భవిష్య మహా పురాణము
5. స్త్రీ లక్షణ వర్ణనము
సుమంతురువాచ :
శ్లో ॥ షట్త్రింశదాబ్దికం చర్యం గురౌత్రై వేదికం వ్రతమ్ తదర్థికం సాదికంవా గ్రహణాంతికమేవచ
వేదానధీత్య వేదౌవా వేదం వాపి నృపోత్తమ! అవిప్లుత బ్రహ్మచర్యో గృహస్థాశ్రమ మావసేత్
తం ప్రతీతం స్వధర్మేణ బ్రహ్మదాయ హరంపితుః స్రగ్విణం తల్ప ఆసీన మర్హయే త్పధమం గవా
గురుణా సమనుజ్ఞాతః సమావృత్తో యధావిధి ఉద్వహేత ద్విజోభార్యాం సవర్ణాం లక్షణాన్వితామ్
శతానీక ఉవాచ :
లక్షణం ద్విజశార్దూల! స్త్రీణాం వద మహామునే! కీదృగ్లక్షణ సంయుక్త కన్యాస్యాత్సుఖదా నృప!
సుమంతురువాచ :
యదుక్తం బ్రహ్మణాపూర్వం స్త్రీలక్షణ మనుత్తమమ్ శ్రేయసే సర్వలోకానాం శుభాశుభ ఫలప్రదమ్
తత్తేవచ్మి మహాబాహో! శృణుష్వైకమనా నృప! శ్రుతేన యేన జానీ షే కన్యాం శోభన లక్షణామ్
సుఖాసీనం సురశ్రేష్ఠ మభిగమ్య మహర్షయః పప్రచుర్లక్షణం స్త్రీణాం యత్పృష్టోఽహం త్వయాధునా
ప్రణమ్యశిరసాదేవమిదం వచన మబ్రువన్ భగవన్! బ్రూహినః సర్వం స్త్రీణాం లక్షణ ముత్తమమ్
శ్రేయసే సర్వలోకానాం శుభాశుభ ఫలప్రదమ్ ప్రశస్తామప్రశస్తాంచ జానీమోయేన కన్యకామ్
తాII సుమంతుముని యిట్లనెను. “ముప్పదియారు సంవత్సరములు గురు సన్నిధిలో మూడు వేదములు నేర్చుకొనుచు గడుపవలసియుండును. లేక అందుసగమో, నాల్గవ భాగమో (వేదముల సంఖ్యను బట్టి) బ్రహ్మచర్య వ్రతముండును. మూడు వేదములనుగాని, రెంటినిగాని, ఒక వేదమునుగాని అకుంఠిత బ్రహ్మ చర్య వ్రతముతో నధ్యయనము చేసి ఆ పిదప గృహ స్థాశ్రమమున నుండవలెను. స్వధర్మముచేత ప్రతీతి పొందినవాఁడు, గురువునుండి వేద భాగమును జీర్ణించుకొనినవాఁడును, మాలాలంకృతుఁడును, తల్పము పైన కూర్చుండిన వాఁడును అయిన అతనిని మొదట వాక్కుతో (లేక మధుపర్కముతో) పూజింపవలెను. గురువుచేత, వివాహితుఁడగుట కనుజ్ఞపొంది, యథావిధిగ, ఆ ద్విజుఁడు సవర్ణ, సలక్షణమైన కన్యను వివాహమాడవలెను. శతానీకుఁడిట్లనెను. “మహామునీ! స్త్రీల లక్షణమును తెలుపుడు, ఏ లక్షణములతో కూడిన కన్య సుఖము నిచ్చునది యగునో సెలవిండు”. శతానీకుని ప్రశ్నకు సుమంతుఁడు ఇట్లు సమాధానము చెప్పెను. “శుభాశుభఫల ప్రదత్వము నెఱుఁగుట ద్వారా సర్వలోకములకు శ్రేయమును కలిగించు నుత్తమ స్త్రీ లక్షణము పూర్వము బ్రహ్మదేవునిచే చెప్పఁబడిన దానిని. నీకు చెప్పెదను. ఏక మనస్కుఁడవై వినుము. వినుటచేత శోభన లక్షణమైన కన్య యెట్టిదో తెలిసికొందువు. సుఖాసీనుఁడైయున్న పరమేష్ఠి వద్దకు మహరులందఱువెడలి, ఇప్పుడు నీవు నన్నడిగినట్లే ఉత్తమ స్త్రీ లక్షణమును గూర్చి ఆయన నడిగిరి. బ్రహ్మకు శిరమువంచి నమస్కరించి ఆ మహరులిట్లనిరి. “భగవన్! ఉత్తమ స్త్రీ లక్షణమును మాకు తెలుపుడు. శుభాశుభ ఫలప్రదముగా, సర్వ లోకముల శ్రేయస్సు కొఱకు మీరు చెప్పిన దానినిబట్టి ఏ కన్య ప్రశస్తమైనదోఏది అప్రశస్తమైనదో మేము తెలిసికొందుము".
శ్లో ॥ తేషాం తద్వచనం శ్రుత్వా విరించో వాక్యమబ్రవీత్ శ్రుణుధ్వం ద్విజశార్దూల వచ్మి యుష్మా స్వశేషతః
ప్రతిష్ఠితతలౌ సమ్యగ్రక్తాంభోజ సమప్రభో ఈ దృశౌ చరణా ధన్యౌ యోషితాం భోగవర్థనౌ
కరాలైరతి నిర్మాం పై రూక్షై రర్థ శిరాన్వితైః దారిద్ర్యం దుర్భగత్వంచ ప్రాప్నువంతి న సంశయః
అంగుల్యాః సంహతావృత్తా: స్నిగ్ధః సూక్ష్మన ఖాస్తథా కుర్వంతత్యంతమైశ్వర్యం రాజభావంచ యోషితః
హ్రస్వాః సుజీవితం హ్రస్వా ఏరలా విత్తహానయే దారిద్ర్యం మూలమగ్నాసు ప్రపంచ పృధులాసుచ
పరస్పర సమారూడైస్తనుభిర్వృత్త పర్వభిః బహూనపి పతీన్హత్వా దాసీ భవతి వైద్విజాః
అంగుష్ఠోన్నత పర్వాణస్తుంగాగ్రాః కోమలాన్వితాః రత్నకాంచనలాభాయ విపరీతా విపత్తయే
సుభగత్వం నఖై: స్నిగ్ధైరాతామ్రైశ్చధనాఢ్యతా పుత్రాఃస్యురున్నతైరేభిః సుసూక్ష్మైశ్చాపిరాజతా
పాండురైః స్ఫుటితై రూక్షైర్నీలై ర్థూమైస్తథాఖరైః నిఃస్వతా భవతి స్త్రీణాం పీతైశ్చాభక్ష్యభక్షణమ్
గుల్ఫాః స్నిగ్దాశ్చ వృత్తాశ్చ సమారూఢ శిరాస్తథా యది స్యుర్నూపురాన్దధ్యుర్బాంధ వాద్యైః సమాప్నుయుః .
తా॥ వారి ఆ మాట విని బ్రహ్మ ఇట్లనెను. “బ్రాహ్మణ శ్రేష్టులారా! వినుడు. మీ కంతయు చెప్పెదను. ఎఱదామర వంటి కాంతి కలిగి నేలమీద చక్కగా ఆనెడు పాదములు ఉండుట స్త్రీలకు శ్రేష్ఠము. అట్టి పాదములు భోగవర్థనములు. ఎగుడు దిగుడులై కఱకుగా నుండి, మాంసములేక, అర్థశిరాన్వితములై (నగము సగముగా నరములు కప్పట్టునట్లు) ఉండు పాదముల వలన దారిద్ర్యము, దుర్భగత్వము కలుగును. సంశయములేదు. చక్కని అమరిక కలిగి, నునుపు కలిగి, గుండ్రదనము కలిగి, సన్నని గోళ్లుగల వేళ్లు స్త్రీలకు మిక్కిలి ఐశ్వర్యమును, ప్రభుతను కలుగజేయును. కురుచగ నున్న, చక్కని జీవితము నిచ్చును. కురుచగ నుండి వంకరైనవి విత్తహాని చేయును. మిక్కిలి బక్కచిక్కి, గుండ్రని కణుపులతో నున్న వేళ్లుగల స్త్రీ చాలా మంది భర్తలను చంపి దాసియగును. బొట్టన వ్రేళ్ల కణుపులు ఎత్తైన కొనలు గలవియై కోమలములుగ నుండిన రత్న కాంచన లాభము కలుగును. దీనికి విరుద్ధముగ నుండిన విపత్తు కలిగించును. గోళ్లు చిక్కగనునుపుకలిగియున్న సుభగత్వము కలుగును. రాగి వర్ణముతో ప్రకాశించుచుండిన ధనాఢ్యత కలుగును. ఉన్నతములుగనున్న పుత్రులు కలుగుదురు. మిక్కిలి సూక్ష్మముగా నున్న ప్రభుత కలుగును. పాండుర వర్ణమున నున్నను, పగుళ్లుండినను కరుకుగా నున్నను, నీల వర్ణములో నున్నను, పొగ రంగులో నున్నను, వాడిమి కలిగియున్నను అట్టి స్త్రీలకు నిఃస్వయోగము' పట్టును. గోళ్లు పసుపు వన్నెలో నున్న అభక్ష్య భక్షణము సంభవించును. చీల మండలు నునుపు గలిగి, గుండ్రనివై, శిరలతోనుండి, నూపురములనుకూడ ధరించినవైనచో నట్టి స్త్రీలు బంధు పరివారములతో నుందురు.
శ్లో ॥ అశీరాః శరకాండాభాః సువృత్తాల్పతనూరుహాః జంఘాః కుర్వంతి సౌభాగ్యం యానంచగజపాజిభిః
క్లిశ్యతే రోమ జంఘాస్త్రీ భ్రమత్యుద్ధత పిండికా కాక జంఘా పతింహస్తివాచాటా కపిలాచయా
జానుభిశ్చైవ మార్షార సింహ జాన్వను కరిభిః శ్రియమాప్య సుభాగ్యత్వం ప్రాప్నువంతి సుతాంస్తథా
ఘటా భైరధ్వగా నార్యోనిర్మాం సైః కులటాస్త్రియః శిరాలైరపి హింస్రాః స్యుర్విళ్లి ఫ్లైర్థన వర్జితాః
అత్యంత కుటిలైరూక్షైః స్ఫుటితాగ్రైర్గుడ ప్రభైః అనేక జైస్తథారోమైఃకేశైశ్చాపి తథావిధైః అత్యంత పింగలానారీ విషతుల్యేతి నిశ్చితమ్ సప్తాహాభ్యంతరేపాపా పతింహ న్యాన్నసంశయః
హస్తిహస్త నిభైర్వృత్తై రంభాభైః కరణోపమైః ప్రాప్నువంత్యూరుభిః శశ్వత్ స్త్రియః సుఖమనంగజమ్
దౌర్భాగ్యం బద్ధ మాం సైశ్చ బంధనం రోమ శోరుభిః తను భిర్వధమిత్యాహు ర్మధ్యచ్ఛిద్రేష్వనీశతా
సంధ్యావర్ణం సమంచారు సూక్ష్మరో మాన్వితం పృథు జఘనం శస్యతే స్త్రీణాం రతి సౌఖ్యకరం ద్విజ!
అరోమకో భగో యస్యాః సమః సుశ్లిష్ట సంస్థితః అపి నీచ కులోత్పన్నా రాజపత్నీ భవత్య సౌ
తా॥ నరములులేనివి, బాణపు కజ్ఞలవలె చక్కనివై, గుండ్రదనము కలిగి, అల్ప రోమములు గల జంఘలు (పిక్కలు) సౌభాగ్యమును కలిగించును. ఏనుగు నడక వంటి నడకను, సక్షి (హంస) గమనము వంటి గమనమును కలిగించును. రోమములున్న పిక్కలు గల స్త్రీ క్లేశము పొందును. ఉవ్వెత్తుగనున్న నాభి గల స్త్రీ తిరుగుఁబోతగును. కాక జంఘ పతిని సంహరించును. గోరోజనము వంటి వర్ణముగలది వదరుబోతగును. పిల్లి, సింహముల మోకాళ్ల వంటి మోకాళ్లు గల స్త్రీలు సంపదలను, సౌభాగ్యములను, సంతానమును పొందుదురు. జానువులు కుండలను బోలియున్న స్త్రీలు త్రిప్పటగలవారగుదురు. మాంస రహితముగనున్న కులటలగుదురు. నరములు కలిగియున్న చంపువారగుదురు. వేరు చేయబడినట్లున్న ధన హీనలగుదురు. మిక్కిలి వంకరగానున్నను కఱుకుగా నున్నను, భేదించినట్లున్న ఆగ్రములు కల్గియున్నను, గోళములవలెనున్నను, దట్టమైన రోమములు, వెంట్రుకలు కలిగియున్నను అట్లేయగుదురు. మిక్కిలి గోరోచనము వన్నె కలిగిన స్త్రీ నిశ్చయముగ విషతుల్యమైనది. ఆమె వారము దినములలోపలనే భర్తను హతమార్చును. సంశయములేదు. ఏనుగుల తొండములవలె, గుండ్రని అరటిస్తంభములవలె, మణి బంధము నుండి కనిష్ఠిక పర్యంతమైన హస్త భాగమువలె తొడలు కలిగిన స్త్రీలు ఎప్పుడును మన్మథ సుఖమును పొందెదరు. బద్ధమాంసములైన దౌర్భాగ్యమును, రోమయుక్తమైన బంధనమును, సన్నగానున్న వధను, మధ్యచ్ఛిద్రములైయున్న అనీశతను కలిగించునని చెప్పుదురు. సంధ్యావర్ణమున, సమముగా, అందముగా, సూక్ష్మరోమములతో, గొప్పగ నుండిన నడుము స్త్రీలకు ప్రశస్తమైనది. రతి సౌఖ్యమునిచ్చునది యగును. అరోమకము, సుశిష్టమునైన భగముగల స్త్రీ, నీచ కులమునఁ బుట్టినను రాజపతియగును.
శ్లో॥ అశ్వత్థ పత్ర సదృశః కూర్మపృష్ఠోన్నతస్తథా శశిబింబ నిభశ్చాపి తథైవ కలశాకృతి:
భగః శస్తతమః స్త్రీణాం రతి సౌభాగ్యవర్థనః
తిలపుష్పనిభోయశ్చయద్యగ్రేఖుర సంనిభః ద్వావప్యేతౌ పరప్రేష్యం కుర్వాతేచ దరిద్రతామ్
ఉలూఖల నిభైఃశోకం మరణం వివృతాననైః విరూపైః పూతి నిర్మాం సైః గజ సంనిభ రోమభిః
దౌః శీల్యం దుర్భగత్వంచ దారిద్ర్య మధిగచ్ఛతి
కపిత్థఫల సంకాశః పీనో వలివివర్జితః సీతః ప్రశస్యతే స్త్రీణాం నిందితశ్చాన్యథా ద్విజాః .
పయోధర భరా నమ ప్రచలత్త్రివలీ గురుః మధ్యః శుభావహః స్త్రీణాం రోమరాజి విభూషితః
పణవాభైర్మృదంగాభైస్తథా మధ్యేయవోపమైః ప్రాప్నువంతి భయావాసక్లేశ దౌ:శీల్య మి ద్నశైః
అవక్రానుల్బణం పృష్ఠ మరోమశ మగర్హితమ్ నానాస్తరణ పర్యంక రతి సౌఖ్య కరం పరమ్
కుబ్జమద్రోణికం పృష్ఠం రోమశం యది యోషితః స్వప్నాంతరే సుఖం తస్యా నాస్తి హన్యాత్పతించసా
విపులైః సుకుమారైశ్చ కుక్షిభిః సుబహుప్రజాః మండూక కుక్షిర్యానారీ రాజానాంసా ప్రసూయతే
ఉన్నతైర్వలిభిః వంధ్యాః సువృత్తైః కుటిలా స్త్రియః జారకర్మ రతాస్తా:స్యుః ప్రవ్రజ్యాంచ సమాప్నుయుః
తా॥ రావియాకును బోలియుండునది, తాబేలు వీపును బోలి ఎత్తుగ నుండునది, చంద్ర బింబమువలెను, కలశాకారముగను ఉన్న భగము స్త్రీలకు ప్రశస్తతమము. మరియు రతి సుఖ వర్ధనమునై యుండును. నువ్వు పువ్వు వలెను, అగ్రమున గొరిజ వలెనుండునదియు దాస్యమును, దారిద్ర్యమును కలుగజేయును, జోళ్ల వలెనున్నవి శోకమును, నోళ్లు తెఱచుకొని యుండునవి మరణమును, వికృతములై, దుర్గంధముగలవియై, నిర్మాంసములై ఏనుఁగు వెంట్రుకలు కలవి దుశ్శీలతను, దౌర్భాగ్యమును దారిద్ర్యమును కలిగించును. వెలగపండువలె నుండి, బలసియుండి, ముడతలు లేనిదై, విరివిగనున్నది స్త్రీలకు శ్రేష్ఠము. దీనికి విరుద్ధముగ నున్న నీంద్యము. కుచ భారముచే నించుక వంగియుండి, కదలుచున్న మూడు వళులచే గొప్పదియై, రోమ పంక్తితో విభూషితమైయున్న నడుము స్త్రీలకు శుభమునిచ్చును. ఉడుక వాద్యములవంటివి, మృదంగ వాద్యములవంటివి, మధ్య భాగమున యవధాన్యపు గింజవలె నున్నట్టివి అయిన నడుముగలవారు భయముతోకూడిన జీవితము, క్లేశమును, దుశ్శీలతను పొందుదురు. వక్రతలేనిది, ఉవ్వెత్తుకానిది, రోమములులేనిది, అసహ్యముగలేనిదియైన వీపుగల స్త్రీలు వివిధములై పరుపులుగల పర్యంకముల పై రతిసౌఖ్యమునను భవింతురు, పొట్టిగ వికారమై, నడిమికాలువ లేనిదై, రోమములు గలదియైన వీఁపు గల్గిన స్త్రీలు కలలో కూడ సుఖమును పొందలేరు. అట్టి స్త్రీ భర్తను హతమార్చును. విపులములు, సుకుమారములునైన కడుపుగల స్త్రీ చక్కని సంతానమును కనును. మండూక కుక్షిగల స్త్రీ రాజులకు జన్మనిచ్చును. వక్షోజములున్నతములుగనుండెనేని వంధ్యలగుదురు. మిక్కిలి వట్రువలై కఠినములుగ నుండెనేని కులటలు, జార కర్మరతులు, అగుదురు. లేక భిక్షా చర్య గలవారగుదురు.
శ్లో॥ ఉన్నతాచ నతైః క్షుద్రా విషమై ర్విషమాశయా ఆయురైశ్వర్య సంపన్నా వనితా హృదయైః సమైః
సువృత్తమున్నతం పీన మదూరోన్నత మాయతమ్ స్తనయుగ్మమిదం శస్త మతోఽన్య దసుఖావహమ్
ఉన్నతిః ప్రథమే గర్భే ద్వయోరే కస్య భూయసీ వామేతు జాయతే కన్యా దక్షిణేతు భవేత్సుతః
దీర్ఘేతు చూచుకే యస్యాః సాస్త్రీ ధూర్తా రతిప్రియా సువృత్తేతు పునర్యస్యా ద్వేష్టిసా పురుషం సదా
స్తనైః సర్ప ఫణాకారైః శ్వజిహ్వాకృతి భిస్తథా దారిద్ర్యమధిగచ్ఛంతి స్త్రీయః పురుషచేష్టితాః
అవష్టబ్ధ ఘటీతుల్యా భవంతి హి తథా ద్విజాః
సుసమం మాంసలం చారు శిరో రోమ వివర్జితమ్ వక్షోయస్యా భవేన్నా ర్యాభోగాన్ భుక్తే యథేప్సితాన్
హింస్రాభవతి వక్రేణ దౌ:శీల్యం రోమశేనతు నిర్మాం సేనతు వైధవ్యం విస్తీర్ణే కలహ ప్రియా
చతస్రో రక్త గంభీరా రేఖాః స్నిగ్ధః కరేస్త్రియాః యది స్యుః సుఖమాప్నోతి విచ్ఛిన్నాభి రనీశతా రేఖాఃకనిష్ఠికా మూలాద్యస్యాః ప్రాః ప్రదేశినీమ్ శతమాయుర్భవేత్త స్యాస్త్రయాణమున్నతౌ క్రమాత్
సంవృత్తాః సమ పర్వాణస్తీ క్ష్ణాగ్రాః కోమలత్వచః సమాహ్యంగులయో యస్యాః సానారీభోగవర్ధినీ
తా ॥ వక్షో భాగములు వంగియున్న ఉన్నతులగుదురు. ఎగుడు దిగుడుగ - లేక ఎక్కువ తక్కువగా నున్న క్షుద్రులు, విషమాశయులునగుదురు. సమానముగనున్నచో ఆ స్త్రీలు ఆయురైశ్వర్య సంపన్నులగుదురు. గుండ్రములై, ఎత్తుగ నుండినవియై, బలిసినవియై, దూరములేనివియై నిడివిగ నుండిన స్తన యుగ్మములు ప్రశస్తములు. అట్లుకానివి దుఃఖావహములు. మొదటి గర్భము ఎత్తినపుడు రెంటిలో నొకటి అతిశయించిన, అది ఎడమవైపుదియైన ఆడ శిశువు, కుడివైపుదైన మగ శిశువు జన్మింతురు. స్తన చూచుకములు పొడవుగనున్న స్త్రీ ధూర్తురాలు, రతి ప్రియమగును. పట్రువలైగట్టిగనున్నయెడల ఆ స్త్రీ పురుషద్వేషియగును. పాము పడగలవలే, కుక్క నాల్కలవలె స్తనములున్న స్త్రీలు పురుష చేష్టలు గలవారై దారిద్ర్యమును పొందుదురు. కట్టఁబడిన కుండలబోలియున్నను అట్లేయగుదురు. సమముగ నుండి, మాంసలములై, నరములుగాని, రోమములుగాని లేనివై, సుందరముగనుండిన పక్షోజములు ఏ స్త్రీకి ఉండునో ఆమె ఈప్సిత భోగములనుభవించును. వక్షము వంకరగనున్న హింసించునది, రోమములతో నున్న దుశ్శీలముగలది, నిర్మాంసముగానున్న వైధవ్యము పొందునది, విస్తీర్ణముగానున్న కలహ ప్రియ యగును. చేతిలో ఎరుపు చాయ కలిగిన నాలుగులోతైన రేఖలుండిన స్త్రీలు సుఖముగానుందురు. అట్టి రేఖలు విచ్ఛిన్నములై యున్న యెడల అధికార పీనలగుదురు. మూడింటిలోను రెండు ఒక దానికంటే నొకటి పొడవై యున్న రేఖలు, ఏ స్త్రీ చేతిలో కనిష్ఠికా మూలము నుండి తర్జని వఱకు వ్యాపించియుండునో అట్టి స్త్రీ వంద సంవత్సరముల ఆయుర్దాయము కలిగియుండును. గుండ్రములై, సమానమైన కణుపులు కలిగి, తీక్షణమైన కొనలుగలిగి, మృదువైన చర్మము గలిగి సమములైన వ్రేళ్లుగల స్త్రీ భోగ వర్థిని యగును.
శ్లో॥ బంధు జీవారుణై స్తుంగై నఖైరైశ్వర్యమాప్నుయాత్ ఖరైర్వక్త్రైర్వివర్ణాభైః శ్వేత పీతైరనీశతా
రక్త్రైర్మృదుభిరైశ్వర్యం నిశ్ఛిద్రాంగులిభిర్ద్విజాః! స్ఫుటితైర్విషమై రూక్షైః క్లేశం పాణిభిరాప్నుయుః
సమరేఖాయవాయాసామంగుష్టాంగులిపర్వసు తాసాంహి విపులం సౌఖ్యం ధనం ధాన్యం తథాఽ క్షయమ్
మణిబంధోఽవ్యవచ్ఛిన్నో రేఖాత్రయ విభూషితః దదాతి నచిరాదేవ-భోగమాయుస్తధాక్షయమ్
శ్రీవత్సధ్వజ పద్మాక్ష గజ వాజి నివేశనైః చక్ర స్వస్తిక వజ్రాసీ పూర్ణ కుంభనిభాంకుశైః ప్రాసాదచ్ఛత్ర ముకుటైర్హార కేయూర కుండలైః శంఖ తోరణ నిర్వ్యూ హైర్హస్తన్యస్తైర్నృప స్త్రియః
యస్యాః పాణితలే రక్తాయూపకుంభాశ్చకుండికాః దృశ్యంతే చరణేయస్యా యజ్ఞపత్నీ భవత్యసౌ
వీథ్యాపణ తులామానైస్తథా ముద్రాదిభిః స్త్రియః భవంతి వణిజాం పత్న్యో రత్నకాంచన శాలినామ్
దాత్రయోక్త్రయుగా బంధ ఫలాలూఖల లాంగలైః భవంతీ ధనధాన్యాథ్యాఃకృషీవల జనాంగనాః
అనున్నత శిరా సంధి పీనం రోమ వివర్జితమ్ గోపుచ్ఛాకృతి నారీణాం భుజయోర్యుగలం శుభమ్
తా॥ మంకెనపువ్వువలె అరుణవర్ణమున పొడవుగనున్న గోళ్లుగల స్త్రీలు ఐశ్వర్యమును పొందుదురు. వంకరగను, వివర్ణముగను, తెలుపుతో కలిసిన పసుపు వన్నెలోనుగల గోళ్లవలన అధికార రాహిత్యము సంభవించును. ఎఱుపుగను, మృదువుగను, నిశ్చిద్రముగను ఉండు వ్రేళ్ల వలన ఐశ్వర్యము కలుగును. పగుళ్లు కలిగి, విషమముగను, గఱుకుగను ఉన్న చేతుల వలన క్లేశము కలుగును. బొటన వ్రేలు, ఇతరములైన వేళ్లు కనుపులయందును సమరేఖలతోడి యవబీజ చిహ్నములుండిన స్త్రీలకు అక్షయమగు ధనధాన్యముల తోడి సౌఖ్యము లభించును. అవ్యయము, అచ్ఛిన్నమునై మూడు రేఖలతో విభూషితమైన మణి బంధము అచిరకాలముననే అక్షయమైన భోగమును, ఆయువును ఇచ్చును. శ్రీవత్సము, టెక్కెము, తామర, కన్ను, ఏనుగు, గుఱ్ఱము, (హంస) పాళెము, చక్రము, స్వస్తికము, వజ్రము, ఖడ్గము, పూర్ణకుంభము, అంకుశము. ప్రాసాదము, గొడుగు, కిరీటము, హారము, కేయూరము, కుండలము, శంఖము, తోరణము, పూలదండ - వీనిలో ఏ చిహ్నమైనను చేతిలో గలవారు రాజస్తీలగుదురు. పాణితలమున, చరణమున యూపస్తంభములు, కుండలు, కమండలములు (లేకతోట్లు) చొహ్నితములై దేవి యగును. అంగడి, దుకాణము, త్రాసు, తూనికలు, ముద్రలు చేతులయందు నొప్పుచు కృషీవలుల భార్యలగుదురు. భుజములు ఆవు తోకవలె నుండి, ఉన్నతములుకాక, నరములు, వెంట్రుకలులేక సన్నగా నుండిన స్త్రీలకు శుభము.
శ్లో॥ నిగూఢ గ్రంథయోయస్యాః కూర్పరా రోమవర్జితే బాహూవై లలితౌ యస్యాః ప్రశస్తా వృత్తకోమలో
ఉన్నతావనతెచైవ నాతి స్థూలౌ నర్మశా సుఖదౌతు సదాస్త్రీణాం సౌభాగ్యారోగ్య వర్ధనౌ
స్థూలే స్కంధే వహేద్భారం రోమశే వ్యాధితా భవేత్ వక్ర స్కంధే భవేద్వంధ్యా కులటాచోన్నతాననే
స్పష్టం రేఖాత్రయం యస్యాగ్రీవా యాంచతురంగులమ్ మణి కాంచన ముక్తాడ్యం సాదధాతి విభూషణమ్
అధనాస్త్రీ కృతగ్రీవా దీర్ఘ గ్రీవాచ బంధకీ హ్రస్వగ్రీవా మృతాపత్యా స్థూల గ్రీవాచ దు:ఖితా
అనున్నతా సమాంసాచ సమాయస్యాః కృకాటికా సుదీర్ఘ మాయుస్త్వస్యాస్తు చిరంభర్తాచజీవతి
నిర్మాంసాబహుమాంసాచ శిరాలా రోమశాతథా కుటిలా వికటాచైవ విస్తీర్ణానచ శస్యతే
న స్థూలో న కృశోఽత్యర్థం నవక్రోనచరోమశః హనురేవం విధః శ్రేయాంస్తతోన్యోన ప్రశస్యతే
చతురస్ర ముఖోధూర్తా మండలాస్యా శివా భవేత్ అప్రజా వాజి వక్రా స్త్రీ మహావక్రాచ దుర్భగా
శ్వ వరాహ వృకోలూక మర్కటా స్యాశ్చయాః స్త్రియః క్రూరాస్తాః పాపకర్మిణ్యః ప్రజా బాంధవ వర్జితాః
తా॥ మణుగు పరచినట్లున్న గనుపులు, రోమములులేని మోచేతులు, లలిత కోమలములైన గుండ్రని బాహువులు స్త్రీకి ప్రశస్తమైనవి. పొడవైనవయి అంతస్థూలములుగాక రోమములు లేనివైన బాహువులు స్త్రీలకు సౌభాగ్యమును, ఆరోగ్యమును వృద్ధిచేసి సుఖము నిచ్చునవియగును. స్టూలములైన భుజములవలన బరువు మోయును. రోమశములవలన వ్యాధి కలుగును. వక్రములైయున్న వంధ్యయగును. పొడవైన ముఖమున్న కులటయగును. మెడ పైన నాలుగంగుళముల స్పష్టమైన మూడు రేఖలు గల స్త్రీ మణులు, బంగారము, మంచి ముత్యములతో నొప్పిదములైన ఆభరణములు ధరించును. కృశించిన మెడగలది. ధనహీన యగును. పొడవైన మెడగలది బంధకియగును. పొట్టమెడగలది మృత సంతానము గలదియగును. స్థూల గ్రీవ దుః ఖితయగును. పెడతలయందలి ముచ్చిలిగుంట ఉన్నతముగాక, మాంసలమై సమముగా నున్న స్త్రీ చిరంజీవియై, చిరకాలము సువాసినియైయుండును. నిర్మాంసమునగాని, మిక్కిలి మాంసముగలదిగాని, నరములు రోమములుండినగానీ, వంకరగాగాని, వికటముగగాని, విశాలముగగాని యుండిన ప్రశస్తముకాదు. చెక్కిలి మీదీ భాగము (వెలిగౌడ) స్థూలముగాక కృశించినట్లు కాక, అధికముగాక, వంకరగాక, రోమశముగాక యున్నచో ప్రశస్తము. అట్లు కానిది అప్రశస్తము. ముఖము చతురస్రముగా నున్న స్త్రీ ధూర్తు రాలగును. గుండ్రని ముఖము గలది శుభకరమైనది. గుఱ్ఱము ముఖము వంటి ముఖముగలది సంతానహీనయగును. మిక్కిలి వంకరగనున్న ముఖము గలది దుర్భగయగును. కుక్క, పంది, తోడేలు, గుడ్లగూబ, కోతి ముఖములవంటి ముఖములు గల స్త్రీలు క్రూర వృత్తిగలవారై పాపకర్మలు చేయువారగుదురు. వారికి సంతానము, బంధువులు ఉండరు.
శ్లో ॥ మాలతీ వకులాంభోజ నీలోత్పల సుగంధియత్ వదనం ముచ్యతే నైతత్పాన తాంబూల భోజనైః
తామ్రాభః కించిదాలంభః స్థాల్య కార్శ్య వివర్జితః అధరోయది తుంగశ్చనారీణాం భోగదః సదా
స్థూలే కలహశీలా స్యా ద్వివర్ణే చాతి దుఃఖితా ఉత్తరోష్ఠేన తీక్ష్ణేన వనితా చాతి కోపనా జిహ్వాతనుతరా వక్రా తామ్రాదీర్ఘాచశస్యతే స్థూల హ్రస్వా వివర్జియా వ భిన్నా చ నిందితా
శంఖ కుందేందుధవలైః స్నిగ్ధై స్తుంగైర సంధిభిః మృష్టాన్నపానమాప్నోతి దంతైరేఖి రనున్నతైః
సూక్ష్మారతి కృశేర్ఘ స్వైః స్ఫుటితై ర్విరలైస్తథా రూక్షైశ్చ దు:ఖితా నిత్యం వికటైర్భామినీ భవేత్
సుమృష్ట దర్పణాంభోజ పూర్ణబింబేందు సంనిభమ్ వదనం వరనారీణామ భీష్ట ఫలదం స్మృతమ్
న స్థూలా నకృశా వక్రా నాతి దీర్ఘా సమున్నతో ఈ దృశీ నాసికా యస్యాః సాధన్యాతు శుభంకరీ
ఉన్నతామృదులా యాచ రేఖా శుద్ధాన సంగతా భ్రూర్వక్త్రతుల్యా సూక్ష్మాచ యోషితాం సా సుఖావహా
ధనుస్తుల్యాభిః సౌభాగ్యం వంధ్యాస్యాద్దీర్ఘరోమభిః పింగలా సంగతా హ్రస్వా దారిద్ర్యాయ నసంశయః
తా ॥ జాజి, పొగడ, తామర, నల్లగలువల పరిమళముగల ముఖము (నోరు) పాన, భోజన తాంబూలములను విడువకుండును. రాగివలె మెఱయుచు, స్టాల్య కార్శ్యములు లేనిదై సన్నగాను, పొడవుగను ఉన్న కింది పెదవి స్త్రీలకెప్పుడును భోగమునిచ్చును. స్థూలమైనచో కలహశీలత, వివర్ణముగనున్న మిక్కిలి దుఃఖమునిచ్చును. మీది పేదవి తీక్షముగనున్న స్త్రీ కోపముగలది యగును. నాలుక మిక్కిలి సన్ననై వక్రముగను పొడవుగను ఉండుట శ్రేష్ఠము. మందముగను, పొట్టిగను, వివర్ణముగను, వక్రముగను, పగిలినట్లును ఉండుట నిందితము. శంఖమువలె, మొల్ల పువ్వువలె, చంద్రునివలె తెల్లనివియై, నునుపుగ, పొడవుగ, సందులులేకుండగ, ఎత్తుగ లేక యున్న దంతములు గల స్త్రీ మృష్టాన్న పానములను పొందును. సూక్ష్మముగను, కృశించినవిగను, పొట్టివిగను, పగిలినట్లును, వంకరగను, కణుకుగను వికటముగను ఉన్న దంతముల వలన స్త్రీ సదా దుఃఖిత యగును. శుభ్రపరచిన అద్దమువలె, తామరపువ్వువలె, నిండు జాబిల్లివలె ముఖములుగల స్త్రీలు అభీష్ట ఫలములను పొందుదురని చెప్పఁబడినది. అంత స్థూలముకాక, అంత సూక్ష్మముకాక, వక్రముకాక, మిక్కిలి పొడవుకాక, మిక్కిలి ఎత్తుగా కాక సమముగా నుండు ముక్కుగల వనీత ధన్యురాలు. శుభమును కలిగించునది యగును. ఉన్నతములై కోమలములై, పరిశుద్ధమగు రేఖలవలెనొప్పారి, ఒకదానినొకటి కలియక, ముఖమునకు సరిపడునట్లున్న సూక్ష్మమైన కనుబొమ్మలు స్త్రీలకు సుఖప్రదములు. ధనురాకారముగనున్నవి సౌభాగ్య ప్రదములు. పొడవైన వెంట్రుకలు కలిగియున్నచో గొడ్రాలి తనము నిచ్చును. గోరోచనము వర్ణమున నుండి, అస్తవ్యస్తముగ, పొట్టిగను ఉన్న కనుబొమ్మలు దారిద్ర్యమునకే యనుటలో సంశయములేదు.
శ్లో ॥ నీలోత్పల దళ ప్రఖ్యైరాతా మ్రైశ్చారు పక్ష్మభిః వనితా నయనైరేఖిర్భోగ సౌభాగ్యభాగినీ
ఖంజనా మృగాక్షీచ వరాహాక్షీ వరాంగనా యత్ర యత్ర సముత్పన్నా మహాంతం భోగమశ్నుతే
అగంభీరైర సంక్లిష్ట ద్బహురేఖా విభూషితైః రాజ పత్యో భవంతీ హనయనై ర్మధు పింగలైః
వాయసాకృతినేత్రాణి దీర్ఘాపాంగాని యోషితామ్ అనావిలాని చారూణి భవంతి హి విభూతయే
గంభీరైః పింగలైశ్చైవ దుఃఖితాః స్యుశ్చిరాయుషః వయోమధ్యేత్యజేత్రాణానున్నతాక్షీతుయాంగనా
రక్తాక్షీ విషమాక్షీచ డూమ్రాక్షీ ప్రేతలోచనా వర్జనీయ సదా నారీ శ్వనేత్రా చైవ దూరతః.
ఉద్ర్భాంతకైఃకరైశ్చిత్రైర్నయనైస్తంగనాస్త్విహ మద్యమాంసప్రియానిత్యం చపలాశ్చైవ సర్వతః
కరాలాకృతయః కర్గా నభః శబ్దాస్తు సంస్థితాః వహంతి వికసత్కాంతి హేమ రత్న విభూషణమ్
ఖరోష్ట్ర నకులాలూక కపిల శ్రవణాః స్త్రియః ప్రాప్నువంతి మహద్దుఃఖం ప్రాయశః ప్రవ్రజంతిచ
ఈషదాపాండు గండాయా సువృత్తా పర్వణి త్విహ ప్రశస్తా నిందితాత్వన్యా రోమకూపక దూషితా
తా ॥ నల్లగలువ జేకులతో సమానమై, ఎఱుపువన్నెగలవియై, అందమైన జెప్పలతోడి కన్నులుగల మగువ సుఖ సంపదలు గలదియగును. కాటుకపిట్ట, లేడి, వరాహము కన్నుల వంటి కన్నులు గల శ్రేష్ఠమైన స్త్రీ ఎచ్చట పుట్టినను భోగములొందును. లోఁతు కానివి, కలయిక లేనివి, అనేక రేఖలతో శోభించునవి, తేనెవంటి పింగలవర్ణముగలవియయిన కనులున్న స్త్రీలు రాజ భార్యలగుదురు. వాయసాకృతిలో నుండి, దీర్ఘమైన కడచూపులుగలవియై, కలఁకబాఱనివియైన అందమైన కనులు స్త్రీలకు ఐశ్వర్యమును కలిగించును. లోతుగను, ఎఱుపుగను ఉన్న నేత్రములు చిరకాలము దుఃఖితులను చేయును. స్త్రీకి కన్నులున్నతములుగ నుండెనేని అకాల మృత్యువు సంభవించును. ఎఱ్ఱనీవి, ఎగుడుదిగుడుగనున్నవి, పొగరంగులోనున్నవి, నిర్జీవమైనవి అయిన కన్నులుగల స్త్రీ విడువదగినది. కుక్క కన్నుల గల యాడు దానిని దూరముగ విడువవలెను. తిరుగుపడినవి కొక్కెర వంటివి, చిత్రమైనవి అయిన కనులున్న స్త్రీలు మద్యమాంస ప్రియులు, ఎప్పుడును చపలురైయుందురు . పొడవైన ఆకృతితో సూక్ష్మ ధ్వనిని కూడా వినగలిగిన చెవులున్నవారు ప్రకాశవంతమైన కాంచన రత్నా భరణములను ధరింతురు. గాడిద, ఒంటె, ముంగిస, గుడ్లగూబ, ఏనుగు చెవుల వంటి చెవులు గల స్త్రీలు మిక్కిలి దుఃఖమును పొందుదురు. ప్రాయశః సన్యసింతురు. ఇంచుక తెలుపు మించిన పచ్చని చెక్కిలి, గనుపునందు గుండ్రదనము గలది ప్రశస్తము. తద్విరుద్ధమైనది రోమకూపములతో దూషితమైనది నింద్యము.
శ్లో ॥ అర్ధేందు ప్రతిమా భోగ మరోమతు సమాహితమ్ భోగారోగ్యకరం శ్రేష్ఠం లలాటం వరయోషితామ్
ద్విగుణం పరిణా హేన లలాటం నిహితంచయత్ శిరః ప్రశస్తం నారీణామధన్యా హస్తిమస్తకా
సూక్ష్మాః కృష్ణా మృదుస్నిగ్ధః కుంచితాగ్రాః శిరోరుహాః భవంతి శ్రేయసే స్త్రీణామస్య స్యుః క్లేశశోకదా
హంస కోకిల వీణాలిశిఖి వేణు స్వరాః స్త్రియః ప్రాప్నువంతి బహూన్భోగా నృత్యానా జ్ఞాపయంతిచ
భిన్నకాంస్యస్వరా నారీ ఖరకాక స్వరాచయా రోగం, వ్యాధిం, భయం, శోకం దారిద్ర్యం చాధిగచ్ఛతి
హంస గోవృష చక్రాహ్వ మత్తమాతంగగామినీ స్వకులం ద్యోతయేన్నారీ మహిషీ పార్ధివస్యచ
శ్వశృగాల గతిర్నంద్యాయాచవాయసవద్వదేత్ దాసీ మృగగతిర్నారీ ద్రుతగా మిచ బంధకీ
ఫలినీ రోచనా హేమ కుంకుమ ప్రభ ఏవచ వర్ణః శుభకరః స్త్రీణాం యశ్చదూర్వాంకురోపమః
మృదూని మృదురోమణి నాత్యంత స్వేదకానిచ సురభీణిచ గాత్రాణి యాసాంతాః పూజితాః స్త్రియః
నోద్వహేత్కపిలాం కన్యాం సాధికౌంగీం నరోగిణీమ్ నాలోమీకాం నాతిహ్రస్వాం నవాచాటాం నపింగలామ్
తా ॥ అర్థ చంద్రుని పోలిక నిండుదనముతో, రోమములులేక, చక్కనిదైన నొసలు స్త్రీలకు శ్రేష్టమైనది. భోగమును ఆరోగ్యమునిచ్చునది. అట్టి నొసటికి, వైశాల్యముచేత రెండింతలు గల శిరస్సు స్త్రీలకు శ్రేష్టమైనది. ఏనుఁగు తలగల యాడుది అభాగ్యురాలగును. సన్ననివి, నల్లనివి, మెత్తనివి, చిక్కనివి, వంకర కొనలుగలవి అయిన తల వెంట్రుకలు స్త్రీలకు శ్రేయోదాయకములు. దానికి విరుద్ధమైనవి క్లేశమును శోకమును కలిగించును. హంస, కోకిల, వీణ, తుమ్మెద, నెమలి, పిల్లన గ్రోవి స్వరమువంటి కంఠ స్వరముగల స్త్రీలు బహు భోగములను, సేవకులను కలిగియుందురు. కంచుపగిలిన ధ్వని, గాడిద, కాకి స్వరముల వంటి స్వరముగల స్త్రీ రోగము, వ్యాధి భయము, శోకము దారిద్ర్యము పొందును. హంస గోవు, వృషభము, చక్రవాకము, మదించిన ఏనుఁగు నడకల వంటి నడకగల స్త్రీ తన కులమును ప్రకాశింపజేయును. రాజపత్నియగును. కుక్క, నక్కలనడక వంటి నడక గలది, కాకివలె నడచునది నిందనీయ యగును. మృగమువలే నడచునది దాసీ యగును. మిక్కిలి వేగముగ నడచునది బంధకి యగును. వెన్న వెదురు, గోరోచనము, బంగారము, కుంకుమ లేతగజిక వంటి ప్రకాశవంతమైన శరీర వర్ణములు స్త్రీలకు శుభకరములు. కోమలములు, మృదువైన రోమమలు గలవి, ఎక్కువగా చెమట పట్టనివి, పరిమళ భరితములైన అంగములు గల స్త్రీలు పూజ్యురాండ్రగుదురు. నలుపు కలిసిన ఎఱుపు, ఎఱుపు వర్ణములలోనున్నది, స్థూల కాయముగలది, రోగగ్రస్తురాలు, బొత్తిగా రోమమలులేనిది, మిక్కిలి పొట్టిగా నున్నది, ఎక్కువగా మాట్లాడునది యైన కన్యను వివాహమాడరాదు.
శ్లో ॥ నరక్షవృక్ష నదీ నామ్నిం నాంత్య పర్వత నామికామ్ న పక్ష్యాహిప్రేష్య నామ్నాం నచ భీషణ నామికామ్
అవ్యంగాంగీం సౌమ్య నామ్నాం హంస వారణగామినీమ్ తనులోమకేశ దశనాం మృద్వంగీ ముద్వత్ స్త్రియమ్
మహాంత్యపి సమృద్ధాని గోజావిధన ధాన్యతః స్త్రీ సంబంధే దశైతాని కులాని పరివర్జయేత్
హీనక్రియం నిష్పురుషం నిశ్ఛందోరోమశార్శనమ్ క్షయామయా వ్యపస్మారి శ్విత్ర కుష్టికులానిచ
పాదౌసుగుల్ఫౌ ప్రధమం ప్రతిష్టా జంఘే ద్వితీయం చసుజాను చక్రే మేథోరు గహ్యంచ తతస్తృతీయం నాభిః కటిశ్చేతి చతుర్థమాహుః
ఉదరం కథయంతి పంచమం హృదయం షష్ఠమధస్తనాన్వితమ్ అథ సప్తమమంస జత్రుణీ కథయంత్యష్టమ మోష్ఠ కంధరే
నవమం నయనేచ సుభ్రుణీ సులలాటం దశమం శిరస్తథా అశుభేష్వ శుభం దశాఫలం చరణం చరణాద్య శుభేషు శోభనమ్
ఇదం మహాత్మా స మహానుభావః శచీనిమిత్తం గురురబ్రవీద్ద్విజాః శక్రేణ పృష్ఠః సవిశేషముత్తమం సంలక్ష్యముక్తం వరయోష లక్షణమ్
మత్సకాశాత్పునః శ్రుత్వాలక్షణం పురుషస్యచ యథాధునా భవద్భిస్తుశ్రుతం మతోద్విజోత్తమాః
లక్షణేభ్యః ప్రశస్తంతు స్త్రీణాం సద్వృత్తముచ్యతే సద్వృత్తము క్త్వా యాస్త్రీసా ప్రశస్తానచ లక్షణైః
తా ॥ నక్షత్ర, వృక్ష, నదీ, మ్లేచ్చ, పర్వత, పక్షి, సర్పాదుల పేరు గలది, దాసీ ఫోచక నామము గలది, భయంకరమైన పేరు గది యైన కన్యను వివాహమాడరాదు. వైకల్యములేని అంగములు గలది, సామ్యమైన పేరు గలది, హంసవలె, ఏనుగు వలె నడచునది, సూక్ష్మమైన రోమములు, సన్నని తలవెంట్రుకలు, చక్కని పలువరస గలది, కోమలమైన శరీరముగలదైన స్త్రీని వివాహమాడవలెన. పశు సంపద, ధన ధాన్య సంపద పుష్కలముగా నున్నను ఈ పది కులములను వివాహ సంబంధ పరముగా విడిచి పెట్టవలెను. సంస్కార హీనులు, పురుష సంతతిలేని వారు, వేద పఠన పాఠనములు లేనివారు, అంగముల పైన మిక్కిలి రోమములు గలవారు, ఆర్శ, క్షయ, మందాగ్ని అపస్మారము, బొల్లి, కుష్టు వంటి రోగములు గలవారు పెండ్లి విషయమున విడువదగినవారు. పాదములు, చీల మండలు ఒకటి, పిక్కలు మోకాళ్లు రెండు, మేడ్ర గుహ్యములు మూడు, నాభి నడుము స్థాలుగు, కడుపు ఐదు, హృదయము స్తనములు ఆకు, భుజములు కొంకులు ఏడు, పెదవులు మెడ ఎనిమిది. కనులు కనుబొమలు తొమ్మిది, నుదురు తల పది అని యిట్లు శరీరభాగములు చెప్పుదురు. ఇందు అన్ని అశుభ లక్షణములు కలిగియున్న అశుభమే కలుగును. చరణాదిగ ఒక నాల్గవ భాగము మాత్రము అశుభముగనున్నను శుభమే కలుగును. శచీదేవి నిమిత్తముగ ఇంద్రుఁడడిగినప్పుడు మహాత్ముడు మహానుభావుఁడునైన బృహస్పతి సవిశేషముగా ఇట్లు ఉత్తమ స్త్రీ లక్షణములను చెప్పెను. బ్రాహ్మణోత్తములారా! ఇప్పుడు మీకు చెప్పినట్లు స్త్రీ లక్షణములతో(బాటు పురుష లక్షణములను కూడ నేను చెప్పగా అతఁడు మఱల వినెను. ఈ లక్షణముల కంటెను స్త్రీలకు సచ్చరిత్ర ప్రశస్తతరమైనది. సద్వృత్తముచేత ప్రశస్తమైనట్లు స్త్రీ, లక్షణములచేత కాదు.
శ్లో ॥ ఈదృగ్లక్షణ సంపన్నాం సుకన్యా ముద్వహేత్తుయః ఋద్ధి వృద్ధి స్థథాకీర్తి స్తత్ర తిష్ఠతి నిత్యశః
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యం బ్రాహ్మేపర్వణి స్త్రీలక్షణ పర్వం నామ పంచమోఽధ్యాయః
తా ॥ ఇట్టి లక్షణములతో నొప్పారు మంచి కన్యను వివాహమాడిన వానికి సర్వ వస్తుసమృద్ధి, అభివృద్ధి, కీర్తి ఎల్లవేళల సమకూరియుండును.
ఇది శ్రీ భవిష్య మహా పురాణ శతార్థ సాహస్ర్యమందు బ్రహ్మపర్వమునందలి స్త్రీ లక్షణ పర్వమను నైదవ అధ్యాయము.
Summary of chapter 5 of the Bhavishya Mahā Purana is as follows:
Brahma instructs Manu on the sāmudrika-śāstra of women: the system of reading physical marks to determine a woman's character, fortune, and her effect upon the household she enters. Auspicious signs — the shape of the hands and feet, the quality of the hair, the nature of the gaze, the sound of the voice — are enumerated as indicators of a woman who will bring prosperity, children, and dharma to her family. Inauspicious marks — asymmetry of features, certain lines on the palm, specific bodily configurations — signal misfortune for the husband or household. The chapter situates this teaching within a devotional understanding: a woman of good marks is herself an embodiment of Śrī, and her entry into a home is akin to the goddess taking residence there.