వామన మహా పురాణము

Table of Contents

అధ్యాయము 21

బ్రహ్మన్! ఆ కాత్యాయనీ దేవీ ఆ మహిష దైత్యుని సకల సైన్యంతో సహా ఎలా సంహరించిందో వివరంగా చెప్పండి. అన్ని శస్త్రాలు కలిగి కూడా కాళ్ళతో ఎలా మర్దించింది? అందులకా పులస్త్య మహర్షి యిలా చెప్పాడు.

నారదా! ఈ పవిత్రమూ పాపభయాపహరమూ అయిన వృత్తాంతము చాలా పురాతన కాలం. కృత యుగం నాటిది. దీనిని శ్రద్ధగా ఆలకించుము. ఆ విధంగా క్రోధోన్మత్తుడైన మరుడు చతురంగ బలంతో దేవి మీద లంఘించడంతో ఆమె వైపు తదేక దీక్షగా చూచింది. అంతనారాక్షసుడు ప్రచండమైన బాణాన్ని ఎక్కు పెట్టి ఆ వింధ్యాద్రిని బాణావృష్టితో కప్పివేశాడు. వాని ఔద్ధత్యం చూచి భగవతి మహావేగంతో తన శ్రేష్టమైన ధనుస్సు ఆకర్ణాంతం వంచింది. బంగారువికారం గల ఆ ధనుస్సు దానవ సైన్యంలో మేఘాల మధ్య ప్రళయ విద్యుత్తు వలె వెలిగింది. అంతటనాదేవి కొందరిని బాణాలతో, కొందరిని ఖడ్గంతో, కొందరను గదతో, కొందరను ముసలంతో, మరికొందరిని చర్మంతో సంహరించింది. ఇక ఆ దేవి వాహనం కాలమృత్యువు లాంటి సింహం వంటరిగానే తన జటలను ఝళిపించి ఎందరో రక్కసులను సంహరించింది. కొందరు రాక్షసులు వజ్రాఘాతాలకు మరణించారు. కొందరి గుండెలు శక్తి తగిలి బ్రద్దలయ్యాయి. కొందరి కంఠాలు నాగలివ్రేటులకు చీలిపోయాయి మరికొందరి తలలు పరశుఘాతాలకు తెగిపోయాయి. గదవ్రేటులకెందరతలలో నుగ్గయిపోతే, చక్రజ్వాలల కెందర సందిబంధాలు మాంసఖండాలో ఊడిపోయినాయి. ఎందరో భయకంపనంతో నేలకొరిగారు. ఇతరులాభయానక సంహారకాండకు బెదరి పారిపోయారు. వారలకాదేవి రౌద్రరూపం, ప్రత్యక్షకాళరాత్రిగా మృత్యువుగా భాసించింది. తవ అని మొన ఆ విధంగా కకావికలు కావడం ఆ దేవి చెక్కుచెదరకుండా ఉండడం చూచిన నమరుడు మదించిన ఏనుగునెక్కి దేవి మీదకు లంఘించాడు. ఆమె పైకి శక్తిని విడిచాడు. సింహం మీద త్రిశూలం ప్రయోగించాడు. దేవికావించిన హుంకారంతోనే ఆ రెండు ఆయుధాలు భస్మమైపోయాయి. అంతలో ఆ రాక్షసుడి గజం తన తొండంతో దేవి సింహాన్ని ఒడిసి పట్టింది. మెరుపు వేగంతో ఏనుగు పట్టును విడిపించుకుని ఆ మృగేంద్రం తన పంజాతో దానవుని గట్టిగా కొట్టగా వాడు ఏనుగుమీద నుంచి క్రిందపడి ప్రాణాలు వదలాడు. వాడి మృతదేహాన్ని సింహం భగవతికి సమర్పించింది.

విప్రోత్తమా! ఆ దానవుని నడుము పట్టుకొని శ్రీదేవి ఎడమచేతితో గిరగిర త్రిప్పుచు డోలు వాయించినట్లు తాడించింది. వెంటనే వాడి శరీరం డోలుగా మారింది. అది చూచి కాత్యాయని పెద్దగా అట్టహాసం చేయడంతో ఆ నవ్వులో నుంచి రకరకాలయిన అద్భుత భూతాలు బయలుదేరాయి. వానిలో కొన్ని వ్యాఘ్రముఖాలు గలవి కాగా కొన్ని తోడేలు ముఖాలతో ఉన్నాయి. కొన్ని భూతాల ముఖాలు గుర్రాలు, దున్నపోతులు పందులు, ఎలుకలు, కోళ్ళు, ఆవులు, మేకలు, గోర్రెలులాగా ఉన్నాయి. వాటి కాళ్ళు కండ్లు రకరకాలుగా ఉన్నవి. నానావిధాలైన ఆయుధాలు దాల్చిన ఆ భూత గణాలు కొన్ని పాడుతుంటే కొన్ని నవ్వుతున్నాయి. కొన్ని ఆడుకుంటుంటే కొన్ని గుంపులుగా వాద్యాలు మోగిస్తున్నవి. మిగిలినవి పరమేశ్వరి అంబికను స్తోత్రం చేస్తున్నవి. ఆ భూతగణాలతో కలసి ఆ దేవి, పిడుగుల వర్షం పంటచేలను ధ్వం         సం చేసినట్లు ఆ రాక్షస బలాన్ని నాశనం చేసింది. సేనాపతి మరణించి సేనా ముఖం వ్రీలిపోవడంతో సైన్యపాలకుడైన చిక్షురుడు దేవతలతో యుద్ధానికి తలపడ్డాడు. ఆ మహారథుడు భయంకరమైన ధనుస్సు ఎక్కుపెట్టి వర్షధారలు భూమిని ముంచినట్లు దేవి సైన్యాన్ని బాణాలతో నింపాడు. వాడి బాణాలను తనవాడియైన శరాలతో చేదించి ఆ దుర్గ, బంగారు రెక్కలుగల పదహారు ఉత్తమ బాణాలను అందుకున్నది. నాలుగు బాణాలతో చిక్షురుడి నాలుగు గుర్రాలను, ఒక బాణంతో సారథిని, మరొక నారాచంతో రథకేతనాన్ని కూల్చింది. ఒక వాడి బాణంతో ఆ రాక్షసుడి ధనుర్బాణాలను ఖండించడంతో వాడు శూలంతీసికున్నాడు. దానిని వేగంగా త్రిప్పుచూ, సంతోషంతో ఆడు సింహం మీదకు దుమికే శ్రుగాలం (నక్క) వలె ఆ కాత్యాయని మీదకు లంఘించాడు. అంతట క్రోధంతో ఆదేవీ అయిదు బాణాలు వేసి ఆ రాక్షసుని కరచరణాలను తలను ఖండించి వేసినది. దానితో వాడు విగత జీవుడై నేల కొరిగినాడు.

సేనాపతి ఓడిపోగా ఉగ్రాస్యకరాళాస్యులనే మహాసురులిద్దరూ కాత్యాయనితో తలపడిరి. బాష్కలుడు, ఉద్ధతుడు ఉదగ్రుడు ఉగ్రకార్ముకుడు దుర్ధరుడు దుర్ముఖబిడాలాక్షాదులనేకులు మహాబలశాలులైన దానవవీరులు నానాశస్త్రాస్తాలు ధరించి దేవికభిముఖంగా పరుగెత్తారు. ఆ దుర్గ వారలను చూచి అలవోకగా వీణను డమరుకాన్ని చేతగొని నవ్వుతూ వాయించ నారంభించింది. ఆమె వాయించేకొద్దీ భూతగణాలన్నీ నవ్వుతూ నృత్యం చేయసాగాయి. ఆ మహాసురులు శస్త్రాలతో కాత్యాయనిని ప్రహరించగా నా పరమేశ్వరి ఆ రాక్షసుల కేశాలు పట్టుకొని సింహం మీద నుంచి పర్వత సానువు మీద దూకి, వీణ వాయిస్తూ పానం సేవిస్తూ నాట్యం చేయసాగింది. శ్రీదేవి బాహుబలం వల్ల ఆ మహాదానవుల గర్వం పటాపంచలు కాగా వారంతా వివస్త్రులై ప్రాణాలు కోల్పోయి నేలపైబడిరి. అలా చచ్చి పడిన తన వారలను చూచి మహావీరుడైన మహిషుడు తన కాలి డెక్కలతో తోకతో కాళ్ళతో భూతగణాలన్నింటినీ పారదోలాడు. ఆశని ఘోషంలాంటి అరపులతో వేడి ఊర్పులతో, ముట్టెతో, వాడి కొమ్ములతో శత్రువులను మర్దించి ఆ దుష్టుడు సింహాన్ని చంపేందుకు దాని వెంట బడ్డాడు. అది చూచి అంబిక క్రోధంతో నిండిపోయింది. అంతనారాక్షసుడు తన వాడియైన కొమ్ములతో క్రుమ్మి పర్వత శిఖరాలను, భూతలాన్ని సముద్రాలను మేఘాలను చిన్నా భిన్నం చేసి దుర్గాదేవి మీదకు విరుచుకపడ్డాడు. ఆమె ఆ దుష్టుని పాశంతో బంధించగా వాడు మదకరీంద్రంగా మారాడు. ఆమె దాని తుండాన్ని నరికివేయగా వాడు మళ్ళీ దున్నపోతుగా మారాడు. ఆ భవాని వాడి మీద శూలం విసిరితే అది పొడియై క్రింద పడిపోయింది. అగ్నిదత్తమైన శక్తిని ప్రయోగిస్తే అదికూడ మొక్కబోయి పడిపోయింది. ఓ మహర్షీ ! విష్ణువు యిచ్చిన చక్రం వాడి మీద ప్రయోగించింది. అయితే అదితన చక్రత్వాన్నే కోల్పోయింది. అంతనామే మండిపడి కుబేర దత్తమైన గదతో ప్రహరించగా అది భగ్నమైంది. వరుణుడిచ్చిన పాశాన్ని కూడా ఆ రాక్షసుడు తన కొమ్ములతో ముట్టెతో గిట్టలతో ముక్కలు చేశాడు. దానితో దుర్గ యముడిచ్చిన కాలదండం వేయగా అది ముక్కలైపోయింది.

ఇంద్ర దత్తమైన వజ్రాయుధం ఆ మహిషునికి తాకి నుగ్గు నూచమైంది. దానితో రెచ్చిపోయి ఆ దుర్గ సింహం వదలి మహిషుడి వీపుమీదకు లంఘించింది. మహిషుడామేను క్రిందకు త్రోసివేయాలని ప్రయత్నించి విఫలుడైనాడు. ఆమె ఆ దున్నపోతు రక్కసిని తన మెత్తని పాదాలతో తడిసిన తోలును తోక్కినట్లుగా మర్దించింది. దానితో వాడి బలమంతా నశించింది. ఆమె వాని శిరస్సును శూలంతో తెగవేసింది. ఆ కలేబరంలోంచి ఖడ్గధారియైన పురుషుడు బయటకు వచ్చాడు. బయటకు రావడంతోడనే ఆ దేవి తన కత్తితో వాని గుండెలపై బలంగా తాడించి మహా క్రోధంతో వాని జుట్టు పట్టుకొని తన వాడియైన ఖడ్గంతో వాని శిరస్సును చేదించివైచెను. దానితో రాక్షస బలాలలో హాహాకారాలు చెలరేగాయి. అంతట భవాని ప్రమథ గణాలచే చావు దెబ్బలు తిని చండ ముండ మయతారాసిలోమాదులైన రాక్షస వీరులు భయకంపితులై పాతాళ లోకానికి పారిపోయారు. అంతట పరమేశ్వరీ విజయాన్ని విలోకించిన దేవతలందరూ, ఘోరముఖీ సౌందర్యరాశీ, సర్వజగద్రక్షకీ అయిన ఆ నారాయణి కాత్యాయనీ దేవిని పలువిధాల స్తుతించారు. ఓ మహర్షీ! ఆ విధంగా సురసిద్ధ సంఘాల ప్రార్థనలందుకుంటూ నా మహాదేవి, దేవకార్యార్థమై తాను మరల జన్మించగలనని చెబుతూ హరుని చరణాల కడకు జేరెను.

అధ్యాయము 21 complete