వామన మహా పురాణము

Table of Contents

అధ్యాయము 36

ఓ నారదా ! అంతట నా దేవతలందరు మురారి విష్ణు మందిరానికి వెళ్ళి ఆ దేవునకు ప్రణామాలు గావించి జగత్సంక్షోభానికి కారణమేమని ప్రశ్నించారు. అదివిని శ్రీహరి మనమందరము శ్రీ శంకరుని నివాసానికి వెళ్ళుదము. మహాజ్ఞానియగు నాతడే జగత్తు సంక్షోభకారణం చెప్పగలుగును. అన్నాడు. జనార్దనుని సలహా మేరకు ఆయన వెంటరాగా ఇంద్రునితో గలసి దేవతలందరు మందరగిరికి వెళ్ళగా నచట శివపార్వతులు కాని నందీశ్వర వృషభాలు కాని కనిపించలేదు. అజ్ఞానాంధకారం వల్ల మూర్ఖులై వెర్రి చూపులతో నాశూన్య మందిరాన్ని చూస్తూ నిలచిపోయిన దేవతలతో మహా తేజస్వియగు నా విష్ణువు, ఇదేమి ఎదురుగా ఆశీనుడైన మహాదేపుడు మీకు కనిపించడం లేదా ! అని ప్రశ్నించాడు. అందుకు దేవతలు తమకా గిరిజా నాధుడు కనిపించడం లేదు. తమ దృష్టి ఏ కారణాన నశించిందో తెలియదని వాపోయారు. అప్పుడు శ్రీహరి మీరు మహా పాపిష్ఠులు. శివద్రోహం చేశారు. స్వార్థంతో గ్రుడ్డివారై ఆ భవాని మృడాని గర్భహవనం గావించారు. అందుచేత మీ జ్ఞానం వివేకం ఆ శూలపాణి హరించాడు. కనుకనే ఎట్టఎదుట ఆయన ఉన్ననూ కళ్ళుతెరచికొని కూడా మీరా ప్రభువును చూడలేకున్నారు. కాబట్టి ఆ పాపపరిహారానికై తప్తకృ చ్ఛ్ర ప్రతం ద్వారా కాయ శుద్ధి చేసుకోండి. దేవుని చూడగలుగుటకై ఆ మహనీయునకభిషేకం చేయండి. నూట ఏబది కడవల పాలతోను తర్వాత అరవై నాలుగు కుండల పెరుగుతోను, ఆ తర్వాత ముప్పది రెండు కడవల నేయితోను పదహారు కడవల పంచగవ్యం (ఆవుపాలు ఆవు పెరుగు ఆవు నేయి, ఆవుపేడ ఆవుపంచితం కలిసిన మిశ్రం)తోను వరసగా నామహాదేవుని అభిషేకించండి. అనంతరం ఎనిమిది కడవల తేనెతో అభిషేకించి కడపటగా పైవాని కన్నింటికీ రెండు రెట్లు కడవల శుద్దోదకంతో స్వామిని స్నానం చేయించండి. స్నానానంతరం స్వామి దేహానికి రోచన లేపనం (గోరోచనం) నూట ఎనిమిది పర్యాయాలు పూయాలి. కుంకుమ చందనాలతో భక్తిపూర్వకంగా అలంకరించి బిల్వదళాలు తామరపూలు ఉమ్మెత్తపూలు సురచందన మందార, పారిజాత, అతిముక్త కుసుమాలతో అర్చించాలి. అగరు కాలేయం (నల్లగంధ చూర్ణం)తో కలిపి స్వామికి ధూపం వేయాలి. తర్వాత నా హరుని ఋగ్వేదోక్తమైన పదక్రమ విన్యాసంతో శతరుద్రీయ మంత్రజపం చేయాలి. ఇలాచేస్తే మీ పాపాలు తొలగి ఆ స్వామి ప్రసన్నుడై నష్టమైన మీ దృష్టిని తిరిగి అనుగ్రహిస్తాడు. ఇక వేరే దారి ఏదీలేదు. వాసుదేవుని మాటలకు దేవతలు క్రుంగిపోయి ప్రభూ! ఆ ఆ తప్తకృచ్ఛ్ర మంటే ఏమో సెలవివ్వండి. దాని నాచరించి కాయ శుద్ధి చేసుకుంటామని వేడుకున్నారు.

మూడు రోజులు వేడినీరు త్రాగుతూ మూడు రోజులు పాలు త్రాగుతూ మూడు రోజులు నేయిత్రాగి మిగిలిన మూడు నాళ్ళూ వాయుభక్షణం చేస్తూ గడపాలి. తర్వాత రోజు క్రమంగా పన్నెండు పలాలు నీరు ఎనిమిది పలాలు పాలు ఆరు పలాలు నేయి త్రాగాలి. ఇతి తప్తకృ చ్ఛ్ర నియమం.

నారదా ! ఆ విధానాన్ని విన్న దేవతలు యింద్రునితో కలిసి కాయశుద్ధి కోసం ఆ తప్తకృచ్ఛ్ర వ్రతం కావించి పాపముక్తులైనారు. అంతట వారందరూ కేశవునితో, భగవాన్ ఆ శంభువు ఎక్కడుండేదీ చెబితే క్షీరాదులతో అభిషేకిస్తామని అన్నారు. అందులకా విష్ణువు యిడుగో శంకరుడు నాతో కలసి నా దేహంలో ఉన్నాడు. మీకు కనిపించడం లేదా ? అని అడుగగా నా దేవతలు కనిపించుట లేదు. ఓ మధుసూదనా ! ఆ మహేశ్వరుడెక్కడున్నాడో నిజంగా చెప్పండని ప్రార్థించారు. అంతనా అవ్యయుడైన శ్రీహరి ఆ ఈశ్వర లింగాన్ని, తన హృదయ కమలంమీద శయనించినట్లుగా దేవతలకు చూపించాడు. అంతట సంతోషించి సురలా లింగమూర్తిని విధానం ప్రకారం క్షీరాదులతో నభిషేకించి గోరోచన లేపనం చందనాదులతో నలంకరించారు. బిల్వపత్ర పుష్పాదులతో పూజచేసి భక్తితో అగురు ధూపంవేసి మహౌషధులు నైవేద్యంగావించారు. అష్టోత్తర శతనామ జపం చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. పరస్పర విరుద్ధాలయిన సత్వతమో గుణాత్మకులయిన హరిహరులొకటిగా కలియుట, ఎలా సంభవమా ! అని ఆ దేవతలు తమలోతాము మథనపడునంతలో ఆ ప్రభువు అవ్యయుడు, సర్వాయుధాలు ధరించి సర్వలక్షణ సంపన్నుడై విశ్వరూపం ధరించాడు. హరిలో గలసిన శివుడు మూడు నేత్రాలు, సర్ప పద్మ కుండలాలు, జటాజూటం, గరుడ వృషభ ధ్వజం, సర్పహారాలు, పీతాంబరం, వ్యాఘ్రాజినం, వనమాల, చక్ర ఖడ్గ శంఖ, హలశార్‌ఙ్గ పినాక శూల అజ గవ, ఖట్వాంగ కపాల ఘంటాది ( శివకేశవులకు సంబంధించిన ) ఆయుధాలు ధరించి నిలచాడు. హరిహరాత్మకమైన ఆ అద్భుతమూర్తిని దర్శించి బ్రహ్మాదులయిన దేవతలందరు ఓ సర్వగతా ! అవ్యయా ! ప్రభూ! నీకు నమస్కారమని ప్రణామాలు గావించి ఆ యిర్వురునొకటియేయని తెలుసుకున్నారు. ఆ విధంగా ఏకాభిప్రాయంతో ఉన్న నాదేవతలందరను తీసికొని శ్రీహరి వెంటనే తన ఆశ్రమ స్థానమైన కురుక్షేత్రానికి తీసుకొని వెళ్ళాడు. అచట జలాల్లో స్థాణువుగా నిలచిన శంకరుని ప్రభూ ! స్థాణుదేవా ! నీకు నమస్సులంటూ కీర్తించి ఉపవిష్టులయ్యారు. అపుడు సురపతి ప్రభూ జగన్నాథా ! జగత్తంతా సంక్షోభంలో ఉంది. నీవు నీటినుండి బయటకు వచ్చి వరమనుగ్రహించి మమ్ము ఉద్ధరించుమని అర్థించాడు. దేవేంద్రుని మధురవచనాలాలకించి ఆ వృషభధ్వజుడూ, సర్వవ్యాపీ నిరంజనుడూ నగుశివుడు బయటకు వచ్చి నవ్వుతూ దేవతలందరకూ నానమస్సుస్వాగతం చెప్పాడు. దేవతలంతా నాత్రినేత్రునకు నమస్కరించారు.

ఓ ప్రభూ ! హరా ! ముల్లోకాలు నీ తపోగ్నికి క్షోభించి పోతున్నాయి. కనుక ఈ కఠోర వ్రతాన్ని వెంటనే వదలండి అని దేవతల కోరగానే ఆయన తన దీక్ష విసర్జించాడు. దేవతలు సంతోషంతో తమ నెలవులకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడ భూమికంపిస్తూనే ఉంది. అందులకు కారణమేమో అని రుద్రుడా కురుక్షేత్ర పరిసరాల్లో వెదకగా ఓఘవతీ నదీతీరాన శుక్రుడు కఠోర తపస్సు చేస్తూన్నాడు. అంతట భవుడాయనను ఓఉశనసా ! ఏ కోర్కెతో జగత్సంక్షోభం కలిగించే ఈ తపస్సు చేస్తున్నా వు.

ఓ త్రినేత్రా ! శుభంకరమైన సంజీవని విద్యను తెలుసుకోగోరుతున్నా. అందులకే నీకు ప్రీతికరంగా తపస్సు చేస్తున్నాను.

ఓ తపోధనా ! నేను ప్రసన్నుడనైనాను కనక సంజీవినీ విద్యామర్మం నీవు తెలుసుకోగలుగుతావని వరం యివ్వడంతో నా తేజస్వి తన తపోదీక్ష విరమించాడు. అయినప్పటికీ యింకా గిరి సముద్రాలతోసహా భూమికంపిస్తూనే ఉంది. అంతట శివుడు పవిత్రమైన సప్తసారస్వత క్షేత్రానికి వెళ్ళి అక్కడ మంకణ మహాముని ఆనందాతిరేకంతో నాట్యం చేయడం చూచాడు. ఆమంకణకుడు పిల్లవాడిలాగ చేతులు త్రిప్పుతూ నేలమీద దొర్లుతూ గంతులేస్తూ ఉన్నాడు. ఆ వేగానికి భూమి కంపించి పోతోంది. శంకరుడతనిని సమీపించి నవ్వుతూ, ఓ మహర్షీ ! ఎందుకిలా గంతులేస్తున్నావు ? ఆనందానికి గారణం నాకు చెప్పమంటూ చేయిపట్టుకొని నిలదీశాడు. ఆ మంకణుడో విప్రేంద్రా! విను. నా ఆనందానికి కారణం. ఎన్నో ఏండ్లుగా కాయశుద్ధి కోసం నేను చేస్తు న్న తపస్సు నేడు ఫలించింది. ఇదిగో చూడు. నాచేతికి గాయమైనచోట రక్తానికి బదులు శాకరసం (ఆకుకూర రసం) కారుతోంది. ఇంతకన్నా ఆనందమేముంటుంది ? అందుకే యిలా నృత్యంచేస్తున్నానని చెప్పాడు.

అది విని శివుడు మంకణునితో ఓయీ ! యిటుచూడు. నేను వ్రేలితో కొట్టినంతమాత్రాన్నే స్వచ్ఛమైవ భస్మం వస్తున్నది. అయితే అందుకు నేనే మీ వళ్ళు మరచి నృత్యం చేయడం లేదే ! నిజంగా నీకు మత్తెక్కి నట్టుంది అన్నాడు. అదిచూచి చకితుడై సిగ్గుతో తలవంచుకొని శివునకు వందనము చేశాడాముని, అంతట హరుడు ఓ మునీ ! నీవు అవ్యయమైన బ్రహ్మలోకానికి పొమ్ము. ఈ ప్రదేశం కూడ పృథూదకంతో సమానమైన పుణ్య తీర్థంగా విలసిల్లుతుంది. ఈ సారస్వత తీర్థంలో సురాసుర గంధర్వ విద్యాధర కిన్నరాదులు నిత్యం సన్నిహితులై ఉంటారు. ఇది ధర్మానికి పట్టుగొమ్మగా ఉంటూ పాపమలాలన్నింటినీ నశింపజేస్తుంది. అని వరమిచ్చాడు. సుప్రభ, కాంచనాక్షి సువేణు, విమలోదకంతో కూడిన మనోహర, ఓఘవతి, విశాల, సరస్వతీ జలాలతో పునీతమైన ఈ సప్తసారస్వత తీర్థం సేవిస్తే సోమపానం చేసిన ఫలం లభిస్తుంది. ఈ సప్త సరస్వతులు ఎప్పుడూ యిక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కనదీ సోమయాగఫలం కలుగజేస్తుంది. నీవు కూడ యిక్కడ మహిమగల మూర్తి స్థాపనం చేసి దుర్లభమైన బ్రహ్మలోకానికి పోగలవు. శంకరుని ఆదేశం ప్రకారమాతపస్వి, ఆ కురుక్షేత్రంలో మూర్తిస్థాపనగావించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. మంకణుడు వెళ్ళిపోవడంతో భూమి కంపించడం తగ్గి యథాస్థితికి చేరుకుంది. శివుడుగూడ తన నెలవు మందరగిరికి వెళ్ళిపోయాడు. ఓ బహ్మర్షీ ! శంకరుడు మందరగిరి వదలి తపస్సుకు ఎందుకువెళ్ళినదీ నీకు వివరించాను. ఆయన లేని సమయంలోనే దుర్బుద్ధి అంధకుడు వెళ్ళడం, పరమేశ్వరితో యుద్ధం చేయడం జరిగింది.అధ్యాయము 36 Complete