వామన మహా పురాణము

Table of Contents

అధ్యాయము 34

6 – Missing content (Slokas 6-33)

నారదా! పాపనాశకము పుణ్యవహము విచిత్రమూ నైన మురాసుర వధ వృత్తాంతం చెబుతున్నా వినుము. కశ్యప మహర్షికి దనువువల్ల మురాసురుడనే దానవుడు కలిగాడు. ప్రముఖులైన దేవతల చేతుల్లో దైత్యులందరు హతులుగావడంచూచి చావుకు భయపడి వాడనేక సంవత్సరాలు బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. వాని తపస్సుకు సంతోషించి పితామహుడు వత్సా! వరం కోరుకో అన్నాడు. అందుకు వాడు పితామహా! నేనెవరిని చేతితో తాకుదునో వారు అమరులైనా సరే యుద్ధంలో చనిపోవునట్లు వరమివ్వండి అని అర్థించాడు. బ్రహ్మ అట్లేయని అంతర్ధానమై పోయాడు. అంతట నా దానవుడు దేవ నివాసమైన (మేరు) పర్వతానికి వెళ్ళి దేవ యక్ష కింనరాదులను యుద్ధానికాహ్వానిస్తే ఎవరూ యుద్ధానికి రాలేదు. అంతట కోపంతో వాడమరావతికి వెళ్ళి ఇంద్రుని యుద్ధానికి పిలవగా నతడా దానవునితో పోరాడుటకు సమ్మతించలేదు. అంతవాడు చేతిని పైకిఎత్తి అమరావతీ నగరంలోకి చొచ్చుకొని పోగా ఎవ్వరూ నిరోధించలేదు. నేరుగా యింద్రుని సదనానికి వెళ్ళి ఆమురుడు నాతో యుద్ధమైనా సాగించు లేదా అమరావతి వదలి వెళ్ళిపో అని నిలదీశాడు. నారదా! వేరే మార్గం లేక దేవేంద్రుడమరావతి వదలి భూలోకానికి వెళ్ళిపోయాడు. దేవేంద్రుడి సింహాసనంతోబాటు ఐరావత గజాన్ని వజ్రాయుధాన్ని వాడపహరింపగా నా సురపతి భార్యాబిడ్డలు దేవతలు తోడురాగా యమునా నది దక్షిణతీరానికి వెళ్ళి తనకొక నగరాన్ని నిర్మించుకొన్నాడు. మురాసురుడు సకల భోగాలనుభవిస్తూ స్వర్గంలో ఉండిపోయాడు. మయుడు తారుడు మొదలయిన యితర దనుజులు గూడ మురాసురుని వద్దకు వెళ్ళి స్వర్గ సుఖాలనుభవించసాగారు. ఆ దానవుడొక పర్యాయం వంటరిగా భూసంచారం చేస్తూ, గజారూఢుడై సరయూనదికి వెళ్ళాడు. ఆ నదీతీరాన యజ్ఞదీక్షితుడై యున్న సూర్యవంశ నృపతి రఘుమహారాజును చూచి, నాతో యుద్ధం చేయాలి లేదా ఈ యజ్ఞాన్ని మానుకోవాలి. దేవతలను యిక ఎంత మాత్రం యజ్ఞాలతో ఆరాధించడం పనికిరాదని శాసించాడు. అది చూచి మిత్రావరుణతనయుడైన వశిష్ఠుడు మహాతపస్వి ఆ దానవుని సమీపించి యిలా అన్నాడు.

"దైత్యవీరా ! మానవుల జయించు నందున ప్రయోజనమేమి ? అజేయులైన వారలను శాసించుము. నిజంగా యుద్ధం చేయాలనుకుంటే యమధర్మరాజును అదుపులో పెట్టు. అతడిని జయించావంటే భూలోకాన్నంతా జయించినట్లే అవుతుంది. అని పలికిన వసిష్ఠుని మాట విని దండపాణియైన ధర్మరాజును జయించేందుకు బయలుదేరాడు. మురుడవధ్యుడనీ తన మీదకెత్తి వస్తున్నాడని విని, యముడు మహిషాన్నధిరోహించి కేశవుని వద్దకు వెళ్ళి నమస్కరించి మరాసురుడి ఆగడాలు వివరించాడు. అందులకా జనార్దనుడు నీవు వెళ్ళి ఆ రక్కసుని నా వద్దకు పంపుమని ఆదేశించాడు. అంతట త్వరగా తిరిగి తన నగరానికి వచ్చేసరికి మురుడుకూడ వచ్చిచేరాడు. యముడు వానికెదురేగి, దానవేశ్వరా ! నీ యిష్ట ప్రకారం చేస్తాను. నేనేంచేయాలో చెప్పుమన్నాడు.

యమా ! ఈ క్షణంనుంచీ నీవు జీవుల ప్రాణాలనపహరించుట మానెయ్యాలి, లేదో నీతల నరికి పారేస్తానన్నాడు. అంతట ఓ నారదా ! ఆ యముడా దానవుడితో నీవునాపై అధికారినుంచి నన్ను కాపాడుచో నేను నా కర్తవ్యాన్ని వదిలేస్తా. నీ ఆదేశాన్ని శిరసావహిస్తా నన్నాడు. అందుకు వాడు, నీమీద ఆధికారం నెరపువాడెవడో తెలుపుము. నేను వానిని నిర్జించి తప్పక నిన్ను రక్షిస్తానన్నాడు. అందుకు యముడు శ్వేతద్వీపవాసి చక్రగదాధారి అయిన విష్ణుపు అదుపాజ్ఞలలోనే నున్నానని చెప్పగా వాడు ఆ దుర్జయుడైన విష్ణువుండే చోటు చెప్పగనే స్వయంగా వెళ్ళగలనన్నాడు. యముడదివిని క్షీర సముద్రానికి వెళ్ళు. అక్కడ నీకు జగన్మయుడు లోకాధినేత అయిన భగవానుడు విష్ణువు కనిపిస్తాడన్నాడు. మురాసురుడిదిగో యిప్పుడే ఆ కేశవుడి దగ్గరకు వెళ్తున్నా. నేను తిరిగి వచ్చే వరకు నీవు నీ మానవసంయమన కర్తవ్యాన్ని నెరవేర్చకూడదు సుమా. అనగా యముడు సరే నీయిష్ట ప్రకారమే చేస్తా కాని ఎలాగైనా ఆయనను, నాపై నియంతను జయించేందుకు ప్రయత్నం చేయము. గట్టిగా యుద్ధం చేయమన్నాడు. అలాగేనని బీరాలు పలుకుతూ ఆ మురుడు శేషపర్యంకంమీద నాలుగు రూపాలతో విరాజిల్లే జనార్దనుని నివాసం క్షీరసముద్రానికి ప్రయాణమై పోయాడు.

ఒక్కడైన విష్ణువు నాలుగు రూపాలు గలవాడుగ నేల చెప్పబడినాడు ? అందుకు కారణం ఆయన సర్వగుడగుటయా లేక అవ్యక్తుడగుటయా ?

అవ్యక్తుడూ సర్వగుడూ ఒక్కడూ అయి ఉండియు జగన్నాథుడు చతుర్మూర్తి అయిన వివరం నారదా ! చెబుతున్నా వినుము. వాసుదేవుడుగా పేర్కొనబడే ఆ పరతత్వం తర్కానికి అతీతమైనది. ఇది అని నిర్దేశింపరానిది అవ్యక్తమైనది శుక్ల వర్ణం కలిగి శాంతియేరూపంగా కలిగినది. అది ద్వాదశ పత్రాలు గలిగినది.

ఓ బ్రహర్షే! ఏ విధంగా ఆ తత్వం శుక్లమైనది శాంతమైనది తర్కాతీతమైనది ఉత్తమమైనది. దానిలోగల ద్వాదశపత్రాలు ఏవియో వివరించండి.

అత్యంతగూఢమైన ఈ తత్వాన్ని మొదట పరమేష్ఠి ప్రజాపతి సనత్కుమారునకు తెలుపగా నాయననుండి నేను విన్నాను. నారదుడంతట, బ్రహ్మ స్వయంగా వినిపించిన ఆ సనత్కుమారుడెవరు ? వివరంగా చెప్పండని అర్థించగా పులస్త్యుడిలా చెప్పాడు. ధర్మునకు అహింస అనే భార్యవలన యోగశాస్త్ర విదులయిన కుమారులు నలుగురు కలిగారు. వారిలో పెద్దవాడు సనత్కుమారుడు రెండవవాడు సనాతనుడు, మూడవవాడు సనకుడు నాలవవాడు సనందనుడు. వీరు గాక సాంఖ్యవేత్తలు కపిల, వోఢు, ఆసురి, యోగివరుడు తపోనిధి అయిన పంచశిఖుడు ఉన్నారు. వారు పెద్దవారైయుండియు చిన్నవారలకు జ్ఞానయోగం చెప్పలేదు. మహాయోగ ప్రమాణం మాత్రమే చెప్పారు. అంతట సనత్కుమారుడు కమలభవుడైన బ్రహ్మనుచేరి యోగవిజ్ఞానాన్ని అర్థిస్తే ఆయన యిలా అన్నాడు.

ఓ సాధ్యుడా ! నీవు నా పుత్రుడవగుటకంగీకరిస్తే ఆ శాస్త్రం నీకు చెప్పగలను. ఎవరికి పడితే వారలకు సత్యం చెప్పగూడదు. అందుకు తిరుగులేదు.

ప్రభూ! నీకు శిష్యుడనుకనుక నేను పుత్రుడనేకదా, పుత్రునకు శిష్యునకుభేదమేమి గలదు?

అలాకాదు ధర్యపుత్రా, శిష్యునికన్నా పుత్రునిలో విశేషం ఉంటుంది. అది ధర్మకర్మ నిర్వహణకు సంబంధించినది. పుత్ అనే నరకంనుంచి రక్షించేవాడు పుత్రుడయితే శేషించిన పాపాన్ని హరించే వాడు శిష్యుడనబడును. ఇది శ్రుతివచనం. అని విశ్లేషించెను.

ఆ పున్నామనరకం, శేషపాపహరణం అంటే ఏమో విపులంగా చెప్పండి.

ఓ సాధ్యా ! యోగాంగయుక్తమైన నీ విజ్ఞానం చాలా పురాతనమైనది. ఉగ్రమైనది, భయాలు పోగొట్టేది. అది నీకు చెబుతున్నాను, వినవలసినది.

అధ్యాయము 34 Complete