మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము
81 - దేవీ స్తుతి
ఋషి:
ఋషి:
ఆ సమయమున ఇంద్రాది సమస్త దేవతా గణములు మహిషాసురుని చంపుటచే సంతోష చిత్తులై జగదంబను స్తోత్రము చేయసాగిరి. దేవి దేవతలకు శత్రువు మహా వీరుడు దుష్టుడు నగు మహిషాసురుని సంహరించుటకై ఇంద్రాది సమస్త దేవతా సమూహములు అత్యంత ఆనందముచే పులకాంచిత శరీరు లయిరి. నమ్ర శిరోధరాంశులై నమస్కరించి నానా ప్రాకారములుగా స్తుతించిరి.
దేవతలు:
దేవతలు:
ఏ దేవి యొక్క ఆత్మ శక్తిచే ఈ చరాచర ప్రపంచము సృష్టి చేయ బడెనో, సమస్త దేవతల శక్తి సమూహముతో ఏ దేవి ఒక మూర్తిగా పరిణమించెనో, ఏ దేవి సమస్త దేవ మహర్షులచే పూజ్యురాలో, మేము భక్తితో అట్టి అంబికా దేవికి నమస్కరించు చున్నాము. మాకు మంగళములను కలుగ జేయు గాక. అనంతుడు, బ్రహ్మ, శంకరుడు ఎవరి ప్రభావము, బలము వర్ణించుటకు సమర్ధులు గారో, అట్టిది యగు చండికా దేవి ఈ యఖిల జగత్తు పాలించుటకు, అశుభములు నశింప చేయుటకు సంకల్పించు గాక.
అమ్మా! నీవు పుణ్యాత్ములగు వారి గృహముల యందు లక్ష్మీ స్వరూపిణివి. పాపాత్ముల ఇండ్లలో అలక్ష్మీ స్వరూపిణివి. నిర్మలాత్ములగు వారి హృదయములలో బుద్ది స్వరూపిణివి. సత్పురుషుల యందు లజ్జా స్వరూపిణివి. అట్టి నీకు నమస్కరించు చున్నాము తల్లీ! నీవు విశ్వమును పాలించుము. ఇట్టి నీ యొక్క అత్యంత రూపము వర్ణించుటకు ఎట్లు సమర్దులము అగుదుము? ఓ దేవీ! నీ యొక్క రాక్షస సంహారము చేయ గల అపరిమిత వీర్యము, సురాసురులు యుద్ద రంగమున అద్భుతమగు నీ వ్యవహారము మేము ఏ రీతిగా వర్ణించ గలము? తల్లీ! వికార రహిత మగు ఆద ప్రకృతివి మరియు సత్వ రజ స్తమో గుణాత్మికవై జగత్తుకు హేతువై యున్నావు. రాగ ద్వేషాది యుక్తులగు హరి హరాదులు నీ ప్రకృతి తత్వమును తెలియ లేరు. మాతా! నీవు అపార మగు సమస్త పదార్ధములకు ఆశ్రయ స్వరూపు రాలవు. ఈ ప్రపంచము నీ అంశ భూతయై యున్నది.
దేవీ! సమస్త యజ్ఞము లందునను నీ నామో చ్చారణముచే సర్వ దేవతలు సంతృప్తిని బొందు చున్నారు. నీవే దేవతలకు స్వాహాకార రూపముగా ఉచ్చరింప బడు చుందువు. అమ్మా! నీవు శబ్దమయ మగు వేద త్రయము నీ రూపము. నీవు దుర్గమ సంసార సాగరము నుండి తరింప జేయుదువు. నీ యొక్క ఉపాసనా విషయము ఊహింప శక్యము కాదు. కావుననే జితేంద్రియులు, తత్వసారులు, దోష హీనులు, మోక్షార్ధులు నగు ముని జనులు నిన్ను ముక్తికి కారణమని పల్కి సేవించు చున్నారు. మాతా! నీవు భగవత్ స్వరూపిణివి సర్వోత్కృష్ట మగు మోక్ష విద్యా స్వరూపిణివై యున్నావు. జగదంబా! నీవు శబ్దాత్మికమగు వేద స్వరూపిణివి. మఱియు ప్రణవ యుక్తము, మనోహరము, పద పాఠ యుక్తము నగు వేద త్రయమునకు ఆశ్రయ స్వరూపు రాలవు సంపత్స్వ రూపిణివి. సంసారము యొక్క జీవన రక్ష కొఱకు కృషి రూపిణీగా ప్రకాశించు చున్నావు. దేవీ! నీవే సంపూర్ణ జగత్తు యొక్క సమస్త దుఃఖములను నశింప చేయు చున్నావు. తల్లీ! నీవు జ్ఞాన స్వరూపిణివి. కావున అంతులేని సంసార సాగరమును దాటించుటకు అద్వితీయ మగు నౌక స్వరూపిణియై యున్నావు. నీవు కైటభ సంహారి యగు విష్ణు భగవానుని యొక్క హృదయ మందు నివశించు లక్ష్మీ దేవిగా సైతము భాసిల్లు చున్నావు మఱియు శివునిచే తన వామ భాగ మందు నివశింప చేసిన అర్ధాంగి స్వరూపిణి యగు గౌరీ దేవియు నీవే. పూర్ణ చంద్రునితో సమానమైనది, సువర్ణ కాంతి కలిగినది, నిర్మలమైనది. చిరునవ్వు కలదియు నగు నీ ముఖము చూచినంతనే మహిషాసురుడు క్రోదముతో అస్త్ర ప్రయోగము చేసెను. ఇది యత్యంతము ఆశ్చర్యముగా నున్నది. నీ ముఖము సంసారులకు మోహము కలిగింప చేయునది. ఆ రాక్షసుడు మోహితుడు కాలేదు. వాడు మిక్కిలి దుష్టుడు.
దేవీ! కోపముతో కూడిన కను బొమ్మలతో భీకరమై నదియు, ఉదయించు చున్న పున్నమి చంద్రుని ముఖమును చూచిన వెంటనే మహిషాసురుడు ప్రాణములను వదలక బ్రతికి యుండుట చాలా ఆశ్చర్యముగా నున్నది. ఎందు వలెననగా కృర్దుడగు యమధర్మ రాజును జూచి ఎవరు జీవించి యుండ గలరు. మాతా! నీవు ప్రసన్ను రాలవు కమ్ము. నీవు లక్ష్మీ స్వరూపు రాలవు. నీవు విశ్వ మంగళము కొఱకు అవతరించితివి. దేవీ! నీవు కోపించినచో సర్వ కులము నాశనము చేయ గలవని ఇప్పుడే తెలిసినది. ఎందు వలననగా మహిషాసురుని వాని యొక్క మహా సైన్యమును నీవు నాశనము చేసినావు. దేవీ! నీవు ప్రసన్నురాలవై ఎవరికి శుభములు నిచ్చేదవో వారు దేశ మందు పూజించ బడుచున్నారు, వారికి ధనము, యశస్సు లభించు చున్నవి. వారిలో ధర్మము నశింపక ధన్యులై, దారాపుత్రులు, భృత్యులు మొదలగు వారితో సుఖము పొందు చున్నారు. అమ్మా! నీ అనుగ్రహముచే పుణ్యాత్ములగు మనుష్యులు ప్రతి దినము అత్యంత ఆధరముతో ధర్మ కార్యములు చేయుదురు మరణా నంతరము నీ దయచే స్వర్గమునకు బోవు చున్నారు. అందు వలన ఓ దేవీ! లోకత్రయ మందునూ నీవే ఫలదాయివగు చున్నావు. దేవీ! నీవు దుర్గతి పొందిన మనుష్యులు నీ స్మరణ చేయుటచే వారి భయమును బాపు చున్నావు. మఱియు ఎవరు స్వస్థ చిత్తులై నిన్ను స్మరణ చేయుదురో వారికి అత్యంత మంగళ ప్రదమగు బుద్దిని ఇచ్చు చున్నావు. దారిద్ర్య దుఃఖ భయమును పోగొట్టు తల్లీ! నీవు గాక ఎవరి యొక్క చిత్తము అందరికి ఉపకారము చేయుటకు ఎల్లప్పుడు దయతో నిండి ఉండును?
ఈ రాక్షసు లందఱు చని పోవుటచే జగత్తుకు క్షేమము చేకూరెను. వారలు మొదటి నుండి మహా పాపములు చేసి నరకమునకు బోవలసిన వారైనను రణ క్షేత్రమున నీ చేతిలో మరణించుటచే వారు స్వర్గమును బొందిరి. దేవీ! నీవు యీ నిశ్చయము తోనే శత్రువులను సంహరించిమి. కేవలము దృష్టి ప్రసారము చేతనే సర్వ రాక్షసులను సంహరిం గలవు. కాని వారు శస్త్ర పూతులై స్వర్గమునకు బోవలయు నని తలంచి శత్రువులగు వారి మీద శస్త్రములను వైచితివి. శత్రువు లైనను వారికి ఉపకారము చేయ దలంచితివి. నీవు అట్టి మంచి బుద్ది గల సాధ్వీమ తల్లివి. దేవీ! మీ ఖడ్గము యొక్క ప్రభా సముదాయముల యొక్క ప్రసారము చేతను శూలాగ్రము యొక్క కాంతి చేతను రాక్షసుల దృష్టి నశించ వలసినదియై యున్నను. కేవలము నీ తేజస్సు చే శోభాయ మానము, చంద్ర బింబ సదృశము నగు నీ ముఖమును చూచుటచే వారి దృష్టి నశించక అత్యంత ప్రకాశవంతముగా నుండెను. దేవీ! నీ స్వభావము దుష్ట పురుషుల దురాచారమును నశింప చేయు నట్టిదియై యున్నది. నీ రూపము అనౌ పమ్యము, అచంచలము. నీ వీర్యము దేవతల పరాక్రమమును హరించిన రాక్షసులను నశింప చేయునదియై యుండెను. యీ ప్రకారము శత్రువుల యందు కూడా నీ కృప స్పష్టమగు చున్నది.
దేవీ! నీ యొక్క పరాక్రమము ఎవరితోనూ పోల్చ శక్యము కాదు. నీ రూపము శత్రువులకు భయము కలుగ జేయునది మరియు అత్యంత మనోహరమై యున్నది. యిట్టి నీ రూపము ముల్లోకముల యందును ఎవరికి ఉండును? వర ప్రదాత వగునో దేవీ! నీ చిత్త మందు దయ యుద్ద మందు శౌర్యము చూడ బడు చున్నది. తల్లీ! నీవు శత్రువులను సంహరించి ముల్లోకములను రక్షించితివి మఱియు రణ క్షేత్రమున ఆ శత్రువులను చంపి వారికి స్వర్గమును ప్రసాదించితివి. మదించిన రాక్షసుల వలన కలిగిన మా భయమును గూడ దూరము చేసితివి. దేవీ! నీకు నమస్కారము.
ఋషి:
ఋషి:
శ్రీదేవి:
శ్రీదేవి:
దేవతా గణములారా! మీకు అభీష్టము గల వరములను వేడు కొనుడు. మీరు చేసిన స్తవమునకు సంతోషించితిని మీ పూజలకు ప్రీతి నందితిని.
మహిషాసుర వధ చేసితిని ఇంత కంటే దుష్కర మగు కార్య మేమైన యున్నచో చెప్పుడు నేను యెరుగను. మీకు దుస్సాధ్య మగునది యున్నచో నాకు తెలుపుడు అని పలికిన దేవితో దేవతలు ఈ విధముగా చెప్పిరి.
దేవతలు:
దేవతలు:
భగవతీ! నీవు మాకు ప్రబల శత్రువగు మహిషాసురుని చంపితివి. మా సమస్త కోర్కెలను దీర్చితివి. మాకు ఇంత కంటే చేయ దగినది యేమియు లేదు. అయితే ఓ మహేశ్వరీ! దయతో మాకు ఇంకను వరమీయ దలంచితివి గాన మేము నిన్ను స్మరణము చేసినపుడు దయతో మా ఆపదలను తొలగించుము. నిర్మల మగు ముఖము గల దాన వగు జగన్మాతా! ఏ మానవులు మేము నిన్ను చేసిన స్తోత్రముతో స్తుతి చేయుదురో వారికి ప్రసన్ను రాలవు గమ్ము. వారికి జ్ఞాన ఐశ్వర్య, ధన దాన్యాది సంపద అభివృద్ధులను అనుగ్రహించుము. అంబికా! నీవు సమస్త వస్తువులు యిచ్చుటకు సమర్దు రాలవు.
ఋషి:
ఋషి:
రాజా! ఇట్లు దేవతలు తమ కొరకు జగత్తు యొక్క క్షేమము కొరకు వరమును కోరగా భద్రకాళి “అట్లే యగు గాక” అని వరము యిచ్చి అంతర్ధానము అయ్యెను.
భూపతీ! సమస్త దేవతల శరీరముల నుండి జగత్త్రయమునకు హితము చేయుటకు ఏ ప్రకారముగా పూర్వ కాల మందు ఉద్భవించెనో, ఆ విధము నీకు చెప్పితిని. ఇప్పుడు పార్వతి దేవి శరీరము నుండి జగదంబ ఏ ప్రకారముగా ఉద్భవించి శుంభ, నిశుంభుల యొక్క ఇతరులై న దుష్ట దైత్యుల యొక్క వధ కొఱకు లోక సంరక్షణ చేయుటకు ప్రవర్తించిందో, ఎట్లు దేవతలకు ఉపకారము చేసినదో ఆ విషయమును యథా ప్రకారముగా చెప్పెదను సావధానముగా వినుము.
