మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము
103 - భాను తను లేఖనము
మార్కండేయుడు:
మార్కండేయుడు:
అనంతరము ప్రజాపతి యగు విశ్వకర్మ ప్రణతుడై వివస్వానుని ప్రసన్నుడిగా చేసి సంజ్ఞా దేవి యను పేరు గల తన కన్య నిచ్చెను. ఆ సంజ్ఞా దేవి గర్భము నుండి వివస్యానునకు “దైవస్వతు”డను పేరు గల పుత్రుడు జన్మించెను. అతని వృత్తాంతమును ఇంతకు ముందు విశేషముగా చెప్పి యుంటిని.
క్రౌష్టుకి:
క్రౌష్టుకి:
ఏ చరిత్ర వినిన వారికి కలి సంబంధమగు పాపము లన్నియు నాశనము చేయునో, అట్టి మార్తాండ మహాత్ముని యొక్క చరిత్రను నేను తిరిగి వినగోరు చున్నాను.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఓ మునీ! గోపతి యగు సూర్యుడు సంజ్ఞా దేవి గర్భము నుండి మహా భాగ్యవంతులగు ఇద్దరు పుత్రులు, యమున పేరు గల ఒక కన్య కలిగిరి. ఇందు శ్రాద్ధ దేవుడు ప్రజాపతి యగు వైవస్వత మనువు జ్యేష్టుడు తరువాత యముడు మరియు యమున అను పేరు గల కవలలు జన్మించిరి. ఆ సమయమున మార్తాండుడు తనకు గల అధికమైన తేజస్సుచే ముల్లోకముల లోని సచరాచరములను తపింప జేయు చుండెను.
సంజ్ఞా దేవి గోళాకారములో నున్న వివస్వానుని రూపమును, అతని తేజస్సును భరించ లేక తన ఛాయతో నిట్లు పలికెను.
సంజ్ఞా దేవి:
సంజ్ఞా దేవి:
“ఓ సుభాంగీ! నీకు శుభమగు గాక. నేను నా తండ్రి గారి గృహమునకు పోవు చున్నాను. నీవు నా ఆజ్ఞను పాటించుచు నిర్వికార చిత్తముతో నా స్థానమున నివసింపుము. నా యిద్దరు పిల్లలను వరవర్ణిని యగు కన్య యెడల స్నేహముగా నుండ వలెను. మరియు ఈ వృత్తాంతమును సూర్య భగవానునికి ఎప్పుడును చెప్పరాదు.”
ఛాయా దేవి:
ఛాయా దేవి:
ఓ దేవీ! ఎప్పటి వరకు నా జుట్టు పట్టు కొనడో, ఎప్పటి వరకు నన్ను శపించడో, అప్పటి వరకు నేను నీ విషయమును చెప్పను. నీవు అభిలషించిన స్థానమునకు పొమ్ము.
ఛాయా దేవి ఇట్లు పలికిన పిమ్మట శుభ దర్శనురాలగు సంజ్ఞా దేవి తండ్రి గారి గృహమునకు వెళ్లి కొంత కాలము అచట నివసించెను. ఓ విప్రుడా! అనంతరము సంజ్ఞా దేవి యొక్క తండ్రి విశ్వకర్మ “ఇక నీ గృహమునకు పొమ్ము” అని మాటి మాటికి చెప్పుట చేత ఆమె అశ్వ రూపమును ధరించి ఉత్తర కురు క్షేత్రమునకు పోయెను. ఓ మహామునీ! సాధ్వి యగు సంజ్ఞా దేవి అచట నిరాహారురాలై తపస్సు చేయ సాగెను. ఇచట సంజ్ఞా దేవి ఎప్పుడయితే తండ్రి గారి గృహమునకు వెళ్ళెనో, అపుడు ఆమె ఆజ్ఞానుసారముగా ఛాయా దేవి, ఆమె రూపమును ధరించి భాస్కర భగవానుని యడల సంజ్ఞా దేవి వలె ప్రవర్తింప సాగెను. సూర్య భగవానుడును ఆమెను తన భార్య సంజ్ఞా దేవిగా తలంచి, ఆమె వలన కూడా ఇద్దరు పుత్రులను, ఒక కుమార్తెను పొందెను. ఓ ద్విజోత్తమా! ఈ ఇద్దరు పుత్రులలో జ్యేష్టుడు, సంజ్ఞాదేవి యొక్క పుత్రుడగు వైవస్వత మనువుతో సమానుడై “సావర్ణి” యను పేరు గల మనువయ్యెను. రెండవ వాడు “శనైశ్వరు”డను పేరు గల గ్రహ మయ్యెను.
“తపతి” అను పేరు గల కన్యను “సంవరణు”డను నరపతి వివాహ మాడెను. చాయా సంజ్ఞ సావర్ణి మనువు మొదలగు తన పుత్రుల యెడల ఎట్టి స్నేహమును చూపు చున్నదో, నిజ సంజ్ఞ గర్భము నుండి ఉత్పన్నమైన వైవస్వత మనువు మొదలగు పుత్రుల యడల అట్టి ప్రేమను చూపుట లేదు. ఛాయా సంజ్ఞ ఈ విధముగా భిన్నముగా ప్రవర్తించుట చూచి వైవస్వత మనువు సహింప గల్గెను. కాని యముడు దుఃఖితుడై సవితి తల్లి చేయు పనులను మాటి మాటికి తల్చుకుంటూ వాటిని సహించ లేక పోయెను. ఓ మునీ! క్రోధముతో యముడు జరుగ బోవు విషయమునకు వశీభూతుడై ఛాయా సంజ్ఞను అదిలించుచు ఆమెను తన్నుటకు తన పాదమును ఎత్తెను. అందులకు చాయా సంజ్ఞ అత్యంత క్రోధితురాలై యముని నిట్లు శపించెను.
ఛాయా దేవి:
ఛాయా సంజ్ఞ:
“నేను పూజ్యులైన నీ తండ్రి గారి భార్యను. నన్ను పాదమును చూపించుచూ అదిలించితివి. అందు వలన నీ పాదము తెగి భూమిపై బడును గాక. ఇందు సందేహము లేదు.”
ధర్మాత్ముడగు యముడు ఈ శాపముచే అత్యంత పీడిత మనస్కుడై మనువు సహితముగా తండ్రి సమీపము నకు వెళ్లి వృత్తాంతము నంతయు తెలిపెను.
యముడు:
యముడు:
ఓ దేవా! తల్లి మా యెడల సమాన భావము చూపక, మేము జ్యేష్టులమై నప్పటికి మమ్ములను అనాదరముగా చూచుచు కనిష్టులైన ఆ ఇద్దరినీ పోషించుట యందే ఇష్టమును చూపు తున్నది. ఆ కారణము వలన నేను బాల్య స్వభావముచే ఆమె పైకి నా పాదమును ఎత్తితిని. కాని ఆమెను తన్న లేదు. నా యీ అపరాధమును మీరు క్షమించ వలెను. తేజః శ్రేష్టుడైన ఓ తండ్రీ! పుత్రుడు దురాచారుడైననూ, తల్లి అతని యెడల ఎల్లప్పుడును చేదుగా వ్యవహరించదు. కాని “నీ పాదము తెగి భూమిపై పడుగాక” అని ఎట్లు శపించ గలదు? ఎప్పుడైతే తల్లియై యుండియు పుత్రునిపై గల కోపముచే ఇట్లు శపించెనో, అప్పుడు ఆమె తల్లిగా కనిపించుట లేదు.
ఓ భగవానుడా! తల్లి యొక్క శాప కారణముగా ఏ ఉపాయము వలన నా పాదము తెగకుండా ఉండ గలదో, ఓ గోపతీ! నన్ను అనుగ్రహించి అట్టి ఉపాయమును ఆలోచింపుడు.
రవి:
సూర్యుడు:
“కుమారా! నీవు ధర్మజ్ఞుడవు మరియు సత్యవాదివై యుండియు ఎప్పుడయితే నీవు క్రోధమునకు వశీభూతుడ వైతివో, అప్పుడు నిస్సందేహముగా ఇట్లు జరుగుట సంభవము”. “ఇతర సమస్త శాపములకును, శాప నివృత్తి చేయవచ్చును. కాని తల్లి యొక్క శాపమును నివృత్తి చేయుటకు ఎత్తి ఉపాయము లేదు. అందువలన నీ తల్లి యొక్క శాపమును నివృత్తి చేయుటలో నేను అసమర్థుడను. కాని పుత్ర స్నేహముతో నిన్ననుగ్రహించి వేరొక విధానమును తెలిపెదను. కృములు నీ పాదము యొక్క మాంసమును గ్రహించి భూమి పైకి తీసుకొని పోవును. అట్లు జరుగుటచే నీ తల్లి యొక్క వచనములు సత్య మగును, మరియు నీవును రక్షింప బడుదువు.”అని పలికెను.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
తిరిగి ఆదిత్యుడు ఛాయతో నిట్లు పలికెను. “నీ పుత్రులందరూ నీకు సమాన స్నేహ పాత్రులే. కాని నీవు అట్లు చూడక కొందరిపైన మాత్రమే స్నేహమును చూపు తున్నావు. అందుచే నీవు వీరి తల్లివి కాదని, సంజ్ఞాదేవి రూపములో నున్న వేరొక దానివని బోధ పడుచున్నది. అట్లు కానిచో పుత్రుడు దురాచారుడైనను, తల్లి శపింప గలదా ?
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఛాయా సంజ్ఞ దివాకరునకు ఏమీ చెప్పక వృత్తాంతము నంతయు రహస్యముగా నుంచెను. కాని దివస్పతి తప శ్శక్తితో నిజ వృత్తాంతమును తెలుసుకొని శపించుట కుద్యుక్తు డయ్యెను. హే బ్రాహ్మన్! అది చూచి చాయా సంజ్ఞ భయముచే కంపించుచు జరిగిన వృత్తాంత మంతయు తెలిపెను. వివస్వానుడు ఆ వృత్తాంతము నంతయు విని కృద్ధుడై మామ గారి వద్దకు వెళ్ళెను. రోషముచే సమస్తమును దగ్ధము చేయు వాని వలె నున్న దివాకరుని సువ్రతుడగు విశ్వకర్మ చూచినా వాడై ఆయనను యధావిధిగా పూజించి అతనిని సమాధాన పరచెను.
విశ్వకర్మ:
విశ్వకర్మ:
తేజస్సుచే వ్యాప్తమై యున్న మీ యొక్క దుస్సహమగు రూపమును సంజ్ఞాదేవి సహింప లేక పోవుటచే వనమునకు పోయి తపస్సును చేయు చున్నది. మీ రూపము యొక్క కారణమున వనము నందు తపస్సును చేయుచు శుభ కార్యము నందు తత్పరురాలై యున్న నీ భార్యను ఇప్పుడే వెళ్లి చూడుము. ఓ దేవా! బ్రహ్మ పలికిన వచనములు ఇప్పుడు నాకు స్ఫురణకు వచ్చుచున్నవి. దానికి మీ అనుమతి ఇచ్చినచో ఓ దివస్పతీ! మీ ఈ రూపమును ప్రకాశవంతముగా పరివర్తనము చేయుదును.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
తన రూపము మండలాకారముగా నుండుటచే భగవానుడు రవి త్వష్టికు ఆ కార్యమును చేయుటకు అనుజ్ఞ ఇచ్చెను. విశ్వకర్మ సూర్యుని ఆజ్ఞచే శాక ద్వీపము నందు వివస్వానుని తేజస్సును సానపట్టి ఆతని రూపమును తగ్గించుటకు ఉపక్రమించెను.
ఓ మహాభాగా! సంపూర్ణ జగత్తుకు నాభి స్వరూపుడగు ఆదిత్యుడు తేజస్సుచే సముద్రము, గిరులు, వనములు, మహీతలము, ఆకాశము, వ్యాకుల మయ్యెను. మరియు హే బ్రాహ్మన్! చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, గగనము నుండి క్రిందికి పడిపోవు నట్లుగా అనిపించ సాగెను. సముద్ర మందలి జలము పొంగ సాగెను. మహా పర్వతముల యొక్క శిఖరములు చిన్నాభిన్నము లయ్యెను. మరియు ఓ మునిసత్తమా! ధ్రువాధారములగు నక్షత్రము లన్నియు తమ రశ్మి బంధనము స్ఖలన మగుటచే క్రిందకు పడిపో సాగినవి. ఓ మునీ! మేఘాలు నలు దిక్కుల వేహముగా తిరుగుటచే కలిగిన గాలి వలన పరస్పరము డీకొని ఘోరముగా గర్జించుచూ విహరింప సాగెను.
ఓ ముని సత్తమా! ఈ విధముగా స్వర్గ, మర్త్య, పాతాళ లోకములన్నియు సూర్యుని భ్రమరము వలన అతిశయమగు వ్యాకులము పొందెను. ఓ విప్రుడా! త్రైలోక్యము లన్నియు ఈ విధముగా వ్యాకుల మగుటచే సురర్షులు, దేవతలు, బ్రహ్మ సహితముగా సూర్యుని స్తుతింప సాగిరి. వారు సూర్యుని ఇట్లు స్తుతించు చున్నారు. దేవతలలో ఆది దేవుడవు నీవేనని, నీ ఈ స్వరూపముచే తెలియు చున్నది. సృష్టి, స్థితి, ప్రళయ కాలములను భేదములతో నీవు త్రివిధములుగా స్థితుడవై యున్నావు. ఓ జగన్నాధా! ఓ గ్రీష్మవర్ష హిమకరా! నీకు జయ మగుగాక. ఓ దేవదేవా! ఓ దివాకరా! నీవు లోకములను శాంతింప జేయుము. సూర్య దేవుని జూచి ఇంద్రుడు “ఓ దేవా! జగద్వ్యాపీ! ఓ అశేష జగత్పతీ! నీకు జయమగు గాక” అని స్తుతించెను.
పిమ్మట అత్రి, వసిష్టాది సప్తర్షులు ‘స్వస్తి’ ‘స్వస్తి’ యని స్వస్తి వాక్యములను ఉచ్చరించుచూ వివిధములుగా స్తోత్రములచే స్తుతించిరి. ప్రసన్నచిత్తులై వాలఖిల్య గణాలు వ్రాయ బడిన భాస్కర దేవుని వేదోక్త, అధ్య ఋక్కుల ద్వారా ఈ విధముగా స్తుతింప సాగిరి. ఓ నాధా! నీవు ముముక్షు పురుషుల యొక్క ఏకైక లక్ష్యము. మరియు కర్మకాండ యందు ప్రవృత్తులగు జీవ కోటికి గతివి నీవే. ఓ దేవేశా! ఓ జగన్నాధా! ప్రజలందరికి, మాకు మరియు మా ద్విపద చతుష్పదుల యొక్క జయమును కలుగ చేయుము. తదనంతరము విధ్యాధర, యక్ష, రాక్షస, పన్నాగా గణాలు శిరస్సు లందు అంజలి ఘటించి ప్రణమిల్లిరి.
ఓ భూతభావనా! నీ తేజస్సు సమస్త భూతములకు సహింప గలదిగా నుండు గాక. అని ఈ విధముగా మనస్సునకు కర్ణములకు సుఖకరమగు వచనములను పలుక సాగిరి. పిమ్మట షట్జ, మధ్యమ, గాంధార అను ఈ మూడు గ్రామము లందు గాన విశారదులగు, హాహా, హూహూ, నారద, తుంబురులను ఇత్యాది సంగీత విడ్వద్గణాలు, మూర్చనా, తాళాది, సంప్రయోగాను సారము రవి సమ్ముఖమున సుఖ దాయకమగు సంగీతము ప్రారంభించిరి. విభావసుడు ఈ విధముగా లిఖ్యమానుడగు చుండగా పిమ్మట విశ్వాచి, ఘృతాచి, ఊర్వశి, తిలోత్తమ, మేనక, సహజన్య, రంభ, ఇత్యాది అప్సరసలు హావ, భావ, విలాసాది, అనేక అభినయాలతో నృత్యము చేయ సాగిరి.
వేణువు, వీణ, ఝర్ఘర, పణవ, పుష్కర, మృదంగ, పటహ, ఆనక, దేవదుందుభులు, శంఖము మొదలగు వందల వేల వాయిద్యములు ధ్వనింప నుగెను. ఇట్లు గంధర్వుల సానము, స్వర్గ లోక మందలి అప్సరసల నృత్యము, మరియు తూర్య వాయిద్యముల వంటి అనేక శబ్దాదులచే ఆ సమయమున జగత్తంతయు కోలాహలముతో నిండి యుండెను. పిమ్మట దేవతలందరు చేతులు జోడించి భక్తితో నమ్రతా మూర్తులై లిఖ్యమాన సహస్రాంశునకు ప్రణమిల్లిరి. దేవతాదుల సమాగమము వలన ఆ సమయ మందలి కోలాహల సమయమున విశ్వకర్మ నెమ్మది నెమ్మదిగా తేజస్సును క్షీనింప జేసెను. శిశిర, వర్ష, గ్రీష్మ కాలములకు హేతు స్వరూపములగు హరి, హర, బ్రహ్మాదులచే స్తుతింప బడిన భానుదేవుని భాను తను లేఖనము అను కథను వినుటచే మరణాంతరము సూర్య లోకమును పొందుదురు.
