మార్కండేయ మహా పురాణము లోని దేవీ మహాత్మ్యము

Table of Contents

126 - మరుత్త చరితము

 

క్రౌష్టుకి:

క్రౌష్టుకి:

ఓ భగవానుడా! మీరు కరంధమ, అవీక్షితుల చరిత్రను విస్తారముగా వర్ణించితిరి. ఇప్పుడు అవీక్షితుని పుత్రుడు మహాత్ముడగు మరుత్త మహారాజు చరిత్రను విన వలెనని కోరు చున్నాను. అతడు అత్యంత ఉద్యమ శీలుడు, కీర్తి కలవాడు, చక్రవర్తి మహాభాగుడు శూరుడు, కమనీయుడు, గొప్పదగు బుద్ధి గలవాడు, ధర్మము కలవాడు, ధర్మము నాచరించు వాడు, చక్కగా భూమిని పాలించు వాడు అని వింటిని.

 

మార్కండేయుడు:

మార్కండేయుడు:

మరుత్తుడు తండ్రి అనుజ్ఞచే పితామహుని వలన రాజ్యమును పొంది తండ్రి ఏ విధముగా తన కన్న బిడ్డలను పాలించునో, అట్లే యావత్ప్రజలను ధర్మానుసారముగా పాలింప సాగెను. ఋత్విక్కులు మరియు పురోహితుల యొక్క ఆజ్ఞలను శ్రద్ధతో అనుసరించుచు ఆ మహీపతి భూరి దక్షిణలతో యథావిధిగా అనేక యజ్ఞములను చేసెను.

 

సప్త ద్వీపముల యందు అతని రథ చక్రము అప్రతిహత మైనది. మరియు ఆకాశ, పాతాళ, జాలాది స్థానము లందును అవిచ్చిన్న మగు గమనము గలదై యుండెను. ఓ విప్రా! ఆ స్వకర్మ పరాయణుడగు మరుత్తుడు ధనమును పొంది మహా యజ్ఞములచే ఇంద్రాది దేవతలను జయించెను. ఇతర సమస్త వర్ణాల వారును తమ తమ కర్మల యందు తత్పరులై ఆ స్వకర్మల వలన ప్రాప్తించిన ధనముచే ఇష్టాపూర్తాది క్రియలు చేసుకొను చుండిరి. ఓ ద్విజ శ్రేష్టా! భూమి మహాత్ముడగు మరుత్తునిచే పాలింపబడి, దేవతలతో పోటీ పడుచుండెను. మరుత్తుడు కేవలము పృథ్వీ పాలకుల యందు మాత్రమే ప్రాధాన్యతను పొంద లేదు. ఇంకనూ వందల యజ్ఞములను అనుష్టించి అతడు దేవరాజగు ఇంద్రుని కన్నను శ్రేష్టు డయ్యెను.

 

ఓ విప్రా! అంగిరసుని పుత్రుడు బృహస్పతి యొక్క సోదరుడు, తపోనిధి మహాత్ముడు నగు సంవర్తుడు అతనికి ఋత్విక్కుగా ఉండెను. ఓ ద్విజుడా! దేవతలు సేవించు నట్టి “ముంజవత్” అను పేరుగల సువర్ణ మయమగు ఒక పర్వత మున్నది. ఋత్విజుడగు సంవర్తుడు తపో బలముచే దాని శృంగమును పెరకి రాజు కొరకు తెచ్చెను. ఇంతియే గాక ఆ సంవర్తుడు తపో బలముచే ఈ శృంగము ద్వారా రాజుచే యజ్ఞము చేయించుచు సమస్త భూభాగమును చక్కగా కాంచన మయములు, నిర్మలములగు భవనములను నిర్మించెను. ఋషి గణాలు చేసినట్లుగా వేదాధ్యయనము పలుమారులు ఈ మరుత్తుని చరిత్రను సదా ఈ విధముగా గానము చేయు చుండిరి. ఎట్లనగా ఎవని యజ్ఞము నందు సమస్త సభలు, ప్రాసాదములు కాంచన మయమై ఉన్నదో, ఇంద్రుడు సోమపానము తోను, బ్రాహ్మణ గణాలు దక్షిణల చేతను మత్తులై యున్నారో, మరియు ఇంద్రాది ప్రధాన దేవతలు, బ్రాహ్మణులకు అన్నాదులను వడ్డించు చుండిరో, అట్టి మరుత్తునితో సమానమగు యజ్ఞశీలుడు నగు మనుష్యుడు భూమి యందు జన్మించ లేదు.

 

మహీపతియగు మరుత్తునితో సమానమగు వాడు లేడు. బ్రాహ్మణులు గృహములు రత్న పూర్ణములై యున్నందున బంగారమును వదిలి వేసిరి. అతని యజ్ఞ కాలమున బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారును సువర్ణమయ ప్రాసాదములు మొదలగు సమస్త వస్తువులను పొందిరి. ధనవంతు లగుటచే వారు గూడ దానములు చేయు చుండిరి. అతడివ్వ బడిన ధనమును పొంది ఏ శిష్ట పురుషులు ఆతని యజ్ఞమున పూర్ణ మనోరథులైరో, వారును వేరు వేరు దేశము లందు వేరు వేరుగా యజ్ఞములు చేయు చుండిరి. ఓ ముని సత్తమా! ఈ విధముగా ఆతని రాజ్య శాసనమున మరియు ప్రజా పాలనా కాలము నందు ఒకనాడు ఒక తపస్వి వచ్చి అతనితో ఇట్లు చెప్పెను. ఓ నరేశ్వరా! తాపస మండలమును మదోన్మత్తులగు సర్పముల యొక్క విషముచే పీడించబడుట చూచి నీ పితామహి (తండ్రి గారి తల్లి) ఈ మాట చెప్పమని నన్ను పంపించిరి.

 

నీ పితామహుడు బాగుగా భూమిని పాలించి స్వర్గమునకు వెళ్ళెను. నీ తండ్రి కూడా రాజ్యమును వదిలి వనమునకు వెళ్ళెను. నేను ఇప్పుడు తపస్సు నందలి ఆసక్తిచే ఔర్వాశ్రమమందు నివసించు చున్నాను. ఓ రాజా! నీ పితామహుడు లేక ఇతర పూర్వ పురుషుల రాజ్య మందు ఎట్టి సంఘటన ఎప్పుడును జరిగి ఉండలేదో, అట్టిది జరుగుట నీ శాసన కాలమందు చూచు చున్నాను. నిస్సందేహముగా నీవు ప్రమత్తుడవు లేక అజితేంద్రియుడవై యున్నావు. మరియు గుఢాచారులను నియమించుట నీవు చేయ లేదు. ఈ కారణమున నీవు దుష్టా దుష్టములు ఎరుగుటలో అసమర్థుడ వైనావు. దంశన శాలురగు భుజంగ గణాలు పాతాళము నుండి వచ్చి ఏడుగురు ముని పుత్రులను కాటు వేసినవి. మూత్రము, పురీహాదులచే హవిస్సులు కలుషిత మైనవి. ఈ కారణమున ముని గణాలు అపరాధము జరిగెనని ఎరిగి నాగులను బలి ఇచ్చు చున్నారు.

 

ఈ మును లందరును సర్పములను భస్మము చేయుటలో సమర్థులే. కాని ఇట్లు చేయుటకు వారికి అధికారము లేదు. నీవే ఆ కార్యమునకు అధికారివి. భూపాలా! రాజ పుత్రులు ఎప్పటి వరకు వారి శిరస్సుపై అభిషేక జలము పడదో, అప్పటి వరకు భోగ జనిత సుఖముల ననుభవింప గలరు. ‘మిత్రుడెవరు? శత్రువెవరు? శత్రువుల బలమెంత యున్నాది? నేనెవడను? మంత్రి ఎవరు? ఏ ఏ రాజులు తన పక్షమున నున్నారు? (నా వద్ద ధనము, బలము ఉందా? నా యందు జనులు అనురక్తులై యునారా?) ఎవరు విరక్తులై యున్నారు? ఎవరు శత్రువులచే భేదమును పొందిరి? శత్రువులలో ఎవరు ఏ విధముగా నున్నారు? తన నగర మందు లేక రాజ్య మందు ఎవరెవరు చక్కగా ధర్మ కర్తాశ్రయులై యున్నారు? మరియు ఎట్టి మూర్ఖులు నివసించు చున్నారు? దండనీయు లెవరు? పాలింప బడునట్టి యోగ్యు లెవరు? ఉపేక్షింప వలసిన వారు ఎవరు?

 

సామ భేదములచే దేశ కాలములను విచారించి ఎవరి యెడల దృష్టి నుంచుట ఉచితము? ఇట్టి వృత్తాంతము లన్నియు తెలుసు కొనుటకు రాజు ఇతర గుఢాచారి నెరుగని వేరొక గుడాచారిని నియమించ వలెను. మహీపతి సమస్త మంత్రులు మొదలగు వారి యెడల కూడా గుడాచారులను నియమించ వలెను. భూపతి ఈ విధముగా ఇట్టి కార్యముల యందు సదా ఆసక్తుడై పగలు రాత్రులు గడుప వలెను. ఎప్పుడూ భోగ పరాయణుడై యుండుట రాజుకు ఉచితము గాదు. ఓ మహీపతీ! రాజులు శరీరమును ధరించునది భోగ నిమిత్తము కాదు. భూమిని మరియు తన ధర్మమును పాలించు కారణమున గొప్ప క్లేశములను కూడా అతడు అనుభవింప వలసి యుండును. ఈ జన్మ యందు అత్యంత క్లేశములను అనుభవించి నప్పటికీ పర లోకమున స్వర్గమునకు వెళ్ళిన పిమ్మట అక్షయ సుఖములు సంప్రాప్తించును. ఓ నరేశ్వరా! ఇవన్నియు బాగుగా విచారించి భోగమును పరిత్యజించి , నీకు పృథ్వీ పాలన కలుగు క్లేశములను అంగీకరించుట ఉచితము. ఓ రాజా! నీ శాసన కాలమున ఏ ఋషులను సర్పముల వలన దుఃఖము సంభవించినదో, గుడాచారులను నియమింపక పోవుటచే దానిని ఎరుగలేక పోయితివి. ఇంకా అధికముగా నేమి చెప్పుదును? ఓ రాజా! నీవు దుష్టులను శిక్షించి పాలింపుము. దీని వలన ధర్మ ఫలము యొక్క ఆరవ భాగము ప్రాప్తించును. దుష్ట గణాలు గర్వించి ఇట్టి కార్యములను చేయునప్పుడు నీవు వారి నుండి శిష్టులను రక్షింపక పోయినచో, నీవు నిస్సందేహముగా పాపము ననుభవించుదువు. ఇప్పుడు ఏది కర్తవ్యమో విచారింపుము. దానిని చేయుము. ఓ వసుధాది పతీ! నేను నీ పితామహురాలను. ఈ కారణమున నేను ఇదంతయు చెప్పితిని. ఈ సమయమున నీకు ఏది ఉచితమని తోచునో, దాని ననుసరించి చేయుము.