వామన మహా పురాణము

Table of Contents

అధ్యాయము 2

ఆ విధముగ త్రినేత్రుడు మేఘమండలముపైన వర్షర్తువు గడపెను. అంతట లోకమున కంతకూ ఆనందము ప్రసాదిస్తూ రమ్యమైన శరదృతువేతేంచెను. ఓ మునీ! నీలి మొగిళ్ళాకటకటిగ ఆకాశాన్ని వదలినవి. చెట్లను కంద (గడ్డలు)ములు, నదులు (ప్రవాహములు)తమ ఒడ్డులు, తామరలు తమవాసనలు, కాకులు తమ నెలవులు, రురు జింకలు తమ కొమ్ములు, పంకాన్ని (బురద)జలాశయాలు విసర్జించినవి. పద్మములు వికసించినవి. చంద్ర కిరణాలు కొత్తకాంతులు సంతరించుకొనినవి. లతలు పుష్పవతులయినవి, ఆలమందలు ఆనంద తుండిలములయినవి. మహాంతులగు సాధువులు సంతుష్టాంతరంగులైరి. కొలకులలో తామరలు, ఆకాశాన తారకలు, జలాశయాల్లో నీరములు, సాధుజనుల అంతరంగాలు, దిసాముఖాలు, వీటన్నింటితోబాటు శశాంకకాంతులు నైర్మల్యాన్ని సంతరించుకొనినవి.

అలాంటి మనోహర వాతావరణం సమీపించగనే హరుడు దాక్షాయణితో మేఘమండలము నుండి దిగి మందరగిరిని చేరెను . ఆకొండ కొమ్మున చక్కని సమతలమైన శిలావితర్ది మీద జ్యోతిర్మయుడైన శంభుడు సతితో గూడి విహరించెను. రమ్యమైన శరత్కాలము గడచి, (ఉత్తానైకాదశి) ఉత్తరాయణము ప్రవేశించుటతో, ప్రజాపతి శ్రేష్ఠుడైన దక్షుడొక క్రతువును ప్రారంభించెను. ఆయజ్ఞానికి ద్వాదశాధిత్యులను, ఇంద్రాది దేవశ్రేష్టులను, కశ్యపమహర్షిని ఆహ్వానించి సదస్యులను గావించెను. సువ్రతుడైన అరుంధతీ వసిష్టులను, అత్రి అనసూయలను, ధృతికౌశికులను, అహల్యా గౌతములను, అమాయా భారద్వాజులను, చంద్రాంగిరసులను దక్షుడు తన యజ్ఞమున కాహ్వానించి ఆవేదవిదులైన సద్గుణజనులను యాజ్ఞకులుగ నియమించెను. అహింసాదేవీ సమేతుడై ధర్ముని పిలిచి ఆయజ్ఞవాటికకు ద్వారపాలకునిగ నుంచెను. అరిష్టనేమికి సమిధలు కొని వచ్చు పనినప్పగించెను. భృగు మహర్షికి మంత్ర సంస్కార బాధ్యత నొసగెను. అనంతరము రోహిణి సహితుడైన చంద్రునకు ధనాదిపత్యమొసగి, సతీశంకరులను తప్ప తక్కిన అల్లుండ్రను కూతుండ్రను దౌహిత్రులను అందరను క్రతువుకు దక్షుడు పిలిపించుకొనెను.

సర్వ లోకేశ్వరుడు, ధనేశ్వరుడు, అందరిలోకి శ్రేష్ఠుడు, జ్యేష్టుడు ఆద్యుడూనైన మహేశ్వరుడు వరిష్టుడైనను, ఆయనను దక్షుడేల పిలువనంప లేదు?

మునీ ।

 అన్ని విధాల జ్యేష్టుడూ వరేన్యుడూ భగవంతుడునైనను కపాలి (చేతిలో పుర్రె కలవాడు) అయినందువలన దక్షుడు ఆయనను ఆహ్వానించ లేదు.

బ్రహ్మర్షీ ।

 దేవశ్రేష్టుడు, శూలపాణి, త్రినేత్రుడునగు శంకరుడేకారణమున కపాలియాయెను?

నారదా! అవ్యక్త బ్రహ్మ ఆదిపురాణంలో చెప్పిన ఈ ప్రాచీన గాధను శ్రద్ధగా వినుము. తొల్లి స్థావర జంగమాత్మకమైన విశ్వమంతయు ఏకార్ణవమై సూర్య చంద్ర పవనానలాలు నశించిపోయినవి. తరు పర్వతాదులను ముంచివేసి ఊహకూ తర్కానికి అందక ఏ మాత్రము తెలియరాని అందతమస్సు సర్వత్రా వ్యాపించింది.

అందులో భగవంతుడు వెయ్యేండ్ల కాలము నిద్రతో ఉండి ఆ నిశాంతాన రాజసరూపం ధరించి లోకాలను సృష్టించెను. ఆ జగత్తు నుండి రజోగుణ ప్రధానుడైపంచాముఖాలతో వేద వేదాంగపారగుడగు చరాచర సృష్టికర్త ఉద్భవించెను. అట్లే తమోగుణమయుడు త్రిలోచనుడు శూలపాణి జటాదారియగు రుద్రుడు రుద్రాక్షమాలతో బయటకు వచ్చెను. అంతట భగవంతుడు భయంకరమైన అహంకారమును సృష్టించగా నది బ్రహ్మరుద్రుల నావహించెను. అహంకారావృతుడై శంకరుడు బ్రహ్మతో “నీవేవడవు?నిన్నెవరు సృజించి పంపిరో నాకెరింగించు” మనెను. అహంకారమునకు లోనై పితామహుడుకూడా నదేవిధమున “నీవెవడవు నీ తలిదండ్రులెవరని” శంకరుని ప్రశ్నించెను. నారదా! ఈ విధంగా ప్రాచీన కాలాన బ్రహ్మకు రుద్రునకు వివాద మేర్పడినది. నీవాసమయమున నుద్భవించితివి. పుట్టిన వెంటనే ఆసద్రుశమైన వీణపై ఆనంద ధ్వని నెలార్చుచు నీవాకలమున కెరిగితివి అభిమాని యగు బ్రహ్మచే నిర్ణింపబడి శంకరుడు దీనవదనంతో రాహుగ్రస్తుడైన చంద్రునకు వాలే అధోముఖుడై నిలచెను. అవమానభారంతో క్రోధంతో నల్లనైన ముఖంతో నిలచిన రుద్రుని బ్రహ్మయొక్క పంచమ ముఖమిట్లు గద్దించి పలికెను. “శంకరా! తమోమూర్తివైన నీవు దిగంబరుడవై త్రినేత్రాలతో ఎద్దుపై నెక్కి లోకసంహారం చేస్తుంటావని నాకు బాగా తెలియును. ఇదే నీ నిర్వాహకము.” అంతట క్రోధఘార్ణిత తామ్రాక్షుడై శంకరుడు ఆ బ్రహ్మ ముఖమును భస్మం చేయుటకై , ఆగ్నేయదృష్టులతో తిలకించెను. వెంటనే శివునకు శ్వేతారుణ స్వర్ణ నీల పింగళ వర్ణములతో నైదు మనోహరములు పవిత్రములునైన ముఖము లేర్పడెను. సూర్య కాంతితో ప్రకాశించే ఆ ముఖాలను చూచి బ్రహ్మ ముఖము హేళనగ నిట్లు పలికెను. “వానకారు నీళ్ళలో తేలే బుడగలకు నీ ముఖాలకు భేదమేమి ? నీవిదియు నొక పరాక్రమమేనా?” ఆ మాట వినిన వెంటనే శంకరుడు క్రోదోన్మత్తుడై , అట్లు ప్రేలుచున్న బ్రహ్మ ఐదవ ముఖమును కొనగోట నవలీలగ త్రుంచి వైచెను. ఆ విధముగా తెగిన ముఖము వెంటనే శివుని ఎడమ అరచేతి కంటుకోనిపోయి ఎంత ప్రయత్నించినను ఊడిపడదయ్యెను. అద్భుత శక్తిగల బ్రహ్మ అందులకు కోపించి కవచకుండల శరాలంక్రుతుడైన బుద్ధిమంతుడగు పురుషు నొకని సృష్టించెను. అతడాజాను చతుర్బాహువు అవ్యయుడు. నాలుగు చేతులలో ధనుర్భాణములు శక్తిగొప్పదగు అంబులపొది ధరించి సూర్యునివలె వెలుగుచుండెను. ఆ దివ్యపురుషుడు శంకరునితో నిట్లనెను. “దుర్భుద్దే! శంకరా! నీవు పాపిష్టుడవు. నిన్ను నేను సంహరింపను. పాపి నెవడు వధింపనెంచును? ఆ మహాపురుషుని మాటకు సిగ్గుపడి ఖిన్నుడై శంకరుడా ప్రదేశము వదలి బదరికాశ్రమమునకు వెళ్ళెను. బదరికాశ్రమం నరనాయణుల తపోభూమి. హిమగిరి ప్రదేశము. పరమ పవిత్రమైన సరస్వతీనది యట ప్రవహించుచుండును. అక్కడకు వెళ్లి నారాయణుని చూచి శంకరుడు “ప్రభో ! మహాకాపాలికుడను. భిక్షార్థినై వచ్చితి” ననెను. అప్పుడు ధర్మపుత్రుడగు నారాయణుడు శంకరుని జూచి మహేశ్వరా! నీ త్రిశూలముతో నా ఎడమ భుజాన్ని కొట్టుమనెను. వెంటనే శంకరుడు తన త్రిశూలముతో నారాయణుని ఎడమ భుజము గట్టిగా ప్రహరించెను. త్రిశూలాఘాతము సోకిన చోటు నుండి మూడు ధారలు నిర్గమించి అందొకటి ఆకాశ మార్గమున స్థిరపడి నక్షత్రములచే నలంకరించ బడెను. భూమిపై దొరలిన రెండవ ధారను తపోధనుడగు నత్రిముని గ్రహించెను. అందుండి ఒక శిశుఉద్భవించెను. అతడు పుట్టుకతోనే శ్యామ మనోహర కాంతితో ధనుర్బాణాలు ధరించి యువకుడై మేఘ గంబీరధ్వనితో నిట్లనెను. “తాళవృక్షం నుండి తాళఫలాలకు వలె నేనెవరి తలలు పడగొట్టవలెనో చెప్పుడు. నారాయణ బాహువు నుండి జన్మించిన ఆ యువకునితో శంకరుడిట్లనెను. ఓ నరుడా! శతార్క ప్రభతో వెలుగుతు దుష్టవాక్యాలు ప్రేలుచున్న బ్రహ్మ పుత్రుడైన ఈ దుష్టుని పరిమార్చుము.

శంకరుని ఆదేశము విని ఆ వీరుడజగవమను ప్రసిద్ద ధనుస్సు, అక్షయ తూణీరాన్ని తీసికొని యుద్ధమునకు తలపడెను. అప్పుడు శివ బ్రహ్మలకు సంభవించిన ఆ అద్భుత వీరులకు వేయి దివ్య వర్షములు ఘోరమైన యుద్ధము జరిగెను. అంతట హరుడు విరించితో నిట్లనెను- “పితామహా! చూడుము! అద్భుత బలశాలియగు నొక నరుని బాణముల తాకిడికి పరాజితుడైనాడు. ఇది దశ దిక్కులలోను పరమాశ్చర్య కరమగు ఘటన ! అంతట బ్రహ్మ శివునితో “శంకరా ! ఒక సాధారణ మానవునిచే ఓడింపబడిన మహాత్ముడగు నా పురుషుడీ లోకమున జన్మించిన వాడు కాదు. నిజానికి సాధారణుడైన ఈ నరుడే ఓడిపోవలసి యుండె” ననెను. వెంటనే శంకరుడు, ఓడిపోయిన బ్రహ్మ పుత్రుని సూర్యునిలోనికీ విజేత అయిన నారాయణ బాహు జన్ముని, నారాయణుని దేహములోనికి విసరివైచెను.

అధ్యాయము 2 complete