3. ఉపస్పర్శన విధి వర్ణనము

శతానీక ఉవాచ :

జాతకర్మాది సంస్కారాన్ వర్ణానామానుపూర్వశః ఆశ్రమాణాం చమే ధర్మం కథయస్వ ద్విజోత్తమ

సుమంతురువాచ :

గర్భాధానం పుంసవనం సీమంతోన్నయనం తథా జాతకర్మాన్న ప్రాశశ్చ చూడా మౌంజీనిబంధనమ్

బైజికం గార్భికం చైనో ద్విజానామప మృజ్యతే స్వాధ్యాయేన వ్రతైర్హోమైః తై విద్యేనేజ్యయాశ్రుతై :

 మహాయజ్ఞైశ్చ బ్రాహ్మీయం యజ్ఞైశ్చ క్రియతే తనుః శ్రణు ష్వైకమనా రాజన్యథా సా క్రియతే తను:

తా II శతానీకుడిట్లు పలికెను - ఓ ద్విజోత్తమా ! నాలుగు వర్ణముల వారికి నిర్దేశించిన జాతకర్మాది సంస్కారాలను మరియు ఆశ్రమధర్మాలను గూర్చి చెప్పుము. సుమంతుడిట్లు పలికెను - గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ అన్నప్రాశనము, చూడ, మౌంజీ బంధము. స్వాధ్యాయము, ప్రతహోమాలు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అను త్రివిద్యలు వేదములు, యజ్ఞాలు మొదలైన వానిచే బ్రాహ్మణులకు గర్భ సంబంధమైన బీజదోషం తొలగుతుంది. మహాయజ్ఞాలచేత, యజ్ఞాలచేత విప్రదేహం నిర్మాణమవుతుంది. ఓ రాజా విప్రదేహం ఎలా నిర్మాణమవుతుందో చెప్పెదను. ఏకాగ్రచిత్తుడవై వినుము

ప్రాఙ్నాభికర్తనాత్పుంసో జాతకర్మ విధీయతే మంత్రవ త్ప్రాశనంచాస్య హిరణ్యమధు సర్పిషామ్

నామధేయం దశమ్యాంతు కేచిదిచ్ఛంతి పార్థివ ద్వాదశ్యామపరే రాజన్మాసి పూర్ణే తథాపరే   

అష్టాదశే ఽహని తథాఽన్యే వదంతి మనీషిణ : పుణ్యే తిథౌ ముహూర్తేచ నక్షత్రే చ గుణాన్వితే

మాంగల్యం తాత విప్రస్య శివశర్మేతి పార్థివ రాజన్యస్య విశిష్టంతు ఇందు వర్మేతి కథ్యతే

వైశ్యస్య ధన సంయుక్తం శూద్రస్యచ జుగుప్సీతమ్ ధనవర్ధనేతి వైశ్యస్య సర్వదా సేతి హీనజే

మనువాచ తథాప్రోక్తం నామ్నోలక్షణముత్తమమ్ శర్మవద్ర్భాహ్మణస్య స్యాద్రాజ్ఞో రక్షాసమన్వితమ్

వైశ్యస్య పుష్టిసంయుక్తం శూద్రస్వ ప్రేష్య సంయుతమ్ స్త్రీణాం సుఖోద్యమక్రూరం విస్పష్టార్థమనోరమమ్

మంగల్యం దీర్ఘవర్ణాంతమాశీర్వాదాభిధానవత్ ద్వాదశేఽహని రాజేంద్ర శిశోర్నిష్ర్కమణం గృహాత్

తా ॥ మగశిశువు యొక్క నాభిసూత్రాన్ని కత్తిరించుట కంటే ముందు జాతకర్మ నిర్వహింపబడును. పిదప తేనె, నేయితో మంత్రయుక్తంగా అన్నప్రాశనము చేయబడును. అనంతరం శిశువుకు ఒక మాసం పూర్తి కాగానే పదియవ దీనమున నామకరణ కర్మను పుణ్యతిథి నక్షత్ర యుక్త ముహూర్తమున నిర్వహించుటకు కొందఱు ఇష్టపడేదరు. కొందఱు పన్నెండవదినమున, మణికొందఱు ఈ ఆచారాన్ని శిశువు పుట్టిన పద్దెనిమిదవ రోజున నిర్వహిస్తారని, కొందరు చెబుతుంటారు. బ్రాహ్మణ కుమారునుకు శుభమైన 'శివశర్మ నామకరణం చేయాలి. క్షత్రియ కుమారునకు విశిష్టమైన “ఇందువర్మ' అను పేరు, వైశ్యునకయితే ధనయుక్తమైన 'ధనవర్ధన' అను పేరు, హీనకులజుడుగు శూద్రునకు 'సర్వదోస' అను పేరు విధింపబడును. మనువుకూడా నామకరణ లక్షణాన్ని ఇట్లాగే చెప్పాడు. బ్రాహ్మణునకు శర్మనామము వలెనే రాజులకు రక్షార్థ సూచకమగు 'వర్మ' పేరు, వైశ్యునకు ధనపుష్టియుతమగు పేరు, శూద్రునకు 'దాస' పదముతో కూడిన పేరు, స్త్రీలకు స్పష్టార్థముతో కూడిన సుకుమారమైన, మంగళకరమైన, దీర్ఘసౌభాగ్యసూచకమైన పేరు విధింపబడాలి. శిశువు పుట్టినది మొదలు పన్నెండవ దినమున పితృగృహమునకు నిష్క్రమింపచేయుట విధి విహితము.

చతుర్ధే మూసి కర్తవ్యం తథాన్యేషాం మతం విభోషష్టేఽ న్నప్రాశనం మాసి యథేష్టం మంగలం కులే

చూడాకర్మ ద్విజాతీనాం సర్వేషామనుపూర్వశ : ప్రథమేఽబ్ధే తృతీయేవా కర్తవ్యం కురునందన

గర్భాష్టమేఽబ్ధే కుర్వీత బ్రాహ్మణస్యోపనాయనమ్ గర్భాదేకాదశే రాజన్ క్షత్రియ స్య వినిర్దిశేత్

ద్వాదశేఽబ్ధేఽపి గర్భాత్తు వైశ్వస్య వ్రతమాదిశేత్ బ్రహ్మవర్చస కామేన కార్యం విప్రస్యపంచమే

బలార్థినా తథా రాజ్ఞః షష్ఠేఽబ్ధే కార్యమేవహి, అర్థకామేన వైశ్యస్య అష్టమే కురునందన

ఆషోడ శా ద్భ్రాహ్మణస్య సావిత్రీ నాతివర్తతే ద్వావింశతేః

క్షత్రబంధ్రాచతుర్వింశతేర్విశ:

అత ఊర్థ్వంతు యే రాజన్ యథాకాలమసంస్కృతాః సావిత్రీ పతితావ్రాత్యా వ్రాతస్తోమాదృతే క్రతో:

న చాప్యేభిరపూతైస్తు ఆపద్యపిహి కర్షిచిత్ బ్రహ్మం యౌనంచ

సంబంధమాచరే ద్భ్రాహ్మణస్సహ

తా ॥ ఆరవమాసమున అన్నప్రాశనం యథేష్టంగా ఆచరింపవచ్చును కాగా నాలుగవ నెలలో దానిని ఆచరించాలి అని ఇతర విద్వాంసుల అభిప్రాయము. బ్రాహ్మణులు మొదలుకొని మిగతా వర్ణముల వారికిని చూడాకర్మ శిశివు పుట్టిన మొదటి ఏటగాని మూడవ ఏట గాని చేయవలెను. ఎనిమిది ఏండ్ల వయస్సులోగా బ్రాహ్మణునకు ఉపనయనం నిర్వహించాలి. ఓ రాజా! ఇక క్షత్రియ బాలునకు పదకొండవ ఏట, వైశ్యబాలునకు పన్నెండవ ఏట ఉపనయన (వ్రతాన్ని ఉపదేశించాలి. బ్రహ్మతేజోవంతుడు కావలెనను కోరికయున్నచో బ్రాహ్మణునకు అయిదవ ఏట ఉపనయనం జరుపదగును. అట్లే బలార్టీయైనచో వైశ్యునకు ఎనిమిదవ ఏట ఉపనయనం జరుపదగును. బ్రాహ్మణునకు 16 సం॥ వయస్సు వరకు సవితృదేవత అనుకూలించియే ఉంటుంది. అతని నుండి వైదొలగదు. కాన 16 సం॥ ప్రాయము వరకు ఉపనయనాధికారం కలదని భావము. అట్లే క్షత్రియునకు 22 సం॥ వయస్సు, వైశ్యునకు, 24. సం॥ వయస్సు వరకు సవితృదేవత అనుకూలురాలై ఉంటుంది. ఆ నిర్దిష్ట వయః పరిమితులలో వారు ఉపనీతులు కానిచో పవిత్ర మంత్రోపాసనా వ్రతభ్రష్టులై అసంస్కారులవుతారు. తత్రాయశ్చిత్తంగా 'వ్రాతస్తోమ'మనే క్రతువుతో తప్ప వారికి సంస్కారం లభింపదు . ఇట్లు అపవిత్రులైన వీరితో

భవంతి రాజంశ్చర్మాణి ప్రతినాం త్రివిధానిచ కార్ష్ణ రౌరవహస్తాని బ్రహ్మ క్షత్ర విశాం నృప

వసీరంశ్చాను పూర్వ్యేణ వస్త్రాణి వివిధాని తు బ్రహ్మక్షత్ర విశో రాజన్ శాణ క్షౌమాదికానిచ

మౌంజీ త్రివృత్సమా శ్లక్ష్ణాకార్యా విప్రస్య మేఖలా క్షత్రియస్యచ మౌర్వీజ్యా వైశ్యస్య శణ తాంతవీ

ముంజాలాభేతు కర్తవ్యా కుశాశ్మంతక బల్వజై : త్రివృతా గ్రంథినైకేన త్రిభిఃపంచభిరేవచ

కార్పాసముపవీతం స్యాత్ విప్రస్యోర్ధ్వవృతం త్రివృత్ శణ సూత్రమయం

రాజ్ఞోవైశ్యస్యావిక సౌత్రికమ్

ఏ ఆపత్సమయమందైననూ, ఏ విధంగానైనను సంస్కారియైనవాడు బ్రాహ్మమగు వివాహ సంబంధమును ఆచరింపరాదు.

తా॥ ఉపనయన వ్రతనిష్టులు ధరింపవలసిన మృగచర్మాలు మువ్విధాలుగా నున్నాయి. బ్రాహ్మణ వటునకు నల్లజింక చర్మము, క్షత్రియునకు “గురు' మృగచర్మం, వైశ్యునకు 'మేక చర్మము నిర్దిష్టము. అట్లే బ్రాహ్మణునకు శణ'వస్త్రము, జనుము క్షత్రియునకు క్షామ (పట్టు వస్త్రము మున్నగు వివిధ వస్త్ర విశేషములను త్రివర్ణముల వారికి సూచింపబడ్డాయి. బ్రాహ్మణునకు మూడువరుసలతో అందంగా మౌంజి (ముంజదర్భలతో తయారుచేబడుతాడు)ని మొలనూలుగా, క్షత్రియునకు అల్లే త్రాటిని మొలనూలుగా, వైశ్యునకు శణ (గొర్రెచర్మపురోమాల) సూత్రమును మొలనూలుగాను చేయదగును . ముంజదర్భలు లభింపని పక్షంలో కుశ దర్భలతో గాని, అశ్మంతకపు ఓషధివిశేషముతోగాని, “బల్వజ'మను తృణ విశేషముతోను ఒక ముడి లేదా మూడు లేదా ఐదు ముళ్ళతోను ఏర్పాటు చేయదగును. బ్రాహ్మణ యజ్ఞోపవీతమును దూదిచే తయారుచేయుట, రాజుల జందెమయినచో శణసూత్రము చే తయారు చేయుట వైశ్యుల జందేమయినచో ఆవిక సూత్రము (గొట్టె చర్మపుదారము)చే తయారు చేయుట శాస్త్ర విహితమై యున్నది.

పుష్కరాణి తథాచైషాం భవంతి త్రివిధానితు బ్రహ్మణోబైల్వ పాలాశా తృతీయం ప్లక్షజం నృప

వాటఖాదిరౌ క్షత్రియస్తు తథాన్యం వేతసోద్భవమ్ పైలవోదుంబరౌ వైశ్యస్తథాశ్వత్ధజమేవ హి

దండానేత న్మహాబాహో ధర్మతోఽర్హంతి ధారితుం కేశాంతికో బ్రాహ్మణస్య దండఃకార్యః ప్రమాణతః

లలాట సమ్మితో రాజ్ఞఃస్యాత్తు నాసాంతికో విశ: ఋజవస్తేతు సర్వేస్యుర్భ్రాహ్మణా స్సౌమ్యదర్శనా

 అనుద్వేగకరా నృణాం సత్త్వచో నాగ్నిదూషితా: ప్రగృహ్యచేప్సితం దండం ఉపస్థాయచ భాస్కరమ్

సమ్యగ్గురుం తథాపూజ్య చరేద్భైక్ష్యం యథావిధి భవత్పూర్వం చరే దైక్ష్యం ఉపనీతో ద్విజోత్తమః

భవన్మధ్యంతు రాజన్యో వైశ్యస్య భవదుత్తరమ్

తా ॥ ఉపనీతులు ధరింపదగిన ఓషధీ దండములు మూడు విధాలుగా ఉన్నాయి. బ్రాహ్మణ వటువు నేరేడు, మోదుగు జువ్వి దండములు, క్షత్రియ వటువు మజ్జి, చండ్ర, వేతసోద్భవ దండములును, వైశ్యవటువు మేడి, రావి పైలవ దండములును ధర్మబద్ధంగా ధరింపనరుడగును. బ్రాహ్మణునకు శిఖాపర్వంతము కొలతగల దండము. క్షత్రియునకు నుదుటి వరకు పొడవుగల దండము, వైశ్యునకు నాసికా పర్వంతముకొలతగల దండము ఉండవలెనని దండప్రమాణము విధింపబడినది. సత్యవర్తనులు, సౌమ్యదర్శనులు, తమ సాత్త్విక ప్రవృత్తి వల్ల ప్రభువులకు కోపము కలిగింపని వారయిన విప్రులు పరమ పవిత్రులు. ఉపనీతుడైన విప్రుడు పై నిర్దేశించిన మూడు విధాలైన దండములలో ఇష్టమైన దానిని గ్రహించి తేజోవంతుడైన గురువునాశ్రయించి యధావిధిగా భిక్షాటన చేయాలి. భవచ్ఛబ్దాన్ని వాక్యారంభమున పలుకుతూ బ్రాహ్మణుడు భిక్షను గ్రహించాలి (భవతి భిక్షాందేహి) భవచ్ఛబ్దాన్నీ వాక్యమధ్యములో పలుకుతూ క్షత్రియుడు, భవచ్ఛబ్దాన్ని వాక్యాంతమున పలుకుతూ వైశ్యుడు భిక్షావృత్తినాచరింపవలెను  

మాతరం వాస్వసారం వా మాతుర్వా భగినీం నిజామ్

భిక్షేత భైక్ష్యం ప్రథమం యాచైనం యావమానయేత్ సువర్ణం రజతం చాన్నం సాపాత్రేఽస్య వినిర్దిశేత్

సమాహృత్య తతో భైక్ష్యం యావదర్థమమాయయా నివేద గురవేఽశ్నీ యాదాచమ్య ప్రాజ్ముఖశ్శుచిః

ఆయుష్యం ప్రాజ్ముఖో భుంక్తే యశస్యం దక్షిణాముఖః శ్రియం ప్రత్యజ్ముఖో భుంక్తే ఋతం భుంక్తే హ్యుదబ్ముఖః

 ఉపస్పశ్య ద్విజో రాజన్నన్న మద్యాత్సమాహితః భుక్త్వాచోపస్పృశేత్సమ్యగద్భిః ఖాని చ సంస్పృశేత్

తథాన్నం పూజయేన్నిత్య మద్యాచ్చైతదకుత్సయన్ దర్శనాత్తస్య హృష్యేద్వై ప్రసీదేచ్చాపి భారత

 అభినంద్య తతోఽశ్నీయాదిత్యేవం మనురబ్రవీత్ పూజితంత్వశనం నిత్యం బలమోజశ్చ యచ్ఛతి

 అపూజితంతు తద్బుక్తముభయం నాశయేదిదం నోచ్ఛిష్టం కస్యచిద్ధద్యాన్నాద్యాచ్చైతత్తథాంతరా

తా II వటువు, తనను కించపరచనట్టి తన తల్లిని గాని, చెల్లెలిని గాని, తల్లి సోదరినిగాని మొదటగా భిక్షను యాచించాలి. ఆ మాతృమూర్తి వటువునకు బంగారాన్ని, వెండిని, అన్నాన్ని భిక్షగా భిక్షాపాత్రలో ప్రసాదిస్తుంది. ఆ భిక్షా ద్రవ్యమునంతటిని ప్రోగు చేసికొని, దాపరికం లేకుండా గురువునకు నివేదించిన మీదట వటువు పరిశుద్దుడై తూర్పునకు అభిముఖుడై కూర్చొని ఆచమనం చేసి భుజింపవలెను. ఆయుష్యము కోరువాడు తూర్పు ముఖముగాను, కీర్తికాముడు దక్షిణముఖంగాను, సంపదఁ గోరువాడు పడమర ముఖంగాను, సత్యఫలాన్ని కోరువాడు ఉత్తరముఖంగాను కూర్చుండి అన్నమును భుజిస్తాడు  ఓ రాజా! బ్రాహ్మణుడు స్నానా చమనాలచే శుచియై అన్నమును భుజించిన పిదప ముఖాద్యవయవములను నీటిచే శుద్ధి చేసికోవాలి. ఎల్లప్పుడూ అన్నమును పూజింపవలెనే కాని అసహ్యించుకొనుచు నిందింపదగదు. అన్నమును చూడగానే సంతోషించి ప్రసన్నుడు కావాలి. అట్లు సంతోషించియే అన్నాన్ని భుజించాలని మనువచనము. స్తుతిస్తూ భుజించిన అన్నము బలవీర్యములనిస్తుంది. నిందాపూర్వకంగా తిన్న అన్నము బల వీర్యములను హరిస్తుంది. అట్లే ఎంగిలి అన్నమును ఇతరులకు పెట్టకూడదు. ఇంకనూ ఇతరుల ఎంగిలి అన్నమును, వదిలిన అన్నభాగమును కూడా తాను తినకూడదు.

యస్త్వన్నమంతరా కృత్వాలోభాదత్తి నృపోత్తమ వినాశం యాతి స నర ఇహలోకే పరత్ర చ

యథాభవత్పురా వైశ్యో ధన వర్ధన సంజిత:

శతానీక ఉవాచ : 

స కథనంతరం పూర్వ మన్నస్య ద్విజసత్తమ కీమంతరం తథాన్నస్య కథం వా తత్కృతం భవేత్

సుమంతురువాచ :

పురాకృతయుగే రాజన్వెశ్వో వసతి పుష్కరే ధనవరన నామావై సంభధో ధనదాన్యతః

నిదాఘ కాలే రాజేంద్ర సకృత్వా వైశ్వదేవికం సపుత్ర భాత్రృభిస్సార్థం తథావై మిత్ర బంధుభిః

ఆహారం కురుతే రాజన్ భక్ష్య భోజ్య సమన్వితమ్

అథ తద్భుంజత స్తస్య అన్నం శబ్ధో మహానభూత్ కరుణః కురుశార్దూల అథ తం సప్రధావితః

 త్యక్త్వా సభోజనం యూపన్నిష్క్రాంతో గృహబాహ్యతః అథ శబ్దస్తిరోభూతస్స భూయో గృహమాగతః

 తమేవ భాజనం గృహ్య ఆహారం కృతవాన్నృప భుక్తశేషం మహాబాహో ఆహారం సతు భుక్తవాన్

 భుక్త్వా స శతధా జాతస్తస్మిన్నేవ క్షణే నృప తస్మాదన్నం న రాజేంద్ర అశ్నీయదంతం క్వచిత్

తా ॥ ఎవడయితే తినిన అన్నమును వదిలి అదే అన్నమును లోభముతో మరల భుజించునో అట్టి నరుడు, పూర్వము ధనవర్ధనుడను పేరుగల వైశ్యుడు నష్టపడినట్లు ఇహపరసౌఖ్యాలను కోల్పోతాడు -40. ఆ ధనవర్ధనుడు అన్నాన్ని ఎలా వదిలివెళ్ళాడో వివరంగా చెప్పమని శతానీకుడు అడుగగా సుమంతుడిట్లు బదులు పలికాడు. ఓ రాజా! కృత యుగంలో పుష్కర క్షేత్రమున నివసించే ధనధాన్యవంతుడైన ధనవర్ధనుడనే వైశ్యుడు వేసవికాలమున వైశ్వ దేవమును చేసి పుత్రసోదర బంధు సమేతంగా భక్ష్యభోజ్యయుక్తమైన ఆహారాన్ని భుజిస్తుండగా ఒక గొప్ప శబ్దము వినబడింది. అంత నా ధనవర్ధనుడు భోజనమును వదిలి పెట్టి ఇంటినుండి బయల్వెడలి, ఆ శబ్దముననుసరించి పరుగెత్తెను. పిదప నా శబ్దము తిరోభూతము కాగా తిరిగి ఇంటికి వచ్చి భుక్తపూర్వాన్న శేషమును భుజింపగా వందసార్లు జన్మల నెత్తినాడు. కావున ఓ రాజా ! భుక్తాన్న శేషమును (ఉచ్ఛిష్టమును) భుజింపరాదు

న చైవాత్యశనం కుర్యాన్నచోచ్ఛిష్టః క్వచి ద్ర్వజేత్ రసోభవత్యత్యనాద్రసాద్రోగః ప్రవర్తతే

స్నానం దానం జపో హోమః పితృదేవాభిపూజనం నభవంతి రసే జాతేనరాణాం భరతర్షభ

అనారోగ్యమనాయుష్య మ స్వర్గ్యం చాతి భోజనం అపుణ్యం లోక విద్విష్టం తస్మాత్తత్పరివర్జయేత్

యక్షభూత పిశాచానాం రక్షసాంచ నృపోత్తమ గమ్యా భవతివైవిప్ర ఉచ్ఛిష్టో నాత్ర సంశయః

శుచిత్వమాశ్రయేత్తస్మాత్ శుచిత్వాన్మోదయేదితి సుఖేనచేహరమతే ఇతీయం వైదికీ శ్రుతి:

శతానీక ఉవాచ:  

శుచితామియాన్కథం విప్రః కథంచాశుచితామియాత్ ఏతన్మేబ్రూహి విప్రేంద్ర కౌతుకం పరమం మమ

సుమంతు రువాచ :

ఉపస్పృశ్య శుచిర్విప్రో భవతే భరతర్షభ విధివత్కురు శార్దూల భవేద్విధిపరో హ్యతః

శతానీక ఉవాచ:-

 ఉపస్పర్శ విధిం విప్రకథయత్వం మమాఖిలం శుచిత్వమాప్నుయాద్యేన ఆచాంతో బ్రాహ్మణోద్విజ .

 సుమంతు రువాచ:-

 సాధు పృష్టోఽస్మి రాజేంద్రశ్రుణువిప్రో యథాభవేత్ శుచిర్భరత శార్దూల విధినాయే నవావిభో

తా ॥ అతిగా అన్నమును తినకూడదు. ఉచ్ఛిష్టాన్నమును తినరాదు. అతిగా తీసుకున్న ఆహారం ఆమ్లంగా మారి, ఆమ్లం వల్ల రోగం కలుగుతుంది. ఆ కారణంవల్ల మానవులకు స్నాన, దాన, జన, హోమ, పితృకర్మలు భంగమవుతాయి. కావున ఆరోగ్యమును, ఆయుర్దాయమును, స్వర్గ సౌఖ్యమును, సర్వ కర్మలను భంగపరచునట్టి అత్యాహార సేవనమును వదులుకోవాలి. ఇక భోజనమువేళ కారణాంతరాల వల్ల అన్నమును వదిలి వెళ్ళినచో అది ఉచ్ఛిష్టమనబడును. ఆ ఉచ్ఛిష్టాన్నమును యక్ష, భూత, పిశాచ, రాక్షస గణాలు ఆశ్రయిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల స్నానాచమనాదులచే మానవుడు పరిశుద్ధిని పొందాలి. దాని వల్ల సుఖం కలిగి ఐహికానందం లభించునని వైదిక ప్రమాణము. విప్రశ్రేష్టా! బ్రాహ్మణుడు ఎట్లు పవిత్రతను పొందగలడో, ఎట్లు అశుచిత్వాన్ని పొందుతాడో నాకు వివరంగా తెలుపుమని శతానీకుడడుగ, సుమంతుడిట్లు పలికాడు. బ్రాహ్మణుడు ఉపస్పర్శనము (స్నానాచమనాదులు)ను యథావిధిగా ఆచరించి శుద్ధిని పొందగలడు . దేని మూలంగా విప్రుడు శుచిమౌతాడో అట్టి ఉపస్పర్శన విధానమునంతయు తెలుపుమని శతానీకుడడుగగా సుమంతుడిట్లు చెప్పాడు. ఓ రాజా! చక్కగా అడిగావు. శాస్త్ర ప్రకారంగా విప్రుడు పవిత్రుడయ్యే ఉపస్పర్శన పద్ధతిని చెబుతాను వినుము .

ప్రక్షాల్య హస్తౌ పాదౌచ ప్రాజ్ముఖోదజ్ము ఖోపివా ఉపవిశ్య శుచౌదేశే బాహుం కృత్వాచ దక్షిణమ్

జాన్వంతరే మహాబాహో బ్రహ్మ సూత్ర సమన్వితః సుసమౌ చరణే కృత్వా తథా బద్ధశిఖో నృప

నతిష్ఠన్నచ సంజల్పంస్తథా ఛానవలోకయన్ న త్వర న్కుపినతో వాపి త్యక్త్వా రాజన్ సుదూరతః

ప్రసన్నాభిస్తథాదిస్తు ఆచాంతశ్శుచితామీయాత్ నోష్ణాభిర్న సఫేనాభి ర్యుక్తాభిః కలుషేణచ

వర్ణేన రసగంధాభ్యాం హీనాభిర్నచ భారత సబుద్బుదాభిశ్చతథా నాచామే పండితో నృప

పంచతీర్థాని వీప్రస్య శ్రూయంతే దక్షిణే కరే దేవతీర్థం పితృతీర్థం బ్రహ్మ తీర్థంచ మానద

ప్రాజాపత్యం తథా చాన్యత్త థాన్యత్సౌమ్యముచ్యతే అంగుష్ఠమూలోత్తరతో యేయం రేఖా మహీపతే

 బ్రాహ్మ్యం తీర్థం వదంత్యేత ద్వసిష్ఠాద్యా ద్విజోత్తమాః కాయం కనిష్ఠికామూలే అంగుళ్యగ్రేతు దైవతమ్

తర్జన్యం గుష్ఠయోగంతః పిత్ర్యం తీర్థముదాహృతం కరమధ్యే స్థితం సౌమ్యం ప్రశస్తం దేవకర్మణి

తా ॥ ఆచమన విధిచేయువాడు ముందుగా కాళ్ళు జేతులను శుద్ధి జేసికొని పరిశుద్ధ ప్రదేశమున తూర్పున, కభిముఖుడైకాని ఉత్తరాభిముఖుడై కానీ కూర్చోవాలి. కాళ్ళను సమముగా చేసి కూర్చొని మోకాలిలోపల కుడిచేయి నుంచి యజ్ఞోపవీతయుక్తుడై, శిఖను ముడి వేసినవాడై ఆచమనము నాచరించాలి. కండ్లను మూసికొని ధ్యానముద్రతో, శాంతుడై మౌనంగా ఆచమనమును చేయాలి. ఉష్ణ జలము (వేడినీళ్ళ)ను, నురగతో కూడిన నీళ్ళను, కలుషిత జలమును, రసగంథములచే రంగుమారి చెడిన నీటిని, మరియు బుడగలతో కూడిన నీటిని ఆచమనమునకు వాడరాదు. పరిశుభ్రమైన నీటిచే ఆచమనము జేసిన పరిశుద్ధుడగును. ఓ రాజా! బ్రాహ్మణునకు ఐదు తీర్థములు వినబడుచున్నవి. అవి దేవతీర్థము, పితృతీర్జము, బ్రహ్మతీర్థము; ప్రాజాపత్యము సౌ సఃమ్యము. చూపుడు వ్రేలు, బొటన వేలి మధ్యన పితృతీర్థము, చిటికెన వ్రేలి మూలమున బ్రహ్మతీర్థము, బొటన వేలి మూలమునందలి ఉత్తరమునగల రేఖయందు ప్రాజాపత్య తీర్థము, దేవతా పూజాది క్రియలకు ప్రశస్తమగు సౌమ్యతీర్థము చేతిమధ్యలోనూ కలవని వసిష్టాదులు పలికెదరు .

దేవార్చాబలిహరణం ప్రవిక్షపణమేవచ ఏతాని దేవతీర్థేన కుర్యాత్కురుకులో ద్వహ

అన్న నిర్వహణం రాజంస్తథా సపవనం (సంచయనం)నృప లాజాహోమం తథా సౌమ్యం ప్రాజాపత్యేనకారయేత్

 కమండలూప స్పర్శనం దధిప్రాశనమేవచ సౌమ్యతీర్థేన రాజేంద్ర సదా కుర్యాద్విచక్షణః

పితృణాం తర్పణం కార్యం పితృతీర్థేన ధీమతా బ్రాహ్మేణచాపి తీర్థేన సదోపస్పర్శనం పరమ్

ఘనాంగుళికరం కృత్వా ఏకాగ్రస్సుమనా ద్విజః త్రిఃకృత్వాయః పిబేదాపో ముఖశబ్ద వివర్జితః

శ్రుణుయత్పలమాప్నోతి ప్రీణాతిచ యథాసురాన్ ప్రథమం యత్పిభేదాప ఋగ్వేద స్తేన తృప్యతి

 యద్ద్వితీయం యజుర్వేదస్తేన ప్రీణాతి భారత యత్తృతీయం సామవేద స్తేన ప్రీణాతి భారత

ప్రథమం యన్మృజేదాస్యం దక్షిణాం గుష్ఠమూలతః అధర్వవేదః ప్రీణాతి తేన రాజన్నసంశయః

తా ॥ ఓ రాజా! దేవతార్చన, బలిహరణము, ప్రవిక్షపణము అనునవి దేవతీర్ధముచేత చేయదగినవి. అన్న దానము, అస్థి సంచయనము మరియు లాజాహోమము ప్రాజాపత్య తీర్థము చేత నాచరింపదగును. కమండలూపస్పర్శనము మరియు దధిప్రాశనము సౌమ్యతీర్థము చేత, పితృతర్పణము పితృతీర్థముచేతను, ఉప స్పర్శన విధి బ్రహ్మతీర్థము చేతను ఆచరించుట శ్రేష్ఠముగా చెప్పబడినది. చేతి వేళ్ళను ముడిచిన దోసిటిలో నీటిని పోసికొని, నీటి చప్పుడు కాకుండా ఏకాగ్రమనస్కుడై మూడు మార్లు ఆచమించిన బ్రాహ్మణుడు దేవతలను సంతోష పెట్టిన ఫలితము నందును. మొదటి జలాచమనముచే ఋగ్వేదము, ద్వితీయాచమనముచే యజుర్వేదము, తృతీయాచమనముచే సామవేదమును తృప్తినొందును. ఓ రాజా! కుడిచేతి బొటన వ్రేలితో మొట్టమొదట చేసికొను ముఖ మార్జనముచే అధర్వణ వేదము ప్రీతినందుననుటలో ఏ సందియమును లేదు.

ఇతిహాస పురాణాని యద్ద్వితీయం ప్రమార్జతి యాన్మూర్థానం హి రాజేంద్ర అభిషించతివై ద్విజః

తేన ప్రీణాతివై రుద్రం శిఖామాలభ్యపై ఋషీన్ యం దక్షిణీ చాలభతే రవిః ప్రీణాతి తేనపై

నాసికాలంభనాద్వాయుం ప్రీణాత్యేవనసంశయః యచ్చ్రోత్రమాలభేద్విప్రో దిశః ప్రీణాతి తేనవై,

 యమం కుబేరం వరుణం వాసవం చాగ్నిమేవచ యద్భాహుమన్వాలభతే ఏతాన్ప్రీణాతి తేనవై

యన్నాభిమన్వాలభతే ప్రాణానాం గ్రంథిమేవ చ తేన ప్రీణాతి రాజేంద్ర ఇతీయం వైదికీ శ్రుతిః

అభిషించతి యత్పాదౌ విష్ణుం ప్రీణాతి తేనవై యద్భూమ్యాచ్ఛాదకం వారి విసర్జయతి మానద

 వాసుకి ప్రముఖాన్నాగాంస్తేన ప్రీణాతీ భారత యద్బిందవోఽoతరే భూమౌ పతంతీహ నరాధిప

తా ॥ నుదురు భాగమును పవిత్రీకరించుటకై చేయు ద్వితీయ మార్జనముచే ద్విజుడు రుద్రుని, ఇతిహాస పురాణములను సంతోషపరచును. అట్లే శిఖను స్పర్శించుటచేత ఋషులను, నాసికాలంబనమువల్ల వాయువును, చెవులను స్పర్శించుట వలన దిక్కులను సంతోష పెట్టిన వాడగును. అదేవిధంగా బాహువులను పట్టుకొనుట వలన ఇంద్ర యమ, కుబేర వరుణాగ్ని దేవతలను, నాభిని ముట్టుకొనుట వలన ప్రాణ గ్రంథిని విప్రుడు సంతసింపచేయును. పాదములను తడుపుట వలన విష్ణువును, భూమి పై విసర్జింపబడిన నీరు వాసుకి మొదలైన నాగులను సంతోషపరచును.

భూత గ్రామంతతస్తస్తు ప్రీణంతీహ చతుర్విధం అంగుష్ఠేన ప్రదేశిన్యా లభేత చాక్షిణీ నృప 

అనామికాంగుష్ఠికాభ్యాం నాసికామాలభేన్నృప మధ్యమాంగుష్ఠాభ్యాం ముఖం సంస్పృశేద్భరతర్షభ

కనిష్ఠికాంగుష్ఠ కాభ్యాం కర్ణమాలభతే నృప అంగులీభిస్తథా బాహుమంగుష్ఠేన తు మండలమ్

నాభిం కురుకుల శ్రేష్ఠ శిరస్సర్వాభిరేవచ అంగుష్ఠోఽగ్ని ర్మహా బాహో ప్రోక్తో వాయుః ప్రదేశినీ

అనామికా తథా సూర్యః కనిష్ఠా మఘవావిభో ప్రజాపతిర్మధ్యమాజ్ఞేయాతస్మాద్భరత సత్తమ

ఏవమాచమ్య విప్రస్తు ప్రీణాతి సతతం జగత్ సర్వాశ్చ దేవతాస్తాత లోకాంశ్చాపిన సంశయః

తస్మాత్పూజ్యస్సదా విప్రః సర్వదేవమయోహిసః బ్రాహ్మేణ విప్రతీర్థేన నిత్యకాలముపస్పృశేత్

తా ॥ ఏ నీటి బిందువైతే భూమిపై పడునో వాటిచే చతుర్విధ భూత సమూహము సంతోషించును. తర్జన్యంగుష్ఠములచేత కన్నులను అనామికాం గుష్ఠముల చేత నాసికను, మధ్యమాంగుష్ఠములచేత ముఖమును, కనిష్ఠ కాంగుష్ఠములచే చెవిని, వ్రేళ్ళచేత బాహువులను, అంగుష్ఠముచేత మండలమును, నాభిని శిరస్సును అన్ని వేళ్ళచేత స్పృశింపవలెను. అంగుష్ఠము అగ్నిగాను, తర్జన్యం గుళి వాయువుగాను, అనామిక సూర్యునిగాను, కనిష్ఠికాంగుళి ఇంద్రునిగాను, మధ్యమాంగుళి బ్రహ్మగాను తెలియదగును. ఈ విధంగా ఆచమించి బ్రాహ్మణుడు సర్వ దేవతలను, జగత్తును, లోకులనందరిని ఎల్లప్పుడు సంతోషింపజేయును. అందుచేతనే విప్రుడు సదా పూజ్యుడు. అతడు సకల దేవతల సమాహార స్వరూపము. బ్రాహ్మతీర్థము చేతనే విప్రుడు ఉపస్పర్శన విధి (ఆచమనం) నాచరించవలే కానీ, పితృతీర్ణముచేత చేయకూడదు.

కాయ త్రైదేశికాభ్యాం వాన పిత్ర్యేణ కదాచన హృద్గాభిః పూయతే విప్రః కంఠగాభిస్తు భూమిపః

వైశ్యోద్భిః ప్రాశితాభిస్తు శూద్రఃస్పృష్టాభి రంతతః ఉద్ధృతే దక్షిణే పాణావుపవీత్యుచ్యతే బుధైః

సవ్యేన ప్రాచీనావీతి నివీతీ కంఠసంజ్ఞతే మేఖలామాజినం దండముపవీతం కమండలుమ్

అప్సు ప్రాస్య వినష్టాని గృహ్ణీతాన్యాని మంత్రవిత్ ఉపవీత్యాచమేన్నిత్య మంతర్జాను మహీపతే

ఏవంతు విప్రోహ్యాచాంత శ్శుచితాం యాతి భారత యాస్త్యేతాః కరమధ్యేతు రేఖా విప్రస్య భారత

గంగాద్యాస్సరిత స్సర్వాజ్ఞేయా భారతసత్తమ యాన్యంగులిషు పర్వాణి గీరయస్తాని విద్ధివై

సర్వదేవమయోరాజన్ కరోవిప్రస్య దక్షిణః హస్తోపస్పర్శన విధి స్తవాఖ్యాతో మహీపతే

ఏష సర్వేషు లోకేషు యేనాచాంతో దివంవ్రజేత్

ఇతి శ్రీ భవిష్కే మహాపురాణే శతార్థ సాహస్ర్యం సంహితాయాం

బ్రా హ్మేపర్వణి ఉపస్పర్శన విధివర్ణనం నామ తృతీయోఽధ్యాయః

ఆచమన జలం హృదయము వరకు వెళ్ళిన మీదట విప్రుడు, కంఠం వరకు వెళ్ళినచో క్షత్రియుడు, నోటిలోనికి వెళ్ళిన పిదప వైశ్యుడు. నీటి స్పర్శ అయిన వెంటనే శూద్రుడు పవిత్రులగుదురు. సవ్యముగా (అనగా ఎడమ భుజము పై నుండి) జందెమును ధరించిన వాడు 'ఉపవీతి'యని, జందెము నపసవ్యము చేసినచో ప్రాచీనావీతి'యని, కంఠమున పేరువలె వ్రేలాడదీయుచో “నివీతి'యనియు చెప్పబడును. మొలనూలు, అజినము (జింక చర్మము) దండము, జందెము, కమండలు, అనునవి శిథిలములైనచో వానిని నీటి యందు వైచి మంత్రవేత్తయైన విప్రుడు నూతనములైన వానిని గ్రహించి, ఉపవీతియై నిత్యము ఆచమనము నాచరంచాలి. ఇట్లు ఆచమనం చేసిన విప్రుడు పరిశుద్దుడగును. విప్రుని చేతిలోని రేఖలు గంగాది పుణ్యనదులుగాను వ్రేళ్ళ యందలి కణుపులు పర్వతాలుగాను తెలియదగును. కాన విప్రుని కుడిచేయి సర్వ దేవతల నిలయము. ఓ రాజా! ఏ హస్తోప స్పర్శన విధిచేత ద్విజుడు ఆచమనము చేయుటచే పవిత్రుడై అన్ని లోకములందును సర్వమును పొందునో అది యంతయు నీకు వివరించితిని.

- తృతీయాధ్యాయము సమాప్తము -