మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము
91 - దక్ష, బ్రహ్మ, రుద్రా, కాచ్య మన్వంతం వృత్తాంతములు.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఓ మునిసత్తమా! ఈ సావర్ణిక మన్వంతరము నీకు చెప్పబడెను. మరియు ఈ ప్రసంగము నందు దేవీ మాహాత్మ్యము, మహిషాసుర వినాశనము, మహా యుద్ద మందు మాతృ గణాల యొక్క ఉత్పత్తి, చాముండ యొక్క ఉత్పత్తి, శివ దూతి యొక్క మాహాత్మ్యము. శుంభ, నిశుంభుల వధ మఱియు రక్తబీజుని వధ. వీటి నన్నింటినీ కూడా నీకు బాగుగా వర్ణించి చెప్పితిని. ఓ ముని శార్దూలా! ఇప్పుడు జరుగ బోవు దక్ష పుత్రుడగు తొమ్మిదవ సావర్ణి మనువు యోక్క మన్వంతరమును వర్ణించెదను. వినుము. ఆ మనువు యొక్క మన్వంతరము ఏ ఏ దేవతలు, ఏ ఏ ఋషులు, ఏ ఏ రాజులు ఉండెదరో, వారిని చెప్పెదను వినుము. పారా, మారీచిభర్గ, సుధర్మ దేవతల యొక్క ఈ మూడు గణాలకు ప్రత్యేక గణ మందు పన్నెండు మంది దేవత లుందురు. ఈ సమయమున ఏ వహ్ని పుత్రుడగు షడాననుడగు కార్తికేయు డుండేనో. ఆతడే రాబోవు మన్వంతరమున ‘అద్భుతు’ డను పేరుతో మహా బలశాలి యగు సహస్రాక్షు డగు ఇంద్రు డగును.
మేదాతిథి, వసు, సత్య, జ్యోతిష్మాన్, ద్యుతిమాన్, సబల, హవ్యవాహనులు ఈ సమయమున సప్తర్షులుగ నుందురు. దృష్టకేతు, బర్హకేతు, హస్త, నిరామయ, పృథుశ్రవ, అర్చిష్మాన్, భూరిద్యుమ్న, బృహద్భయులు మొదలగు వారు ఎంతో మంది దక్ష సావర్ణి మనువు యొక్క పుత్రులు రాజు లగుదురు. ఓ ద్విజుడా ఆ తరువాత పదియవ మనువు యొక్క మన్వంతరమును వినుము.
ఈ మన్వంతరము నందు ధీమంతు డగు బ్రహ్మ యొక్క పుత్రుడు దశమ మనువు అగును. వాని మన్వంతరమున సుఖాసీన అనిరుద్ధ నామములు గల ద్వివిధ దేవత లుందురు భావి మనువు యొక్క మన్వంతరమున భవిష్య ద్దేవతలు నూరు సంఖ్యలో నుందురు. ఎందువల్ల ననగా ఈ మన్వంతరమున ప్రాణుల సంఖ్య నూరు అందుచేత దేవతల సంఖ్య కూడా నూరు ఉండును. ఇంద్రుని యొక్క సంపూర్ణ గుణ యుక్తుడై యున్న “శాంతి” యను వాడు ఆ సమయమున ఇంద్రు డగును. మరియు ఎవరు సప్తర్షులుగ నున్నారో. వాని విషయమును చెప్పెదను వినుము. అపోమూర్తి, హవిష్మాన్, సుపిత, సత్య, నాభాగ, అప్రతిమ, వసిష్ఠులు సప్తర్షులుగా నుందురు. సుక్షేత్ర, ఉత్తమౌజస, భూరిషేణ, వీర్యవాన్, శతానీక, వృషభ, అనమిత్ర, జయద్రధ, భూరిద్యుమ్న, సుపర్వులు, దశమ మనువు యొక్క పుత్రులు. భావి మనువు, ధర్మ పుత్రుడునగు సావర్ణిక మన్వంతరమును వినుము.
విహంగము, కామగ నిర్మాణ పతులను ఈ ముగ్గురును దేవతా గణాలు. ఒక్కొక్క గణ మందు ముప్పది దేవత లుందురు. మాస, ఋతు, దినములకు వారే నిర్మాణ పతులు. రాత్రులు విహంగమ దేవతలు, సమస్త ముహూర్త జాతక విషయము లకు కామగ దేవతల యొక్క గణాలు. ప్రసిద్ద పరాక్రమము గల “వృషా”ఖ్యుడు వారికి ఇంద్రు డగును. ఈ మన్వంతరమున హవిప్మాన్, వరిష్టులు అరుణ తనయు డగు ఋషి, నిశ్చర, అనఘులు మహాముని యగు విష్టి, మరియు సప్తముడు అగ్ని దేవుడు సప్తర్షులుగా నుందురు.
సర్వత్రగ, సుశర్మ, దేవానీక, పురూద్వహ, హేమధన్వా, దృఢాయువులు ఆ మనువు యొక్క పుత్రులు మఱియు భావి నరాధి పతు లగుదురు. రుద్రా పుత్రుడగు సావర్ణి మనువు యొక్క పన్నెండవ మన్వంతరము నందు ఏ దేవతలు. మునులు ఉండెదరో, ఇప్పుడు వాని విషయమును వినుము. సుధర్మ, సుమన, హరిత, రోహిత, మఱియు సువర్ణు లను ఈ ఐదు విధాల దేవ గణాలు ఉండును. ప్రత్యేక గణమున పది మంది దేవత లుందురు. సంపూర్ణముగా ఇంద్ర గుణ యుక్తుడైన, మహా బలవంతుడగు “ఋతధాముడు” వారికి ఇంద్రునిగా ఎరుంగ వలెను. ఇప్పుడు నా వలన సప్తర్షుల విషయమును వినుము. ద్యుతి, తపస్వి, సుతప, తపోమూర్తి, తపోనిధి, తపోరతి, తపోధృతులను వీరు సప్తర్షులుగా నుందురు.
