వామన మహా పురాణము
అధ్యాయము 15
మహావీరా! ఎల్లప్పుడు ధర్మమునందు నిలకడ గల మానవుడు భుజింప దగినవేవో వర్జింప దగినవేవో చెప్పుచున్నాము వినుము. నూనె లేక నేతిలో బాగావండబడిన అన్నము చాలాకాలము క్రిందటిదైనను తినవచ్చును. నూనె నేయి తగలకుండ వండబడిన బియ్యపుటన్నము, పాయసాన్నము, కుందేలు, ఏదుపంది, మొసలి, ముళ్ళపంది, తాబేలు మాంసము, చేపలు పప్పులు కూరలు మొదలగు వానిని తినవచ్చునని మనువు ఆదేశం. మణిరత్న ప్రవాళాలు శిలా దారుమయాలు, తృణధాన్యాలు, గడ్డలు, జల్లెడ, జింక చర్మము, నూతనవస్త్రాలు, అన్ని రకముల నారగుడ్డలు ( చెట్ల బెరడుతో చేసినవి) నీటితో కడిగి శుద్ధిచేయాలి. జిడ్డు తగిలిన వస్తువులన్నింటిని నువ్వుల నూనెతో కాచిన కషాయంలో శుభ్రం చేయాలి. నూలు ఉన్ని బట్టలను బూడిద కలిసిన నీటితో శుధ్ధిచేయాలి. ఏనుగుదంతాలు, కొమ్ములు పరిశుద్ధములే. మట్టిపాత్రలకు అగ్ని సంస్కారం శుద్ధిసాధనం. భిక్షాటనవల్ల తెచ్చిన అన్నం పనివాని(శిల్పి) చేయి, స్త్రీ ముఖము, బజారు నుండి కొనితెచ్చినవి, దాసదాసీలు తెచ్చినవి, ప్రశంసించబడిన వస్తువులు, చాలచేతులు మారినవి, తెలికవస్తువులు, బాలవృద్ధుల కృత్యాలు, బాలల ముఖాలు, యివన్నియు పరిశుద్ధాలే. ధాన్యపు కొట్లు, బొగ్గు నిల్వ చేయు కొట్లు, బాలింతస్త్రీలు, పాలుత్రాగే శిశువులు, బ్రాహ్మణుల నోటినుండి వెలువడు తుంపరలు ఉష్ణోదకములు ఇవన్నియు పరిశుద్ధములే.
భూమిశుద్ధి, పారతో గడ్డిగాదం తొలగించిగాని, పైనున్న చెత్త కాల్చిగాని చీపురుతో చిమ్మిగాని, ఒకరాత్రిపగలు ఆవుల చేత త్రొక్కించిగాని, ఆవుపేడతో అలికించిగాని, ఆవు పంచతం చల్లిగాని చేసుకోవచ్చు. యింటిని ఊడ్చిగాని అందులో పూజచేసిగాని శుద్ధిచేసుకోవలె. వెంట్రుకలు పడినా మక్షికాది కీటకాలు వాలినా, ఆవులు వాసనచూచినా, అలంటి అన్నం మీద మృత్తిక భస్మాక్షారాలు కలిపిన జలం చిలికించి పవిత్రం చేసుకోవలెచు. సత్తు గిన్నెలు సీసపు పాత్రలు క్షారజలంతోను రాగి పాత్రలను పులుసుతోను, కంచుపత్రాలను బూడిద కలిపిన నీటితోను, శుద్ధి చేయవలె. మలస్పర్శ కలిగిన వస్తువులను దుర్వాసన వదిలే వరకు మట్టితో నీటితో శుద్ధి చేసుకోవలె. ఇతర వస్తువులను కూడా దుర్గంధం వదిలేవరకు అట్లే చేసుకోవలెను. చనుబ్రాలు త్రాగే శిశువు పవిత్రుడు. పక్షి (చిలుక) కొరికి పడవేసిన పండు, బరువుమోయుచున్న గాడిద, లేడిని పట్టుకున్న కుక్క పరిశుద్ధాలు, దారి, బురద, నీరు, పడవలు, దారిలో పెరిగిన గడ్డి, వీనిని గాలి శుభ్రపరచును. కాల్చిన ఇటుకలు గూడ నట్లే. అమేధ్యంలాంటి అపవిత్ర వస్తుస్పర్శ గలిగిన భోజనం (అన్నం) , అడ్డెడు మానెడు వండినది, ఎక్కువ ప్రయాణంలో ఉన్నప్పుడు దానిపై పొరతీసి పారవైచి మిగిలిన దానిపై నీరు ప్రోక్షింఛి శుద్ధి చేసుకోవలెను. ఆశుద్దాన్నం తెలియక తినినచో ఒకరాత్రిగాని, మూడు రాత్రులుగాని ఉపవాసం చేసి దోషం పోగొట్టుకోవచ్చు. తెలిసిగూడ దూషితాన్నం తింటే దానికి శుద్దియేలేదు.
రజస్వల అయిన స్త్రీని, కుక్కను, దిగంబరుడిని, ప్రసూతయగు స్త్రీని, అంత్యజులను, శవవాహకులను తాకినచో స్నానంతో శుద్ధియగును. మాంసంతో కూడిన ఎముకలు తాకినచో సచేల స్నానం చేయాలి. ఎండిన ఎముక అయితే ఆచమనంచేసి గాని ఆవును తాకిగాని సూర్యుని చూచిగాని శుద్ధిచేసుకోవచ్చు. మలం రక్తం ఉమ్మి నలుగుపెట్టి పారవేసిన పిండి వీనిని దాటకూడదు. ఎంగిలి, చెత్త చెదారం, పెద్దలకు పాద ప్రక్షాళనం చేసిన నీరు, మూత్రాదులు యింటికి దూరంగా పారవేయాలి. ఇతరులకు చెందిన జలాశయాల్లో స్నానం చేసేముందు అయిదు దోసిళ్ళ నీరు బయటకు చిమ్మవలెను. ప్రకృతి సిద్ధాలయిన చెరువుల్లో జలాశయాల్లో నదీనదాల్లోను స్నానంచేయాలి. అనుచిత సమయాల్లో ప్రాజ్ఞుడు ఉద్యానవనాలలో నిలవదు, జనవిద్వేషియయిన వ్యక్తితో మాటాడదు, విధవలతో వ్యర్థ స్త్రీలతో మాట్లాడడు. దేవపితృనిందకులను వేదశాస్త్ర యజ్ఞాది దూషకులను తాకినను సంభాషించినను, వెంటనే సూర్యుని చూచి పవిత్రులు కావచ్చును. సూతికులు, షండులు, మార్జార, మూషిక, శునక, కుక్కుట, పతితులు, అపవిద్ధులు, నగ్న చండాలాది హీనుల నుండి భోజనం గ్రహించరాదు.
మహనీయులారా! సూతికాదులనుండి భోజనం గ్రహించకూడ దన్నారు. అలాంటి వారి లక్షణాలేవో వివరించండి.
బ్రాహ్మణుని భ్రష్టుని గావించిన బ్రాహ్మణస్త్రీ, యిద్దరూ సూతికులనబడతారు. వారల చేతితిండి తినరాదు. సకాలంలో స్నానజప సంధ్యావందనాదులు, హోమాది కర్మలు, దేవపితృ కార్యాలు దాన ధర్మాదులు చేయనివాడు షంఢుడు. డాంబికంగా జపం తపం యజ్ఞాదులు చేస్తూ పరలోక చింతన లేనివారు మార్జారులు. సంపద కలిగి ఉండి కూడా దానహోమాదులు చేయకుండా తామే అనుభవించేవారు మూషికులు. వారల అన్నం తినరాదు. కృచ్చ్రాదులు చేస్తేనే ఆ పాపం పోతుంది. ఎల్లపుడూపరులను సూటిపోటు మాటలతో వేధిస్తూ పరులలోని సద్గుణాలను ద్వేషించేవానిని శునకుడంటారు. సభలోనున్న సభ్యులపట్ల పక్షపాత బుద్ధితో బాహాటంగా వ్యవహరించేవాడు కుక్కుబుడు. అటువంటి వాడొసగిన అన్నం తినరాదు. ఏలాంటి ఆపద కలగనప్పటికీ స్వధర్మాన్ని వదలి పరధర్మాన్ని ఆశ్రయించేవాడు పతితుడు. వాని చేతి అన్నం తినరాదు. దేవపితృకార్యాలు వదలి గురువుల పట్ల భక్తిలేక, గోవులను బ్రాహ్మణులను స్త్రీలను వధించు దుష్టుడు అపవిద్ధుడు. ఎవడి యింట్లో ఎప్పుడూ కూడ ఎలాంటి వ్రతాలుగాని వేదాధ్యయన శాస్త్ర చర్చలు గాని జరగవో వాడు నగ్నుడు (దిగంబరుడు). వాడొసగు భోజనం గర్హించదగినది. ఇతరులకు ఆశ గొలిపి దానిని పూర్తిచేయనివాడు, దానం చేసేవాడిని అడ్డగించేవాడు, తన్నాశ్రయించు వానిని నట్టేటముంచువాడు ఛండాలుడు. అధముడు. బంధు పరిత్యక్తుడు సాధువులు బ్రాహ్మణులచే విడువబడిన వాడు, దుశ్శీలునిచే తిండి తినే వాడి ఇంట భుజించినచో చాంద్రాయణం చేస్తేనే శుద్ధి. నిత్యనైమిత్తిక కర్మలు వదలిన వానింట భుజిస్తే మూడు రాత్రులు ఉపవాసం చేయాలి. గణకుడు (జ్యోతిషి), వ్యాధుడు, వేశ్య, వైద్యుడు, లోభి. వీరలోసగిన అన్నం భుజిస్తే ప్రాయశ్చిత్తంగా మూడు రాత్రులు ఉపవసించాలి. జాతశౌచమృతాశౌచములు కలిగినప్పుడు నిత్య విధులు మానుకోవచ్చు, కాని ఎట్టిపరిస్థితులలోను నైమిత్తిక కర్మలు వదులుకోరాదు.
పుత్రజన్మ కలుగగానే సచేలస్నానం తండ్రి చేయాలి. కుటుంబంలోని వారెవరైనను మరణించినచో బంధువులందరు స్నానం చేయాలని భృగు మహర్షి వచనం. మరణించిన వానిని యింటి బయట దూరంగా దహనం చేయాలి. సగోత్రీయులు జలతర్పణం వదలాలి. మొదటి నాడు గాని నాలుగవ లేక ఏడవ దినాన అస్తి సంచయనం చేయాలి. ఆస్థి సంచయనానంతరం సోదరులందరూ తమ అంగ స్పర్శ చేసుకోవలె. సపిండీకులు శుద్ధి అనతరం శ్రాద్ధ కర్మ చేయాలి . విష ప్రయోగం వల్ల, ఉరి, శస్త్రాల ద్వారా, అగ్ని వల్ల, నీళ్ళల్లో మునిగినందున, పైనుండి క్రింద పడినందున మృతి కలిగినప్పుడు, బాలురు, సన్యాసులు మరణించినప్పుడు దేశాంతరగతుడు చనిపోయినను యీ పరిస్థితులలో నాలుగు రకాలయిన సద్య:శుద్ధి (వెంటనే శుద్ధి) చెప్పబడింది . గర్భస్రావం జరిగినప్పుడు కూడా యింతే. ఇతరులకు మాత్రం శౌచకాల పరిసమాప్తి నుండే శుద్ధి బ్రాహ్మణుల కొకరోజు క్షత్రియులకు మూడు రోజులు, వైశ్యులకు ఆరు రోజులు, శూద్రులకు పండ్రెండు రోజులు అశుచి. ఈ అన్ని జాతుల వారునూ వారి వారి ఆచారాలననుసరించి వరుసగా పది, పండ్రెండు, పదిహేను రోజులకు శ్రాద్ధములు చేసుకోవాలి. విధివిధానంగా చనిపోయిన వారికి ఏకోద్దిష్ట కర్మ జరపాలి. సంవత్సరాంతంలో సపిండీకరణం చేయాలి. ప్రేతత్వవిముక్తి కలిగిన పితృత్వం కలిగి తర్వాత వేదవిహితంగా ధర్మపూర్ణ కర్మలు నిర్వర్తించి వారికితర్పణం చేయాలి. ఓ రాక్షసేస్వరా! పితరులకు ఉత్తరోత్తర సద్గతులు గలుగుటకు భోగో హిరణ్య దానాదులు చేయాలి. పితరులకు వారి జీవిత కాలంలో ఏయే వస్తువులు యిష్టతములో ఆయా వస్తువును దానం చేసినచొ వారల కక్షయ లోకములు కలుగును. విద్వాంసుడు ప్రతిదినం వేదాధ్యయనం చేయవలె, ధర్మం తప్పకుండా ధనార్జనం చేసి తన శక్త్యానుసారం యజ్ఞాదులు చేయాలి. తన అంతరాత్మకు జుగుప్సావహములు కానిపనులు, పెద్దలయెడ దాచనవసరం లేని పనులు గృహస్తుడైన వాడు సంకోచం లేకుండా ఆచరించాలి. భార్యా బిడ్డలతో కూడియుండియూ ఈ విధంగా సదాహరణం చేయు మానవుడు ధర్మార్థ కామములు సమకూర్చుకొని ఈ లోకంలోనూ అనంతరం పరలోకంలోను సుఖాలు పొందుతాడు. ఇంత వరకు ఉత్తమ గృహస్తధర్మాలు చెప్పితిమి. ఇక వానప్రస్థుని విధులు వివరించుకొన్నాము. జాగ్రత్తగా వినుము.
తెలివి గల గృహమేధి పుత్రపౌత్రులు కలిగిన తర్వాత తన శరీరపాటవం తగ్గడం గమనించి వెంటనే ఆత్మశుద్ధి కోసం వాన ప్రస్థాశ్రమం స్వీకరించాలి. అరణ్యంలో దొరకే కంద మూలాదులు తింటూ యింద్రియాలను అదుపులోనుంచుకొని తపస్సు చేసుకోవాలి. భూమి మీద శయనిస్తూ బ్రహ్మచర్యం నెరపాలి. పితరులను దేవతలనుపాసిస్తూ అతిధి అభ్యాగతుల సేవ చేయాలి. హోమం త్రికాల స్నాన సంధ్యానుష్టానం జటా వల్కల ధారణం వనాల్లో లభ్యమయ్యే తైలాదులుపయోగిస్తూ వానప్రస్థ జీవితం నెరపాలి. సర్వసంగ పరిత్యాగం, బ్రహ్మచర్యం, నిరహంభావం, ఇంద్రియ విజయం, ఒకేచోట దీర్ఘ కాలం నివసించకుండుట, లౌకిక కార్యాలకు దూరంగా ఉండటం, భిక్షాన్న గ్రహణం, చీటికి మాటికి కోపించకుండుట, ఆత్మా జ్ఞానాపేక్ష, ఆత్మను తెలుసుకోవటం, తెలియజెప్పడం, ఇవి సన్యాసాశ్రమ ధర్మాలు. నిశాచరా! యిప్పుడు చతుర్వర్ణాల వారి విధులేమో చెప్పెదము. వినవలసినది; బ్రహ్మచర్య గార్హస్థ్యవాన ప్రస్థాశ్రమ విధులు బ్రాహ్మణులతోబాటు క్షత్రియులు కూడా ఆచరించాలి. ఇక గార్హస్థ్యవాన ప్రస్థ ఆశ్రమ ధర్మాలు వైశ్యులు అనుష్టించాలి. కాగా శూద్రులకు గృహస్థాశ్రమ నిర్వహణమే ఉత్తమంగా చెప్పబడినది. ఈ విధముగా తమకు విధించబడిన ఆశ్రమ ధర్మాలను నాలుగు వర్ణాలవారూ వదలకుండా ఆచరించాలి. అలా కాక తమ తమ ధర్మాలను త్యజించిన వారు ప్రత్యక్ష దైవం సూర్యుని కోపానికి గురి కాగలరు. సూర్యుడు కోపిస్తే మానవులు వ్యాధి పీడితులౌతారు. కులనాశనం సంభవిస్తుంది. కావున ఓ రాక్షస రాజా! తన క్షేమం, వంశ క్షేమం కోరిన మానవుడెట్టి పరిస్థితి లోనూ స్వధర్మాచరణం వదలకూడదు. వదలినచో భాస్కరుని కోపాగ్నికి ఆహుతి కాగలదు సుమా!”
నారదా! ఆవిధంగా ఋషులచే ప్రబోధింప బడి ఆసుకేశి వారాలకు ప్రణమిల్లి, వారల యుపదేశములను మాటి మాటికి నెమరు వేసుకొంటూ ఆకాశ మార్గాన తన నగరికి తిరిగి వెళ్ళాడు.
అధ్యాయము 15 complete
