మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము

Table of Contents

93 - రౌచ్య మన్వంతరము నందు రుచ్యుపాఖ్యానమున రుచి కృత పితృ స్తవము

 

మార్కండేయుడు:

మార్కండేయుడు:

విప్రర్షి యగు యా ఋషి యట్లు పితృ దేవతలా మాటలను విని మిక్కిలి యుద్వేగ మనస్కుడై కన్యాభిలాషతో భూమండలమున తిరుగు చుండెను. పితృ వాక్య రూపమగు సగ్ని చేదేప్తుడై కన్య లభించక పోవుటచే అత్యంత ఉద్విగ్న మనస్సుతో మిక్కిలి చింతను బొందెను. “ఏమి చేయను? ఎక్కడికి బోదును? ఏమి చేసిన నా పితరులకు అభ్యుదయము కలిగించు భార్యా పరిగ్రహణము శీఘ్రముగా సంపన్న మగును?” అని ఇట్లు చింతించు చుండ ఆ మహాత్మునికి “నేను తపస్సుచే భగవంతుడు కమల సంభవుడు నగు బ్రహ్మ దేవుని ఆరాధించెదను.” అను బుద్ధి కలిగెను. అప్పుడు అత్యంత నియమముతో చాలా కాలము బ్రహ్మ దర్శనాభిలాషియై నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసెను.

 

పిమ్మట లోక పితామహుడగు బ్రహ్మ దేవుడు రుచికి తన స్వరూపమును కనబర్చెను. “నేను ప్రసన్నుడనైతిని.” ఇప్పుడు నీవు నీయభీష్టమగు కోరికను చెప్పమనెను. అప్పుడు రుచి జగధారదా భూతుడగు బ్రహ్మ దేవునికి నమస్కరించి, పితృ దేవతల వచనానుసారముగా తన కోరికను విన్నవించెను. తరువాత బ్రహ్మ విప్రర్షియగు “ఋచి” యొక్క కోరికను విని యిట్లు పలికెను.

 

బ్రహ్మ:

బ్రహ్మ:

విప్రా! నీవు ప్రజాపతివి అగుడువు గాక. నీ వలన ప్రజలు కలుగుడురు గాక. ప్రజలను సృష్టించి సంతానోత్పాదన పూర్వకముగా సమస్త క్రియలను చేసిన తరువాత సిద్ధిని పొందుదువు గాక. ఈ కారణము చేతనే పితృ దేవతలు నిన్ను “వివాహము చేసు కోనుము” అని చెప్పిరి. “వారి వచనము తప్పక చేయ దగినది” అని నిశ్చయించుకొని నీవు పితృ పూజ జేయుము. ఆ పితృ గణము సంతుష్టి చెంది నీకు అభీష్టములను ప్రసాదించెను. పితామహులు కోరిన భార్యా పుత్రులను అనుగ్రహించెదరు.

 

మార్కండేయుడు:

మార్కండేయుడు:

అవ్యక్త జన్మయగు బ్రహ్మ చెప్పిన యిట్టి వాక్యములను విని ఋచి ఏకాంతమగు నొక నదీ తీరమున తర్పణము కలుగజేసెను. ద్విజోత్తమా! ఆ ఋచి ఆచార యుక్తుడు, ఏకాగ్ర చిత్తుడు, శ్రద్ధా సహితుడు భక్తిచే శిరస్సు నంచిన వాడును, రెండు చేతులు జోడించి శిరస్సు యందు అంజలి ఘటించిన వాడునునై ఇట్లు స్తోత్రము చేయ సాగెను.

 

రుచి:

రుచి:

శ్రాద్ధ కర్మ యందు ఆధి దేవతా రూపమున ఎవరు నివసించు చున్నారో, దేవతలు కూడా శ్రాద్ద కర్మ యందు స్వాహాకారముతో ఎవరిని తృప్తి చెందించు చున్నారో, అట్టి పితరులకు నేను నమస్కరించు చున్నాను. స్వర్గ మందు భుక్తి ముక్తుల యందలి అభిలాషతో మనోమయ శ్రాద్ధ కర్మచే మహర్షి గణములు భక్తీ పూర్వకముగా ఎవరిని తృప్తి బొందించుదురో, ఆ పితరులకు నమస్కారము జేసెదను. స్వర్గ మందలి సిద్ధ గణము శ్రాద్ధ సమయమున దివ్యములు, అత్యుత్తములు నగు సకల ఉపాహారములచే ఎవరిని తృప్తి బొందించుదురో, ఆ పితృ దేవతలకు నేను నమస్కరించెదను.

 

అత్యంత సమృద్ధి కొరకు గుహ్యక గానము తన్మయ భావముతో భక్తి సహితులై ఎవరిని అర్చించెదరో, అట్టి పితృ దేవతలకు నమస్కారము. భూలోక మందలి జనులు శ్రాద్ధ కర్మ చేసినచో శ్రద్ధతో చేసిన యట్టి వారికి అభిష్ట ఫలము నిచ్చు పితృ గణములకు నమస్కరించు చున్నాను. ప్రాజాపత్య పదవీ ప్రదాతలగు పితృ గణములకు కోరిన లోకములు యిచ్చునట్టి పితరులను, ఎవరు శ్రద్ధా సహితులై అర్చన గావించెదరో ఆ పితృ దేవతలకు వందనములు. అరణ్యవాసులు, నియతాత్ములు, నైష్టిక బ్రహ్మచారులు, తపస్సుచే సమస్త పాపములు నశింప చేసి కొన్నవారు నగు బ్రాహ్మణులు సమాధిలో ఎవరిని తృప్తి బొందించెదరో, అట్టి పితరులకు నమస్కరించు చున్నాను. మరియు అరణ్య వాసులు అరణ్య మందలి పదార్థములచే సంతర్పణము చేసి ధన్యులగు చున్నారో, ఆ పితృ దేవులకు నమస్కారము చేయు చున్నాను.

 

క్షత్రియ జనులు లోక మందలి ఫలముల నొసంగి పితృ దేవతలను శ్రద్ధా పూర్వకముగా శ్రాద్దాన్నముచే తృప్తిచేయు చున్నారో, అట్టి పితరులను నమస్కరింతును. స్వధర్మ మందు ఆసక్తులగు వైశ్యులు భూలోకమున ఎవరిని పుష్ప, ధూప, దీప, అన్న జలాదులచే సంతుష్టి కలుగ జేయు చున్నారో, ఆ పితరులకు వందనము చేసెదను. మర్త్య లోక మందలి శూద్ర జనము “సుకాలీన” నామముచే విఖ్యాతులగు పితరులను భక్తి శ్రద్ధలతో తృప్తి చేయు చున్నారో, అట్టి పితృ గణమునకు నమస్కారము. పాతాళ లోకమున మద దంభ రహితులయి మహాసురులు స్వధాకారములచే పితృ గణములను శ్రాద్ధముచే ఎల్లప్పుడూ తృప్తి చేయుదురో, ఆ పితరులకు నమస్కరించెదను. రసాతల లోక మందు కామాభిలాషులగు నాగకులములు శ్రాద్ధ కర్మచే ఎవరిని సంతుష్టి కలిగించి అశేష భోగములను సంపత్తులను అనుభవించు చున్నారో, అట్టి పితృ దేవతలకు నేను నమస్కరించెదను.

 

మంత్ర, భోగ,సంపత్తులు గల సర్పగణము పాతాళ మందు ఎల్లప్పుడు ఏ పితృ దేవతలను శ్రాద్ధముచే విధి ప్రకారము సంతుష్టుల జేయురో, ఆ పితరులకు నమస్కారము జేసెదను. దేవలోకమున అంతరిక్షమున ప్రత్యేకముగా నివసించు వారు, భూతలమున దేవతలచే పూజింపబడు వారును అగు ఆ పితరులకు ప్రణామము జేయుదును. ఆ పితృ దేవతలు నేను జేయు పూజను గ్రహించెదరు గాక. పరమాత్మ స్వరూపులు, మూర్తిమంతులునయి విమాన మందు నివసించు వారును యోగీశ్వరులు విమల మనస్కులై క్లేశ విమోచకమగు జ్ఞానము ద్వారా యజ్ఞమున ఎవరిని పూజించెదరో, ఆ పితరులకు నా వందనము. స్వర్గమున మూర్తిమంతులై కామ్య ఫలప్రాప్తి యందు స్వధా భోజులు అగుదురు. కోరిన వారికి కోర్కెల నొసంగుము. నిష్కాములకు ముక్తి ప్రదులయ్యెదరు. అట్టి పితృ దేవులకు నా అంజలి ఘటించెదను. కోరిన వారికి కొంగు బంగార మగుదురు. దేవత్వము గాని ఇంద్ర పదవి గాని యిచ్చెదరు. ఇంతకన్నా అధికముగా గావలెనన్న అనుగ్రహించెదరు. పుత్ర, పశు, అర్థ, బల, గృహముల నేవి కోరినను యిచ్చెదరు. ఇట్టివారు పితృ దేవతలు నా పూజచే సంతుష్టి బొందుదురు గాక.

 

చంద్ర కిరణము లందు సూర్య బింబ మందు తెల్లని విమాన మందు ఎల్లప్పుడూ నివసించు చుండెడి పితృ దేవతలు నేను సమర్పించు అన్న తోయ, గంధాదులచే పుష్టిని పొంది సంతుష్టి గలవార లగుదురు గాక. పితృ దేవతలు అగ్ని యందు ఆజ్యాహుతులచే తృప్తి బొందుదురు మరియు బ్రాహ్మణ శరీరము లందు ఆవేశించి భోజనము చేయుదురు. పిండ ప్రధానముచే సంతుష్టు లగుదురు. నేను సమర్పించు ఈ అన్న జలాదుల వలన సంతృప్తులయ్యెదరు గాక. పవిత్ర కాలము నందు దేవతలు ఇచ్చు ఖడ్గ మృగ మాంసము చేతను దివ్యములు మనోహరములగు కృష్ణ తిలల చేతను, మహర్షులు సమర్పించు కాలశాకము (కరివేపాకు) చేతను త్రుప్తులగు పితృ దేవతలు ఇచ్చట సంతుష్టు లగుదురు గాక. దేవతలచే అర్చితులగు పితృ గణములకు అభీష్టంబగు కవ్యములో, నేను వాటితోనే తృప్తి చేయుదును. పుష్ప, గంధ, అన్న, భోజ్యములతో తృప్తులై నా సాన్నిధ్యమునకు దయ చేయుదురు గాక. కొందరు ప్రతి దినము అర్చించెదరు. కొందరు ప్రతి మాసము, కొందరు ప్రతి సంవత్సరాంతము, అభ్యుదయ కాలమునను అర్చింతురు. అట్లు చేయు వారి పూజ లన్నింటిని స్వీకరించి తృప్తులైన భంగి నా పూజను గూడ గ్రహించి తృప్తులగుదురు గాక.

 

ఏ పితృ గణాలు కుముద చంద్రుల వంటి శుక్ల వర్ణ ప్రభాయుక్తులై దేవతలకు పూజ్యులగు చున్నారో, ఎవరు కొత్తగా ఉదయించు చున్న సూర్యుని వలె రక్త వర్ణ యుక్తులై క్షత్రియులకు పూజ్యులగు చున్నారో, ఎవరు కనకము వాలే సుందర కాంతి యుక్తులై వైశ్యులకు పూజ్యులగు చున్నారో, ఎవరు నీల వర్ణము వారై శూద్రులకు పూజ్యులగు చున్నారో, అట్టి పితృ గణాలు నాచే ఇవ్వ బడుచున్న పుష్ప, గంధ, ధూప, అన్న, జాలాది నివేదనము మరియు అగ్ని హోమాదులచే నా వలన తృప్తిని పొందుదురు గాక. నేను సదా ఆ పితరులకు నమస్కరించు చున్నాను. ఎవరు అతి తృప్తికి దేవతలా ముందు ఆహుతులై సమస్త శుభ కావ్యములను భుజించు దురో ఎవరు తృప్తులై అణిమాది అష్టైశ్వర్యములను సృష్టించెదరో, అట్టివారు నాచే త్రుప్తులగుదురు గాక. నేను వారికి నమస్కరించు చున్నాను. ఎవరు రాక్షస, హోట, ఉగ్ర రాక్షసుల యొక్క ఘాతుకములను ప్రజల యొక్క అమంగళమును నాశనము చేయుదురో, ఎవరు దేవతలకు ఆదిపురుషులై యున్నారో, ఎవరు అమర్వీరుడగు ఇంద్రునికి పూజ్యులగు చున్నారో, అట్టి పితృ గణాలు నాచే త్రుప్తు లగుదురు గాక. నేను వారికి నమస్కరించు చున్నాను. అగ్నిష్వ్యాత్త, బర్హిషద, ఆజ్యప, సోమప పితృగణాలు నాచే అర్చింప బడి ఈ శ్రాద్ధము నందు తృప్తిని పొందుదురు గాక.

 

అగ్నిష్వాత్త పితరులు నన్ను, తూర్పు దిక్కు నందు, బర్హిషద పితరులు దక్షిణ దిక్కు నందు రక్షింతురు గాక. ఆజ్యప పితరులు మరియు సోమ పితృ గణాలు క్రమముగా పశ్చిమ, ఉత్తర దిక్కులా యందు రాక్షస, భూత, పిశాచ, అసురోత్పన్న దోషముల నుండి రక్షించు చుందురు గాక. విశ్వ, విశ్వభుక్, ఆరాధ్య, ధర్మ, ధన్య, శుభానన, భూతిద, భూతికృత్, భూతి అను ఈ తొమ్మిది సంఖ్య గల పితృ గణాలు కలవో, ఆ గణాలకు అధిపతి యగు యముడు అన్ని దిక్కుల యందు నన్ను రక్షించు గాక. కళ్యాణ, కల్యాతా, కర్త, కల్య, కల్యతరాశ్రయ, కల్యతా హేతు, అనఘ అను ఈ ఆరు గణాల ఏ పితృ దేవతలు కలరో, మరియు ఏ పితరుల యోక్క వర, వరేణ్య, వరద, పుష్టిద, తుష్టిద

విశ్వపాత, ధాత అను సప్తవిధ గణాలున్నవో. ఏ పితరుల యొక్క మహాన్, మహాత్మా, మహిత, మహిమావాన్, మహాబల అను ఈ ఐదు పాపనాశకము లగు గణాలున్నవో, ఇవి అన్నియు కలిపి మొత్తము ముప్పది ఒకటి గణాలు. ఇవి జగత్తంతయు వ్యాప్తి చెంది యున్నవి. వీరందరు నాచే తృప్తులై నన్ను సంతుష్టుని చేయుదురు గాక. నాకు సదా హితము చేయుదురు గాక.