1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము
21 - నారదుని శాప విముక్తి
సౌతిరువాచ - సౌతి ఇట్లు పలికెను –
కళావతికి జన్మించిన ఆ బాలుడు క్రమముగా ఐదు సంవత్సరములవాడయ్యెను. అతడు చిన్నతనముననే జ్ఞాని. అతనికి గత జన్మనృతి కలదు. పూర్వ జన్మలో నేర్చుకొన్న అన్నీ మంత్రముల స్మృతి కలదు. అతడు ఎల్లప్పుడు శ్రీకృష్ణుని నామములను గుణములను కీర్తించువాడు. క్షణకాలము తన నిస్సహాయతను గుర్తించి ఏడ్చును. వెంటనే సంతోషముతో నృత్యము చేయుచుండును. కృష్ణుని కథలుగాని, కృష్ణునికి సంబంధించిన పురాణ విషయములు వినుచు కూర్చొనెడివాడు. తన శరీరము నిండ ధూలీనిండిపోగా ధూలితోనే శ్రీ కృష్ణ ప్రతిమను చేసినట్లు భావించుకొని ధూలితోనే అతనిని పూజించి, ధూలితోనే నైవేద్యము పెట్టెడివాడు. తల్లి భోజనము చేయుటకు రమ్మని పిలిచినప్పుడు శ్రీహరిని పూజిస్తున్నట్లు సమాధానమిచ్చేవాడు.
శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను –
సౌతి మహర్షి! ఈజన్మలో ఆ బాలకుని పేరేమీ? దాని అర్థమేమిటి? దానినంతయు చెప్పగలవు.
సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికెను –
అనావృష్టి కాలమున ఈ బాలుడు జన్మించెను. అతని జన్మకాలమున నీరు ఇచ్చినందువలన (వర్షము పడుటచే) ఈ శిశువునకు నారదుడని పేరు వచ్చెను. అట్లే ఈ బాలుడు తోటిబాలురకు జ్ఞానము నిచ్చువాడు కావున నారదుడని పిలువబడెను. అట్లే కాశ్యపుడైన నారదమునీంద్రుని యొక్క వీర్యము వలన, అతని అనుగ్రహమువలన పుట్టినందువలన ఇతనిని నారదుడని పిలిచిరి.
శౌనక ఉవాచ- శౌనక మహర్షి ఇట్లనెను –
ఓ మహర్షీ! మీరు కళావతి పుత్రునిపేరు, ఆపేరుకు గల అర్థము తెలిపితిరి. అట్లే ఆబాలకుని జన్మకు కారణమైన మహర్షి పేరు నారదుడనీ ఎట్లు వచ్చినదో తెలుపుడు.
సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికెను –
ధర్మ దేవత పుత్రుడైన నరుడను ముని పుత్రులు లేని కశ్యపుడను మునికి పుత్రునిచ్చినందువలన కాశ్యపుడైన ఆబాలునకు నారదుడను పేరు వచ్చినది.
శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను –
ఓ మహర్షి నారదుడను పేరు ఎట్లు వచ్చినదో తెలిపితివి కాని బ్రాహ్మణునకు శూద్రస్త్రీకి పుట్టిన ఆ శిశువునకు శ్రేష్ఠమైన ‘నారద’ అను పేరెట్లు వచ్చినది?
సౌతి రువాచ- సౌతి మహర్షి ఇట్లనెను –
బ్రహ్మదేవుని కంఠమునుండి చాలామంది నరులు ఉద్భవించిరి. బ్రహ్మదేవుని కంఠము నరులను ఇచ్చినందువలన దానిని నారదమనిరి. ఆ కంఠదేశమునుండి పుట్టిన బాలునికి బ్రహ్మదేవుడు నారదుడను పేరు పెట్టెను.
ఇప్పుడు కళావతి పుత్రుని వృత్తాంతము వినుము. ఆ గోపికాబాలుడు బ్రాహ్మణునిఇంటిలో దిన దినము పెరుగుచుండగా ఒక దినమున గొప్ప బ్రహ్మతేజస్సు కలవారు, ఐదు సంవత్సరముల వయస్సుగల సనకసనందాది బ్రాహ్మణకుమారులు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చిరి.
వారికి మధుపర్కాదికములనిచ్చి నమస్కరించి ఇంకను వారికి ఆ బ్రాహ్మణుడు ఫలమూలాదికముల నిచ్చి గౌరవించేను. ఆ మునులు భుజింపగా మిగిలినదాన్నీ (భుక్తశేషాన్ని) బాలుడు భుజించెను. ఆ బ్రాహ్మణ కుమారులలో నాలుగవ వ్యక్తి సనత్కుమారుడు ఆ బాలునకు శ్రీకృష్ణమంత్రోపదేశము చేయగా ఆతడు తల్లి ఆజ్ఞపై తనకు మంత్రోపదేశము చేసిన సనత్కుమారునకు దోసుడయ్యెను.
ఒకనాడు బాలకుని తల్లి రాత్రిపూట బయటకు వెళ్ళినప్పుడు పాము కరచి మరణముపాలయ్యెను. ఆమె నారాయణుని తలచుచు ప్రాణములు వదలినందువలన మంచి రత్నములచే నిర్మించబడిన విష్ణువిమానములో విష్ణుమూర్తియొక్క అనుచరులతో కలసి వైకుంఠమునకు పోయెను.
తల్లి చనిపోయిన తరువాత ఆ బాలుడు బ్రాహ్మణులతో కలిసివెళ్ళగా వారతనికి తత్వజ్ఞానమునుపదేశించిరి. మహాజ్ఞానియైన ఆ బాలుడు గంగలో స్నానముచేసి ఆ గంగా తీరమున అశ్వత్థవృక్షముక్రింద యోగాసనమును వేసికొని తనకు సనత్కుమారుడుపదేశించిన విష్ణుమంత్రమును జపించుచు చాలాకాలముండెను.
శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను –
బాలకుడు బ్రాహ్మణకుమారునిచే పొందిన శ్రీహరి మంత్రమేది? దానీనీ వివరముగా చెప్పుడు.
సౌతి రువాచ- సౌత్ మహరీ ఇట్లు పలికెను -
ఇరువది రెండు అక్షరములుగల ఈ మంత్రమును శ్రీకృష్ణుడు గోలోకమున బ్రహ్మదేవునకు ఉపదేశించెను. బ్రహ్మదేవుడు దానిని తన కుమారునకు ఉపదేశించగా అతడు ఈ బాలునకు ఉపదేశించెను.
ఓం శ్రీం నమో భగవతే రాసమండలేశ్వరాయ శ్రీకృష్ణాయ స్వాహా అమమంత్రము కల్పవృక్షమువంటిది. ఇది మహాపురుష స్తోత్రము, మరియు పూర్వము చెప్పబడిన కవచము ఇవన్నియు కల్పవృక్షమువలె కోరికలు తీర్చునవి. వీటి ద్యానము సామవేదములో చెప్పబడినది.
యోగులు, సిద్ధులు, దేవతలు కోరుకున్న ఆ పరమాత్మ రూపమును వైష్ణవులు. ధ్యానింతురు.
ఆ పరమాత్మ రూపము మిక్కిలి అందమైనదీ. నూతన మేఘమువలె నల్లనిది. అతని కళ్ళు శరత్కాలమందలి తామరలవంటివి. ముఖము శరత్కాలమందలి పున్నమి చంద్రునివంటిది. పెదవులు పండిన దొండపండు కన్న అందమైనవి. దంతములవరుస ముత్యాలవరుస కన్న మిన్ననైనది. ఆతని హాస్తమున మురళీ ఉండును. అతని ఆందము కోటి మన్మథులతో సమానమైనది. త్రిభంగిమలో నున్నది ఆతడు ద్విభుజుడు, పీతవస్త్రము కలవాడు, రత్నకేయూరములు, రత్నాభరణములు, రత్ననూపురములు కలవాడు. అట్లే రత్నకుండలములతో ప్రకాశించుచున్న చెక్కిళ్ళు గలివాడు, తలకొప్పులో నెమలి పింఛముగలవాడు. మోకాళ్ళవరకు వ్రేలాడుచున్న మాలతీ పువ్వుల మాల కలవాడు. సమస్తమైన అవయవములయందు చందనలేపము కలవాడు, వక్షఃస్థలమున కౌస్తుభ రత్నము ఉన్నవాడు.
ఆతని చుట్టు భూషణాలంకృతలు, సిగ్గు కల కళ్ళున్నవారు. స్థిరయావనలగు గోపికాసీలుందురు. ఆతడు రాధాదేవి వక్షఃస్థలమున ఉండును. అతనిని త్రిమూర్తులు పూజింతురు. అతడు కిశోరవయస్కుడు, రాధికా మనోహరుడు. నీరుణుడు. ప్రకృతి కంటే మిన్నయైన ఆ పరమాత్మను ధ్యానించవలెను.
ఓ శౌనకమునీ! నీకు ధ్యానము, స్తోత్రము కవచములను చెప్పితిని. ఈ శ్రీకృష్ణవింశత్యక్షరీ మంత్రము కల్పవృక్షమువలె కోరిన కోరికలను తీర్చును.
ఓ మహరీ గోపికాసుతుడైన ఆబాలుడు ఆహారమును వదలి పెట్టి కృశించిన ఉదరము కలవాడై వేయి దివ్యసంవత్సరములు ధ్యానమున నుండెను. ఇన్ని సంవత్సరములు ఆహారములేకపోయినను మంత్ర సిద్ధి జరిగినందువలన శక్తి, పుష్టి యథాత తథముగానుండెను.
ఆ బాలకుడు ధ్యానము చేయుచున్న సమయమున దివ్యలోకమున రత్న సింహాసనముపై కూర్చున్న ఒక శిశువును చూచెను. అతడు రత్న భూషణములు కలవాడు, నల్లనివాడు, గొల్లవాని వేషమున నున్నవాడు, గోపులు, గోపికలు పరివేష్టించి యుండగా పచ్చని పట్టువస్త్రము కట్టుకొని. మురళీని పట్టుకొని, శరీరమున శ్రీచందనమును ధరించియుండెను.
శాంతమూర్తి, పరాత్పరుడైన ఆ మురళీకృష్ణుని బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైన దేవతలందరు స్తుతించుచుండిరి. ఆ రూపమును చూచి గోపికాసుతుడు శాంతిపొందుచున్న సమయమున ఆ బాలమురళీ కృష్ణుని రూపము అదృశ్యమాయెను. ఆ బాలకృష్ణుని తిరిగి చూడజాలక గోపికాసుతుడు శోకారుడై తాను చేయుచున్న ధ్యానమును వదలి ఆ రావిచెట్టు క్రింద ఏడ్చుచుండెను.
బాలకృష్ణుని పునర్దర్శనమునకై ఏడ్చుచున్న గోపికా సుతునిలో ఆకాశవాణి అతనిని ప్రబోధించుచు హితమైనది, మితాక్షరమైనది, సత్యమైనది అగు ఈమాటలు వినిపించినది.
ఓబాలుడా! ఇంతకు ముందు నీవు చూచిన రూపము మరల నీకు కన్పించదు. పూర్తిగా యోగము సిద్ధించని వారు ఎంత కష్టపడినను ఆ పరమాత్మయొక్క సంపూర్ణ దర్శనము చేయజాలరు. నీయొక్క ఈ. శరీరము గతించి నీకు దివ్యశరీరము లభించినపుడు జన్మ మృత్యువులను హరించు గోవిందునీ మరల చూడగలపు.
ఆకాశవాణి యొక్క పై మాటలు విని బాలకుడు తృప్తిపడి ఏడ్పును మానెను. కాలము గడుచుచుండగా ఆ బాలుడు పుణ్యక్షేత్రమున హరిని స్మరించుకొనుచు తన శరీరమును వదిలిపెట్టెను.
ఆ బాలకుడు శ్రీహరి స్మరణ చేయుచు శరీరమును వదలగానే స్వర్గమున దుందుభులు మ్రోగినవి. పుష్పవృష్టి కురిసినది. ఆతని జీవుడు కాలక్రమమున ప్రాక్తన శరీరమును వదలి నిత్య శరీరమును పొంది పరబ్రహ్మ యొక్క శరీరమున అంతర్ధానమునందెను.
నిత్య దేహులకు పుట్టుక లేక మరణము వారి స్వేచ్ఛననుసరించి జరుగును. ఆ భక్తులకు పుట్టుక, మృత్యువు, ముసలితనము, వ్యాధి ఆనునవి ఉండవు.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనక మహర్షుల సంవాదము గల బ్రహ్మ ఖండమున నారదశాప విమోచనమను ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.
