మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము
122 - అవిక్షిచ్చరితము
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఒక పవిత్ర దిన మందున అవీక్షుని తల్లి వీరమాత యగు వీర అవీక్షితుని బిలచి ఇట్లు చెప్పెను. ఓ కుమారా! నేను ”కిమిచ్చక” మను పేరుగల ఒక దుష్కరమగు వ్రతమును ఉపవసించి చేయుదును. మహాత్ముడగు నీ తండ్రి గూడ దానిని చేయుటకు అనుమతించెను. ఈ వ్రతమును నీ తండ్రి, నీవు మరియు నేను ఆధీనులమై యుండ వలెను. అందు వలన ఎప్పుడు నీవు దానికి ప్రతిజ్ఞ చేయుదువో, అప్పుడు నేను ప్రతికార్యము లందు యత్నవతి నగుదుము. నీ తండ్రి యొక్క రాజ్య కోశము నుండి సగము దానము చేయుదును. ఆ ధనము నీ తండ్రి ఆధీనము. అందుచే అతని నుండి ఆజ్ఞను పొందితిని. కష్ట సాధ్యమైన విషయము నా ఆధీనము. అది నావలన సంపన్నము కాగలదు. మరియు ఇంక ఎట్టిది బల పరాక్రమముచే సాధ్యమై యున్నదో అదంతయు నీ ఆధీనమున నున్నది.
అది నీకు సుసాధ్యము గాని దుఃఖ సాద్యము గాని లేక అసాధ్యము గాని గావచ్చును. అందువలన ఓ కుమారా! నీవు నీ సాధ్య విషయ మందు అంగీకారమును తెలిపినచో ఈ వ్రతమును చేయుదును. నీ అభీష్టమును తెలియ జెప్పుము.
అవిక్షితుడు:
అవిక్షితుడు:
“ధనము తండ్రి ఆధీనము. ఇందు నా ప్రభుత్వ మేమియు లేదు. నా శరీరముచే ఎట్టి కార్యము సంపన్న మగునో, నీ ఆజ్ఞానుసారము నేను దానిని సంపన్నము చేయుటకు సిద్ధముగా నున్నాను. విత్తేశ్వరుడగు తండ్రి గారి ఆజ్ఞ అయినచో ఓ తల్లీ! నీవు నిశ్చింతగా సంతుష్ట హృదయముతో “కిమిచ్చక” వ్రతమును ఆచరించుము.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
అనంతరము సంయమ పరాయణురాలైన పట్టపు రాణి ఆ వ్రతమును ఉపవాసముతో మనో వాక్కాయములచే ఇంద్రియ నిగ్రహము గలదై అత్యంత భక్తి శ్రద్ధలతో యధావిధిగా నిధి సమూహములను నిధి పాలగణాలను మరియు లక్ష్మీ దేవిని పూజింప సాగెను.
ఇక్కడ కరంధముడు, నీతి శాస్త్ర విశారదులైన మంత్రులతో మంత్రణా గృహ మందుండగా వారు ఇట్లు విన్నవించిరి.
మంత్రులు:
మంత్రులు:
ఓ రాజా! పృథ్వీ పాలన చేయుచూ మీ వయస్సు గడచి పోయినది. మరియు మీ ఏకైక పుత్రుడు వివాహము చేసుకొనలే దు. ఓ భూపతీ! అతను ఎప్పుడైతే అపుత్రుడై యుండునో, పత్నిని చేపట్టడో, అప్పుడు నిస్సందేహముగా ఈ భూమి మీ యొక్క శత్రువుల నాశ్రయించును. మీకు కూడా వంశ క్షయము, పితృ దేవతలకు శ్రాద్ధ, తర్పణాదులు నష్టమగును. క్రియాహాని కలుగుటచే సమస్తములగు మహత్తర భయములు సంభవించును. అందుచేత ఓ భూపాలా! దేని వలన మీ పుత్రుడు సదా పితరులకు ఉపకారము చేయు బుద్ధి నవలంభించునో, అట్టి ఉపాయమును చేయుడు.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
అదే సమయంబున రాజమహిషియు మరియు పురోహితుడు అర్థి గణాలతో చెప్పిన వచనము లన్నియు రాజు వినెను. పురోహితుడు ఇట్లు చెప్పెను. “కరంధముని మహిషి “కిమిచ్చక” వ్రతము చేయు చున్నది. మీరేమేమి కోరు చున్నారో, ఎట్టి దుస్సాధ్యమగు కార్యములు చేయవలసి యుండెనో, వానిని తెలుపుడు. పురోహితుని వచనములు విన్న రాజ పుత్రుడు అవీక్షుడు కూడా రాజ ద్వారము వద్దకు వచ్చి ఆ అర్థి గణాలతో నిట్లు పలుక సాగెను. “ఓ అర్థులారా! నా ప్రతిజ్ఞ ఆలకింపుడు. భాగ్యవతి యగు నా తల్లి కిమిచ్చక వ్రతము నందున్నది. ఈ సమయమున నా శరీరము నుండి ఎట్టి కార్యములు చేయుటకు సాధ్యమగునో వాటిని చెప్పుడు. ఈ కిమిచ్చక వ్రతసమయ మందు మీరు ఏమేమి కోరు చున్నారో, వానిని కూడ చెప్పుడు. వాని నిచ్చుటకు నేను సిద్ధముగా నున్నాను. ఇది నా ప్రతిజ్ఞ”.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
పిమ్మట కరంధమ రాజు పుత్రుని నోట వచ్చిన పలుకులు వినిన వెంటనే అతని సమీపమునకు వెళ్లి ఇట్లు పలికెను. కుమారా! నేను అర్థినై వచ్చితిని. నేనభిలషించిన దానిని యిమ్ము.
అవీక్షితుడు:
అవీక్షితుడు:
“తండ్రీ! నేను మీకేమి ఇవ్వగలను? ఆజ్ఞాపింపుడు. మీరడిగిన వస్తువు సాధ్యము, దుస్సాద్యము లేక అసాధ్యము అయినను, తప్పక ఇచ్చెదను”.
రాజు:
రాజు:
“నీవు కిమిచ్చక వ్రతమందు దానము చేయుదునని సత్య ప్రతిజ్ఞ చేసినచో, నా యొడిలో గూర్చోను నట్టి పౌత్రుని ముఖమును నాకు జూపుము.”
అవీక్షితుడు:
అవీక్షితుడు:
ఓ రాజా! నేను మీకు ఏకైక పుత్రుడను. మరియు నేను బ్రహ్మచర్యము నవలంభించితిని. అందుచే నాకు పుత్రుడు కూడా లేడు. ఈ కారణముచే ఎట్లు మీకు పౌత్రుని ముఖము చూపించ గలను?
రాజు:
రాజు:
నీవు అవలంభించిన బ్రహ్మ చర్యము పాపమునకు హేతువు. అందు వలన దానిని పరిత్యజించి దాని నుండి ఆత్మకు ముక్తిని కలిగించుము. నాకును పౌత్రుని చూపించుము.
అవీక్షితుడు:
అవీక్షితుడు:
ఈ కార్య మత్యంత విషయము. ఓ మహారాజా! నేను వైరాగ్య నిమిత్తము స్త్రీ సంభోగమును పరిత్యజించితిని. దేని వలన ఈ వైరాగ్యము చెడ కుండునో, అట్టి దానిని వేరొకటి ఆజ్ఞాపించుడు.
రాజు:
రాజు:
బృహత్తమ సేనా యుక్తులై ఉన్న వైరులను నీవు యుద్ధమున ఓడించుట నేను చూచితిని. అట్టి నీవు వైరాగ్యము నవలంభించినచో మూర్ఖుడవు అగుదువు. ఇప్పుడు నాకు నీవు అధికముగా చెప్పుట వలన ప్రయోజన మేమున్నది? తల్లి ఇచ్చానుసారముగా బ్రహ్మచర్యమును పరిత్యజించుము.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఇట్లు రాజ పుత్రుడు మాటి మాటికి ప్రార్థించినను ఆ రాజు ఎప్పుడయితే వేరొక కోరికను అడుగలేదో, అప్పుడు రాజ పుత్రుడు తిరిగి ఇట్లు పలికెను. ఓ తండ్రీ! మీతో కిమిచ్చక ప్రధాన విషయమును అంగీకరించి నేను సంకటమున పడితిని. ఈ కారణముచే నిర్లజ్జుడనై భార్యను పరిగ్రహించు చున్నాను.
నేను స్త్రీ ఎదుట పరాజితుడనై భూమి యందు బడియుంటిని. అందువలన స్త్రీ నా యెడల భర్తతో సమానముగా నున్నది. ఓ తండ్రీ! ఇది చాలా కఠిన కార్యముగా నున్నది. అయినను నేను ఏమి చేయుదును? సత్య పాశముచే బంధింప బడితిని. ఇప్పుడు మీరు చెప్పిన దానిని తప్పక చేయుదును. మీరు నిశ్చింతగా రాజ్య శాసనమును చేయుడు.
