మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము
98 - వంశానుకీర్తనము
క్రౌష్టుకి:
క్రౌష్టుకి:
ఓ భగవానుడా! మీరు మన్వంతరముల విషయములను చక్కగా చెప్పితిరి. మరియు నేను క్రమముగా ఆ విషయములను మీ వలన విస్తార సహితముగా వింటిని. ఓ ద్విజ సత్తమా! బ్రహ్మ మొదలుకొని రాజుల యొక్క సంపూర్ణ వంశములను విన వలెనని కోరు చున్నాను. ఓ భగవానుడా వాటిని నాకు చక్కగా వర్ణించి చెప్పుడు.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
ఓ వత్సా! నీవు జగత్తుకు మూలమగు ప్రజాపతి యగు బ్రహ్మ నుండి ఆరంభించి సంపూర్ణ రాజుల యోక్క జన్మ వృత్తాంతములను, మరియు చరిత్రలను వినుము. అనేక యజ్ఞములు చేసిన వారు, రణ విజయములు పొందిన, ధర్మజ్ఞులు, అగు వందల సంఖ్యలలో ఉన్న రాజులతో ఈ వంశములు అలంకృత ములై ఉన్నవి. మహాత్ము లగు ఈ రాజుల ఉత్పత్తి విషయములను మరియు అందరి చరిత్రమును, విన్న పురుషుడు సమస్త పాపముల నుండి విడువ బడును.
ఏ వంశ మందు మనువు, ఇక్ష్వాకుడు, అనరాణ్యుడు, భగీరథుడు మరియు వందల కొలది ధర్మజ్ఞులు, యజ్ఞ కారులు, శూరులు, పరమ జ్ఞానులు అగు భూపాల గణాలు జన్మించి, బాగుగా భూమిని పాలించి యుండిరో, ఆ వంశముల యొక్క విషయములను వినిన పురుషుడు సంపూర్ణ పాప సమూహము నుండి విడువ బడును. వట వృక్షము నుండి అంకురము ఉత్పన్నమై ఏ విధముగా అది స్వతంత్ర వట వృక్ష రూపములో పరిణతి చెందునో, అదే విషముగా ఈ వంశముల నుండి మనుజేంద్ర గణాల యొక్క సహస్ర సహస్రముల వంశములు ఉత్పన్న మైనవి. వానిని వినుము. ఓ ద్విజోత్తమా! పూర్వ కాల మందు ప్రజాపతి యగు బ్రహ్మ వివిధ ములగు ప్రజలను ఉత్పన్నము చేయ వలెనను కోరికచే కుడి చేతి యందలి బొటన వ్రేలు నుండి ‘దక్షుడు’ అను వానిని సృష్టించెను. జగప్ప్రసవ కారి యగు ప్రభువు, భగవానుడు అగు బ్రహ్మ జగత్తు యొక్క సృష్టి కొఱకు ఎడమ చేయి బొటన వ్రేలు నుండి దక్షుని భార్యను సృష్టించెను.
ఆ దక్షునికి అదితి అను పేరు గల సుందరి యగు కన్య జన్మించెను. ఆమె గర్భము నుండి కశ్యపుని వీర్యముచే ఆదిత్యుడు జన్మించెను. ఓ ద్విజుడా! ఎవరు బ్రహ్మ స్వరూపమై అశేష జగత్తునకు వరము నిచ్చు వాడై ఉన్నాడో, సృష్టి, స్థితి, ప్రళయ, క్రియల యందు ఎవరు ఆది, మధ్యాంత స్వరూపుడై ఉన్నాడో, మఱియు ఎవరు సనాతనుడై పరమాత్ముడై ఉన్నాడో, అట్టి సూర్య భగవానుడు పూర్వము అదితిచే ఆరాధింప బడి ఆమె గర్భము నుండి జన్మించెను.
క్రౌష్టుకి:
క్రౌష్టుకి:
ఓ భగవానుడా! వివస్వాను డగు సూర్యుని యొక్క ఏ స్వరూప మున్నదో మరియు ఏ కారణముచే ఆ ఆది దేవుడు కశ్యపుని పుత్రు డయ్యెనో దానిని విన వలె నని కోరు చున్నాను.
మఱియు అతడు ఏ విధముగా కశ్యపుడు మరియు అదితి దేవిచే ఆరాధింప బడెనో, ఆరాదింప బడి ఆ బాస్కర దేవుడు ఏమి చెప్పెనో, గృహీత జన్ముడగు దివాకరుని ప్రభావము ఇంతకు ముందు మీరు ఏ విధముగా చెప్పిరో, ఓ ముని సత్తమా! అవన్నియు చక్కగా సవిస్తరముగా విన వలెనని కోరు చున్నాను.
మార్కండేయుడు:
మార్కండేయుడు:
విస్పష్టా, పరమా, విద్యా, జ్యోతి, శాశ్వతీ, ప్రకాశితా, దీప్తి, కైవల్య. జ్ఞాన, ఆవిర్భావ, ప్రాకామ్య సంవిత్, భోధ, ఆవగతి, స్మృతి, విజ్ఞానము లన్నియు రూప రహితుడగు సూర్య దేవుని స్వరూపములు. ఓ మహాభాగా! నీవు “రవి ఏ విధముగా ఆవిర్భవించెను?” అని అడిగితివి. దానిని నేను విస్తారముగా చెప్పెదను. వినుము.
సృష్టి ముందు ఎప్పుడైతే ఏమియు లేదో, అప్పుడు ఈ జగత్తు ప్రభా హీనముగా, నిరా లోకముగా బాగుగా అంధ కారముచే కప్పబడిన సమయ మందు అక్షయము, జగదు త్పత్తికి పరమ కారణ మయినది యగు ఒక పెద్దదగు అండము (గ్రుడ్డు) జన్మించెను. దాని మథ్య యందున భగవానుడు, పితా మహుడు, పద్మయోని యగు బ్రహ్మ ఉండెను. ఎవరు జగత్తు యొక్క సృష్టి కర్తయై ఉన్నాడో అట్టి ప్రభువగు బ్రహ్మ స్వయముగా ఈ అండమును భేదించి బయలు వెడలెను. ఓ మహా మునీ! ఆ బ్రహ్మ ముఖము నుండి ఆ సమయమున “ఓమ్” అను శబ్దము కలిగెను. ఈ ఓం కారము నుండి మొదట “భూః” తర్వాత “భువః” ఆ తర్వాత “స్వః” అను శబ్దములు ఉత్పన్న మయ్యెను. ఈ మూడు విధముల వ్యాహృతులే సూర్య భగవానుని స్వరూపములు. ఈ “ఓమ్” స్వరూపము నుండియే రవి యొక్క అతి సూక్ష్మ రూప మున్నది. తర్వత దాని స్థూల రూప మగు “మహః” ఆ తత్వాత స్థూల రూపమగు “జనః” తిరిగి దాని కన్నను కూడా స్థూల రూపమగు “తపః” అనంతరము దాని కంటెను కూడా స్థూల రూపమగు “సత్యః” అనునవి ఉత్పన్న మయ్యెను. ఇవి సూర్యుని యొక్క సమస్త స్థూల రూపములు అని చెప్పుదురు. ఓం కారము నుండి వినస్వానుని యొక్క స్థూల సూక్ష్మ రూపములచే ఈ ఏడు రూపములు ఉత్పన్న మైనవి.
భాస్కర భగవానుని యొక్క రూపము లైనప్పటికి ఇవి ఒకప్పుడు ప్రకాశించును, మరి యోకప్పుడు అప్రకాశముగ నుండును. వాని స్వభావములు మఱియు భావము యొక్క అస్తిత్వములు కూడా సంశయమును పొందు చుండును. ‘ఓ విప్రా! ఈ విశ్వము యొక్క ఆద్యంతములు యందు ఎట్టి రూప విహీనుడు అతి సూక్ష్మ పరమాత్ముడు స్థితుడై ఉన్నాడో, నేను ఎట్టి ఓం కారమును చెప్పితినో’ ఆ ఓం కారము అతడే. ఓ విప్రా! ఆ పర బ్రహ్మయే మార్తాండ దేవుని శరీరము అయి యున్నది.
