మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము
111 - నాభాగ చరిత్రము
మార్కండేయుడు:
మార్కండేయుడు:
అనంతరము పుత్రునితో యుద్దమును విరమించు కొనెను. మరియు నా రాజ కుమారుడును ఆ వైశ్య కన్యను వివాహమాడి వైశ్యత్వమును పొందెను. అప్పుడతడు వైశ్యత్వమును పొంది రాజు వద్దకు వెళ్లి ఇట్లడిగెను. ఓ భూపాలా ! ఇప్పుడు నేనేమి చేయ వలెనో, దానిని ఆజ్ఞాపింపుడు.
రాజు:
రాజు:
“బాభ్రవ్యాధి ఏ సమస్త తపస్వులు ధర్మాదికరణము నందు నియమించ బడిరో, వారు ఏ కర్మను ధర్మమని చెప్పి ఆజ్ఞాపించుదురో, దానిని ఆచరింపుము.”
మార్కండేయుడు:
మార్కండేయుడు:
అప్పుడా సభ యందున్న మునులు “పశు పాలనము, వ్యవసాయము, వాణిజ్యము అను ఈ కర్మలే నీకు ఉత్తమ ధర్మమై ఉన్నవి.” అని పలికిరి. పిమ్మట ఆ రాజ పుత్రుడు తన ధర్మమును వీడి రాజు యొక్క ఆజ్ఞానుసారము ఆ ధర్మవాదులు నిర్దేశించిన ధర్మమును ఆచరింప సాగెను.
కొంత కాలమునకు అతనికి “భలందను”డను పుత్రుడు కలిగెను. అతని తల్లి “ఓ కుమారా ! గోవులను పాలించు చుండుము.” అని పలికి గోపాలన యందు నియమించెను. అప్పుడతడు తల్లి ఆజ్ఞ ప్రకారము తల్లికి నమస్కరించి హిమాలయ పర్వత వాసియైన “నీపు” డను రాజర్షి వద్దకు వెళ్ళెను. భలందనుడు రాజర్షి సమీపమునకు వెళ్లి యధావిధిగా చరణములకు వందన మొనర్చి ఇట్లు పలుక సాగెను. హే భగవాన్
నా తల్లి నన్ను “గోపాలకుడ వగుము” అని ఆజ్ఞాపించినది. పృథ్వీ పాలనయే నా అవశ్య కర్తవ్యము. కాని ఈ గోపాలనము ఎట్లు స్వీకరించుదును? ఇప్పుడు పృథ్వీ పాలనను నేను స్వీకరించినను బలవంతులగు జ్ఞాతులచే రాజ్య మంతయు ఆక్రమింప బడి యున్నది.
అందు వలన ఓ ప్రభూ ! మీ అనుగ్రహము వలన నేనెట్లు పృథ్వీ పాలన చేయగలనో, దానిని ఈ ప్రణతునకు ఆజ్ఞాపించుము. నేను దానిని చేయుదును.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఓ బ్రాహ్మన్ ! అప్పుడు రాజర్షి యగు నీతడు మహాత్ముడగు భలందనునకు సంపూర్ణముగా అస్త్ర విద్యలను ప్రసాదించెను. ఓ ద్విజుడా ! భలందనుడు అస్త్ర విద్యా లాభమును పొంది రాజర్షి యొక్క ఆజ్ఞను తీసుకొని పితృ వ్యపుత్రులగు వసురాతుడు మొదలగు వారి సమీపమునకు వెళ్ళెను. మరియు తాత గారి రాజ్యము నందలి అర్థ భాగము నిమ్మని ప్రార్థించెను. తాత గారు “నీవు వైశ్య పుత్రుడవు. రాజ్య పాలన నీకు ఉచితము కాదు “అనిరి. అప్పుడు అస్త్ర లాభమును పొందిన భలందనుడు కృద్ధుడై అస్త్రములను వర్షించుచూ వసురాతుడు మొదలగు వారితో యుద్దమును ప్రారంభించెను.
ఆ యుద్ధమున ధర్మాత్ముడగు భలందనుడు ధర్మ యుద్ధము తోనే సేనలందరను శస్త్రములచే గాయపరచి పరాజితులను చేసి భూమి నాక్రమించెను. భలందనుడు ఈ విధముగా శత్రువులను జయించి పృథ్వీ రాజ్యము నంతయు తండ్రిగారి పాదములకు సమర్పించెను. కాని తండ్రి దానిని గ్రహింపక భార్య ఎదుటనే పుత్రునితో నిట్లు పలికెను.
నాభాగుడు:
నాభాగుడు:
“కుమారా! భలందనా! పూర్వీకులచే శాసింప బడిన ఈ రాజ్యమును నీవే అనుభవింపుము.” “నేను రాజ్య పాలన యందు అసమర్థుడను అని కాదు”. పూర్వము నేను తండ్రి గారి ఆజ్ఞ యందుండియు తండ్రి గారు సమ్మతించక పోయిననూ, వైశ్య కన్యను గ్రహించిన కారణమున వైశ్యత్వమును పొందితిని. అందుచే రాజ్య భోగములకు అధికారిని కాలేక పోయితిని. ఇప్పుడు నేను తండ్రి గారి ఆజ్ఞను ఉల్లంఘించి భూమిని పాలించినచో, విధ్యా ప్రతిజ్ఞ కారణమున రాజు కూడా ప్రళయ కాల పర్యంతము పుణ్య లోకములను పొంద లేడు. మరియు నాకును నూరు కల్పముల యందును ముక్తి లభింపదు.
మరియు నా వంటి ఆజ్ఞాలంఘన చేయు పురుషునకు దుర్బులు నిపర వర్జిత భోగ విషయముతో సమానముగా నీ బాహు బలముచే జయింప బడిన రాజ్యము ననుభవించుట ఉచితము గాదు. నీవే స్వయముగా రాజ్యమును పాలించుము. లేక తిరిగి దాయాదులకు ఇచ్చివేయుము. నాకు తండ్రి యాజ్ఞ పాటించుటయే ఉత్తమము. “అంతే కాని రాజ్యమేలుట ఉచితము కాదు.”
మార్కండేయుడు:
మార్కండేయుడు:
అని పలికిన భర్త మాటలు వినిన సుప్రభ అను అతని భార్య నవ్వి ఇట్లనెను. ఓ రాజా! సమృద్ధకారి యగు ఈ రాజ్యమును గ్రహింపుము. మీరు వైశ్యులు కారు. మరియు నేనును వైశ్య కుల మందు జన్మింప లేదు. మీరును క్షత్రియులే మరియు నేనును క్షత్రియ కుల మందు జన్మించిన దాననే. పూర్వము సుదేవుడను విఖ్యాత రాజుండెను. ధూమ్రాశ్వుడను రాజు యొక్క పుత్రుడైన నలుడు అతని మిత్రుడు.
ఓ పార్థివా ! ఒక రోజున వైశాఖమాస మందు స్నేహితునితో భార్యలతో గూడి ఆమ్రవన మను పేరుగల వనమునకు విహరించుటకు బోయెను. పిమ్మట అచ్చట మిత్రునితో భార్యా సహితుడై అనేకములగు పానములతో భక్షములను భుజించెను. అనంతరము పుష్కరిణీ తీరమున చ్యవన మహర్షి యొక్క కుమారుడగు ప్రమతి మహర్షి యొక్క మనోహరమగు భార్యను చూసెను. ఆమె ఒక రాజ కన్య. అప్పుడు రాజు యొక్క స్నేహితుడు దుష్ట బుద్ధియు నగు నలుడు ఆమెను బలాత్కారముగా గ్రహించబోగా ఆమె రక్షింపుము, రక్షింపుము అని రాజుతో మొర బెట్టుకొనెను. అప్పుడామె భర్తయగు ప్రమతి మహర్షి దూరముగా రోదన శబ్దమును విని “ఏమి జరిగినది?” అని పలుకుచూ త్వరితముగా అచ్చటకు బోయెను. పిమ్మట అచ్చటకు బోయి చూడగా, సుదేవుడను రాజు కూర్చొని యుండ అతని సమక్షమున దురాత్ముడగు స్నేహితుడు బలాత్కరించుట చూసెను.
అప్పుడు ప్రమతి సుదేవునితో ఇట్లనెను. ఇతనిని శాసించుము. నీవు రాజువు. నీవే శాసించ దగిన వాడవు. అందువలన ఈ దుష్టుడగు నలుని శిక్షించుట ఉచితము.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ప్రమతి ఈ కారణముగా చెప్పిన ఆర్త వచనమును విని రాజగు సుదేవుడు నలుని యందలి గౌరవముచే ఇట్లు పలికెను. నేను వైశ్యుడను. నిన్ను రక్షించ వలెనన్న వేరొక క్షత్రియుని వద్దకు బొమ్ము. ప్రమతి సుదేవుని మాటలను విని అత్యంత కృద్ధుడై తన తేజస్సుచే దహించు వానివలె, నేను వైశ్యుడనని పలికిన ఆ రాజుతో ఇట్లనెను.
ప్రమతి:
ప్రమతి:
అట్లే యగుదువు గాక. ఎందు వలన యనగా ఆర్త జనుల రక్షణ కొరకే క్షత్రియ నామము కలిగినది. ఆర్త శబ్దము లేకుండుట కొరకే క్షత్రియులు శాస్త్రమును ధరించుదురు. అందు వలన నీవు ఇప్పటి నుండి క్షత్రియుడవు గాకుందువు గాక. కులాధముడగు వైశ్యుడ వగుదువు గాక.
