1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము
2 - పరబ్రహ్మ నిరూపణము
శౌనక ఉవాచ - శౌనకమహర్షి ఇట్లనెను.
ఓ సౌతి మహర్షి| అపూర్వము, అత్యద్భుతము ఉత్తమోత్తమమయిన ఆ బ్రహ్మఖండమును వివరించి పూర్తిగా చెప్పవలసినది.
సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లు పలికెను.
ఆత్యంత తేజస్సంపన్నుడు, నాకు గురువు ఐన వ్యాసమహర్షి పాదపంకజములను, శ్రీహరిని, ఇతరదేవతలను బ్రాహ్మణోత్తములను నమస్కరించి సనాతనములైన ధర్మములను చెప్పుదును.
మిక్కిలి శ్రేష్ఠమైనది, ఆజ్ఞానమనే చీకటిని నాశనముచేయునది, జ్ఞాన మార్గమును చూపించునది ఐన బ్రహ్మఖండమును నా గురుదేవులైన వ్యాసమహర్షివలన విన్నాను. దానివిప్పుడు చెప్పుదును.
ప్రళయ కాలమున సృష్టికారణమును, కోటిసూర్యుల కాంతితో సమానమైన కాంతికలదియు, నిత్యమైనది, అసంఖ్యాకమైన తేజ: పుంజముమాత్రమే ఉండినది.
ఉజ్వలమైన ఆ జ్యోతి, స్వేచ్ఛామయుడైన పరమపురుషునీది. ఆ జ్యోతి: పుంజముమధ్య స్వర్గ, మర్త్య, పాతాళములనే మూడు లోకాలున్నాయి. ఆ ముల్లోకముల పైన నాశనములేని గోలోకమున్నది. ఆ గోలోకము మూడుకోట్ల యోజన పరిమితమైనది. గుండ్రముగానున్నది. చాలా వీలుకల రత్నములు పరచియున్నది. తేజ స్వరూపమైన ఆ గోలోకమును యోగులు కలలో సైతము చూడలేరు, కానీ విష్ణుభక్తులకది స్పష్టముగా కనిపించును. వారు తమ అనన్యమైన భక్తివలన ఆ లోకమును పొందుతారు. అంతరిక్షములో ఉన్న ఆలోకము పరమపురుషుడైన శ్రీకృష్ణునిచే యోగశక్తివలన ధరించబడినది. ఆ లోకమున మనోవ్యథలు, వ్యాధులు, ముసలితనము, చావు, శోకము, భయము కనిపించవు. మంచిరత్నములతో కట్టబడ్డ అసంఖ్యాకమైన భవనములు ఉన్నాయి. ప్రళయకాలమున శ్రీకృష్ణుడు మాత్రముండగా, సృష్టికాలమున గోప, గోపికలతో శోభితమైయుండును.
ఆ గోలోకమునకు క్రిందిభాగమున కుడి ఎడమ భాగములలో వైకుంఠము, శివలోకము ఉన్నాయి.
అందు వైకుండము కోటి యోజన విస్తీర్ణమై, మండలాకారమున ఉన్నది. ఆ లోకము లయ కాలమున శూన్యమైయుండును. సృష్టికాలమున నాల్గు భుజములతోనున్న సహచరులు కల లక్ష్మీ నారాయణులతో కనిపించును. అచ్చట కూడ ముసలితనము చావు, ఆధీ వ్యాధులు మొదలైనవి కన్పించవు.
వైకుంఠమునకు ఎడమ ప్రక్కనున్న శివలోకము కోటి యోజన పరిమితమైనది. ఆ లోకము సహితము లయకాలమున శూన్యముగానుండి, సృష్టికాలమున సహచరులతో నున్న పార్వతీపరమేశ్వరులతోనుండును.
గోలోకమున ఉన్న జ్యోతి మిక్కిలి మనోహరమైనది. ఆహ్లాదాన్ని, శాశ్వతమైన పరమానందాన్ని కల్గిస్తుంది. యోగులు ఎల్లప్పుడు తను యోగమువల్ల కలిగిన జ్ఞాన నేత్రము ద్వారా దానిని దర్శింతురు, ఆ జ్యోతిస్సు యొక్క మధ్య భాగమున ఉన్న రూపము చాలా ఆందమైనది. ఆ రూపము నూతన మేఘమువలె నల్లనై, ఎఱ్ఱని కలువలవంటి కన్నులతో, శరత్కాల పౌర్ణమినాటి చంద్రునివలె నిర్మలమైన ముఖముతో, కోటి మన్మథుల లావణ్యము కలిగి మిక్కిలి అందముగా కన్పిస్తుంది. ఇంకా అది రెండు భుజములతో ఒక చేత మురళిని పట్టుకొని, చిరునవ్వుతో కూడిన ముఖముతో, పచ్చని బట్టలతో మంచి రత్నభూషణములతో అలంకరించబడి, శరీరమునందంతటా శ్రీచందనమును పులుముకొని ముఖమున కస్తూరీ కుంకుమతోనున్న బొట్టులో కనిపిస్తుంది, రొమ్ముపై శ్రీవత్సము. కౌస్తుభమణి ఉంటుంది. శిరస్సుపై మంచి రత్నములతో అలంకరింపబడిన కిరీటముండును. వననూలా భూషితమై రత్నసింహాసనమున నున్న ఆ రూపమే సనాతనమైన పరబ్రహ్మగా భగవంతుడుగా కీర్తింపబడుతున్నది.
స్వేచ్చామయుడు, సమస్తమునకు కారణభూతమైనవాడు, సృష్టి సమస్తమునకు ఆధారభూతుడు, ఎల్లప్పుడు గోపవేషమున ఉండువాడు భక్తానుగ్రహకారకుడు కోటి పూర్ణచంద్రుల శోభకలవాడు కిశోర వయసులో ఉన్నవాడు ఆ పరబ్రహ్మ.
స్వార్థమైన కోరికలు లేనివాడు, నిర్వికారుడు, సర్వ పరిపూర్ణుడు, రాసమండల మధ్యభాగమున ఉన్నవాడు, రాసేశ్వరుడు శాంతుడు, మంగళస్వరూపుడు, మంగళప్రదుడు, పరమానందకారకుడు. సత్యస్వరూపుడు, అక్షరుడు, అన్వయుడు, సర్వసిద్ధులకు ఆధీశుడు సర్వసిద్ధిస్వరూపుడు, సమస్త సిద్ధులను ఇచ్చువాడు ఆ పరబ్రహ్మయే.
ప్రకృతికి అతీతుడు, ఈశ్వరుడు, నిర్గుణుడు, ఆదిపురుషుడు, అవ్యక్తుడు స్వతంత్రుడు అద్వితీయుడు ఐన ఆ పరమాత్మను శాంతాత్ములైన వైష్ణవులు సదా ధ్యానింతురు.
ఇట్టి పరరూపమును ధరించు నా భగవంతుడు దిక్కులు ఆకాశముతో ఉన్న విశ్వమంతయు శూన్యముగా నున్నట్లు చూచెను.
శ్రీ బ్రహ్మవైవర్త పురాణమున సౌతీశౌనక సంవాదరూపమైన బ్రహ్మఖండమున పరబ్రహ్మ నిరూపణమనే
రెండవ అధ్యాయము సమాప్తము.
