మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము
130 - దమ చరిత్రము
మార్కండేయుడు:
మార్కండేయుడు:
నరిష్యన్తుని పుత్రుడు దముడు అతడు దుర్వృత్తులగు శత్రువులను అణచి వేయును. అతనికి ఇంద్రునితో సమానమగు బలము, మునులతో సమానమగు దయ మరియు శీలము ఉన్నది. నరిష్యంతుని వలన బభ్రుని కన్య ఇంద్రసేన గర్భము నుండి దముడు జన్మించెను. ఈ మహాశయుడు తొమ్మిది సంవత్సరములు తల్లి యొక్క జఠర మందు ఉండెను. ఈ రాకుమారుడు ఈ విధముగా జఠర మందున్న సమయమున ఈతని తల్లి ఇంద్రియ నిగ్రహమును అవలంభించ వలసి వచ్చెను. మరియు “ఈ రాజపుత్రుడును స్వయముగా ఇంద్రియ నిగ్రహ శీలుడే యగును” అని తలచి త్రికాలజ్ఞులగు పురోహితులు ఆ నరిష్యంతుని కుమారునికి “దముడు” అని నామకరణము చేసిరి. రాజపుత్రుడగు దముడు అసుర రాజగు వృషపర్వుని వద్ద సంపూర్ణముగా ధనుర్వేద విద్యలను గ్రహించెను.
మరియు తపోవన నివాసి, దైత్య శ్రేష్టుడు అగు దుందుభి వద్ద నుండి అన్ని అస్త్ర ప్రయోగములు మరియు సంహార సహితముగా గ్రహించెను. అతడు శక్తి అను ముని వద్ద సంపూర్ణ వేద వేదాంగములు మరియు ఆత్మ వంతుడైన ఆర్ష్ణిషేణుని వద్ద యోగ విద్యను గ్రహించెను. దశార్దాధిపతి, మహాబలుడు నగు చారుకర్ముని కన్య “సుమన” తండ్రి ద్వారా స్వయంవర మందు నియోగింపబడి తన కోరికపై వచ్చియున్న రాజు లందరి యెదుటనే మహా బలవంతుడు, అస్త్ర ధారుడు అగు దముని తన ఇష్టానుసారము ఆ మహాత్ముని పతిగా వరించినది. మద్రా రాజ పుత్రుడు, మహా బలవంతుడు నగు మహానందుడు, విదర్భాదిపతి సక్రందుని పుత్రుడగు వపుష్మానుడు మరియు మహాధనుడను పేరు గల ఉదార చేతనుడగు రాజు యొక్క పుత్రుడు ‘సుమన’ యడల అనురాగము కలిగి యుండిరి.
కాని దుష్టులగు వైరులను అణచి వేయు నట్టి ఆ దముని రాజ కన్య వరించినది. అది చూచి వారు కామ బాణములచే మోహితులై పరస్పరము ఈ విధముగా పరామర్షించు కొనసాగిరి. “మనము ఈ రూపవతి యగు కన్యను ఇతని వద్ద నుండి బలవంతముగా గ్రహించి మన గృహమునకు తీసుకొని పోవుదము” “పిమ్మట ఈ వరారోహ స్వయంవర విధానానుసారము మనలో ఎవరిని ఇచ్చగించునో, వారికి ఈ కన్య విధానముగా భార్య యగును.” మరియు ఒకవేళ ఈ మదిరేక్షణ మనలో ఎవరినీ కూడా తన ఇష్టానుసారముగా గ్రహింపని యెడల, మనలో ఎవరు ఆ దముని సంహరించునో, వానికి ఈ కన్య భార్య యగును.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఆ రాజ పుత్రులు మువ్వురు ఈ విధముగా నిశ్చయించుకొని దముని పార్శ్వ భాగ మందున్న ఆ సుందరిని గ్రహించిరి. అట్లు జరుగగానే దముని వైపు ఎంతో మంది రాజులు నిందించు చుండిరి. మరికొందరు రాజులు కోపచిత్తులైరి. ఇంకొందరు మధ్యస్థము అవలంభించిరి. ఓ మహామునీ! అటు పిమ్మట ఆ రాజు లందరు నాలుగు వైపుల స్థితు లగుట చూచి వ్యాకుల చిత్తుడై దముడు వారితో ఇట్లనెను.
దముడు:
దముడు:
“ఓ భూపాలులారా! స్వయంవరమును ఏ ధర్మ కార్యము లందు లెక్కించుదురు? వాస్తవానికి అది ధర్మమా? లేక అధర్మమా? మీరు ఈ స్వయంవర మందు ప్రాప్తించిన కన్యను బలవంతముగా గ్రహించిరి. ఒకవేళ స్వయంవరము అధర్మము నందు లెక్కించినచో, దీని వలన నేను చేయవలసిన దేమియు లేదు. ఈమె అన్యుల భార్య యగును. లేక ఈ స్వయంవరమును మీరు ధర్మముగా నిశ్చయించినచో, ఈ శత్రు లాంచితమగు ప్రాణధారణ యొక్క ఆవశ్యకత ఏమున్నది?
ఓ మహామునీ! అనంతరము దశార్నాధిపతి, మహారాజు నగు చార్మువర్మ సభను నిశ్శబ్దముచేసి ఇట్లు పలికెను. “ఓ రాజులారా! దముడు ధర్మా ధర్మ సంబంధమున ఏ విషయమును చెప్పెనో, మీరందరూ దాని సంబంధమున దేని వలన మీ ధర్మమునకు లోటు కలుగదో, అట్టి దానిని తెలుపుడు.”
మార్కండేయుడు:
మార్కండేయుడు:
“అప్పుడు చాలా మంది రాజులు ఆ రాజుతో నిట్లు పలికిరి. పరస్పరానురాగము వలన గాంధర్వ వివాహము సంపన్న మగును.” ఈ వివాహము క్షత్రియుల పక్షమున శ్రేష్ఠము. సూద్ర వైశ్యుల పక్షము నందు యీ విధానము లేదు. దమునితో మీ కుమార్తె యొక్క గాంధర్వ వివాహము సంపన్న మయ్యెను. అందువలన ఓ రాజా! పైన చెప్పిన ధర్మానుసారము మీ కుమార్తె దమునికి భార్య అయినది. ఎవరు కామాసక్తు లగుదురో వారు మొహమునకు వశులై ఈ విధానమును విరోదించుదురు.
ఓ విప్రుడా! పిమ్మట విపక్షమున గల రాజులు మహాత్ముడగు దశార్నాధిపతితో నిట్లు పలికిరి. “వీరు మోహ వశులై ఏమేమో చెప్పు చున్నారు. యీ గాంధర్వ వివాహము క్షత్రియుల పక్షమున ప్రశస్త మైనది కాదు. అంతియే గాక అన్య వివాహములును ప్రశస్తములు కావు. కేవలము క్షత్రియులకు రాక్షస వివాహ మొక్కటియే ప్రసస్త మైనది. “ఓ అవనీశ్వరులారా! ఏ పురుషుడు ఎదుటి పక్షము వారిని నాశనము చేసి బలాత్కారముతో ఈ కన్యను గ్రహింప గలడో, రాక్షస వివాహ విధానానుసారము ఈ కన్య ఆతనిని పొందును.” “క్షత్రియుల సంబంధమున ఈ ఇద్దరి వివాహ మధ్యమున ఎప్పుడయితే రాక్షస వివాహమే ప్రధాన మగునో, అప్పుడు మహానందుడు, మొదలగు రాజ పుత్రులు ధర్మ వ్యవహారమునే చేసిరి.”
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఎవరు మొదటి రాజుల ఎదుట పరస్పరానురాగము మరియు జాతి ధర్మ విషయ సంబంధమగు వచనములు చెప్పిరో, ఆ రాజు లందరు తిరిగి ఇట్లు చెప్పసాగిరి.
“నిజమే క్షత్రియుల పక్షమున రాక్షస వివాహము ప్రశస్తమైనది. మరియు శ్రేష్టమగు విధానము. కాని ఈ రాజ కన్య తండ్రి ఆధీనములో నుండి యౌవనావస్థ యందు దముని వరించెను.” పితృ పక్షము వారిని ఓడించి కన్యను గ్రహించి నట్లయితే దానిని రాక్షస వివాహమని అందురు. కాని పతి యొక్క హస్తగత మగు కన్యను హరించుట వలన అది రాక్షస వివాహము కాదు. రాజు లందరూ చూచు చుండగా ఎప్పుడయితే సుమనా దేవి దమునిని వరించినదో, అప్పుడు ఈ వివాహము గాంధర్వ విధానముగా సంపన్న మైనది. రాక్షస వివాహము కాదు. వివాహిత కన్యకు కన్యాత్వము ఉండదు. ఓ రాజులారా! వివాహము సంబంధము చేతనే కన్యా సంబంధము తెలుసుకొన దగుచున్నది. ఎవడైతే దముని యొక్క హస్తము నుండి బల పూర్వకంగా గ్రహించుట యందు ఉద్యుక్తులై యుండునో వారు బల మందలి గౌరవముచే అట్లు చేసినను అది మంచి పని కాదు.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
దముడు యీ మాటను విని కోపముచే ఎఱ్ఱ బడిన నేత్రములు కలవాడై ధనుష్టంకారము చేసి ఇట్లు పలికెను. నేను చూచు చుండగా బలవంతుడైన వాడు బలాత్కారముగా నా భార్యను అపహరించిన యెడల అప్పుడు నేను నపుంసకుడనై జన్మించెదను. నా కుల గౌరవము నా భుజ బలము ఇంకా ఏమున్నది? నేను జీవించి యుండగా ఈ మూఢుడు బలపూర్వకముగా నా భార్యను అపహరించుకు పోయినచో నా అస్త్రములు, శౌర్యము, శర సమూహము శరాసనము వ్యర్థములు మహాత్ముడగు మర్తు మహారాజు యొక్క వంశ మందు నేను జన్మించుట వ్యర్థ మగును. అట్టి నా జన్మ నిరర్థకము. బలవంతుడు శతృ దమనుడునగు దముడు యీ మాట చెప్పి మరల మహా నందుడు మొదలగు సమస్త రాజులతో ఇట్లనెను. ఓ రాజులారా ! యీ కన్య అత్యంత మనోహర మదిరేక్షణ సత్కులోత్పన, సుందరీ, బాలిక, ఎవరికి భార్య కాదో వారి జన్మ నిరర్థకము.
మీరందరూ ఈ ప్రకారం ఆలోచించుకొని ఎవరు నన్ను ఓడించి యీమెను భార్యగా స్వీకరించ గలరో వారు యుద్ద మందు ప్రయత్నము చేయుడు. దముడు యిట్లు చెప్పి ఆ కాలమున వృక్షములను చీకటి క్రమ్మినట్లు రాజులను బాణ వర్షముచే ఆచ్చాదించెను. అపుడు అందరు రాజులు కూడ శరములు, శక్తులు, యష్టులు, ముద్కరములు మొదలగు వాటిని వేయసాగిరి. కాని దముడు లీలా పూర్వకముగా అన్ని అస్త్రములను ఖండించెను. ఓ మునీశ్వరా! ఆ సమయ మందు రాజ సమూహము దముడు వేయుచున్న అస్త్రములను ఖండించెను. మరియు నరిష్యంత పుత్రుడగు దముడు కూడా వారి సమస్త అస్త్రములను చేదించెను.
రాజ పుత్రులతో దమునకు ఈ ప్రకారముగా జరుగు చున్న సమయ మందు ఖడ్గ పాణియై మహానందుడు దమునకు సమ్ముఖముగా వచ్చెను. దముడు ఆ మహా యుద్ధరంగ మందు ఖడ్గ పాణియై వచ్చుచున్న వానిని చూసి ఏ ప్రకారముగా ఇంద్రుడు జలమును వర్షించునో, ఆ ప్రకారంబుగా బాణముల వర్షమును కురిపించెను. మహానందుడు ఆ కాలమున ఖడ్గముతో అతడు వేయుచున్న అస్త్ర సమూహమును, శర జాలమును చేదించెను. హస్త లాఘవముచే అతడు ఇట్లు శీఘ్రముగా చేయ గలిగెను. ఏ రాజులు కూడ ఇట్లు చేయలేదు. పిమ్మట మహా వీర్యవంతుడగు మహానందుడు క్రోధముతో దముడి యొక్క రథము మీదకి దూకి యుద్ధము చేయ నారంభించెను. మహానందుడు చాలా సేపు యుద్ధము చేసిన తరువాత దముడు హస్త లాఘవముచే అతని యొక్క హృదయమునకు కాలాగ్నితో సమానము, తేజో యుక్తమునగు బాణమును ఒదిలెను.
మహానందుడు హృదయము నందు గుచ్చు కొనిన యా బాణమును తనంతట తానే లాగించుకొని విభిన్న హృదయముతో దముని మీదకి ఉజ్జ్వల మగు కత్తిని వేసెను. దముడు పిడుగుతో సమానమగు ఆ కత్తిని శక్తి బాణమును వేసి వెంటనే వేతసపాత్ర బాణముచే మహానందుని శిరస్సును ఖండించెను. మహానందుడు హతుడైన పిమ్మట చాలా మంది రాజులు యుద్ధము నుండి తిరిగి పోయిరి. కుండినాది పతి యగు వపుష్మంతుడు అను రాజు మాత్రము నిలబడి యుండెను. దాక్షిణాత్య భూపాల కుమారుని బలము యొక్క గర్వముచే మదించిన వపుష్మంతుడు దమునితో యుద్ధము చేయ నారంభించెను. రణ రంగమందు దముడు తక్షణమే యుద్ధము చేయుచున్న వపుష్మంతుని యొక్క ఖడ్గమును సారథి యొక్క శిరస్సును ధ్వజమును ఖండించెను.
అపుడు వపుష్మంతుడు ఖడ్గము చేదింప బడిన పిమ్మట బహు కంటకయుత మగు గదను గ్రహించి వేయ బోవగా అతని చేతిలో నుండగానే దముడు చేదించి వైచెను. తిరిగి వపుష్మంతుడు ఒక గొప్పదగు అస్త్రమును గ్రహించి వేయబోవు చుండగానే దముడు బాణములచే ఖండించి అతనిని భూమిపై పడవేసెను. రాజ పుత్రుడగు వపుష్మంతుడు భూమి యందు పడి విహ్వలాంగుడై శరీరము కంపించు చున్నందున యుద్ద మండలి ఆశ వదిలెను. మనస్వియగు దముడు అతని యవస్థను జూచి వదిలి పెట్టెను. ప్రసన్న చిత్తుడై సుమనా దేవిని తీసికొని పోయెను. అనంతరము దశార్ణాధిపతి ప్రసన్న చిత్తుడై దమునకు సుమనా దేవికి విధి పూర్వకముగా వివాహము చేసెను.
దముడు వివాహ మైన పిమ్మట కొంత కాలముండి భార్యా సహితుడై తన గృహమునకు బోయెను. దశార్నాధిపతి ఆ సమయమున అనేకములగు ఏనుగులు, గుర్రములు, రథములు, గోవులు, ఖరములు, ఒంటెలు, దాస దాసీ పరివారము, వస్త్రములు, అలంకారములు, ధనుర్భాణములు మొదలగు అమూల్యములగు వస్తువులను ప్రీతి దాన పూర్వకముగా ధన రత్నాదులతో నింపిన భాండములతో సాగ నంపెను.
