మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము
99 - మార్తాండ మాహాత్మ్యము
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఓ మునీ! ఎప్పుడైతే ఆ గ్రుడ్డు పగిలి పోయెనో, దాని నుండి అవ్యక్త జన్ముడగు బ్రహ్మ వెలువడెనో, అప్పుడు ఆతని మొదటి ముఖము నుండి ఋగ్వేద ఛందస్సులు ఉత్పన్న మయ్యెను. ఆ ఋగ్వేద ఛందస్సులు జపా పుష్పముల వలె తేజో రూపములు, అసంహతములు, పరస్పర విభిన్న రజో రూపమయ ములై యుండెను. ఆతని దక్షిణ ముఖము నుండి కాంచన వర్ణ యుక్తములు, అసంహితములు నగు సమస్త యజుర్వేద ఛందస్సులు విభిన్న భావములతో బహిర్గత మయ్యెను. అనంతరము పరమేష్టియగు బ్రహ్మ యొక్క పశ్చిమ ముఖము నుండి సమస్త సామ వేద ఛందస్సులు ఆవిర్భవించెను. ఆ సమస్త సామ వేద ఛందస్సులు పరస్పరము విభిన్నములై యుండెను. ఆ బ్రహ్మ యొక్క ఉత్తర ముఖము నుండి ఇదే విధముగా మారణ ఉచ్చాటనాది అభిచారికములు, శాంతి కారకములు, ఘోర రూపములు తుమ్మెదల సమూహముల వలె కృష్ణ వర్ణములు, ప్రభాయుక్తములు సుఖ సత్వ తమో బహుళములగు సౌమ్య, అసౌమ్య రూపములగు అశేష అధర్వణ వేద ఛందస్సులు బయల్వెడలెను.
ఓ మునీ! సమస్త ఋగ్వేద ఛందస్సులు రజో గుణ యుక్తములు, సమస్త సామవేద ఛందస్సులు తమో గుణ యుక్తములు, మఱియు సమస్త అధర్వణ వేద ఛందస్సులు సత్వ్త తమో గుణాత్మకములుగ ఉండును. ఇవన్నియు అప్రతిమ తేజస్సుచే ఉజ్జ్వలమై పూర్వము వలె వేరు వేరు భావలచే అవస్థితములై యుండెను. ప్రథమ మగు ఏ తేజస్సున్నదో దానిని “ఓమ్” అని చెప్ప బడెను. దానికి స్వభావముచే ఉత్పన్నమైన ఏ తేజస్సున్నదో దానిని అది ఆవరించి అస్థితమై యున్నది. ఓ మహామునీ! సామమయ తేజస్సు మరియు యజుర్మయ తేజస్సు ఆ ఓంకార రూప మగు పరమ తేజస్సును ఆశ్రయించి ఏకత్వమును పొందెను.
హే బ్రహ్మన్! అనంతరము ఋగ్వేద యజుర్వేద, సామ వేదాలను ఈ మూడు వేదము లందలి శాంతిక, పోష్టిక, మరియు అభిచారిక ఛందస్సులను ఈ మూడును అథర్వణ వేదము లందు లీన మయ్యెను. ఓ విప్రర్షీ! తిరిగి అంధకారము నాశన మగుటచే. ఈ విశ్వము వెంటనే నిర్మల మయ్యెను. దీని వలన తిర్య గూర్ధ్వాథో దేశములు ప్రకాశ వంత మయ్యెను. హే బ్రహ్మాన్! ఆ తరువాత ఆ ఛాందస మగు ఉత్తమ తేజస్సు మండలీ భూతమై తిరిగి పరమ తేజో రూపమగు ఓంకారము నందు ఏకత్వమును పొందెను. ఈ విధముగా ఈ తేజస్సు ప్రథమముగా ఉత్పన్న మగుటచే ఆదిత్య సంజ్ఞను పొందెను. ఓ మహాభాగా, ఇతడు ఈ విశ్వమునకు అవ్యయాత్మక మగు విశ్వమునకు కారణము. ఋక్, యజు, సామము లను పేరు గల మూడునూ ప్రాతః కాల, మధ్యాహ్న కాల, అపరాహ్న కాలము లందు తాపమును కలుగ జేయు చున్నవి.
ఓ మునిసత్తమా! ప్రాతః కాలమున ఋక్కులు, మధ్యాహ్న కాలమున యజుస్సులు, మరియు అపరాహ్న కాలమున సామములు తపో యోగ్యము లగు చుండును. పూర్వాహ్న సమయ మందు ఋక్ లతో శాంతి కర్మలు, మధ్యాహ్న సమయమున యజుస్సులతో పౌష్టిక కార్యములు, అపరాహ్న సమయముల సామ మంత్రములతో అభిచారిక కర్మలు చేయ వలయునని నిశ్చయింప బడినది. మధ్యాహ్న అపరాహ్న కాలము లందు అభిచారిక కర్మలు చేయ వలెను. మఱియు కేవలము అపరాహ్న మందే సామముచే పితరుల కార్యములను చేయ వలెను. సృష్టి కాల మందు బ్రహ్మ ఋఙ్మయుడు, స్థితి కాలమున విష్ణువు యజుర్మయుడు మరియు సంహార కాలమున రుద్రుడు సామ మయుడుగ చెప్ప బడెను. అందు వలన పైన చెప్ప బడిన విధముగా వేదాత్ముడు, వేద సంస్థితుడు, వేద విద్యామయుడు, భగవానుడు నగు భాస్వానుడు పరమ పురుషుడుగా చెప్ప బడెను.
సృష్టి, స్థితి, ప్రళయకారి యగు ఈ శాశ్వతుడైన ఆదిత్యుడు సత్త్వ రజస్తమో గుణములను ఆశ్రయించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లను పేర్లు పొందు చున్నాడు. మరియు ఆ సూర్యుడు పూజ్యుడు, వేదమూర్తి, నిరాకారుడు, సంపూర్ణ ప్రాణుల యొక్క మూర్తి స్వరూపము లందు మూర్తి మంతుడు, జ్యోతి స్వరూప మందు ఆది పురుషుడు, ఆ ఆదిత్య భగవానుడు విశ్వమునకు ఆశ్రయ స్వరూపుడు, అవేద్య ధర్ముడు, వేదాంత గమ్యుడు మరియు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడైన వాడుగా దేవతలచే ఎల్లప్పుడు పూజింప బడుచున్నాడు.
