1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

4 – సావిత్రి, రతీమన్మధులు, వరుణుడు మొ.వారి జననం

సౌతిరువాచ- సౌతమహర్షి ఇట్లు పలికెను.

ఆ తర్వాత శ్రీకృష్ణదేవుని నాలుకనుండి శుద్ద స్పటికమువలె తెల్లనిది, అందమైనది, తెల్లని వస్త్రమును ధరించినది, సమస్తాలంకార సుశోభిత, జపమాలను చేతిలో ధరించిన ఒక దేవి ఆవిర్భవించినది. ఆమె పేరు సావిత్రి. ఆమె శ్రీకృష్ణుని ముందు నిలిచి, పరబ్రహ్మస్వరూపుడు, సనాతనుడు ఐన శ్రీకృష్ణుని, భక్తితో తలవంచుకొని, చేతులు జోడించుకొని ఇట్లు స్తుతించెను.

సావిత్ర్యువాచ - సావిత్రిదేవి ఇట్లు పలికెను -

సమస్తమునకు కారణభూతుడవు, బ్రహ్మస్వరూపుడవు, సనాతనుడవు, పరాత్పరతరుడవు, నల్లనివాడవు, నిర్వికారుడవు, నిరంజనుడవగు నిన్ను నమస్కరింతును.

చిరునగవు కల ఆ సావిత్రి ఇట్లు శ్రీహరిని స్తుతించి, నమస్కరించి రత్న సింహాసనమున కూర్చుండెను.

ఆ తరువాత శ్రీకృష్ణపరమాత్మ మనస్సునుండి మేలిమి బంగారమువంటి కాంతికల పురుషుడొకడు ఆవిర్భవించెను. ఆతడు తన పంచబాణములతో సమస్త కామికుల మనస్సులను చిలుకుచున్నందువలన అతనిని మన్మథుడని పండితులనుచున్నారు. మన్మథుని ఎడమవైపు అతనికి ప్రియురాలు, అందరికి మోహమును పుట్టించు ఒక స్త్రీ ఉదయించినది. చిరునవ్వు కల ఆమెను చూడగానే అచటనున్న అందరికి వరమ ప్రీతి ఏర్పడినది. అందువలననే ఆమెను రతీదేవిగా పండితులు పేర్కొనుచున్నారు.

మన్మథుడు తన ప్రియురాలైన రతీదేవితోపాటు శ్రీహరిని స్తుతించి శ్రీహరిముందు రత్నసింహాసనము పై తన ధనుస్సును ధరించి ఉపవిష్టుడాయెను.

మారణము, స్తంభనము, జృంభణము, శోషణము, ఉన్మాదము అను ఐదు బాణాలను మన్మథుడు ధరించెను. మన్మథుడు తన బాణముల శక్తిని పరీక్షించుటకై వాటినన్నిటిని అచ్చటనున్న దేవతలపై ప్రయోగించినాడు. మన్మథబాణ ప్రయోగమువలన పరమేశ్వరుని ఇచ్ఛవలన అచటనున్న దేవతలందరు వెంటనే మోహమును పొందినారు. రతీదేవిని చూచిన బ్రహ్మదేవునికి వెంటనే రేతోపాతము జరిగినది. మహాయోగియైన బ్రహ్మదేవుడు సిగ్గుతో వస్త్రముతో దానిని కప్పుకొనెను. కాని జ్వలించుచున్న ఆ అగ్ని బ్రహ్మ దేవుని వస్త్రమును కాల్చివేసి కోటి తాటిచెట్ల ప్రమాణముతో మంటలతో పెరుగసాగెను.

పెనుమంటలతో పెరుగుచున్న ఆగ్నిని చూచి శ్రీకృష్ణుడు తన లీలతో నీటిని సృష్టించేను. భగవంతుని నిశ్వాసవాయువు వలన వెదజల్లబడిన ముఖబిందుజలము సర్వ ప్రపంచములను పవిత్రము చేసినది. ఆ ముఖబిందుజలము యొక్క చిన్న కణమే భయంకరమైన ఆ ఆగ్నిని చల్లార్చినది. నాటినుండి అగ్ని, నీటి వల్ల శాంతిని పొందుచున్నది.

భగవంతుడు సృష్టించిన జలములనుండి వాటికి అధిదేవతయైన పురుషుడుద్భవించాడు. సమస్త జలములకుఆధిపతి, జలములకు అధిష్టానదేవతయైన ఆ పురుషుడు వరుణుడని పిల్వబడినాడు.

అగ్నికి ఎడమవైపు ఆవిర్భవించిన కన్యను “స్వాహా” అని, అగ్నియొక్క భార్య అని విద్వాంసులు అంటారు. ఆట్లే వరుణుని యొక్క వామపార్శ్వమున ఆవిర్భవించిన కన్యను "వరుణానీ" అని, వరుణుని యొక్క భార్య అని కూడ అంటారు.

పరమాత్మ విశ్వాసమునుండి ఉద్భవించిన వాయువు సమస్త ప్రాణులకు ప్రాణముగా నయ్యెను. అదే ఇతర ప్రాణులకు నిశ్వాసముగా మారినది. ఆ వాయువు యొక్క ఎడమ పార్శ్వమున ఆవిర్భవించిన స్త్రీ వాయుపత్ని. ఆమెను “వాయవి” అని పిలుతురు.

మన్మథుని బాణమువలన బ్రహ్మకు రేతః పతనము జరుగగా అతడు దానికి సిగ్గుతో జలమున వదిలెను. ఆ రేతస్సు వేయి సంవత్సరముల తరువాత శిశు రూపమును చెందినది. ఆ శిశువే ప్రపంచములకన్నిటికి ఆధార భూతుడు. మహత్స్వరూపుడు, విరాడ్రూపుడు. అతనియొక్క ఒక్కొక్క రోమకూపమున ఒక్కొక్క విశ్వముండును. అతడు స్థూలస్వరూపములకెల్లా స్థూలరూపుడు. అతనికంటె మహత్ స్వరూపుడు ఎవ్వరూ లేరు. అతడు కృష్ణ పరమాత్మ యొక్క పదునారవ అంశము. సర్వాధారుడు సనాతనుడైన అతడే మహావిష్ణువు.

ఆ మహావిష్ణువు జలమున తామరాకువలె సముద్రముపై పవళించియుండగా అతని కర్ణమలమునుండి ఇద్దరు రాక్షసులు పుట్టిరి. వారు పుట్టగనే సముద్రజలములనుండి పైకి వచ్చి బ్రహ్మదేవుని చంపుటకు పూనుకొనిరి. అందువలన నారాయణుడు వారిని తన ఊరువులమధ్య నుంచుకొని చంపెను. ఆ రాక్షసులయొక్క మేదస్సు వలన ఈ మేదిని (భూమి) ఏర్పడినది. ఈ భూమిపై విశ్వములన్ని ఉన్నవి. ఆ దేవిని “వసుంధర” అని అందురు.

బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనక సంవాద రూపమగు బ్రహ్మఖండమున సృష్టినిరూపణ ప్రకరణమున చతుర్థాధ్యాయము సమాప్తము.