మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము

Table of Contents

83 - దేవీ మాహాత్మ్యము నందలి ధూమ్రలోచన వధ.

 

ఋషి:

ఋషి:

దేవి ఈ ప్రకారముగా పలికిన పలుకులు వినిన దూతయగు సుగ్రీవుడు అత్యంత కోపముతో దైత్యేశ్వరుని వద్దకు పోయి వృత్తాంత మంతయు సవిస్తరముగా చెప్పెను. దూత మాటలు విని రాక్షస రాజగు శంభుడు క్రోధము గలవాడై రాక్షస సేనాధిపతి యగు దూమ్రలోచనునితో నిట్లు చెప్పెను. దూమ్రాలోచనా! నీవు మన సైన్యముతో నచ్చటికి పొమ్ము. ఆ దుష్ట యువతిని జుట్టుపట్టి ఈడ్చి విహ్వలురాలిని జేసి శీఘ్రముగా తీసికొని రమ్ము. ఆమెను రక్షించుటకై ఎవడైన ప్రయత్నించినచో వాడు దేవుడు గాని యక్షుడు గాని, గంధర్వుడు గాని మరి ఎవడైనను గాని వానిని సంహరింపుము.

 

ఋషి:

ఋషి:

పిమ్మట ఆ దూమ్రలోచనుడు ఆ రాక్షసుని యాజ్ఞచే హిమాచల మందు నివసించి యున్న జగదంబ సమీపమునకు అరవై వేల రాక్షస సైన్యముతో త్వరగా బోయెను.

 

పిమ్మట దూమ్రలోచనుడు హిమాచలమున నివసించి యున్న దేవిని చూచి బిగ్గరగా “దేవీ! శుంభ, నిశుంభుల సమీపమునకు నడువుము.” అని పలికెను. నీవు ఈ సమయమున ప్రీతి పూర్వకముగా మా ప్రభువగు శంభుని వద్దకు రానిచో నేనే జుట్టు పట్టుకొని బలాత్కారముగా యీడ్చుకొని తీసుకొని పోయెదను.

 

శ్రీదేవి:

దేవి:

దైత్యరాజగు శుంభుడు నన్ను తీసుకొని రమ్మని నిన్ను పంపెను. నీవు బలవంతుడవు. సేనాసహితముగా వచ్చితివి. నీవు బలాత్కారముగా తీసికొని పోయినచో నేను నిన్ను ఏమి చేయ గలను?

 

ఋషి:

ఋషి:

దేవి ఇట్లు చెప్పుచుండ దూమ్రాలోచానుడు అను పేరు గల యా రాక్షసుడు ఆమె మీదకు పరుగు పరుగున బోయెను. అప్పుడు అంబికా దేవి హుంకారము చేసి ఆ రాక్షసుని భస్మము చేసెను. అనంతరము ఆ రాక్షస మహా సైన్యము క్రోధముతో దేవి మీదకు బోవగా, అంబికా దేవి తీక్ష్ణమగు బాణములను, శక్తులను, పర్వశ్వధములను వర్షించెను.

 

అప్పుడు దేవి వాహనమగు సింహము జూలును కోపముతో కంపింప జేసి భయంకరముగా గర్జించుచూ రాక్షస సేన మీద పడెను. కొలది దైత్యులను కరప్రహారము చేతను, కొందరిని నోటితోను, మహాసురులగు మరికొందరిని పాదముల చేతను ఆక్రమించి చంప సాగెను. మరికొందరు రాక్షసుల యొక్క గుండెలను గోళ్ళతో చీల్చెను. మరి కొందరి మస్తకములను ప్రహారముల ద్వారా దేహము నుండి వేరు చేసెను. మరి కొందరి రాక్షసుల యొక్క బాహువులను శిరస్సులను ఖండించి వేసెను. మరియు జూలును ఆడించుచు రాక్షసుల శరీర మందలి రక్తమును త్రాగి వేసెను. క్షణ కాలములోనే దేవి వాహనమగు మహా సింహము అత్యంత క్రోధముతో ఆ రాక్షస మహా సైన్యమును నాశనము చేసి వైచెను.

 

దేవి అసురుడగు దూమ్రలోచనుని చంపుటయు, దేవీ వాహనమగు సింహము సంపూర్ణముగా సైన్య మంతయు చంపుటయు, వినిన దైత్యరాజగు శంభుడు క్రోధముచే పెదిమలు కంపించు చుండగా ‘చండ’, ‘ముండ’ లను మహా రాక్షసులను ఆజ్ఞాపించెను. చండ ముండులారా! మీరు చాలా సైన్యమును వెంట బెట్టుకొని దేవి యున్న చోటుకు పొండు. ఆ యువతిని శీఘ్రముగా తీసుకొని రండు. ఆ స్త్రీ యొక్క జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రండు. కానిచో బంధించి తీసుకొని రండు. ఈ ప్రకారము తీసుకొని వచ్చుటకు మీరు అసమర్థులైన యెడల సేనాసహితులై సమస్త అస్త్రములతో ఆమెను చంపి వేయుడు. ఆ దుష్టురాలిని ఆ సింహమును చంపిన తర్వాత ఆ అంబికా దేవిని బంధించి త్వరితముగా తీసుకొని రండు.