మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము

Table of Contents

87 - దేవీ మహాత్మ్యము నందలి శుంభ వధ

 

ఋషి:

ఋషి:

ప్రాణ తుల్యుడగు సోదరుడు నిశుంభుడును మరియు సేనలను చంపుట చూసి శుంభుడు కృద్దుడై ఇట్లు పలికెను. ఓ దుష్టురాలా! దుర్గా! నీవు బలవంతు రాలనని గర్వింపకుము. నీవు ఇతరుల బలమును ఆశ్రయించి అత్యంత మానవతివై యుద్ధము చేయు చున్నావు.

 

శ్రీదేవి:

శ్రీదేవి:

ఓరీ దుష్టుడా! ఈ జగత్తు నందు నేనొక్క దానినే వెలుగొందు చున్నాను. నేను కాక వేరెవరున్నారు? చూడుము. ఈ నా విభూతు లందరూ నాయందే ప్రవేశించు చున్నారు.

 

ఋషి:

ఋషి:

అనంతరము బ్రహ్మాణీ మొదలగు సమస్త శక్తులు దేవి యొక్క శరీర మందు లీనమైరి. అప్పుడు అంబిక ఒక్కతే వెలుగొందెను.

 

శ్రీదేవి:

శ్రీదేవి:

ఓరీ శుంభా! నేను నా విభూతి ద్వారా ఈ స్థానము నందు చాలా రూపములతో యున్నాను. ఇప్పుడు ఆ రూపాల నన్నిటినీ ఉపసంహరించి యుద్ధ క్షేత్రమున ఒంటరిగా ఉన్నాను. నీవు యుద్ద రంగమున స్థిర బుద్ధివై , ధైర్యముగా నుండుము.

 

ఋషి:

ఋషి:

తదుపరి దేవాసురులు చూచు చుండగా ఉభాయులగు శ్రీదేవీ శుంభాసురుల దారుణమగు యుద్ధము మొదలయ్యెను. ఈ విధముగా ఆ దేవీ శుంభాసురుల శరవృష్టి, శస్త్రాలు మరియు దారుణ అస్త్రాల యొక్క పరస్పర ఆక్రమణల ద్వారా సంపూర్ణ లోకాలకు భయమును కలిగించు యుద్ధము జరిగెను. అంబిక ఏ వందల కొలది దివ్యాస్త్రములను వేసేనో ఆ సమస్త దివ్యాస్త్రములను ఆ దైత్యేంద్రుడగు శుంభాసురుడు తన అస్త్రములచే విరగ గొట్టెను. మరియు శుంభాసురుడు ఏ దివ్యాస్త్రములను వేసేనో ఆ దివ్యాస్త్రముల నన్నింటిని పరమేశ్వరి యగు చాముండిక కూడా లీలా మాత్రముగా ఉగ్రములగు హుంకారోచ్చారణాదుల చేతనే భంగ పరచెను. తరువాత ఆ మహాసురుడు వందల కొలది బాణములను వర్షింప జేసి శ్రీ దేవిని కప్పి వేసెను. అప్పుడు దేవి కూడా కుపితురాలై బాణములచే అతని విల్లును విరిచెను.

 

విల్లు విరిగి పోగానే దైత్యపతి శక్తిని గ్రహించెను. కాని దేవి శుంభుని చేతి యందలి ఆ శక్తిని కూడా చక్రముతో తునకలు చేసెను. అప్పుడు రాక్షస రాజు అగు శుంభుడు ఖడ్గము మరియు దీప్తి వంతమగు “శతచంద్ర”మను ఖడ్గమును గ్రహించి దేవిపై కురికెను. అప్పుడు అట్లు వచ్చిన ఆ శుంభుని ఖడ్గమును మరియు సూర్యుని కిరణముల వలె నిర్మలమగు ఢాలును చండిక తన ధనుస్సు నుండి వదులు చున్న పదునైన బాణములచే తుంచి వేసెను. గుర్రములను పడ గొట్టెను. సారధి సహితముగా రథమును భుజించెను. ఎప్పుడైతే ఆ రాక్షస రాజు రథము భిన్నమయ్యెనో, అశ్వములు చనిపోయేనో, విల్లు విరిగెనో, మరియు సారధి మరణించెనో, అప్పుడు అతడు ఘోరమగు ముద్గరమును (సుత్తి వంటి సాధనము) తీసుకొని అంబికను చంపుటకు ఉద్యుక్తు డయ్యెను. అప్పుడు దేవి దగ్గరగా వచ్చుచున్న అసురుని ముద్గరమును పదునైన బాణములచే నరికి వేసెను. అయినప్పటికీ ఆ మహాసురుడు పిడికిలి బిగించి వేగముతో దేవిపై కురికెను.

 

రాక్షస శ్రేష్టుడు ఆ పిడికిలిచే దేవి యొక్క హృదయమును కొట్టెను. అప్పుడు దేవి కూడా హస్తముచే అతని వక్ష స్థలమును చరిచెను. ఆ ప్రహారముచే పీదితుడైన రాక్షస రాజు భూమి యందు పడిపోయెను. తత్క్షణమే తిరిగి లేచెను. అనంతరము దేవిని గ్రహించుటకు ఎగురుచూ శుంభుడు ఆకాశమున నిలచెను. మరియు దేవి కూడా ఆకాశ మందు నిరాధారురాలై అతనితో ఘోరమగు యుద్ధము చేయ సాగెను. అప్పుడు ఆకాశమున శుంభాసురుడు, చండికాదేవియు సిద్ధులకు మునులకు ఆశ్చర్యమును గొలుపు నట్టి యుద్ధము చేయ సాగిరి. ఆ అసురునితో చాలా కాలము వరకు నిర్యుద్ధము చేసి అతనిని పైకి ఎగురవేసి గిర గిర త్రిప్పి భూమి యందు విసిరి వేసెను.

 

అప్పుడు దుష్టాత్ముడగు ఆ రాక్షసుడు భూమి యందు పడి, అత్యంత వేగముతో పిడికిలి ఎత్తి చండికను చంపవలెనని మీదికి పరుగెత్తెను. సర్వ దైత్యేశ్వరుడగు ఆ శుంభుడు వచ్చు చుండుట చూచి దేవి తన శూలముతో అతని హృదయమును చీల్చి అతనిని భూమిపై పడవేసెను. శ్రీదేవీ శూలాగ్ర విక్షతుడగు నా రాక్షసుడు ప్రాణము పోయిన వాడై భూభాగమున పడి పోయెను. ఆ సమయమున సముద్ర, ద్వీప, పర్వత సహితమైన భూమి యంతయు కంపించెను. దురాత్ముడగు ఆ రాక్షసుడు మరణించుటచే అందరూ ప్రసన్నులైరి. జగత్తు అత్యంత సుఖమును బొందెను. మరియు ఆకాశము కూడా అత్యంత నిర్మలముగా నయ్యెను. ఎట్టి అనిష్ట సూచకములగు మేఘములు మరియు ఉల్కా గణాలు శుంభుడున్న సమయము వెలు గొందెనో, శుంభుడు మరణించిన పిమ్మట అవన్నీ అదృశ్యమై పోయెను. మరియు నదులు వాని వాని స్థానములను ప్రవహించ సాగెను.

 

మరియు అతడు మరణించ గానే సమస్త దేవగణాలు అత్యంత హర్ష చిత్తులైరి. గంధర్వులు మధుర గానము చేయ సాగిరి. కొంత మంది వాద్యములు మ్రోగింప సాగిరి. మరియు అప్సరసలు నృత్యము చేయు చుండిరి. సుందరమగు చల్లని గాలులు వీచ సాగెను. దివాకరుడు కూడ సుందరమైన కాంతిని ధరించెను. ఆరి పోవుచున్న హోమాగ్ని తిరిగి ప్రజ్వలింప సాగెను. మరియు దిక్కులయందు “శాంతి, శాంతి” యను శబ్దములు వినబడు చుండెను.