వామన మహా పురాణము
అధ్యాయము 4
దేవర్షీ! ఈ విదంగా భగవంతుడగు హరుడు కపాలియయ్యెను. అది కారణంగా దక్షుడాయనను ఆహ్వనించడాయెను. యజ్ఞంలో పాల్గొనుట కర్హురాలైనను కపాలి భార్యయగుటచే తన కుమార్తె సతిని గూడా నాహ్వానించలేదు. ఈ లోపుగా గౌతమ దుహిత జయ అందమైన గుహలతో కూడిన మందర పర్వతమునకు వెళ్ళి సతీదేవిని దర్శించెను. ఒంటరిగా వచ్చిన జయను చూచి దాక్షాయణి, విజయ, జయంతీ, అపరాజితలేరీ? నీ వొక్కతెవే ఏల వచ్చితివనెను. పరమేశ్వరితో జయ, “వారందరు మన మాతామహుడొ నరించుచున్న యజ్ఞమున కాహ్వానితులై వెళ్ళిరి. నేను నిన్ను చూడవలెనని మా తల్లి దండ్రులు అహల్యా గౌతములతో కలిసి వెళ్ళుచూ దారిలో యిటు వచ్చితిని. మరి నీవు మహేశ్వరునితో కలిసి వచ్చుట లేదా? మీ తండ్రి పిలువనంపలేదా? లేక తరువాత వచ్చెదవా? ఋషులు వారి భార్యలు, దేవతలు, సపత్నీతుడై చంద్రుడు, పదునాలుగు భువనాల్లో గల చరాచర ప్రాణులందరూ ఆహ్వనితులై యజ్ఞానికి వెళ్ళగా నీ వేల బయలుదేరకుంటివి పిన్నీ ? నిన్ను మీ తండ్రి పిలువా లేదా ?” యనెను.
పిడుగు పాటు లాంటి ఆ మాటలు వినిన తోడనే సతీదేవి క్రోధాతిరేకంతో అక్కడకక్కడనే ప్రాణములు వదలెను. చనిపోయిన సతీదేవిని చూచి జయ దుఃఖాతిరేకంతో కన్నీరు కార్చుచు విలపింపసాగెను. ఆక్రందన ధ్వని విని పరమేశ్వరుడదరిపడి, “ఏమి జరిగిన” దనుచూ జయను సమీపించెను. పరశుఘాతానికి తెగిపడిన తీగవలె నేల కొరగిపడియున్న సతిని జూచి, “నరుకబడిన తీగ వలె ఈమె యేలపడియున్న”దని జయనడిగెను. అప్పుడు జయ ప్రభూ! తన తోబుట్టువు లెల్లరూ భర్తలతో నాహ్వానించబడి దక్షయజ్ఞమునకు వెళ్ళిన సంగతియూ ఇంద్రాది సకల దేవతలు వెళ్ళిన విషయం విని, ఈనా పిన తల్లి అంతర్దుఃఖాగ్నిలో మ్రగ్గి ఈ దశకు ప్రాప్తించిన” దనెను.
జయ మాటలు విన్నంతనే రుద్రుడు క్రోధతామ్రాక్షుడయ్యెను. ఆయన అంగ ప్రత్యంగమం నుండియు భయంకరమైన విస్పులింగములు బయలు వెడలెను. అట్లు క్రోదోన్మత్తుడైన త్రినేత్రుని రోమకూపాల నుంచి వీరభద్రుని పురస్కరించుకొని సింహముఖులైన రుద్రగణములు వెలువడి దక్షుడు యజ్ఞమొనర్చుచున్న కనఖల ప్రదేశానికి వెళ్ళిరి. గణాధ్యక్షుడైన వీరభద్రుడు భయంకరమైన శూలము ధరించి యజ్ఞశాలకు పశ్చిమ ఉత్తర దిశల నాక్రమించి నిలచెను. క్రోధావేశంతో కంపించిపోతూ జయ గద చేతబట్టుకొని తూర్పు దక్షిణ దిక్కుల నిలబడినది. ఓ మునీ! మధ్యభాగాన త్రిశూలధారియై శర్వుడు భయంకరాకృతితో నిలబడెను. ఇంద్ర పురోగములైన ఋషులు యక్ష గంధర్వులు భయంకరమైన సింహ ముఖము చూచి ఇదేమని చింతాకులితులైరి. అంతట ద్వారరక్షకుడగు ధర్ముడు ఆశీవిషోపమాలైన సరములు పూన్చిన విల్లు గ్రహించి వీరభద్రున కెదురుగా పరుగిడెను. ఆ విధంగా పైకివచ్చు ధర్ముని చూచి గణేశ్వరుడు అగ్ని శిఖా సదృశమైన త్రిశూలమొక చేత బట్టెను. రెండవ చేత ధనుస్సు మూడు నాలుగు చేతులలో బాణములు గద ధరించి ధర్ముని తరుమజొచ్చెను. నాలుగు భుజములతో తన్నెదిర్చిన గణాధ్యక్షుని చూచి అవ్యయుడైన ధర్ముడు తత్క్షణమే ఎనిమిది భుజములు దంరించి నానాయుధములతో నిలబడెను. ఖడ్గ చర్మ, గద, ప్రాస పరశు అంకుశ చాపమారణములతో గణేశ్వరుని జంపనుద్యుక్తుడయ్యెను. గణేశ్వరుడు కూడ సనాతనుడగు ధర్ముని సంహరించు తలంపుతో, వర్షాకాలపు మేఘము వలె తీవ్రములగు బాణములనతనిపై ప్రయోగించెను. ఓ మునీ! అట్లమ్మహాత్ములగు వీరులిర్వురు శరచాపములతో నొకరి నొకరు ప్రహరించుకొని రక్తసిక్తాంగులై పూచిన మోదుగ వలె ప్రకాశించిరి. అంతట వీరభద్రుని తీవ్ర బాణవృష్టికి నోటుపడి దీనుడై ధర్ముడు ముఖము వంచుకొని తొలగిపోగా వీరభద్రుడు యాగశాల బ్రవేశించెను.
యజ్ఞశాలలో ప్రవేశించిన వీరభద్రుని చూడగనే అందున్న దేవతలందరు – అష్టవసువులు, నవగ్రహాలూ, ఇంద్రాది ద్వాదశాదిత్యులు ఏకాదశరుద్రులు, విశ్వేదేవులు, సాధ్యులు, సిద్ధగంధర్వ కింపురుషులు పన్నగులు యక్షులు, ఖగములు చక్రధరులు మొదలగు వారెల్లరు లేచి నిలబడిరి. వైవస్వత వంశానికి చెందిన లబ్ధ ప్రతిష్టుడగు ధర్మకీర్తి, ఉగ్రుడు మహాబాహువునగు సోమ వంశోద్భవుడు భోజకీర్తి. అక్కడ చేరిన దైత్యులు దానవులు తదితరు లెల్లరు తమతమ ఆయుధములతో రుద్రమూర్తియగు వీరభద్రు నెదుర్కొనిరి. అంతట వీరభద్రుడు తన తీవ్రశరపరంపరతో వారలందరను చెల్లాచెదరు కావించెను. వారందరు తమ అసమాన శస్త్రాలను వీరభద్రునిపై కుప్పింపగా నా గణాదిపుడు కూడ తన శ్రేష్టమైన ఆయుధాలతో వానినన్నింటిని తుత్తునియణగావించెను. వీరభద్రుని అస్త్రములచే తీవ్రముగ నొప్పింపబడి చేయునది లేక నాదేవత లందరు నాతనికి లొంగిపోయిరి. అంతట వీరభద్రుడు మహర్షుల ఆజ్యాహుతులతో వెలుగుచున్న విశాలమగు యజ్ఞశాలలో ప్రవేశించెను. భాయంకరాకారులై వచ్చు నా సింహముఖ గణాలను చూచినంతనే హడలిపోయి ఋత్విక్కులందరూ తమతమ యజ్ఞ వేదికలు వదలిపారిపోయి నారాయణుని శరణు వేడిరి. భయకంపితులగు నామహర్షులకభయ మొసగి విష్ణువు తన ఉత్తమమగు శార్గ్నధనువు నెత్తికొని వీరభద్రునిపై అభేద్యకవచములను సైతము చించి చెండాడ గలిగిన అగ్ని బాణములను వర్షించెను. అమోఘాలయిన ఆబాణాలన్నీ వీరభద్రుని శరీరామును తాకి నాస్తికులను యాచించి విఫల మనోరథులయిన యాచకులవలె వ్యర్థములై నేలబడిపోయెను. తన బాణములట్లు వ్యర్థములగుట చూచి కేశవుడు దివ్యాస్త్రాలతో వీరభద్రుని ముంచి వైచుట కుద్యమించెను. శ్రీహరి ప్రయోగించిన అస్త్రాలన్నింటిని వీరభద్రుడు త్రిశూలంతో గదతో మార్గణాలతో నివారించెను. తన దివ్యాస్త్రములు వ్యర్తముకాగా మాధవుడాతనిపైకి గదవిసరెను. ఆగదను త్రిశూలముతో భూమిపై బడగొట్టెను. అంతట హరి వీరభద్రునిపై హలము ముసలము ప్రయోగింపగా దానిని గణేశుడు గదతో నివారిత మొనర్చెను. అంతట మహాక్రోధంతో ఖగధ్వజుడు వీరభద్రునిపై చక్రము ప్రయోగించెను. శత సూర్యుల కాంతితో వచ్చే ఆ సుదర్శనాన్ని చూచి వీరభద్రుడు తనశూలాన్ని వదలివైచి, మీన శరీరం ధరించి ఇంద్రుడు మధురాక్షనుని మ్రింగినట్లుగా, చక్రాన్ని మ్రింగివైచెను. అంతట క్రోధంతో నల్లబడిన సుందర నేత్రాలతో విష్ణువు వీరభద్రుని సమీపించి మెరుపు వేగంతో నతని భూమిపై బడగొట్టి బాహువులతో తీవ్రంగా మర్ధించెను. అట్లు భయంకరంగా మర్థింప బడిన వీరభద్రుడు రక్తము గ్రక్కి పడిపోవుటతో నాతని శరీరము నుండి చక్రము వెలికివచ్చెను. అంతట తన చక్రాన్ని తాను తీసికొని విష్ణువు వీరభద్రుని వదలి వైచెను. వాసుదేవునికి ఓడిపోయి వీరభద్రుడా విషయము శంకరునకు నివేదించెను. నెత్తుట దోగిన వీరభద్రుని చూచి శివుడు క్రోదోన్మత్తుడై వీరభద్రుని భద్రకాళిణి వారినిర్దిష్ట స్థానాల్లో నిలిపి తాను స్వయంగా త్రిశూలపాణియై దక్షుని యజ్ఞశాలలోనికి జొరబడెను. ఆ విధముగా వచ్చిన త్రిపురాంతకుడగు మహాదేవుని చూచి మునులందరు బయకంపితులయిరి.
అధ్యాయము 4 complete
