వామన మహా పురాణము
అధ్యాయము 7
నారదా! అనంతరం సమర్థుడైన నారాయణ ఋషి కాముని చూచినవ్వుచు, ‘కందర్పా ! వచ్చియిచ్చట కూర్చొను’ మనెను. ఆ మహర్షి స్తైర్యమునకు మన్మథుడు బెదరిపోయెను. మునీ ! వసంతుడు కూడ ఎంతో విచారానికి లోనైనాడు. తర్వాత స్వాగత వాక్యాలతో అప్సరసలను సంభావించి నారాయణుడు వసంతుని కూడ తన సమీపమున కూర్చుండబెట్టుకొనెను. అంతట నవ్వుచు ఆ మహర్షి ఒక పుష్పమంజరి తీసికొని దానితో తన తొడ (ఊరు) మీద సర్వాంగ సుందరియగు నొక స్త్రీయాకృతి నిర్మించి దానికి ప్రాణము పోసెను. అట్లు ఆ ఋషి ఊరువు నుండి వెలువడిన ఆ అందాలరాశిని చూచి మన్మథుడదరిపడి ఈమె నాభార్యయగు రతియా యనుకొనెను.
‘అదే మొగము. అవే అందమైన కనులు, కనుబొమలు, ముంగురులు. అదే అందమైన నాసిక, వంశం, అవే చక్కని అధరోష్టాలు. ఎంత చూచినా తనివి తీరదు. ఇద్దరు సత్పురుషుల వలె పరస్పరం ఒరుసుకొని చక్కని చూచుకములతో చిక్కగా మాంసలములుగా నున్న చన్నులు. మూడు వళులతో సన్నగానున్న నడుము, లేత నూగారుతో అందమైన ఉదరం. దానిమీద స్తనభాగం వరకు పైకి వ్యాపించిన రోమావళి, సరోవరం ఒడ్డునుండి వికసించిన తామర పూలకు ఎగబ్రాకే తుమ్మెద గుంపులాగా శోభిల్లుతోంది.
ఒడ్డాణంతో వెలుగొందే ఈమె జఘన ప్రదేశం క్షీరసాగర మథన వేళ వాసుకిచే చుట్టబడిన మందర పర్వతంలాగ ఉన్నది. తలక్రిందుగా నుంచబడిన కదళీకాండముల వంటి నునుపైన తొడలు. పద్మకేసరాల వంటి గౌరవర్ణంతో శోభిల్లుతోంది. రోమరహితాలయిన మోకాళ్ళు, పుష్టమైన మడమలు, లత్తుక రంగు పాదములు ఒహో ఎంత అందంగా ఉన్నవి! నారదా! ఈ విధంగా మన్మథుడంతటి సుందరుడే ఆ సుందరి శోభకు ముగ్దుడు కాగా నితరుల మాట వేరే చెప్పవలెనా?
ఇక వసంతుడో, ఆమెను చూచి; అహో! ఇది మన్మథనృపతి రాజధాని కాదుగదా! లేక రాత్రి గడచి పోవుటతో సూర్యకిరణతాపానికి భయపడి శరణాగతమైన చంద్రజ్యోత్స్నయా? ఈ విధంగా వితర్కించుచు, అప్సరల నపవారించి, వసంతుడు మౌనివలె ధ్యానమగ్ను డాయెను. మహామునీ! ఈ విధంగా ఆ స్త్రీ సౌందర్యానికి ముగ్దులై నిలచిన మన్మథ వసంత అప్సరసలను చూచి పుణ్యవ్రతుడైన నారాయణముని నవ్వుతూ – కామా! వసంతా! అప్సరసలారా! ఈ అప్సరస నా తొడనుండి పుట్టినది. దీనిని మీరు తోడుకోనిపోయి మీ దేవేంద్రునికి సమర్పించుడనెను. ఆ మహర్షి మాటలకు భయకంపితులై మరుమాటాడక మన్మథాదులా యూర్వశిని తీసికొని స్వర్గమునకు వెడలిపోయి ఇంద్రునకా యిరువురు ధర్మపుత్రుల (నరనారాయణుల) ఉదంతము నివేదించిరి. అది విని దేవేంద్రుడాశ్చర్య పడెను. నరనారాయణుల ఆ అద్భుతగాధ మర్త్య పాతాళాలలో దిగ్దిగంతాలలో వ్యాపించినది.
మునీ! ఒకనాటి విషయము. మహాక్రూరుడైన హిరణ్యకశిపు వధానంతరం ప్రహ్లాదుడను దానవుడు రాజ్యాభిషిక్తుడాయెను. దేవా బ్రాహ్మణ పూజకుడైన ఆ దైత్యేంద్రుని పాలనలో భూమి యందలి రాజులందరు విద్యుక్తంగా యజ్ఞాదులాచారించిరి. బ్రాహ్మణులు తపోద్యయన తీర్థయాత్రాది ధర్మ కార్యనిరతులై యుండిరి. వైశ్యులు పశుపాలన వాణిజ్యాదులు శూద్రులు సేవాధర్మము నెరపుచుండిరి. ఆ విధంగా నాలుగు వర్ణాలవారు తమతమ ధర్మాచరణ నిరతులు కాగా దేవతలు కూడ తమ తమ వృత్తుల నిర్వర్తించుచుండిరి.
ఆ సమయాన నొకనాడు బ్రాహ్మణ శ్రేష్టుడు బార్గవ వంశీయుడు మహా తపోధనుడైన చ్యవన మహర్షి నర్మదా తీరాన అకులీశ్వర తీర్థంలో స్నానము చేయబోయెను. మహా దేవ దర్శనానంతరం స్నానార్థం నదిలోకి దిగిన వెంటనే ఆ మునిని ఒక గోధుమ వన్నె సర్పము పట్టుకొనెను. సర్పగ్రస్తుడైన ఆ ముని మనసార విష్ణువును స్మరించగా వెంటనే ఆ నాగము విషరహితమాయెను.
అంతట ఆ పామా ఋషిని లాగికొని పాతాళమునకు గోనిపోయివదలెను. అచట నామహర్షి నాగకన్యల పూజ లందుకొనుచు నలువైపుల తిరుగసాగెను. ఆ విదంగా తిరుగుతూ దానవుల యెక్క విశాలమైన నగరంలో ప్రవేశించెను. అక్కడ దైత్యజన పూజ్యుడైన ప్రహ్లాదుడా మునిని చూచెను. మహాతేజస్వి యగు ప్రహ్లాదుడా మహర్షిని యథా విధిగా పూజించి ఆయన వచ్చిన కారణమడిగెను. ఆ మహర్షి, ‘ఓ దైత్యేంద్రా! మహా ఫలప్రదమైన మహాతీర్థ స్నానము, మహేశ్వరుడగు నకులీశ్వర దర్శనార్థినై నేడు బయలుదేరితిని. నీట అడుగుపెట్టగనే ఒక నాగమునన్నుగట్టిగాపట్టుకొని ఈపాతాళమునకు గొని తెచ్చినది. ఇచట మిమ్ము చూడగలిగితి ననెను. వాక్యవిశారదుడైన ప్రహ్లాదుడంతట చ్యవనునితో ధర్మసంయుక్తముగ నిట్లనెను.
“భగవన్ ! ఈ పృథ్వి ఆకాశ పాతాళములోనే యే పవిత్ర తీర్థములు గలవో దయచేసి ఆనతీయుడు.”
“ఓ మహావీరా ! భూలోకంలో నైమిషం, ఆకాశంలో పుష్కరం, పాతాళంలో చక్రతీర్థం ప్రసిద్దమైనవి.”
మహామునీ! భార్గవుని మాటవిన్నంతనే దైత్యపతి ప్రహ్లాదుడు నైమిషారణ్యము వెళ్ళు కోరిక కలిగి ఆ విషయం దానవుల కెరింగించెను.
రండు! మనమందరము నైమిషతీర్థానికి వెళ్లి స్నానంచేసి అచట పీతాంబరధరుడు కమలలోచనుడు నగు నచ్యుతుని దర్శింతము.
తమ ప్రభువు మాటలు విని దైత్యదానవులందరు రసాతలము నుండి బయలు వెడలి మహా సంరంభముతో నైమిషారణ్యమును చేరి సంతోషముతో స్నానములు గావించిరి. తర్వాత దైత్యరాజు ప్రహ్లాదుడు మృగయావినోదము కొరకై అరణ్యములో తిరుగసాగెను. అట్లు తిరుగుచు దానిలో నిర్మలోదకయగు సరస్వతీ నదిని దర్శించెను. ఆ ప్రక్కనే బాణములతో సందులేకుండ వేధింపబడిన గొప్ప శాఖలు గల ఒక సాల వృక్షాన్ని చూచెను. ఆ బాణములు పరస్పర మొకదాని ముఖమున కొకటి అంటుకొని యుండెను.
అద్భుతాకారాలతో నాగములచే చుట్టబడిన ఆ బాణముల చూడగనే ప్రహ్లాదునకు చాలా కోపము కలిగెను. అక్కడకు దూరంగా అతడు నల్లని లేడి చర్మాలు దరించి దీర్ఘజటలతో నొప్పియున్న ఇరువురు తపస్వులను చూచెను. వారల ప్రక్క చక్కని లక్షణములతో నొప్పియున్న శార్జ్గము అజగవమనే రెండు దివ్య దనుస్సులను పెద్దవగు అక్షయ తూణీరములను కనుగొనెను. ఆ విధంగా కనుపించిన వారలను చూచి దంభు (దొంగ సన్యాసు)లని ఎంచి ఆ పురుషోత్తములతో నిట్లనెను.
“మీరు ధర్మ వినాశకరములయిన యిలాంటి దాంభిక కృత్యము లేల చేయుచున్నారు? మీ ఈతపస్సు లెక్కడ? జడలు కట్టిన వేషాలెక్కడ? ఈ దివ్యాస్త్ర శస్త్రాలెక్కడ? అందులకు నరుడిట్లు సమాధానము చెప్పెను. “ దైత్యేంద్రా! నీవెందులకు బాదపడెదవు? సమర్థుడైన వాడు ఏ పని చేసిన నదేవానికి శోభనూ గౌరవాన్ని కల్గిస్తుంది. అంత ప్రహ్లాదు డిట్లనెను : ‘ధర్మ సేతు స్థాపనకు కంకణం కట్టిన దైత్యరాజును నేనుండగా మీరేమి చేయగలరు? అందులకు నరుడు – మాకు కావలసినన్ని శక్తి సామర్థ్యాలున్నవి. నరనారాయణులమైన మాతో ఎవ్వరూ యుద్దము చేయలేరు.
ఆ మాటలకు క్రుద్దుడైన దైత్యేశ్వరుడిట్లనెను. సరియే నరనారాయణులను సంగ్రామంలో నిర్ణించితీరెదనని ప్రతినబూనెను. అంతట ఆదైత్యపతి తన సేవలను అరణ్యపు టెల్లల నిలిపివేసి తానొక్కడే వెళ్లి వారలను యుద్దమునకు రమ్మని ధనుష్టంకారముగావించెను. ఆ కఠోరరవం విని నరుడు తన అజగవచాపాన్ని ఎక్కుపెట్టి వాడియైన బాణాలను పెక్కింటిని శత్రువుపై వదలెను. దైత్యేశ్వరుడు వానినన్నింటిని తన బంగారు రెక్కలు గల బాణాలతో ఖండించివైచెను. తన బాణాలను దైత్యుడు ఖండించుట చూచి క్రుద్దుడైన నరుడు తన మహాధనువును ఎక్కుపెట్టి రకరకాల బాణాలు గుప్పించసాగెను. నరుడు వేసిన ఒక్కొక్క బాణానికి రెండేసి బాణాలతో దైత్యపతి బదులొసగెను. నరుడు మూడు బాణాలు వేయగా నతడు నాలుగు వేసెను. ఐదు వేయగా నారు తీవ్రశరాలను గుప్పించెను. ఋషీశ్వరుడు ఏడు బాణాలు వేయగా రాక్షసు డెనిమిది ప్రయోగించెను. నరుని తొమ్మిది బాణాలకు పదివారాచములతో బదులొసగెను. నరుడు పండ్రెండు వేయగా దైత్యుడు పదునైదు ప్రయోగించెను. తత్వాత నరుని ముప్పదియారు శరాలను డెబ్బది రెండు శరాలతో వమ్మొనర్చెను.
నరుడు నూరు బాణములు ప్రయోగింపగా దైత్యవల్లభుడు మున్నూరు నారాచముల వదలెను. అంతట ధర్మపుత్రుడు ఆరువందలు బాణములు వేయగా రాక్షసపతి వేయి నారాచముల గుప్పించెను. అనంతరం క్రోదొంమత్తులై వారు ఉభయులూ అసంఖ్యాకాలుగా బాణాలు పరస్పరం వర్షింపసాగిరి. అంతట నరుడు తన శరపరంపరలతో భూమ్యాకాశాలను దశదిశలను ముంచెత్తగా నిమేషకాలంలోనే ఆదైత్య వల్లభుడు స్వర్ణవక్షాలతో ప్రకాశించేతన బాణాలతో వానినన్నింటిని ముక్కలుగావించెను. ఈ విధంగా ఆ వీరులిరువురు మహాసాహాసంతో రకరకాలయిన శ్రేష్ఠ యుద్ద సాధనాలతో భయంకరమైన సంగ్రామంకావించిరి. అంతట మహాక్రోదంతో రాక్షసరాజు బ్రహ్మాస్త్రం సంధించగా పురుషోత్తముడగు నరుడు పాశుపతాన్ని ప్రయోగించెను. ఆ రెండు అమోఘాస్త్రాలు పరస్పరంరాడించుకొని క్రిందబడిపోయినవి. తన బ్రహ్మాస్త్రం విఫలమవడంతో కోపంతో మండిపడి ప్రహ్లాదుడు భయంకరమైన గధచేబూని రథము నుండి క్రిందకుదూకెను. గదాపాణియై నరునిపై బడనున్న దైత్యుని చూచి తాను యుద్దము చేయనెంచి నరుని వెనుకకు నెట్టివైచెను. అంతట నారాక్షసపతి గదాదండంతో, పరమతపోధనుడు, శార్జ్ఞపాణి, ఉదార విక్రముడు, లోకపాలకుడు, పురాణ మహర్షి అయిన నారాయణుని వెంబడించెను.
అధ్యాయము 7 complete
