వామన మహా పురాణము
అధ్యాయము 17
శివకేశవుల ప్రసన్నులను గావించుకొనుటకు చంద్రుడు గావించిన వ్రతారాధనము లెవ్వియోదయచేసి సెలవియ్యవలయును.
నారదా! శర్వకేశవులను ప్రసన్నుల గావించుకొనుటకుగా కాముకులు ప్రవచించిన పుణ్యవ్రతాలను గురించి వినుము. ఉత్తరాయణం వెళ్ళిపోయి ఆషాఢ మాసాగామనంతో దేవాధిదేవుడు లక్ష్మీపతి శేషశయనం మీద నిద్రించును. తమ ప్రభువు నిద్రించినతోడనే దేవ గంధర్వ యక్షులు వారల తల్లులు క్రమంగా గాఢ నిద్రలో మునిగిపోతారు.
మహర్షే ఆదేవతల ఉత్తమశయన పద్ధతిని క్రమంగా వినగోరెదను.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు సూర్యుడు మిథునరాశిలో ప్రవేశించగా జగన్నాథుడు శయనమున కుపక్రమించును. పీతాంబరదారియై శుచియై ప్రయత్నశీలుడై నరుడు. శేషశయనము నేర్పరచి దానిపై కేశవునికి ఉపవీతదారణం కావించి అర్ఘ్యపాద్యాదులతో చక్కగా పూజించి, ద్వాదశినాడు బ్రాహ్మణ పూజచేసి, వారిచేత అనుజ్ఞ పొంది స్వామిని సుఖశయనుని గావింపవలెను. త్రయోదశినాడు కదంబ పుష్పశయ్య మీద మన్మథుడు నిద్రించును. చతుర్దశినాడు యక్షులు, బంగారు కమలాలు పరచినశీతల శయ్య మీద మంచి తలగడలమర్చుకొని నిద్రింతురు. పౌర్ణమి నాడు పరమశివుడు తనజటాజూటాన్ని పులితోలుతో ముడివేసికొని వ్యాఘ్రాజినం మీద శయనించును. సూర్యుడు కర్కట రాశిలో ప్రవేశించుటతో దేవతలకు రాత్రి ఆరంభమగును. అదే దక్షిణాయనము. ఓ పవిత్రమునీ! పాడ్యమినాడు నల్లకలువలశయ్య మీద విరించి శయనించును. ప్రజలకు ఉత్తమమైన మార్గము చూపును. తర్వాత వరుసగా విదియనాడు దేవ శిల్పి విశ్వకర్మ తదియనాడు పార్వతీదేవి, చవితినాడు వినాయకుడు, పంచమినాడు యమధర్మరాజు, షష్టినాడు కుమారస్వామి, సప్తమినాడు సూర్యుడు, అష్టమినాడు కాత్యాయని, నవమినాడు మహాలక్ష్మి, దశమినాడు వాయుభుక్కులు పన్నగులు, నిద్రింతురు. కృష్ణ పక్ష ఏకాదశినాడు సాధ్యులు నిద్రింతురు. ఈ క్రమంలో దేవతలు శ్రావణమాసంలో నిద్రించగా అప్పటి నుండి వర్షాకాలము ప్రారంభమగును.
గ్రద్దలు (కంకాః) కొంగలు, కాకులు, కొండకొమ్ముల మీద చేరుతవి. కాకులు గూళ్ళు కట్టడం మొదలెడతాయి. ఈ ఋతువులో గర్భాభారంతో ఉండే ఆడకాకులు వెళ్లి ఆగూళ్ళలో నిద్రిస్తవి. నారదా! ప్రజాపతి విశ్వకర్మ నిద్రించిన రోజును పవిత్రమైన అశూన్యశయన ద్వితీయ అంటారు. ఆదినాన శ్రీ వత్సాంకుడు చతుర్భుజుడైన మహా విష్ణువును, మహాలక్ష్మితో గూడ శయనం మీద నుంచి గంధ పుష్పాదులతో పూజించి ఆ శయ్య మీద సువాసన గల ఫలాలు ప్రక్షేపించాలి. వానిని నివేదించి ఆ మధుసూదనుని యిలా ప్రార్థించాలి. “ఓ త్రివిక్రమా! అనంతా! జగన్నివాసా! నీవే విధంగా క్షణ కాలం కూడ వదలకుండా లక్ష్మితో ఉంటావో అదే విధంగా నీ అనుగ్రహం వల్ల మాశయ్యలు గూడ ఒక క్షణకాలం కూడ శూన్యంగా ఉండకుండుగాక! మేము కూడ అశూన్యశయనుల మగుదుము కాక! ఓ అచ్యుతా! వరదా! లక్ష్మితో కూడి ఎట్లు నీ తల్పం అశూన్యంగా ఉంటుందో, అదేవిధంగా ఓ అమితవీర్యా! విష్ణూ! మాకుగార్హస్త్య నష్టమే నాడును కలుగ కుండుగాక! ఈ విధంగా ప్రార్థించి మరల మరల నమస్కారములు గావించి శ్రియః పతిని ప్రసన్నుని గావించుకొని, ఆనాడు రాత్రివేళ మాత్రమే, నారదా! నూనె ఉప్పులేని భోజనం చేయాలి. ఆ మరునాడు ఉత్తమ బ్రాహ్మణునకొక పండును, తన శక్తి కొలది దక్షిణతో కూడ దానం చేయాలి. లక్ష్మీనాధుడు సంతోషించు గాక! అని సంకల్పించుకొని ఆఫలదానం చేయాలి. ఈ విధంగా, సూర్యుడు వృశ్చికరాశిలో ప్రవేశించువరకు చాతుర్మాస్య వ్రతాచరణం చేయాలి. అంతట దేవతలొకరొకరుగా నిద్రనుంచి మేలుకుంటారు. అంతట విదియనాడు లక్ష్మీనారాయణ విగ్రహాన్ని తల్పం ఆస్తరణతో కూడ తన వైభవానికి తగిన రీతిలో దానం చేయాలి, ఈ విధంగా మొదటి వ్రతాన్ని నీకు తెలిపితిని. దీనినాచరించిన వారికి జీవితంలో ఎవరితో వియోగం ఎప్పుడు కలుగదు. ఇదే విధంగా మృగశిరా యుక్తమైన శ్రావణ కృష్ణ అష్టమి గూడ పవిత్రమైనది. దానిని కాలాష్టమి అంటారు.
ఆ తిథినాడు శంకరుడన్ని లింగములలోను నిద్రించును. ఆ సమయాన ఆయన నారాధించిన వాని పూజ అక్షయఫల దాయకమౌతుంది. అప్పుడు విజ్ఞుడు గోమూత్ర జలాలతో స్నానం చేయించి ఉమ్మెత్తపూలతో త్రిలోచనుని పూజించాలి. కేసరసత్తు ధూపం వేసి, తేనె నేయి నైవేద్యం యిచ్చి “విరూపాక్షుడు నా యెడ ప్రసన్నుడగు గాక !” అని పలికి సువర్ణ సహితంగా నైవేద్యాన్ని ఉత్తమ బ్రాహ్మణునకు దాన మివ్వవలెను. అదే విధంగా ఆశ్వయుజంలో ఉపవసించి జితేంద్రియుడై నవమినాడు గోమయ స్నానం చేయించాలి. కమలాలతో పూజ చేసి, ధూపం అర్పించి తేనె మిష్టాన్నం (కుడుములు) నైవేద్యం యివ్వాలి. అష్టమినాడుపవసించి నవమినాడు స్నానంచేయాలి. హిరణ్యాక్షుడు నన్ననుగ్రహించు గాక; యనుచు నువ్వులు దక్షిణ యివ్వాలి. కార్తీక మాసంలో పాలతో స్నానం చేయించి కరవీర పుష్పాలతో అర్చన చేయాలు. శ్రీగంధం ధూపం వేసి తేనె పాయసం నివేదించాలి. రజత దక్షిణతో ఆ నైవేద్యం బ్రాహ్మణునకిచ్చి సౌమ్య వచనాలతో “భగవంతుడగు స్థాణువునన్నను గ్రహించు గాక!” అని నమస్కరించాలి. మార్గశీర్ష మాసంలో అష్టమినాడుపవసించి నవమి రోజు పెరుగుతో స్నానం చేయించి భద్ర పుష్పాలతో అర్చన చేయాలి. బిల్వవృక్షపు బెరడులతో ధూపం వేయాలి. తేనెతో వండి అన్నం నివేదనం చేసి, దానిని బ్రాహ్మణునకు ఎర్రబియ్యపు దక్షిణతో దానం యివ్వాలి. “శ్రీశర్వునకు నమస్సులు! ప్రీతుడగు గాక!” అని ప్రార్థించాలి. పవిత్రమైన పుష్యమాసంలో నేతితో స్నానం చేయించి మంగళ ప్రదాలయిన తగరుపూలతో అర్చనం చేయాలి. మధూక చెట్టు బెరడు ధూపం వేసి మధువు శష్కులి (రొట్టె) నైవేద్యం పెట్టాలి. పెసలు దక్షిణగా ఆ నైవేద్యం బ్రాహ్మణునకు దానం చేసి, దేవాధిదేవా! త్ర్యంబకా! నీకు నమస్కారం!” అని కీర్తించాలి. మాఘ మాసంలో దర్భలు వేసిన జలంతో స్నానం చేయించి కస్తూరితో పూజించాలి. కడిమిచెట్టు బెరడు ధూపం వేసి నువ్వుల అన్నం నివేదించాలి. బంగారం పాయసాన్నం దక్షిణగా నివేదితాన్నాన్ని బ్రాహ్మణునకు యివ్వవలెను. “ఉమాకాంతుడను మహాదేవుడు ప్రీతుడగు గాక!” అని సమర్పించవలెను. ఈ విధంగా ఆరు నెలల కాలంసాగే ఈ వ్రతపారణంజరుగుతుంది. పారణం (సమాప్తి) చివర త్రిలోచనునికి సక్రమంగా స్నానం చేయించాలి.
మహర్షే! గోరోజనం బెల్లం కలిపిన మిశ్రమంతో స్వామిని తాకి పూజించాలి. “ఈశ్వరా! ఈ దీనునియెడ ప్రసన్నుడవుకమ్ము. ణా శోకబాధలన్నింటిని నశింపజేయుము!” అని ఆత్మ నివేదనము చేయవలె. తర్వాత ఫాల్గుణమాసంలో కృష్ణ పక్షంలో అష్టమినాడు యథావిధిగ ఉపవసించాలి. ఆ మరునాడే దేవుని పంచాగవ్యములతో(పంచగవ్యములనగా – ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నేయి , గోమయము, గోమూత్రము) నభిషేకించాలి. మల్లె పూలతో పూజించి చందన ధూపం వేయాలి. రాగి పాత్రలో నేయి బెల్లముతో వండిన అన్నం నైవేద్యం చేయాలి. మునీ! రెండు వస్త్రాలు దక్షిణతో నైవేద్యం, బ్రాహ్మణునకు రుద్ర నామోచ్చారణ చేస్తూ యివ్వాలి. చైత్ర మాసంలో ఉదుంబర (మేడి) ఫలరసంతో స్నానం చేయించి మందార కుసుమాలతో అర్చించాలి. మహిష గుగ్గిలం నేతితో తడిపి ధూపం వేయాలి. నేయి కుడుములు (లడ్లు) ప్రేమతో నైవేద్యం పెట్టాలి. ఈ నైవేద్యంతో బాటు దక్షిణ క్రింద చర్మాన్ని బ్రాహ్మణునకివ్వవలెను. నారదా! తదుపరి శ్రద్దా భక్తులతో ఆ దేవేశ్వరునకు ప్రీతిగొల్పునట్లుగా “ప్రభో! నాట్యేశ్వరా! నీకు నమస్కారము!” అని ప్రణమిల్లాలి. వైశాఖ మాసంలో సుగంధ కుసుమ వాసనలు గల నీటితో అభిషేకం చేసి శంకరునకు తియ్యమామిడి పుష్పగుచ్చాలతో అర్చన చేయాలి. నేతితో తడిపిన పాలవృక్షపు బెరడులు ధూపం వేసి “కాలఘ్నా!” (కాలాంతకా!) అని జపిస్తూ నేయి పండ్లు నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యదానంతో బాటు బ్రాహ్మణునకు జల కుంభములు, యజ్ఞోపవీతాలు, భోజన సామగ్రి దక్షిణ యివ్వాలి. ఇక జ్యేష్ఠ మాసంలో స్వామికి ఆమలక జల స్నానం చేయించి అర్కపుష్పాలతో (జిల్లేడు పూలు) అర్చన చేయాలి. అభ్యుదయకారియగు సరళ వృక్ష బెరడుల దూపంవేయాలి. నేయి పెరుగులతో తడిపిన సత్తు (పేలపిండి) ను నైవేద్యం చేయాలి. రెండు పాదరక్షలు గొడుగు దక్షిణగా యివ్వాలి. అనంతరం, జగత్పతి ప్రీతి సంపాదనకై “భగుని నేత్రములడచిన ప్రభూ, నీకు నమస్సులు ! పూషు (సూర్యు)ని పండ్లూడకొట్టిన స్వామీ! నీకు ప్రణామము! “ లంటూ ఉచ్చరించాలి., భక్తి పురస్పరంగా, ఇక ఆషాడ మాసంలో బిల్వోదక స్నానం శ్వేత దత్తూర (ఉమ్మెత్త ) కుసుమార్చనం ప్రతిపాదింపబడినవి. పిల్హక (సాంబ్రాణి) ధూపం వేసి నేతితో వండిన పూపాలు (అప్పాలు) నైవేద్యం చేయాలి. నేయియవలు దక్షిణగా యివ్వాలి. “దక్ష యజ్ఞనాశకా!” అని బిగ్గరగా కీర్తించాలి. శ్రావణ మాసంలో భ్రుంగరాజపత్ర (గుంటకరాకు) జలంతో స్నానం చేయించి మారేడుదళాలతో పూజించాలి. అగరుదూపం వేసి నేతితో వండిన పెరుగు వడలు, లడ్డూలు, పెరుగన్నం, అప్పములు నైవేద్యం చేయాలి. దక్షిణగా తెల్లని ఎద్దును, కపిల గోవును, బంగారం, ఎర్రని వస్త్రాలు బ్రాహ్మణునకర్పించాలి. శివుని “గంగాధర” నామం కీర్తించాలి. ఈ విధంగా మరొక ఆరు మాసాలు వ్రతం పారణ చేయాలి. ఇట్లు సంవత్సరం పాటు వృషభకేతనుని ఆరాధించిన వాడు అనంతమైన కోర్కె లను సిద్దింపజేసుకొనగలడని స్వయంగా మహేశ్వరుడే వక్కాణించాడు, ఓ దేవర్షీ! అన్ని విధాల అక్షయత్వాన్ని ప్రసాదించే ఈ ఉత్తమమైన పుణ్యవ్రతాన్ని సాక్షాత్తు రుద్రుడే వివరించాడు. దీనికి తిరుగులేదు. సాటిలేదు.
అధ్యాయము 17 complete
