మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము

Table of Contents

82 - దేవీ మాహాత్మ్యము నందలి దేవీ దూత సంవాదము

 

ఋషి:

 

ఋషి:

పూర్వ కాలమున శుంభ, నిశుంభ లను పేరు గల ఇద్దరు రాక్షసులు అత్యంత బలము గల వారై ఇంద్రుని యొక్క త్రిలోక రాజ్యమును, సంపూర్ణ యజ్ఞ భాగములను అపహరించిరి. ఆ శుంభ నిశుంభులు సూర్య చంద్ర, కుబేర వరుణుల యొక్క కార్యములను, సంపూర్ణముగా నిర్వహించ సాగిరి. మరియు వాయు, అగ్ని దేవతల అధికారములను చేబట్టిరి. ఇంతియే కాక సమస్త దేవతల అధికారములను తమ హస్త గతము చేసి కొనిరి పిమ్మట ఆ యిద్దరు రాక్షసుల వలన అధికారములు పోగొట్టు కొనిన వారై తిరస్కరింప బడిరి. రాజ్య హీనులు, పరాజితులును అయ్యిరి. ఇట్లు ఆ మహా రాక్షసులచే నిరాకృతులు, హృతాధికారులు నగు సమస్త దేవతలు అప్పుడు అపరాజితా దేవిని స్మరణ చేయ సాగిరి. “ఆపత్కాలము లందు నన్ను స్మరణ చేసిన యెడల తక్షణమే మీ సమస్తము లగు ఆపదలను తొలగించెదను అని జగదంబ మనకు చెప్పెను గదా! కావున ఇప్పుడు ఆమెను స్మరణము చేయుదము.”

 

 

దేవతలు ఈ ప్రకారము తలచి పర్వత శ్రేష్ఠమగు హిమాలయమునకు బోయి విష్ణు మాయా స్వరూపిణి యగు జగదంబను స్తుతి చేయ సాగిరి.

 

దేవతలు:

దేవతలు:

దేవికి నమస్కారము. మహాదేవికి వందనము. శివకు సర్వదా నమస్కారము. ప్రకృతికి నమస్కారము. మేము ప్రణుతులమై ఆ దేవికి నమస్కరించు చున్నాము. రౌద్ర స్వరూపిణికి నమస్కారము. నిత్య, గౌరీ మఱియు ధాత్రికి పలు మారులు నమస్కారములు. జగత్తుకు ప్రతిష్ఠా స్వరూపిణి యగు దేవికి మఱియు కృత్యా స్వరూపిణి యగు దేవికి నమస్కారము. నమస్కారము. ప్రకాష రూప, చంద్ర రూప, పరమానంద రూప యగు దేవికి ఎల్లప్పుడు నమస్కారములు చేయు చున్నాము. కళ్యాణి, బుద్ది రూపయగు దేవికి నమస్కారము. సిద్ది రూపయగు దేవికి పెక్కు మారులు నమస్కారము చేయు చున్నాము. నైరృతి స్వరూపిణి యగు దేవికి నమస్కారము. రాజ్య లక్ష్మికి నమస్కారము. శర్వాణి స్వరూప యగు నీకు నమస్కారము నమస్కారమ. దుర్గ, దుర్గాపార, సారా, సర్వకారిణి, ఖ్యాతి, కృష్ణ, ధూమ్రాయగు దేవికి మేము ఎల్లప్పుడు నమస్కరింతుము.

 

 

అత్యంత సోమ్యురాలు, అతి రౌద్ర యగు ఆ దేవికి అత్యంత వినయముతో మాటి మాటికి నమస్క రించుదుము. జగత్తుకు ప్రతిష్ఠా రూప మగు దేవికి నమస్కారము కార్య రూపిణి యగు దేవికి నమస్కారము. సర్వ ప్రాణులకు విష్ణు మాయ అను పేరుతో చెప్పబడు దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సర్వ ప్రాణులతో చేతన అను పేరుతో చెప్పబడు ఆ దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సర్వ ప్రాణులలో బుద్ది రూపములో నున్న ఆ దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. ఏ దేవి సమస్త ప్రాణుల యందు ఆకలి రూపముగా నున్నదో ఆ దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సమస్త భూతముల యందు ఛాయా రూపముతో నున్న ఆ దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సమస్త ప్రాణుల యందు శక్తి రూపమున విరాజిల్లుతున్న యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సమస్త భూతము లందు తృష్ణా రూపమున నివసించు చున్న ఆ దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సర్వ భూతముల యందలి క్షాంతి రూపముతో నున్న యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము.

 

ప్రాణులన్నింటిలో జాతి రూపముగా విరాజిల్లుచున్న యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సర్వ ప్రాణులలో లజ్జా రూపములో నివసించు చున్న యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సర్వ ప్రాణుల యందు శాంతి రూపములో నున్న యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సర్వ ప్రాణుల యందు శ్రద్దా రూపములో నున్న యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సర్వ ప్రాణుల యందు కాంతి రూపములో అధిష్ఠించి యున్న యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. సర్వ ప్రాణుల యందు లక్ష్మీ రూపములో నివసించు చున్న యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. ధృతి రూపముగా సర్వ ప్రాణుల యందు యున్న యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. వృత్తి రూపిణియై సర్వ ప్రాణుల యందు విరాజమానురాలగు యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. ఏ దేవి సమస్త ప్రాణుల యందు స్మృతి రూపమున భాసిల్లు చున్నదో యా దేవికి యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము. ఏ దేవి సర్వ భూతముల యందు దయా రూపముతో అవస్థానము చేయు చున్నదో యా దేవికి నమస్కారము! నమస్కారము!! నమస్కారము.

సమస్త ప్రాణుల యందు దయా రూపముగా నున్న యా దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము. నీతి రూపిణియై సర్వ భూత స్థితురాలైన యా దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము. సర్వ భూతముల యందు పుష్టి రూపమున నున్న యా దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము. సమస్త ప్రాణుల యందు మాతృ రూపముగా నున్న యా దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము. సర్వ భూతముల యందు భ్రాంతి రూపముగా నున్న యా దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము. ఏ దేవి సమస్త యింద్రియములకు సమస్త ప్రాణులకూ అధిష్టానమై యున్నదో సమస్త ప్రాణులకు వ్యాప్తి రూపముగా ప్రకాశించు చున్నదో యా దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము. ఏ దేవి చైతన్య రూపముతో సమస్త జగత్తును వ్యాపించి యున్నదో అట్టి దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము. పూర్వ కాలమున మేము అభీష్ట సిద్ది కొరకు ఏ దేవిని స్తుతించితిమో, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు ఏ దేవిని సేవించిరో, ఏ దేవి సమస్త శుభములకు కారణమై యున్నదో, ప్రచండ దుష్ట దైత్యులచే పీడింప బడిన మేము యీ సమయ మందు ఆ దేవికి నమస్కారములు చేయు చున్నాము. భక్తి, నమ్ర శరీరులమై మేము స్మరణ చేసిన తక్షణమే మా యొక్క ఆపదలను నశింప చేయునది యగు నట్టి పరమేశ్వరి మహా దేవి మాకు వివిధము లగు శుభములను కలుగ చేయు గాక. మా సంపూర్ణ విపత్తులను నశింప చేయు గాక.

 

ఋషి:

ఋషి:

 రాజ కుమారా! దేవతలు ఇట్లు స్తుతి చేయు చుండగా ఆ సమయమున పార్వతి దేవి గంగా జలముల స్నానము చేయుటకై వారి కభి ముఖముగా వచ్చెను. సుందర మగు కను బొమలచే శోభాయమాన యగు ఆ పార్వతీ దేవి “మీరు ఎవరిని స్తుతించు చున్నారు?” అని యడిగెను. ఆ సమయము లోనే పార్వతీ దేవి శరీరము నుండి శివా దేవి ఉద్భవించి వారితో ఇట్లు పలికెను. యుద్దమున శుంభునిచే జయింప బడి నిశుంభునిచే గూడ పరాజితు లైన దేవత లందఱు కలసి నన్ను స్తుతించు చున్నారు. అంబికా దేవి పార్వతీ దేవి శరీర కోశము నుండి యుద్భవించెను. ఇందుచే లోకము లందు కౌశికి యను పేరుతో పిలువ బడు చున్నది. ఆ కౌశికీ దేవి యుద్భవించిన తరువాత పార్వతీ దేవి గూడ నల్లటి రూపము గలది ఆయెను. ఆమె అప్పటి నుండి కాళికా దేవి యను ప్రసిద్ద నామముతో వెలుగొందెను. అప్పటి నుండి యామె హిమాచల నివాసిని అయ్యెను. పిమ్మట అంబికా దేవి పరమ మనోహరమగు రూపమును చూచిన శుంభ, నిశుంభుల యొక్క సేవకులగు చండముండులు ఆమె మనోహర రూపమును చూసిరి. అప్పుడు చండముండులు శుంభుని వద్దకు పోయి మహారాజా! అత్యంత మనోహర మయిన దగు ఒకానొక స్త్రీ రత్నము హిమాలయ పర్వతములను ప్రకాశింప జేయుచూ నివసించు చున్నది. అసురేశ్వరా! ఇట్టి ఉత్తమ రూపము ఎవరూ చూచి యుండరు. ఆమె ఎవరో తెలిసుకొని ఆ యువతిని నీవు గ్రహించుము.

 

 

దైతేంద్రా! ఆమె సుందర మయిన అంగములు కలది. స్త్రీ రత్నము, ఆమె దశ దిక్కులను ప్రకాశింప జేయు చున్నది. నీవు ఆమెను చూడ దగినదై యున్నది. ప్రభూ! ముల్లోకము లందును శ్రేష్టము లగు రత్నములు, మణులు, గజాశ్వములు, మొదలగు సమస్తము ఇప్పుడు మీ గృహమున యున్నవి. గజములలో రత్న భూతమగు “ఐరావత” గజము మనోహరమగు “పారిజాత” వృక్షము, అశ్వ శ్రేష్ఠ మగు “ఉచ్చైశ్రవము” ఇంద్రుని వద్ద నుంచి తీసుకొని రాబడినవి. బ్రహ్మ దేవుని యొక్క శ్రేష్టమైన హంస యుక్తము నగు “విమానము” తీసుకొని వచ్చి నీ ముంగిలి వాకిట ఉంచ బడినది. “మహా పద్మము” అను పేరు గల నిధిని నీ సమీపమునకు తీసుకొని వచ్చితిమి. సముద్రుడు వాడని పంకజములు గల “కింజల్కినీ” అను పేరు గల మాలను నీకు సమర్పించెను. వరుణ దేవుడు “కాంచన స్రావి” యను పేరు గల ఛత్రమును నీకు సమర్పించెను. మొదట ప్రజాపతి యెద్ద నున్న శ్రేష్ఠ మగు ‘రథము’ మీ యింటి యందున్నది. ప్రాణమును హరించు యమధర్మ రాజు యొక్క “ఉత్ర్కింతిదా” యను శక్తి మీ వెంట నున్నది. ఈశ్వరా! నీ యొక్క సోదరుడగు నిశుంభునికి “వరుణ పాశము” ఉన్నది. సముద్ర మందు పుట్టిన సంపూర్ణ రత్నములు నీ యింట నున్నవి. వాటి నన్నింటిని నీవు అపహరించితివి. ఈ స్త్రీ రత్నమును ఇప్పుడు నీవు ఎందుకు అపహరించవు?

 

 

దైతేంద్రా! ఈ ప్రకారముగా యీ సమస్త రత్నములు నీవు అపహరించితివి. ఇప్పుడు మంగళ ప్రదు రాలగు ఈ స్త్రీ రత్నమును నీవు ఎందుకు గ్రహించ కూడదు.

 

ఋషి:

 

ఋషి:

చండ ముండులు పలికిన మాటలు విని మహా రాక్షసుడగు శుంభుడు సుగ్రీవుడను పేరు గల దూతను దేవి సమీపమునకు పంపెను.

 

శుంభుడు:

 

శుంభుడు:

నీవు దేవి వద్దకు పోయి నేను చెప్పు నట్లుగా యీ ప్రకారము చెప్పుము. ప్రేమతో శీఘ్రముగా వచ్చు నట్లు చేయుము. ఆమె ప్రసన్ను రాలగు నట్లు మాట్లాడ వలెను. అత్యంత శోభాయ మానమగు పర్వత ప్రదేశ మందున్న దేవి సమీపమునకు బోయి మధుర వచనములుగా అని చెప్పగా, ఆ దూత ఆమెతో ఇట్లు చెప్ప సాగెను.

 

దూత:

 

దూత:

దేవీ! దైత్యాదిపతి యగు శుంభుడు ముల్లోకములకు ప్రభువై యున్నాడు. ఆతడు నీ సమీపమునకు నన్ను దూతగా పంపించెను. ఈ కారణముచే నే నిచటకు వచ్చితిని.

 

సమస్త దేవతలలో నిరంకుశాజ్ఞ గల వాడు. కావుననే సర్వ దేవతలను జయించిన వాడు నగు శుంభుడు నీకు ఏమి చెప్పెనో ఆ మాటలను వినుము. దేవీ! ముల్లోకము లన్నియు సమస్త దేవతలు నాకు వశమై యున్నవి. నేను వేరు వేరుగా సంపూర్ణ యజ్ఞ భాగములను భుజించు చున్నాను. త్రిలోకము లందలి శ్రేష్టములగు రత్నము లన్నియు నా స్వాదీనములో నున్నవి అటులనే దేవేంద్రుని శ్రేష్ఠ మగు ఐరావత గజమును అపహరించితిని. దేవతలు క్షీర సముద్రమును చిలికి నపుడు పుట్టిన ఉచ్చైఃశ్రవమను అశ్వ రత్నమును నాకు సమర్పించిరి. ఇవియే గాక గంధర్వోరగ దేవతలకు రత్న భూతము లగు సమస్త వస్తువులు ఓ శుభ స్వరూపురాలా? నా స్వాధీనములో నున్నవి.

 

 

 

ఋషి:

ఋషి:

యీ ప్రకారముగా దూత చెప్పిన పిమ్మట సమస్త జగత్తును భరించునది భగవతీ, భద్రా, యగు నా దేవి అప్పుడు గంభీరముగా గూఢముగా నవ్వినదై యిట్లు పలికెను. నువ్వు సత్యము చెప్పితివి. నీవు చెప్పిన దాని యందు ఏ కొంచము అసత్యము లేదు. శుంభుడు త్రి లోకములకు అధిపతి. నిశుంభుడు కూడ ఆతడితో సమానము ఇందులో సందేహము లేదు.

 

 

కాని నేను పూర్వము ఒక ప్రతిజ్ఞ చేసితిని. ఆ ప్రతిజ్ఞ చెప్పెదను వినుము. ఏ పురుషుడు నన్ను యుద్ద మందు జయించునో, ఏ పురుషుడు నా దర్పమును పోగొట్టునో, ఏ పురుషుడు లోకములో నాతో సమానమైన బలం కలవాడో, ఆ పురుషుడు నాకు భర్త కాగలడు. అందు వలన మహా సురుడగు శుంభుడు గాని నిశుంభుడు గాని యిచ్చటకు వచ్చెదరు గాక! వారిలో ఎవరు సమర్ధులో, అతడు నన్ను జయించి శీఘ్రముగా వివాహము చేసుకొను గాక! ఆలస్యము చేయుట చేత ప్రయోజన మేమున్నది?

 

దూత:

 

దూత:

దేవీ! నీవు చాలా గర్వించి యున్నావు. నా సమీపమున ఇట్లు వలుకకుము. మూడు లోకములను జయించిన శుంభ నిశుంభుల యెదుట ఏ పురుషులు నిలబడ గలరు? నీ వైతే స్త్రీవై యున్నావు. వారితో నీవు ఎట్లు యుద్దము చేయ గలవు? శుంభ నిశుంభుల యొక్క మాట దూరముగా ఉంచుము. వారి యొక్క అనుచరులు అగు దైత్యుల యొక్క సమ్ముఖ మందు సమస్త దేవతలు కలిసి యుద్దమునకు వచ్చినను యెదుట నిలబడ జాలరు. ఏకాకివి. స్త్రీవైన నీవు ఎట్లు వారి యెదుట నిలబడ గలవు?

 

 

ఇంద్రాది దేవతా గణములు శుంభాది దైత్యుల యెదుట నిలబడి యుండ లేరు. అట్టి స్థితిలో స్త్రీవై యుండి వారి సంముఖము నకు ఎట్లు వెళ్ళ గలవు. అందు వలన నీవు నేను చెప్పిన రీతిగా శుంభ నిశుంభుల యొక్క సమీపమునకు నడువుము. అట్లు రానిచో నేను నీ జుట్టు పట్టుకొని యీడ్చుకొని పోవుదును. నీ సమస్త గౌరవ ప్రతిష్ఠలు నష్టమగును.

 

శ్రీదేవి:

శ్రీదేవి: