వామన మహా పురాణము

Table of Contents

అధ్యాయము 65

నారదా! ఈ లోపున వామనాకృతి ధరించిన భగవానుడు బలి యజ్ఞ శాలను సమీపించి మేఘ గంభీర స్వరంతో యిలా అన్నాడు. ఈ యజ్ఞంలో ఓంకార పూర్వకాలయిన వేదాలన్నీ తపోధనుల రూపాన నెలకొని ఉన్నవి. ఇక అశ్వమేధమా! యజ్ఞాలన్నింటిలోను తల మానికం బలి దానవేంద్రుడో, యజ్ఞ కర్తలందర లోనూ ఉత్తముడు! ఆ మాటలు వినగానే జితేంద్రియు డగు దానవేంద్రుడు అర్ఘ్య పాత్రతో భగవానుడు నిలబడిన చోటుకు వెళ్లి అర్ఘ్య పాద్యాదులతో భరద్వాజ మహర్షి సమేతంగా ప్రభువు నర్చించి, యజ్ఞ శాల లోనికి తీసి కొని వచ్చాడు. ప్రవేశ ద్వారాన మరల యథావిధిగా కూర్చుండ బెట్టి పూజించి చేతులు జోడించి వినయంతో ఓ మానదా! ప్రభూ! మీకు నేనేమి యివ్వ వలెనో ఆజ్ఞాపించండని అర్ధించాడు. అంతనా అవ్యయు డగు దేవ శ్రేష్ఠుడు దానవేశ్వరుని చూచి చాల సేపు పక పక నవ్వి భరద్వాజ ఋషిని చూస్తూ ఇలా అన్నాడు. నా గురువు నకు గరువైన యి మహనీయుడు అగ్ని (యజ్ఞాగ్ని) పరిగ్రహం చేశాడు. ఆ అగ్నిని యితరుల భూమిపై నుంచరాదు. అందులకై ఓ దానవేశ్వనా! నా శరీర ప్రమాణానికి సరియైన మూడడుగుల నేల నా కొసగుము. ఇదియే నా యాచన. ముర మర్దనుని మటలు విని ఆ బలి భార్యను తనయుడగు బాణుని చూస్తూ యిలా అన్నాడు. ప్రేయసీ! చూచావా! ఈ వామనుడు ఆకారంలోనే కాక బుద్ధిలో కూడ వామనుడే సుమా! కనుకనే మూర్ఖుడై మూడడుగుల చోటు యాచించాడు. నిజమే. విధాత సామాన్యంగా అల్ప బుద్ధులగు వారికీ, భాగ్య దూరులగు వారికీ, భూరి భోగ భాగ్యాలు యివ్వడు. ఇదిగో అల్పాన్ని యాచించే ఈ విష్ణువునకు వలెనే! భాగ్యం వక్రించిన వానికి విధి ప్రదానం చేయడు. నాలాంటి దాతను ఈ పొట్టి వాడు మూడడుగులు యాచించడం అంతే కదా! అని ఆ మహనీయుడగు దైత్యపతి శ్రీహరితో మళ్లీ యిలా అన్నాడు. విష్ణో! అడగవయ్యా, గజాలా, అశ్వాలా, రధాలా, భూమియా, దాసీ జనమా, సువర్ణ రాసులా, ఏమి కావాలో కోరుకో, దాతనైన నేను త్రిలోకాధిపతిని! యాచించే నీవో విష్ణుడవు. ! ఈ అల్పాన్ని కోరడం మనకు యిద్దరకూ సిగ్గు పడ వలసిన విషయం కాదా? రసాతలమా, ఈ ధరణీ మండలమా, భువస్వర్లోకాలా, ఏమి కావాలో అడగవయ్యా వామనా! తప్పక యివ్వ గలను.

గజాశ్వ భూ రధ సువర్ణాదులు, అవి కావలసిన వారికివ్వుము. నాకు కావలసినది మూడడుగుల నేల యే కనుక నో రాజా కాదనక దీని నొసంగుము. వామనుడిలా అనగానే ఆ మహాదైత్యుడు జల పాత్ర తీసికొని మూడడుగుల నేల విష్ణువునకు దానం చేశాడు. దాన జలం చేతిలో పడగానే వామనుడు ముల్లోకాలు ఆక్రమించేందుకు జగన్మయమైన బహు రూపాన్ని ధరించాడు. పాదాలతో, పిక్కలతో ఆకాశాన్నీ సత్య తపో లోకాలను మోకాళ్లతో, మేరు మందరాలను తొడలతో ఆ త్రిలోక ప్రణమ్యుడు కప్పి వేశాడు. నడుములో విశ్వేదేవతలు, మరుత్తులు వస్తి శిరో భాగాల యందు, లింగం(మేఢ్రం) లో మన్మధుడు, వృషణాలలో ప్రజాపతులు, కుక్షి(పై పొట్ట) లో సప్త సాగరాలు, జఠరం(క్రింది పొట్ట) లో యజ్ఞాలు భువనాలు ఇష్టా పూర్తాలు మొదలగు వైదిక క్రియ లన్నీ కడుపు మీది మూడు పొరలలో నదులు నిలిచినయి. వీపు భాగాన వసువులు, భుజాలలో రుద్రులు, బాహువులలో పది దిక్కులు, చేతులలో అష్ట వసువులు, హృదయంలో బ్రహ్మ, హృదయాస్థులలో వజ్రాయుధము, లక్ష్మి, సముద్రాలు, వక్షోజాల మధ్య భాగాన చంద్రుడు మనస్సులో, మెడలో దేవ మాత అదితి, కంఠపు మూడు పొరలలో విద్యలు కనిపించాయి. ఆ ప్రభువు నోటిలో అగ్నుల తోటి విప్రులు, పెదవులలో సంస్కారాలు, లలాట దేశాన లక్ష్మితో కలిసి ధర్మార్ధ కామ మోక్ష శౌచ సమన్వితా లయిన శాస్త్రాలు, చెవులలో అశ్వినీ దేవతలు, ఊర్వులలో మాతరిశ్వుడు, సర్వ సంధులలో మరుత్తులు, దంతములలో సకల సూక్తాలు, నాలుక మీద సరస్వతి, నేత్రాలలో చంద్ర సూర్యులు, కృత్తిక మొదలగు నక్షత్రాలు, కను రెప్పలలోను కనిపించాయి. ఆ దేవ దేవుని శిఖా భాగాన ధ్రవుడు ఉపవిష్టుడయ్యాడు. రోమ కూపాల్లో తారకలు రోమాల్లో మహర్షులు నిలిచారు. సర్వ గుణమయుడు, సర్వభూ తమయుడు నగు నా భగవంతుడు ఒకే అడుగులో చరాచర ప్రాణులతో నిండిన భూమి నంతటినీ ఆక్రమించగా ఆ విశ్వ రూపుని కుడి రొమ్ము చంద్రుడయినది. ఎడమ రొమ్ము సూర్యుడైనది. ఆ ప్రభువు పైకి పెరిగే కొలదీ సూర్య చంద్రు లాయన బొడ్డుకు ఎడమ కుడి బాగాల నిలచారు.

రెండవ పాదం మొదటి సగంతో స్వర్గ మహర్లోక జన తపో లోకా లను కప్పి, మిగిలిన సగంతో వైరాజాన్నీ మిగిలిన మధ్య భాగంతో అంబరాన్ని, ఆక్రమించి అనంతమైన అంతరాళాన్ని నింపి, బ్రహ్మాండ కటాహాన్ని (పైపెంకును) భేదించి నిరాలోకమైన (గాఢాంధకార పూరితమైన) లోకానికి ద్వితీయ చరణాన్ని సాచి, నిలిపా డా విరాట్పుడుషుడు. రెండవ పదాంగుళుల తాకిడికి భిన్నమైన బ్రహ్మాండపు పైనుండి ఆ సాదం వెంట క్రిందికి జల జల గొప్ప ప్రవాహం నిర్గమించింది. వక్ర గతితో పారిన ఆ జలం కుటిల అయింది. అదే విష్ణు పదీ అనే పేరుతో (విష్ణు పాదోధ్భవ) విఖ్యాతమైంది. నారదా! ఆ పవిత్రోదకాలనే సుర నది అని భక్తితో తాపసులు సేవిస్తారు. మూడవ పాదానికి చోటు లేకుండుట చూచి ఆ ప్రభువు పెదవులదురు చుండగా బలిని సమీపించి దైత్యేంద్రా! ఋణ శేషం బంధనకారి అవుతుంది. మూడవ చరణానికి భూమిని చూపించుము. లేదా బంధనము నకు సిద్ధపడు మని హెచ్చరిచాడు. మురారి మాటలకు బలి పుత్రుడు బాణుడు నవ్వి హేతుబద్ధంగా ఆయనతో యిలా అన్నాడు.

జగన్నాధా! ఈ భూమండలాన్ని మిగిలిని భువన షట్కాన్నీ నీ విరాడ్రూపంతో అల్ప తరంగావించి నిశ్శేషమైన దాని నెట్లు కోరగల వయ్యా! నీవు సృష్టించిన దంతయు నదియే గదా! (నీ సృష్టి లోపాన్ని గుర్తించక) ఇంకను భూమి నెక్కడ నుంచి తెచ్చి యివ్వ మందువు? ప్రభూ! నీవు సృష్టించిన భూమండలం భువనాంతరాలతో సహా సర్వం నా తండ్రి నీకు ధార బోశాడు. నీ సృష్టిలో మగిలిన దేదియు లేదే? యింకను కపట వచనాలు పలుకుతూ బంధిస్తా నందువేల? నీవు సృష్టించినది లేనప్పుడూ నీకు సృష్టించుటకు శక్తి లేనప్పుడూ దైత్యేశ్వరుడేమి చేయగలడయ్యా! ఆయన ప్రస్తుతం చేయ గలిగినది ఆయనకు చేతనైనది ఒక్కటే నిన్ను మనసార పూజించడమే. కనుక బంధన ప్రసక్తి వదలి, ఆయనను అనుగ్రహించి ప్రసన్నుడవు కమ్ము. దేశము కాలము పాత్ర నెరిగి గావించిన దానం అక్షయ మవుతుందని శ్రుతులలో నీవే చెప్ప లేదా? ఓ చక్రధరా! మా తండ్రి చేసినది భూదానము, పాత్ర యా జితాత్మవూ, దేవ దేవుడవైన నీవు. సమయమా, చంద్ర జేష్ఠా మూలా నక్షత్రాల పవిత్రయోగం!. ఇక స్థానమా క్షత్రాలలో తల మానికం కుక్షేత్రం, సుప్రసిద్ధం! సర్వజ్ఞుడవైన నీకు బుద్ది హీనులమైన మేము, మంచి చెడులను, విధి నషేధాలను గురించి ఏమి చెప్పగలమయ్యా? వేదాలను మొదటసృజించిన వాడవు. సదస ద్విల సితమైన విశ్వంలో సర్వత్రా నిండి యున్న ప్రభువువు, నీకు తెలియని దేమి కలదు? మొదట్లో పొట్టి బొట్టెడివిగా వచ్చి మూడడుగులు యాచించావు. నిజం చెప్పు ప్రభో! లోక త్రయ పూజ్య మైన విశ్వరూపం దాల్చి మూడడుగులకు బదులు మూడులోకాలూ నీవు తీసుకోలేదటయ్యా? ఇంకా వంచన మాట లెందుకు? నీ మూడు అడుగులకూ మూడు లోకాలు చాలక పోవడం లో ఆశ్యర్యంలేదు. ఒక్క చరణంతో టే ముల్లోకాలనూ లంఘించ లేవా? లోకేశ్వరా! ఇదంతా నీ లీల మాత్రమే కాదా? ఈ భూమిని చిన్న దానిగా నీవే సృష్టించి తర్వాత ఇప్పుడు బలిని బంధిస్తావా? పద్మనాభా! మాధవా! ఇదెక్కడి ధర్మ మయ్యా? అవును నిజమే పెద్దలు తమకు నచ్చినది చేస్తారు. వారేమి చేసినా చెల్లుబడి అవుతుంది.

నారదా! బలి తనయుడు బాణుని పలుకులు విని ఆది కర్తయగు జనార్దనుడిలా బదులు చెప్పాడు.

బలి పుత్రా! నీవు గావించిన ఆరోపణలకు హేతు బదమైన సమాధానం చెబుతున్నా విను. నేను మొదట్లోనే నా ప్రమాణాన్ని అనుసరించి నాకు మూడడుగు లివ్వమని అడిగాను. ఆ ప్రకారంగానే ఆచరించాను. ఓ దానవా! మీ తండ్రికి నా ప్రమాణం తెలియదా? అతడు నిస్సంకోచంగా పరిమాణాతీతాలయిన మూడడుగులు నాకిస్తాననలేదా? నిజమే. నేను తలచుకున్నచో ఒక్క పాదంతోనే అన్ని లోకాలను కొలువ గలను. అయితే నీ తండ్రి హితాన్ని కోరి యే మూడడుగులలో వానిని కొలిచాను. ఓ బాణా! పవిత్రమైన దాన ధారను నా చేతిలో విడిచాడు. ఆ కారణాన నీ తండ్రి ఆయుర్దాయం కల్ప పర్యంతం ఉంటుంది. యిప్పుడు జరుగుతున్న శ్రాద్ధ దేవుని మన్వంతరం గడచిన మీదట సావర్ణి మన్వంతరంలో యితడు (బలి) ఇంద్రుడు కాగలడు. ఈ విధంగా బాణుని సమాధాన పరచి ఆ త్రివిక్రమ దేవుడు బలిని చూచి ప్రేమార్ద్రాలయిన తియ్యటి మాటలు ఇలా పలికాడు.

దైత్య నాథా! దాన సాద్గుణ్యం కోసం నీ వివ్వ వలసిన దక్షిణ పూర్తయ్యే వరకు నీవు నా వారలందరతో సుతల మనే పాతాళానికి వెళ్లి రోగ బాధలు లేకుండా వాసం చేయుము.

ప్రభో! సుతలంలో నిరామయంగా ఉండగలుగుటకు అవసరమైన అక్షయ భోగాలు నా కెక్కడ నుండి లభిస్తాయో చెప్పండి.

బలిరాజా! సుతలంలో ఉన్నపుడు నీకు లభించే అపూర్వమైన భోగా లేవో చెబుతాను విను. అవిధిపూర్వకంగా చేయబడిన దానాలు, వేద మంత్రాలు లేకుండా పెట్టబడే శ్రాద్ధాలు, (బ్రహ్మ చర్య) వ్రత దీక్ష తీసుకోకుండా చేయబడే వేదాధ్యయనాలు, వీటన్నిటి ఫలాలు వివిధ భోగాల రూపంలో నీకు లభిస్తాయి. ఇవి గాక నీ పేరిట ఒక మహోత్సవం ప్రతి సంవత్సరం జనులంతా చేసుకుంటారు. ఆ రోజు ఆరోగ్య వంతులై సంతోష స్వాంతువైన మానవులంతా చక్కగా అలంకరించుకొని దీప జ్యోతులు, పుష్పాంజలులు సమర్పించి శ్రద్ధగా నిన్ను పూజిస్తారు. ఆ ఉత్సవంలో ముఖ్య భాగంగా కౌముది ఉత్సవం చేసుకుంటారు. ప్రస్తుతం నీ రాజ్యంలో జరుగుతున్నట్లే అప్పుడు గూడ రాత్రింబవళ్లు నరులు వేడుకలు చేసుకుంటారు.

మధుసూదను డిలా బలిని సమాధాన పరచి భార్యతో సుతలానికి పంపాడు. యజ్ఞాన్ని తనతో తీసుకుని దేవతలతో పరివేష్టితుడైన యింద్రుని వీటికి వెళ్లాడు. ఇంద్రున కతని త్రివిష్టపాన్ని యిచ్చి దేవతలకు వారల యజ్ఞభాగాలు పునరుద్ధరించి, ఓ మహర్షి నారదా! యింద్రాదులు చూచు చుండగా నా విశ్వనాథు డక్కడి కక్కడే అంతర్హితుడైనాడు. మానవుల భాగ్య నిర్ణేత యగు వాసుదేవుడు స్వర్గానికి వెళ్లగానే శాల్వ దైత్యుడు గొప్ప రాక్షస బలంతో అంతరిక్షంలోనే సౌభమనే నగరాన్ని నిర్మించుకుని యిష్టము వచ్చినట్లు తిరుగసాగాడు. మహాత్ముడగు మయుడు స్వర్ణ తామ్ర లోహ నిర్మితమైన త్రిపుర మనే పట్టణం సకల వసతులతో సర్వాంగ సుందరంగా నిర్మించుకుని భార్యా పరివారంతో, తారకాక్ష దైత్యులతో గూడుకొని సుఖ నివాసం గావించ సాగాడు. బాణుడు కూడ శ్రీహరి త్రివిష్టపాన్ని అపహరించిన మీదట తన తండ్రి బద్ధుడై రసాతలానికి వెళ్ళగా భూమి మీద శోణితమనే చక్కని నగర దుర్గం నిర్మింకొని ముఖ్యులైన దైత్యేశ్వరులతో కలిసి రాజ్యం చేశాడు. ఓ నారదా! ఈ విధంగా పూర్వకాలాన దేవ కార్యం సిద్ధింప జేసి యింద్రునకు హితం చేయుటకు గో బ్రాహ్మణ కల్యాణం కోసమూ చక్రధరు డగు విష్ణు దేవుడు వామన రూపం దాల్చి బలిని బంధించాడు. పాప హరం పుణ్య ప్రదమూ అయిన వామనావ తార కథ నీకు చెప్పాను. దీనిని వినినా స్మరించినా కీర్తించినా పాపక్షయం కలిగి పుణ్యం లభిస్తుంది. పుణ్య శ్లోకుడు అవ్యయుడు నగు విష్ణుడు వామనుడుగా పుట్టి బలిని బంధించిన గాధ వినిపించాను. ఇంకనూ ఏమి వినదలచెదవో అడుగుము. వివరంగా చెప్పెదను.

అధ్యాయము 65 Complete