మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము

Table of Contents

133 - దమ చరితము నందు వపుష్మానుని వధ

 

మార్కండేయుడు:

మార్కండేయుడు:

నరిష్యంతుని  పుత్రుం డగు దముడు ఈ విధముగా ప్రతిన బూని క్రోధముచే రక్త వర్ణమును దాల్చిన నేత్రములతో మీసములు మెలి త్రిప్పెను. “హా! హతోస్మి” అని తండ్రిని గూర్చి చింతించుచూ దైవ నింద చేయ సాగెను. పిమ్మట పురోహితులను పిలిపించి మంత్రు లందరి సమక్షమున ఇట్లు చెప్పెను.

దముడు:

 

దముడు:

‘తండ్రి గారు స్వర్గమునకు బోయిరి. శూద్ర తపస్వి చెప్పిన దంతయు మీరు విని యున్నారు. ఇప్పుడు ఈ సమయమున ఏమి చేయ వలెనో దానినే మీరు తెలియ జెప్పుడు.’ ఆ రాజు వృద్దవస్థ యందు వాన ప్రస్థ వ్రతుడై, తపస్వియై మౌన వ్రతుడై యుండెను. వపుష్మానుడు అడిగిన దానికి నా తల్లి యగు ఇంద్రసేన, వపుష్మానునకు అంతయు యదార్ధముగా తెలిపెను. అప్పుడా దురాత్ముడు ఖడ్గమును లాగి వామ హస్తముతో, లోకనాథుని అనాథుని వలె పట్టుకొని చంపి వేసెను. సతియగు నా తల్లి నన్ను మంద భాగ్యునిగా, ధన హీనునిగా తిరస్కరించుచూ నా తండ్రి యగు నరిష్యంతుని కౌగిలించుకొని అగ్ని ప్రవేశము చేసి స్వర్గమునకు వెళ్ళెను.

 

“నా తల్లి ఏ విధముగా అజ్ఞాపించినదో, నేను దాని  ననుసరించి కార్యమును చేయుదును. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, పాదచారులతో చతురంగ బలమును సమాయిత్తము చేయుడు.” తండ్రి యొక్క వైరమును తీర్చుకొనక పితృ ఘాతకుని వదింపక, తల్లి ఆజ్ఞను పాటింపక జీవించుట కెట్లు ఉత్సాహ పడుదును?”

మార్కండేయుడు:

 

మార్కండేయుడు:

మంత్రులు ఆతని వచనములు విని హాహా కారములను చేయుచు దుఃఖమును పొంది, నిమనస్కులైరి. రాజు అజ్ఞాను సారము వారు భృత్యులు, సైన్యములు, వాహనముల సహితముగా, సిద్దమయిరి.

 

 

ఇట్లు దముని పురస్కరించుకొని మంత్రులు సపరి వారముగా బయలు దేరిరి. అప్పుడు దముడు కూడ త్రికాలజ్ఞులగు పురోహితుల ఆశీర్వాదమును పొంది, నాగరాజు వలె భుసలు కొట్టుచు సీమలను పాలించు నట్టి సామంతులను నాశనము చేయుచు శీఘ్రముగా వపుష్మానుని కొరకు దక్షిణ దిక్కునకు బోయెను. పరివార, కుటుంబ, అమాత్య గణ సహితముగా తన దేశమునకు దముడు వచ్చినాడన్న వార్త విని సంక్రందనుని పుత్రుడగు వపుష్మానుడును ఆశ్చర్యముతో, విచలిత మనస్కుడై తన సైన్యమును యుద్దము చేయుటకు ఆజ్ఞాపించెను. మఱియు నగరము వెలుపలికి వెళ్లి ఇట్లు ప్రకటింప మని దూతను పంపెను. ఓరీ క్షత్రియాధమా! నీవు త్వరగా రమ్ము. భార్యా సహితుడై నరిష్యంతుడు నీకై నిరీక్షించు చున్నాడు. నీవు శీఘ్రముగా నా సమీపమునకు రమ్ము.

 

 

“రుథిర దహముచే శిలల వంటి పదును గల నా ఈ బాణములు నాచే యుద్ద క్షేత్రమున విడువ బడినవై నీ శరీరమును చేదించి రుధిరమును త్రాగును.” దముడు దూతచే  ఈ వచనములు విని ముందుగా తాను చేసిన ప్రతిజ్ఞ స్మరణకు రాగా త్రాచు పాము వలె ఉచ్చ్వాసములను విడుచుచూ శీఘ్రముగా వెళ్ళెను. మరియు ఆతనిని సమరమునకు బిలచుచు ఇట్లనెను. “ప్రకృత పురుషుడైన వాడు ఎల్లప్పుడును ఆత్మను శ్లాఘించు కొనడు అనంతరము దముడు, వపుష్మానుల మధ్య ఘోర యుద్దము జరిగినది. రథికులతో రథికుల ఏనుగుల నధిరోహించిన వారితో అట్లే ఏనుగుల నధిరోహించిన వారు, అశ్వారోహులు యుద్దము చేయు చుండిరి. భయంకర మగు యుద్దము జరుగు చుండెను. ఓ విప్రర్షీ! సంపూర్ణ దేవ గణాలు, సిద్దులు, గంధర్వులు మరియు రాక్షస గణాలు చూచు చుండిరి. వారి ఎదుట ఈ విధముగా యుద్దము జరుగ సాగెను. ఓ బ్రాహ్మణుడా! ఎప్పుడయితే దముడు క్రోధ పూర్వకముగా యుద్దమును చేయుట యందు ప్రవృత్తు డయ్యెనో ఆ సమయమున భూమి అంతయు కంపించి పోయెను.

 

 

గుఱ్ఱములు, ఏనుగులు, రథములే కాదు. ఎవ్వరును అతని బాణములను సహింపలేక పోవు చుండిరి. వపుష్మానుని సైన్యము దమునితో యుద్దము చేయ సాగెను. దారుణ మగు దముని బాణములు ఛేదింప బడుచుండెను. సేనాపతి పడిపోవుటచే వపుష్మానుడు సహింము సైన్య మంతయు పారి పోవుటకు ప్రయత్నించు చుండిరి. అప్పుడు శత్రువుల నణచునట్టి వాడగు దముడు “ఓరీ దుష్టుడా! తపస్వి యగు నా తండ్రిని చంపి నీవెక్కడికి పోయెదవు?”  నీవు శస్త్ర హీనుడు తపస్వి యగు నా తండ్రిని వధించితివి. నీవు క్షత్రియుడవు. అందు వలన ఆగుము. అనెను. అనంతరము వపుష్మానుడు తన అనుజుడును, పుత్ర సంబంధీకుల బంధవుల సహితముగా వెనుతిరిగి రథా రోహణము చేసి యుద్దము చేయ సాగిరి. అప్పుడు వపుష్మానునిచే విడువబడిన బాణములతో ఆకాశ మంతయు అచ్చాదింప బడెను.

 

 

మరియు బాణములచే వలను నిర్మించి ఆ వల ద్వారా అశ్వ, రథ సహితముగా దముని కప్పి వేసెను. అప్పుడు దముడును తండ్రిని వధించుట వలన కలిగిన కోపముచే. అతని బాణములను చేదించుచూ శత్రువుల అంగములను తన బాణములచే విచ్చిన్నము గావించు చుండెను. ఒక్కొక్క బాణముతో అతని ఏడుగురు పుత్రులను, సోదర సంబంధులను, బాంధవులను, మిత్రులను యమపురికి పంపెను. అప్పుడు రథము మాత్రమే మిగిలిన వపుష్మానుడు ఆత్మీయులు, బంధువులు  మరణించుటతో అత్యంత కృద్ధుడై అతి విషతుల్య మగు బాణములను వదలుచు దమునితో యుద్దము చేయ సాగెను. కానీ ఓ మహామునీ! దముడు ఆ బాణము లన్నియు త్రుంచి వేసెను. ఈ విధముగా అత్యంత క్రోధముతో పరస్పరము ఒకరి నొకరు వధింప వలెనను కోరికచే దారుణముగా యుద్దము చేయసాగిరి. ఇద్దరును బలవంతులే క్రమముగా ఆ యిద్దరును శారాఘాతములచే ముక్క చెక్కలైన ధనుస్సులను వదలి ఖడ్గదారులై లేచి యుద్ద క్రీడను సల్పు చుండిరి. వనము నందు మరణించిన తండ్రిని క్షణకాలము తలచుకొని దముడు ఆతని కేశములు పట్టి లాగి ఆతనిని భూమిపై పడవేసెను మరియు అతని కంఠమును పాదముచే నొక్కిపట్టి తన హస్తములను పైకి చాపి ఇట్లనెను.

 

 

ఈ క్షత్రియాధమము డగు వపుష్మానుని హృదయమును చీల్చు చున్నాను. సమస్త దేవతలు, మనుష్యులు, సిద్దులు మరియు పన్నగములు పక్షులు అవలోకించుదురు గాక.” అని పలికి దముడు అతని హృదయమును చీల్చి వేసెను. మరియు అతని రక్తమును పానము చేయుటకు ఉద్యుక్తు డయ్యెను. అప్పుడు దేవతలు ఆతనిని వారించిరి. అప్పుడు ఆ రక్తముతో, అతడు తన తండ్రికి ఉదక క్రియలు సంపన్నము గావించెను. దముడు వుపుష్మానుని మాంసముచే పిండ ప్రదానము చేసెను. మరియు రాక్షస కులోత్పన్ను లగు బ్రాహ్మణులకు భోజనములు పెట్టెను. ఈ విధముగా తండ్రి గారి ఋణము నుండి విముక్తుడై తిరిగి తన రాజ్యమునకు మరలి వచ్చెను.

 

 

ఈ విధముగా పరాక్రమ వంతులగు రాజులు సూర్య వంశం నందు జన్మించిరి, ఇంకను అనేకులగు బుద్ది మంతులు, శూరులు, యజ్ఞము చేయు వారు. ధర్మాత్ములు, పండితులు పుట్టిరి. వేదాంత పారంగతులు ఎంత మంది కలిగిరో చెప్ప నలవి గాదు. వారిని ఇంత సంఖ్యా యని చెప్ప జాలము. ఈ దమ చరిత్రను శ్రవణము చేసిన మానవుడు అన్ని పాపముల నుండి విముక్తు డగును.