1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

5 – గోవులు, గోపికాగోపులు, రాధాదేవి మొ.వారి ఆవిర్భావం

శౌనక ఉవాచ - శౌనక మహర్షి ఇట్లు పలికెను -

గోవులు, గోపకులు, గోపికలు గోలోకమున నిత్యము ఉంటారా? లేక కల్పించబడినవారా? నా సందేహ నివృత్తికై మీరు దీనిని విపులముగా వాఖ్యానించగలరు.

సౌతిరువాచ - సౌతి మహర్షి ఇట్లనెను.

సర్వాది సృష్టిని గురించి నేను నీకింతకుముందే వివరించితిని. సర్వాదిసృష్టిలో నారాయణ మహేశ్వరులు, ప్రకృతి, ఇతర దేవతలు సృష్టింపబడి ప్రతి ప్రళయమువరకు ఉందురు.

ఓ శౌనక మహర్షీ! బ్రహ్మ కల్పమునందు జరిగిన సృష్టిని గురించి నీకింతకు ముందే వివరించితిని. బ్రహ్మకల్పము తరువాత ఉన్న వారాహ పాద్మ కల్పముల గురించి నీకు ముందు వివరింతును. సత్య యుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని నాలుగు యుగములు. 360 {మూడువందల అరువది యుగములను దివ్య యుగమని పిలుతురు. డెబ్బది ఒక్క (71} దివ్య యుగములు ఒక మన్వంతరము. పదునాలుగు మన్వంతరములు బ్రహ్మదేవునికి ఒక దినము. మూడు వందల ఆరువది దినములు గల నూటఎనిమిది (108) బ్రహ్మ సంవత్సరములు అతని ఆయుస్సు, బ్రహ్మదేవుని ఆయుఃపరిమితమైన కాలము శ్రీకృష్ణ పరమాత్మకు ఒక నిముషము.

బ్రహ్మ దేవుని ఆయుఃపరిమితమైన కాలమును 'కల్ప' మని అందురు. ఇంకను సామాన్యమైన, సంవర్తనము మొదలైన కల్పములు అనేకమున్నవి. ఇవి బ్రహ్మదేవుని ఏక దిన పరిమితములు. మార్కండేయ మహర్షి సప్తకల్పాంతజీవి ఆని అందురు. అనగా బ్రహ్మదేవుని ఏడు దినముల కాలము అతడు జీవించియుండును.

. ఈ విధముగా బ్రహ్మ, వారాహ, పాద్మ కల్పములు ఉండును. ఈ మూడు కల్పములందు జరిగిన సృష్టి క్రమమును నీకు వివరింతును.

బ్రాహ్మకల్పమున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞచే మధు, కైటభుల మేదస్సుచే బ్రహ్మదేవుడు మేదినిని సృష్టించెను. వారాహకల్పమున సముద్రములో పడిపోయిన భూమిని విష్ణువు వరాహ రూపమున పాతాళలోకమునుండి ఉద్ధరించెను. పొద్మ కల్పమున విష్ణుమూర్తి నాభికమలముననున్న బ్రహ్మదేవుడు వినాశములేక నిత్యమైన గోలోకము మొదలైన మూడు లోకములను వదిలి బ్రహ్మలోకము వరకున్న లోకములనన్నిటిని బ్రహ్మదేవుడు సృష్టించెను.         

ఇంతవరకు సృష్టి నిరూపణ ప్రకరణమున కాలమునకు సంబంధించిన విషయమును చెప్పితిని. ఇంకను సృష్టి నిరూపణమునకు చెందిన విషయము నేమైనా వినదలచుకున్నావా?

శౌనక ఉవాచ - శౌనక మహర్షి ఇట్లనెను.

జగత్పతియైన శ్రీకృష్ణుడు బ్రహ్మాదులనందరిని సృష్టించిన తరువాత ఏమి చేసెనో దానిని నాకు విపులముగా తెలుపుడని సౌతమహర్షి నడిగెను.

సౌతి రువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికెను.

బ్రహ్మాదులనందరిని సృష్టించిన తరువాత గోలోకమునకు అధిపతి, మహాప్రభువైన శ్రీకృష్ణుడు గోలోకమున ఉన్న అందమైన రాసమండలమునకు వెళ్ళెను. ఆ రాసమండలము అందమైన కల్పవృక్షముల మధ్య ఉన్నది. మిక్కిలి విస్తీర్ణమైనది. ఎత్తు పల్లములు లేక సమానముగానున్నది. మండలాకారములో నున్నది. అది చందనము  అగురు, కస్తూరి, కుంకుమాది సుగంధ ద్రవ్యములు చల్లబడిన ప్రదేశము. పెరుగు పేలాలు, సత్తుపిండి, ధాన్యము. గరిక, ఆకులతోనిండి ఉన్న ప్రదేశము. జంటగా నున్న అరటి స్తంభముల సమూహముతో, మంచి రత్నములతో నిర్మించిన మండపములతో, వెలుగుతున్న రత్న దీపములతో పుప్పుధూప దీపములచే మంచి వాసన కలిగిన ప్రదేశము. శృంగార భోగమునకు తగిన వస్తువులతో, కల్పవృక్ష కల్పితములైన మిక్కిలి సున్నితమైన పరుపులతో నిండి ఉన్న ప్రదేశమిది. అచ్చటికీ జగత్పతి, దేవతలతో కలిసి వెళ్ళి కూర్చుండెను. అత్యద్భుతమైన ఆ రాసమండలమును చూచి  దేవతలందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.

శ్రీకృష్ణ పరమాత్మ ఎడమ భాగమున ఒక కన్య ఆవిర్భవించెను. ఆ కన్య వెంటనే పరుగెత్తుకొనిపోయి పుష్పమును తెచ్చి శ్రీహరి పాదములపై అర్ఘ్యముగా సమర్పించెను. గోలోకమున రాసమండలమున శ్రీహరిముందు పరుగెత్తినది (రాసే దధావ) కాన ఆమెను రాధ అని పిలిచిరి. ఆ రాధ శ్రీకృష్ణపరబ్రహ్మకు ప్రాణాధిష్ఠాతృదేవి. ప్రాణములలో ప్రాణము. పదునారు సంవత్సరాల నవయౌవన. ఆమె బంగారువన్నెగల చీరను ధరించినది. చిరునగవుతో మిక్కిలి సుందరముగా నున్నది. కోమలాంగి, సుందరస్త్రీలకు సుందరి. బృహన్నితంబభారముతో పీనపయోధరములతో, మంకెన పూవు వన్నెను మించిన ఆధరోష్ఠముతో, పున్నమి చంద్రుల కాంతిని మించిన ముఖముతో, చక్కని పాపెడతో, శరత్కాల చంద్రునివంటి నేత్రములలో గరుత్మంతుని ముక్కు కంటే చక్కనైన నాసికతో, స్వర్ణగండూకమును మించు చెక్కిళ్ళతో, రత్నాభరణములు గల చెవులతో మిక్కిలి ఆందముగా నున్నది. చందనము, అగురు, కస్తూరితో కూడిన కుంకుమ బిందువులతో, సిందూర బిందువులు కల చెక్కిళ్ళతో మనోహరముగా నున్నది. మాలతీ పుష్పమాలతో, సువాసనలు కల కొప్పుముడిని, పద్మములకన్న మిన్న ఐన పాదములు కలది, ఆమె నడక హంస నడక. వనమాలా విరాజిత, వజ్రహార ధర. రత్నమయములైన చేతి కంకణములను, ఘల్లు ఘల్లు మని మ్రోయు అందెలను, నానావిధ చిత్రములు అంచులో గల చీరను ధరించిన ఆ రాధాదేవి శ్రీకృష్ణుని పలుకరించి అతనికి ఎదురుగా రత్నసింహాసనమున కూర్చున్నది.

ఆ రాధాదేవి యొక్క రోమకూపములనుండి, రూపమున, వేషమున ఆమెతో సమానముగా నున్న లక్షకోటి సంఖ్యగల గోపికా గణము ఆవిర్భవించెను. ఆ గోపికాగణము సుస్థిరమైన యావనము కలది. అట్లే శ్రీకృష్ణుని రోమ కూపములనుండి, రూపమున, వేషమున శ్రీకృష్ణుని వలె ఉన్న ముప్పది కోట్ల గోపకుల సమూహము ఆవిర్భవించినది.

ఆట్లే శ్రీకృష్ణుని యొక్క రోమకూపములనుండి అనేక రంగులు కల గోగణము ఆవిర్భవించెను. అందు అనేక విధములైన ఎడ్లు, ఆవులు, లేగలు ఉన్నవి. అనేకమైన కపిల ధేనువులు వాటిలో ఉన్నవి. ఆగోగణములో కోటి సింహముల బలము కల ఒక ఎద్దును శ్రీకృష్ణుడు శివునకు వాహనముగా ఇచ్చెను.

శ్రీకృష్ణుని కాలిగోళ్ళనుండి స్త్రీ, పుం, వత్స సమన్వితమైన రాజహంసలగణమావిర్భవించెను. ఆ రాజహంసలలో మంచి బలిష్ఠమైన ఒక రాజహంసను శ్రీకృష్ణుడు బ్రహ్మ దేవునకు ఇచ్చెను.

శ్రీకృష్ణుని ఎడను చెవిలోనుండి తెల్లని గుఱ్ఱముల సమూహము ఆవిర్భవించెను. ఆగుఱ్ఱములలో ఒక మంచి గుఱ్ఱమును ధర్మునకు వాహనముగానిచ్చెను.

ఆతని కుడిచెవిలో నుండి మిక్కిలి బలిష్ఠమైన సింహముల సమూహము ఆవిర్భవించెను, ఆ సింహములలో ఒక మేలైన సింహమును శ్రీకృష్ణుడు ప్రకృతి స్వరూపిణియైన దుర్గాదేవికి ఇచ్చెను, ఇంకను ఆమెకు ఇష్టమైన వరములను అమూల్యమైన రత్నములను, పూలమాలలను శ్రీకృష్ణుడు ఇచ్చెను.

యోగీంద్రుడగు శ్రీకృష్ణుడు తన యోగముచే పరిశుద్ధ రత్నములతో కూడియున్న మనోహరమైన ఐదు రథములను నిర్మించెను. అవి ఒక్కొక్కటి లక్షయోజనముల ఎత్తుగలవి. శతయోజన విస్తీర్ణము కలవి, వాయువేగము కల ఆ రథములు లక్షచక్రములతో, లక్షక్రీడా గృహములతో, శృంగారమునకు తగిన భోగవస్తువులతో, అసంఖ్యాకమైన పరుపులతో కూడుకున్నవి. ఇంకను అవి అనేక చిత్రములతో, వీచిత్రములతో, ముత్యాల వరుసలతో, మంచి రత్నకలశములతో, రత్నదర్పణములతో, భూషణములతో, తెల్లని చామరములతో, బంగారు వన్నెగల, చిత్రవస్త్రములతో, ఇంద్రమణులు, ముత్యాలు. మాణిక్యముల హారములతో నున్నవి. చాల అందమైన, సంపూర్ణముగా ఎఱ్ఱనైన రత్నములచే నిర్మింపబడిన కృత్రిమమైన తామరపుష్పములు అసంఖ్యాకముగా ఆ రథములందున్నవి. అటువంటి రథములలో నొక దానిని శ్రీకృష్ణుడు నారాయణున కిచ్చెను. ఇంకొక దానిని రాధాదేవికి ఇచ్చెను. మిగిలిన మూడు రథములను తనవద్దనే ఉంచుకొనెను.

శ్రీకృష్ణుని గుహ్య ప్రదేశమునుండి పింగళ వర్ణము కల పురుషుడొకడు పింగళ వర్ణము కల వ్యక్తుల సమూహముతో ఆవిర్భవించెను. గుహ్య ప్రదేశమునుండి పుట్టినందువలన వారిని గుహ్యకులని అనిరి. ఆ గుహ్యకులలో మొదట పుట్టిన పురుషుడు కుబేరుడు. అతడు ధనపతి, గుహ్యకులకందరికి అధిపతి.

ఆ కుబేరుని ఎడమ పార్శ్వమున ఉదయించిన సుందరి కుబేరుని పత్ని, అదేవిధముగా పరమేశ్వరుని యొక్క గుహ్య ప్రదేశమునుండి భూత, ప్రేత, పిశాచులు, కూష్మాండ, బ్రహ్మ రాక్షసులు, భేతాళురు పుట్టినారు.

శ్రీకృష్ణుని యొక్క ముఖమునుండి శంఖ, చక్ర, గదా, పద్మములను, వనమాలలను, పీత వస్త్రములను ధరించినవారు, నల్లనివారు, నాల్గుభుజములు కలవారు, కుండలములు, కిరీటములను, రత్నభూషణములను ధరించిన పార్షదులు ఉద్భవించిరి.

చతుర్భుజులైన పార్షదులను శ్రీకృష్ణదేవుడు నారాయణున కిచ్చెను, గుహ్యకులను గుహ్యకేతుడైన కుబేరునకిచ్చెను. భూత, ప్రేత, పిశాచాదులను శంకరునకు ఇచ్చి వేసెను.

రెండు భుజములు కలవారు, నల్లనివారు, ఎల్లప్పుడు జపమాలను చేతియందుంచుకొన్నవారు, శ్రీకృష్ణుని యొక్క పాదములను ఎల్లప్పుడు ధ్యానించుచున్నవారు, శ్రీకృష్ణదాసుల దాస్యమునందున్నవారు, శ్రీకృష్ణ పరాయణులు, శ్రీకృష్ణ నామ స్మరణముచే పులకించిన అవయవములు కలవారు, కళ్ళలో నుండి నీరు స్రవించగా గద్గద కంఠులైన, వైష్ణవులు శ్రీకృష్ణుని పాద పద్మములనుండి ఆవిర్భవించిరి.

శ్రీకృష్ణుని కుడికంటినుండి భయంకరమైనవారు, త్రిశూలము, పట్టిశమను ఆయుధముల ధరించినవారు, చంద్రుని శిరస్సులో కలవారు, మహాకాయులు, జ్వలించుచున్న అగ్ని శిఖలవలెనున్నవారు, శివునితో సమానమైన తేజస్సు కలవారు. పూజ్యులు, దీగంబరులైన అష్టభైరవులు పుట్టిరి. వారి పేర్లు వరుసగా రురు. సంహార, కాల, అసిత, క్రోధ, భీషణ, మహాభైరవ, ఖట్వాంగ అనునవి.

శ్రీకృష్ణుని యొక్క ఎడమ కంటినుండి భయంకరమైనవాడు, త్రిశూలము, పట్టిశ, గద అనే ఆయుధములను, వ్యాఘ చర్మమును ధరించినవాడు, మహాకాయుడు, మూడు కన్నులు కలవాడు, దిగంబరుడు, చంద్రశేఖరుడైన ఈశ్వరుడు ఆవిర్భవించెను. అతడు దిక్పాలకులకందరికి అధిపతి.

శ్రీకృష్ణుని ముక్కునుండి క్షేత్రపాలకులు, యోగులు ఐన డాకినులు ఉద్భవించిరి. అట్లే ఆ పరమాత్మయొక్క పృష్ఠ ప్రదేశమునుండి దివ్యమూర్తులను ధరించిన మూడు కోట్ల దేవతలు ఉద్భవించిరి.

 శ్రీబ్రహ్మ వైవర్తమహాపురాణమున సౌతీ శౌనక సంవాద రూపమైన బ్రహ్మ ఖండములోని సృష్టినిరూపణ ప్రకరణమున ఐదవ అధ్యాయము సమాప్తము.