వామన మహా పురాణము
అధ్యాయము 11
మహాత్మా! నీవింతకుముందు, సుకేశి నగరాన్ని సూర్యుడు క్రిందకు త్రోసివైచెనంటివి. అది ఎప్పుడు ఎక్కడ జరిగినది? ఆసుకేశి ఎవడు? అతనికా నగరం ఎవరిచ్చారు? ఆకాశాన్నుంచి దానిని సూర్యుడెందుకు భూమి మీదకు పడవేశాడు?
అనఘా! ఇది చాల పురాతన గాథ; శ్రద్దగా విను. బ్రహ్మ నాడు వినిపించిన ఈ వృత్తాంతం సాకల్యంగా చెబుతున్నాను. ఒకప్పుడు విద్యుత్కేశి అనే రాక్షస రాజుండేవాడు. అతనికి సద్గుణవంతుడైన సుకేశియను వాడు కుమారుడు. అతని వల్ల సంతుష్టుడై పరమ శివుడాకాశగమనం కలిగిన ఒక నగరాన్నీ, అజేయత్వాన్నీ, శత్రువుల చేత అనద్యత్వాన్నీ వరాలుగా యిచ్చాడు. ఆ విధంగా ఆకాశనగరాన్ని సంపాదించి ఆ అసురుడు తనవారలతో కలిసి ధర్మం తప్పకుండా, సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు. ఆ రాక్షస రాజొక పర్యాయం మగధ దేశంలో అడవికి వెళ్లి, అక్కడ మహర్షుల ఆశ్రమాలను దర్శించాడు. ఆ మహనీయులకు పాదాభివందనం చేసి, వారి చేత గౌరవింపబడి వారలతో నిట్లనెను.
నా మనస్సులో ఒక సందేహం కలిగింది. దయచేసి దానిని తొలగించండి. ఇది మీకు నా ఆజ్ఞ కాదు. విన్నపము. మహనీయులారా! ఇహ లోకంలోనూ పరలోకంలోనూ శ్రేయస్సు కలిగించేది ఏమిటి? దేనివల్ల సజ్జనులలో గౌరవం లభిస్తుంది? మానవుడు సుఖంగా ఉండకలుగుతాడు?
సుకేశి మాటలు విని ఆమహర్షులు చక్కగా వితర్కించుకొని ఇహపర శ్రేయస్కరమైన ఉపాయాన్ని వివరించారు.
రాక్షసోత్తమా! ఇహ పరలోకాల్లో శ్రేయస్కరమైన విషయమేదో చెప్పెదము. శ్రద్దగా వినుము. నిశాచరా! ధర్మాచరణ మొక్కటే ఇహ పరాల్లో సుఖం కలిగిస్తుంది. దాని ననుష్టించిన వారిని సజ్జనులు గౌరవించి పూజిస్తారు.
ధర్మం యొక్క లక్షణమేమిటి ? దాని ఆచరణ పద్ధతి ఎట్టిది ? దేవాదులకు గూడ సౌఖ్యాపాదియగు ఆ ధర్మస్వరూప స్వభావాలను వివరించండి.
యజ్ఞయాగాదులు చేయడం, వేదాధ్యయనం, వేదార్థజ్ఞాన సంపాదనం, విష్ణుపూజ యివి సదా దేవతలనుష్టించవలసిన ధర్మకార్యాలు, యిక బాహుబలం, మాత్సర్యబుద్ది, యుద్ధం, ఆతిథ్యం, నీతిశాస్త్రజ్ఞానము శివభక్తి యివి దైత్యదానవ ధర్మాలు, యోగాభ్యాసం, వేదాధ్యయనం, బ్రహ్మ విజ్ఞానప్రాప్తి. వీనినిమించి అచంచలమైన భక్తి యివి సిద్దుల ధర్మాలు. ఇక గంధర్వులకు, పరమమైన ఉపాసన, నృత్యవాద్య పరిజ్ఞానం, స్థిరమైన సరస్వతీ ఆరాధనం అనుష్టేయ ధర్మాలు. అసమాన విద్యాసంపాదనం లోకవిజ్ఞానం, పౌరుషం, భవాన పట్ల సద్భక్తి విద్యాధర ధర్మాలు. సంగీత విద్యానైపుణ్యం, సూర్యునిపట్ల భక్తి, సర్వశిల్ప ప్రావీణ్యం కింపురుష ధర్మాలు. బ్రహ్మచర్యం, అమానిత్వం, దృడమైన యోగాభ్యాసాసక్తి కామగమనం పితృదేవతల ధర్మాలు; ఇక ఋషులనుష్టించ వలసిన ధర్మాలు, బ్రహ్మచర్యం, మితాహారం, జపం, జ్ఞానప్రాప్తి ధర్మస్వరూపజ్ఞానం, యివి; స్వాద్యాయం, బ్రహ్మచర్యం, దానం, యజనం, ఔదార్యం, సారళ్యం, దయ, అహింసా, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం, శుచిత్వం సత్సంకల్పం, శివకేశవ భాస్కర దేవ్యాదుల పట్ల భక్తి యివి మానవులనుష్టించవలసిన ధర్మాలు. ధనాధిపత్యం, భోగాలు, స్వాద్యాయం, శివారాధన, అహంకారం, ఔద్దత్యం, యక్షుల ధర్మాలు. ఇతరుల భార్యల చెరబట్టడం, పరధనాపహరణం, త్ర్యంబకారాధన రాక్షస ధర్మాలు. ఇక పిశాచ లక్షణాలు. అవివేకం, అజ్ఞానం, అశౌచం, అసత్యం, సదా మాంస భోజనం. దానవా! యివి ఈ పన్నెండు యోనుల వారికై బ్రహ్మ నిర్దేశించిన లక్షణాలు. వారివారికి సద్గతి ప్రదాలు.
ద్వాదశయోనుల వారు ఆచరించాల్సిన శాశ్వత ధర్మాలేవో చెప్పారు. అయితే వీనిలో మానవుల ధర్మాలేవో మరొక పర్యాయం దయతో వివరించండి.
రాత్రించరా! మహీతలాన సప్తద్వీపాలలో నివసించే మనుష్యాది జీవుల ధర్మాలు చెబుతున్నాం వినుము. మహాజలరాశి మీద ఓడకువలె యీధరామండలం, ఏబది కోటియోజన విస్తీర్ణం గలిగి సముద్ర జలాల మీద నిలచియున్నది. దానిమీద దేవాధిపతి బ్రహ్మ కమల దళాల మధ్య కర్ణికలాగా నొక ఎత్తైన పర్వతం నిర్మించాడు. దానికి నలుదిశలా, యీ పవిత్రమానవాళిని, వివిధద్వీపాలలో ప్రజాపతి సృష్టించాడు. ఆ ద్వీపాల మధ్య లక్షయోజన ప్రమాణం గల ఈ జంబూద్వీపాన్ని నిర్మించాడు. దానిచుట్టూ రెండింతల విస్తీర్ణంగల సముద్రం పరివేష్టించి ఉంది. దానికి వెలుపల రెండింతలు పరిమాణం గల ప్లక్షద్వీపం ఉంది. దాని నలువైపుల యిక్షురస సముద్రం వ్యాపించి ఉంది. దానికి ద్విగుణ ప్రమాణంలో శాల్మలి ద్వీపం దానిచుట్టూ రెండింతలుగా సురాసముద్రం వ్యాపించి ఉన్నాయి. దానికి రెండింతలు గల కుశద్వీపం, అందుకు రెండింతలుగా నేతి సముద్రం ఆవరించి ఉన్నాయి. రాక్షసా! నేతి సంద్రం చుట్టూ రెండింతల ప్రమాణంలో క్రౌంచ ద్వీపం, దానికి రెండింతల పెరుగు సముద్రం క్రమ్ముకొని ఉన్నాయి. దది సముద్రాన్ని ద్విగుణ ప్రమాణం గల శాకద్వీపం ఆవరించి ఉంటే దాని చుట్టూ రెండింతలుగల క్షీర సముద్రం విస్తరించి ఉంది. దాని మీద శేష పర్యంతం మీద శ్రీహరి శయనించి ఉంటాడు. ఒకదానికొకటి రెండు రెట్ల విస్తీర్ణంతో యివి అన్నీ వ్యాపించి ఉన్నాయి. రాక్షసేశ్వరా! జంబూద్వీపం మొదలు క్షీరసముద్రం వరకూ విస్తరించియున్న వీటన్నింటి విస్తీర్ణం నలభైకోట్ల తొంబదియైదు లక్షలయోజనాలు .
వాని తర్వాత పుష్కర ద్వీపం దానిని చుట్టి మంచినీటి సముద్రం రెండూ ఒక్కొక్కటి నాలుగు కోట్ల ఏబదిరెండు లక్షల విస్తీర్ణాలతో వ్యాపించి ఉన్నాయి. వీటన్నింటికీ లక్షయోజనాలు ఆవలగా నలువైపులా అండాకారంలో వ్యాపించి ఉన్నది. బ్రహ్మాండ కటాహం (పెంకు). ఈ విదంగా ఏర్పడిన సప్తద్వీపాలకు వేర్వేరుగా ధర్మాచరణాలు నిర్దేశింపబడినాయి. చెబుతున్నాము. శ్రద్దగా విను. మహావీరుడా! ప్లక్షం మొదలు శాకద్వీపం వరకుగల ద్వీపాలలో నివసించే వరులకు మొదటి నుంచీ యుగాలనేవి లేవు. వారలు ఎల్లప్పుడూ దేవతలకు వలె, దేవ సౌఖ్యాలను అనుభవిస్తూ ఉంటారు. వారలకు కల్పాంత మందే ప్రళయం సంభవిస్తుంది. ఇక భయం గొలిపే పుష్కర ద్వీపవాసులు పిశాచ ధర్మావలంబకులై తమ కర్మ క్షయంతో నశిస్తారు.
పుష్కర ద్వీపం భయంకరంగా ఉండటం, అందలి వారు అపవిత్రులుగా, పిశాచ ధర్మంతో క్రూరులుగా, కర్మాంత వాశస్తులుగా ఉండటానికి కారణాలేమిటి?
రాక్షసా ! ఆ ద్వీపం రౌరవాది భయంకర నరకాలకు నిలయం. అందుచేత అది చూచేవారికి భయం కలిగిస్తుంది.
తపోధనులారా ! ఆ నరకాలెన్ని ! వాని స్వరూప స్వభావాలు వర్ణించండి.
దైత్యేశ్వరా! రౌరవాది నరకాలు యిరువది యొక్కటి. వాటి విస్తీర్ణం లక్షణాలు వినుము. మొదటి రౌరవ నరకం రెండు వేల యోజనాల విస్తీర్ణం గలిగి, కణకణమండే నిప్పు కణికలతో నిండి ఉంటుంది. దానికి రెండింతలు ప్రమాణంతో మహారౌరవ నరకం, దిగువ నుంచి అగ్నితప్తమైన రాగిరేకులతో నిండి ఉంటుంది. దానికి ద్విగుణ ప్రమాణంలో తామిస్ర నరకం, దానికి రెండింతలు నాలుగో నరకం అందతామిశ్రం వ్యాపించి ఉంటాయి. ఐదవది కాలచక్రం, ఆరవది అప్రతిష్టం, ఏడవది ఘటీయంత్ర నరకం. ఎనిమిదవదైన అసిపత్రవనం డెబ్బది రెండు యోజనాల విస్తీర్ణంతో అన్నింటికన్న ప్రముఖంగా ఘోరంగా కనిపిస్తుంది. తప్తకుంభ కూటశాల్మలాలు తొమ్మిదీ పదీ నరకాలు. అట్లే కరపత్రం, శ్వాసభోజనం, సందంశం, లోహపిండం, కరంభసికతం, ఘోరం, క్షారనది, క్రిమిభోజనం వరసగా ఉంటాయి. పదునెనిమిదవది భయంకరమైన వైతరణీనది. మిగిలిన రకాలు శోణిత పూయ భోజనం, క్షురాగ్రదార, చక్రకం, సంశోషణం అనంతం అనేవి. ఓ సుకేశీ! ఈ విధంగా నీకు నరకాలను గురించి తెలిపినాము.
అధ్యాయము 11 complete
