1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

22 - బ్రహ్మదేవునకు ఇతర పుత్రుల జననము

సౌతిరువాచ - సౌతీ మహర్షి ఇట్లనెను-

బ్రహ్మదేవుడు సృష్టి చేయదలచినప్పుడు నారదుడు మరీచి మహర్షి మొదలైన ఋషులతో కలసి బ్రహ్మ దేవుని కంఠము నుండి పుట్టెను.

బ్రహ్మ దేవుని యొక్క నారదమనే కంఠ ప్రదేశమునుండి పుట్టినందువలన ఆ మహర్షిని నారదుడని పిలిచిరి. బ్రహ్మదేవుని దక్షిణపార్శ్వమునుండి పుట్టినందువలన సమస్తకర్మలు ఆచరించుటలో దక్షుడు కావున ఆ మునీనీ "దక్షుడ"నిరి.

వేదములలో కర్దమశబ్దము  నీడ అను అర్థమున నున్నది. బ్రహ్మయొక్క కర్దమమునుండి (నీడ) నుండి పుట్టిన ముని “కర్దముడయ్యెను.

వేదములలో మరీచి యనగా కాంతి. అందువలన బ్రహ్మనుండి పుట్టిన అతితేజస్వియైన మహర్షిని "మరీచి” అని పిలిచిరి.

క్రతువులెన్నో పూర్వజన్మమున ఆట్లే ఈ జన్మలోను చేసినందువలన బ్రహ్మపుత్రుడైన ఆ మహర్షిని “క్రతువ”ని పిలిచిరి.

ప్రధానమైన అంగము శిరస్సులేక ముఖము. 'ఇర' అనగా తేజస్వి. బ్రహ్మదేవుని ముఖమునుండి ఉద్భవించిన తేజస్వియైన కుమారుని "అంగిరసు" డనీ పిలిచిరి.

భృగువనగా మిక్కలి తేజస్సు కలవాడని అర్థము. బ్రహ్మ దేవుని యొక్క అతి తేజస్వియైన పుత్రుని "భృగు" మహర్షి యనిరి.

మంచి తేజస్పుగల బ్రహ్మ పుత్రులలో ఊర్ద్రమైన తపస్సుచే ప్రజ్వలించుచు ఆరుణ వర్ణముగల పుత్రుని "అరుణి' అని పిలిచిరి.

ఏ యోగి తనయోగశక్తిచే హంసలను లేక ప్రాణవాయువులను తనవశములోనికి తెచ్చుకొనెనో ఆ పరమయోగీంద్రుడైన బాలుడు హంసీ' యని పేరు తెచ్చుకొనెను. బాలుడు పుట్టగానే బ్రహ్మదేవునకు వశీభూతుడయ్యెను. మిక్కిలి ఇష్టమైన శిష్యుడుగా కూడ ఉండెను. ఆవిధముగా బ్రహ్మదేవునకు వశమై ఉన్నందువలన నాతడు వశిష్ఠుడుగా పరిగణింపబడెను.

ఏ బాలుడు ఎల్లప్పుడు తపస్సుపై వాంఛ కలిగియుండెనో సమస్త కర్మలను తన్ను తాను నిగ్రహించుకొని (యమించుకొని) చేయునో ఆ బాలుని 'యతి' అని పిలిచిరి.

పుల అనగా తపస్సముదాయము. పూర్వజన్మలలో చేసిన తపస్సముదాయము ఏబాలకునకు స్పష్టముగా నున్నదో అతనిని “పులహుడ“నీరి.

త్రిగుణాత్మకమైన ప్రకృతిని ‘త్రి’ అని విష్ణువును 'ఆ' అని సంకేతముతో పిలుతురు. బ్రహ్మ పుత్రుడైన ఈ బాలకునకు. విష్ణువుపై, ప్రకృతిపై సమానమైన భక్తి భావమున్నందువలన ఆతనిని అత్రి అని పిలిచిరి.

తపస్తేజమువలన పుట్టిన ఐదు శిఖలు అగ్నిశిఖల వలె ఎవరి శిరస్సుపై ఎల్లప్పుడు కన్పించునో ఆ మహర్షిని "పంచశిఖుడు" పిలిచిరి.

తనపూర్వజన్మలో ఆపాంతరతమమను దేశమున తపస్సు చేసినందువలన ఆ బాలునకునకు “ఆపాంతరతముడ"ని పేరు పెట్టిరి. .

తాను స్వయముగా తపస్సు చేయుటే కాక ఇతరులకు కూడా తపఃఫలితము వహింపజేయువాడు లేక పొందించువాడు. అట్లే తపస్సును వహించు సామర్థ్యము కలవాడు కావున ఆ బాలకునికి "వోడు"డని పేరు పెట్టిరి.

తన తపస్తేజస్సుతో ఎల్లప్పుడు వెలిగిపోవుచు ఉండును. అట్లే అతని మనస్సు తపస్సు పైవనే రుచికలిగియుండును కావున ఆ బాలకుని "రుచి" అని పిలిచిరి.

బ్రహ్మదేవుడు రోదించినందువలనను, కోపగించిన సమయమున పుట్టిన కారణముచేతను ఆ పదకొండుమంది బాలురను రుద్రులని పిలిచిరి.

శౌనక ఉవాచ - శౌనకుడిట్లు పలికెను-

ఓ సౌతి మహర్షీ! రుద్రులలో ఒకరిని మహేశుడని పిలుతురని భావించుచున్నాను. ఈ మహేశుడు బ్రహ్మదేవుని కంటే గొప్పవాడు కదా. మరి బ్రహ్మ పుత్రులలో ఎట్లు చేరెను? ఈ సందేహమును పురాణ తత్వములన్నీ తెలిసిన మీరు తీర్తురనీ భావింతును.

సౌతిరువాచ- సౌతీ మహర్షి ఇట్లు పలికెను

లోకముల రక్షించు విష్ణువు సత్వగుణ సంపన్నుడు. సృష్టి చేయు బ్రహ్మదేవుడు రజోగుణయుక్తుడు, భయంకరులు దురీదారులు ఐన రుద్రులు తమోగుణ సంపన్నులు. ఆ రుద్రులలో ఒకడైన కాలాగ్ని రుద్రుడు శంకరుని యొక్క అంశస్వరూపుడు, శివుడు శుద్దమైన సత్వగుణ సంపన్నుడు. అతడు సజ్జనులకు మంగళకరుడు. మిగిలిన దేవతలందరు కృష్ణుని యొక్క ఆంశాంశస్వరూపులు. విష్ణువు, శంకరుడు అతని అంశరూపులు వారిద్దరు పరిపూర్ణుడైన ఆ కృష్ణపరమాత్మతో సమానులు. వారు సత్వ గుణసంపన్నులు.

ఈ విషయమునంతయు రుద్రోద్భవము గూర్చి చెప్పిన సందర్భమున నీకు చెప్పితిని. దానిని అప్పుడే మరచినట్లున్నావు, ఆందరు ఆ భగవంతుని మాయచే మోహితులగుచున్నారు. అందువలన మునులకు కూడ మతిభ్రమ జరిగినట్లున్నది.

బ్రహ్మదేవువకు సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు ఆను నలుగురు పుత్రులు కలరు. బ్రహ్మదేవుడు సృష్టిచేయవలెనని తొలుత తన పుత్రులైన వీరికి చెప్పగా వారు వినిపించుకొనలేదు. అందువలన బ్రహ్మదేవుడు కోపించగా ఆప్పుడు రుద్రులు పుట్టిరి.

సనక, సనంద అను రెండు పదములు ఆనందార్థకములు పరిపూర్ణభక్తిగల ఈ బాలురు సదా ఆనందముతో ఉన్నందువలన వారికి సనక, సనందులను పేరు కల్గినది.

నీత్యము పరిపూర్ణుడైన శ్రీకృష్ణుడే సనాతనుడు. ఆ సనాతనుడైన కృష్ణునిపై భక్తిగలిగి ఉండుటేగాక అతనితో సమముగా ఉన్నందువలన ఆ బాలుని సనాతనుడని పిలిచిరి.

సనత్ ఆనగా నిత్యము, కుమారుడనగా శిశువు. ఎల్లప్పుడు కుమారుని వయస్సులోనే ఉండుటవలన ఆ శిశువును సనత్కుమారుడనిరి.

ఓ శౌనక మహర్షి బ్రహ్మదేవుని పుత్రులైన మరీచి మహర్షి మొదలైన వారి పేర్ల వ్యుత్పత్తిని తెలిపితిని. ఇక ఇప్పుడు నారదుని విషయమును వినవలసినది.

శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణములో సౌతి శానకమహర్షుల సంవాదముగల బ్రహ్మ ఖండమున బ్రహ్మ పుత్రులయొక్క నామవ్యుత్పత్తిని తెలిపే ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.