ శుశ్రూషాం యాతి వీరసలోకతామ్
చరత్యేవం హి యో విప్రో బ్రహ్మచర్యమ విప్లుతః సగత్వా బ్రహ్మ సదనం బ్రహ్మణా సహమోదతే
ఇత్యేష కథితో ధర్మః ప్రథమం బ్రహ్మచారిణః గృహస్థస్యాపి రాజేంద్ర! శ్రుణు ధర్మమశేషతః
కాలే ప్రాప్య వ్రతం విప్ర ఋతుయోగేన భారత! ప్రపాలయన్ర్వంతం యాతి బ్రహ్మసాలోక్యతాం విభో!
తా ॥ అబ్రాహ్మణుఁడైన గురువు సమీపమున శిష్యుఁడు నివసింపనక్కఱలేదు. సాంగ వేదాధ్యయనముగల బ్రాహ్మణుని గురువుగా పొందగోరుటయే ఉత్తమమైనది. ఒకవేళ గురుకులమునందే నివసించుట రుచించినయెడల శరీర మోక్షణము వఱకును అచట గురు సేవలో ఉండుట యుక్తమైనది. శరీర సమాప్తి వఱకును గురుశుశ్రూష చేయువాఁడు శాశ్వతమైన బ్రహ్మపదమును పొందును. ధర్మ విదుడు విద్యాభ్యాసమునకు పూర్వము గురువున కేమియు ఈయనక్కఱలేదు. స్నాతకము వఱకు గుర్వాజ్ఞతో ‘గురు దక్షిణ', శక్తిననుసరించి సమర్పింపవలేను. క్షేత్రము, బంగారము, గోవు, అశ్వము, ఛత్రము, పాదరక్షలు, ధాన్యము, వస్త్రములు, లేక శాకమైనను గురువునకు ప్రీతితో నర్పింపవలెను. భరత సత్తమా! గురువు స్వర్గస్థుఁ డైన గురుపుత్రుని, భార్యను లేక గురువుగారి సపిండులను గురువును వలె గౌరవింపవలేను. వీరును లేని పక్షమున ఇట్లు అవిప్లుతముగా బ్రహ్మచర్య వ్రతమును పాటించు బ్రాహ్మణుఁడు బ్రహ్మ లోకమును పొంది బ్రహ్మతో కూడి ఆనందించును. ఈ విధముగా మొదట బ్రహ్మచారి ధర్మము చెప్పబడినది. రాజేంద్ర! ఇఁక గృహస్థ ధర్మమును సొంతముగ వినుము. బ్రహ్మచర్యవ్రత దీక్షను నిర్ణీత ఋతుయోగమున స్వీకరించి, దానిని చక్కగా అనుష్ఠించినచో బ్రహ్మసాలోక్యము కలుగును.
శ్లో ॥ సదోపనయనం శస్తం వసంతే బ్రాహ్మణస్యతు క్షత్రియస్యతతో గ్రీష్మే ప్రశస్తం మనురబ్రవీత్
ప్రాప్తే శరది వైశ్యస్య సదోపనయనం పరమ్ ఇత్యేష త్రివిధః కాలః కథితో వ్రతయోజనే.
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్యాం సంహితాయాం బ్రాహ్మేపర్వణీ ఉపనయన విధి వర్ణనం నామ చతుర్థోఽధ్యాయః
తా ॥ వసంతర్తువున బ్రాహ్మణునకు, గ్రీష్మమున క్షత్రియునకు, శరత్కాలమున వైశ్యునకు ఉపనయనము శ్రేష్ఠమని మనువు చెప్పెను. ఇట్లు వ్రత యోజనమున మూడు విధములైన కాలము చెప్పఁబడినది.
ఇది శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున ఉపనయన విధి వర్ణనమను నాలుగవ అధ్యాయము.
Summary of chapter 4 of the Bhavishya Mahā Purana is as follows:
The Oṃkāra is declared the highest of all mantras: the syllable that contains within it the entire Vedic teaching. The Gāyatrī Mahāmantra is revealed as the supreme gift given to humanity by Brahma, and the morning and evening sandhyāvandana is established as the non-negotiable daily obligation of every twice-born. The chapter distinguishes between three categories of guru — the father who begets the body, the ācārya who initiates into the Veda, and the teacher who imparts specific vidyās — and defines the student's obligation toward each. The Āṅgirasa narrative illustrates how the faithful observance of brahmacarya generates the highest tapas-power, enabling the student to illuminate not only his own lineage but all who come after him.