1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

30 - భగవత్స్తుతి, అతని స్వరూపముల వివరణ

శ్రీనారాయణవాచ- శ్రీనారాయణుడు ఇట్లు పలికెను-

శ్రీగణేశుడు, శంకరుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతాగణము స్వాయంభువాది మనువులు, మహర్షులు, లక్ష్మీ, గంగ, గౌరీ, సరస్వతీ మొదలైన దేవతలందరు ఏ భగవంతుని ధ్యానింతురో అతనియొక్క పాదపద్మములను ధ్యానింపవలెను.

సంసారమను సాగరము చాలా లోతైనది. భయంకరమైనది. దానిని దాటిపోవుటకు మానవుడు ఎవరి దాస్యము చేయవలెనని కోరుకొనుచున్నాడో ఆ భగవంతుని పాదపద్మములను - ఎల్లప్పుడు ధ్యానింపవలెను.

శ్రీకృష్ణుడు తన చిన్నతనముననే గోవర్ధన పర్వతమునెత్తెనను మాట చాలాచీన్నది. తన ఒకపంటియొక్క చీవర ఈ భూమండలమునంతయు ఎత్తైనను మాటకూడ సామాన్యమైనది. ఈ విశ్వములన్నియు అతని రోమకూపములందు ఒదిగియున్నవి. అట్టి భగవంతునీయొక్క పాదపద్మములమ సంతతము ధ్యానింపవలెను.

జననము, మరణము, భయము, శోకము మొదలగు భావములచే శిథిలమైన దేహాముకల మానవుడు వేదములు, వేదాంగములకు కారణుడైన ఆ శ్రీకృష్ణుని చరణారవిందములను ఎల్లప్పుడు ధ్యానముచేయవలెను.

గోపికాస్త్రీయొక్క ముఖపద్మములకు తుమ్మెదవంటివాడుమ, రాసేశ్వరుడు, రసికరమణుడు, బృందావనములో గోపవేషముతో తిరుగుచున్న శ్రీకృష్ణుని చరణారవిందములను సదా ధ్యానింపవలెను.

ఏ శ్రీకృష్ణునీయొక్క కనురెప్పపాటుతో ఈ జగములు సృష్టించు బ్రహ్మదేవుడు పడిపోవునో (చనిపోవునో) ఆతని చర్యలనన్నిటిని చెప్పుటకు ఎవ్వరు సమర్థులు కారు. అట్టి శ్రీహరి చరణారవిందములను మిక్కిలి గౌరవభావముతో నీవుకూడ ధ్యానింపుము.

మీరు మేము మనువులు మహర్షులు ఆందరు ఆ శ్రీకృష్ణునియొక్క అంశాంశములే. మహద్విరాట్ స్వరూపము సైతము ఆతని కళావిశేషమే. వేయి తలలుగల శేషుడు ఈ భూమండలమును చిన్న ఆవగింజవలె మోస్తున్నాడు. ఆ శేషుని ఆదికూర్మము తన వీపుపై ఏనుగు, దోమను మోయుచున్నట్లు మోయుచున్నది. ఆటువంటిది ఆదికూర్మము శ్రీకృష్ణునియొక్క చాలా చిన్ననైన అంశభాగము. విభుస్వరూపుడైన గోలోకనాథునియొక్క నిర్మలమైన కీర్తి వేదములలో పురాణములలో ఉన్నప్పటికిని విస్పష్టముగా మాత్రము కన్పించదు. ఆ శ్రీకృష్ణుని మహిమలను బ్రహ్మదేవుడు మొదలగువారు సైతము చెప్పలేరు. అందువలన సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుని నీవు తప్పక సేవింపుము.

అనంతమైన విశ్వములలో ఒక్కొక్క విశ్వములో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ప్రత్యేకముగానున్నారు. వారియొక్క సంఖ్యను, ఆ విశ్వముల సంఖ్యను దేవతలు వేదములు తెలిసికొనలేవు. అట్టి వీశ్వములకన్నీటినీ స్థానమైన ఆ పరమేశ్వరుని నీవు సేవింపుము, బ్రహ్మదేవునకు సైతము మూలకారణమైన ఆ శ్రీకృష్ణుడు జగత్కారణమైన ప్రకృతిని సృష్టించి ఆ ప్రకృతీద్వారా సృష్టిచేయుచున్నాడు. బ్రహ్మాది దేవతలందరు ఆ ప్రకృతికి సంబంధించినవారే. అందువలన వారందరు ఆ పరమేశ్వరునిపై భక్తిని కలిగించు శ్రీప్రకృతిని సేవించుచున్నారు. అంతమాత్రమున సనాతనుడైన పరమేశ్వరుడు ఏ ప్రకృతిననుసరించి ఈ సృష్టిచేయుచున్నాడో ఆ ప్రకృతి పరబ్రహ్మ స్వరూప. ఆ ప్రకృతి, పరబ్రహ్మలిద్దరు ఆభిన్నులే, వారిమధ్య భేదములేదు. ఆ ప్రకృతియొక్క అంశవలననే సమస్త విశ్వములందున్న లక్ష్మీదేవతలు ఆవిర్భవించుచున్నారు. ఆ ప్రకృతి మాయారూపిణి. నారాయణి ఆత్మేశ్వరుడైన పరమాత్మయొక్క శక్తిస్వరూపిణి. ఆ పరమాత్మ సైతము ఆ ప్రకృతివలననే శక్తికలవాడగుచున్నాడు. ఆమె లేనిదే ఆతడు సృష్టికార్యమును చేయుటకు ఆశక్తుడగుచున్నాడు.

ఓ సారదా! ఇంటికివెళ్ళి వివాహమును చేసికొనుము. నీవిప్పుడు నీ తండ్రియొక్క ఆజ్ఞను పరిపాలింపవలసియున్నది. దానివలన తండ్రియాజ్ఞను నిర్వహించినవాడవు కాగలవు. అట్లే అంతట . పూజ్యుడవై విజయివికూడ ఆగుదువు.

తన భార్యను వస్త్రములు, ఆలంకారములు, చందనాదులతో సంతృప్తిపరచినచో, బ్రాహ్మణులను గౌరవించినచో శ్రీకృష్ణుడు సంతోషపడినట్లు ప్రకృతి చాలా సంతోషపడును.

ఆ ప్రకృతి స్త్రీ స్వరూప కావున స్త్రీలను అవమానించినచో ఆమెను అవమానించినట్లే యగును. పతివ్రత, భర్త, పిల్లలతోనున్న స్త్రీని గౌరవించినచో సర్వమంగళదాయిని యైన ప్రకృతిని పూజించినట్లగును. మూలప్రకృతీ ఒక్కటే, ఆమె పూర్ణబ్రహ్మస్వరూపిణి. ఆమెను సనాతనీయైన విష్ణుమాయ అని కూడ అందురు. ఆమె సృష్టి జరుగునప్పుడు పంచభూతాత్మక ఆగుచున్నది.

ఆమె పరమాత్మయగు శ్రీకృష్ణునకు ప్రాణమువంటిది. సమస్త ప్రకృతులలో చాల ఇష్టమైన ప్రకృతిని రాధయని ఆందురు.

సమస్త సంపదలకు ప్రతిరూపమైన లక్ష్మీదేవి నారాయణునకు ధర్మపత్ని. పూజ్యురాలైన సరస్వతీ చదువులకు ఆధిష్టానదేవత. పూజ్యురాలు వేదమాతయైన సావిత్రి బ్రహ్మదేవుని పత్ని, శంకరుని భార్య దుర్గ. ఆమె పుత్రుడే గణేశ్వరుడు.

శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణమున సౌతి శౌనక మహర్షుల సంవాదముగల బ్రహ్మఖండమున భగవంతుని స్తోత్రము, ఆతని స్వరూపవర్ణనగల ముప్పదియవ అధ్యాయము సమాప్తము.