1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

29 - నారదమహర్షి ప్రశ్నలు

సౌతిరువాచ-సౌతి మహర్షి ఇట్లనెను-

దేవర్షియైన నారదుడు బదరీవనములలో నున్న నారాయణ మహర్షియొక్క ఆశ్రమమును చూచెను. ఆ బదరికాశ్రమము అనేకములైన వృక్షములతో ఫలములతో నున్నది. కోకిలల కుహనాదము ఎల్లప్పుడు అచ్చట వినిపించుచుండును. శరభమృగములు, సింహములు, పులులు మొదలగు క్రూర జంతువులున్నను మహర్షియొక్క ప్రభావమువలన అచ్చట హింసకాని, భయముకాని లేకుండును. అచ్చటి మహారణ్యము చాలా గహనమైనదైనా స్వర్గము కంటె మనోహరముగా కనిపించును. అచ్చట మహాసిద్ధులయొక్క, మహరులయొక్క ఆశ్రమములనేకమున్నవి. చందనారణ్యములు, పారిజాతవనములనేకమున్నవి. అచ్చటి సభా భవనముయొక్క మధ్యలోనున్న రత్నసింహాసనమున యోగులకు గురువును, ఆత్మేశ్వరుడు పరబ్రహ్మయగు శ్రీకృష్ణుని నామమును జపించుచున్న నారాయణ మహర్షిని చూచి నారదుడు అతనికి నమస్కరించెను.

నారాయణమహర్షి లేచి నారదుని కౌగలించుకొని, ఆశీర్వదించి కుశలమడిగి ఆతిథి పూజ చేసెను. తరువాత నారదుని రత్న సింహాసనమున కూర్చుండబెట్టెను. సారదుడు మార్గాయాసము తీరిన తరువాత నారాయణ మహర్షితో ఇట్లనెను.

ఓ మహర్షీ నేను యోగేంద్రుడైన శంకరునినుండి జ్ఞానమును సంపాదించు కొన్నప్పటికీ నా మనస్సు తృప్తి పొందలేదు. అది చంచలమైనది, ఐనను నామనస్సు యొక్క ప్రేరేపణ వలన ఇక్కడకు వచ్చి మీపాదపద్మముల నాశ్రయించితిని. ప్రస్తుతము కొంత విశేషఙ్ఞానము పొందవలెనను కోరికగలదు.

జన్మను, ముసలితనమును, మృత్యువునపహరించు కృష్ణునియొక్క దివ్యగుణకీర్తన ఎచ్చట జరుగునో, బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలగు దేవతలు మహరులు, మనువులు ఎవరిని ధ్యానింతురో, ఎవరి వలన ఈ సమస్త విశ్వము, సమస్త ప్రాణులు సృష్టింపబడినవో, ఇవన్నియు ఎవరిలో విలీనమగుచున్నవో, ఎవరు సర్వేశ్వరుడో, సర్వవ్యాపకుడో, సర్వకారణకారణుడో, ఆసర్వేశ్వరుని రూపమెట్లుండును. అతడు చేయుపని ఎటువంటిది? ఈ విషయములను చక్కగా మీరు నాకు చెప్పగలరు.

నారదుని మాటలు విని పూజ్యడైన నారాయణ ఋషి భగవంతునకు సంబంధించిన పుణ్యకథను చెప్పుటకు మొదలుపెట్టెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున సౌతిశానకుల సంవాదము గల బ్రహ్మ ఖండమున నారాయణ మహర్షిని నారదుడు ప్రశ్నించుట ఆను ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.