వామన మహా పురాణము
అధ్యాయము 9
మహా మునీ! అంధకుడు గ్రుడ్డివాడని తెలిసియు రాజధర్మమునకు విరుద్ధముగా నాతనిని ప్రహ్లాదుడెట్లు రాజ్యాదిపతిని గావించెను?
నారదా ! తండ్రి హిరణ్యాక్షుడు జీవించియుండగనే అంధకునకు చూపు తిరిగి వచ్చింది. అందుకే ప్రహ్లాదుడతనిని తన స్థానమున రాజుగా నిలిపెను.
మహామునీ! రాజ్యాభిషిక్తుడైన అంధకుడేవిధముగ పాలన మొనర్చెను? దేవతలతో నెట్లు మసలుకొనెను?
రాజైన హిరణ్యాక్ష సుతడంధకుడు మహాదేవుడగు శూలపాణిని తపస్సు చేసి ప్రసన్నుని గావించుకొనెను. దేవసిద్ధ ఋషిపన్నగాదుల నుండి అజేయత్వమూ అవధ్యత్వముతో బాటు, అగ్ని, జలముల వలన భయములేకుండునట్లు వరములందుకొనెను. తర్వాత శుక్రాచార్యుని పురోహితుని గావించుకొని రాజ్యము చేయసాగెను.
అంతట నా రాక్షసుడు దేవతల జయింప నెంచి భూతలాన్నంతను ఆక్రమించుకొని అందలి రాజుల నందరను నిర్జించెను. అట్లు జయించిన భూమీశుల సహాయంతో విక్రమించి మేరుశైల శిఖరమును సమీపించెను. అది చూచినా దేవేంద్రుడు తన బలాలను సమకూర్చుకొని రాజధాని అమరావతి రక్షణకై తగిన ఏర్పాట్లు గావించి, ఇరావత గజాన్ని అధిరోహించి రాక్షసుని పైకి వెడలెను. దేవపతి ననుసరించి యితర దిక్పాలకులు సైతము తమ సైన్యాలతో వాహనారూఢులై బయలుదేరిరి. ఇంద్రుని నాయకత్వంలో రథ గజ తురగాదులతో కూడిన దేవసైన్యం వివిధాయుధాలతో పురోగమించెను. ముందు భాగాన ద్వాదశాదిత్యులు వెనుక రుద్రులు. మధ్యభాగంలో అష్టవసువులు విశ్వేదేవతలు సాధ్యులు మరుత్తులు అశ్వినులు యక్షవిధ్యాధరాదులందరూ తమ తమ వాహనాల మీద బయలుదేరిరి.
మహర్షే ! ఏకాదశ రుద్రులు తదితరులూ ఏ ఏ వాహనాలపై వచ్చిరో వివరంగా వినాలని కుతూహలంగా ఉంది.
నారదా! అంతా వివరంగా చెబుతాను; వినుము. రుద్రుని అరచేతి నుండి పుట్టి అపూర్వ జవసత్వాలు గలిగిన శ్వేతగజం ఐరావతం. ఇంద్రుని వాహనం. రుద్రుని తొడల నుండి పుట్టిన నల్లని భయంకరాకృతితో మనో వేగంతో పయనించే పౌండ్రకమనే మహిషం యముని వాహనం. రుద్రుని కర్ణమలం (గుమిలి) నుంచి పుట్టి చక్కని గమనం కలిగి జలధి అనే పేరు గల నల్లని శిశుమారం (మొసలి వంటిది) వరుణ వాహనం. అంబికాదేవి చరణాల నుండి ఉద్భవించి బండి చక్రాలంతటి కండ్లతో భయంకరమైన శైలాకారం గల నరోత్తముడు కుబేరుని వాహనం. గంధర్వులు మహాశక్తివంతులగు పన్నగులు, సురభి (కామధేనువు) పుత్రులగు శ్వేత వృషభ రాజాదులు ఏకాదశ రుద్రుల వాహనాలు. మునిశ్రేష్టా! చంద్రుని రథాన్ని ఐదు వందల హంసలు, ఆదిత్యుల రథాలను ఉత్తమాశ్వాలు లాగుతున్నవి. వసువులు ఏనుగుల మీద యక్షులు నరుల మీద స్వారీ చేస్తున్నారు. కిన్నరులు భుజంగాలను, అశ్వినులు హయాలను, భయంకరులైన మరుత్తులు లేళ్ళను తమ వాహనాలుగా చేసుకున్నారు. భ్రుగువులు చిలుకలపై బయలుదేరగా గంధర్వులు పాదచారులై నడిచారు. గొప్ప తేజస్సు గల అమరులు తమకు తగిన వాహనాల నధిరోహించి మహోత్సాహంతో బయలుదేరారు.
మహామునీ ! దేవతల వాహనాలను వివరించారు. యిక దైత్యుల వాహనాలను గూడ వివరించండి.
విప్రోత్తమా! దానవుల వాహనాలేవో వినండి. చెబుతున్నా. అంధకుని దివ్య రథం 1200 మూరల పరిమాణం గలిగి వేయి ఆకులు గల చక్రాలతో నల్లని ఉత్తమాశ్వాలతో నొప్పి యున్నది. ప్రహ్లాదుడెక్కిన రథం, బంగారపు కాంతితో చంద్రునితో సమానమైన తెల్లని కాంతులు వేలార్చే ఎనిమిది ఉత్తమాశ్వాలు పూన్చబడి వెలుగుతోంది. బంగారపు కాంతితో చంద్రునితో సమానమైన తెల్లని కాంతులు వెలార్చే ఎనిమిది ఉత్తమాశ్వాలు పూన్చబడి వెలుగుతోంది. విరోచనుడేనుగెక్కెను. కుజంభుడుతురగారూఢుతు. జంభుడు కాంచన శోభతో వెలిగే గుర్రాలు కట్టిన రథస్థుడు. శంకు కర్ణుడు గుర్రం మీద; హయగ్రీవుడు ఏనుగు మీదనెక్కారు. మయుడు ఉత్తమ రథాన్నీ దుందుభి మహొరగాన్నీ అధిరోహించారు. శంబరుడు విమానం మీద శంకుడు సింహం మీద కూర్చున్నారు. గద, ముసలం ధరించి మహాబలశాలురైన బలుడు వృతుడు పాదచారులై సురసైన్యాన్ని ఎదుర్కునేందుకు విజృంభించారు. నారదా! అప్పుడు జరిగిన భయంకరతుములలో యుద్ధములో రేగిన దుమ్ము ధూళితో భూమ్యాకాశాలు కప్పబడినాయి. ఆరజసాంధకారంలో కనులు కనిపించక తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని గుర్తింపలేక పోవడంతో కొందరు వీరులు తమ వారినే సంహరింపసాగిరి. మరికొందరు శత్రువుల దునుమాడిరి. రథాలొకదానికొకటి ప్రచండమైన వేగంతో వెంబడించినవి. ఏనుగులు, ఏనుగులను, అశ్వికులాశ్వికులను, పదాతులు పదాతులను వెంటాడి పరస్పరం జయకాంక్షతో నొకరినొకరు మర్దింపసాగిరి. మునే! ఆ విధంగా జరిగిన దేవాసుర సంగ్రామంలో చెలరేగిన దూళిమేఘాలను శమింప చేస్తూ ఒక భయంకరమైన నది ప్రవహించింది. అందులో నీటికి బదులు రక్త ప్రవాహం, సుడిగుండాలకు బదులు రథ చక్రాలు, వెల్లువలకు బదులు మృతకళేబరాలు, తాబేళ్ళకు బదులు బాణాలు, మొసళ్ళ స్థానంలో ప్రసాయుధాలు. ప్రవాహ రూపాన దీర్ఘకరవాలాలు, నాచుకుప్పలకు బదులు వీరుల ప్రేవుల గుట్టలు, తెట్టెలు గట్టిన నురుల స్థానంలో శ్వేత ధ్వజాలు చక్ర, సారసాలకు బదులు భయంకరమైన డేగలు కంక గృధ్రాలు, రోమహర్షకంగా గోచరించాయి! అడవి కాకులు కాదంబ పక్షులుగా, జంబుకాలు మండూకాలుగా , గుంపు గట్టిన పిశాచాలూ డాకినులే నదీ తీరాన తపస్సు చేసే మునులుగా, ఏర్పడి మామూలు జనులకు దాటుటకు వీలు కాకపోయినది. ఆ భయంకరమైన రణనదిని రథాలనే పడవల మీదదాటుటకు ప్రయత్నించిన వీరులు కొందరు అందులోపడి మోకాళ్ళవరకు మునిగిపోగా, విజయలక్ష్మిని వరించ గోరిన మరికొందరు సునాయాసంగా దాట గలిగిరి. దేవ దానవులకు జరిగిన ఆ ఘోర సంగ్రామం, పిరికిపందలకు భయావహమైనది. యక్షరాక్షసులకు సంతోషకరమైనది. పిశాచ సమూహాలు ఆనందంతో గెంతులు వేశాయి. వాయసాలు మృతవీరుల రక్తం కడుపార ఆరగించాయి. మాంస ఖండములు భక్షించాయి. మజ్జా మేదస్సులు గంతులు వేస్తూ కేకలు పెడుతూ తినేశాయి. ఒకవైపు వీరులు బాధతో ఆర్తనాదాలు చేస్తుంటే మరో వైపు నక్కలుత్సాహంతో ఊళలు పెడుతున్నాయి. రణ నిహతులైన వారి శవాలు చెల్లాచెదురుగా నలువైపులపడి ఉన్నాయి. రణభూమి భయంకరమైన శ్మశానంగా మారిపోయింది. యుద్ధానికి ముందుగా దుర్నిమిత్తాలుగా నక్కల అరుపులు కూతలు వినిపించగా, దేవతలు, రాక్షసులు రాబోయే దుష్పరిణామాన్ని తలచుకొని భయకంపితులయ్యారు. వీరగ్రేసరులైన వారు ప్రాణాలనే పణంగా పెట్టి ఆ మారణ జూడంలోనికి దిగారు.
వేయి గుర్రాలు పూన్చిన రథం మీద నెక్కిహిరణ్యాక్ష పుత్రుడు అంధకుడు, మదించి ఏనుగుపైనున్న మహా తేజస్వి దేవేంద్రుని పైకి లంఘించెను. ఎనిమిది అశ్వాలు కట్టిన రథం మీద కూర్చొని మహా బలశాలి యగు దైత్యపతి ప్రహ్లాదుడు, మహిషాదిరూఢుడై మీదకు వచ్చుచున్న యముని ఎదుర్కొనెను. మహర్షే! అంతట విరోచనుడు వరుణుని, బలశాలి యగు కుబేరుని జంభుడు, శంబరుడు వాయుదేవుని, మయుడు అగ్నిని ఎదుర్కొని యుద్ధము చేసిరి. హయముఖుడు మొదలయిన యితర దైత్య దానవవీరులు, మహాబలశాలులగు సూర్యాగ్ని వసూరగేంద్రులతో ద్వంద్వయుద్ధానికి తల పడ్డారు.”ఊరక నిలుచుంటివేమి? యుద్ధానికి రమ్మ” ని ఒకరినొకరు రెచ్చగొడుతూ, గర్జిస్తూ, ధనస్సులు ఎక్కుపెడుతూ ఒకరిపైనొకరు వేల సంఖ్యలో బాణాలు వదల సాగారు. తీక్ష్ణములైన బాణ పరంపరలతో ఒకరినొకరు నొవ్వజేస్తూ గురి తప్పని శస్త్రాస్త్రాలతో దేహాలు చీల్చుకుంటూ, నా వీరులు మందాకినీ లాంటి రక్తస్రవంతిని ప్రవహింపజేశారు. ఆ నెత్తుటి నది రక్షో పిశాచాలకు సుష్ఠుగా విందు చేసింది. త్రైలోక్య విజిగీషులయిన దేవదానవ వీరులా తరంగిణి నుత్తరించుటకు పోటీపడసాగారు. ఆ సమయాన ఆకాశంలో నిలబడి మునులు సిద్ధులు దుందుభులు మ్రోగిస్తూ ఆ భీకర సమరాన్ని వీక్షించగా అప్సరసాంగనలు శత్రుల కెడురొడ్డి యుద్ధంలో నిహతులైన వీరాగ్రేసరులకు స్వాగతాలు పలుకసాగారు.
అధ్యాయము 9 complete
